వాయు మహా పురాణము
2 - ద్వాదశ వార్షిక సత్రము
శుకుడిట్లు పలికెను: - తపస్సే ధనముగా గల ఆ ఋషులు సూతునితో మరల నిట్లు పలికిరి: ఆశ్చర్యమును గొలిపే కర్మలనాచరించు ఆ మహర్షులు సత్రయాగము నేచట చేసిరి?. ఎంత కాలము చేసిరి? ఆ యాగము జరిగిన విధమెట్టిది? వారికి వాయుదేవుడు పురాణమును చెప్పిన విధమెట్టిది?. ఈ విషయములను విస్తరముగా చెప్పుము. మాకు కుతూహలము అధికముగానున్నది. ఇట్లు ప్రేరితుడై సూతుడు శుభకరములగు పలుకులను ఇట్లు పలికెను.
బ్రహ్మవేత్తలగు ఈ ఋషులు శ్రేష్ఠమగు సత్రయాగము నాచరించిన స్థలమును, ఆ యాగము జరిగిన కాలమును, జరిగిన విధమును వినుడు. పూర్వము జగత్తును సృష్టించిన ఆ ఋషులు జగత్తును సృష్టించాలనే కోరిక గలవారై వేయి సంవత్సరములు పవిత్రమగు సత్రయాగమును చేసిరి. దాని యందు సూర్యుడు యజమాని, బ్రహ్మ స్వయముగా బ్రహ్మత్వమును చేపట్టెను. భూమి యజమాని పత్ని. మహాత్ములగు ఋషుల ఆ సత్రము నందు బుద్ధిమంతుడు, మహాతేజశ్నాలి యగు యముడు శమితగా నుండెను. వారా సత్రయాగమును నైమిషారణ్యము నందు వేయి సంవత్సరములు అనుష్ఠించిరి. పరుగిడుచున్న ధర్మచక్రము యొక్క అంచు (నేమి) ఒక ప్రదేశములో శిథిలమయ్యెను. ఆ స్థానమునకు నైమిషము అను పేరు వచ్చును. ఆ స్థలమును ఋషులు పవిత్రముగా భావింతురు.
నైమిషము నందు సిద్దుల చేత, చారణుల చేత సేవింపబడే పవిత్రమగు గోమతీనది గలదు. రోహిణి అచటనే సౌమ్యుడను కుమారుని కనెను. మహాత్ముడగు వసిష్ఠునకు అచటనే జ్యేష్ఠ కుమారుడగు శక్తి జన్మించెను. నైమిషము నందు అరుంధతికి గొప్ప తేజశ్శాలురగు వందమంది కుమారులు జన్మించిరి. అచటనే శక్తి కల్మష పాద మహారాజును శపించెను. అచటనే విశ్వామిత్ర వసి ష్ఠులకు వైరము కలిగెను. ఆ నైమిషము నందే అదృశ్యంతికి పరాశరుడు జన్మించెను. పరాశరుడు జన్మించినప్పటికీ, వసిష్ఠునకు (పుత్ర వినాశరూపమగు) పరాభవము తప్పలేదు. అట్టి నైమిషము నందు బ్రహ్మవాదులగు ఆ మహర్షులు సత్రయాగమును చేసిరి. నైమిషము నందు సత్రయాగము ననుష్ఠించుటచే, ఆ మహర్షులకు నైమి షేయులు అను పేరు కలిగేను.
మహర్షుల ఆ సత్రయాగము జరుగుచుండగా పన్నెండు సంవత్సరములు గడిచెను. అపుడు పరాక్రమియగు పురూరవసుడు భూమిని పాలించుచుండెను. పురూరవసునకు రత్నములయందు లోభము మెండు. ఆతడు సముద్రము లోని పద్దెనిమిది ద్వీపములను తన వశము చేసుకొనెను. అయిననూ, ఆతని రత్నకాంక్ష తీరలేదని మేము వింటిమి. దేవహూతి చేత ప్రేరేపించబడిన ఊర్వశి పురూరవసుని కామించెను. ఆతడు దేవవేశ్యతో కూడి ఆ సత్రమునకు వచ్చెను.
