వాయు మహా పురాణము

Table of Contents

53 -  జ్యోతిః సన్నివేశో

శాంశపాయనుడనెను:- ఇది విని మునులు మరలసంశయము గలవారైరి. అపుడు వారు లోమహర్షణుని (తమప్రశ్నకు) మరల సమాధానమునడిగిరి. ఋషులనిరి మీరు ఈ గృహములు ప్రసిద్దని చెప్పితిరి. అవియే విధముగ దేవగృహములగును. అవి జ్యోతిస్సులేట్లుగును- తెలుపుడు. ఇదియంతయు జెప్పుడు జ్యోతిస్సుల యొక్క నిశ్చయ(సరూప) మును జెప్పుడు అపుడు వారి మాటలను విని సూతుడు ఏకాగ్రచిత్తుడయ్యెను. ఈ విషయములో జ్ఞానబుద్ధులైన మహాప్రాజ్ఞులచే జెప్పబడిన సూర్య చంద్రుల పుట్టుకను నేను మీకు జెప్పబోవుచున్నాను. ఇచట దేవ గృహములు సూర్యచంద్రుల గృహమెట్లయ్యెను? అను విషయము జెప్పబోవుచున్నాను. తరువాత, ఆకాశమునకు సంబంధించినట్టియు, భూతములకు సంబంధించినట్టియు, పృథివికి సంబంధించినదియునై మూడు విధములైన అగ్నియొక్క పుట్టుకను జెప్పెదను. రాత్రి తెల్లవారగనే అవ్యక్తజన్ముడైన బ్రహ్మయొక్క మూలప్రకృతిగానున్న యీ జగము రాత్రి చీకటిచే నావరింపబడినదయ్యెను. ఆకాశాదులైన నాలుగు భూతములకు మిగిలినదైన యీ భూమియందలియగ్ని పార్థివాగ్నియనబడును. మొదటి సూర్యునియందు తపించునది. శుచియను నగ్నియనబడును. వైద్యుతమును (విద్యుత్తు, (మెఱుపు) వల్లవచ్చునగ్నిని గూడ తెలియవలె. ఇక ఆయగ్నుల లక్షణమును జెప్పెదను. వైద్యుతము (మెఱుపువల్ల వచ్చునది) జాఠరము(అన్నజీర్ణకారియై కడుపులో నున్నయగ్ని), సౌరము సూర్యుని నుండి వచ్చు నగ్ని) అని జలగర్భములైనయగ్నులు మూడు కావుననే నీరు ద్రావుచు నీ సూర్యుడు ఆకాశమున వెలుగుచున్నాడు. విద్యుత్తుతోనావేశింపబడిన వృక్ష సంబంధమైన యగ్ని నీటితో జల్లారదు. మానవుల కడుపులో నున్న జాఠరాగ్నియు నీటితో జల్లారదు. మంటలతోగాని వెలుగుతోగానియున్నయగ్ని (సౌరాగ్ని) పరమమైనది. జాఠరాగ్ని (వెలుగులేక) ప్రభావముగలదియనబడినది. మండలాకారమున వేడిలేనిది శుక్లమై (తెల్లనై) ప్రకాశించును.

