వాయు మహా పురాణము

Table of Contents

42 -  భువనవిన్యాసో

సూతుడనెను:- సరోవరముల నుండి పుణ్య జలములు గల నదులు బయలు వెడలినవి. అవి పెల్లుబికిన మహా జలములు గలవి. వరసగా ఆ నదులను (గూర్చి) వినుడు-1. ఆకాశమను(వంటి) సముద్రమునుండి వెలువడి సోముడని పిలువబడునీ చంద్రుడు సర్వభూతములకాధారమై దేవతల యమృతమునకు నిధియైన వాడు-2. అతని నుండి బయలు వెడలినదియు, పుణ్యజలములు గలదియు, నైన నదీ ఆకాశ గామిని యైనది. అది యేడవ వాయువు మార్గమున విమల జలయై బయలు దేరినది-3,4. అది (నది) జ్యోతిస్సు నందు మరలుచున్నదై జ్యోతిర్గణ ములచే సేవింప బడినది. కోటి వేల తారలు గల యాకాశము నుండి మిక్కిలి పొడవైనదై ఆకాశ మార్గమున వెడలు మహేంద్రుని గజమైన ఐరావతము చేత నాకాశ మధ్యనే జలక్రీడలు సలపబడినదై విక్షోభితమైన జలములు గలది ఆకాశ తలమున నెగిరి పోవుచున్న యనేక విమాన సమూహములు గల సిద్దుల చేత ఆచమించిన జలములు గలదై, మహపుణ్యజలములు గలదై మంగళ స్వరూమైనదీ-5,6. వాయువుచే ప్రేరేపింప బడుచున్నదై అనేక విస్తారములలో పయనించునదై-సూర్యునివలె ప్రతిదినము పరివర్తన (భ్రమణము) జేయును 7. అది వేగముగా మేరువును ప్రదక్షిణముగా. జుట్టి వైచి యంతటను ఎనుబదినాలుగు యోజనములు విస్తరించినది-8.

తరువాత నీటి చేతను, తైజసమైన వాయువు చేతను బ్రద్దలగుచున్నదై మేరువు యొక్క యుత్తర కూటముల నాల్గింటిపై పడినది-9. అంతఎత్తైన మేరు శిఖరముల యొడ్డుల చివరల నుండి మరలినదై, నీటిని వేదజల్లు చున్నదై, నాలుగు విధములుగా స్రవించు జలములు గలదై-10. అఱువది వేల యోజనములు నిరాధారమైన యాకాశమున మేరువు యొక్క నలుదెసలబడెను.11

ఆమంగళకరమైన పుణ్యమైన మహానది యాపర్వత మహాపాదముల నాల్గింటి యందంతట మందరమునకు పూర్వగా బడినదీ-12. దేవతల యొక్క పూర్వాంశగా సర్వసిద్ధ గణముల కాలయమైనదియు, చక్కని చిత్రములైన మధ్యప్రదేశములు గలదియు, అనేకములైన సెలయేరులు గల గుహలుగలదియు-13. పర్వతశ్రేష్టమైన సుందర గుహలు గల మందర పర్వతమును చుట్టి కొండనెత్తముల ప్రతాపమును జల్లార్చు స్పటికము వలె తెల్లని నిర్మలజలములచే యాయాకాశ మహానది ప్రవహించుచుండును-14.

అట్లే రమ్యమైన కుబేరుని తోటయగు చైత్రరథమును ప్రదక్షిణముగా జుట్టి ప్రవహించుచు ఆయాకాశమహానది అరుణోద (ఎఱ్ఱని జలములుగల) సరోవరమును ప్రవేశించినది-15. ఆ తరువాగ అరుణోద సరోవరమునుండి మరలి చలికాలము చివర మనోహరములైన ప్రవాహములు గలిగి సిద్దగణములకావాసమైన శైలమునందు చక్కని నడకగలదై పడేను-16.

సీతయను నది మహాపుణ్యమై నదులలో శ్రేష్టమైన నది. అదియనేకములైన పొదలతో అడ్డుకొనబడినదై అనేకములైన విశాల స్థలముల మీదుగా బోవునదై-17. శీతమస్తముగాగలదై శిఖరము నుండి జారినదై సుకుంజమను శ్రేష్ఠపర్వతమునందు బడినది. మహాభాగ్యవంతమైన యానది యాసుకుంజపర్వతము నుండి సమంజసపర్వతమునుండి మాల్యవంతపర్వతమును భావించుచున్నదై యా శ్రేష్ఠనది వైకంకమను పర్వతమును జేరి దాని నుండి మణిపర్వతమును. దానినుండి యనేకగుహలుగల ఋషభపర్వతమును జేరినది-19.