ఆ మహారాజు సన్నిధిలో నైమిషీయుల సత్రయాగము కొనసాగు చుండెను. పూర్వము అగ్ని వలన గంగ గర్భమును దాల్చి, గర్భమునందలి తేజోమయమగు పిండమును పర్వతమునందు విడువగా, అది బంగారమాయెను. ఆ మహర్పుల యాగ వేదిక ఆ బంగారముతో నిర్మింపబడెను. ధీమంతుడగు విశ్వకర్మ లోక క్షేమమును గోరి, స్వయముగా ఆ యజ్ఞవాటికను మహాతేజశ్శాలురగు, ఆ ఋషులయాగము కొరకు నిర్మించెను. ఇలా కుమారుడగు పురూరవసుడు అడవిలో వేటాడుతూ ఆ స్థలమునకు వచ్చి, అచట బంగరు యజ్ఞవాటికను చూచి, గొప్ప ఆశ్చర్యమును పొందెను.
లోభము వలన నశించిన వివేకము గల ఆ మహారాజు బంగరు యజ్ఞ వేదిని తన అధీనము చేసుకొనుటకు యత్నించగా, నైమి షేయులగు ఋషులకు తీవ్రమగు కోపము కలిగెను. కుద్దులగు ఆ మహర్పులు దైవముచే ప్రేరితులై, ఉదయ సమయములో ఆ రాజును దర్భలనే వజ్రములతో కొట్టిరి. దర్భ వజ్రములచే కొట్టబడిన ఆ రాజు దేహమును చాలించెను. అపుడు, ఆ రాజునకు ఊర్వశి యందు జన్మించిన కుమారునీ చక్రవర్తిని చేసిరి ఆతని కుమారుడే నహుషుడు. ఆ మహాత్ముడగు రాజు ధర్మబుద్ధి గలవాడై, ఆ మహర్షుల యందు యోగ్యమగు వర్తనము కలిగియుండెను.
ఆతని పేరు ఆయుషుడు. శక్తి శాలియగు ఆ మహారాజును బ్రహ్మవేత్తలగు మునులు ఓదార్చిరి. అపుడా మహర్షులు ధర్మము యొక్క అభివృద్ధి కొరకు యథా శాస్త్రముగా యజ్ఞమును మరల కొనసాగించిరి. మహాత్ములగు వారి ఆ సత్రయాగము గొప్ప విస్మయమును కలిగించెను. జగత్తుని సృష్టించగోరి పూర్వము జగత్ స్రష్టలగు మహరుల యాగము వలె ఆది భాసించెను. ఆ యాగమునందు వారి ప్రియమిత్రులగు వైఖానస, వాలఖిల్య, మరీచిక మహర్షులు, సూర్యునితో, అగ్నితో సమమగు తేజస్సు గల ఇతర ఋషులు, పితృదేవతలు, దేవతలు, అప్సరసలు, సిద్ధులు, గంధర్వులు, నాగులు, చారణులు కూడా పాల్గొనిరి.
ఆ యాగశాల పవిత్రమగు సంభారములతో ఇంద్రసభ వలె విరాజిల్లుచుండెను. మహర్షులు దేవతలను స్తోత్రములతో, గ్రహము (సోమమును నింపే చెక్కపాత్ర) లతో ఆరాధించిరి. పితృకర్మలతో పితృ దేవతలను ఆరాధించిరి. గంధర్వులు మొదలగు వారిని శ్రద్ధతో యథావిధిగా ఆరాధించిరి. కర్మల మధ్యలో, గంధర్వులు సామగానము చేసిరి. అప్సరసల గణములు నృత్యము చేసినవి. మునులు చిత్రములగు పదములతో కూడిన మంగళాశీస్సులను పలికిరి. మంత్రములు మొదలగు వాటి స్వరూపము నెరింగిన విద్వాంసులు పరస్పరము సంభాషించుకొనిరి. వితండవాదులు (స్వీయపక్షము లేకుండగనే వాదించువారు ప్రతివాదులను ఓడించిరి.
