హరి వంశ పురాణము లోని హరివంశ పర్వము
10 - వైవస్వతమనువంశం, పురూరవ జన్మ
వైశంపాయనుడిలా చెప్పాడు.
వైవస్వతమనువుకు తనతో సమానులైన తొమ్మిదిమంది కొడుకులన్నారు. వాళ్ళు ఇక్ష్వాకుడు, నాభగుడు, దృష్ణుడు, శర్వాతి, నరిష్యుడు, ప్రాంశువు, నాభాగారిష్టుడు, కరూషుడు, పృషధ్రుడు అనువాళ్ళు. వైవస్వతమనువుకు పుత్రులు కలుగక పూర్వం మిత్రుని వరుణుని ప్రసన్నులను చేసుకోవటానికి పుత్రేష్టి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో మిత్ర వరుణులకు భాగము ఇవ్వటానికి మునులు ఆహుతి వేయగా దేవతలు, గంధర్వులు, మునులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. వాళ్ళు ఆహా ఈ మహారాజు మనువు యొక్క తపస్సు ఇతని పరాక్రమం శాస్త్ర జ్ఞానం అద్భుతమైనవి. అని మెచ్చుకొన్నారు.
ఆ యజ్ఞంలో దివ్యమైన వస్త్రాలు ధరించి, దివ్యమైన ఆభరణాలు ధరించి, దివ్యములైన అస్త్రాలు ధరించిన ఇల అనే కన్యక పుట్టింది. మహారాజు ఆమెకు ఇల అని పేరు పెట్టి, ఆ కన్యతో ఇలా అన్నాడు. ఓ పుత్రీ! నీవు పుత్రులను కోరుతున్న ప్రజాపతినగు నా మాటలను పాటించు. అది విని ఇల మహారాజ నేను మిత్రావరుణుల అంశతో పుట్టాను. అందుచే వాళ్ళ దగ్గరకు వెళ్లాను. అలా చేయక పోతే నేను ధర్మం పాటించని దానవుతాను. నేను నశించిపోతాను అని మనువుతో చెప్పి మిత్రావరుణుల వద్దకు వెళ్ళింది. అక్కడ చేతులు జోడించి దేవా! నేను మీయిద్దరి అంశతో పుట్టాను. కనుక నేనేమి చేయాలో ఆజ్ఞ ఇవ్వండి. మహారాజు మనువు నా ఆజ్ఞను పాటించు అంటున్నాడు, అన్నది. అప్పుడు మిత్రావరుణులు ఓ సుందరి! నీ ధర్మదృష్టి, సత్యనిష్ఠ ఇంద్రియని గ్రహము చూచి మేమిద్దరం చాల సంతోషించాము.
ఓ భాగ్యవంతురాల! నీవు మూడు లోకాలలోనూ మా యిద్దరికీ కుమార్తెవు. మనువుకు వంశాన్ని ఉద్దరించే పుత్రుడవు నీవే అవుతావు. సుద్యుమ్నుడనే పేరుతో మూడు లోకాలలలో ప్రసిద్ధి పొందుతావు. లోకానికి ప్రియమైనవాడవు ధర్మ స్వభావంతో మనువు వంశాన్ని వృద్ధి చేయువాడవవుతావు అని చెప్పారు. ఇలా వాళ్ళ ఇద్దరి మాట విని తన తండ్రి మనువు వద్దకు తిరిగివెళ్ళింది. దారిలో చంద్రుని కుమారుడు బుధుడు తారసిల్లాడు. ఆమెను సంగమానికి పిలిచాడు. ఈ విధంగా బుధుడు వలన ఆమెకు పురూరవుడనే కొడుకు పుట్టాడు. అతడు పుట్టగానే ఇల స్త్రీ రూపాన్ని విడిచిపెట్టింది. పురుషరూపంతో సుద్యుమ్నుడనే పేరుతో ప్రసిద్ధి పొందింది. సుద్యుమ్నునికి ఉత్కలుడు గయుడు వినతాశ్వుడు అనే పరమ ధర్మాత్ములైన పుత్రులు పుట్టారు.
