హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
38 - భజమాన వంశ, స్యమంతకమణి వర్ణనము
వైశంపాయనుడిలా చెప్పాడు.
మహారాజ! మహారధి విదూరథుడు భజమానుని పుత్రుడు. ఇతనికి ఇద్దరు కొడుకులు రాజాధిదేవుడు, శూరుడు. రాజాధిదేవుడికి దత్తుడు, అతిదత్తుడు, శోణాశ్వడు, శ్వేతవాహనుడు, శమి, దండశర్మ, దండశత్రు, శత్రుజిత్తు అనే పరాక్రమవంతులైన ఎనిమిదిమంది పుత్రులు, శ్రవణ, శ్రవిష్ట అనే ఇద్దరు పుత్రికలు. శమికి ప్రతిక్షత్రుడు, ఇతనికి భోజుడు, వీనికి హృదీకుడు పుత్రులు. హృదీకుని పుత్రులలో కృతవర్మ పెద్దవాడు. శతధన్వుడు మధ్యవాడు. దేవర్షి చ్యవనుని ఆశీర్వాదం చేత శతధన్వుడికి, భిషక్కు, వైతరణ, సుదాన, విదాన అను నలుగురు పుత్రులు, అట్లే కామద, కామదంతిక అనే ఇద్దరు కన్యకలు పుట్టారు. కంబల బర్హిషుడికి దేవవస్తుడు, అసమేజుడు, నామసమేజుడు అనే ముగ్గురు పుత్రులు. అంధకుడు సంతానంలేని అసమేజుడికి సుదంష్ట్ర, సుచారు, కృష్ణుడనే పుత్రులు ముగ్గురుని ఇచ్చాడు. ఈ విధంగా అంధకవంశం వీరుల వృత్తాంతం చెప్పి వినిపించాను. ఈ అంధక కధను నిత్యమూ చదివి మనస్సుకు పట్టించుకున్నవాడు విస్తారమైన సంతతి కలవాడౌతాడు.
గాంధారి, మాద్రి వీళ్ళిద్దరూ క్రోష్టరాజుకు భార్యలు. గాంధారికి శత్రువిజయి అయిన అనమిత్రుడు పుత్రుడు. యుధాజిత్తు, దేవమీఢుడు మాద్రికి పుత్రులు. అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. ఇతనికి ఇద్దరు పుత్రులు ప్రసేనుడు. సత్రాజిత్తు. ప్రసేనుడు ద్వారకా పట్టణమందున్నపుడు సత్రాజిత్తు సముద్రంనుంచి స్యమంతక మణిని పొందాడు. సూర్యుడికి మిత్రుడు సత్రాజిత్తు. ఒకనాడు చీకటితో స్నానాదులను పూర్తిచేసి రథంమీద కూర్చొని సూర్యుని ఉవస్థానం(స్తోత్రం) చెపుతూ సముద్రం ఒడ్డున ఉన్నాడు. సూర్యుడు అప్పుడు ఎదురుగా వచ్చి నిలిచాడు. అప్పుడు సత్రాజిత్తు మహాత్మా! నేను నిత్యమూ నిన్ను చూస్తున్నాను. నీతో స్నేహంవల్ల నాకేం ప్రయోజనం కలిగింది? అని అడిగాడు. సూర్యుడాతని మాటవిని స్యమంతకమణిని తన కంఠంనుంచి తీసి రహస్యంగా ఉంచాడు. సత్రాజిత్తు క్షణకాలం కబుర్లు చెప్పి వెళ్ళేటప్పుడు మహానుభావా! లోకాన్ని ప్రకాశింపచేసే మీ మణిని నాకివ్వండి అని అడిగాడు. సూర్యుడు మణిని అతనికిచ్చాడు.
సత్రాజిత్తు ఆ మణిని ధరించి తన పట్టణానికి వచ్చాడు. పట్టణంలో జనులు సూర్యుడే వస్తున్నాడని నలువైపులకూ పరుగెత్తారు. ఇలా ద్వారకానగరాన్ని ఆశ్చర్యపరుస్తూ తన ఇంటికి వెళ్ళాడు. తరువాత సత్రాజిత్తు ఆ మణిని తన సోదరుడైన ప్రసేనజిత్తుకిచ్చాడు. అప్పటినుండి వృష్ణి, అంధకవంశాల వారి ఇళ్ళల్లో బంగారం వర్షం కురవటం ప్రారంభించింది. కావలసినపుడు వర్షాలు కురిసేవి. మనోవ్యధలు, వ్యాధులు నశించాయి. తరువాత శ్రీకృష్ణుడు ఆ మణిని పొందాలనుకున్నాడు. కాని తీసుకోలేదు. తరువాత ఒకనాడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతన్ని చంపింది. ఆ మణిని చేతపట్టుకొని పారి పోతుండగా గొప్ప ఎలుగుబంటు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళింది. మణికోరి శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపి ఉంటాడని వృష్ణి అంధక వంశం వీరులనుకొన నారంభించారు.
