వాయు మహా పురాణము

Table of Contents

54 -  నీలకంఠస్తవో

ఋషులనిరి:- ఓ మహాకాంతివంతుడా సూతా! బ్రహ్మ మొదలైన యేకాలములోను, ఏ దేశములోను ఈ పుణ్యమైన యాఖ్యానము జరిగినది. ఓ తపోధన దీనిని జరిగినది జరిగినట్లు చక్కగా మాకు జెప్పుడు-.

సూతుడనెను:- ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! వేయి యేండ్లయాగమందు జగత్తునకాయువైన వాయువుచే జెప్పబడుచుండగా పూర్వము నేను విన్నది విన్నట్లు చెప్పెదను వినుడు-2. ఓ స్తుతింపబడిన వ్రతములు గల మునులారా! కావున దేవదేవుడైన శివుని కంఠమునకు నలుపెందులకో నేను జెప్పెదను వినుడు-3. శైలరాజైన హిమాలయము యొక్కయుత్తరమున సరస్సులును, నదులును, మడుగులును గలవు. పవిత్రమైన యుద్యానములలోను, తీర్థములతోను, దేవాలయములలోను ఎత్తైన పర్వత శిఖరములలోను గుహలలోను వానియుపనములలోను, దేవభక్తులును మహాత్ములునై స్తుతింపబడిన వ్రతములు గలవారైన మునులు అచ్చటచ్చట యథావిధిగా మహాదేవుని స్తుతింతురు. ఋగ్వేద యుజర్వేద సామవేదములతోను, నృత్యములతోను, గీతములతోను, మొదలగు పూజలతోను, ఓంకారముతోను నమస్కారములతోను సదాశివుని నర్చింతురు-6, జ్యోతిశ్చక్రము బాగా తిరుగగా సూర్యుడు మధ్యమున వ్యాపించినవాడు గాగా నిశ్చయాత్ములై దేవతలందరు ఆ కధను వినుటకై కూర్చుందురు. తరువాత నియమములోనుండుటచే ప్రాణశేషులై యుండిరి-7. వాయువు నమస్తే నీలకంఠాయ అనెను. అది విని యాత్మభావము గలవారును, స్తుతింపబడిన వ్రతములు గలవారును సూర్యునితోడుగా చరించువారును వాలఖిల్యులును ప్రసిద్దిజెందిన మునులుండిరి-8. వారు ఎనుబది యెనిమిది వేలు ఊర్థ్వరేతస్కులు కావున ఆకులు, జలము, వాయువు వీనిని మాత్రమే భుజించువారై వాయువునడుగుదురు.

ఋషులనిరి:- ఓ వాయు పండితోత్తమా! నీవు "నీలకంఠ" యన్నది ఓ పుణ్యకార శ్రేష్టులారా! రహస్యమైనదియు, పవిత్రమైన వానిలో పుణ్యమైనది-10. కావున, ఓ వాయుదేవా! పార్వతీపతియైన శివుని యొక్క కంఠమందలి నలుపునకు కారణమేమో! నీయనుగ్రహమున వినదలచితిమి” విశేషించి నీ ముఖమునుండియే చక్కగా వినదలచితిమి. నీవు చెప్పిన మాటలు సారవంతమైన యర్థములు గలవై వెలువడినంతవరకు వినదలచితిమి-11,12. వాయువు మానవుని వర్ణస్థాన (వర్ణోత్పత్తి స్థానములందుండగా మాటల ప్రక్రియ చక్కగా నడుచుచుండును. ఓ వాయుదేవా! మానవులలో నీ వల్లనే మొదట జ్ఞానము, తరువాత ఉత్సాహమును గలుగును-13. నీవు కదులుచుండగనే తక్కిన వర్ణముల యుచ్చారణలు జరుగును. వాక్కులు బయలు వెడలక వెనుకకే వెళ్ళినపుడు దేహబంధములు (దేహమునకున్నయవయవ బంధములు) దుర్లభములగును-14. ఓ వాయుదేవా! అచటగూడ నీ చక్కని యునికి గలదు. నీవు అంతటనుండు వాడవు గదా. ఓ వాయుదేవా! నీవుదక్క అంతటనుండు దేవుడు మరొకడు లేడు-15. ఓ వాయుదేవా! నీ యీ జీవలోకమంతటను ప్రత్యక్షము. నీవు బ్రహ్మదేవుని దెలియుదువు. మనోనాయకుడైన యీశ్వరుని గూడ దెలియుదువు-16. కావున ఈశ్వరుని కంఠదేశమున గలిగిన రూపవికారమునకు (నలుపుదనము) దేనివల్ల జరిగినది? భావితాత్ములైన యా ఋషుల మాటవినిన తరువాత లోక నమస్కృతుడైన మహాతేజస్వియైన వాయువు మారుపలికెను.

