వాయు మహా పురాణము

Table of Contents

52 - ధ్రువచర్యా

సూతుడనెను:- దేవతలైన యాదిత్యులచేతను, ఋషులచేతను, అట్లే గంధర్వులచేతను, అప్సరసలచేతను, గ్రామీణులచేతను, అట్లే (గ్రామాధిపతులచేత), సర్పములచేతను, రాక్షసులచేతను, ఆ సూర్యుడధిష్ఠితుడై యుండును. వీరు సూర్యుని రెండేసి మాసములు వరుసగా నివసింతురు. ధాత, ఆర్యముడు, పులస్త్యుడు, పులముడు, ప్రజాపతి. ఉరుగుడైన వాసుకియు, సంకీర్ణారుడును అనునిద్దరు, గాయకవరులైన గంధర్వులైన తుంబురు నారదులును, క్రతుస్థలి, అప్సరయైన పుంజిక స్థలి, గ్రామణియైన కృఛ్ఛుడును, తాపోర్యుడును, అనునిద్దరును, రక్షో హేతి, ప్రహేతీయను రాక్షసులిద్దరును, ఈ గణము చైత్ర వైశాఖ మాసములలో భాస్కరుని యందుండును. పైవి వసంత ఋతువునకు సంబంధించిన మాసములు, ఇక గ్రీష్మ ఋతువునకు సంబంధించిన మాసములు ఋషులైన అత్రి, వసిష్ఠుడు, తక్షకుడు, రంభుడు, మేనక, సహజన్య, హా హూహువులను గంధర్వులును, గ్రామణ్యుడైన రథస్వనుడును, రథచిత్రుడును, అనునిర్వురును, పౌరుషేయుడు ధవుడు అను రాక్షసులును వీరు జ్యేష్ఠ - ఆషాడ మాసములలో సూర్యునిలో నివసింతురు. ఆ తరువాత ఇంకను ఇతర దేవతలు సూర్యునిలో నివసింతురు. ఇంద్రుడు, వివస్వంతుడు, అంగీరసుడు, భృగువు. సర్పమైన ఏలాపర్లుడు శంకపాలుడును అను నిరువురును, విశ్వావసువు, ఉగ్రసేనుడు ప్రాతస్సున అరుణుడును. ప్రహ్లిచ, నిమ్లోచయని ప్రసిద్దిజెందిన స్త్రీలును, సర్పమైన రాక్షసుడును, వ్యాఘుడు, శ్వేతుడు, అనునిర్వురును, అను నీ గణము శ్రావణ భాద్రపద మాసములలో భాస్కరునిలో నివసింతురు. శరదృతువునందైతే పర్జన్యుడు, పూష భరద్వాజుడు, గౌతముడు, మునులు, దేవతలు వసింతురు. విశ్వావసువు, గంధర్వులు, సురభి, శుభలక్షణులైన విశ్వాచి, ఘృతాచి, యనునిరువురు అప్పరలును, ఐరావతమను ఏనుగును, ప్రసిద్ధుడైన యగ్నియు, సేనజిత్తైన సుషేణుడును, సేనానియైన గ్రామణియు అను నిరువురును రాక్షసులనబడిన జలమును, వాయువును వీరందరు ఆశ్వయుజ కార్తీక మాసములలో సూర్యునిలో నివసింతురు. హేమంత ఋతువునకు సంబంధించిన మాసములలో సూర్యునియందుండు వారు వీరు. అంశుడు భగుడను నీ యిరువురు, కశ్యపుడును, ఋతువును. భుజంగుడైన మహాపద్ముడును, కర్కోటక సర్పమును, గంధర్వుడైన చిత్రసేనుడును, ఉర్ణాయువు, అను నిరువురును. శుభప్సరసలైన ఊర్వశియు, విప్రచిత్తియంతార్యుడైన యరిష్టనేమియు, గ్రామణియైన సేనానియు అనునిరువురును, విద్యుత్ స్పూర్ణుడు అను రాక్షసులును వీరు మార్గశీర్ష పుష్యమాసములలో దివాకరునిలో నివసింతురు. ఆత శిశిర ఋతు మాసములలో గూడ ఈ క్రిందివారు నివసింతురు. త్వష్ట, విష్ణువు జమదగ్ని, విశ్వామిత్రుడు, కద్రుపుత్రులైన కంబల అశ్వతరులను నిరువును నాగులును, గంధర్వుడైన దృతరాష్ట్రుడును, సూర్యువర్చస్కుడును. అప్పరసలైన తిలోత్తమయు, నోరమయైన రంభాదేవియు, లోకప్రసిద్ధులైన గ్రామాధిపతులైన (గ్రామణ్యులు) ఋతజిత్తును, సత్యజిత్తును, బ్రహ్మతోగూడి యజ్ఞముతో గూడిన దక్షుడనబడువాడును ఈ దేవతలు వరుసగా మాఘ పాల్గుణమాసములలో సూర్యునీలో నివసింతురు.

