వాయు మహా పురాణము
27 - మహాదేవతనువర్ణనం
ఋషయ ఊచు:-
ఋషులనిరి:- ఈ కల్పమున సాధకులైన మునులతో బాటు మహాత్ముడు మహాదేవుడునైన రుద్రుని యొక్క ప్రాదుర్భావము నీచే చెప్పబడినది-1.
సూత్రువాచ:-
సూతుడనెను:- మొదటి సృష్టియొక్కయుత్పత్తి నాచేతసంగ్రహముగా జెప్పబడినది. దీని యొక్క నామములను వాని శరీరములతోబాటు విస్తరముగా జెప్పెదను-2. ఎనిమిదవ కల్పము గడచి పోగా యే కల్పమున (9వ కల్పమున) మహాదేవుడు తన భార్యల యందు అనేకులగు పుత్రులను బుట్టించెను-3. కల్పాదిలో తనతో సమానమైన పుత్రుని ధ్యానించుచున్న ప్రభువు శంకరుని తొడనుండి నీలలోహితుడైన (నలుపు ఎఱుపుగల) కుమారుడు బుట్టెను. మంచీస్వరము గలిగి తేజస్సుతో మండుచున్నట్లున్న యాతనిని ధరించేను-4. అకస్మాత్తుగా నేడ్చుచున్న కుమారుడైన నీలలోహితుని జూచి బ్రహ్మకుమార! ఏడ్చుచుంటి వేమి?యనెను-5. అతడు (నీలలోహితుడు) ఓ బ్రహ్మ నాకు మొదటి పేరునిడుము- అనెను బ్రహ్మ నీవు పేరుతో రుద్రుడవు అనే ను. ఆ కుమారుడు మరలనే డ్చెను -6. ఏడ్చుచున్న యాతనిని బ్రహ్మయెందులకేడ్చుచుంటివనెను. కుమారుడు తనకు రెండవ పేరు జెప్పుమని బ్రహ్మనడిగెను-7. ఓ దేవా!' పేరుతో నీవు భవుడవగుదువు. అనెను. కుమారుడు మరలనేడ్చెను-8,9. బ్రహ్మయేల మరల నేడ్చుచుంటివనెను. శివుడు నాకు నాల్గవ పేరు జెప్పుమనెను-10. బ్రహ్మ నీవు పశుపతివి అనెను. కుమారుడు మరలనేడ్చెను. బ్రహ్మయేల యేడ్చుచుంటివనేను-11. శివుడు నాకు ఐదవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో ఈశుడవగుదువనెను, కుమారుడు మరల నేడ్చెను-12. బ్రహ్మ మరల నేడ్చుచుంటివేల అనెను. కుమారుడు నాకొఱవ పేరు జెప్పుమని యాప్రభువైన బ్రహ్మనడిగెను-13. బ్రహ్మనీవు పేరుతో భీముడవగుదువు అనెను. కుమారుడు మరల నేడ్చెను. బ్రహ్మ యేల మరల ఏడ్చుచుంటివనెను-14. కుమారుడు నా కేడవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో ఉగ్రుడవగుదువు అనెను. కుమారుడు మరల నేడ్చెను-15. బ్రహ్మ ఏల మరల యేడ్చుచుంటివనెను. కుమారుడు నాకెనిమిదవ పేరును జెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో మహాదేవుడవగుదువనెను-16.
బ్రహ్మనుండి శివుడీ నామములను బొంది యీ నామములకు సరియైన భౌతిక శరీరముల (భూతములను) జెప్పుమని బ్రహ్మనడిగెను-17. దాని వలన బ్రహ్మ చే పైనామములకు శరీరములు సృష్టింపబడినవి. సూర్యుడు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము-18, దీక్షితుడైన బ్రాహ్మణుడు, చంద్రుడు ఈయివి బ్రహ్మ ధాతువులు, వానిలో రుద్రుడు పూజ్యుడును. వంద్యుడును అగును. కావున రుద్రుడు వారిని బాధించడు-19.
