హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

19 - పితృకల్పము - భరద్వాజ పుత్రుల కథ

మార్కండేయుడిలా చెప్పాడు.

తండ్రీ! పూర్వము మహర్షి భరద్వాజుడి పుత్రులు యోగులయ్యారు. కాని కొన్ని రోజుల తరువాత కొన్ని చెడ్డపనులు చేసి యాగభ్రష్టులయ్యారు. కర్మ వశం వల్లవాళ్ళు మానస సరోవరం ఒడ్డున వెళ్ళిపడ్డారు. వెనుకటి యోగసిద్ధిని పొందలేక పోయారు స్వర్గలోకంలో చాలా రోజులున్న తరువాత కురుక్షేత్రంలోని కౌశిక వంశంలో పుట్టారు. ఈ జన్మలో పితృదేవతలకు శ్రాద్ధం చేయాలని ప్రయత్నించారు. జీవహింస చేత పాపాత్ములై వెనుకటి కంటే నీచజన్మ నెత్తారు. పూర్వజన్మలో పితరులకు దానం చేయటం చేత నీచజన్మ నెత్తినా అన్ని మాటలు గుర్తున్నాయి. వాళ్ళు ఏ జన్మలో ఏ సంఘటనలు జరిగింది దివ్యదృష్టితో చూచారు. వెనుకటి జన్మలలోని విషయాలను తలచుకొని మెల్ల మెల్లగా ధర్మాన్ని ఆచరించడం ప్రారంభించారు.

కొంచెం సమయం తరువాత తమ మంచి పనులచేత పోయిన బ్రాహ్మణ ధర్మాన్ని మళ్ళీ పొందారు. మళ్ళీ వాళ్ళకి పూర్వజన్మలో సంపాదించిన యోగబలం వచ్చింది. అందు యోగసిద్ధి శాశ్వత లోకాలను కూడ పొందారు. ఈ కధ చెప్పి ఓ మునివరా! ఈ విధంగా మీకు కూడా మంచి బుద్దప్రాప్తిస్తుంది. సాధారణ బుద్ధి గలవాళ్ళకు యోగసిద్ధి పొందరానిదే అవుతుంది. ఒకవేళ ఏవిధంగానైనా పొందినా వేట మొదలైన వ్యసనాలతో అధర్మంగా ప్రవర్తించి గురువులకు దుఃఖం కలిగిస్తారు. సత్ర్పవర్తన కలవారే యోగసిద్ధిని పొందటానికి సమర్థులు. సద్గుణాలు సత్ప్రవర్తన లేనివాళ్ళకు యోగసిద్ధిని పొందటం చాలాకష్టం.

నాయనా! ఈ విధంగా భరద్వాజుని పుత్రుడు అన్ని మంచి గుణాలు కలవాడై మరల బ్రాహ్మణుడయ్యాడు. అతనికి పూర్వపు చెడ్డపనులు, పొరపాట్లు గుర్తున్నాయి. ప్రపంచంలో ధ్యానమూ చదువుతో కూడిన శాంతి మార్గంలో నడిచే వాడికి శాంతి తప్పక ప్రాప్తిస్తుంది. అందువల్ల ఓ భార్గవా! నీవు కూడ యోగమార్గాన్ని అవలంబించుము. ఓ భీష్మా! సనత్కుమారుడు నాకిలా చెప్పి అక్కడనే అంతర్ధానం చెందాడు (కనబడలేదు) నేను పద్దెనిమిది సంవత్సరాలు ఆయనను సేవించాను. కాని ఒక్కరోజుగా తలచాను. ఆ మహానుభావుని అనుగ్రహం వల్ల నాకు అలసట, ఆకలిదప్పులు కాలం గూడా తెలియలేదు. తరువాత శిష్యుల వలన సమయం తెలుసుకొన్నాను.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో పితృకల్పము-భరద్వాజ పుత్రుల కథ అను పందొమ్మిదవ అధ్యాయము.