ఈ పండ్రెండైన యేడేసి గణములు స్థానాభిమానముగలవి. ఇవి తమ తేజస్సుచే ఉత్తమతేజమైన సూర్యుని వెంబడించి సంతోషపెట్టును. మునులు ప్రసిద్ధమైన వాక్కులతో రవిని స్తుతింతురు. గంధర్వాప్సరసలు గీత నృత్యములతో నుపాసింతురు. గ్రామణీ యక్ష - భూతములు భయ సంగ్రహమును జేయుదురు. సర్పములు సూర్యుని మోయును. యాతుధానులు (రాక్షసులు) వెంబడింతురు. వాలఖిల్యులు ఉదయము నుండి రవిని సేవించి యస్తమింతురు.

ఈ దేవతలయొక్క వీర్యము ననుసరించి, తపస్సుననుసరించి యోగముననుసరించి, సత్యముననుసరించి ధర్మముననుసరించి బలము ననుసరించియు ఈ సూర్యుడు ఎట్లు తపించునో యట్లే వారియొక్క తేజస్సుచే సిద్దుడగును. ఈ విధముగా వీరు రెండేసి మాసములు సూర్యునీలో నివసింతురు. ఋషులు, దేవగంధర్వులు పన్నగాప్సరసల గణములు, గ్రామీణులు, యక్షులు, ఎక్కువ రాక్షసులు. వీరు తపింతురు, వర్షింతురు. ప్రకాశింతురు. వీతురు, సృజింతురు. ఈ లోకములో ప్రాణులయు శుభ కర్మను తొలగింతురు. పాపాత్ములైన మానవులు శుభమును వీరు హరింతురు. అక్కడక్కడ ప్రచారముల యొక్క పాపమును తొలగింతురు. వాయువేగము గలవారై కామగమనముగల (యధేచ్చాగమనముగల) వీరు దివ్యమైన విమానమున నున్నవారై పగలు ననుసరించి సూర్యునితోబాటు తిరుగుదురు. వర్షించుచున్న వారై తపించుచున్న వారై ప్రజలను సంతోషపెట్టుచున్న వారై ఈ లోకమున మన్వంతరము చివరి నుండియు ఈ ప్రాణులనందరిని రక్షింతురు. భూత భవిష్యద్వర్త మానముల నెవరుందురో మన్వంతరములలో అట్టి స్థానాభిమానుల కిది స్థానము, ఈ విధముగా పదునాలుగు మన్వంతర స్పష్టులలో ఆసప్తకులు నలుదెసల సూర్యునిలో నివసింతురు. రాత్రింబవళ్ళు గ్రీష్మ ఋతువున ఘర్మమును (వేడిని) హేమంత ఋతువున హిమమును, వర్ష ఋతువున వర్షమును గురియుచు, కాలముననుసరించి ఋతువశమున చుట్టు తిరిగిన కిరణములు గలవాడై సూర్యుడు దేవతలను పితరులను మనుజులను సంతోషపెట్టును. సూర్యుడు తనసుషుమ్న మను కిరణముచేత చంద్రుని పెంపొందజేసి యమృముతో దేవతలను సంతోషపెట్టును. శుక్లపక్షమున దీవసక్రమమున నిండుగానైన యా చంద్రుని కృష్ణపక్షమున దేవతలు ద్రావుదురు. కృష్ణ పక్షములో క్షీణావస్థలో ఆ విధముగా త్రాగబడి రెండు కళలు మిగిలిన వాడై కిరణములతో క్షీణించుచున్న వాడగును. అట్టి చంద్రునిలోని యాసుధామృతమును సౌమ్యులైన (సోమ సంబంధులైన) దేవతలు త్రాగుదరు. అట్లే పితరులు దానిని కవ్యముగా త్రాగుదురు. సూర్యుడు తన కిరణములచే భూమి పైని జలములను పైకి తీసికొనిపోవును. తరువాత వర్షించిన వృష్టిచే ఫలపాకాంతములైన వరి గోధుమ మొదలగు ధాన్యౌషధులు వృద్ధిజెందును. వానియన్నపానములచే మర్యులు (మానవులు) ఆకలిని జయింతురు. దేవతలకు అమృతముతో సగము నెల (15 దినములు) తృప్తి కలుగును. పితరులకు స్వధచేత నలువదియైదు దినములు తృప్తి కలుగును. సూర్యుడన్నముతో మర్త్యులను ఎల్లప్పుడు ధరించును. అదియును తన కిరణములతో ధరించును. ఈ సూర్యుడు ఆ తన పచ్చని గుఱ్ఱములతో (కిరణములతో) బోవుచు, కిరణములతో జలమును హరించును. విసర్గ (సృష్టి) కాలమున మరల నా జలములను వదలును. ఈ విధముగా సూర్యుడెల్లప్పును స్థావర జంగమాత్మకమైన జమునెల్లప్పుడు భరించును, సూర్యుడు తన పచ్చని గుజ్జములచే (కిరణములచే) జలములను హరించును. ఆ తరువాత కిరణముల చే వేయి(అనంత) ఔషధములుగా జలముల ద్రావును. తరువాత కిరణములను గుఱ్ఱములచే మోయబడుచున్నవాడై యీ సూర్యుడు ఆ జలములను వర్షరూపమున వదులును.