వాయురువాచ :-

వాయుదేవుడనెను:- పూర్వము కృతయుగమున బ్రహ్మమానస పుత్రుడును, బ్రాహ్మణుడును, వేద నిర్ణతత్పరుడును, ధర్మాత్ముడునైన వసిష్ఠుడను వాడుండెను-18. ఆతడు మయూరవాహనుడును, మహిషాసుర భార్యల మాంగళ్య చిహ్నమైన కంటికాటుకను దొంగిలించినవాడును (మహిషాసురుని జంపి వాని భార్యలను విధవలను జేసినవాడును, కృత్తికా పుత్రుడైన కుమారస్వామిని నడిగెను-19. (దేవ) మహాసేనుడు, మహాత్ముడు మేఘగర్జనము వంటి కంఠధ్వని గలవాడును, ఉమాదేవియొక్క మనస్సంతోషముచే బాలకరూపమును ధరించినవాడును-20. క్రౌంచ పర్వతము జీవితమును హరించువాడును పార్వతీ హృదయనందనుడును, మహాబలుడునునైన కార్తికేయుని (కుమారస్వామిని) వసిష్ఠుడు భక్తితో నడుగుచున్నాడు.

వసిష్ఠ ఉవాచ:-

వషిష్ఠుడనెను:- హరుని కుమారుడవగు నీకు నమస్కారము. ఉమాదేవి యొక్క గర్బస్వరూపుడవైన నీకు నమస్కారము. అగ్నియొక్క గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము. గంగా గర్భస్వరూపుడవైన నీకు నమస్కారము-22. రెల్లు గడ్డికి గర్భ స్వరూపుడవైన నీకు నమస్కారము. కృత్తికానక్షత్ర గణస్వరూపులైన షట్కృత్తికల సుతుడవైన నీకు నమస్కారము. పండ్రెండు నేత్రములు గలవానికి నమస్కారము ఆరు ముఖములు గల నీకు నమస్కారము-23. శక్తియను సాయుధమును చేత ధరించిన వానికి నమస్కారము. దివ్యమై ఘంటధ్వజముగా గలవానికి నమస్కారము. అని యీ విధముగా మహాసేనుడగు కుమారస్వామిని స్తుతించి యా నెమలి వాహనమైన కుమారస్వామిని వసిష్ఠుడడిగెను-24. శుభ్రమైన కాటుక కాంతిగలిగి కనబడుచున్న యీ(నల్లని) వర్ణము మల్లెపూవుతోను చంద్రునితోను సమానమైన శివుని కంఠమునం ఎందు పుట్టినది?-25. ఈ విషయములకును ఆప్తుడును, భక్తుడును, ఇంద్రియ దమనశక్తిగలవాడనై నిన్నడుగుచున్న నాకు (ఓ కుమారస్వామి) చెప్పుము మంళముతో గూడినదియు, పవిత్రమైనదియు, పాపముల నశింపజేయునదియు నైన యీ నీలకంఠ కథను నా ప్రీతికై పూర్తిగా జెప్పదగియున్నావు-26. తరువాత, మహాత్ముడైన వసిష్ఠుని యొక్క మాటను విని మహాతేజస్వియై రాక్షసబలముల జంపు కుమారస్వామి మారుపలికెను-27. ఓ ప్రవక్తలలో శ్రేషా(వశిష్ఠునేను జెప్పుమాటలు వినుము. పూర్వము ఉమాదేవి యొక్కయొడిలో గూర్చొని మహాత్ముడైన శివునకు పార్వతితో జరిగిన సంవాదమును ఓ మహామునీ! నీ ప్రీతికై నేను విన్నది విన్నట్లుగా జెప్పెద వినుము.

