హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము

Table of Contents

41 - విష్ణువు-వరాహ నృసింహాది అవతార వర్ణనము

వైశంపాయనుడిలా పలికాడు.

మహారాజ! నీవు నాపై పెద్ద ప్రశ్నల బరువు మోపావు. అదృష్టంవల్ల నీవు ఈవేళ శ్రీకృష్ణునికథ వినటానికి ఉత్సాహంతో ఉన్నావు. నేను నాశక్తి కొలది శ్రీకృష్ణభగవానుని కథ చెపుతున్నాను. విను.

వేదం బాగా తెలిసినవాళ్ళు, బ్రాహ్మణులు సహస్రాక్షుడని, సహస్రముఖుడని, సహస్రపాదుడని, సహస్రశీర్షుడనీ, సహస్రహస్తుడని, సహస్రబాహుడని, సహస్ర జిహ్వుడని, సహస్రకిరీటుడని ఎవనిని పొగడుతున్నారో, ఎవడు అక్షయుడు, హవనుడు, సవనుడు, ద్రవ్యము, హోత పవిత్రమైన పాత్ర అయిఉన్నాడో, ఎవడు యజ్ఞవేది, దీక్ష, చరువు, సృవము, సృక్కు, సోమరసం, శూర్పం(చాట), ముసలం (రోకలి), ప్రోక్షణీపాత్ర, దక్షిణాయనము అయిఉన్నాడో, ఎవడు యజుర్వేది, సామవేది బ్రాహ్మణుడో, ఎవడు యజ్ఞంలో సదస్యుడో, సదనము, సభ, యూపం, - సమిధలు, దర్భలు, చమస, ఉలూఖలం(రోలు), ప్రాగ్వంశం, యజ్ఞభూమి, ఋత్విక్కు, స్థండిలం(అరుగు), ఏకహాయనీశకటం మొదలైనవి సోమక్రయాది వస్తువులు, స్థావరం, జంగమం, ప్రాశ్చిత్తం, అర్ఘం, కుశ అయిఉన్నాడో, ఎవడు మంత్రం, యజ్ఞవహం, వహ్నిభాగం, భాగవహం, అగ్రేభుజ, సోమభుజ, హుతార్చి, ఉదాయుధ, శాశ్వత, విభు శబ్దాలతో చెప్పబడుచున్నాడో, ఆ శ్రీవత్సమనే పుట్టుమచ్చగలవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు, దేవదేవుడు ఐన నారాయణుడు అనేకమార్లు అవతరించాడు. ఆయన మళ్ళీ అవతరిస్తాడని కూడ నేను ప్రజాపతి నోటినుండి విన్నాను.

ఓ మహారాజా! భగవంతుడు విష్ణుమూర్తి దేవలోకాన్ని విడిచి ఎందుకు వసుదేవునింటిలో జన్మించాడు? అనే నీ ప్రశ్న చాలా పవిత్రమైనది. ఈప్రశ్నను గూర్చి నీకు ఆ ప్రభువుయొక్క గొప్పతనాన్ని, చరిత్రను మొదటినుండి చివరివరకు వినిపిస్తాను. నీవు పరిశుద్దము, శాన్తము ఐన మనస్సుతో విను. సమస్త ప్రాణులకు అంతరాత్మయైన భగవంతుడు దేవతలకు, మనుష్యులకు శుభం కొరకు మాటిమిటికీ అవతరిస్తూ ఉంటాడు. భగవంతుడైన విష్ణుని పవిత్రచరిత్రను వినటం పవిత్ర పురాణంతో వేదంతో సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. అందుచేత నీవు ప్రశాంతమైన మనస్సుతో తన్మయత్వంతో ఈ చరిత్ర విను.

