వాయు మహా పురాణము

Table of Contents

47 -  భువనవిన్యాసో

సూతుడనెను:- హిమవత్పర్వతము యొక్క యెడమ ప్రక్కన కైలాసమను పర్వతము గలదు. దానియందు శ్రీమంతుడైన కుబేరుడు రాక్షసులతో బాటు నివసించును. అప్సరోగణముతో గూడి యలకాధిపుడైన కుబేరు డానందించు చుండును. కైలాసము యొక్క పాదము (ప్రత్యంత పర్వతముల) నుండి బుట్టిన మందమను నొక కలువలతో నిండి పుణ్యమై శీతజలము గల శుభమైన సరస్సు గలదు. అది శరత్కాల మేఘము వలె తెల్లనైనది. దానినుండి బుట్టి  ప్రవహించినది శుభమైన మందాకినీ నది. దాని తీరమున దేవసంబంధమైన నందనమనుగొప్ప వనము గలదు.

కైలాసమునకు తూర్పు దక్షిణములుగా (ఆగ్నేయముగా) దివ్య ప్రాణులు ఓషధులును గలిగి దివ్యధాతువులతో నిండిన చిత్రమై చక్కని వెన్నెలగల (బంగారు) పర్వతమును గూర్చి వినుడు. అది చంద్రప్రభమను పర్వతము. శుద్ధమైనది రత్నము వలె నున్నది. దాని పాదమున గొప్పనై దివ్యమైన యచ్చోదమను సరస్సు గలదు. దాని నుండి దివ్యమైన యచ్చోదయను'నది' బుట్టును. దాని యొడ్డున దివ్యమై పెద్దదైన చైత్రరథమను నుద్యానవనము గలదు. ఆ చంద్రప్రభ గిరియందు మణిభద్రుడను కుబేరుని సేనాపతి క్రూరులైన యక్షులతో జుట్టబడియుండును. పవిత్రములైన మందాకినీ అచ్ఛోదా నదులు భూమండలమధ్యగా బ్రవహించుచు మహాసముద్రమున గలియును.

కైలాసమునకు దక్షిణ పూర్వముగా (ఆగ్నేయముగా) శుభములైన సత్యములు ఓషధులుగలదియు, మిక్కిలి గొప్పనైనదియు, మనఃశిలతో (ఎఱ్ఱని శిలతో) నిండి దివ్యమై పిశంగమను పర్వతమును గూర్చి (వినుడు). ఆది ఎఱ్ఱనిదై బంగారు శిఖరములు గల్గి సూర్యకాంతిగల గొప్ప పర్వతము. దాని పాదమున దివ్యమై గొప్పదైన లోహితమను సరస్సుగలదు  దాని నుండి ఎఱ్ఱని గొప్పనైన సదనము (నదము) బుట్టును. దాని తీరమున దేవారణ్యమను నొక దుఃఖములేని మహావనము గలదు. ఆ వనమున మణివరుడను యక్షుడు వశీకృతాత్ముడు సౌమ్యులును చక్కని ధార్మికులును నైన యక్షుల పరివారముతో నివసించును.

కైలాసమునకు దక్షిణపు ప్రక్కన క్రూర ప్రాణులు ఓషధులును గలదియు, వృత్రాసురుని శరీరము నుండి బుట్టినదియు మూడు శిఖరములు గల అంజన పర్వతమును (నల్లని త్రికూట పర్వతమును) గూర్చి వినుడు. అచట సర్వధాతువులతో నిండిన గొప్ప వైద్యుతమను పర్వతము గలదు. దాని పాదమున ఆ కొండ దిగువనున్న తిప్పలలో పవిత్రమైన సిద్దులచే సేవితమైన మానసమను సరస్సు కలదు. దాని నుండి లోక భావినియగు పుణ్యమైన సరయూనది గలదు. ప్రహేత తనయుడైన కుబేర సేవకుడై ఇంద్రియములను తన వశమునందుంచుకొని గ్రహవంతుడై యనంత పరాక్రమవంతుడైన బ్రహ్మపాతుడను రాక్షసుడట నుండును. వాడు ఆకాశమున చరించువాడును భయంకరులైన వందల రాక్షసులతో గూడియుండును.