కైలాస శిఖరము రమ్యమైనది. అనేక ధాతువులచే విచిత్రమైనది. అనేక వృక్షలతలచే వ్యాపించినది. చక్రవాక పక్షులతో బ్రకాశించినది-30. తుమ్మెదల గానములతో నిండినది. జడివానల చప్పుడులతోను, జలధారాపాతములతోను ప్రతిధ్వనిత మైనది, మదించిన క్రౌంచ పక్షులయొక్కయు నెమళ్ళయొక్కయు నాదములతో బ్రతిధ్వనించిన గుహలుగలది-31. అప్సరోగణములతో వ్యాపించినది, కిన్నరులతో ప్రకాశించినది, జీవంజీవకములనెడు వృక్షముల యొక్కయు జాజి వృక్షముల - యొక్కయు తీవలచే ప్రకాశించినది-32. కోకిల ధ్వనులచే మధురమైనది, సిద్ద-చారణులు నివసించినది, గోవులయం బొరవములచే నొప్పనది, క్రిందిగా మేఘగర్జన ధ్వనులు గలది?-33. వినాయకుని భయముచే నుద్విగ్నమైనది. ఏనుగలతో గూడిన గుహలు గలది. వినసొం పైన వీణా వాదిత్ర ధ్వనులతో గూడినది-34. ఊయలలో నూగు జనసమూహముగలది, స్త్రీ సంఘములు నివసించినది, ధ్వజములతో వ్రేలాడిన గంటల నాదములు నిండినది. ముఖములతోను మద్దెలలతోను, వైద్యవిశేషములతోను బలవంతుల చేతులు చజచుటలతోను, ఆటలలో చరించు ధ్వనులతోను నిండిన భవనములు గలది-36. నవ్వులతోను, భయము బుట్టించు వికటములైన ముఖములతోను, విచిత్రములైన దేహగంధములతో పీడింపబడిన గణపతులతోను-37. వజ్రములు స్పటికములు వీనితో నిర్మింపబడిన మెట్ల పైని చిత్రములైన పట్టికలుల శిలల పైభాగములతోను చుట్టబడినది. పులి ముఖములు గల వారితోను, సింహము ముఖములు గలవారితోను, మరి యితరములైన యేనుగు యొక్కయు గుజ్జములయొక్కయు ముఖములు గలవారితోను-38. పిల్లి ముఖము గలవారితోను, క్రూరములైన నక్కల యాకార నిర్మాణముగల వారితోను, పొట్టివారితోను, పొడుగువారితోను బక్కచిక్కిన వారితోను, బలిసిన వారితోను, వ్రేలాడు పొట్టలుగలవారితోను, పెద్ద పొట్టలు గలవారితోను-39 పొట్టి పిక్కలు గలవారితోను, వ్రేలాడు పెదవులు గలవారితోను, తాడిచెట్టు వలన పెద్దవైన పిక్కలుగలవారితోను, అట్లే మటి గోవు చెవులవారితోను, ఒక చెవిగలవారితోను, పెద్ద చెవులు గల వారితోను, చెవులే లేనివారితోను, అనేక పాదములు గలవారితోను, పెద్ద పాదములు గలవారితోను, పాదములే లేనివారితోను. పెక్కు తలలు గలవారీతోను, పెద్ద తలలు గలవారితోను, ఒకే తలగల వారితోను, తలయే లేని వారితోను-41, పెక్కు కన్నులు గలవారితోను, పెద్ద కన్నులుగల వారితోను, ఒకే కన్నుగలవారితోను, కన్నులేలేని వారితోను, ఈ విధముగానున్న మహాయోగి భూతులైన (భూతములైన) వారిచే భూతపతియైన శివుడు చుట్టబడినాడు-42. అపుడు, పరిశుద్ధములైన ముత్యములు, మణులు మణులు వీనిచే నలంకరింపబడి బంగారుమయమైన మనోహరమైన శిలాతలమున సుఖముగా గూర్చొని యున్న మన్మథ శరీరమును దహించిన శివుని గూర్చి గిరిరాజపుత్రియైన పార్వతి పలికెను.

