వాయు మహా పురాణము
14 - పాశుపతయోగో
ఈ విధముగా జ్ఞానము నుండి వచ్చినవాడు రాగము వలన కర్మ నాచరింపరాదు. రాజస మైనదిగాని తామస మైనదిగాని యైన కర్మను చేసి అనుభవించిన మానవుడు దానిలోనే తగుల్కొనును-1. అట్లే పుణ్యకర్మను జేసినవాడు స్వర్గములో దాని ఫలమును బొందును. ఆ స్థానము నుండి (పుణ్యము క్షీణింపగా) మరల భ్రష్టుడై మానవ లోకమును బొందును-2. కావున బ్రహ్మ పరము సూక్ష్మము. బ్రహ్మ శాశ్వతము అని చెప్పబడును. కావున బ్రహ్మనే సేవింపవలె. బ్రహ్మయే పరమమైన సుఖము-3. యజ్ఞములలో పరిశ్రమ గొప్ప (స్వర్ణ) ప్రయోజనముతో జరుగును. కాని వాడు క్షణయజ్ఞఫలుడై మరల మర్త్యలోకమునకు వచ్చి మృత్యువశుడగును. కావున మోక్షము పరమసుఖము-4.
అట్లుగానిచో ధ్యాన సంయుక్తుడు బ్రహ్మయజ్ఞ పరాయణుడు. (జ్ఞానయజ్ఞ పరాయణుడు). వాడు మన్వంతర శతములచేత గూడ వ్యాపించుటకు సాధ్యపడడు-5. విశ్వరూపుడు విశ్వమే పాదములు శిరము, కంఠములైనవాడు, విశ్వేశుడు, సమస్త భావనలుగలవాడు, సమస్త గంథములు గలవాడు సమస్తమాలలచే నలంక రింప బడినవాడు. విశ్వమను వస్త్రమును (సమస్త వస్త్రములను) ధరించువాడు ప్రభువు ఐయిన,విశ్వుడను దివ్య పురుషుని చూచి-6.
భూమి తన గోవుల (కిరణముల) చేత, రెక్కలు గలవానిని, మహాత్ముని, పరమమతిని, వరింపదగి వానిని, కవిని (బ్రహ్మరూపిని) పురాణుని (ప్రాచీనుని), అనుశాసించువానిని, సూక్ష్మమునకన్న సూక్ష్మరూపిని, మహత్తుకన్న మహత్తైన వానిని, బంధించి వేయును. అతడు నిరింద్రియుడు, బంగారు వన్నెగల తేజోమయపురుషుడు, నిర్గుణుడు చేతనుడు. ఈతనిని యోగులు యోగముతోనే చూతురుగా నేత్రములతో జూడలేరు-7. ఎల్లప్పుడు సర్వగతుడై శుచియైన వాడు అచలుడై ప్రకాశ స్వరూపుడైన యాతనని యోగము చేతనే నిత్యము జూతురు-8. అతడు తత్తుగా పరమాత్మగా భావింపబడినవాడు, తేజస్సుతో వెలుగుచున్నవాడు, చేతులు, కాళ్ళు కడుపు, ప్రక్కలు, నాలుక లేనివాడు, ఇంద్రియముల కతీతుడు. ఇప్పటికి గూడసుసూక్ష్మడైన ఒక్కడు. అతడే నేత్రములు లేకయే జూచువాడు. చెవులు లేకయే వినువాడు-9. ఈతనికి బుద్ధిలేదు. కాని యాతనికి తెలియనిది లేదు. అతడు వేదములకు గూడ దెలియని వాడు. కాని తాను సర్వము తెలిసినవాడు. అతని మొట్టమొదటివానిగా పురుషునిగా మహత్స్వరూపునిగా సచేతనునిగా, సర్వగతునిగా, సుసూక్ష్మునిగా జెప్పుదురు-10.
