హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
46 - దేవతల విజయము, కాలనేమి యుద్ధము
వైశంపాయనుడిలా చెప్పాడు.
ఇలాగే అగుగాక అని యింద్రుడు సంతోషించినవాడై ఓ చంద్రుడా! నీవు యుద్దంలో శత్రునాశం కోసం దేవతల విజయం కొరకు వరుణదేవుడికి సహాయం చెయ్యి. మమ్మల్ని కాల్చివేస్తున్న రాక్షసమాయను శాంతింపచెయ్యి అన్నాడు. అప్పుడు చంద్రుడు దేవరాజా! ఇప్పుడు నాప్రభావం చూపిస్తాను. ఈ రాక్షసులను చలిచే నశించిపోయేటట్లు మంచును వర్షిస్తాను. మాయ తొలగి మదం గర్వం నశించి పోయిన రాక్షసులను చూస్తావు అని మంచును వర్షించగా వరుణుడు వర్షాలు కురిపించాడు. పాశముల దెబ్బలతో రాక్షసులు నేలపై ఒరిగారు.
తరువాత రాక్షసరాజు మయుడు వరుణుని పాశాలతో బంధింపబడినట్టియు, చంద్రుని మంచు వర్షంతో శక్తిహీనులునైన రాక్షసులను చూచి మాయతో కూడిన పర్వతాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు రాళ్ళవర్షంవల్ల దేవతలు మరణించారు. రాక్షసులు బ్రతికారు. రాక్షసమాయ వృద్ధి చెందటంచూచి విష్ణువు అగ్నికి, వాయు దేవునికి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకరొకరు సహాయమై ప్రళయకాలంలాగా రాక్షస సైన్యాన్ని చంప మొదలుపెట్టారు. దానితో రాక్షసుల పర్వతమాయ నష్టమైపోయింది. ముందు వాయుదేవుడు నడుస్తుంటే అతనివెనుక అగ్నిదేవుడు. ఈ విధంగా ఇద్దరూ అడ్డూ లేకుండా రాక్షససౌన్యంలో చొరబడి సంచరించారు. రాక్షసుల విమానాలు తగలబడిపోయాయి. వాయువు వలన నేలకూలాయి. దీనివల్ల రాక్షసులలో నిరాశ వ్యాపించింది.
ఈ విధంగా రాక్షసమాయ నాశంకాగా దేవతలు సంతోషిస్తూ విష్ణుభగవానుని స్తోత్రం చేస్తూ నలువైపుల నుంచీ జయజయధ్వానాలు చేశారు. ఈ విధంగా ఇంద్రుడికి జయం రాక్షసులకు పరాజయం (ఓడిపోవుట) కలిగింది. దీనితో దిక్కులు నిర్మలమయ్యాయి. ధర్మకార్యాలు జరుగ నారంభించాయి. పుణ్యాత్ములకు అభివృద్ది, పాపాత్ములకు నాశం సంభవించింది. అంతటా ప్రశాంత వాతావరణమేర్పడగా “కాలనేమి” అనే రాక్షసుడు రాక్షసులకు సంభవించిన భయం విని సూర్యుని వంటి కిరీటాన్ని ధ్వని చేయుచున్న ఆభరణాలు ధరించి పెద్ద పర్వతంలాగా గ్రీష్మర్తువులో బయల్దేరిన అగ్నిలాగా మండిపోతూ యుద్ధానికి దిగాడు. అతని శరీరం మూడులోకాలంతా విశాలమైనది.
తన భుజాలతో ఆకాశాన్ని ఎత్తివేస్తూ పాదాలతో భూమిని అణగతొక్కుతూ వచ్చాడు. ప్రళయకాలంలో ఆకలిగొన్న మృత్యుదేవతలా యుద్ధభూమిని చేరాడు. యుద్దరంగంలో కాలనేమిని దేవతలు భయంతో ఒణుకుతూ చూచారు. ఆ కాలనేమి గాలికి కదులుతున్న వస్త్రం గలవాడై దేవతలనందర్నీ భయపెట్టాడు. మయుడు కాలనేమిని కౌగలించుకున్నప్పుడు విష్ణువుతో కూడిన మందరపర్వతం గుర్తుకొచ్చింది. అప్పుడు ఇంద్రునితో సహా దేవతలందరూ భయపడిపోయారు. యముడే వస్తున్నట్లు తలచారు.
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వంలో దేవతల విజయము, కాలనేమి యుద్ధము అను నలభై ఆరవ అధ్యాయము