 ఈ విధముగా నీ సూర్యుడు ఏక చక్రరథముతోను, భద్రములై నాశములేని యా గుఱ్ఱములతోను పగటి చివరి వరకు కదలుచు బోవును. సప్తద్వీపసముద్రములు చివరగల భూమిని యేడు గుఱ్ఱములతోను ఏకచక్రముతోను గూడిన రథముతో అహోరాత్రము ఈ సూర్యుడు తిరుగును. ఆ సూర్యుని రథాశ్వములు అశ్వరూపములైన ఛందస్సులు చక్రము వైపుననే యున్నవి. కామ రూపములు (కోరిన రూపమున ధరింపలవి. ఒక్కమారే రథమునకు బూన్చబడినవి. ఒక పరిమితి (కొలత) లేనివి. మనోవేగముగలవి. పచ్చనివి, నాశములేనివి, పింగ(గోరోచన) వర్ణముగలవి, ఈశ్వర స్వరూపములైనవి. బ్రహ్మ(వేదము)ను బలుకునవి, ఇట్టి యా గుఱ్ఱములు సంవత్సరమున ఎనుబది నూర్ల మండలములను దిరుగును. కల్పాదియందు రథమునకు బూన్చబడిన యా గుజ్జములు భూత ప్రళయము వరకు దివసక్రమమున బాహ్యమండలమును అభ్యంతర మండలమును జుట్టినవై వాలఖిల్యులతోబాటు రాత్రింబవళ్ళు దిరుగును. పక్షులవలె ఆకాశమున వేగముగా బోవు గుఱ్ఱములచే దిరుగుచున్న దినపతియైన సూర్యుడు, వేదాది ప్రసిద్ధములైన శ్రేష్ఠములైన వాక్కులచే మహర్షులచే స్తుతింపబడుచున్న వాడై గంధర్వుల చేతను అప్సరోణముల చేతను గీత నృత్యములచే సేవింపబడుచుండును.