రాజా! లోకంలో ధర్మం ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు ధర్మాన్ని స్థాపించ డానికి భగవంతుడు భూమిమీద అవతరిస్తాడు. ఇలాంటి సమయంలో భగవంతుని ఏ స్వరూపం అవతరిస్తుందో దానిని రాజసమూర్తి అంటారు. అతని గొప్పదైన స్వరూపం ఎల్లప్పుడూ స్వర్గంలో ఉండి చేయశక్యంకాని తపస్సును చేస్తూ ఉంటుంది. అది అతని సాత్వికమూర్తి. అతనియొక్క ఏ రూపం సృష్టిలయములను నిర్వహించుటకు యోగనిద్రలో మునిగి ఉంటుందో అది తామసమూర్తిగా తలచబడుచున్నది. భగవంతుడు ఒక వెయ్యిసంవత్సరాలు యోగనిద్రలో ఉంటాడు. వెయ్యి సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు.

ఆ సమయంలో బ్రహ్మ లోకపాలకులను చంద్ర, సూర్య, అగ్ని, కపిలముని, సప్తర్షిగణము, శివ, వాయు సముద్రాలను, మహానుభావులైన సనత్కుమార, మను మొదలగు వారందరనూ ఆ మహాప్రభువు సృస్తాడు. ఈ సమయంలోనే తేజశ్శాలియైన ఆ పురాణ పురుషుడే గ్రామములు, నగరములు మొదలైనవాటిని కూడ సృష్టిస్తాడు. వెయ్యి యుగాలు పూర్తిఅయిన పిమ్మట సమస్తసృష్టి అతని శరీరంలో లీనమౌతుంది. సమస్త ప్రపంచమూ నశించిన తరువాత మధుకైటభులనే ఇద్దరు రాక్షసులు విష్ణుమూర్తితో యుద్ధానికి సిద్ధపడతారు. అప్పుడు భగవంతుడు వాళ్ళకు వరాలిచ్చి ఆ సముద్రంలోనే చంపుతాడు. పూర్వం భగవంతుడు పాల సముద్రంలో పడుకొని యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడతని బొడ్డునుండి ఒక తామరపువ్వు పుట్టింది. ఆ కమలంనుండే బ్రహ్మాదిదేవతలు, ఋషులు పుట్టారు. ఇందువల్లనే పురాణాలలో భగవంతుని ఆ అవతారాన్ని పుష్కరావతారమన్నారు.

మహారాజ! మహాత్ముడైన నారాయణునియొక్క వరాహావతారం మిక్కిలి వినసొంపైనది. ఈ అవతారంలో నారాయణుడు వరాహరూపం ధరించి సము ద్రంలో చొరబడ్డాడు. నీటిలో మునిగిఉన్న వనాలతో, పర్వతాలతో కూడిన భూమిని కోరలతో పైకితెచ్చాడు. వరాహమూర్తికి నాలుగువేదాలు కాళ్ళు. యూపస్తంభం కోర, క్రతువు(యజ్ఞము) దంతాలు. చితి ముఖము, అగ్ని నాలుక, దర్భలు రోమాలు, రాత్రింబవళ్ళు నేత్రాలు. వేదాంగాలు చెవి అలంకారాలు. ముక్కు, స్రువం ముఖము. సామగానం కంఠస్వరం. ధర్మం, సత్యం మోకాళ్ళు. కర్మ పరాక్రమ సత్కారము. ప్రాయశ్చిత్తాలు ఘోరములైన గోళ్ళు, ఉద్దాత అస్త్రం, హోమం లింగము, ఓషధులన్నీ వృషణ్ణాల్లో ఉండే వీర్యం, వాయువు అంతరాత్మ. మంత్రం పృష్ఠము, సోమరసం రక్తము, వేది భుజశిరస్సు, హవిస్సు గంధం. హవ్యకవ్యములు వేగము (తుమ్ము, ఆవలింత మొదలైనవి).