సమస్త మునులు ఆమెను లోకమున ప్రసవ ధర్మిణిగా (లోకమును బుట్టించుదానినిగా) జెప్పుదురు. యోగయుక్తులు తమ చిత్తముతో ఆమెను సర్వ భూతములకు ప్రకృతిగా జూతురు-11. అంతట కాలుసేతు చాచియందు కొనునది. అంతట జూడగల కన్నులు శిరస్సు ముఖములు గలది. అంతట వినగల చెవులు గలదియునై యాప్రకృతి సర్వముగా నావరించి యుండును-12. యోగముచే యుక్తులై యోగులు, ఈశానుడు, అన్ని విధముల సనాతనుడు, సర్వభూతములలో పురుషుడైన వానిని జూతురు. కావున ధ్యానయోగి మోహమును జెందడు-13. భూతాత్ముడు, మహాత్ముడు పరమాత్ముడు, అవ్యయుడు, సర్వాత్ముడు ఐన ఆ పరబ్రహ్మను ధాన్యనముజేసి మోహము జెందడు-14.
వాయువు సర్వ మూర్తులయందు చరించుచు గ్రహింప దగినదైనట్లే పురమును అట్లే ఆకాశమునను శయనించును గావున పురుషుడనబడుచున్నాడు. ఒకవేళ సవిశేషములైన కర్మలచే లోపించిన ధర్మము గలవాడై నందున పురుషుడనబడి నట్లైతే-15, అప్పుడు స్త్రీ పురుషుల ప్రయోగము చేత శుక్ర శోణిత సంయుత మైన బ్రహ్మ స్త్రీ యోని యందు మరల మరల బుట్టును. సూక్ష్మ రూపమున జన్మనొందును-16. అపుడు గర్భకాలమున (గర్భముగా నేర్పడు కాలమున) కలనమనునది (శుక్రశోణితములు గలియుటయన్నది) జనించును. కాలక్రమమున 'ఆ కలనము బుద్బుదము (బుడగ) యగును-17. కుమ్మరి సారె (చక్రము) మీద నున్న మట్టి ముద్ద తిరుగుచున్న చక్రవాయువు (సుడిగాలి)చే పీడింపబడినదై (కుమ్మరి) హస్తములచే చేయబడుచున్నదై విశ్వరూపమును (కుండమొ రూపమును) దాల్చును-18. ఈ విధముగనే ఆత్మ ఎముకతోగూడినదై వాయువుతో పైకి ప్రేరేపింపబడినదై మానుషాకారము గలవాడగును. అచట రూపము గలిగినట్లే మనస్సు కలుగును-19. వానిలో వాయువు బుట్టును. వాయువునుండి జలము, జలము నుండి ప్రాణము బుట్టును. ప్రాణము నుండి శుక్రము వృద్ధిజెందును-20. రక్తభాగములు (శోణితముల యొక్క భాగములు) ముప్పదిమూడు. శుక్రభాగములు పదునాలుగు (మొత్తము 46 భాగములు). ప్రతి భాగము నుండి సగము ఫలము అనగా రెండు కరములు లేదా ముప్పదిరెండు మాషముల పరిమాణము గల భాగమును దీసికొని గర్భమున ప్రవేశించును. (గర్భముగానగును)-21. తరువాత గర్బముతో గూడిన యాకారము ఐదు ప్రాణ అపాన-సమాన-వ్యాన-ఉదాన) వాయువులతో జుట్టబడును. ఈ గర్భమునకు తండ్రి శరీరము నుండి ప్రతియవయవ రూపము గలుగును-22. తరువాత తల్లి యొక్క తల్లి యాహారము నుండి త్రాగుట ద్వారా నాకుట ద్వారా వైశించినది బొడ్డు తాడులో బ్రవహించి గర్భములో బ్రవేశించుటచే అది దేహులకు (గర్భస్థ ప్రాణులకు) ప్రాణాధారమగును-23.