అట్లే చంద్రుడు వీధి నాశ్రయించియున్న నక్షత్రములను చరించును. అట్లే చంద్రునియొక్క కిరణములయొక్క వృద్దిక్షయములు సూర్యునివలెను యుండునని చ్పెబడినది. చంద్రుని రథము మూడు చక్రములు గలది. రెండు చక్రముల ప్రక్కన (మధ్యన)నున్నది. అని తెలియవలెను. ఆ రథము గుఱ్ఱములతోను, సారథితోను, జలగర్భమునుండి పుట్టినది. నూరు ఆకులుగల మూడు చక్రములతోను, తెల్లని శ్రేష్ఠములైన గుజ్జములతోను కూడియున్నది. సన్ననైనవియు దివ్యములైనవియు, సంగములేనివియు మనోవేగముగలవియునైన పది గుఱ్ఱములను ఒక్కమారే పూన్చిన యా రథము నా గుఱ్ఱములు యుగక్షయము వరకును మోసికొని పోవుచుండును. ఆ రథమట్లు సంగ్రహింపబడగా, తెల్ల సర్పము, ఒకే వర్ణముగల యా గుజ్జములును శంఖమువలె తెల్లనైన రథమును మోసికొనిపోవును. మయువు, త్రిమనము, వృషము, రాజీవలము, హయము, అశ్వము, వామము, తురణ్యము హంసము, వ్యోమి, మృగము. అనునవి. చంద్రుని పది గుఱ్ఱముల పేరులు. పగలు నశించినప్పటి నుండి దేవుడైన చంద్రుని మోసికొని పోవును. భాస్కరుడుముందు ఉండగా చంద్రుని శుక్లపక్ష ప్రారంభమున చంద్రుడు పితృదేవతలచే జుట్టబడి వెళ్ళుచుండును. దివసక్రమమున నెల్లప్పుడు తన పురముయొక్క లోపలనింపబడును. కృష్ణ పక్షమున దేవతలచే ద్రావబడిన చంద్రుని పదియైదు దినములు. సూర్యుడు ఒకే కిరణముచే నెల్లప్పుడు నింపి సంతసింపజేయును. సుషుమ్నయను కిరణములచే నెల్లప్పుడు నింపి సంతసింపజేయును. సుషుమ్న కిరణములచే దినక్రమముననుసరించి చంద్రుని ప్రతిభాగమును సూర్యుడు నింపుచుండును. సూర్యుని సుషుమ్న కిరణముచే శుక్లపక్షమున నింపి సంతసింపబడుచున్న చంద్రుని కళలు వృద్ధిజెందును. కావున కృష్ణపక్షమున చంద్రకళలు తగ్గును. శుక్లపక్షమున చంద్రకళలు వృద్ధిజెంటినిండును. ఈ విధముగా సూర్యుని వీర్యము (బలము)చే చంద్రుని శరీరము నిండును. ఈ విధముగ శుక్ల పక్షమున దీనక్రమమున చంద్రుడు కళలచే నిపంబడుటచే సంతుష్టి జెందింపబడినవాడై పూర్ణిమయందు తెల్లనివాడై నిండిన మండలముగలవాడై కనబడును. తరువాత బహుళపక్షమున ద్వితీయ నుండి చతుర్దశివరకు, జలసారమై రసమే, యాత్మగా గలిగిన చంద్రునియొక్క జలమయమై సౌమ్యమై సుధామయమైన మధువును దేవతలు ద్రావుదురు. సూర్యతేజస్సు చేత అర్ధ మాసములో దేవతలభోజనమునకై సౌమ్యమైన (చంద్రసంబంధియైన) అమృతము సంపాదింపబడును. దానిని పూర్ణిమయందు దేవతలు ఉపాసింతురు. కృష్ణపక్ష ప్రారంభమున, సూర్యునికెదురుగా నున్న చంద్రుని యొక్క కళలు ఒక రాత్రిలో సమస్త దేవతలచేతను, పితృదేవతలచేతను మహర్షులచేతను, త్రాగబడుచున్నవై క్రమముగా పురములోపల క్షీణించును. కావున కృష్ణ పక్షమున క్షీణించుకళలు శుక్లపక్షమున నా కళలను నింపును. ఈ విధముగా దినక్రమము గడవగా దేవతలు చంద్రుని నర్ధమాసం వరకు త్రాగి యాదేవోత్తములే అమావాస్యను జేరుదురు. పితరులు గూడ అమావాస్యయందు చంద్రునుపాసింతురు. ఆ తరువాత కళాత్మకమైన పదియైదవ భాగము కొద్దిగ మిగులగా అపరాష్ట్రమున పితృణములచే ఆ మిగిలిన చివరి కళయే యుపాసింపబడును. చంద్రునిలో చివర మిగిలిన కళను రెండు కళల కాలము (60 కాష్టల కాలము) త్రాగుదురు. అది యమావాస్యలో కిరణముల. ద్వారా బయలువెడలిన స్వధామృతము. నెల తృప్తికై వారు ఆ స్వధను ద్రావి యమృతమును బొందుదురు. సౌమ్యులు (సోమ సంబంధులు), బర్హిషదులు. (దర్బలపై గూర్చునువారు) అగ్నిష్వాత్తులు, కవ్యులనబడు వారును వారందరును పితరులే. సంవత్సరములు కవ్యములు వారు బ్రాహ్మణులచే పంచాబ్దులు అని యనబడిరి. సౌమ్యములు ఋతువులని తెలియవలె. మాసములు బర్హిషదులనబడిరి. పితృదేవతలచే త్రాగబడుచున్న చంద్రుని యొక్క పదియైదవ కళ క్షీణము జెందనంతవరకు అది చంద్రుని పదియైదవ భాగము. అప్పుడమావాస్యలో చంద్రుని యొక్క చిట్టచివరి భాగము పూరించబడును. పక్షప్రారంభమున షోడశి (పదునాఱువ) కళయందు చంద్రుని యొక్క వృద్ధి క్షయములుండు ననబడినది. ఈ విధముగా చంద్రునియందలి క్షయ వృద్దులు సూర్యుని కారణమున గలిగినవి. ఇక తారాగ్రహముల యొక్కయు, రాహువుయొక్కయు రథమును గురించి వినుడు.