శరీరం ప్రాగ్వంశము. హృదయం దక్షిణ, స్వాధ్యాయం స్వీకారము. పెదవులు అలంకారాలు. ధర్మాన్ని స్థాపించటానికి మహావీరుని రూపంగా మారుటయే అలం కారస్వరూపము. అనేకవిధాలైన ఛందస్సులు నడక. రహస్యములైన ఉపనిషత్తులు ఆసనము. నీడ భార్యగా మారింది. ఈ యజ్ఞవరాహ రూపము ధరించిన పరమాత్మ అనేకవిధములైన దీక్షలచే పూజింపబడ్డవాడు, దక్షిణ హృదయంగా కలవాడు. యోగమందాసక్తి కలవాడు. మహాయజ్ఞ స్వరూపుడు. వేదములు పెదవులుగా గలవాడు. ప్రావర్గ్యభూషణుడు, మహాయోగియైన విష్ణువు మేరుపర్వత శిఖరంతో సమానుడు, అంత ఉన్నతుడు అయ్యాడు. తరువాత ఆయన లోకకళ్యాణం కోసం నీటిలోపల దూరి యజ్ఞవరాహమూర్తి ద్వారా పర్వతాలతో, వనాలతో కూడిన భూమిని బయటకు తీశాడు. ఇంతవరకు భగవంతుని వరాహావతార వృత్తాంతం చెప్పాను. దీనితర్వాత నరసింహావతార చరిత్ర చెపుతున్నాను.

పూర్వం సత్యయుగ సమయంలో దేవతలకు శత్రువు రాక్షసులకు మొదటి వాడైన హిరణ్యకశిపుడు పదకొండువేల సంవత్సరాలవరకు నీరుమాత్రమే త్రాగుతూ ధృఢమైన ఆసనంమీద ఇంద్రియాలను నియమించి కఠోరమైన తపస్సు చేశాడు. అతని శమదమాది గుణాలను, బ్రహ్మచర్య, తపస్సులను చూచి ప్రసన్నుడై బ్రహ్మ హంసలవిమానంమీద వచ్చి, హిరణ్యకశిపునితో నీతపస్సుకు సంతోషించాను. వరం కోరుకో. కావలసిన, ఇష్టమైనదానిని పొందు అన్నాడు. అప్పుడు హిరణ్య కశిపుడు ఓ పితామహా! దేవ, గంధర్వ, యక్ష, అసుర, సర్వరాక్షస, పిశాచ, మనుష్యు లలో ఎవడూ నన్ను చంపలేకుండా ఉండేట్లు వరమిమ్మన్నాడు. ఋషులుకూడ శాపం పెట్టలేనట్లు, ఏ ఆయుధంచేత చావకుండునట్లు, ఎండినవస్తువుతోకాని, తడివస్తువుతోకాని చావకుండునట్లు, ఒక్క చేతిదెబ్బతో సేవక, సైన్య, వాహనాలతో కూడిన నన్ను చంపుటకు ఎవడు సమర్థుడో వాడే నన్ను చంపునట్లు, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం, నక్షత్రాలు, పదిదిక్కులు, కామం, క్రోధం, వరుణుడు, ఇంద్రుడు, యముడు, కుబేరుడు, కింపురుషరాజు నేనేకావాలి అని కోరాడు. ఇలా వరమడిగిన తరువాత బ్రహ్మ నవ్వుతూ ఓ రాజా! ఈ దివ్యము లైన వరాలిస్తున్నాను. ఈ కోరికలనన్నిటినీ పొందుతావు అనిచెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు.

దేవతలు బ్రహ్మ ఇచ్చిన వరాలను విని ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మవద్దకు వెళ్ళి మహాత్మా! ఈ వరదానంచేత ఆ రాక్షసుడు మమ్మల్ని చంపుతాడు. కనుక అతని మరణానికి ఉపాయమేదైనా ఆలోచించు. జీవులందరినీ నీవే సృష్టించావు. హవ్యకవ్యములను సృష్టించావు. నీ ప్రకృతితత్త్యాన్ని ఎవడూ ఎరుగడు అని విన్నవించారు. అప్పుడు బ్రహ్మ దేవతలారా! హిరణ్యకశిపుడు తన తపస్సుకు ఫలితం తప్పక పొందుతాడు. తరువాత భగవంతుడు విష్ణువు స్వయంగా అతన్ని చంపుతాడు అనిచెప్పాడు. అప్పుడు దేవతలు సంతోషించి తమతమ స్థానాలకు వెళ్ళిపోయారు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు వరాలుపొంది గర్వాంధుడయ్యాడు. మొట్టమదట మంచి నియమాల్ని పరిపాలించేవాళ్ళను, సత్యమందు, ధర్మమందు ఆసక్తి కలవారిని, ఆశ్రమాల్లో ఉండే మునులనీ బాధ పెట్టసాగాడు. తరువాత మూడులోకాలలోని దేవతలను వెళ్ళగొట్టి మొత్తం మూడు లోకాలనూ తనవశం చేసుకొని స్వర్గలోకం మీద అధికారం చెలాయిస్తూ అక్కడనే ఉండిపోయాడు.