దేవ్యువాచ:-

పార్వతి యనెను:- భూత భవిష్యత్తులకు ప్రభువై, వృషభధ్వజుడవైన, యోభగవంతుడవైన మహాదేవా! నీ కంఠమున కమలముతో సమానమైనదియు-44. అంతగా మసకగానిదియునై, అంతగా స్పష్టము గానిదియు, నల్ల కాటుక సమూహముతో బోలినదియు కాదు ఓ సంహారకా! దేవా! నీ కంఠమున యిది యేమి ప్రకాశించుచున్నది?-45. ఓ యీశ్వర! కంఠమునందు నలుపునకు గారణమేమి? ఇది యంతయు న్యాయానుసారముగ జేప్పుడు. నాకు కుతూహలమెక్కువగానున్నది-46. అంత పార్వతీప్రియుడైన శివుడు ఆ పార్వతి మాటను విని శంకరుడు మంగళముతో కూడిన కథను చెప్పసాగెను-47. పూర్వము దేవదానవులచేత పాల సముద్రము మథింపబడుచుండగా దానిలో మొదట ప్రళయకాలాగ్ని కాంతిగల విషము బయలు వెడలినది-48. దానిని జూచి, సంఘములును, రాక్షసులును విషాదముతో గూడిన ముఖములు గలవారై యందరును శ్రేష్ఠమైన ముఖము గలదానా! బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి. మహాతేజస్వియైన బ్రహ్మ భయపడిన దేవగణములను జూచి, ఓ మహాభాగులారా! మీరెందుకు భయపడి ఉద్వేగముజెందిన చిత్తములు లవారైతిరి?-49,50. నేను మీకు ఎనిమిదింతల యైశ్వర్యమును కల్పించి యిచ్చితిని. ఓ దేవశ్రేష్ఠులారా! మీరే కారణముచేత పోయిన టైశ్వర్యములు గలవారైతిరి! (మీ యైశ్వర్యములు పోయినవి?)-51. మీరు ముల్లోకముల కీశ్వరులు. మీరందరు జ్వరములేనివారు నేను సృజించిన సృష్టిలో నాయాజ్ఞను తిరస్కరించిన వాడులేడు-52. అందరు విమానములలో బోవువారు. అందజును స్వేచ్చగా చరించువారు. ఆధ్యాత్మికమునందును ఆత్మకు సంబంధించిన విషయమునందును) ఆధి భౌతికమునందును (పాంచ భౌతికముగా శరీరమునకు సంబంధించిన విషయమునందును, ఆధి దైవికమునందును దైవ వశమున తటస్థించిన విషయమునందును) మీరు కర్మవిపాకముతో ప్రజలను ప్రవర్తింపజేయుదురు-53. కావున, సింహముతో పీడింపబడిన లేళ్ళవలే మీరెందులకు భయపీడితులగుచున్నారు? మీదుఃఖమేమి? దేనిచేత మీకు సంతాపము గలిగినది? మీకు భయమెక్కడి నుండి వచ్చినది? ఇదియంతయు న్యాయముననుసరించి శీఘ్రముగా జెప్పదగియున్నారు.

