వాయు మహా పురాణము

Table of Contents

23 - మాహేశ్వరావతారయోగో

వాయువు పలికెను:- ముప్పదియొకటీ యవకల్పము పీతవాసకల్పమనబడినది. అచట మహతేజుడైన బ్రహ్మపీత(పసుపు) వర్ణమును బొందెను-1. పుత్రకాముడై ధ్యానము జేయుచున్న యాపరమేష్ఠియైన బ్రహ్మకు మహాతేజస్వియై పసుపు వస్త్రము ధరించిన కుమారుడు పుట్టెను-2. అతడు పసుపు గంధమును చూసికొన్నయంగములు గలవాడు. పసుపు మాలలు ధరించినవాడు యువకుడు పసుపుయజ్ఞోపవీతమును ధరించినవాడు. పసుపుతలపాగా గలవాడు, మహాభుజములు గలవాడు-3,

ప్రభువును అయిన యాలోకేశ్వరుని జూచి బ్రహ్మ మనస్సుతోనే యాలోకస్రష్టయయిన పరమేశ్వరుని నమస్కరించెను 4. తరువాత బ్రహ్మధ్యానమునందుండి పరాస్వరూపిణియు మహేశ్వర ముఖమునుండి వెలువడి మాహేశ్వరియై విశిష్టరూపము గల గోవును చూచేను-5. ఆ గోవు నాలుగు పాదములు గలది నాలుగు నోళ్లు గలది. నాలుగు చేతులు గలది నాలుగు స్తనములు గలది. నాలుగు నేత్రములు గలది. నాలుగు కొమ్ములుగలది. నాలుగు కోరలు గలది. నాలుగు ముఖములు గలది. ముప్పది రెండు లోకములతో గూడుకొన్నది. సర్వతోముఖ (అన్ని వైపుల ముఖములు గలది.) మైనది సర్వాధికారిణియైన యీశ్వరియైనది-6.

సర్వదేవతలచే నమస్కరింప బడినవాడు మహాతేజోవంతుడు అయిన మహాదేవుడు హహేశ్వరియైన యామహాదేవిని జూచి మరల బలికెను-7. మతిస్మృతి బుద్ధి అని మాటిమాటికి గానము జేయుచుండెను మరలమరల రారమ్మనెను. ఆమహాదేవి కూడ చేతులు జోడించి మ్రిక్కిలి ఎక్కువగా పైకి లేచెను-8. యోగముచే విశ్వమునావరించి జగత్తునంతయు వశము జేసికొనుము (జేసికొందువు) లేదా మహాదేవునిచే నీవు రుద్రాణివి (రుద్రుని భార్యవు) అగుదువు బ్రాహ్మణుల హితముకొజుకు పరమార్థమవగుదువు-9.

ఆ తరువాత పుత్రకాముడైయీమెను ధ్యానము జేయుచున్న పరమేష్ఠికి దేవదేవేశుడు నాలుగు పాదములు గల మహేశ్వరినిచ్చెను తరువాత ధ్యానయోగముతో నామెను పరమేశ్వరిగా దెలిసికొన్న లోకనమస్కార్యుడగు బ్రహ్మయామహేశ్వరిని పొందెను. తరువాత చక్కని నియమబద్దుడై గాయత్రిని రౌద్రిని ధ్యానించెను.11 అని యీ విధముగా వైదిక విద్యారూపిణిని దేవదేవేశునిచే నర్పింపబడిన (ఈయబడిన) గాయత్రీరూపిణియైన రౌద్రీరూపిణిని కావుననే రుద్రలోకనమస్కృతమైన మహాదేవిని జపించెను. తరువాత ధ్యానయుక్తమైన చిత్తముతో మహాదేవుని బొందెను.12