ఈ విధముగా వేల పర్వతములను చీల్చుకొనుచు మహానది మహాశైలమున సిద్దసేవితమైన జఠరభాగమున బడినది 20. అటనుండి కూడ ఆ నది దేవకూటమైన మహాశైలమును జేరినదై, దాని కడుపున సముద్రము చివరగలదై క్రమముగా పృథివిని జేరినది-21. ఆ నది యీ విధముగ వేయి స్థలములము నూర్లపర్వత శ్రేష్ఠముల మీదుగా, విచిత్రవనముల మీదుగా వివిధములైన సరస్సుల మీదుగా-22, మహాభాగ్యవంతమైన యానది. విశాలప్రదేశములలో ఒడుదుడుకులు లేక ప్రవహించునదై వేలనదులను గలుపుకొన్నదై మహానదియైనది-23. ఆ శ్రేష్ఠనది భద్రాశ్వమను మహాద్వీపమున ప్రవహించుచున్నదై తూర్పుసముద్రమున బ్రవహించి యామహానది తూర్పు ద్వీపమును జేరెను-24.

దక్షిణను జేరిన యానది గంధమాదన పర్వత శ్రేష్ఠమును జేరినది. అచట చిత్రములైన జలపాతములలో అనేక విధముగ విప్పారిప్రవహించు జలములుగలదై-25, దేవతల కానందమునిచ్చు గంధమాదన పర్వతవనమైన నందనవనవనమున బ్రవహించు మహాభాగ్యవంతమై దక్షిణముగా బ్రవహించినది-26. దాని పేరు అలకనందయని యన్ని లోకములలో ప్రసిద్ధము. అది యటనుండి దేవతల మనస్సువంటిదైన మానసరోవరమున బ్రవేశించును-27. మానస సరస్సునుండి శైలశ్రేష్ఠమై సుందరమైన మూడు శిఖరములు గల త్రికూటపర్వతమును జేరును. త్రికూటము నుండి కలింగ శిఖరమును జేరును-28. కలింగశిఖరమునుండి జారినదై రుచకపర్వతమునబడును. రుచకము నుండి రాగి కాంతి గల నిషధ పర్వతమును జేరును. నిషధ పర్వతమునుండి కూడ-29. జారినదై శ్వేతోదరగిరిని జేరును. అటనుండి చక్కని మూలము  గల వసుధారపర్వత శ్రేష్ఠమును జేరును-30. అటనుండి హేమకూట పర్వతమును జేరినదై యటనుండి దేవ శృంగమును జేరును. అటనుండి పిశాచకమను మహాశైలమును జేరును-31. ఆ పిశాచక పర్వతము నుండి పంచకూట పర్వతము జేరును. పంచకూటము నుండి దేవ నివాసమైన కైలాస పర్వతమును జేరును-32. దాని గర్భములలో అనేకములైన గుహల లోను చరియల లోను తిరుగుచు పర్వత శ్రేష్ఠమైన హిమవత్పర్వత మునబడినదీ-33.

ఆ నది యీ విధముగా వేల పర్వతములను జీల్చుచు మహానదియై వేగముగా ప్రవహించునదై నూర్ల స్థలులమీదుగా ప్రవహించుచు-34. వేలవనములమీదుగా, నూర్ల గుహలలోనుండియు బ్రవహించుచు మహాభాగ్యవంతురాలై దక్షిణ సముద్రము జేరును-35.

సుందరమై, ఒక యోజనము వెడల్పుగలదై, పర్వత గర్భములలో దిరుగుచున్నదైన యా గంగా మహానది మహాత్ముడైన శంకరుని చేత ధరింపబడినది-36. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ శంకరుని చేత ధరింపబడిన యా నది భయంకరము లైన పాపములను పవిత్రము జేయును. శంకర శరీర స్పర్శచే రెట్టింపుగా పవిత్రమైన జలములు గలదై సర్వ లోకములలో బ్రసిద్ది జెందినది-37. పర్వతముననుసరించి యనేక ముఖములుగా నంతటను బయలు వెడలనిదై, క్రింద ఇతర పర్వతము చేత గొట్టబడుటచే దాని వేల నదులు ప్రసిద్ధి చెందినవి-38. ఆ మహానది యైన గంగ ఆ హిమవత్పర్వతము నుండి ‘గంగా’ అను పేరుతో మొదట ప్రకాశించినదై, సిద్ధులచే సేవింపబడినది-39. మహానదియైన గంగ ప్రవహించిన దేశములన్నియు ధన్యములు. అది రుద్రుని చేత సాధ్యులచేతను, అనిలుల చేతను ఆదిత్యులచేతను సేవింపబడిన జలములు గలదై తాను ప్రవహించిన దేశములు ధన్యముల జేసినది-40.

