వాయు మహా పురాణము

Table of Contents

22 - కల్పసంఖ్యానిరూపణం

ఓ మహామునీ ఇది యంతయు అత్యద్భుతమైనది. ఈ కల్పముల యొక్క రహస్యము మన్తముల యొక్క ప్రకల్పమున్ను మీకు చక్కగా జెప్పబడినది-1. ముల్లోకములో నీకు దెలియనిదేమియు లేదు. కావున విస్తారముగా మాకు సమస్త కల్ప సంఖ్యలను జెప్పుము-2.

వాయువు పలికెను:- ఇట ఉన్నది యున్నట్లు కల్పసంఖ్యను జెప్పబోవుచున్నాను. అట్లే పరమేష్ఠియైన బ్రహ్మయొక్క యుగాగ్రమును వర్షాగమును జెప్పెదను-3. ఒక వేయి కల్పములు బ్రహ్మయొక్క అబ్దము (సంవత్సరము) అనబడును. ఎనిమిదివేల యబ్దములు బ్రహ్మయొక్క యుగము అనబడును-4. వేయు యుగములు బ్రహ్మకు ఒక్క సవనము వేయు. సవనములు ద్విగుణము (రెట్టింపు) అట్లే త్రివృతము (మూడింతలు) (?) ఇదియంతయు బ్రహ్మయొక్క స్థితి కాలమునకు సంబంధించినదిగా జెప్పబడినది. ముందు వరుసగా దాని సంఖ్యను జెప్పుదును-5, 6.

 పేరులతో జెప్పబడిన ఇరువది యెనిమిది కల్పములలో ముందుగా వరుసగా కల సంజ్ఞను (కల్పమను పేరును) జెప్పెదను-7. రథస్తరసామము యొక్క పైన కల్పాక్షమున నామధేయములు వాని నుండి బుట్టిన మనోత్పత్తియు వినుడు 8. పందొమ్మిదవ కల్పము శ్వేతలోహితమని తెలియవలె. దానిలో పరమధ్యానమును జేయుచున్న బ్రహ్మను వేడి-9, తెల్లని శిరోవేష్టనము (తలపాగా) గలవాడు, తెల్లని పూలమాలలు గలవాడు, తెల్లని వస్త్రములు ధరించిన సిగగలవాడు అగ్నితోబోలి మహాతేజోమంతుడైన కుమారుడు బుట్టెను-10. భయంకరమైన ముఖముగలవాడు. మహారౌద్రుడు, చక్కని ఘోర (భయంకర) రూపుడు, తెలుపు ఎఱుపు రంగుగలవాడు, ఉజ్వలమైన శరీరముతో మహోజ్జలుడును. విశాలమైన నోరు గలవాడును, తెల్లని కాంతిగలవాడు-11. అయిన ఆతనిని శ్రీమంతుడును విశ్వమంతటను ముఖములు గలవాడు పురుషుడును అయిన బ్రహ్మ చూచెను ఆతడు లోకసష్ట విశ్వరూపుడు మహేశ్వరుడు-12. పురాణ పురుషుడు. దేవుడు అట్టి దేవదేవేశుని యోగులకు విశ్మాత్ముడైనవాడు. పితామహుడు అయిన బ్రహ్మ చాలకాలము ననుసరించెను-13. ఆ తరువాత బ్రహ్మ మహాదేవుడు పరమాత్మ ఈశ్వరుడు సద్యోజాతుడైన పరబ్రహ్మను హృదయమున నిలిపి, ధ్యానించేను. దేవేశుడైన జగత్పతి యీశ్వరుని దెలిసికొని సంతసించి నవ్వెను-14.

ఆ తరువాత బ్రహ్మయొక్క ప్రక్క భాగము నుండి బ్రహ్మవర్చస్సుగల శ్వేతులను ఋషులు పుట్టిరి. ఆ ఋషులు మహాత్ములు, తెల్లని పుష్పమాలలను ధరించిన వారు. తెల్లని మైపూత (గంధము) బూసికొన్నవారు-15. సుదన్దుడు, నన్దకుడు, విశ్వనస్తుడు, తరువాత నన్దనుడు అను వారు శిష్యలైన మహాత్ములు వారిచేత బ్రహ్మ (పరబ్రహ్మ జ్ఞానము) వరింపబడినది 16. ఆ బ్రహ్మయొక్క ముందర తెల్లని కాంతి గల శ్వేతుడను పేరుగల మహాముని పుట్టెను. అతడు మహా తేజస్కుడు. అతని నుండి యీ నరుడు పుట్టెను-17. అచట ఆ ఋషులందరు సద్యోజాతుడయిన మహేశ్వరుని చూచిరి. కావున దేవుడైన విశ్వేశ్వరుని జూచిన బ్రాహ్మణులు అందరు ప్రాణాయామపరులై యోగధారణబేసినవారై, పరబ్రహ్మయందు ప్రయత్నశీలురై-18, పాప నిర్ముక్తులయి మలము లేనివారై, బ్రహ్మ తేజోవంతులై బ్రహ్మ లోకమును దాటి పరబ్రహ్మలోకమును  జేరుదురు-19.