సూర్యుడస్తమించగనే-సూర్యకాంతియొక్క పావుభాగము అగ్నినావేశించును. కావున రాత్రియందది దూరమునుండి ప్రకాశించును. అగ్ని యొక్క వేడి మరల నుదయించు సూర్యునావేశించును. ఆకారణమున పార్థివాగ్నియొక్క పావుభాగముచే ఈయగ్ని తపించును. కాంతియు వేడియును సూర్యాగ్నుల తేజస్సులు, అవి పరస్పరముగా బ్రవేశించుటచే పగటిని రాత్రిని సంతసింపజేయును. ఉత్తరపు దైనభూమిసగభాగమునను, దానినుండి యీ దక్షిణ(అర్థ) భాగమునను మరల సూర్యుడుదయించుచుండగా, జలములను రాత్రిప్రవేశించును. రాత్రిప్రవేశము వలన జలములు తామ(ఎఱుపు) వర్ణముగలవగును. సూర్యుడు మరలనస్తమించుచుండగా పగలు జలములలో బ్రవేశించును. ఆ కారణమున రాత్రియందైతే తెల్లని జలములు సూర్యునిలో బ్రవేశించును. ఈ క్రమయోగముతో భూమియొక్క దక్షిణోత్తరార్ధ భాగములందు ఉదయాస్తమయములలో నిత్యము పగలు రాత్రియు జలములను బ్రవేశించును, తపించు (ఎండగాయు) చున్న సూర్యునియందు కిరణములచే జలమును ద్రాగుచున్న పార్థివాగ్ని దివ్యమై విమిశ్రమై శుచియనబడును. వేయి కిరణములు గల యాయగ్ని గుండ్రనిదై కుండవంటిదై శుచి యను పేరుగలది. అది తన వేయికిరణములచే నంతట (జలమును) దీసికొనును. ఆశుచియను దివ్యాన్ని నదీ జలములను, సముద్రజలములను, కూపజలములను మెట్టనేలలోని జలములను దీసికొనును. ఆ సూర్యుడు హిరణ్మ (తేజోమ)యుడు. ఆతని వేయికిరణములు వర్షమును, చలిని, వేడిని స్రవింపజేయునవి. ఆరశ్ములలో నాలుగువందలనాడులు చిత్రమూర్తులై వర్షించును. వందనములు (నమస్కారరూపములు) వంద్యములు (నమస్కరింపదగినవి. ఋతవములు (ప్రాచీనములు7) నూతనములు, అమృతములు-ఈ పేరులుగల సమస్తకిరణములును వృష్టిని గలుగజేయునవి. మంచునుప్రవహింపజేయునవియా రశ్ములకంటే వేరైనవి. అవి మూడు వందలు అవి చూడదగినవి. పవిత్రమైనవి. ప్రవహింపజేయునవి. గర్జనములు మెఱుపులు-ప్రవాహములును గలవి. మంచును సృష్టించునవి. చంద్రులను పేరనున్న రశ్ములన్నియు పచ్చని కాంతిగలకిరణములు. శుక్లములు కకుభములు గోవులు, విశ్వభృత్తులు. అనుకిరణములు అన్నియు పేరునకు శుక్లములు. అవి మూడువందలు, వేడిని సృష్టించునవి. ఆ కిరణములచే (ఆశుచియనునగ్ని మనుష్య పితృదేవతలను సమానముగా భరించును. ఔషధములచే మనుష్యులను, స్వధచేత పితరులను, అమృతముచేత దేవతలను ముగ్గురిని మూటిచేత సూర్యుడు తృప్తిబొందజేయును. వసంతగ్రీష్మఋతువులలో ఆ మూడు రకముల కిరణములచేత సూర్యుడు తపించును. వర్ష ఋతువు నందును శరదృతువునందును నాలుగింటిచే లాగును. హేమంత శిశర-ఋతువులలో మూటిచే హిమమును సృజించును. ఓషధులందు బలమును గలుగజేయును. స్వధచేత పితరులను తృప్తిపరచుచు సూర్యుడు అమరత్వమును, అమృతత్రయమును మూటిలో నియమించును. ఈ విధముగా సూర్యసంబంధమైన యావేయి కిరణములు లోకార్థసాధకములు. ఋతువును బొంది జలమునందలి శీతోష్ణ ప్రవాహమును గలుగజేయును-27. విధముగ తెల్లనైప్రకాశించు మండలము సూర్యుడను పేరుగలది. నక్షత్రములకు, గ్రహములకు, చంద్రునకును నిలచుటకు కారణమైనది. నక్షత్రములు, చంద్రుడును గ్రహములును సూర్యునినుండి బుట్టినవనీ తెలియవలెను.

