వాయు మహా పురాణము
40 - భువనవిన్యాసో
సూతుడు పలికెను:- మర్యాద పర్వతమై(సరిహద్దుపర్వతమై) శుభ్రమైన దేవకూట పర్వతము గలదు. విశాలమైన శిఖరము గల యా పర్వత శ్రేష్ఠపు శిఖరమున-1. అంతట నూరు యోజనములు గలిగి, మహా భవనములచే నలంకరింపబడి, బుద్ధిమంతుడైన సుపర్ణుడైన వినతాసుతుడైన గరుడుని యొక్క జన్మక్షేత్రము గలదు-2. వేగ విక్రమము గలిగి, సంపూర్ణ వీర్య సంపద గలిగి, శత్రువులను దమింప జేయగలిగి, సర్పశత్రువులైన గరుడ వంశ సంభవములైన యనేక మహాపక్షి గణములచే మొదట గూడియున్న ఆ మహాత్ముడైన పక్షిరాజు(గరుడుని) యొక్క భవనము అచట గలదు. ఆ పక్షిరాజు మహా వాయువేగము గలవాడు, శాల్మలి ద్వీపనివాసి-3,4, ఆ దేవకూట పర్వతము యొక్క శిరోభాగము సుందరము. దాని మహా సంపన్నమైన దక్షిణ(కుడి) శిఖరములు విచిత్రములు, ఏడు-5, అచట ఏడు గంధర్వ నగరములు గలవు, అవి సంధ్యారాగము వలె నెఱ్ఱని కాంతిగలవి. గుమికూడి పైకెగసి నట్లుండును. బంగారు ప్రాకారములతోను తోరణముల తోను కూడినవి. వనమాలలచే గొప్పకాంతిగలిగి శోభించినవి. దేవతలచే నిర్మింపబడినవి-6. ముప్పది యోజనములు విశాలములైనవి. నలబది యోజనముల పొడవుగలవి. అట్టి గంధర్వ నగరములేడుగలవు-7. ఆగ్నేయులను గంధర్వులు. మహాబలపరాక్రమముగలవారు. కుబేరసేవకులు, వారి యాభవనరాజములు మిక్కిలి ప్రకాశించినవి-8.
ఆ భువనపు మహాగిరి యొక్క ఉత్తర శిఖరము లందు ధనిక భవనముల చేతను దేవబ్రాహ్మణ నివాసములైన మేడల చేతను చుట్టబడినదియు ఉద్యానవనములతో శోభితమైనదియునైన-9. పురము గలదు. అది ఆశీ విషములచే (సర్పములచే) నిండినది. గొప్ప కోటగోడలు తోరణమును గలది. నూర్లకొలదీ వాద్యముల ధ్వనులచే ఆనందించిన వనమధ్య ప్రదేశములు గలదీ-10. శత్రువులకు సహింపనలవి కానిది, ముప్పది యోజనముల మండలము గలది, ఎత్తుగా పెరిగినది, అది దేవశత్రువు లైన రాహు సంతానముల నగరము, ఇక దేవకూటము నందలి సిద్ధదేవరుల చరితము వినుడు-11.
రెండవదియై శుభమైన మర్యాదా (సరిహద్దు) పర్వతమున ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! కాలకేయులను రాక్షసుల నగరము గలదు. అది అనేక వర్ణములుగల మహాభవనముల పంక్తులతో జుట్టబడినది-12. ఆ భవనములు బంగారము చేతను మణులచేతను నిర్మింపబడిన చిత్రములచే నలంకరింపబడినవి. ఆ నగరము విశాలమైన రథమార్ధములు గలవి. శత్రువులచే నశింపజేయనలవిగానిది. నిత్యసంతోషము గలది. శివమైనది-13. స్త్రీ పురుష గణములచే నిండినది. పొడవైన కోటగోడలు ద్వారతోరణములును గలది. అటువది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవును గలది-14. శత్రువులకెవ్వరికిని జొరగానిది. రమ్యమైన దేవకూటపుతటమున గూర్చొనియున్నట్లున్నది. జయింపనలవి కానిది. గొప్పమేఘముల సమూహముతో బోలినది. ‘సునాసత్’ అని ప్రసిద్ధిగాంచినది -15.