వాయువు పలికెను:- ఆ తరువాత ముప్పదియవ కల్పము రక్తమని చెప్పబడినది. అచట రక్తుడు. మహాతేజస్కుడై రక్తవర్ణమును ధరించేను-20. ఆ తరువాత పుత్రుని గోరి పరమేష్టియైన బ్రహ్మధానము జేసెను. ధ్యానించుచున్న యాతని నుండి రక్త (ఎర్రని) ఆకారముగల మహాతేజస్వియైన కుమారుడు పుట్టెను. అతడు ఎఱ్ఱని మాలలను ఎఱ్ఱని వస్త్రములను దరించి మిక్కిలి ప్రతాపవంతుడయ్యెను-21.

బ్రహ్మ కుమారుడైన యెఱ్ఱని వస్త్రములు ధరించిన మహాదేవుని జూచెను. వెంటనే పరమధ్యానయోగమును బొంది విశ్వమునీశ్వరునిగా తెలిసికొనెను (విశ్వేశ్వరుని దెలిసికొనెను)-22. భగవంతుడైన బ్రహ్మ పరమమునందే మనస్సును నిలిపినవాడై యా మహాదేవునకు నమస్కరించెను. తరువాత బ్రహ్మ వామదేవుని (శివుని) బ్రహ్మాత్మకుగా విశ్లేషించి ధ్యానించెను. 23. ఈ విధము పరమేష్టియైన బ్రహ్మచే ధ్యానింపబడిన మహాదేవుడు సంతోషముతో గూడిన మనస్సుతో బ్రహ్మదేవునితో నిట్లనెను-24. ఓ సత్తమా నీకు పితామహుడను (తండ్రియైన తాతను) అయినందున పుత్రిని గోరి పరమభక్తితో ధ్యానయోగముతో చూడబడితిని-25. కావున పరమధ్యానమును బొంది ప్రతి కల్పమున మహాతపస్వివై లోకప్రష్టను, మహాసత్త్యుడను, ఈశ్వరుడనగు నన్ను తెలిసికొనగలవు. ఈ విధముగా జెప్పిన తరువాత శర్వుడు (శివుడు) పెద్ద నవ్వునవ్వెను- 26. తరువాత ఆ శర్వునకు నలుగురు మహాత్ములు కుమారులుగా బుట్టిరి. ఆ మహాత్ములు శుద్ధబుద్దులై ప్రకాశించిరి-28. వారందరు ఎఱ్ఱని వస్త్రములు ధరించినవారు. ఎఱ్ఱని మాలలు మైపూతలు గలవారు. ఎఱ్ఱని భస్మమును బూసికొన్న అంగములు గలవారు. ఎఱ్ఱని ముఖము, ఎఱ్ఱని కండ్లు గలవారు-29.

 ఆ తరువాత వేయి సంవత్సరముల చివర బ్రహ్మహితులై ప్రయత్నశీలురైన యా మహాత్ములు ఆ వామదేవ (శివ) సంబంధమైన బ్రహ్మను శబ్దములతో జెప్పుచుండిరి-30. లోకానుగ్రహమునకై శిష్యహితమును గోరి యా బ్రాహ్మణులు స్వయముగా ధర్మోపదేశములను సమస్తమును జేసిరి. తరువాత వెంటనే మరల నాశములేని ధర్మోపదేశములను సమస్తమును జేసిరి. తరువాత వెంటనే మరల నాశములేని యా రుద్రునిలో బ్రవేశించిరి-31. తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులు గూడ వామదేవుడైన యీశ్వరుని యోగధారణముచేయుచున్న వారై తద్భక్తులై తత్పరాయణులై మహాదేవుని (శివుని) బొందుచున్నారు-32. వారందరు పొపములవీడినవారై విమలురై బ్రహ్మతేజముగలవారై పునరావృత్తిలేని రుద్రలోకమును బొందగలరు-33.

ఇది వాయు మహాపురాణమున కల్పసంఖ్యా నిరూపణమను ఇరువది రెండవ యధ్యాయము 22