వాయు మహా పురాణము
33 - స్వాయంభువంశానుకీర్తనం
సూత ఉవాచ:-
సూతుడనెను:- భూత భవిష్యత్కాలపు మన్వంతరముల యన్నింటిలోను ఇచట నామరూపములలో సమానాభి మానములు గలిగి-1, అనేక విధములైన యే దేవత లందరు బుట్టిరో వారు ఆ మన్వంతరమున అధిపులు ఋషులును మానవులు గూడ నందరును (దేవతలవలెనే) సమానముగా (నామరూపములలో) నభిమానులు-2. మహర్షుల సృష్టి చెప్పబడినది. ఇక స్యాయంభువ మనువుయొక్క వంశము ననుక్రమముగా విస్తారముగా జెప్పెద వినుడు-3.
స్వాయంభువ మనువునకు ఆతనితో సమానులైన పదుగురు పుత్రులుండిరి. వారిచేత సప్త ద్వీపములు గలిగి సముద్రములు నిధులు గలిగిన యీ భూమియంతయు ప్రతి సంవత్సరము వ్యాపించి నివాసముగా జేసికొనబడినది-4 అపుడు స్వాయంభువ మన్వంతరమున మొదటి త్రేతాయుగము-5.
ప్రజాసృష్టికి తగిన తపము యోగముగల వారును, స్వాయంభువునకు పౌత్రులును (మనుమలును) ఐన, ప్రియవ్రతుని పుత్రులచే ఈ భూమియంతయు నివాసభూమిగా జేసికొనబడినది-6. వీరుడైన ప్రియ వ్రతునివల్ల సంతానవంతులైనారు. స్వాయంభువ మనువునకు కన్య (దేవహూతి) కలిగెను. ఆ మహాభాగ్యవంతురాలు కర్దమ ప్రజాపతికి భార్యయైనది-7. (ప్రియవ్రతునకు?) సమ్రాట్, కుక్షియను వారలిరువురు కన్యలును, నూరుగురు పుత్రులును గలిగిరి. ఆ యిరువురి కన్యల సోదరులైన పదుగురు శూరులు ప్రజాపతితో సమానులును-8. వారు (1)అగ్నీధ్రుడు, (2)వపుష్మంతుడు, (3)మేధుడు (4)మేధాతిథి (5)విభువు, (6)జ్యోతిష్మంతుడు (7)ద్యుతిమంతుడు, (8)హవ్యుడు, (9)సవనుడు (10)సర్వుడు అనువారు-9. ప్రియవ్రతుడు ధర్మప్రకారముగా నీ యేడుగురిని ఏడు ద్వీపములందు పట్టాభిషిక్తులను జేసెను. ఆ ద్వీపముల వినుడు-10.
ప్రియవ్రతుడు - మహాబలుడైన అగ్నీధ్రుని జంబూద్వీపమునకు రాజుగా జేసెను. మేధాతిథిని ప్లక్షద్వీపమునకు రాజుగా జేసెను-11. వపుష్మంతుని శాల్మల ద్వీపమునకు పట్టాభిషిక్తుని జేసెను. జ్యోతిష్మంతుని కుశద్వీపమునకు రాజుగా జేసెను–12. ద్యుతి మంతుని క్రౌంచద్వీపమునకు రాజుగా జేసెను. హవ్యుని శాకద్వీపమునకు రాజుగా జేసెను -13. సవనుని పుష్కరద్వీపమునకు రాజుగా జేసెను.
పుష్కర ద్వీపమున సవనునకు మహవీతుడను పుత్రుడు కలిగెను. (మహావీతుడు) ధాతకియును అను నీయిరువురు పుత్రవంతులు శ్రేష్ఠులైన పుత్రులు -14. మహాత్ముడైన యాతని పేర మహావీత వర్థమని యాదేశము పిలువబడినది. ధాతకియను పేర ధాతకీ ఖండమని కూడ యాదేశము పిలువబడినది-15.