ఆదాని యొక్క(దేవకూటముయొక్క) దక్షిణ శిఖరమున ఇరువదియోజనముల వెడల్పు, ఆఱువదిరెండు యోజనముల పొడవును గలదియై, బంగారు కోట గోడలు గలదియై-16. ఔత్కచులైన (పైకి నిక్కబోడిచుకొన్న తలవెంట్రుకలు గల) రాక్షసుల మహాపురముగలదు. ఆ రాక్షసులు కామరూపులు, సంతుష్టులు, బలిష్ఠులు మదించినవారును, వారి నివాసభవనము లచట గలవు-16,17.
దేవకూట పర్వతము యొక్క మధ్య మహాశిఖరమున, మహాత్ముడై మహాదేవుడైన ముక్కంటి యొక్క యనేక భూతగణములకు నిలయమైన భూతవటమనునొక మహావట వృక్షము గలదు. అది ముక్కంటి యొక్క ప్రకాశవంతమైన నివాసము సర్వలోక ప్రసిద్ధమైనది-20. అది బంగారం చేతను, మణులచేతను, రాళ్లచేతను దట్టముగానున్న చిత్రములు గలిగి శుభకరములైన నూరు శాఖల చేతను, వాని నున్న అనేక పక్ష్యాదులచే సమాకులమైనది-18. దట్టమైన యాకులతోను గొప్పవేళ్ళతోను అనేక శాఖలను మోయుచున్నది. రమ్యమైనది. దట్టమైన నీడకలది. పదియోజనముల మండలము గలది-19. పంది ఏనుగు సింహము ఎలుగుబంటి-పులి-ఒంటెపిల్ల-గద్ద-గుడ్లగూబ-గొజ్జా-మేక-21. వీని విశాలముఖములు గలిగి, గుబురుగాను వికటముగాను, లావుగాను, పొడవుగాను ఉన్న తలవెంట్రుకలు బడలి పై వెంట్రుకలును గలిగి, అనేక వర్ణములు ఆకారములును ధరించి, అనేక సంస్థానము(స్థితుల) లోనుండి-22. ఉగ్రులై ఉగ్రముఖులై, ఉగ్రపరాక్రములై, ఉజ్జ్వలులైన భూతముల చేతను, అట్లే మహాపారిషదులచే చండీశ్వరాది ప్రమథగణముఖ్యుల చేతను, (ఆ వటవృక్షము) ఎల్లప్పుడు నిండియుండును-23. అచట భూతములు భూతపతియైన శివుని నిత్యము పూజింతురు. రర రములు (కయిముడి వాద్యములు) శంఖములు, పటహములు(తప్పెటలు), భేరులు(దుందుభులు) డిండిమములు (రాయరిగిడిగిళ్ళు) గోముఖములు (ఆవు ముఖమువంటి వాద్యవిశేషములు)-24. ఈ వాద్యములయొక్కరకరకములైన ధ్వనులతో గూడి గానములచేత భ్రమణములు లేని నూర్ల విస్పూర్జితములచేతను శివగణనాథులు శివపూజాయుక్తులగుదురు. సంతుష్టులగుదురు. క్రీడాపరులగుదురు-25. సిద్దులచేతను, దేవతలచేతను, ఋషులచేతను, గంధర్వులచేతను, యక్షులచేతను నాగేంద్రులచేతను పూజితుడై సాక్షాత్తు లోకశివంకరుడై మహాదేవుడైన శివుడు ఆ స్థానమున పూజితుడగుచుండును -26.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబదవ యధ్యాయము. 40.