ఆ తరువాత ఉత్కలుడికి ఉత్కలదేశం, వినతాశ్వుడికి పడమర దిక్కు గయుడికి తూర్పు దిక్కు పరిపాలించటానికి ప్రభుత్వ (మిచ్చారు)ము ప్రాప్తించింది. గయ మహారాజు రాజధాని గయ అనే పట్టణం. జనమేజయ మహారాజ ప్రజాపతి అయిన మనువు ఇక్ష్వాకుడు మొదలైన పదిమంది పుత్రులను కని సూర్యభగవానుని శరీరంలో ఎప్పుడు ప్రవేశించాడో అప్పుడు అతని కొడుకులు పది విభాగాలుగా భూమిని చేసి వనములతో యూపస్తంభములతోడకూ గుర్తులు గలదానినిగా చేశారు. పెద్దవాడైన ఇక్ష్వాకుడు మధ్యదేశాన్ని పొందాడు. సుద్యుమ్నుడికి కన్యా స్వభావం ఉండటంచేత మధ్యప్రదేశమతనికి ప్రాప్తించలేదు. అతడు గురువైన వసిష్టుని ఆజ్ఞననుసరించి ప్రతిష్టానపురాన్ని పరిపాలించాడు.
కీర్తిశాలి అయిన ప్రద్యుమ్నుడు కొన్ని రోజులు ప్రతిష్టానపురాన్ని పరిపాలించి, ఆ రాజ్యాన్ని పురూరవుడికి ఇచ్చాడు. ఉత్కలకునికి ధృష్టకుడు, అంబరీషుడు, దండుడు అనే కీర్తిమంతులైన ముగ్గురు పుత్రులు పుట్టారు. దండుడే దండ కారణ్యాన్ని ఏర్పరచినవాడు. ఆ వనము తపశ్శాలురకు తపస్సు చేసుకొనే ఉత్తమ స్థానమైంది. అక్కడ ప్రవేశిస్తేనే మనిషి పవిత్రుడౌతాడు. పాపాలు తొలగిపోయిన వాడౌతాడు. ఈ విధంగా ఇలుని కని సుద్యుమ్నుడు స్వర్గస్తుడయ్యాడు. మహారాజా! మనుపుత్రుడైన సుద్యుమ్నుని స్త్రీ పురుష లక్షణాలు ఉండుటచే అతనిని సుద్యుమ్నుడనీ, ఇల అనీ రెండు పేర్లతో పిలిచారు.
నరిష్యత్తుడు కుశకులు అనే వాళ్ళు పుత్రులు, నాభగుడికి అంబరీషుడు కుమారుడు. ధృష్ణుని పుత్రుడు ధర్టకుడు, శర్యాతికి ఆనర్హుడనే కొడుకు, సుకన్య అనే కూతురు కలిగారు. తరువాత ఆమె చ్యవనమహర్షికి భార్య అయింది. ఆనర్తుని కొడుకు తేజశ్శాలి, రేవుడు. అతనికి ఆవర్తదేశం, (ద్వారక) రాజ్యం ప్రాప్తించింది. కుశస్థలి అతని రాజధాని రేవుడికి కకుద్మి పెద్దకొడుకు కొన్ని రోజుల తరువాత రేవుడు తన కూతురుతో సంగీతం వినటానికి బ్రహ్మలోకం వెళ్ళాడు.
అక్కడ వాళ్ళు ముహూర్తకాలమే ఉన్నారు. ఆ కాలం భూలోకంలో కొన్ని యుగాలైంది. తరువాత యాదవులతో నిండిన తన రాజధాని ద్వారకకు తిరిగి వచ్చాడు. అప్పటికి అతడు యువకుడుగానే ఉన్నాడు. తిరిగివచ్చిన రేవుడు ద్వారాలు కలిగి మిక్కిలి అందంగా ఉన్న దానినిగానూ శ్రీకృష్ణడు బోజవృష్ణి అంధకులచే రక్షింపబడుచున్న దానినిగా చూచాడు. అక్కడ పరిస్థితులను బాగా తెలుసు కొని తన కన్యను రేవతిని బలరాముని కిచ్చి వివాహం చేశాడు. తరువాత తపస్సు చేయటానికి మేరుపర్వతానికి వెళ్ళాడు. బలరాముడు రేవతితో ఆనందంగా ఉన్నాడు..
ఇది శ్రీమహాభారతంలో హరివంశమందలి హరివంశపర్వమందు వైవస్వత మను వంశం, పురూరవ జన్మ అను పదవ అధ్యాయము.