ఇక మేరు పర్వతము యొక్క పశ్చిమమైన మహాపాదమును జెప్పెదను. అది యనేక రత్నములకు నెలవైనది. పుణ్యమైనది. పుణ్యము జేసినవారిచే సేవింపబడినదీ-41. విశాలమైనది. పర్వతరాజము విశాలమైన గర్బము గుహలును గలది. మధ్య ప్రదేశములలో పొదళ్ల చేతను స్వచ్ఛమైన కటకముల చేతను (నడిమి భాగములచేతను) అలంకరింప బడిన గర్భము గలది-42. ఆ యీ ముక్కంటి యొక్క నది. దేవతలచే సేవింపబడిన జలములు కలది. వాయు వేగము గలది. వైశాల్యము లేక సన్ననైనది. కావున తీతవలె మలుపులు తిరిగినది-43. మేరుకూటతటమునుండి జారిపడినది. ఆ దెబ్బలచే తీయనైన జలములు గలది. వ్యాపించుచున్న జలములుగలది. నిర్మలమైన కొంగువలె తెల్లనైనది-44.

మేరుకూటమున నది ఆకాశనది(గంగ) సిద్ధచారణులచే సేవింపబడినది. తరువాత నా నది ప్రదక్షిణముగా తిరిగి పడినదై ప్రవహించుచు-45. దేవతలతో ప్రకాశించునదియు, మహాకాంతిగలదై, దేవవనమైన మహావనమును తననీటిచే తడుపుచు మహా భాగ్యవంతురాలై అనేక పుష్పఫల ఉదకములు గలదై-46, ప్రదక్షిణముగానే తిరుగుచు నానా వనములచే నలంకరింపబడి నదై తెల్లని విమల జలము గల పశ్చిమ సరస్సును ప్రవేశించును-47. తరువాత నది సితోద సరస్సు నుండి వెలువడి సుపక్షమను పర్వతమును జేరును. పుణ్యోదకము గల సుపక్షము నుండి దేవరులచే సేవింపబడినదై సుపక్షకూట తటమును జేరును. దానినుండి స్తుతింపబడిన జలము గలదై రమణ్యమైన శిఖపర్వతము పై బడును-49. శిఖి (నెమళ్ళ) పర్వతము నుండి కంక (కొంగ(రాపులుగు)ల) పర్వతమును, కంక పర్వతము నుండి వైదూర్య పర్వతమును, వైదూర్య పర్వతము నుండి కంపిల పర్వతమును, దాని నుండి గంధమాదన పర్వతమును-50, దాని నుండి శ్రేష్టమైన పింజర పర్వతమును, పింజర పర్వతము నుండి సరస్సును జేరును. దానినుండి కుముదాచలమును-51, అటనుండి మధుమంతము జనము ముకుటము-అను పర్వతములు జేరును. ఆ ముకుట పర్వతము నుండి మహాపర్వతమైన కృష్ణపర్వతమును జేరును-52.

ఆ కృష్ణ పర్వతము నుండి మహానగములచే సేవింపబడిన శ్వేత మహాపర్వతమును, ఆ శ్వేత పర్వతము నుండి వేయి శిఖరములు గల పర్వత రాజము నందు బడును-53. అనేక నదులచే నిండారిన జలములు గలిగి మంగళకరమై, యీ విధముగా వేయి పర్వతముల మీదుగా వేగముగా బ్రవహించుచు ఆ మహానది పారిజాతమను మహాపర్వతమున బడును-54.

ఆ మహానది పారిజాత పర్వతము పైన అనేకములగు సెలయేళ్ళు-నదులు గల గుహల లోను చరియల లోను ప్రకాశించును. ఆ పర్వతము యొక్క అనేక కుక్షులలో భ్రమించిన జలములుగలదై యా మహానది-55. కొట్టబడుచున్న వేగము గలదై, యనేక గండశిలలచే అనేక పర్యాయములు భేదింపబడుచున్న జలములు గలదై భూతలమునకు జేరును-56.

బంగారు వర్ణముచే చిత్రమై చక్కని ప్రక్కలు గలదియు గొప్ప ప్రత్యంత పర్వతములు(కొండ తిప్పలు) గలదియు, అనేక ప్రాణులచే సేవింపబడినది యునైన ఉత్తర గిరి యందు-58, మేరు కూట తటము నుండి జారిన యా మహానది వాయువుచే ప్రేరేపింపబడిన జలములు గలదై, అనేకములగు విరజిమ్ముటచే యా కాశమున వంకరలు తిరిగి పడుచున్నదై, ఆఱువది వేల యోజనముల నిరాధారమై శుభమైన యాకాశమున వేదజల్లబడుచున్నదై ఒక మాలవలె యామహానది పడెను. (మహాజలపాతముగా బడెను)-60.