ప్రభువైన హవ్యుడు శాకద్వీపరాజులైన పుత్రులను గనెను. వారు జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మణీచకుడు, వసుమోదుడు, సుమోదాకుడు, మహాద్రుముడు-అనునేడుగురు-16. జలదునిది జలదవర్షము (దేశము) మొదటిది. కుమారునిది కౌమారవర్షము రెండవది-17 సుకుమారునిది సుకుమారవరము మూడవది, మణీచకునిది మణీచకవర్షము నాల్గవది వసుమోద వర్షము ఐదవది, మోదాకునిది మోదాకవర్షము ఆజవది. మహాద్రుమునిది మహాద్రుమవర్షము ఏడవది. వీరియొక్క నామములతోనే యేడుపర్వములు (దేశములు) ప్రసిద్ధినొందినవి -20.
క్రౌంచద్వీప రాజైన ద్యుతిమంతునకు గూడ పుత్రులున్నారు. వారు కుశలుడు, మనుగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారుడు, మునిదుందుభి-యనువారు ఏడుగురు ద్యుతిమంతుని పుత్రులు -21. వారి స్వనామములతో వెలసి క్రౌంచద్వీపాశ్రయములైన దేశములు శుభములు. ఉష్ణుని దేశము ఉష్ణమనబడినది. పీవరునిది పీవరమనియు-22. అంధకారకుని దేశము అంధకారమనియు, మునియొక్క దేశము మునియనీయు, దుందుభిది దుందుభియనియు అనబడినవి. క్రౌంచద్వీపములోని యీ యేడు దేశములు భాస్వరములు ప్రకాశవంతములు -23.
కుశద్వీపమున జ్యోతిష్మంతునకు చక్కని మహాతేజస్వులైన యేడుగురు పుత్రులు వీరు- ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరథుడు, లవణుడు, ధృతి, ఆరవవాడు ప్రభాకరుడు, ఏడవవాడు, కపిలుడును అనువారు -24. మొదటి వర్షము (దేశము) ఉద్భిదము, రెండవది వేణుమండలము. మూడవది స్యైరథాకారము. నాలుగవది లవణము. అనబడినది-25. ఐదవది. ధ్రుతిమద్వర్షము ఆజవది ప్రభాకర వర్షము, ఏడవది కపిలునిది కపిలమనబడినది -26. కుశద్వీపములోనున్న వారి ద్వీపములు వారి పేరులతోనే వెలసినవి. అవి బ్రహ్మచర్యాది ఆశ్రమములయాచారములతో గూడిన ప్రజలచే నలంకరింపబడినవి -27.
(శాల్మలరాజైన) వపుష్మంతుని పుత్రులు ఏడుగురు వారుశాల్మల ద్వీపాధిపతులు వారు- శ్వేతుడు, హరితుడు, జీమూతుడు, రోహితుడు, వైద్యుతుడు, మానసుడు, ఏడవవాడు సుప్రభుడు అనువారు-28. శ్వేతునిది శ్వేతదేశము రోహితునిది రోహితము జీమూతునిది జీమూతము హరితునిది హారితము-29. వైద్యుతునిది వైద్యుతము మానసునిది మానసము. సుప్రభునిది సుప్రభము. ఈ ఏడుగురు ఈ దేశములకు పాలకులు-30.
జంబుద్వీపము తరువాత సప్తద్వీపమున (సముదాయమున) జరిగిన విషయమును జెప్పెదను. ప్లక్ష ద్వీపాధిపతియైన మేధాతిథి యొక్క పుత్రులు ఏడుగురు ప్లక్ష ద్వీపరాజులైరి-31. వారిలో జ్యేష్ఠుడు శాంతభయుడు ఆ ఏడు వర్షములను (దేశములను) ఏలెను. ఆ శాంత భయుని తజువాత శిశిరుడు, సుఖోదయుడు, ఆనందుడు, ధ్రువుడు, క్షేమకుడు, శివుడు అనువారు ఆ ఏడు వర్షములనేలిరి-32. ఆ యేడు వర్షములు ఏడు భాగములుగా వారి వారి పేరులతోనే పూర్వము స్వాయంభువమన్వంతరమున పరిపాలింపబడినవి -33.