తరువాత మహాత్ముడైన బ్రహ్మయొక్క మాటను విని ఋషులతోబాటు దేవతలు దైత్యేంద్రులు, దానవులును పలికిరి-55. మహాత్ములైన దేవదానవులచే పాల సముద్రము మథింపబడుచుండగా కాలసర్పముతోను తుమ్మెదలోను సమానమైనదియు నీలమేఘముతో సమానమైనదియు, ప్రళయకాల సంవర్తాగ్నితో సమానమైన కాంతిలదియునై ఘోరమైనదియు విషము బయలు వెడలినది-56. అది కాలమృత్యువువలే బయలువెడలినది. యుగానకాలసూర్యకాంతి గలది. ముల్లోకముల నశింపజేయు సూర్యుని వంటిది. అంతటను వెలుగుల విరజిమ్ముచున్నది-57. ఆ విధముగా కాలాగ్ని కాంతితో పైకి లేచుచున్న విషముచే తెల్లని శరీరముగల జనార్దనుడైన విష్ణువు దహింపబడి నల్లని వాడయ్యెను-58. ఎఱుపు తెలుపు శరీరము గల యా విష్ణువును నల్లనైనవానిగా జూచి మేము దేవతలమందరము భయపడినవారమై నిన్నే శరణు బొందితిమి-59. అవి ఈ దేవరాక్షసుల మాటనువిని మహాతేజస్వియైన బ్రహ్మ లోకముల హితమును గోరి మారుపలికెను-60. ఓ సమస్త దేవతలారా! ఋషులారా! మునులారా! వినుడు. పాల సముద్రము మథింపబడుచుండగా మొదట బుట్టినది (ప్రళయ) కాలాగ్ని సమమై కాలకూటమని ప్రసిద్ధిజెందినది. అది పుట్టినంత మాత్రముననే దానిచే, విష్ణువు నల్లగా చేయబడినాడు-62. ఆ విషమును విష్ణువు, నేనును, ఆ సమస్త దేవతా శ్రేష్టులును ఒక్క శంకరుడు దక్క తక్కిన యెవ్వరును సహింపలేదు-63. అని చెప్పి పద్మగర్భమువంటి పసిడికాంతిగవాడును, పద్మమున బుట్టి యయోనిజుడైన లోకపితామహుడైన బ్రహ్మ శివుని స్తుతింప మొదలిడెను.

ఓ విరూపాక్షా (మూడు కన్నులు గలవాడా!) నీకు నమస్కారము. అనేక నేత్రములు గల నీకు నమస్కారము. పినాకధనువు చేతియందుగలవానికి నమస్కారము. వజ్రము చేతియందు గల వానికి నమస్కారము-65. ముల్లోకముల యధిపతికి నమస్కారము. భూతముల పతికి నమస్కారము. రాక్షస సంహారకునకు నమస్కారము. తాపసునకు నమస్కారము. ముక్కంటికి నమస్కారము-66. బ్రహ్మవైన నీకు నమస్కారము. రుద్రుడవైన నీకు నమస్కారము. విష్ణువైన నీకు నమస్కారము. సాంఖ్యతత్వరూపునకు నీకు నమస్కారము యోగతత్యరూపునకు నమస్కారము. భూతములకు శిలారూపుడవైన నీకు నమస్కారము-67. మన్మథశరీరమును భస్మముజేసిన వానికి నమస్కారము. (మార్కండేయ రక్షణకై యమునకు గూయముడవైన నీకు నమస్కారము. రుద్రరూపునకు నీకు నమస్కారము. దేవేంద్రరూపునకు నీకు నమస్కారము దేవతల దేవునకు నమస్కారము-68. జటాజూటము గల నీకు నమస్కారము క్రూర స్వరూపునకు నమస్కారము. శంకరునకు నమస్కారము. ఏకరూపుడవైన నీకు నమస్కారము. శివునకు నమస్కారము. వరదునకు నమస్కారము-69. త్రిపురాసురుల త్రిపురములను భస్మము జేసిన నీకు నమస్కారము. అందరికి వందనము జేయదగిన నీకు నమస్కారము. సప్తమాతృదేవతల పతికి నమస్కారము. జ్ఞానస్వరూపునకు నమస్కారము. శుద్ద స్వరూపునకు నమస్కారము. ముక్త స్వరూపునకు నమస్కారము (కేవల) ఏకస్వరూపునకు నమస్కాము-70. కమలము(వంటి) హస్తములుగల నీకు నమస్కారము. దిగంబరునకు నమస్కారము. నెమలి పింఛము (మాయాకిరాతడై) ధరించినవానికి నమస్కారము. వరుణ స్వరూపునకు నీకు నమస్కారము 71. అగ్రునకు (అందరికన్న ముందుండువానికి) నమస్కారము. ఉగ్ర స్వరూపునకు నమస్కారము. విప్ర స్వరూపునకు నమస్కారము. అనేకములైన కండ్లు గలవానికి నమస్కారము. రజోగుణ స్వరూపునకు నమస్కారము. సత్యగుణ స్వరూపునకు తమస్స్వరూపునకు నమస్కారము. జన్మములేనివానికి నమస్కారము-72. (పరమాత్మగా) నిత్యస్వరూపునకు నమస్కారము. (జీవాత్మగా) అని నిత్యస్వరూపునకు నమస్కారము (కావున) నిత్యానిత్య స్వరూపుడవైన నీకు నమస్కారము. (జగముగా) వ్యక్తస్వరూపునకు నీకు నమస్కారము. (జగదతీతముగా) అవ్యక్తస్వరూపునకు నమస్కారము-73. (విశ్వవ్యాప్తుడుగా) చింతింప (ధ్యానింప దగినవానికి నమస్కారము. (విశ్వాతీతుడుగా) ధ్యానమునకు మించినవానికి నమస్కారము. (కావున) చింత్యాచింత్య స్వరూపునకు నమస్కారము. భక్తుల బాధల నశింపజేయువానికి నమస్కారము. నరనారాయణ స్వరూపునకు నమస్కారము 74. ఉమాదేవీ ప్రియునకు నమస్కారము. శర్వునకు ప్రళయమున భూతములనశింపజేయువానికి) నమస్కారము. నంది చక్రములు చిహ్నములుగా గల వానికి (హరిహర స్వరూపునకు) నమస్కారము. పక్షము ఒకటిన్నర మాసము మాసము వీని స్వరూపునకు నమస్కారము. సంవత్సర స్వరూపునకు నమస్కారము-75. బహురూపములు గలవానికి నమస్కారము. బోడితల గలవారికి నమస్కారము. దండముగలవానికి నమస్కారము. కవచము గలవానికి నమస్కారము. కపాలము చేతగలవానికి నమస్కారము. దిగంబర స్వరూపునకు నమస్కారము. నెమలి పింఛము ధరించినవానికి నమస్కారము-76. ధ్వజము గలవానికి నమస్కారము. రథముగలవానికి నమస్కారము. బ్రహ్మచారికి (ఆత్మ బ్రహ్మయందు చరించువానికి) నమస్కారము. ఋగ్వేద స్వరూపునకును యజుర్వేద స్వరూపునకును సామవేద స్వరూపునకును నమస్కారము. (సాంఖ్య పురుష స్వరూపునకు నమస్కారము. (ఈశ్వర సాంఖ్య) ఈశ్వర స్వరూపునకు నమస్కారము. అని యీ మొదలగు నీ చరితములచే ఓ దేవా! నీకు నమస్కారము.