స్వర్గంలో ఉన్న సమయంలో యజ్ఞంలో హవిర్భాగాలను దేవతలకు లేకుండా చేసి రాక్షసులకు వాటిపై అధికారం ఇచ్చాడు. ఈస్థితిలో ఆదిత్యులు, రుద్రులు, విశ్వేదేవులు, మరుద్గణాలు విష్ణుమూర్తిని శరణువేడి ఇలాచెప్పారు. దేవతలకు ప్రభు వైనవాడా! నీవే మమ్మల్ని సృష్టించావు. నీవే పరమదైవం, పరమగురువు. మేము హిరణ్యకశిపుడికి భయపడి నిన్ను శరణువేడుతున్నాం. మీరు అతన్ని నశింపచేయండి. ఎలాగైనా అతని దుర్మార్గంనుంచి మమ్మల్ని రక్షించండి. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు. ఓ దేవతలారా! నేను మీకు అభయమిస్తున్నాను. మీరు భయం విడిచిపెట్టండి. మళ్ళీ స్వర్గరాజ్యం మీకు ప్రాప్తిస్తుంది.

హిరణ్యకశిపుడు వరాలచే చంపశక్యం కానివాడై గర్వించాడు. నేను త్వరలోనే అతని సహచరులను, అతన్ని చంపుతాను. ఇలాచెప్పి ఆ విష్ణుమూర్తి దేవతలను పంపి సగం సింహము, సగం మానవరూపంగల శరీరాన్ని ధరించి హిరణ్యకశిపుని సభాభవనానికి వెళ్ళాడు. నరసింహరూపంతో మేఘంలాంటి శరీరం, మేఘం లాంటి కంఠధ్వని, వేగమూ కలవాడై అతిబలవంతుడు, అహంకారమత్తుడు అయిన హిరణ్యకశిపుని అతని సహాయులను చేతితో చంపాడు. ఈవిధంగా నరసింహా వతారమును చెప్పాను. తరువాత వామనావతారకథను వినిపిస్తాను.

పూర్వం భగవంతుడైన విష్ణువు బలవంతుడైన బలి అనే రాక్షసునికొరకు వామనరూపం ధరించి, తన మూడు అడుగులతో జయింపరాని రాక్షసులను భయపెట్టాడు. చంపివేశాడు. క్షోభించిన రాక్షసులు విప్రచిత్తి, శిబి, శంకురయుడు, అయశ్శిరుడు, శంకుశరుడు, హయగ్రీవుడు, వేగవంతుడు, కేతువంతుడు, ఉగ్రుడు, సామవ్యగ్రుడు, పుష్కరుడు, పుష్కడు, వేపనుడు, బృహత్కీర్తి, మహాజ హ్వుడు, సాశ్వుడు, అశ్వపతి, ప్రహ్లాదుడు, అశ్వశిరుడు, కుంభుడు, సంహ్రదుడు, గగనప్రియుడు, అనుహ్లాదుడు, హరి, హరుడు, వరాహుడు, శంకరుడు, రుజుడు, శరభుడు, శలభుడు, కుపనుడు, కోసనుడు, క్రధుడు, బృహత్కీర్తి, మహాజుహ్వుడు, శంకుకర్ణుడు, మహాస్వనుడు, దీర్ఘజిహ్వుడు, అర్కనయనుడు, మృదుచాపుడు మొదలగు వారు చాలమంది ఉన్నారు.