ప్లక్ష ద్వీపమున సప్తద్వీప నివాసులైన మేధాతిథి పుత్రులచేత ప్రజలు వర్ణాశ్రామాచారములతో గూడిన వారుగా జేయబడిరి-34. ప్లక్ష-శాల్మల-కుశ-క్రౌంచ-శాకద్వీపములైదింటిలోనే వర్ణాశ్రమవిభాగము ప్రకారము ధర్మముండెనని తెలియదగును-35. సుఖము, ఆయువు, రూపము, బలము, ధర్మమున్ను ఈ ఐదు ద్వీపములందునిత్యము సర్వ సాధారణముగా నుండెడివనీ తెలియబడినది-36.
ఏడు ద్వీపములతో జుట్టియున్న జంబూద్వీపమును గూర్చి వినుడు. ఆగ్నీధ్రుడు జ్యేష్ఠదాయాదుడు ద్రాయభాగమును హరించువాడు). కన్యాపుత్రుడు మహాబలుడు. ప్రియవ్రతుడు ఆతనిని జంబూద్వీపమునకధిపతియైన రాజునుగా పట్టాభిషిక్తుని జేసెను-37. ఆతనికి తొమ్మండుగురు పుత్రులుండిరి. వారు బ్రహ్మాతో సమానమైన తేజముగలవారు. వారిలో జ్యేష్ణుడు నాభియను వాడుగా బ్రసిద్ధిజెందెను. ఆతని తమ్ముడు కింపురుషుడనువాడు -38. మూడవ వాడు హరివరుడు నాలుగవవాడు ఇలావతుడు. ఐదవ కుమారుడు రమ్యుడు. ఆరవవాడు. హరిన్మంతుడు -39. ఏడవవాడు కురువు. ఎనిమిదవవాడు. భద్రాశ్వుడు. తొమ్మిదవ వాడు కేతుమాలుడు- అనువారు వారిదేశములను వినుడు -40.
అగ్నీధ్రుడు తన మొదటి కుమారుడైన 'నాభి'కి 'హిమ'మను పేరుగల దక్షిణ వర్ష (దేశమునిచ్చెను. కింపురుషునకు హేమకూట వర్షదేశము నిచ్చెను-41. హరివరునకు నైషధమను వర(దేశమునిచ్చెను. ఇలావృతునకు మేరువుయొక్క మధ్యదేశమునిచ్చెను. రమ్యునకు నీలమను వర్షదేశమునిచ్చెను. హరిన్మంతునకు (పైదానికి) ఉత్తరపుదైన శ్వేతమను వర్షదేశమునిచ్చెను-43. కురువునకు శృంగవంతపుటుత్తర దేశమునిచ్చెను. భద్రాశ్వునకు మాల్యవ ద్వదేశము నిచ్చెను 44. కేతుమాలునకు గంధమాద వర్షదేశ)మునిచ్చెను. ఇవి యిట భాగములుగా గొప్పవైన తొమ్మిది వర్ష (దేశములు-45. ధర్మాత్ముడైన ఆగ్నీధ్రుడు వరుసగా తన పుత్రులను పైన జెప్పిన యన్ని (తొమ్మిది) దేశములలో నభిషేకించి తాను తపమున నుండెను -46. ఈ విధముగా స్వాయంభువుని పౌత్రులైన ప్రియవ్రతుని యీ యేడుగురి పుత్రులచే సమస్తములైన సప్తద్వీపములు రాజ్యము చేయబడినవి-47. కింపురుషాదులైన యెనిమిది శుభవర్షదేశములేవి కలవో వానియొక్క సిద్ధ స్వభావసిద్ధముగనే యత్నము లేకుండగనే సుఖముతో నిండినది-48. ఆదేశములలో సుఖవ్యతిరేకమైన దుఃఖము లేదు. ముసలితనము మరణము-వీని భయము లేదు. ఆ క్షేత్రములలో ధర్మాధర్మములు ఉత్తమ-అధమ-మధ్యమములును యుగావస్థయును లేవు. (వీని కతీతములా క్షేత్రములు) -49.