మహేశ్వరుడనెను:- ఓ పార్వతీ! ఈ విధముగా దేవతలచే నమస్కరించి శివుడు స్తుతింపబడెను. బ్రహ్మనగు నా భక్తిని దెలిసి దేవదేవుడైన శివుడు గంగాజలముతో స్నానముచేసి శివము గలవాడును మిక్కిలి యోగాతిశముచే, సూక్ష్ముడును ధ్యానాతీతుడు నయ్యెను శిరమున దడిసిన చంద్రుడు గూడ గనబడుట లేదు-79. ఈ రీతిగా పూర్వము భగవంతుడై లోక కర్త యైన బ్రహ్మచే వేదముల నుండియు వేదాంగములైన శిక్షాదుల నుండియు బుట్టిన వివిధ స్తోత్రములచే స్తుంతింపబడిన నేను-80. ఆ మహాత్ముడైన బ్రహ్మను గూర్చి సంతసించిన వాడనైతిని తరువాత నేను చిన్న మాటతో బ్రహ్మతో నిట్లంటినీ 81. ఓ భగవంతుడా! భూతభవిష్యత్కాలములకు ప్రభువైనవాడా! లోకనాథ! జగత్పతే! బ్రహ్మా! నీ కొరకు నేనేమి జేయవలెను ఓ సువ్రతుడా! చెప్పుము-82. ఈ మాటవిని కమలముల వంటి కన్నులు గల బ్రహ్మ మారు పలికెను. భూత భవిష్యవర్తమాన కాలముల కధిపతియై జత్కారణుడవైన యీశ్వరా! వినుము-83. అంబుజేక్షణుడవైన యో భగవంతుడా! దేవదానవులచే సముద్రము మథింపబడుచుండగా మేఘము వంటిదియు, నల్లనిమేఘము వంటిదియు-84. ప్రళయాగ్ని వంటిదియు నైన భయంకరమైన విషము ఉద్భవించినది. అది అకాల మృత్యువు వలె బుట్టినది. యుగాన సూర్యునివలె ప్రకాశించునది-85. ముల్లోకముల నశింపజేయు సూర్యుని వలే వెలుగుచున్నది. అన్ని వైపులా బ్రకాశించునది దాని కొసలో కాలాన్ని కాంతిల విషము బయలువెడలినది-86. దానిని చూచి మేము భయపడి యాశ్చర్యము జెందితిమి. కావున ఓ మహాదేవ! లోకహితమును గోరి యీ విషమును ద్రాగుము. నీవే యా మొదటి సముద్ర ఫలమును భుజించువాడవు. నీవే దానికి శ్రేష్ఠమైన సమర్థుడవు 87. ఓ మహాదేవా! నీవు దక్క యా విషమును సహించువాడు లేడు. ముల్లోకములలో దీనికి సమర్థుడైన పురుషుడెవ్వడును లేడు అని చెప్పబడుచున్నది.

