హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

5 - వేనుడి మరణం - పృథువు జన్మ

ఆ వైవస్వతమనువు యొక్క విస్తర వృత్తాంతాన్ని యిక చెపుతాను విను అని వైశంపాయనుడిలా చెప్పాడు.

మహారాజా! పూర్వము అత్రి వంశంలో పుట్టిన “అంగుడు” అనే రాజు ప్రజాపతి అయ్యాడు. అతని కొడుకు వేనుడు. అతడు ధర్మం తెలిసినవాడుకాడు. మృత్యువు కుమార్తె అయిన సునీధకు పుత్రుడు. అతడు ధర్మభ్రష్టుడై కామంచేత, లోభంచేత ఆకర్షింపబడ్డాడు. రాజ్యంలో అధర్మాన్ని స్థాపించాడు. వేదధర్మాలను అతి క్రమించాడు. అధర్మమందు ఆసక్తి కలవాడయ్యాడు. అతని రాజ్యంలో స్వాధ్యాయం చదివేవాళ్ళు లేరు. వషట్కారాలు లేవు. యజ్ఞాలలో ఇచ్చిన సోమరసాన్ని దేవతలు త్రాగలేదు. యాగం చేయకూడదు, హోమం చేయకూడదని ప్రజాపతి యైన అతని ప్రతిజ్ఞ. నేనే పూజింపదగినవాడను, యజ్ఞస్వరూపుడను, యజ్ఞం చేసేవాడినికూడ, ప్రజలు నా కొరకే యజ్ఞం చేయాలి. నాకొరకే హోమం చేయాలి. హద్దుమీరి చేయరానిపనులు చేస్తున్నవానికి మరీచి మొదలైన మహర్షులందరు మేము చాలా సంవత్సరాలు దీక్షలో ఉంటాము.

వేనమహారాజా! నీవు అధర్మం చేయకు. మేము పురాతనమైన ధర్మాన్ని పాటిస్తున్నాం. నీవు అత్రి వంశంలో పుట్టావు. ప్రజాపతివి సందేహం లేదు. ప్రజలను పరిపాలిస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. అని పలుకగా ధర్మాన్ని సృష్టించినవాడు నాకంటే ఎవడున్నాడు? నేను ఎవడి మాటలు వినాలి? పాండిత్య పరాక్రమ తప సత్యములలో నాకు సమానుడెవ్వడునాడు? అన్ని ధర్మాలకు కారణమైన నన్ను అజ్ఞానులైన మీరు తెలుసుకొనుటలేదు. నేను కావాలంటే భూమినంతను తగల బెట్టగలను. లేదా నీటిలో నీటిలో ముంచి వేయగలను. భూమిని ఆకాశాన్ని అడ్డగించ గలను. ఇందుకు సందేహం లేదు. అని వేనుడు అజ్ఞానంచేత గర్వంచేత, మంచి నడవడి పాటించకపోగా మహర్షులు కోపించి మహాబలశాలియై ప్రకాశిస్తున్న వేనుని పట్టుకొని అతని ఎడమతొడను మధించారు (తరిచారు) అలా మధిస్తుండగా మిక్కిలి పొట్టి నల్లని పురుషుడు పుట్టాడు. అతడు భయపడుతూ చేతులు జోడించి నిలబడ్డాడు.

అత్రి మహర్షి అతని చూచి “నిషీద” (కూర్చో) అన్నాడు. అతడు కిరాత(నిషాద) వంశానికి మూలపురుషుడయ్యాడు. వేనుని పాపం వలన చేపలు పట్టు జాతి సృష్టించబడింది. ఆ జాతినుండి తుషారులు, తుంబురులు అనే ధర్మరహితమైన అసభ్యజాతులు పుట్టాయి. తరువాత మహర్షులు వేనుని కుడి చేతిని మధించారు (తరిచారు) అప్పుడు “పృధువు” అనే అగ్నితో సమానమైన తేజస్సుగలవాడు పుట్టాడు. అతడు ధనుస్సును ధరించి కవచంతో పుట్టాడు. అతడు గొప్ప ధ్వనిగల ధనుస్సును పట్టుకొని దివ్యములైన బాణాలను పట్టుకొని ప్రజలను రక్షించటానికి పుట్టగానే ప్రజలు సంతోషించారు. వేనుడు స్వర్గము పొందాడు. సత్పుత్రుడు జన్మించి నందున వేనుడు పున్నామనరకము నుండి బయటపడ్డాడు.

సముద్రములు, నదులు, రత్నాలను, తేగా దేవతలతో కూడిన బ్రహ్మ రాగా ప్రాణులందరూ సముద్రనదీ జలాలతో పట్టాభిషేకం చేశారు. ధర్మవేత్తలైనవారిచే ఆదిరాజుగా ప్రతాపవంతుడైన పృధువు పట్టాభిషేకం చేయబడ్డాడు. తన తండ్రిచే బాధపడిన ప్రజలు పృథుచక్రవర్తి చేత రంజింపబడ్డారు. ప్రజల అనురాగం వలన అతడు రాజయ్యాడు. రాజు అనే మాటకు ప్రజలను రంజింపచేసేవాడు (సంతోష పెట్టేవాడు) అని అర్ధం. అతడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సముద్రం దారిచ్చేది. పర్వతాలు కూడ మార్గమిచ్చేవి. జండా ఎప్పుడు విరుగలేదు. దున్నకుండానే భూమి పండేది. అన్నం కావాలనుకోగానే గిన్నెనిండా అన్నం కనిపించేది. ఆవులు కామ ధేనువు వలె కోరికలు తీర్చేవి. చెట్టులో ప్రతి ఆకువద్దనూ తేనె ఉండేది.