ఆ రాక్షసుల వద్ద చాలా శస్త్రములు ఉన్నాయి. వాళ్ళ వేషాలు, అలంకారాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళలో గొప్ప ఉత్సాహం ఉంది. తాబేలు, కోడి వంటి ముఖాల వాళ్ళు గాడిద, ఒంటె ముఖాలవాళ్ళు, పంది ముఖం కలవాళ్ళు, మొసలివంటి నోరు వాళ్ళు, నక్కముఖాల వాళ్ళు అయిన రాక్షసులు, అనేకములైన పూలదండలు ధరించి తమ ఆయుధములు పట్టుకొని భగవంతుడైన వామనుణ్ణి సమీపిస్తూనే చుట్టు ముట్టారు. అప్పుడు వామనుడు తన భయంకర స్వరూపాన్ని ప్రకటించి చేతులతో, కాళ్ళతోనూ ఆరాక్షసుల్ని నుతిమివైచి మహా భయంకరమైన రూపం ధరించి చంపివేశాడు. భూమికి బరువు తొలగించాడు. వేదవేత్తలైన బ్రాహ్మణులు విష్ణుమూర్తి గుణాన్ని గానం చేశారు.

వామనుడు తన పరాక్రమం ప్రదర్శిస్తూ భూమిపై ఉన్నప్పుడు సూర్యచంద్రులు అతని రొమ్ముమీద కనిపించారు. ఆయన ఆకాశంలో ఉన్నప్పుడు సూర్యచంద్రులు నాభి ప్రదేశమందున్నారు. ఇంకా ఎదిగినప్పుడు మోకాళ్ళ వద్ద ఉన్నారు. ఈ విధంగా వామనరూపం ధరించిన విష్ణువు పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపి భూమికి భారం లేకుండా చేశాడు. స్వర్గరాజ్యాన్ని మరల ఇంద్రునికి ఇచ్చాడు. వామన భగవంతుని చరిత్రను నీకు వినిపించాను. ఇప్పుడు ఆ నారాయణుని యొక్క దయామయమైన దత్తాత్రేయ ఆవతారకథను చెపుతాను.

“మహారాజా! వేదము వేదంలో చెప్పబడిన ధర్మాలు యజ్ఞయాగాదులు లేకుండా పోయినప్పుడు నాలుగు వర్ణాల వాళ్ళు కలిసిపోయినపుడు ధర్మం తగ్గి అధర్మం వృద్ధి చెందినపుడు సత్యం నశించి అసత్యం అధికారం చలాయిస్తు న్నప్పుడు జనం ఛిన్నాభిన్నమై ధర్మం వ్యాకులముకాగా అప్పుడు దత్తాత్రేయ రూపాన్ని ధరించి భగవంతుడు మళ్ళీ వేదధర్మాల్నీ యజ్ఞాలనీ నాలుగు ఆశ్రమాల ధర్మాలనూ ప్రవర్తింప చేశాడు. వరాలనిచ్చే దత్తాత్రేయడు బుద్ధిమంతుడైన కర్తవీర్యుడికి నీకు రెండు చేతులే ఉంటాయి. కాని సమయం వచ్చినప్పుడు వెయ్యి చేతులవుతాయి. ఓ కార్తవీర్యా! నీవు రాజ్యపరిపాలన చేస్తావు. నీవు ధర్మం తెలిసిన వాడవు అవుతావు. శత్రువులు నిన్ను కన్నెత్తి చూడజాలరు. అని వరమిచ్చాడు. ఈ విధంగా దత్తాత్రేయావతార కథ వినిపించాడు. ఇప్పుడు పరశురామావతార కథ చెపుతా విను!