శ్రీకృష్ణుడు వారి అపోహను తొలగించుటకై మణిని వెదకటానికి ప్రతిజ్ఞ చేశాడు. ప్రసేనుని అడుగుల గుర్తులు చూస్తూ అడివికి వెళ్ళాడు. అతనితో సేవకులు కూడ చాలామంది వెళ్ళారు. చాలాచోట్ల వెతకగా చివరకు ఒకచోట ప్రసేనుడు గుర్రంతో పాటు చచ్చిపడి ఉన్నాడు. అతనివద్ద మణిలేదు. తరువాత దగ్గరలోనే ఒక సింహం చచ్చిపడి ఉంది. అక్కడ ఎలుగుబంటి అడుగుల గుర్తులు కనబడ్డాయి. అప్పుడు ఆ గుర్తులబట్టి శ్రీకృష్ణుడు గుహవద్దకు వెళ్ళాడు. గుహలోపల స్త్రీల మధురవాక్కు వినిపించింది. ఒకదాని ఎలుగుబంటి శిశువును ఆడిస్తోంది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. అతన్ని ఓదార్చటానికి దారి చెపుతోంది. “సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! ఏడవకు, నీదే యీమణి” అని.
ఈ మాటలు విని శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలగువారిని గుహ వెలుపల నుంచి తానొక్కడే గుహలో ప్రవేశించాడు. అక్కడ జాంబవంతుడు కృష్ణుని చూచి అతనితో యుద్ధానికి దిగాడు. ఇరవైయొక్క రోజులు వరకూ ఇద్దరికీ బాహుయుద్ధం జరిగింది. ఆలస్యం కావటంచేత బలరాముడు మొదలైన యాదవులు ద్వారకా నగరానికి తిరిగి వెళ్ళారు. కృష్ణుడు చచ్చిపోయాడని చాటింపు వేశారు. శ్రీకృష్ణుడు మహాబలవంతుడైన గొప్పఎలుగుబంటిని (జాంబవంతుని) ఓడించి స్యమంతక మణిని, భల్లూకరాజు కూతురు జాంబవతిని స్వీకరించాడు. శ్రీకృష్ణుడు తన అపవాదును పోగొట్టుకొనుటకు ఆ మణిని సాత్వతవంశీయుల సమక్షంలో సత్రా జిత్తుకు ఇచ్చివేశాడు. సత్రాజిత్తుకు పదిమంది భార్యలు. వాళ్ళపుత్రులు వంద మంది. వాళ్ళలో పేరు పొందినవాళ్ళు ముగ్గురు- భంగకారుడు, వాతపతి, ఉపస్వావంతుడు. కుమార్తెలు ముగ్గురు- స్త్రీరత్నమైన సత్యభామ, ప్రతిని, ప్రస్వాపిని. ఈ ముగ్గురినీ శ్రీకృష్ణుడికి భార్యలుగా ఇచ్చాడు.
సత్రాజిత్తు కొడుకు భంగారకుడికి ఇద్దరు పుత్రులు- సమాక్షుడు, దారేయుడు. మాద్రీయుధా జిత్తుల కుమార్తె పృశ్ని. ఈమెకు శ్వఫల్క, చిత్రకులు ఇద్దరు పుత్రులు. శ్వఫల్కుని భార్య కాశీరాజు కూతురు గాందిని. ఆమెతండ్రి నిత్యమూ గోదానం చేశేవాడు. గాందిని కడుపున శ్రుతవంతుడు అక్రూరుడు, ఉపమద్గు. అరిమేజయమద్గు, గిరిక్షిప, ఉపేక్ష, ధార్మికుడైన గృధ్రుడు, ఓజాన్తకుడు, ఆవాహ, ప్రతివాహ అనే పుత్రులు, సర్వాంగసుందరియైన ఒక కన్య జన్మించారు. ఆమె సాంబునికి భార్య అయింది. అక్రూరుడికి ఉగ్రసేనివలన సుదేవుడు, ఉపదేవుడు ఇద్దరు పుత్రులు. చిత్రుకునికి పృథు, విపృథు, అశ్వసేన, సుపార్శవక, గవేషణ అనే ఐదుగురు పుత్రులు. అరిష్టనేమికి ధర్మ, ధర్మభృత్తు, సుబాహు, బహుబాహు అనే పుత్రులు, శ్రవిష్ఠ, శ్రవణ అనే ఇద్దరు పుత్రికలు. శ్రీకృష్ణభగవానుని అపవాద కథను విన్నవాళ్ళు ఎప్పుడూ అపవాదు రానివాళ్ళు అవుతారు.