హిమవర్షమున నాభియను నాతని సృష్టిని జెప్పుదును. దానిని వినుడు. మహాద్యుతి యైన 'నాభి' మేరుదేవియందు ఋషభుని గనెను. ఋషభుడు సమస్తక్షత్రియజాతికి మొదటి వాడైన రాజశ్రేష్ఠుడు-50. ఋషభుని వలన భరతుడుపుట్టెను. ఆతడు వీరుడు నూరుగురు కుమారులలో మొదటివాడు భరతుడు తన పుత్రునకు రాజ్యాభిషేకముజేసి సన్యాసమును స్వీకరించేను-51. ఋషభుడు దక్షిణ హిమవర్ష(దేశమును భరతున కిచ్చినందున దీనిని భారతవర్షదేశ) మనుపేర పండితులు పిలిచిరి-52. భరతుని కుమారుడు విద్వాంసుడు ధార్మికుడునైన సుమతియను వాడు భరతుడు తన రాజ్యమునాతని కిచ్చెను. పుత్రునకు రాజ్యమును సంక్రమింపజేసి భరతుడు వనమునకు వెళ్లాను-53. తేజసునకు పుత్రుడు శత్రుజేతయైన ప్రజాపతి. తేజసుని మనుమడు జాపతిపుత్రుడు) విద్వాంసుడైన ఇంద్రద్యుమ్నుడు-అనితెలియబడినది-54. తండ్రి మరణానంతరమింద్రద్యుమ్నుడు అందరికిని సుందరుడుగా నుండెను. ఆతని వంశమున నాతనికి ప్రతీహారకులమున 'ప్రతిహర్త' యను పేర పుత్రుడు గలిగెను-55. ప్రతిహర్తకు భూమినుండి ఉన్నేతయను పుత్రుడు కలిగెను. ఉన్నేతకు ఉధీథుడు, ఉధీథునకు, ప్రతావియనువాడును గలిగిరి-56, ప్రతావికి విభువు, విభువునకు పృథువు, పృథువునకు నక్తుడు, నక్తునకు గయుడు, గయునకు నరుడు, నరునకు విరాట్టు, విరాట్టునకు మహావీర్యుడు, మహావీర్యునకు దీమంతుడు బుట్టిరి-58. ధీమంతునకు మహానుడు, మహానునకు భౌవనుడు, భౌవనునకు త్వష్ట, త్వష్టకు అరిజుడును బుట్టిరి-59. అర్జునకు రజుడు రజునకు శతజిత్తు, బుట్టిరి. శతజిత్తునకు నూరుగురు పుత్రులు గలిగిరి. వారందరును రాజులే యైరి-60. ఎవరి చేత ఈ ప్రజలు విశ్వజ్యోతి:ప్రధానులుగా (విశ్వజ్యోతిని వెలిగించుటయే ప్రధానలక్ష్యము గలవారుగా) వర్ధిల్లజేయబడిరో, వారి చేత ఈ భారతవర్షదేశము ఏడు ఖండములు గలదిగా పూర్వము చేయబడినది-61 వారి వంశమునబుట్టిన వారి చేతనే యీ భారత భూమి కృత త్రేతాదులతో గూడిన డెబ్బది యొక్కయుగములు పరిపాలింపబడినది-62. ఏ రాజులు ఆయుగములతో బాటు తాము గతించిరో వారు పూర్వము స్వాయంభువమన్వంతరమున వందలువేలుగానుండి యా వంశమునకు జెందినవారే-63. ఇది స్వాయంభువసృష్టి. దీనిచే జగమునిండినది. ఋషులచేతను, దేవతలచేతను, పితరులచేతను, గంధర్వులచేతను రాక్షసులచేతను-64. యక్ష-భూత-పిశాచులచేతను, మనుష్య-మృగపక్షులచేతను వారి యీ సృష్టిలోకమున యుగములతో బాటు మారుచుండును-65.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున స్వాయంభువ వంశానుకీర్తనమను ముప్పదిమూడవ యధ్యాయము 33.