చంద్రుడు నక్షత్రాధిపతి సూర్యుడు గ్రహములకు రాజు, తక్కిన యైదుగ్రహములు కామరూపులగు నీశ్వరులుగా దెలియవలెను-29. అగ్నిఆదిత్యు (అదితి పుత్రుడని పఠింపబడుచున్నది. జలసంభవుడు చంద్రుడనబడినాడు.నారాయణుని బుధగ్రహముగా జెప్పుదురు. జ్ఞానవిదులు ఆతనిని దేవునిగా దెలియుదురు-31. రుద్రుని శనిగను దెలియవలె. అతడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. లోకమున స్వయముగా ప్రభువు మహాగ్రహమై ద్విజశ్రేష్ఠుడై మెల్లిగా బోవువాడు. శనైశ్చరుడు- 32. దేవ-అసురులకు గురువులైన గురు-శుక్రులు కాంతి కిరణములు గలవారై మహాగ్రహములు బ్రహ్మయొక్క పుత్రులు ఈ శుక్రగురువులు. దైత్యుడు దితిపుత్రుడైన రాక్షసుడు) మహేంద్రుడును ఆశుక్ర గురువులు. దైత్యుడు (దితిపుత్రుడైన రాక్షసుడు) మహేంద్రుడును ఆశుక్రగురులకు అధిపతులుగా నిర్మింపబడిరి-33. సమస్త త్రిలోకములు సూర్యుడు మూలముగా గలవి. ఇచట సంశయము లేదు. దేవ-రాక్షసమనుష్యాత్మకమైన జగమంతయు ఈ సూర్యునిదే యగును.

సర్వలోకములలో వ్యాపించియున్న యే(రవి)తేజముగలదో అది రుద్ర-ఇంద్ర-ఉపేంద్ర(విష్ణువు)-చంద్రులయొక్కయు, స్వర్గవాసులైన దేవతలయొక్కయు, కాంతిమంతములైన మరి యితరముల యొక్కయు సమస్తమైన కాంతియే-35. సూర్యుడు సర్వాత్ముడు, సర్వలోకములకీశుడు, సర్వమునకును మూలమైన పరమదైవతమా ఆతనినుండియే సర్వము బుట్టును, ఆతనీయందే లీనమగును-36. పూర్వము లోకముల యొక్క కలిమి లేములు సూర్యుని నుండియే బయలు వెడలినవి. ఓ బ్రాహ్మణులారా! జపముచేదెలియదగినవాడై కాంతిమంతమైన గ్రహము సుగ్రహమైన రవియే-37. ప్రాణులు సూర్యునియందు మృతిజెందుదురు. మరలమరల బుట్టుదురు. గూడను క్షణములు, ముహూర్తములు, దివసములు, (పగళ్ళు), రాత్రులు, పక్షములు, మొత్తమును. నెలలు, సంవత్సరములు, ఋతువులు, సంవత్సరములు, యుగములును వీనికి సూర్యుడు లేనిచో కాలగణనముండదు. కాలములే కున్న, వేదము లేదు, దీక్షలేదు, ఆహ్నికక్రమము లేదు-39. ఋతువుల నామవిభాగమును లేదు. ఇక పుష్పములు మూలమైన ఫలము లుండునా? పంటలు పండుటయుండునా? గుణవంతము లైనమౌషధిగణములుమొదలైనవుండునా?-40. జగమును తపింప జేయునీటి దొంగ (జలమునెండజేయు) సూర్యుడు లేకున్న స్వర్గమర్త్యలోకములలోను దేవతల వ్యవహారములే యుండవు.

