వాయు మహా పురాణము

Table of Contents

20 - లక్షణం

వాయువు పలికెను:- ఆ పైన ఓంకార ప్రాప్తి లక్షణమును జెప్పబోవుచున్నాను. ఓంకారము మూడు మాత్రలు గలదని తెలియవలె. ఇచట వ్యంజనముగూడ (హల్లుగూడ) సస్వరము-1. మొదటి మాత్ర విద్యుత్సంబద్ధమైనది. (వైద్యుతీ). రెండవ మాత్ర తామసీ యనబడినది. మూడవ మాత్ర నిర్గుణీయని తెలియవలె. మాత్రను అక్షరగామినిగా తెలియవలెను-2. గాన్గార స్వరమును బుట్టినదీ గాన్తరీయమని తెలియవలే. పిపీలిక యనునదీ సమానస్పర్శగలదై ప్రయోగింపబడినది. అది శిరమున గనపడును-3. ఆ విధముగా ప్రయోగింపబడిన ఓంకారము శిరమున బయలుదేరును. ఆ విధముగా యోగి ఓంకారమయుడై ఓంకారాక్షరమున (నాశములేని ఓంకారమున) నాశనము లేనివాగును-4. ఓంకారము ధనువు. ఆత్మబాణము, బ్రహ్మదానికి లక్ష్యము (గురి) జాగరూకుడైనచో బాణము చేతవలె లక్ష్యము వధ్యమగును. కావున బాణము లక్ష్యమును భేదించి తన్మయమయిన రీతిగా ఆత్మబ్రహ్మను జేరి బ్రహ్మమయముగావలె-5.

ఓం అనునొక్కయక్షరము బ్రహ్మ దాని పదము గుహారూపమయిన బుద్ధియు నుంచబడినది. ఓం అనునది మూడులోకములు ,మూడగ్నులు, వామనావతారములోని విష్ణువు యొక్కయు మూడు పాద విక్షేపము (భూమ్యాకా పాతాళము)-6. పరమార్థమునకు (సత్యార్థమునకు) ఓంకారమున మాత్రలు నాలుగు అని తెలియవలెను. ఓంకారమున యోగధారణమునుజేసిన యోగి ఓంకార సరస్వరూపమును బొందును-7. అకారము అక్షరముగను (నాశనములేని దానిను వర్ణముగను) తెలియవలె. ఉకారము స్వరితముగా జెప్పబడినది. మకారము ప్లుతముగా తెలియవలే. ఇది త్రిమాత్రకముగా గుర్తించబడినది (పేర్కొనబడినది)-8. తరువాత ఆకారము భూర్లోకము. ఉకారము భువర్లోకమనబడినది. వ్యంజనముతో గూడిన మకారము స్వర్లోకముగా జెప్పబడినది-9. ఓంకారమైతే మూడు లోకములు దాని శిరస్సు స్వర్గము అది యంతయు భువనాంతము. ఆస్థానము బ్రహ్మకు సంబంధించినదిగా జెప్పబడినది-10. మాత్రాస్థానము రుద్రలోకము మాత్రలులేనిది శివస్థానము ఈ విధముగ ధ్యాన విశేషముచే ఓంకారపదము నుపాసింతురు-11. కావున ధ్యానాసక్తుడైనవాడు శాశ్వతపదమునుగోరి నిత్యము అయాత్రకమైన యా ఓంకారాక్షరమును ప్రయత్నశీలియై యుపాసింపవలె-12.

హ్రస్వమాత్ర మొదటిది. తరువాత దీర్ఘ మాత్ర రెండవది. ఆ తరువాత ఫుతవతియైన మాత్ర మూడవది అని చెప్పబడినవి-13. మొదటిది రెండవది ఇత్యాది అనుపూర్వక్రమముననివి (ఫైజెప్పినవి) మాత్రలని తెలియవలె. శక్తియున్నంతవరకు ఇవి యోగధారణలో ధరింపబడును-14. ఆత్మయందు ఇంద్రియములను, మనస్సును, బుద్దిని, ఎల్లప్పుడు ధ్యానము చేయుచు ఎనిమిది మాత్రలు గల దానినిగా ఓంకారమును విన్నవాడు ఫలితమును బొందును-15. ప్రతిమాసమున నూరేండ్లు అశ్వమేధయాగముజేసిన యంతటి పుణ్యఫలమును ఓంకారములోని ఒక మాత్రమును ధ్యానముచేసి పొందగలడు- 16.