కైలాసమునకు పశ్చిమమున ముఖ్య ప్రాణులు ఓషధులు గలదియు, బంగారు ధాతువుతో నిండినదియు, పర్వత శ్రేష్ఠమైన అరుణ గిరిని గూర్చి వినుడు. శ్రీమంతమై మేఘమువలె నున్న పర్వతము శివువైకు ప్రియమైనది. బంగారు నిండిన మంగళములైన శిలాజాలములతో జుట్టబడినది. దాని నూర్ల శిఖరములు బంగారముతో గూడినవై ఆకాశమును రాయుచున్నట్లుండును. అది మంచుతో జుట్టబడి గొప్ప దివ్యమై పోరాని (ఎక్కరాని) ముంజవంతమను శైలము. ఆ పర్వతమున దుమ్ముబారిన యెఱ్ఱని వర్ణముగల గిరీశుడు (శివుడు) నివసించును. దాని పాదము నుండి శైలోదమను సరస్సు బుట్టును. దాని నుండియే శైలో దయను దివ్యమైన నది బుట్టును. అది చక్షుఃశతముల మధ్యగా లవణ (ఉప్పు) సముద్రమును బ్రవేశించును. దాని తీరమున సురభి యను ప్రసిద్ధమైన దీవ్యవనము గలదు.

కైలాసము నకుత్తరముగా శివ బలమును ఓషధులును గల గిరి కలదు. అచట గౌరమను గిరి గలదు. అది పసుపు పచ్చని వన్నెగల హరిత దళమను ఖనిజముతో నిండినది. శుభమైనది. బంగారు శిఖరము గలది. గొప్ప దివ్యమైన మణిమయమైన పర్వతము, దానీ పాదమున గొప్పదియు దివ్యమైనదియు, శుభమైనదియు బంగారుఇసుక గలదియు, సుందరమైనదియునైన బిందు సరస్సను సరస్సు గలదు. అచటికే భగీరథుడు వెళ్ళెను. రాజర్షియైన భగీరథుడు గంగ నిమిత్తమై యచట పెక్కేండ్లుండెను. గంగాజలమున దడిసి పవిత్రులై నా పూర్వ పితరులు (ముత్తాతలు 1000గురు) స్వర్గమునకు బోగలరు. (అని యనుకొని) యచట (త్రిపధగాదేవి) (గంగాదేవి) ప్రతిష్టింపబడెను. చంద్ర కిరణముల నుండి బుట్టిన యా గంగ యేడు భాగములైనదని చెప్పబడును. అచట మణిమయములైన యజ్ఞయూపస్తంభములును, బంగారు చితులును (పొదలును) గలవు. ఇంద్రుడు సమస్త దేవతలతో గూడి యచట యజ్ఞముతో శివుని బూజించి కాంతిమారుడై నక్షత్ర మండలము వెంట నాకాశమున వెళ్ళేను. దేవియైన (త్రిపథగ గంగ) రాత్రిలో తెల్లగా బ్రకాశించును. ఆ గంగ నక్షత్రమండలములు ఆకాశమును (స్వర్గమును) భావించుచున్నదై భూమిని జేరునదై శివునియొక్క శిరమున బడినదై యోగమాయచే శిరమున బంధింపబడినది. కోపించిన యా గంగ యొక్క కొన్ని బిందువులు భూమి పై బడి యచట సరస్సు ఏర్పడినది. దానిని బిందు సరస్పందురు. చిరునవ్వు నవ్వుచు శిరమున బంధించబడిన యా గంగ తనమున శంకరుని బడద్రోయుటకై యాలోచించుచుండెను. ఈ శంకరునీ నా ప్రవాహముచే కబళించి ఛేదించి పాతాళమున బ్రవేశింతుననుకొనెను. గంగాదేవియొక్క యాక్రూర చేష్టితములను దెలిసికొని, యా. నదిని శివుడు గంగ యొక్క మదమును దెలిసి కోపించి తన యంగములలోనే వెనుతిరుగ జేయదలిచి, వేగముగా భూమి పైబడబోయిన గంగను తన శిరముననే బంధించెను. ఈ సమయముననే తన యెదురాజైన భరతుని జూచెను. అతని శరీరము కేవలము (మాంసములేక) నాధమనుల (నాడుల)తో మాత్రము వ్యాపించి క్షీణమై ఇంద్రియములు గూడ పనిచేయని స్థితిలో నుండెను. అది చూచి "ఈతడు పూర్వమే గంగానది విషయమై నన్ను సంతసింపజేసెను. అని స్మరించి యాతనికిచ్చిన వరదానమును గూడ స్మరించి శివుడు తనకోపమును నిగ్రహించెను. ప్రతిజ్ఞా నిర్వహణమును గూర్చి బ్రహ్మయొక్క మాట గూడ విని, తన తేజస్సుతో కట్టివేయబడిన గంగానదిని భగీరథుని యుగ్రతపముచే సంతుష్టుడై యా భగీరధుని కొరకై వదిలి పెట్టెను. ఆ విధముగా వదిలి పెట్టబడుచున్న గంగానది యొక్క ప్రవాహము ఏడు విభాగములను బొందెను. అందులో మూడు తూర్పువైపునకును, మూడు పశ్చిమ వైపునకు బోయినవి. గంగానదీ ప్రవాహము ఏడు భాగములనందెను. నలినీ, హ్రదినీ, పావనీ అనునీ మూడు తూర్పునకు బోయిన భాగములు. సీతా, చక్షువు, సింధువు అను నీ మూడు పశ్చిమ దిక్కునకు బోయినవి. వానిలోనేడవది దక్షిణముగా ననుసరించినదై భగీరథియైనది. అందువలన భాగీరథి యనునది లవణ సముద్రమును బ్రవేశించెను. ఈ యేడును నీ లోకమున హిమమను దేశమును భావించును (ప్రవహించును).