మావితో చుట్టబడిన శిరమును ధరించినవాడై, సర్వావయవములచే జుట్టబడినవాడై తొమ్మిది మాసములు చుట్టుగా కష్టములనుభవించినవాడై తొమ్మిది మాసములు గర్భమందుండి యోని రంధ్రము నుండి యధోముఖుడై పర్యాయ క్రమమును దప్పి యావలకు వచ్చును-24.
ఆ తరువాత పాప కర్మలచేత నరకము బొందును. అసిపత్ర వనమను నరకము, బూరుగు చెట్టుల గొట్టుట పగలగొట్టుట యొక్క భయము-25. రక్త భోజనము, ఈ భయంకరమైన తీవ్రబాధలను కుంభీపాకముచే సహింపనలవిగానివై యుండును 26. నీరు వేరు చేయబడిన రూపమును బొందినట్లు యాతనాస్థానమునకు వచ్చినవాడు ఛిన్నుడు భిన్నుడునగును-27. ఈ విధముగా జీవుడు తాను చేసిన ఆ పాపములచేత పరితపింపబడినవాడగును. జీవుడు తన కర్మలచేతనే దుఃఖమును గాని సుఖమునుగాని పొందును-28. అన్ని విధముల మృత్యు ప్రవేశము తానొక్కడే చేయును. తోడెవ్వడునూ రాడు.' చేసిన కర్మఫలము నొక్కడే యనుభవింపవలెను. తోడెవ్వడురాడు. కావున పుణ్యమునే యాచరించవలె-29. ప్రాణావసానమున శరీరమును వదలి బయలుదేరి పోవుచున్నవాని వెంటనెవ్వరును రారు. వాడు చేసిన కర్మయే వెంబడివచ్చును-30.
వారు నిత్యము యమలోకములో వేర్వేరు దేహములు గలవారై యేడ్చుచుందురు. వారికి అనిష్టమైన ప్రయోగముల చేత నిండిపోవు చుందురు. అధర్మమువల్ల గలిగిన అనేక యాతనలచే తీవ్ర బాధలచే చుట్టుకొన్న వేదనా శరీరములు గలవారగుదురు 31. దేహికి పూర్వకృత పాపకర్మల సరిపోవు తామస సంసారము కలుగును. అదియారు విధములు-32, 33. మానుషము పశు భావమును పశుభావము వల్ల మృగమగును. మృగభావము వల్ల పక్షిభావమును దాని నుండి సర్పమగును-34. సర్పభావము నుండి నిస్సంశయముగ స్థావరత్వమునందును ఆ స్థావరత్వము నుండి మేలుకొనునంత వరకు వాడు కుమ్మరి సారె (చక్రము) వలె అక్కడనే తిరుగుచుండునని చెప్పెడివారు-35.
ఈ విధముగా మనుష్యుడు మొదలు స్థావరము వరకు పరివర్తించునది తామస సంసారమని తెలియవలెను. అచటనే-36, బ్రహ్మ మొదలుకొని పరివర్తనమానమగునది సాత్త్యిక సంసారము అని యనబడినది. స్వర్గ స్థానములతో బ్రహ్మాది పిచాశముల వరకు పరివర్తమానమగు సంసారము సాత్త్యికమని తెలియవలెను-37. బ్రాహ్మము నందు కేవలము సత్యముండును. స్థావరమున కేవలము తమముండును. ఈ పదునాలుగు స్థానముల మధ్యన విఘ్నముగా నిలచినది రజము. తన మర్మ స్థానములు కోయబడుచుండగా వేదనచే పీడితుడైన దేహియైన బ్రాహ్మణుడు పరవశుడైన బ్రహ్మనెట్లు స్మరించగలడని పూర్వధర్మము యొక్క సంస్కారము వలన భావనవల్లను ప్రవేశింపబడిన వాడై నిత్యము మానుష్య భావమును బొందును.కావున నిత్యము సమాహిత చిత్తుడు (బ్రహ్మయందు మాత్రమే లగ్నమైన చిత్తము గలవాడు గావలెను-38, 39.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున పాశుపత యోగమను పదునాలుగవ యధ్యాయము.