ప్రతి మాసమున నూరేండ్లవరకు దర్భకొసతో నీటి బిందువు త్రాగి సంపాదించునంతటి పుణ్యమును ఓంకారము యొక్క మాత్రను ధ్యానించుటతో బొందును-17. ఇష్టా పూర్త యజ్ఞమునకు సత్యవాక్యమునకు, మాంసభక్షణము జేయనందుకును, రాగల పుణ్యమును ఓంకార మాత్రధారణచే బొందును-18. తమ స్వామి కొరకు మరలకుండగా యుద్ధముజేయు వారితో సమానమైన ఫలమును ఓంకార మాత్రధారణతో బొందగలడు-19. ఉగ్రతారుస్సుచేతనా, భూరి దక్షిణలుగల యజ్ఞములచేతను పొందలేనంతటి ఫలమును ఓంకార మాత్రముచే బొందగలడు. అందులో అర్థమాత్రము ప్లుతముగా నుపదేశింపబడును. గృహస్థులైన యోగులు దీనినే చేయవలె 21

ఇదియే విశేషముగా ఐశ్వర్యముతో సవలక్షణమైనది. విశేషమగు యోగులకు ఎనిమిది రూపములు గల యైశ్వర్యమునందు సమముగా గుర్తింపదగినది. అది అణిమాదులగలదియని తెలియవలె. కావున బ్రాహ్మణుడు యోగమున మనస్సు నిలిపి యోగిగావలె-22. ఈ విధముగ యోగి చక్కగా యోగయుక్తుడై శుచియై, కోరికల నణచిదాత్తుడై ఇంద్రియముల జయించినవాడై, ఆత్మనుదెలిసికొన్న బ్రాహ్మణుడు సర్వమును బొందలడు-23. బ్రహ్మ ధాన్యము చేయువాడు యోగజ్ఞానమువలన ఋక్కులను యజుస్సులను సామములను (ఋగ్యస్సామవేదములను) వేదోపనిషత్తులను (జ్ఞానమును) బొందగలడు-24.

సర్వభూతముల లయము జరిగి జన్మించనివాడు జన్మించును. యోగి సంక్రమణమును (పరమాత్మతో గలిసి) జేసి శాశ్వతపదమును బొందును-25. ఇంతియే కాక, ఇచట (ఓంకారమునందు) నాలుగు హస్తములు నాలుగు ముఖములు గలిగిన ప్రకృతియైన విశ్వరూపయను ధ్యానించుచున్నవాడై దివ్య చక్షువుతో నామెను జూచును-26.

ఈ ప్రకృతి పుట్టుకలేనిది (ఆడమేక) సామ్యావస్థలో నున్న రజస్-సత్త్వ తమోగుణములు నిండినది. ఎరుపు తెలుపు నలుపురంగులు నిండినది) అనేక ప్రజలను త్రిగుణములైన మహదాది వికారములనేకములను సంతానములను) సృజించుచున్నది. స్వాత్మ స్వరూపమైనది. జన్మరాహిత్యముజెందిన యొక యోగి (మగమేక) ఈ పై ప్రకృతిని (ఆడమేక) అనుభవించిన భోగసుఖముగల యా ప్రకృతిని (ఆడమేకను) బంధమునుబెట్టుకొనక వదలివేసి విముక్తుడగును. ఎనిమిది యక్షరములు గలది. పదునాలు చేతులు కాళ్ళు గలది. నాలుగు ముఖములు గలది, మూడు సిగలు గలిగి ఒక కొమ్ముగలదియు అందరికన్న మొదటిదియు, పుట్టుక లేనిదియు, విశ్వమును సృష్టించునదియు, ఆత్మస్వరూపమునై దానీనిగా నామెను దెలిసి పండితులు జ్ఞానులు అమృతత్వమును బొందుదురు ప్రణవమును దెలిసికొన్న బ్రాహ్మణులు మరల భూలోకమున సంసారమును బొందరు-27. ఈ విధమైన ఓంకారమను అక్షర పరబ్రహ్మరూపమును తెలిసినవాడుగాని లేదా ఆ విధము ధ్యానము చేసినవాడు గానీ సంసార చక్రమును వదలి విడిపోయిన బంధనముల యొక్క బంధనముగలవాడై నిస్సంశయముగా. అచలమును, నిర్గుణమునునైన స్థానమగు శివుని బొందును-28, 29.

