హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
51 - విష్ణువు దేవతలతో మాట్లాడుట
వైశంపాయనుడిలా చెప్పాడు.
శ్రీమహావిష్ణువు మాటలు విని బ్రహ్మదేవుడు దేవతలందరికీ మేలు కలిగే మాటను ఇలా చెప్పాడు.
రాక్షసవినాశకుడవైన నారాయణా! నీవు మమ్ము యుద్దసముద్రం నుండి బయటకు తీసి అభయమివ్వటానికి నిలిచి ఉండగా భయపడే ఊహే లేదు. ఇంద్రుడు రాజ్యం చేస్తుంటే మీరు మా శత్రువులను నశింపచేస్తున్నారు. మనుష్యులందరూ సత్యధర్మపరులై ఉన్నారు. రాజులు ఒకరితోఒకరు యుద్ధం చేయటం లేదు. ఎక్కువ ధనాన్ని వెచ్చించి ప్రజలకు సుఖసమృద్ధిని, ధనాగారాన్ని నింపుట చేస్తున్నారు. ఎవరినీ కఠినంగా దండించడలేదు. నాలుగు వర్ణాలవాళ్ళు ధర్మాన్ని పరిపాలిస్తూ దేశరక్షణ చేస్తున్నారు. ఎవరికీ ఎట్టి భయమూ లేదు. జనులందరూ మంత్రుల యొక్క ఆలోచనా బలంచేత చతురంగసేవ చేతనూ రక్షింపబడుచు న్నారు. ఎక్కువగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చేస్తున్నారు.
అందరూ ఋషుల నియమాలననుసరించి నడుస్తున్నారు. ధర్మశాస్త్రం చెప్పిన ధర్మాలనన్నిటినీ ప్రజలు ఎరుగుదురు. రాజులు మహర్షుల వలె తేజస్సు కలవారై సత్యయుగంగా చేస్తున్నారు కాలాన్ని. మేఘాలు సకాలంలో వర్షం కురుస్తున్నాయి. వాయువు అనుకూలంగా వీస్తున్నది. దిక్కులు నిర్మలంగా ఉన్నాయి. ఏ విధమైన అపశకునాలు లేవు. చంద్రుడు సౌమ్యంగా తిరుగుతున్నాడు. సూర్యుడు అందరికీ అనుకూలంగా ఉన్నాడు. అగ్ని అనేక విధములైన హవిస్సులతో తృప్తిపడి చక్కని పరిమళం వెదజల్లుతున్నాడు. రాజుల యొక్క సేనల వలన భూమికి పెద్దకష్ట మేర్పడింది. భూమి మునిగిపోయే పడవలా భయంకరమైన కష్టంలో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క రాజు ఉన్నాడు. ప్రతి పట్టణానికి కోట్ల కొలది గ్రామాలున్నాయి. ప్రతి రాజువద్ద లెక్కలేనంత సేన ఉంది. ఆ రాజుల యొక్క విస్తారమైన సేవలచేత భూమి సందు లేకుండా ఉంది.
ఓ భగవంతుడా! ఈ విధంగా దుఃఖపడుతూ భూమి కాలంతో పాటు నా వద్దకు వచ్చింది. ఇప్పుడు నీవొక్కడేవే ఈమెకు గతి. మనుష్యులకు కర్మభూమియైనది బాధపడుచున్నది. ఆమె బాధను మేము విన్నాం, నీవు విన్నాను. ఆమెకు బరువు తగ్గించుటకు నీతో ఆలోచించుతాము. ప్రజలందరూ ధర్మమార్గాన నడుస్తున్నారు. ధర్మానికి లోపం కలుగుకుండునట్లు ఆలోచించండి. భూమికి భారం లేకుండ చేయటానికి రాజులనే చంపాలి. ఈ విషయాన్ని స్థిరంగా ఆలోచించటానికి మనం భూమితోకూడ మేరుపర్వత శిఖరానికి వెళ్దాం రండి.
