హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

24 - విభ్రాజుడు బ్రహ్మదత్తుని పుత్రుడగుట

మార్కండేయుడిలా చెప్పాడు.

బ్రహ్మదత్తుడికి వైభ్రాజుడనే రాజు పుట్టాడు. వైభ్రాజుడికి ప్రపంచంలో విష్వక్సేనుడని ప్రసిద్ది యేర్పడుతుంది. అతడు గొప్పయోగి, తపశ్శాలికూడ. ఒకనాడు బ్రహ్మదత్తుడు తనభార్యతో శచీదేవితో ఇంద్రుడిలాగా వనంలో విహరించాడు. అపుడు ఆ రాజు చీమ మాటను విన్నాడు. కాముకుడు కామినియైన స్త్రీని ప్రార్థించే మాటఅది. ఆ మాటకు ఆడచీమ కోపగించింది. బ్రహ్మదత్తుడు పెద్దగా నవ్వాడు. అప్పుడు అతని భార్య “సన్నతి” సిగ్గుపడింది. చాలారోజులు అన్నం తినలేదు. భర్త బ్రతిమాలగా ఆమె నీవు నవ్వావు గనుక నేను బ్రతకదలుచు కోలేదు. రాజు తన నవ్వుకు కారణం చెప్పినా ఆమె నమ్మలేదు. ఇంకా కోపగించి, మనుష్యులలో ఎవడికీ చీమల మాటలు తెలియవు. దేవతానుగ్రహంవల్ల పూర్వజన్మలో చేసిన తపోబలంచేత తప్ప చీమల మాటలెలా తెలుస్తాయి? నీకిట్టి ప్రభావము ఉంటే నేను నమ్మేటట్లు చేయి.

ఇలా కాకపోతే నేను ప్రాణాలు విడుస్తాను. రాణి యొక్క కఠినమైన యీ మాటలు విని ఆపదలో పడినవాడై నారాయణుని శరణువేడాడు. ఆరురాత్రులు ఉపవాసం చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు కనిపించాడు. తెల్లవారుజామున నీవు శుభాన్ని పొందుతావు అనిచెప్పి భగవంతుడు అంతర్ధానం చెందాడు. నలుగురు బ్రాహ్మణులకు తండ్రి పుత్రులకు చెప్పిన శ్లోకాలను చదువుకొని చింతలేనివా డయ్యాడు. వాళ్ళు మంత్రులతో కలిసి కూర్చొని రాజైన బ్రహ్మదత్తుని కలిసి విని పించటానికి చాలాసేపు సమయంకోసం ఎదురుచూచారు. కాని వాళ్ళకు సమయమే దొరకలేదు. పిమ్మట రాజు సరస్సులో స్నానంచేసి నారాయణుని వలన వరంపొంది బంగారు రధం మీద తన పట్టణంలో ప్రవేశించాడు.

కండరీకుడు గుర్రపుపగ్గాలు పట్టుకున్నాడు బాభ్రవ్యుడు చామరం విసిరాడు. ఇది సమయమని ఆ బ్రాహ్మణుడు రాజుకి మంత్రులకీ ఆశ్లోకం వినిపించాడు. ఓ మహారాజా! దశార్ణదేశంలో ఏడుగురు కిరాతులు, కాలంజన పర్వతంమీద ఏడు మృగాలు, శరద్వీపంలో ఏడు చక్రవాకపక్షులు, వాటి ఏడిటినుండి మానస సరోవరంలో ఏడుహంసలై పుట్టాయి. వాటినుండి మేము నలుగురము కురు క్షేత్రంలో వేదవేదాంగ పండితుడైన ఒక సత్కుల బ్రాహ్మణుని ఇంటిలో పుట్టి చాలాదూరం వెళ్ళి మిమ్మల్ని ముగ్గుర్నీ వెతికాను. చాలా కష్టపడి చూచాను. ఈ రెండు శ్లోకాలు విని రాజైన బ్రహ్మదత్తుడు ఆయన మంత్రులు పాంచాలుడు, పుండరీకుడు మూర్చపోయారు.

వారిచేతుల నుండి పగ్గాలు, చామరాలు విడిపోయి క్రిందపడ్డాయి. వాళ్ళ ఈస్థితిని చూచి నగరజనులు మిత్రులు చాల దుఃఖపడ్డారు. ఈవిధంగా రాజు ఆయన మంత్రులు మూర్చపోయి రధంమీదనే పడిపోయారు. క్షణం తరువాత తెలివి వచ్చింది. అప్పుడు వాళ్ళు పట్టణంలోకి వచ్చారు. ఆ శ్లోకాలు విని వాళ్ళు మానస సరోవరాన్ని పూర్వజన్మలోని యోగి కథలను గుర్తు తెచ్చుకున్నారు. దానితో వాళ్ళు సంతోషించి ఆ బ్రాహ్మణుడికి మంచిభోజనం పెట్టి కావలసినంత ధనం ఇచ్చారు. తరువాత రాజు బ్రహ్మదత్తుడు తన పుత్రుడైన విష్వక్సేనుని రాజ్యమందు పట్టాభిషిక్తుని చేసి భార్యతో వనానికి వెళ్ళాడు.

అడవిలో దేవలుని కూతురు “సన్నతి” సంతోషంతో బ్రహ్మదత్తునితో మహారాజ! మీరు భోగాలలో మునిగిపోయారు. మీరు చీమభాషను తెలిసినవారని ఎరుగుదును. మీశక్తిని తెలిసికొనటానికే కోపం ప్రకటించి మంచిపనే చేశాను. మీరు యోగజ్ఞానాన్ని మరిచిపోయారు. దాన్ని మీకు గుర్తుకుతెచ్చాను. ఇప్పుడు మనకు మంచిస్థానం ప్రాప్తిస్తుంది అని పలికింది. బ్రహ్మదత్తుడు తనభార్య మాటలు విని సంతోషించాడు. యోగబలంతో గొప్పస్థానాన్ని పొందాడు. యోగ సిద్దుడు ధర్మాత్ముడైన కండరీకుడుకూడా సాంఖ్యయోగంద్వారా యోగుల స్థానాన్ని పొందాడు. మహాతపశ్శాలి పాంచాలపుత్రుడు వేదప్రసిద్ధమైన క్రమాన్ని ప్రవర్తింపజేసి ఉచ్ఛరించే పద్ధతిని తెలిపి యోగాచార్యస్థానాన్ని కీర్తిని పొందాడు.

ఈ పురాతనకథను నేను ప్రత్యక్షంగా చూచాను. కనుకనే భీష్మపితామహ! నీవుకూడా ఈ శ్రాద్దఫలితాన్ని మనస్సుకు పట్టించుకో. దీనివల్ల నీకు శుభం కలుగుతుంది. వాగ్ధుష్టాది ఈ ఏడుగురి సోదరుల ఉత్తమచరిత్రను మనస్సుకు పట్టించుకున్నవాళ్ళు ఎప్పుడూ పశుపక్ష్యాది జన్మను పొందరు. ఈ ఉపాఖ్యానాన్ని వినడంచేత హృదయంలో యోగధర్మం స్పురిస్తుంది. దానివల్ల యోగగతిని పొందుతారు. మార్కండేయుడు శ్రాద్ధఫలాన్ని చెప్పటానికి సోమదేవుని ప్రసన్నుని చేసు కోటానికి ఈ కథ చెప్పాడు. సోమదేవుడు ప్రసన్నుడై సంతోషం కలుగజేస్తాడు. ఇప్పుడు వృష్ణివంశ ప్రసంగంలో చంద్రవంశాన్ని వర్ణిస్తున్నాను విను.