ఆ సమయంలోనే పృధుమహారాజు బ్రహ్మయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సోమరసంతో నిండిన కుండనుండి బుద్ధిమంతులైన సూత మాగధులు (స్తోత్రం చేయువారు) పుట్టారు. అప్పుడు ఋషులు సూత మాగధులకు పృధుమహారాజును స్తోత్రం చేయండి అని చెప్పారు. అప్పుడు వారు దేవతల ఘనకార్యాలను వెల్లడిస్తూ స్తోత్రం చేస్తూ ఉంటాము. ఈ రాజు గుణాలు ఏమి తెలియకుండా ఎలా స్తోత్రం చేస్తామని ప్రశ్నించారు. వెనుకటి కల్పంలో ఇతడెటువంటి పనులు చేశాడో, ఏ గుణాలు కలవాడో ఆ పనులే ఆ గుణాలే కలవాడుగా స్తోత్రం చేయమన్నారు ఋషులు.

అప్పుడు సూతమాగధులు పృధుచక్రవర్తిని “మహాబలపరాక్రమములు గలవాడా! వేనపుత్రా! నీవంటి సత్యము పలికేవాడు, దాత మరొకడు లేడు, నీవు సత్యమైన ప్రతిజ్ఞ గలవాడవు. నీవు శ్రీమంతుడవు, విజయం గలవాడవు, గొప్ప ఓర్పు గలవాడవు. పరాక్రమవంతుడవు, చెడ్డవాళ్ళను శిక్షించేవాడివి. ధర్మం తెలిసిన వాడవు. చేసిన మేలు మరువనివాడవు, దయ గలవాడవు, ప్రియంగా మాట్లాడే వాడవు, గౌరవింపదగినవాడవు, ఎదుటివారిని గౌరవించేవాడవు, యజ్ఞం చేసే స్వభావం కలవాడవు. బ్రాహ్మణ భక్తుడవు, నీవు శానుడవు, నీ పనులలో ఆసక్తి కలవాడవు, వ్యవహారంలో నేర్పుగలవాడవు, అని స్తోత్రం చేశారు. అప్పటి నుండి వాళ్ళకు ఆశీర్వాదంచేసే అధికారం వచ్చింది. వాళ్ళ స్తోత్రంచేత ప్రసన్నుడై సూతునకు అనూపదేశాన్ని, మగధడికి మగధదేశాన్ని దానం చేశాడు పృధుమహారాజు. మహారాజైన పృధువును చూచి ప్రసన్నులైన ఋషులు ప్రజలకు ఇలా చెప్పారు.

ఈ పృధుమహారాజే మీ జీవితానికి ఉపయోగం కలుగచేస్తాడు, అని అప్పుడు ప్రజలు మహారాజు వద్దకు వచ్చి మహారాజా! ఋషులు చెప్పినట్లు మాకు జీవించే వ్యవస్థ కలుగజేయుము అని విన్నవించారు. అప్పుడు రాజు ప్రజలకు మేలు చేయగోరి ధనుస్సు బాణాలను తీసుకొని భూమిని ఆహారం సమకూర్చవలసిందని పీడించాడు. అప్పుడు భూమి పృధువుకు భయపడి ఆవు రూపాన్ని పొంది పరుగెత్తింది. పృధువు దానిని వెంటాడాడు. రాజునకు భయపడి భూమి అన్ని లోకాలు తిరిగి తనకు ఎదురుగా నిలిచి ధనుస్సు ధరించియున్న పృధువును చూచింది దేవతలకు కూడా ఎదిరింపరాని అతన్ని చూచి రక్షణ లేనిదై పృధువునే శరణు వేడింది. భూమి చేతులు జోడించి స్త్రీ వధ చేయతగదని ప్రార్ధించింది.

మరియు మహారాజా! నేను లేకపోతే ప్రజల నందరను నీవెక్కడ ఉంచుతావు? అందరూ నాపైన నివసిస్తున్నారు. నేను సమస్త ప్రపంచాన్ని మోస్తున్నాను. నన్ను నీవు నశింపచేస్తే ప్రజలందరూ నశిస్తారు. నీవు ప్రజలకు క్షేమం కలుగజేసేటట్లైతే నామాట విను- ఏ పనులైనా ఉపాయంతో నెరవేరుతాయి. ఈ ప్రజలను పోషించడానికి ఉపాయం ఆలోచించు. నన్ను చంపి ప్రజలను నీవు రక్షించలేవు. తరువాత పశ్చాత్తాపడతావు. స్త్రీని చంపకూడదని పెద్దలు చెపుతారు అని ఈ విధంగా భూమి చెప్పిన మాటలు విని కోపం తగ్గించుకొని రాజు భూమితో ఇలా అన్నాడు.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో వేనుడి మరణం- పృథువు జన్మ అను ఐదవ అధ్యాయం.