 బిందు సరస్సున బుట్టి శుభములైన యా యేడు నదులు స్రవించుచు మ్లేచ్చ ప్రాయములైన నా నాదేశముల బారుచు, ఇంద్రుడు వర్షించు దేశముల చేరును. సిరింధ్రములు, కుంతలములు, చీనాదేశములు, బర్బరములు, యవనులు, ద్రుహములు, రుషాణములు, కుణిందములు, అంగలోకవరములు ఈ దేశములలో ప్రవహించుచు సీతానది సింధు మరుభూమిని రెండుగాజేసి పశ్చిమసముద్రమును జేరును. ఆ తరువాత చీనమరుదేశములు, నంగణములు, సర్వమూలకములు ఆంధ్రములతో బాటు తుషారములు, తంపాకములు, పహావములు, దరదములు, శకములు ఈ దేశములలో బ్రవహించుచు 'చక్షు' నది సముద్రమును జేరును. కాశ్మీరములతోబాటు దరదములు, గాంధారములు, వరపములు, ప్రదములు, శివపౌరములు, ఇంద్రహాసములు, వదాతులు, విసర్జయములు, సైంధవములు, రంధ్రకరములు, భ్రమరములు, ఆభీరములు, రోహకములు, శునాముఖములు సిద్దచారణ సేవితములైన ఊర్థ్వ మనువులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, విద్యాధరులు, ఉరగులు కలాపగ్రామకులు పారదులు, సీగణులు, ఖసులు, కిరాతులు, పులిందులు, భరతులతోడి కురులు, పంచాలులు, కాశీయులు, మాత్యులు మగధులు అంగులు, బ్రహ్మోత్తరులు, వంగులు తామ(మ)లిప్తులు ఈ జనపదములను గంగ శుభములుగా భావించును. (పవిత్రము జేయును). ఆ తరువాత వింధ్యచే నడ్డగింపబడి దక్షిణసముద్రమున బ్రవేశించును. తరువాత 'హ్లాదిని' పవిత్రమై తూర్పుముఖమై వెళ్లాను. నిషాద జాతులుండుదేశములు ధీరులు, ఋషికులు నీలముఖులు, కేరళులు, ఉష్టకులు (ఒంటి చెవులు గలవారు) కిరాతులు, కాలోదరులు, వీవర్లులు, స్వర్ణభూషితులగు కుమారులు. వీరుండు దేశములలో గంగ సముద్రము యొక్క మండలమున తూర్పు ముఖముగ మరలినదై బ్రవహించినది. తరువాత “పావని” తూర్పు దిక్కునకే ప్రవహించినదై, అపథములను ఇంద్రద్యుమ్న సరస్సును అట్లే ఖరపదములను (గాడిదల మార్గములు గలవి), ఇంద్ర శంకు పథములను, బ్రవహించుచున్నదై మధ్యగా లేచి నమస్కారము లేనివారై బొంతల గప్పుకొను వారిని (దేశమును) జేరెను. ఇంద్రద్వీపసముద్రమున లవణసముద్రమును ప్రవేశించేను.

తరువాత 'నలిని' వేగముగా తూర్పు దిక్కునకు వెళ్ళెను (ప్రవహించేను) ఇచట నది హంసమార్గములై (భూమార్గములేని) హూహుకములతోడి తోమరదేశములో బ్రవహించినది. అది తూర్పు దేశములను సేవించుచు పర్వతములను బహువిధముల బ్రద్దలుగొట్టి కర్ణప్రావరణములను అశ్వముఖములను బొంది ఇసుక పర్వతపు మరుప్రదేశములను జేరి, విద్యాధరము (దేశము)లకు వెళ్ళేను (పొందెను) నేమీ మండలకోష్టమున (అథ చక్రపుటంచుతోనేర్పడిన) మండల ప్రదేశమున నది మహాసముద్రమున గలిసెను.