ఈ విధముగా, అనేక దేవర్షులచే సేవింపబడిన శిఖరతటములనుండి జారినదై, వెదజల్లబడుచున్న జలములు గలదియు, అనేకములైన పూలతప్ప(మాను)ల నెడి యూర్థ్వకేశములుగలదియై-61. అనేకరత్నవనప్రదేశములుగల యడవియై సూర్యుని వనమైన మహావనమున ప్రదక్షిణముగా బ్రవహించుచు-62. గొప్పవారిచే సేవింపబడి మహాపుణ్యవంతమై మహాపుణ్యమైన యామహానది యటనుండి బయలుదేరినదై-64. అనేకములైన సెలయేరులతో కొండనెత్తములతో నొప్పినదై, వేగముగా బ్రవహించుచు శంఖకూటమను గిరీతటమున బడెను-65. శంఖ కూటతటమునుండి జారినదై వృషపర్వతమునను, వృషపర్వతమునుండి నాగశైలపర్వతమును-66. అటనుండి వర్ష పర్వతమైన నీల పర్వతమును, నీలపర్వతమునుండియానది. కపింజల పర్వతమును ఇంద్రనీల పర్వతమును చేరినది-67. ఆ తరువాత, మహానీలమును హేమశృంగమును ఆ నది చేరినది. హేమశృంగము నుండి శ్వేత పర్వతమును శ్వేతమునుండి సునగమను పర్వతమును చేరినది-68. ఆ మహానది సునగము నుండి శతశృంగమును శతశృంగమునుండి పుష్పాలంకృతమైన పుష్కర మహా శైలమును జేరినది-69. పుష్కరము నుండి బలిష్ఠమైన విరాజమను మహాపర్వతమును వరాహ పర్వతమును అటనుండి మయూర పర్వతమును-70. ఆటనుండి గుహాగర్భముతో నలంకృతమైన ఏకశిఖరమును ఆటనుండి జారుధియనశైలశిఖరమున వేగముగా బడినది-71.

ఈ విధముగా నా మహానది వేయి పర్వతములను జీల్చుచు మర్యాదా పర్వతమై మూడు శిఖరములతో నొప్పిన త్రిశృంగ పర్వతమును జేరినది-72. త్రిశృంగతటమునుండి జారినదై గొప్పవారిచే సేవింపబడినదై మేరు కూట తటము నుండి జారినదై గొప్పవారిచే సేవింపబడిన స్వచ్ఛమైన జలములు గలదై విరుద్ధమను పర్వత శ్రేష్ఠమున బడెను-73. అటనుండి భూములపై బ్రవహించుచు నాభాగ్యవంతమహానది పశ్చిమ సముద్రమును జేరినది-74.

ప్రక్కన సువర్ణ భూములు గలిగి, చక్కని పార్శ్వభాగములుగలిగి, మహాప్రాణులచే సేవింపబడి, చిత్రమైన ప్రత్యంత పర్వతములు గల మేరువుయొక్క యుత్తర గిరియందు-75, గుహాగరమునుండి జాలువారి, బహువైశాల్యముగలదై, చిత్రమైన పూలతెప్పలనెడి యూర్ఖకేశములుగలదియే భూమిని బ్రవేశించినది-76. అటనుండి ప్రవహించు సంతోషముతో మంగళకరమై ఉత్తర కురు దేశములను బ్రవేశించినదై మహాద్వీపమున మధ్యముగా ఉత్తర సముద్రమును జేరినదీ-77. ఈ విధముగా నా నాలుగు మహానదులు నిర్మలజలములు గలవై మహాగిరితటములనుండి జారిపడినవై నలుదెసలను జేరినవి-78. కావున, బహువిశాలమైన పృథివి పై విధములో పూర్తిగా జెప్పబడినట్లే. అది (భూమి) మేరు పర్వతమును జుట్టి వెదజల్లినట్లుగా నన్ని దిక్కులకు వ్యాపించి ప్రవేశించినది-79. అది నాలుగు మహాద్వీపములుగలది. నాలుగు ఉద్యానవనముల వంటి వనములు గలది. నాలుగు ధ్వజములవంటి మహావృక్షములుగలది. నాలుగు శ్రేష్ఠములైన సరోవరములు గలది-80. నాలుగు మహాపర్వతములు గలది. నాలుగు మహాసర్పముల కాశ్రయమైనది. ఎనిమిది ఉత్తరమహాపర్వతములుగలది. ఎనిమిది శ్రేష్ఠ పర్వతములు గలది-81.

ఇది శ్రీవాయుప్రోక్తే మహావాయుపురాణమున భువనవిన్యాసమను నలుబదిరెండవ అధ్యాయము-42.