హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

15 - సూర్యవంశ వర్ణనము

జనమేజయుడిలా అడిగాడు.

మహాత్ముడైన సగరుడికి వీరులైన కుమారులు ఎలా పుట్టారు? వాళ్ళు అరవై వేలమంది ఎట్లు పుట్టినది మహాత్మా తెలియజేయుము. వైశంపాయనిడిలా సమాధానం చెప్పాడు.

సగరుడికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య విదర్భరాజు కుమార్తె కేశిని, రెండవ భార్య అరిష్టనేమికూతురు ఆమె ధర్మాత్మురాలు మిక్కిలి సౌందర్యవతి. వాళిద్దరికీ ఔర్వుడు వరమిచ్చాడు. ఒకటవది వెయ్యి కొడుకులను, రెండవది వంశోద్దారకుడైన ఒకణ్ణి కోరుకోమన్నాడు. చిన్నరాణి ఆశతో అరవై వేలమందిని కోరుకుంది. పెద్ద భార్య ఒకే పుత్రుణ్ణి కోరింది. ఔర్వముని అలాగే జరుగుతుందని వరమిచ్చాడు. కేశినికి ఒకే పుత్రుడు అసమంజసుడనేవాడు పుట్టాడు. అతనికి పంచజనుడనే రెండవ పేరు కూడా ఉంది. రెండవ రాణికి గింజలతో కూడిన ఆనపకాయ పుట్టింది. అందులో అరవై వేలమంది శిశువులు నువ్వుగింజల్లాంటి వాళ్ళు పుట్టారు.

అసమంజసుడు పరాక్రమవంతుడైన వీరుడు. చిన్నరాణి పిల్లలు మెల్లమెల్లగా పెరిగారు. ఆ శిశువులను తండ్రి నేతిపాత్రలలో ఉంచాడు. వాళ్ళ పోషణకు దాదులను కూడ అన్ని వేలమందిని నియమించాడు. పది నెలలైన పిమ్మట ఆ పిల్లలందరూ ఎదిగి తండ్రికి ఆనందం కలగచేశారు. సగరుడి అరవై వేల పుత్రులు ఈ విధంగా జన్మించారు. ఆ రాజపుత్రులందరి శరీరాలలో నారాయణుని తేజస్సు ప్రవేశించింది. వారిలో పంచజనుడనే వాడే పట్టాభిషిక్తుడయ్యాడు. పంచజనుడికి అంశుమంతుడనే వీరుడైన పుత్రుడు కలిగాడు. అంశుమంతునికి దిలీపుడు. ఇతనికి ఖట్వాంగుడని కూడ పేరున్నది. ఇతడు స్వర్గం నుంచి వచ్చి ముహూర్తకాల జీవితంలో మూడు లోకాలను ధ్యానబలంచేత బ్రహ్మస్వరూపంగా భావించాడు.

దిలీపుని కుమారుడు భగీరథుడు. అతడే గంగానదిని తెచ్చినవాడు కీర్తిమంతు డైన ఆ మహానుభావుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు. భగీరథుడు గంగను కుమార్తెగా పొంది సముద్రానికి చేర్చాడు. కాబట్టి గంగను విద్వాంసులు భాగీరధి అని పిలుస్తారు. భగీరథుని కొడుకు “శత్రుడు” ఇతని కొడుకు నాభాగుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. ఇతనికి సింధుద్వీపుడు. ఇతనికి అయుతా జిత్తు పుట్టారు. అయుతాజిత్తు కొడుకు ఋతుపర్ణుడు. ఇతడు గొప్ప కీర్తి గలవాడు. జూదంలో రహస్యాలు తెలిసినవాడు కూడ. నలుడితో ఇతనికి గొప్ప స్నేహం ఉంది. ఇతని కుమారుడు ఆర్తుపర్ణి. ఇతని కొడుకు సుదాసుడు. ఇతడు ఇంద్రునికి మిత్రుడు. ఇతని కుమారుడు సౌదాసుడు. ఇతనికి కల్మాషపాదుడనీ మిత్రసహుడనీ కూడ ప్రసిద్ధి ఉంది.

కల్మాషపాదుని కుమారుడు సర్వకర్ముడు, ఇతని పుత్రుడు అనరణ్యుడు ఇతని కొడుకు నిఘ్నుడు. ఇతని పుత్రులు అనమిత్రుడు రఘువు అనేవాళ్ళు. అన మిత్రుని పుత్రుడు దువిదుహుడు. ఇతడు విద్వాంసుడు. ఇతని కుమారుడు దిలీపుడు. ఇతడు రాముడికి ముత్తాత. దిలీపుని కొడుకు “రఘువు” ఆయనే అయోధ్య రాజ్య సింహాసనముపై కూర్చున్నవాడు. రఘువు కొడుకు అజుడు. అజుని పుత్రుడు దశరథుడు. ఇతనికి ధర్మాత్ముడు రాముడు పుత్రుడు. రాముని పుత్రుడు కుశుడు. ఇతని కొడుకు “అతిథి” ఇతనికి నిషధుడు. ఇతనికి నలుడు, ఇతనికి నభుడు. ఇతనికి పుండరీకుడు, ఇతనికి క్షేమధన్వుడు, ఇతనికి దేవానీకుడు కొడుకు, ఇతనికి అహీనగుడు.

అహీనగుడికి సుధన్వుడు, ఇతనికి అనలుడు. ఇతనికి ఉక్తుడు, ఇతనికి వజ్రనాభుడు, ఇతనికి శంఖుడు. వీడి కొడుకు పుష్యకుడు వీనికి అర్ధసిద్ది. ఇతనికి సుదర్శనుడు. ఇతనికి అగ్నివర్ణుడు ఇతనికి శీఘ్రుడు. ఇతనికి పుత్రుడు “మరువు” ఇతడు కలాపద్వీపంలో యోగాభ్యాసం చేశాడు. ఇతనికి బృహద్బలుడు. వీరసేనుని కుమారుడు మరోనలుడున్నాడు. జనమేజయ మహారాజా! ఇంతవరకు ఇక్ష్వాకు వంశమందలి ప్రధాన రాజుల గూర్చి చెప్పి వినిపించాను. సూర్యుని యొక్క వంశ మందలి రాజుల యొక్క సృష్టిని చదివినవాడు. ప్రజలను పుష్టినిచ్చే శ్రాద్ధదేవుని వంశావళిని చదివినవాడు. సూర్యుని లోకానికి వెళ్ళి ఆనందిస్తాడు. బ్రతికి ఉన్నంత కాలం పాపాలు పోయి రజోగుణము నశించి ఆయుర్దాయం కలవాడవుతాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో సూర్యవంశ వర్ణనము అను పదిహేనవ అధ్యాయము.