చంద్రపుత్రుడైన బుధుని యొక్క రథము జలతేజోమయమై శుభ్రమైనది. గోరోజన వర్ణముగలిగి వాయువేగము గల యెనిమిది గుజ్జములతో బుధ రథము పూన్చబడినది. ఆ రథమున మేఘముతో సమానమై గొప్పనైన సారధి యుండును. ఆ సారధి కవచముతో గూడినవాడు. ఆకర్షణము గలవాడు. దివ్యుడు అమ్ములపొదియు, ధ్వజమును ధ్వజస్తంభమును గలవాడు. శుక్రుని యొక్క రథము చక్కని శోభగలది. తేజస్సుతో సూర్యునితో సమానమైనది. భూమిలో బుట్టిన యనేక వర్ణములు గల శ్రేష్ఠమైన గుజ్జములతో బూన్చబడినది. ఆ గుఱ్ఱములు - శ్వేతము, పిశంగము, సారంగము, నీలము, పీతము, విలోహితము, కృష్ణము, మరితము, పృషతము, వృష్టి, అనునీ పది చంద్రుని యొక్క రథము గూడ ఎనిమిది గుఱ్ఱములు గలదై, బంగారు మయమై శోభించునది. అసంగములును, ఎటు పైనవియు, అంతటనుబోగలవియునైన యగ్నినుండి బుట్టిన గుజ్జములచే, చక్కగను వంకరగను చక్రముననుసరించి పోవువాడై యీ కుమారుడు (చంద్ర సారథి) కదలిపోవుచుండును. తరువాత ఆంగిరసుడును, విద్వాంసుడును, దేవాచార్యుడునైన బృహస్పతి యెట్లని గుఱ్ఱములతో బంగారు రథముతో (నాకాశమున) కదలిపోవును. దివ్యములు, వాయువేగములునైన న యెనిమిది గుఱ్ఱములచే బూన్చబడినదై నక్షత్రమున సంవత్సరముండును. వేగము గలదై యా నక్షత్రముతోనే వెళ్ళును. తరువాత శనైశ్చరుడు గూడ, ఆకాశమున బుట్టి చిత్ర వర్ణములు గల గుజ్జములతో నల్ల యినుము రథమునెక్కి మెల్లిగా వెళ్ళును. అట్లే రాహువు యొక్క గుజ్జములు మనోవేగము గలిగి నల్లనైన యెనిమిది గుజ్ఞములు అవి తమయమైన రాహు రథమునకు ఒక్కమారు బూన్చబడినవై రథమును లాగికొని పోవును. సూర్యుని నుండి బయలు వెడలిన రాహువు పర్వదినములందు (పూర్ణిమా మావస్యలందు) చంద్రుని జేరును. మరల చంద్రుని నుండి సౌర పర్వతములందు (అమావాస్య పర్వదినములందు సూర్యుని జేరును. ఇక కేతువు యొక్క రథము దాని గుజ్జములు వాయువేగముగల యెనిమిది గింజలేని వరిపోచ వర్ణము గలవి పొగవర్ణముగలవి చిత్రవర్ణము గలవి (కంచరి గాడిద యెరుపుగలవి. ఇవి గ్రహముల యొక్క గుఱ్ఱములు రథములతో బాటు నాచే జెప్పబడినవి. అవి యన్నీయు వాయువుల చేతను కిరణములచేతను బాగుగా కట్టబడినవై ధ్రువుని యందు నిబంధింపబడినవి.