ఆ సూర్యుడే కాలము, అగ్ని, ద్వాదశాత్ముడు (పండ్రెండు రూపములుగలవాడు), ప్రజాపతి(బ్రహ్మ), ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! చరాచరములతోనున్న ఈ మూడు లోకములను (స్వర్గమర్త్యపాతాళములను) ఎండగాసి తపింపజేయును-42. ఆయీరవియే సర్వలోకములకు సంబంధించిన తేజస్సులరాశి. వాయువుయొక్క కాంతులచే జగత్తునను, ఉత్తమమైన స్వర్గమునను నిలిచి, ప్రక్కభాగమును, పైభాగమును, క్రింది భాగమును నంతట తపింపజేయును-43. నేనిదివరకే సూర్యుని వేయికిరణములను గూర్చి చెప్పితిని. వానిలో మరి శ్రేష్ఠములైన యేడుకిరణములు గ్రహముల(జన్మల)కు కారణములు 44. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవము, సంపద్వసువు, ఆర్వావసువు, (స్వరాట్)-అనియే యేడు కిరణములిట జెప్పబడినవి-45. సుషుమ్నమను సూర్యరశ్మి క్షీణించిన చంద్రుని వృద్ధిజెందించుచు, తిర్యక్ (అడ్డముగను) ఊర్ధ (పైభాగమునను) ప్రభావముగలదై యిది సుషుమ్నమనబడును-46. హరికేశమను సూర్యరశ్మి ముందుగనే (తూర్పున యుండి నక్షత్రము (పుట్టుక)లకు కారణమనబడినది. దక్షిణమున విశ్వకర్మయను సూర్యకిరణము బుధునివృద్ధి బొందించును 47. పశ్చిమమున విశ్వశ్రవమను సూర్యకిరణము శుక్రగ్రహజన్మకు కారణమని పండితులతో జెప్పబడినది. సంపద్వసువను సూర్యరశ్మి అంగారకగ్రహజన్మకు కారణమైనది-48. ఆరవదైన యర్వావసువను సూర్యరశ్మి గురుగ్రహజన్మకు గారణమైనది. స్వరాట్ అనుసూర్యరశ్మి శనిగ్రహమును దృప్తిపరచును-49. ఈ విధముగ సూర్య ప్రభావమున (సూర్యకాంతిచే) గ్రహములు, నక్షత్రములు, తారకలు అన్నియు తెలియబడినవై వృద్ధిజెందును. ఈ విశ్వమును, ఈ జగమును వృద్ధిజెందును. మరియవి క్షీణింపవు. కావున అవి నక్షత్రములనబడినవి.

పూర్వము కిరణములచేత ఈ క్షేత్రములు పడిపోవును. తరువాత సూర్యుడు నక్షత్రత్వమును బొంది వారిక్షేత్రములను స్వీకరించును-51. ఈ లోకమున, పుణ్యము చేత తరించిన తారలు పుణ్యము క్షీణింపగా గ్రహము నాశ్రయించుటవలనను తెల్లవైనందునను ఇవి(నక్షత్రములు) తారలకు చీకటినుండి తరింపజేయునవైనందునను తారకలైనవి-52. దివ్యములైనవి యు (ఆకాశముననున్నవియు), భూమి పైనున్నవియు రాత్రికి సంబంధించినవియు నైన చీకటులను తేజస్సులను ప్రతినిత్యము ఆదానము (చీకటుల ఖండించుటను, తేజస్సులను స్వీకరించుటను జేయుటచే సూర్యుడు ఆదిత్యుడైనాడు-53. సుధాతువు స్పందనార్థము గలదిగ భావింపబడును. తేజస్సును నీటిని(ఎండచే) కందిలింపజేయుట వలన సూర్యుడు సవిత యనబడును 54. 'చంద్ర' యనుశబ్దము బహ్వర్థకము, చది ధాతువు ప్లనము (సంతోషమున) తెలుపు దనము అమృతత్వము శీతత్వము ఈయర్థములలో భావింపబడును-55. సూర్యచంద్రులయొక్క మండలములు దివ్యములు (ఆకాశమున నుండునవి), ప్రకాశవంతములు, ఆకాశమున బోవునవి. మండుచున్నతేజముతో నిండినవి. తెల్లనివి, గుండ్రని కుండతో బోలినవి, మంగళకరములైనవి-56. అందులో చంద్రుని మండలఘనీభూతమైన జలరూపమనబడినది. సూర్యుని మండలము ఘనీభూతతేజోరూపము. తెల్లనిది-57. సమస్తదేవతలు ఈ స్థానములందంతటను బ్రవేశింతురు. అన్నీ మన్వంతరములలోను