ఆ పెద్దనదుల యొక్క నదులును ఉపనదులును నూర్లకొలదియు వేల కొలదియు నున్నవి. అవి యన్నియు ఇంద్రుడు వర్షించిన వైపునకు వచ్చి చేరును. వస్వోకసానదీ తీరమున నీటి పరిమళముతో ప్రసిద్దిజెందిన హరీశృంగమున విద్వాంసుడైన కుబేరుడు వశియే ఇంద్రియనిగ్రహము గలవాడై నివసించును. ఆ మహాత్ముడు యజ్ఞములతో గూడినవాడు, అమిత తేజస్వి, మంచి పరాక్రమము గలవాడు. అచట కుబేరుడు అగస్త్యు చేతను విద్వాంసులచేతను బ్రహ్మరాక్షసులచేతను చుట్టబడియుండును. ఈ నలుగురు కుబేరుని సేవకులై కుబేరునితో సమానులుగా తలంపబడినవారు.

 ఈ విధముగనే పర్వతదాసులయొక్క పరస్పరముగా ధర్మముతోను కామముతోను అర్థముతోను రెండింతలైనదిగా తెలియవలెను.

హేమకూటముయొక్క వెనుక భాగమున సాయనమను సరస్సు గలదు. దాని నుండి మనస్విని జ్యోతిష్మతియు (నదులు) బుట్టును. నిషధమను పర్వతోత్తమమున తూర్పుపడమరల సముద్రములను ఇరువైపుల బ్రవేశించిన విష్ణుపదమును సరస్సు గలదు. దాని నుండి గాంధర్వ నన్వలి యను నదులు బుట్టినవి. మేరువు వెనుక భాగమున చంద్రప్రభమనునొక గొప్ప సరస్సు బుట్టినది-65. అచట శుభమైన బంగారము గలిగి పుణ్యమైన జంబూనది కలదు. నీలపర్వతమున తెల్లకమలమువలె శుభ్రమైన పయోదమను సరస్సు గలదు. దాని నుండి పుండరీక పయోద అను రెండు నదులు బయలు వెడలినవి. శ్వేతపర్వతము నుండి పుణ్యమైన ఉత్తరమానస సరస్సు పుట్టినది. జ్యోత్స్న మృగకాంత యను రెండు నదులు దాని నుండి బుట్టినవి. మధుమత్ అను పుణ్యమైన సరస్సు గూడ కలదు. అది భవునిచే నిర్మింపబడినది. కల్పవృక్షములతో నిండినది తేనెలు గలది. అంతట సుఖము గలది రుద్రకాంతమని ప్రసిద్ది జెందినది. ఇచట ఇతరమైనవి గూడ ప్రసిద్ధములైనవి (సరస్సులు) కలవు. అవి పద్మములతోను మీనములతోను పక్షులతోను నిండినవి. పేరున రుద్రములు జయములు, ఇవి పండ్రెండు. సముద్రములవంటివి. వాని నుండి శాస్త్ర మాధ్వీ యను రెండు నదులు బుట్టినవి. ఇచట భూమిని భేదించుకొని వచ్చిన (బుగ్గ) జలములు నదులై ప్రవహించు వాని జలములు కింపురుషులచే త్రాగదగినవి. ఋషభము అను భేరియాకారములో పొగనీండియున్న గొప్ప పర్వతము గలదు. తూర్పు నుండి వచ్చిన సంపన్నములైన నదులు ఉప్పు సముద్రములో గలియును. చంద్రకంకము ప్రాణము, మహాన్, అగ్ని, శిలోచ్చయము అను ఈ పర్వతములు ఉత్తరమువైపు బోయినవై యుత్తరము వైపున పొడవై దక్షిణ సముద్రమున బ్రవేశించినని. చంద్ర మైనాక పర్వతముల మధ్యన ఏ దిక్కైన ఆగ్నేయ దీక్కన, సంవర్తకుడను అగ్ని కలడు. ఆతడాజలమును ద్రావును. ఆతని పేరు సముద్రమును ద్రావు శ్రీమంతుడైన ఆడగుజ్జపు ముఖమాకారముగల ఔర్వుడు, మహేంద్రుడు తమ రెక్కలను ఛేదించునను భయముచేత అప్పుడీ (పైజెప్పిన) పండ్రెండు పర్వతములు లవణసముద్రమున బ్రవేశించినవి కదా. ఇదియే తెల్లని చంద్రునిలో గనబడు నల్ల కుందేలు ఆకారము, భారతదేశము యొక్క భేదములు తొమ్మిదియని చెప్పబడినవి. ఇక్కడ చెప్పబడిన భారతదేశమునకు ఇతర పురాణాదులలో జెప్పబడిన కొన్ని బేధములు కనబడుచున్నవి. ఆరోగ్య ఆయుః ప్రమాణములచేత ధార్మికముగను కామికముగను ఆర్థికముగను గుణములచే వీనికి వర్ష (దేశ) పదముద్దేశింపబడినది. భాగములుగా ఈ గుణములతో గూడిన ప్రాణులు గలవు. అవి నానాజాతులు ఆయాజాతులు ఆయా వర్ష (దేశములలో నివసించినవి.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబదియేడవ యధ్యాయము.