 పమేష్ఠియైన బ్రహ్మయొక్కయు మాటను విని, ఓ శ్రేష్ఠమైన ముఖముగలదానా పార్వతీ! సరియ యని యా బ్రహ్మవాక్యమును స్వీకరించెను-89. తరువాత యమునితో సమానమైన విషమును ద్రాగుటకు ప్రారంభించితిని. దేవభయంకరమైన యా ఘోర విషము ద్రోగుచున్న నా కంఠము ఓ యుత్తమురాలా! వెంటనే నల్లనైనది-90. కలువరేకువలె నున్నదియు, కంఠమున నంటియున్న సర్పమువలె నున్నదియు, నాగరాజైన తక్షకుని నాకుచున్నట్లున్న యా విషమును జూచి లోక పితామహుడైన బ్రహ్మ యిట్లనెను. ఓ సువ్రతుడవైన మహాదేవా! ఈ కంఠముతో శోభించుచున్నావు-91,92. బ్రహ్మ మాటను విని ఓ హిమాలయపుత్రీ! నేనంటిని ఓ వరాననా! యక్షులు, గంధర్వులు, భూతములు, పిశాచులు, ఉరగులు, రాక్షసులు, వీరందరు చూచుచుండగా భయంకరమైన యా విషమును నేను కంఠములో ధరించితిని-93, 94. కావున, ఓ పర్వతరాజపుత్రి! ఉగ్రతేజమైన కాలకూట విషమును కంఠములో బ్రవేశపెట్టుచుంగా (ద్రాగుచుండగా) జూచి దేవదానవ సంఘము మిక్కిలి యాశ్చర్యము జెందెను.

ఓ మదించిన యేనుగ నడకల వంటి నడకలు గల పార్వతీ! తరువాత దేవగణములందరు, దైత్యులు ఉరగులు, రాక్షసులును చేతులు జోడించినవారై యనిరి-96. గంగాజలముచే గొట్టబడి విడివడిన తల వెంట్రుకలు గల యో దేవదేవా! నీ యొక్క బలము వీర్యము పరాక్రమమును ఆశ్చర్యకరములైనవి. మణి నీయోగబలము గూడ నాశ్చర్యకరమైనది-97. నీవే విష్ణువు నీవే బ్రహ్మవు, నీవే మృత్యువు. నీవే వరదుడవు. నీవే సూర్యుడవు. నీవే చంద్రుడవు. నీవే భూమివి. నీవే జలము. నీవే యజ్ఞము. నీవే నియమము. నీవే భూతకాలము భవిష్యత్కాలమును నీవే యన్నిటికీని ఆదివి (మొదలు) నీవే మరణము. నీవే స్టూలుడవు. నీవే సూక్ష్ముడవు. నీవే యగ్నివి. నీవే వాయువు. నీవే చరాచరమైన లోకమునకు కర్తవు. ప్రళయమున రక్షించువాడవు- 100. అని యీ విధముగా జెప్పి దేవేంద్రులు అందరును ఉమాసహితుడైన శివుని శిరస్సుతో నమస్కరించి, అడ్డరాని వేగములతో మేరువును జేరి వెళ్ళిరి.