నక్షత్రసూర్యగ్రహములనాశ్రయింతురు-58. అవి దేవగృహములే ఆదేవతల పేరులుగలవి యగును. సౌరమండలము సూర్యుడు ప్రవేశించిన స్థానము చంద్రమండలము అట్లే చంద్రుడు ప్రవేశించిన స్థానము-59. శుక్రమండలము శుక్రుడు ప్రవేశించిన స్థానము ఆతడు పదునాఱువెలుగులులవాడై ప్రతాపవంతుడు. గురుమండలము గురువు ప్రవేశించిన స్థానము. అంగారక మండలము అంగారకుడు ప్రవేశించిన స్థానము, శని మండలము శనిదేవుని స్థానము-60. సూర్యకిరణ సంయోగములవలన తక్కిన గ్రహములన్నియు వెలుగుగలవి యనబడినవి. సూర్యుని విష్కంభము(విరివి) వృత్తవ్యాసము) తొమ్మిదివేల యోజనము లనబడినది-61. ఆ సూర్యుని విస్తారము మండలమున్ను పైదానికి మూడింతలు. సూర్యుని విస్తారమునకన్న చంద్రుని విస్తారము రెండింతలనబడినది. రాహువుయొక్క విశాలమైన స్థానము చీకటిమయముగా నిర్మింపబడినది. అది పర్వములలో సూర్యుని నుండి వెడలి చంద్రుని జేరును-64. చంద్రుని నుండి సూర్యుని జేరును. మరల పర్యాయములలో మరల చంద్రుని జేరును. ఆకాశకాంతిచే ప్రేరేపించును గాన స్వర్భానువనబడుచున్నాడు-65, చంద్రుని యొక్క పదునారవ భాము శుక్రుడని విధింపబడినది. ఈ పదునారవ భాగము వ్యాసమునుండిగాని, మండలమునుండిగాని, యోజనము చివరినుండి గాని ప్రామాణికమని తెలియవలె-66. శుక్రునికంటెగురువు పావుతక్కువవాడు. గురువుకంటే కుజశనులిద్దరును పావుతక్కువ వారనబడిరి. విస్తారమునుండిగాని, మండలమునుండిగాని కుజశనులకంటే పావుతక్కువవాడు. బుధుడు 67. తారానక్షత్ర రూపములై శరీరము (ఆకారము) దాల్చినవన్నియు విస్తారమునుండి గాని మండలమునుండిగాని బుధునితో సమతుల్యములు-68. తత్యజ్ఞానిసామాన్యముగా చంద్రయోగములును విద్యావృక్షములును తారా నక్షత్రరూపములును పరస్పరము తక్కువగా జెప్పును-69. రెండువేల మూడువందల నలుబదియైదువందల (234500) యోజనములు పరస్పరముగ పూర్వాపనికృష్టములైనవి (తక్కువైనవి) మండలములు సము యోజనములు తక్కువనిగూలవు. అంతకు తక్కువని లేవు-70. వానికి పైననుండి దూరముగా బోవునట్టి మూడు గ్రహములు శని, గురువు, వక్రగ్రహమున్ను ఇవి మెల్లెగా చరించునవి 71. వాని కంటే క్రిందవేరైనవి నాలుగు మహాగ్రహములు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడును ఇవిశీఘ్రముగా (తొందరగా)చరించుగ్రహములు-72. ఎన్నికోట్ల తారకలున్నవో అన్ని కోట్ల నక్షత్రములు అంతటను గలవు. వానికి వీధులనియముగలదు. ఈ రీతిగ నక్షత్రమార్గము వ్యవస్థీకరింపబడినది-73. సూర్యుని యొక్క నీచ-ఉచ్చభావములలో అయనక్రమము ననుసరించి యానక్షత్రవీధులందే గమనముండును. పర్వములందు చంద్రుడు ఉత్తరాయణ మార్గమునందున్నపుడు, బుధుడు బుధస్థానమును, రాహువు రాహుస్థానమును బట్టుకొనియుందురు-74. పుణ్యాత్ములయొక్క నక్షత్రములు అన్ని నక్షత్రములు ప్రవేశించును. పుణ్యాత్ముల యొక్క గ్రహములన్నియు ఈయన్ని జ్యోతిస్సులను బ్రవేశించును-75. బ్రహ్మచే నిర్మింపబడి, కల్పాదియందు ఏర్పడిన యీ స్థానములు భూతప్రళయము వరకును ఉండును 76, అన్నిమన్వంతరములలోను దేవాలయములను అభిమానులు భూతప్రళయము వరకు ఉందురు.

