హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

4 - పృథుచరిత్ర - దిక్పాల ప్రతిష్ఠ

మరల వైశంపాయనుడిలా చెప్పాడు.

బ్రహ్మదేవుడు వేనుడి కుమారుడైన పృధువును రాజుగా పట్టాభిషేకం చేశాడు. తరువాత ఎవరెవరికి ఏఏ పని వప్పచెప్పినదీ చెపుతాను విను.

బ్రాహ్మణులకు, తీగెలకు, నక్షత్రాలకు, గ్రహాలకు, యజ్ఞాలకు తపస్సులకునూ చంద్రుని రాజుగా చేశాడు. బృహస్పతిని సమస్త ప్రపంచానికీ అధిపతిగా చేశాడు. భృగు వంశమందు పుట్టినవారందరికీ శుక్రాచార్యుని, ఆదిత్యులందరికీ విష్ణువును, వసువులకు పావకుని (అగ్నిని) ప్రజాపతులకు దక్షుని, మరుత్తులకు ఇంద్రుని, రాక్షసులకు ప్రహ్లాదుణ్ణి, పితృదేవతలకు యముణ్ణి, మాతృకలకు, వ్రతాలకు మంత్రాలకు గోవులను, యక్షులకు రాక్షసులకు సాధ్యులకు అధిపతిగా విష్ణువును, వ్యవస్థ ఏర్పరచాడు. రుద్రులకు శివుణ్ణి అధిపతిగాను, విప్రచిత్తిని రాక్షసులకు సమస్త భూత పిశాచాలకు, శివుణ్ణి పర్వతాలకు హిమవంతుని, నదులకు సముద్రుణ్ణి, అన్ని వాసనలకు వాయువులకు, శరీరములేని ప్రాణులకు, శబ్దమునకు ఆకాశానికి వాయువును రాజుగా బ్రహ్మ కల్పించాడు. గంధర్వులకు చిత్రరధుణ్ణి రాజు చేశాడు. సర్పాలకు వాసుకుని సర్పాలకు తక్షకుని ఏనుగులకు ఐరావతమును రాజుగా చేశాడు. గుర్రాలకు ఉచ్చైశ్రవమును, పక్షులకు గరుడుని, జంతువులకు పెద్దపులిని, ఆవులకు, ఎద్దులకు ఆబోతును, వనస్పతులకు (పువ్వులు లేకుండా కాయలు కాసే చెట్లకు) జువ్విచెట్టును, సముద్రాలకు, నదులకు, మేఘాలకు, ఆదిత్యులకును, పర్జన్యుని అధిపతిగా చేశాడు.

కోరలు గల ప్రాణులకు శేషుని రాజుగాను, సర్పాలకు తక్షకుణ్ణి, గంధర్వులకు, అప్పరసలకు మన్మధుని, ఋతు, మాస, దిన, పక్ష, రాత్రి ముహూర్త తిధి, పర్వ కలా కాష్ఠ ప్రమాణాలకు ఉత్తరాయణ, దక్షిణాయనాలకు గణితానికి యోగానికి కూడ సంవత్సరాన్ని ప్రభువుగా చేశాడు. బ్రహ్మ ఈ విధంగా రాజ్యాలను విభజించి దిక్పాలకులను స్థాపించాడు. తూర్పుదిక్కునందు వైరాజుని పుత్రుడైన సుధన్వుని రాజుగా చేశాడు. దక్షిణ దిక్కునందు కర్ధమప్రజాపతి పుత్రుడైన శంఖపదుని పడమర దిక్కునందు, రాజసుని పుత్రుడైన కేతుమంతుని, అట్లే హిరణ్యరోముని ఉత్తరదిక్కునందును రాజుగా చేశాడు. వాళ్ళు ఈ భూమినంతనూ ధర్మంగా పరిపాలిస్తున్నారు. చాక్షుష మన్వంతర కాలము పూర్తి అయిన తరువాత బ్రహ్మ వైవస్వత మనువుకు రాజ్యం వప్పచెప్పాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో

పృధచరిత్ర - దిక్పాల ప్రతిష్ఠ అను నాల్గవ అధ్యాయం.