 ఇవి వాయవ్యములైన పోతరశ్ములచే (వాయు కిరణములచేత) బాగుగా గట్టబడినవై త్రిప్పబడుచు యోగముననుసరించి (తమ చుట్టు తామును) తిరుగును. ఆకాశమున ధ్రువునిచే బద్దములై చంద్ర-సూర్యగ్రహములు చుట్టు తిరుగును. ఆ జ్యోతిర్గణములు (తన చుట్టు తాను) తిరుగుచున్న ధ్రువుని ననుసరించి తిరుగుచున్నవి. నదియొక్క జలమున నావ నీటితోబాటు మోయబడినట్లు ఈ దేవాలయములు (గ్రహాదులు) వాయు-కిరణములచే మోయబడును. నాకాశమున నా దేవగణములందరిచే జూడబడుచున్నవి. ఎన్ని నక్షత్రములున్నవి? అన్ని వాయు కిరణములున్నవి. అవి యన్నియు ధ్రువుని కేంద్రము బేసికొని కట్టబడినవై తాము దిరుగుచు ఆతనిని (ధ్రువుని) గూడ ట్రిప్పును. తైలమును (కందెనను) పీడించు చక్రము తాను దిరుగుచు ఇతరమును (రథాదులను) ద్రిప్పునట్లు వాయుబద్ధములైన జ్యోతిస్సులను (చుక్కలను) అంతటను త్రిప్పును. అందువలన జ్యోతీరూపములైన గ్రహనక్షత్రాదులు వాయు చక్రముచే ప్రేరేపింపబడినవై కొఱవి చక్రమువలె తాను పరుగెత్తుచునే గ్రహనక్షత్రాదులను పరుగెత్తింపజేయునని చెప్పబడినది. ఈ విధముగా జ్యోతిరూపములైన నక్షత్ర తారాగ్రహణములు ధ్రువునియందు నిబద్ధమైయున్నవి. ఆ ధ్రువుడుగ ఆకాశమున తారా ఏ (నక్షత్రమయమైన శిశుషామార రూపమని (మొసలి) తెలియదగినది. పగలు చేసిన పాపము రాత్రి యా ధ్రువుని జూచిన వదలిపోవును. ఆకాశమున ఈ శింశుమారము (మొసలి) నాశ్రయించిన తారలెన్ని కలవో అన్ని వర్షములు (సంవత్సరములు) అంతకంటే నెక్కువయును శింశుమారాశ్రితములైన తారలు జీవించును. ఈ శింశుమారము (మొసలి) శాశ్వతమైనది. ఇక విభాగ ప్రకారమైతే శింశుమార రూప ధ్రువునకు చెక్కిలిపై భాగము (ఉత్తరాహనువు) ఉత్తానపాదుడు అని తెలియవలెను.యజ్ఞము (అధర్హనవు) క్రింది చెక్కిలి భాగము అనియు ధర్మము శిరస్సు నాశ్రయించినదనియు, హృదయమున నారాయణుడు సాధ్యుడైయుండుననియు, పూర్వపాదములయందు' అశ్వినీ దేవతలిరువురును. వరుణుడును సూర్యుడును (ధ్రువశింశుమారము యొక్క తొడలయందును ఆశ్రయించియుండును. సంవత్సరము దాని శిశ్నము. అసానమున మిత్రుడు (సూర్యుడు) ఆశ్రయించును. తోకయందు అగ్నియు మహేంద్రుడును ఆశ్రయించియుండును. మరీచి, కశ్యపుడు తారకలును, శింశుమారరూపుడైన ధ్రువుడును ఈ నాలుగును అస్తమించవు, నక్షత్ర, చంద్ర, సూర్యులును తారాగణములతో గూడిన గ్రహములును అన్నియు ఆకాశమున చక్రీభూతమును (మండలమును) ఆశ్రయించినట్లే ఉన్ముఖములుగను అభిముఖములుగను) (పైకి ముఖములుంచిగాని ఎదురెదురుముఖములుంచి గాని)యుండును. ధ్రువునిచే (ఆకాశమున) నిలుపబడినవై యన్ని గ్రహనక్షత్రములును ధ్రువునికే ప్రదక్షిణము జేయును. ఆ ధ్రువుడు వరుడు, శ్రేష్ఠుడు అందరికంటే పైనున్నవాడు. ఆకాశమున మిక్కిలి పైకి వృద్ధి చెందినవాడు. ధ్రువ అగ్ని కశ్యపులలో ధ్రువుడే శ్రేష్ఠుడనబడినాడు. ఈతడొక్కడే మేరు పర్వత శిరస్సున దిరుగును. ఈతడు అవాళ్ముఖుడైన (క్రిందు ముఖముగలవాడై) ఈ జ్యోతిశ్చక్రమునంతయు నెల్లప్పుడాకర్షించును. ఈతడు (ధ్రువుడు) మేరువునకు ప్రదక్షిణముగా బోవును, మేరువును జూచును.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ధ్రువచర్యయను నేబది రెండవ యధ్యాయము.