ఈ అవతారంలో భగవంతుడు పరశురామరూపం ధరించి వెయ్యి చేతులు కలిగి యుద్ధంలో జయింపశక్యం కాని కార్తవీర్యుని సంహరించాడు పరశురాముడు నేలమీద నుండి రథమందు కూర్చున్న కార్తవీర్యుని నేల మీద పడవేశాడు. ధిక్కరించి మేఘంలా గర్జిస్తూ ఉన్న కార్తవీర్యుని వెయ్యి చేతులను నరికివేశాడు. కోట్ల కొలది క్షత్రియులతో కూడిన భూమి ఇరవై ఒక్కమార్లు క్షత్రియులు లేనిదిగా చేయబడింది. భూమి మీద క్షత్రియులు లేకుండా చేసి పాపం పోగొట్టుటానికి అశ్వమేధయాగం చేశాడు. ఆ యజ్ఞంలో ఆయన గుర్రాలను, ఏనుగులను, అమితమైన బంగారు రాసులను, అనేక గోవులను, అనేక విధాలైన దక్షిణాలను బ్రాహ్మణులకు ఇచ్చాడు. చివరకు సంతోషంతో భూమండలాన్ని అంతనూ మరీచిపుత్రుడైన కశ్యపుడికి దానం చేశాడు.

ఇప్పటికీ లోకకల్యాణం కోసం కఠోరమైన తపస్సు చేస్తూ మహేంద్ర పర్వతం మీద దేవతలవలె నివసిస్తున్నాడు. మహారాజ! నేను శాశ్వతుడు నాశం కానివాడైన శ్రీమహావిష్ణువు యొక్క పరశురామ వృత్తాంతాన్ని వినిపించాను. ఇరవై నాలుగవ యుగంలో పద్మాలవంటి అందమైన కళ్ళు కలిగిన పరమాత్మ తనను నాలుగు భాగాలుగా విభజించుకొని దశరథ మహారాజుకు పుత్రుడుగా అవతరించాడు. అతడు లోకంలో రాముడని ప్రసిద్ధిచెందాడు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు. ఈ రామావతారంలో ప్రజలను సంతోషపెట్టుట రాక్షసవంశమును నశింప చేయుట, ధర్మానికి అభివృద్ధి కలిగించుట ప్రధానమైన ఉద్దేశము.

ప్రపంచ ప్రజలందరూ అతని రాజా! రామచంద్ర! అని పిలుస్తారు. బుద్ధి మంతుడైన విశ్వామిత్రుడు దేవతలకు శత్రువులైన రాక్షసులను నశింప చేయుటకు, దేవతలకు కూడ పొంద శక్యముగాని గొప్పగొప్ప అస్త్రాల్ని రామచంద్రునికి ఉపదేశించాడు. శ్రీరాముడు చిన్నతనంలోనే ఆ అస్త్రాల మహిమతో యజ్ఞానికి విఘ్నం కలిగించే మరీచ సుబాహులను సంహరించాడు. అతడు మహాత్ముడు రాజర్షి అయిన జనక మహారాజు యజ్ఞంలో ప్రవేశించి అవలీలగా శివధనుస్సును విరిచాడు. సమస్త ప్రాణులకు శుభం కోరి శ్రీరాముడు లక్ష్మణుని వెంట బెట్టుకొని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు.

ఎప్పుడూ విడువకుండునట్టి మహాలక్ష్మి సీతరూపంలో అవతరించి శ్రీరామునికి భార్యయై అరణ్యవాస సమయంలో కూడ భర్తతో కూడా ఉంది. రామచంద్రుడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాస వ్రతాన్ని స్వీకరించి జన స్థానంలో ఉంటూ దేవతల పనిని నెరవేర్చాడు. లక్ష్మణునితో పాటు సీతని వెతికే సమయంలో శాపానికి గురియై మహాబలవంతుడయిన విరాధుణ్ణి, కబంధుణ్ణి ఈ యిద్దరు గంధర్వులనీ సూర్యుడు అగ్ని మెరుపులాంటి వజ్రాయుధముతో సమానమైన బాణాలతో చంపివేశాడు. ఆ రాక్షసులను మళ్ళీ గంధర్వరూపం వచ్చింది. తరువాత రామచంద్రమూర్తి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. దేవతల నుండి అనేక వరాలు పొంది మదించి యున్న రాక్షసరాజైన రావణుని అతని బంధువులతో సహా సంహరించాడు.