తరువాత బ్రహ్మ రుద్రునితో మరల నిట్లనెను. నీ రెండవ పేరు భవుడవంటిని దీనికి జలరూపమైన శరీరము గలుగగలదు. అని యనగానే యారుద్రుని యొక్క స్థిరమై రసాత్మకమైన శరీరము ఆజలమున బ్రవేశించెను. కావున జలములు భవుడనబడేను-21. జలములవలన బుట్టి భూతములు (శరీరములు) జలములనే భవించు భవన భావనములవలన (ఉండుట భావించుట వలన) భూతముల సంభవము జెప్పబడినది. శివుడు జలములలోనుండి జలముల భావించుటచే జలములు శివుడయ్యెను-22. కావున జలములలో మూత్రమలవిసర్జనములు విడువరాదు. నగ్నముగా స్నానము చేయరాదు. ఉమ్మివేయరాదు 43, స్త్రీ సంభోగము జేయరాదు. తలస్నానము జేయరాదు. సంతుష్టుడైకాని, మోయుచున్నవాడైకాని, సరిగానుండని వాడైకాని నీళ్లను వదలరాదు. పవిత్ర పవిత్రశరీరములగుటవలన జలములు దుష్టములు గావు. రంగుమారిన రసము వాసనయు గలవియు అల్పములైనవియునైన జలములను వదలి వేయ వలెను-23,24, 25. నీటికి యోని (పుట్టుకారణము) సముద్రమును జేరి పవిత్రములును అమృతములును అగును-26. కావున జలములను అడ్డుకొనరాదు. అవి సముద్రమున జేరగోరును. ఈ విధముగ నీటి విషయమై యెవడు ప్రవర్తించునో వానిని శివదేవుడు హింసించడు-27.
తరువాత బ్రహ్మ శివునితో ననెను. ఓ శివదేవ నీ మూడవ పేరుగా నిడబడిన శర్వ అను పేరునకు మూడవ శరీరముగా ఈ భూమి యగును-28. అనియనగానే శివుని యొక్క యెముకయనబడు స్థిరమైన (శరీర) భాగము భూమిలో ప్రవేశించెను. కావున భూమి శర్వుడనబడును-29. కావున విద్వాంసుడు (తెలిసినవాడు) నీడలోగాని, మెట్టునందుగాని, తననీడయందుగాని మలమూత్రములు వదలరాదు-30. తల పైవస్త్రము గప్పుకొని భూమిని గడ్డితో గప్పి మలమూత్రముల జేయవలెను ఈ విధముగా నడుచుకొన్నవానిని శర్వుడు హింసించడు.
తరువాత బ్రహ్మ శివదేవుని తోనిట్లనెను. నేను నీ నాల్గవ పేరు ఈశానుడని యంటిని-32. దానికి (ఆ నామమునకు) నాల్గవ శరీరము వాయువగును. అనియనగనే శివుని శరీరమున నైదు విధములుగా ప్రాణమను పేరనున్న (ప్రావణ) వాయువు ఆ వాయువులో జేరెను. అపుడు వాయువు ఈశానుడనబడెను. కావున విశాలముగా వ్యాపించిన మీ వాయువును ఈశ్వరునిగా జెప్పవలెను. ఈ విధముగానున్న వానినీశానుడు హింసింపడు.
తరువాత మరల బ్రహ్మ ధూమ్రలోహితుడగు శివునితో ననేను. నేను నీ యైదవ పేరు పశుపతి యని యంటిని ఆయైదవ పేరున కైదవ శరీరము అగ్నియగును-35, అనియనగనే శివుని శరీరముననుండి యాతని చిహ్నముగా నున్న తేజస్సు అగ్నిలో ప్రవేశించెను. కావున అపుడాయగ్ని పశుపతియై పతియయ్యెను-36. చంద్రుడు సోముడన బడెను. ఆతని యాత్మయోషధీగుణము, ఈ విధముగ దెలిసియే విద్వాంసుడు ప్రతి పర్వమున (పూర్ణిమయందు)నుండునో యాతనిని మహాదేవుడు చంపడు. ఈ విధముగ ఆ ప్రభువును (శివుని) నమస్కరింపవలేను-37. సూర్యుడు పగలు ప్రజలను రక్షించును. రాత్రి యందు చంద్రుడు రక్షించును. సూర్యచంద్రులు గలిసిన యొక యమావాస్య రాత్రియందు చంద్రుడు ఎల్లప్పుడు సూర్యునితో గలిసి యుండును-38. అక్కడ ఇదియంతయు (శివశరీరమంతయు) తన పేరులతో శరీరములతోను ప్రవేశించి యావరించియుండును. కావున ఈ యొక్కడుగా (ఆకాశమున) చరించుచున్న సూర్యుడే చంద్రుడనబడును-39. సూర్యుని యేకార్తితో ప్రజలు చూచుచున్నారో అది శుక్ల (తెల్లని) స్వరూపముననున్న రుద్రుడు అతడు కిరణములచే నీటిని త్రాగును 40. ఏది అన్నపానాత్మకములను తీని త్రాగుచున్నదో అది శివాత్మనుండి బుట్టిన శరీరములలో నేయభివృద్ధినొందును-41. దేని చేత స్థిరమైన చిత్తముతో సమస్త ప్రజలను ధరించుచున్నదో అది శివుని యొక్క శార్వీయను వర్థితమైన శరీరము. అది ప్రజలను ధరించును.