భావ్యభావ్యులై (ఉండదగినవారు ఉండదని వారునై) గడచిపోయిన సురాసురులతోబాటు దేవతలు గడచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతోబాటు దేవతలు గడిచిన వారగుదురు. వర్తమానులైన తమ సురులతో బాటువారీ స్థానములును దేవస్థానములు) ఉండును-78. ఈ మన్వంతరమున గ్రహములు వైమానికులనబడిరి. వైవస్వతమన్వంతరమున అదితి పుత్రుడైన వివస్వంతుడు సూర్యుడు-79. త్విషిమంతుడై (కాంతిమంతుడై) ధర్మపుత్రుడైన సోమదేవుడు వసువన బడినాడు. భృగువంశీయుడై దేవుడైన శుక్రుడు రాక్షసరాజగురువు-80. గొప్ప తేజస్సుగలిగిదేవుడైన అంగిరసుని పుత్రుడగు ఆంగిరసుడు (గురువు) దేవగురువన బడినాడు. మనోహరుడైన బుధుడు త్విషి (కాంతికిరణ) పుత్రుడనబడినాడు. వికల్పము నుండి అగ్నిపుట్టెను. యువకుడైన యీ యగ్నియంగారకుడన బడెను. నక్షత్ర - ఋక్షములతో బోవువారు దాక్షాయణులన బడిరి-82. సింహికాపుత్రుడైన రాహువు భూతములను సంతపింపజేయురాక్షసుడు. వీరందరు చంద్ర ఋక్ష గ్రహసూర్యులం దభిమానులుగా జెప్పబడినారు.

ఇక ఈ స్థానములు చెప్పబడినవి. ఆ స్థానములు గల దేవతలు గూడ జెప్పబడినారు. సహస్ర కీరణుడైన వివస్వంతుని యొక్క (సూర్యుని యొక్క) స్థానము శుక్లము (తెల్లనిది) అగ్నిమయముగూడను-84. వేయికిరణములు గల సూర్యుని (యొక్క) కాంతియొక్క స్థానము జలమయము. తెల్లనిదే యైయుండును. తరువాత నల్లనిది మనోహరుడైన పంచరశ్మియొక్క గృహము (ఐదు కిరణములయొక్కగృహము)గా జెప్పబడినది-85. శుక్రుని యొక్క స్థానముగూజలమయము. అది షోడశరశ్మివత్తు పదునాలు కిరణములు గలది. తొమ్మిదికిరణములుగల యువకుడైన యంగారకుని యొక్క స్థానము జలమయము. తొమ్మిది కిరణములుగలది-86. పండ్రెండు కిరణములుగల బృహస్పతి(గురువు)యొక్క స్థానము జలమయమును, విశాలమైనదియు, పచ్చనైనదియునగును. ఎనిమిది కిరణములుగల బుద్దునియొక్క గృహము (స్థానము) జలమయమై నల్లనైనది-87. రాహువుయొక్క స్థానము చీకటినిండినదై భూతములను (ప్రాణులను) పీడించుస్థానము తారకలన్నియు జలమయములై ఒకే కిరణముగలవిగా తెలియదగినవి-88. పుణ్యకీర్తులకాశ్రయమైనవి, రంగులో మంచి తెల్లనివి. ఘనీభవించి జలరూపములు, కల్పాదిలోవేదములచే నిర్మింపబడినవి-89. ఎత్తైనందున ప్రకటించినకిరణములచే తొందరగా గనబడును. అట్లే దక్షిణమార్గమునందున్న వాడై (నీవిప్రోకముడి) వీధినాశ్రయించిన వాడట్లే కనబడును.