ఆ శ్రీరాముడే యుద్ధవీరుడు వరాలు పొంది గర్వంతో కూడిన “మధు” పుత్రుడైన రావణసురుణ్ణి ఇతర రాక్షసులను కూడ సంహరించాడు. ధర్మప్రధానుడై శ్రీరామచంద్రుడు ఈ మహాకార్యాలనన్నిటినీ నిర్వహించి. అయోధ్యా నగరంలో పది అశ్వమేధయాగాలు చేశాడు. అతని రాజ్యంలో ఎక్కడా అశుభవార్త వినపడలేదు. వాయునిత్యమూ అనుకూలంగా వీచేది. ఒక్క స్త్రీ కూడా భర్త పోయిన దుఃఖించేది లేదు. దొంగతనం ఉండేది కాదు. నీటివల్ల, గాలివల్ల ఎప్పుడూ ఏ ప్రాణికీ నష్టం వాటిల్లలేదు. వృద్దుడు మరణించిన పిల్లవానికి ప్రేతకార్యం చేయటం ఉండేదికాదు. అన్ని వర్గాలవాళ్ళు తమతమ విధులను నిర్వర్తించేవాళ్ళు. భార్యాభర్తలలో కలహం ఉండేది కాదు. ఆకాలంలో రాముడు ఒక్కడే రాజు అతడే పరిపాలించువాడు.

అందువల్లన సమస్త ప్రపంచమూ ఏ బాధలేకుండా సుఖపడింది. శ్రీరాముని పరిపాలన కాలంలో మనిషికి వెయ్యి సంవత్సరాలు పూర్ణాయుస్సు. అందరూ ఏవ్యాధీ లేనివాళ్ళే. పురాణం తెలిసిన వాళ్ళు అతని గొప్పతనాన్ని గానం చేసేవాళ్ళు. భగవంతుడైన శ్రీరాముడు నల్లని వర్ణం గలవాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉండేవి. ముఖం తేజస్సుగలది. మితంగా మాట్లాడేవాడు. అతని చేతులు, మోకాళ్ళ వరకూ ఉండేవి. భుజశిరస్సులు సింహానికి ఉన్నట్లు ఉండేవి. ఆయన యువకుడు బలవంతుడు, సమస్త కల్యాణ గుణాలకూ గనియైనవాడు. శ్రీరాముడు పదకొండు వేల ఏళ్ళు అయోధ్యకు రాజై పరిపాలించాడు.

ఋగ్యజుస్సామ వేదాలధ్వని నగరంలో వినిపిస్తుండేది. సూర్యచంద్రులను మించిన కాంతి గలవాడు శ్రీరాముడు. గొప్ప దక్షిణలిచ్చి వందలకొలది యాగాలు చేశాడు. తరువాత తన ఉత్తమస్థానానికి వెళ్ళాడు. ఓ మహారాజా! ఇక్ష్వాకుకుల నందనుడు మహాబాహువైన రామచంద్రుడు ఈ విధంగా పరివార సమేతంగా రావణాసురుని చంపి తన పరమశ్రేష్ఠమైన తన స్థానమును చేరాడు. వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! మాధురలో లోకక్షేమం కోసం అవతరించి మహాత్ముడైన శ్రీకృష్ణుడు చేసిన ఘనకార్యాలను ఇప్పుడు చెపుతున్నాను విను!

శ్రీకృష్ణుడు “శ్వాల్వుని”, “మైంద”, “ద్వివిదు”లను, కంసుని, అరిష్టుని, వృషభుని, కేశి అనే రాక్షసుని, పూతననుకువలయా పీడమనే ఏనుగును, చాణూరముష్టికులను, మనుష్యరూపంలో ఉన్న చాలామంది రాక్షసులను సంహరించాడు. అతడు బాణా సురుని వెయ్యి చేతుల్ని నరికివేశాడు. మహాబలవంతుడైన యవనరాజు నరకాసురుని చంపాడు. అతడు చెడ్డ రాక్షసులను చంపి బలాత్కారంగా వాళ్ళ ధన రత్నాదులను హరించాడు. గడిచిపోయిన పద్దెనిమిదవ ద్వాపరయుగంలో నారాయణుని తొమ్మిదవ అవతారం జరిగింది. ఈ సమయంలో ఆయన వేద. వ్యాస రూపంలో అవతరించాడు. సత్యవతీ పుత్రుడయిన వ్యాసుడు ఒకేరాశిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలు చేశాడు. భరతవంశాన్ని నిలబెట్టాడు.