ప్రాణవ్యాపారములచేత ప్రాణుల శరీరములలో నెంతవరకు వాయ్యాత్మకమై (వాయురూపమే) యుండునో, ఆది ఐ శానియై ప్రాణితోబాటు ప్రాణముల రూపమునొందును-43. జఠరములందు (జీర్ణకోశములందు) త్రాగినవానిని, తిన్న వానిని పక్వము (జీర్ణము) జేయునది ఆ శివుని యొక్క పాశుపతియను పాచికశక్తియనబడును.
ఇచట దేహములలో వాయుసంచారము కొఱకై యంతర్గతములై యున్న రంధ్రములు శివుని భీమయను శరీరమనబడును-45. బ్రహ్మవాదులై వైతాన (వ్రత)దీక్షితులయొక్క స్థితి శివుని యుగ్రరూపమైన శరీరమనబడును. కావున దీక్షితుడు ఉగ్రుడనబడును-46. ఇట ప్రజలలో సమముగా నున్న శివుని సంకల్పము (శివసంకల్పము) ఆ శివుని మానసీతనువైన చంద్రుడు. అతడు ప్రాణులలో నుండును-47. మరలమరల బుట్టుచున్నవాడై క్రొంగొత్తవాడగును. ఆతడు దేవతలతోను పితృదేవతలతోను గూడ స్వేచ్చగా (కామానుసారముగా) తీసికొనిపోబడును. మహాదేవుడు అమృతాత్ముడు అట్టియీ శివుడు జలమయుడైన చంద్రుడనబడెను.
ఆ శివుని యొక్క మొదటి శరీరము రౌద్రియను పేర జెప్పబడినది. అట్టి రుద్రుని యొక్క భార్య సువర్చల ఆతని కామెకును బుట్టిన పుత్రుడు శనైశ్చరుడు-49. శివుని రెండవ తనువు (శరీరము) జలములనబడినది. అట్టి శివ జలతనువునకు భార్య 'ఉష' అనబడినది. వారి పుత్రుడు ఉశనుడు (శుక్రుడు) అనబడెను-50. శివుని మూడవతనువు భూమి యనబడినది. అట్టి శీవభూతనువునకు భార్య వికేశి' యనబడినది. వారి పుత్రుడు 'అంగారకుడు ' అనబడెను-51. శివుని నాల్గవదై స్వర్గతమైన ఈశానతనువునకు శివ యను పత్ని వారికి పుత్రుడు మనోజవుడు-52. పశుపతికి యైదవ తనువగ్నియని ద్విజులచే జెప్పబడినది. ఆ(శివ)యగ్నికీ భార్య స్వాహాదేవి. వారి పుత్రుడు స్కందుడనబడెను-53. శివుని యారవదీయైన భీమయను తనువు ఆకాశమనబడినది. ఆ శివాకాశతనువునకు దిక్కులు భార్యలు స్వర్గము పుత్రుడనబడెను-54. దీక్షిత బ్రాహ్మణులచే శివుని యేడవ తనువు ఉగ్రయనబడినది. ఆయుగ్రతనువునకు భార్య దీక్ష 'భార్య వారిరువురి పుత్రుడు 'సన్తాన'ము (కల్పవృక్షము) అనబడెను-55. శివుని యష్టమతనువైన చంద్రునకు పత్ని రోహిణీ వారి పుత్రుడు బుధుడనబడెను.
అని శివుని యొక్క నామములతో తనువులు చెప్పబడినవి. ప్రతి నామతనువులలో చక్కగా వందనముజేయదగినవి. చక్కగా నమస్కరింపదగినవియును-57. శివుని యొక్క తనువులతోను నామములతోబాటు శివ తనువులైన సూర్యునియందు, జలములందు, భూమియందు, వాయువునందు, అగ్నియందు, ఆకాశమునందు, దీక్షితునియందు, చంద్రుని యందును. భక్తివలన నరుడు ప్రజావంతుడై యీశ్వరునితో సాయుజ్యమును బొందును-58. భీముడైన శివుని యొక్క యీ రహస్యమయిన యశము మీకు జెప్పబడినది. ద్విపదులైన నరులకు సుఖము గలుగుగాక. చతుష్పదులైన మృగములకును సుఖము గలుగుగాక 59. ఓ ప్రజలారాః దేవుడై మహాదేవుడైన శివునియొక్క (భృగువుయొక్క) నామములతోబాటు తనువులయొక్క మూలకారణము ఇది మీకు జెప్పబడినది వినుడు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున మహాదేవతనువర్ణనమను ఇరువది యేడవ అధ్యాయము.