భూమియొక్క రేఖతో నావరింప(జుట్ట)బడిన సూర్యుడు పూర్ణిమ అమావాస్యలందు కనబడడు. కాలానుగుణముగా నస్తమించును-91. అందువలన ఉత్తరమార్గమందున్న చంద్రుడు అమావాస్యలో జూడబడడు. కాని దక్షిణమార్గమందున్న చంద్రుడు నియమముగా జూడబడడు-92. విషువద్దినములందు (రాత్రిపగలు సమముగానున్న దినములందు) సూర్యచంద్రు లిద్దరును, జ్యోతిస్సు(నక్షత్రము)లగతి యోగముచే సమానకాలమున నస్తమయమును సమానకాలమున నుదయయును గలవారగుదురు-93. ఉత్తరమార్గములందు అంతరము (భేదము) లేని యస్తమ యాదయములు గలవారై జ్యోతిశ్చక్రము (నక్షత్రచక్రము) ననుసరించు వారగుదురని తెలియవలె-94. సూర్యుడు దక్షిణాయన మార్గమందున్నపుడు ఆ సూర్యుడన్ని గ్రహములకంటె క్రిందుగా చరించును-95. చంద్రుడు విశాలమండలము జేసికొని సూర్యునకు పైన చరించును. సమస్త నక్షత్రమండలము చంద్రునికంటె పైగా చరించును-96. నక్షత్రముల కంటే పైనబుధుడు, బుధునికంటే పైన గురువును గురునకంటే పైన శనియు, శనికంటే పైన సప్తర్షిమండలమును, ఆసప్తర్షిమండలమునకంటే పైనధ్రువుడును నిలువరింపబడి యున్నారు-97. ఊర్ధ్వభాగమున తారాగ్రహముల యంతరములు (మధ్య దూరములు) రెండు లక్షలయోజనములలో యథాక్రమముగ నుండును-98. గ్రహములు, చంద్ర సూర్యులను ఆకాశమున దివ్య తేజస్సుతో నియమ క్రమము ననుసరించి నిత్యనక్షత్రములతోగూడును. అచటికి వెడలును-99. గ్రహములు నక్షత్రములు సూర్యుడును నీచలోను ఉచ్చలోను మార్దవములోను ఉన్నవారై వారికలయికలోను విడువడినప్పుడును ప్రజలను ఒక మారు జూతురు-100. వీరు పరస్పరముగా (ఒకరిస్థానమున మరొకరుగా)నుందరు. పరస్పరముగా గలిసియుందురు. పండితులు వారి సంయోగమును సంకరముగ భావింపరాదు. సహయోగమునే తెలియవలెను-101. అని యీ విధముగా భూమిపై గ్రహనక్షత్ర సూర్యులున్న జ్యోతిస్సుల యొక్కయు ద్వీపముల యొక్కయు, సముద్రముల యొక్కయు, నదుల యొక్కయు, పర్వతముల యొక్కయు అట్లే వర్షముల యొక్కయు, నదుల యొక్కయు, సన్నివేశము మీకు ఓ ముని బ్రాహ్మణులారా! చెప్పబడినది. ఈ గ్రహములే పూర్వము నక్షత్రములందుండి యుదయించిరి- 103. చాక్షుషమన్వంతరమున వివస్వంతుడును. అదితి పుత్రుడును. గ్రహములలో మొదటగ్రహమైన సూర్యుడు విశాఖానక్షత్ర గణమున బుట్టెను-104. త్విషిమంతుడు (కిరణవంతుడు) ధర్మపుత్రుడును. సోముడును విశ్వావసువును, శీతరశ్మియునైన చంద్రుడు కృత్తికానక్షత్రగణమున బుట్టెను-105. పదునారు కిరణములు గలవాడును, భృగుపుత్రుడును, సూర్యుని తరువాత తారా గ్రహములలో శ్రేష్ఠుడును ఐన శుక్రుడు పుష్యమి నక్షత్రమున బుట్టెను-106. ఆంగీరసపుత్రుడును. పండ్రెండు కిరణములు గలవాడును జగద్గురవైన బృహస్పతి గ్రహము ఫల్గునీ నక్షత్రగణములన్నింటను బుట్టినాడు-107. తొమ్మిది కిరణములుగలిగి. ప్రజాపతిసుతుడై, గ్రహమైన అంగారకుడు పూర్వాషాఢ నక్షత్రగణమందు బుట్టెను-108. ఏడు కిరణములు గలిగి, సూర్యపుత్రుడైన శనేశ్వరుడు రేవతీ నక్షత్రగణమందు బుట్టెను. రోహిణీ నక్షత్రగణమందు రాహుకేతుగ్రహములు బుట్టిరి-109. వీనిని తారలు గను (నక్షత్రములుగను) గ్రహములుగను దెలియవలెను. శుక్రాది గ్రహములు జన్మనక్షత్ర పీడలందు పైగుణమును బొందినందున గ్రహభక్తులలో) వారు ఆదోషముతో స్మృశింపబడుదురు.