మహారాజా! ఈ విధంగా నేను నీకు గడిచిన భగవంతుని లోకహితకరములైన అవతారాలను వాటి వృత్తాంతాలను వినిపించాను. ఇప్పుడు రాబోయే అవతారాల వృత్తాంతం చెపుతా విను. తొమ్మిదవ అవతారము యొక్క పని పూర్తి అయిన తరువాత శ్రీమహావిష్ణువు మళ్ళీ లోకక్షేమం కొరకు సంభృ గ్రామంలో విష్ణుయశుడనే బ్రాహ్మణునికి పుత్రుడై “కల్కి” అనే పేరుతో పదవ అవతారం ధరిస్తాడు. అప్పుడు యాజ్ఞవల్క్యమహర్షితోపాటు ఆ “కల్కి” భగవానుడు మొదట క్షణికవాదులైన బౌద్దులను శాస్త్రార్థరూపమైన వాగ్యుద్ధంలోను తరువాత ఆయుధ యుద్దంలో కూడా, ఓడించి గంగా యమునల మధ్యప్రదేశంలో నివసిస్తాడు.

తరువాత ఒకరి భార్య నింకొకరు అపహరించటం వల్ల వాగ్వాదంరాగా అప్పటి రాజు, మంత్రి, సైనికులు వారిలోవారు యుద్ధం చేసుకొని మరణిస్తారు. అప్పుడు ప్రపంచంలో అరాచకం వ్యాపిస్తుంది. ప్రజలు ఒకరితో ఇంకొకరు యుద్ధం చేస్తారు. బలవంతులు బలహీనులు సమస్తమునూ అపహరిస్తారు. అప్పుడు కలి యుగం మధ్యకాలమవుతుంది. ఇందువల్ల అందరూ ఉపాయం లేక మిక్కిలి దుఃఖించి పోట్లాడువారై కలియుగం పూర్తి అయ్యేటప్పుడు మిగిలి ఉన్న ప్రజలు కూడ నశిస్తారు. ఈ విధంగా కలియుగం పూర్తి అయిన తరువాత మరల సత్య యుగం (కృత యుగం) ప్రారంభమవుతుంది.

ఆ సమయంలో ప్రజలు సహజంగా న్యాయమందు ఆసక్తి కలవారౌతారు. బ్రహ్మజ్ఞానులైన ఋషులు పురాణాల్లో విష్ణుభగవానుని అనేక అవతారలను వర్ణిస్తారు. భగవంతుని అవతారాల వర్ణనను విని దేవతలు కూడ ఏమీ తెలియని వాళ్ళు అవుతారు. వేదములు, పురాణములు ప్రచారంలో ఉంటాయి. కల్యాణగుణ పరిపూర్ణుడైన భగవంతుని అవతారాలను తగ్గించి వర్ణించాను. సాటిలేని పరాక్రమం గల విష్ణు భగవానుని అవతారకథలను చేతులు జోడించి విన్నవాడని పితృదేవతలు సంతోషిస్తారు. యోగీశ్వరుడైన విష్ణుభగవానుని యోగమాయ వృత్తాంతాన్ని శ్రద్దగా విన్నవాడు సమస్త పాపాలనుండి విడువబడుతాడు. భగవంతుని దయతో ధనధాన్యములు గొప్ప సంపద కలవాడౌతాడు. అన్ని విధాలైన భోగాలు అతనికి సులభమౌతాయి.

ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో విష్ణువు-వరాహ నృసింహది అవతార వర్ణనము అను నలభై ఒకటవ అధ్యాయము