లోకేశ్వరునకు నమస్కారము. సృష్టి ప్రళయములకై మహత్స్వరూపముతో వచ్చువానికి నమస్కారము. మీకు హితమైన యా బ్రహ్మకు నమస్కారము. అంతట స్థానము గలవానికి, నిర్గుణునకు, చక్కగా సేవింపబడిన యోగీశ్వరునకును నమస్కారము. నీటిచేత తామరాకువలె యోగి విశుద్దమైన బ్రహ్మను జేరవలె. అది పవిత్రములలో పవిత్రమైనది. పవిత్రముతో పవిత్రము జేరవలే. పవిత్రముతో నిండిన పవిత్రముతో హ్వస్వ దీర్ఘపుత రూపమైన ఓంకారమును శబ్ద-స్పర్శ రూప-రస గంధములు (పంచతన్మాత్రలు) లేని దానిని. సంపూర్ణముగా ఉపాసించవలె. అవిద్య కీశానుడైన వానికిని యోగీశ్వరునకును నమస్కారము. అతనిచే ద్యులోక ముగ్రమైనది. పృథివి దృఢమైనది. అతనిచేతనే స్వర్లోకము నాకలోకము వానియొక్క మధ్యనుండు అంతరిక్షమును గర్జితములైనవి. ఇవి శ్రేష్ఠములైనవి. దేవతలకు హృదయము విశ్వరూపుడు. ఆతనికి ప్రాణాపానములతో పోలికలేదు. ఓంకారము విశ్వమంతయు వ్యాపించిన యజ్ఞము. యజ్ఞమే వేదము. వేదము నమస్కారము. నమస్కారము రుద్రుడు నమస్కారము. యోగేశ్వరాధిపతికి నమస్కారము. ఇది సిద్ధి ప్రత్యుపస్థానము. సాయం ప్రాతర్మధ్యాహ్నములందు నమస్కారము. అని సర్వకామ ఫలము రుద్రుడు. పరిపక్వమైనపండు తొడిమనుండి గాలిచే క్రిందబడును. అట్లే రుద్రనమస్కారముచే పాపము నశించును-30.

రుద్ర నమస్కారము నిశ్చయముగా సర్వధర్మఫలములనిచ్చునది. అన్యదేవ నమస్కారముననట్టి ఫలము లభింపదు-31. కావున యోగి ప్రాతర్మధ్యాహ్న సాయంకాలములలో మహేశ్వరునుపాసించవలెను. దశవిస్తారకమైనది బ్రహ్మ, కాకా బ్రహ్మ విస్తరమైనది-32. ప్రభువు అంతట కాలమున (తగిన కాలమున) మొత్తము ఓంకారమును జెప్పెను. అద్దానిచేతనే మహాయశస్కుడు విష్ణుత్వమును నమస్కారమును బొందును-33. నమస్కారములాగుననే ప్రణవము (ఓంకారము) ప్రభువును, స్తుతించును. యజ్ఞము ప్రణవమును స్తుతించును. యజ్ఞమును నమస్కారము స్తుతించును. నమస్కారమును రుద్రుడు స్తుతించును. కావున రుద్రపదము శివము (శివరూపము)-34. ఈ చెప్పిన యతి రహస్యములను యథాక్రమముగా తెలిసికొన్నవాడు ధ్యానమును తద్వారా పరమపదమును బొందును-35.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ఓంకార ప్రాప్తి లక్షణమను ఇరువదియవ యధ్యాయము 20