 ఈ గ్రహములన్నింటికిని ఆదియైనవాడు ఆదిత్యుడనబడినాడు, తారాగ్రహములకు శుక్రుడు మొదటివాడు. కేతువులకు ధూమకేతువు మొదటివాడు. నలుదిక్కుల విభజింపబడిన గ్రహములకు కాలరూపుడైన ధ్రువుడే మొదటివాడు. నక్షత్రములకు ధనిష్ణానక్షత్రము మొదటిది. ఆయనములకు ఉత్తరాయణము మొదటిది-112. ఐదేండ్లకు సంవత్సరము మొదటిది. ఋతువులకు శిశీఋతువు మొదటిది. మాసములకు మాఘమాసము మొదటిది-113. పక్షములకు శుక్లపక్షము. తిథులకు ప్రతపత్తు రాత్రింబగళ్లకు పగలును మొదటివిగా జెప్పబడినవి-114. ముహూర్తములలో రుద్రదేవతాకమైన ముహూర్తము మొదటిది కనుల రెప్పపాటు కాలము కాలమునకు మొదటిదని కాలవేత్తకు సమ్మతమైనది-115. ధనిష్టా నక్షత్రము మొదలు శ్రవణానక్షత్రమువజకు జంటపంచవార్షిక మగును. అది సూర్యుని గతి విశేషముతో చక్రమువలె దిరుగును. కావున సూర్యుడు కాలమనబడినాడు. కావున సూర్యుని నీశ్వరునిగా దెలియుము. సూర్యుడు నాలుగువిధములైన (ప్రృధివి జల అగ్ని వాయు రూపములైన) భూతములకు పనులలోనుంచువాడును పనులనుండి తీసివేయువాడును అగును-117. ప్రయోజననిశ్చయము వలన ఈజ్యోతిస్సుల సన్నివేశమే లోకవ్యవహారముకై యీశ్వరునిచే నిశ్చయింపబడినది-118. శ్రవణముచే బుట్టిన యితడు ధ్రువునిలో సంక్షిపుడైనాడు. అంతట చివరలకు వ్యాపించిన వాడై వృక్షకారుని గానున్నవాడు-119. బుద్ధిపూర్వకముగా భగవంతునిచే కల్పాదిలో నీవిధముగా జెప్పబడినాడు. ఆతడాశ్రయముగలవాడు. అభిమాని అందరిని జ్యోతిస్వరూపుడు విశ్వరూపుడు, వీడు ప్రధానముగా జెప్పబడినాడు. ఆతడాశ్రయంగ గలవాడు. అభిమాని అందరికిని జ్యోతి స్వరూపుడు. విశ్వరూపుడు, వీడు ప్రధానము (ప్రకృతి)యొక్క యద్భుతపరిణామమైన వాడు-120. మనుష్యులందు జ్యోతిస్సుల (గ్రహనక్షత్రాదుల) రాకపోకలను నిజముగా మాంసనేత్రములతో జూచి లెక్కించి చెప్పుటకు సాధ్యపడదు-121. పండితుడు వేద ప్రమాణము వల్లను ప్రత్యక్ష ప్రమాణము వల్లను అనుమానప్రమాణము వల్లను, హేతువువల్లను నిపుణముగా భక్తితోను పరీక్షించి శ్రద్ధవహింప(నమ్మ) వలెను-122. జ్యోతిర్గణమును విచారించునపుడు కన్ను శాస్త్రము, జలము, వ్రాయదగినది. గణితము, బుద్ధి సత్తములు (మహాబుద్ధిమంతులు) ఈయైదును హేతువులుగా దెలియదగినవి.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జ్యోతి:సన్నివేశమను నేబదిమూడవ యధ్యాయము.