సాంఖ్య, న్యాయాది శాస్త్రములలో పండితులైన మహర్షులు ఆ యాగములో నుండిరి. అచట బ్రహ్మరాక్షసులు పాపముల నాచరించుట గాని, దైత్యులు యజ్ఞమునకు హాని చేయుట గాని, అసురులు యజ్ఞసంభారములను అపహరించుట గాని లేదు. ఆ యజ్ఞములో ప్రాయశ్చిత్తము గాని ఇతరులకు హాని కలిగించే కర్మగాని లేదు. ఈ విధముగా, ఆ మహర్షులు తమ శక్తిని, విద్వత్తును, కర్మ సామర్థ్యమును కలబోసి, సత్ర యాగమును పన్నెండు సంవత్సరములు యథా విధిగా అనుష్ఠించిరి-35. జ్ఞానులగు, భృగు - ఆది మహర్షులు అయుతము (10,000) దక్షణగా గల జ్యోతిష్ణోమ యాగములను వేర్వేరుగా ఒక దాని తరువాత మరియొకటి అనుష్ఠించిరి.
ఓ ద్విజులారా: మీరు నన్ను కోరిన విధముగనే, ఆ ఋషులందరు యజ్ఞమును పూర్తి చేసుకొని, మహా ప్రభువు, అనంత స్వరూపుడునగు వాయువును కోరిరి. వారిచే పురాణము కొరకు ప్రేరితుడై వాయుదేవుడు వారికి చెప్పెను. వాయు దేవుడు పరమేశ్వరునకు శిష్యుడు, సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు; వశి. ఆయన అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములతో కూడినవాడు. పశుపక్ష్యాది సర్వ ప్రాణులను భరించువాడు ఆయనయే. ఆవహ, ప్రవహ, సంవహ ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములయందు వాయుదేవుడు సదా వేగముగా సంచరించుచుండును. సప్తమరుద్గణములు ఆయన అధీనమునందు ఉండును. మహాబలశాలియగు వాయుదేవుడు పృథివి, జలము, అగ్ని అనే మూడు భూతముల రచనారూపములగు ప్రాణుల శరీరముకు ప్రాణముపోసి, ఆహారమును జీర్ణము చేయుటలో అగ్నికి సహకరించుచూ, ప్రాణులను ధరించుచున్నాడు.
ఇంద్రియముల వ్యాపారములచే ప్రేరితములైన, ప్రాణాపాన వ్యానోదాన సమానములనే అయిదు వాయువృత్తులు (క్రియలు) ప్రాణుల శరీరధారణమునకు మూలముగ నున్నవి. ఆకాశ గుణమగు శబ్దము, స్పర్శతో గూడి గాలికి గుణములు అగును. ఆకాశము నుండి గాలి పుట్టెను. గాలి నుండి అగ్ని పుట్టెనని విద్వాంసులు చెప్పెదరు. అట్టి గాలికి అభిమాని వాయుదేవుడు. ఆయన క్రియా స్వరూపుడు. వ్యాకరణ శాస్త్రకోవిదుడు. ఆయన సర్వకాలములయందు వీచుచునే యుండును. పురాణముల నెరింగిన అట్టి వాయు దేవుడు పవిత్రమగు మనస్సు గల మునులనందరినీ సంతోషపెట్టుచున్నవాడై, మధురమగు వాణితో పురాణమును బోధించెను.
శ్రీ వాయుమహాపురాణములో ద్వాదశవార్షిక సత్రవర్ణనము అనే రెండవ అధ్యాయము ముగిసెను.