అను నిది పరమ రహస్యము పుణ్యములన్నింటికన్న మహాపుణ్యము. నీలకంఠయను విషయమున జెప్పినది ప్రఖ్యాతమై లోక ప్రసిద్ధమైనది-102. స్వయముగా బ్రహ్మచే జెప్పబడినదియు, పుణ్యమై పాపములనశింపజేయునది నైన బ్రహ్మనుండి బుట్టిన కథను విని జ్ఞప్తియందుంచుకొన్నవానికి లభించు మహాఫలమును గూర్చి విపులముగా జెప్పెదను-103. ఓ చక్కని పిరుదులు గల పార్వతీ! ఈ కథను విని ధారణచేసిన వాని శరీరమును స్థావరమైనదిగా జంగమమైనదిగానియైన విషము చేరిన వెంటనే ప్రభావము జూపక నశించిపోవును-104. భయంకరమైన యశుభము శాంతించును. చెడు స్వప్నములను బోగొట్టును. స్త్రీలకును, సభలో రాజునకును ప్రేమ పాత్రుడగును-105. వివాదములో జయమును బొందును. యుద్దమున శౌర్యమునందును దారిలో బోవువాడు క్షేమమును ఇంటనున్నవాడు నిత్యసంపదలను బొందును-106. ఓ శ్రేష్ఠముఖముగల జన్మాంతరమున గూనాతని ప్రాప్తిని జెప్పెదను. వాడు నీలకంఠుడు పచ్చని మీసములు గలవాడును. చంద్రుడలంకరించిన శరీరము గలవాడును-107. ముక్కంటియు, త్రిశూలము చేతలవాడును, ఎద్దు వాహనము గలవాడును పినాక ధనువు చేతబూనినవాడును, నందీతో సమబలుడు, శ్రీమంతుడును, నందితో సమానమైన పరాక్రమము గలవాడును నై-108, తొందరలోనే (అల్పకాలములోనే) నా యాజ్ఞచే సమస్త లోకములను చరించును. ఆకాశమున వాయునకువలె యాతని గమనమునకు అడ్డుండదు. నాతో సమబలుడై భూతప్రళయము వరకుండును-109. ఈ కథను విన్న నామానసభక్తుల యీ లోకములోని గతిని, పరలోకములోని గతిని ఓ పార్వతీ చెప్పెదను-110. బ్రాహ్మణుడు వేదమును బొందును. క్షత్రియుడు భూమిని జయించును. వైశ్యుడు (తనవ్యాపారమున) లాభమును బొందును. శూద్రుడు సుఖమును బొందును-111. వ్యాధితో బాధింపబడినవాడా వ్యాధినుండి ముక్తుడగును. కారాగారబద్ధుడు బంధనము నుండి విముక్తుడగును. గర్భవతి పుత్రుని బొందును. కన్య మంచి భర్తను బొందును. ఇహపరలోకముల రెండింటను నష్టపోయిన సమస్తమును బొందును-112. లక్ష గోవులను చక్కగా దానముచేసిన వాని ఫలము ఈ ప్రభువైన నీలకంఠుని దివ్య కథను విన్నవానికి లభించును-113. పావు భాగముగాని, సగభాగమునుగాని ఒక శ్లోకమునుగాని, శ్లోకసగభాగమునుగాని నిత్యము(పఠించి) ధరించువాడు రుద్రలోకమును జేరును-114. చంద్రశేఖరుడైన కుమారస్వామికి ప్రియుడైన ప్రభువైన శివుడు పుణ్యఫలములు మొదలగునవి గల యీ కథను దేవియైన పార్వతికి జెప్పి, పార్వతీదేవితో బాటు తన వాహనమైన వృషభము పై కిష్కింధగుహకు వెళ్ళెను-115. నా చేత దాటబడిన పాపహారమైన మహాపదమును(గొప్పస్థానమును) జెప్పి వారికి వాయువాస్థానము నిచ్చెను. తరువాత బ్రాహ్మణోత్తముడైన సూతుడు అఖిలసులక్షణములు గల సమస్తము అధ్యనముతో బొంది సూర్య మార్గమును జేరెను. 

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున నీలకంఠస్తవమను ఏబది నాలుగవ యధ్యాయము.