తరువాత మహాదేవుడు అతనికై (బ్రహ్మాకై) మరల తన దివ్యయోగమును స్మరించెను. అట్లు స్మరించి యైశ్వర్యమును, జ్ఞాన సంపదను వైరాగ్యమును గూడ నిచ్చెను-13. ఆ తరువాత ఈశ్వరుడు భయంకరమై యుజ్జ్వలమైన అట్టహాసమును (పెద్దనవ్యును) జేసెను. (నవ్వెను) ఆ నవ్వు నుండి అన్ని వైపుల వెలుగుల విరజిమ్మిన కుమారకులు పుట్టిరి-14. వారు పసుపుపచ్చని మాలలు వస్త్రములు ధరించినవారు పసుపు గంధములు పై పూతలును పూసికొన్నవారు. పసుపురంగు తలపాగాలు గలిగి పసుపు పచ్చని ముఖములు శిరోజములు (తలవెంట్రుకలు) గలవారు-15. తరువాత వేయి సంవత్సరముల చివర వరకు ఉండి యావిమల తేజోవంతులు, యోగాత్ములు నైనవారు బ్రాహ్మణుల హితమును గోరిన వారై స్నానము జేసిరి-16. వారు ధర్మబలమును యోగబలమును గలవారై దీర్ఘసత్రయాగముజేయు ఋషులకు యోగమునుపదేశించి రుద్రుడైన యీశ్వరునిలో బ్రవేశించిరి-17. ఈ విధానములతో మహేశ్వరుని బొందినవాడును తక్కిననియమబద్దమైన యాత్మలు గల వారును ధ్యానయుక్తులై యింద్రియముల జయించిరి. వారందరు పాపములను వదలి బ్రహ్మతేజోవంతులై పునర్జన్మలేనివారై రుద్రుడైన మహాదేవునిలో బ్రవేశించిరి-18,19.

వాయువు పలికెను:- తరువాత ఆ పసుపుపచ్చని కల్పము గడచిపోగా స్వయంభువుడగు బ్రహ్మనుండి సితకల్పుడను పేర మరోకడు బయలు దేరెను-20. అపుడు సమస్తము ఏకసముద్రముగా నయినది. దీవ్యములైన వేయియేండ్లు గడచినవి. దుఃఖితుడయిన బ్రహ్మ ప్రజలను సృష్టింపదలచి చింతించెను. (ధ్యానించెను)-21. ఆ విధముగా ధ్యానించుచున్న పుత్రకామియై ప్రభువగు బ్రహ్మయొక్క వర్ణము నల్లని వర్ణమయ్యెను-22. తరువాత ఆ మహాతేజోవంతుడగు బ్రహ్మ ఆవిర్భవించిన యొక్క కుమారకుని జూచెను. ఆ కుమారుడు, నల్లని వాడు మహావీర్య(బల)ముగలవాడు తన తేజముచే వెలుగుల విరజిమ్మువాడు-23. నల్లని వస్త్రము తలపాగా, యజ్ఞోపవీతములు గలవాడు, నల్లని తలగలవాడు. నల్లని మాలలు మైపూతలు గలవాడు-24.

బ్రహ్మ అమరుడు, ఘోరమైన మన్రణము (ఆలోచనము) గలవాడు, దేవదేవేశుడు నలుపు గోరోజనమువంటియెరుపును గలవాడునగు విశ్వేశుని నమస్కరించెను-25. ప్రాణాయామపరుడైన శ్రీమంతుడగు (తేజోవంతుడగు) బ్రహ్మమహేశ్వరుని తన హృదయము నందు నెలకొల్పేను. ధ్యానయోగముతో నున్న యాయతీశ్వరుని మనస్సుతో బొందెను. తరువాత బ్రహ్మ అఘోర యని యనుచుపరబ్రహ్మనే ధ్యానించుచుండెను-26. ఈ విధముగ ధ్యానించు పరమేష్ఠియగు బ్రహ్మకు బ్రహ్మను గూర్చి) భగవంతుడైన రుద్రుడు మహాశబ్దముతో పెద్దగా నవ్వెను-27. తరువాత ఆరుద్రుని ప్రక్కల నుండి నల్లని నలుగురు కుమారకులు జనించిరి వారు నల్లని మాలలను లేపనములను ధరించినవారు-28. మహాత్ములు నల్లని వస్త్రములు తలపాగాలు ధరించినవారు నల్లని ముఖములు నల్లని కప్పు వస్త్రములుగలవారు. వారు గూడ పెద్దగా నవ్విరి. గొప్పగా హూంకరించిరి మాటి మాటికి పెద్దగా నమస్కారములను గూడ జెప్పిరి-29.

తరువాత వేయి సంవత్సరముల చివర యోగధారణ చేత ఆ పరమేశ్వరను పాసించి మహాభాగులై శిష్యులకు ఆమోగమునిచ్చిరి-30. తరువాత వారా యోగముచే సుసంపన్నులైమనస్సుతో నిర్మలము నిర్గుణము శివము విశ్వేశ్వరమునకు స్థానమును బ్రవేశించిరి-31. ఇట్లే యోగముచే తక్కిన బ్రాహ్మణులు సైతము యోగ విధానమును దెలసిన వారై అవ్యయుడైన రుద్రుని స్మరించి యాతనిని జేరిరి-32.

తరువాత ఆ భయంకరమై కృష్ణరూపమైన కల్పము గడచిపోగా విశ్వరూపమను పేరుగల మరొక కల్పము వచ్చినది-33. సర్వసంహారము జరిగి మరల చరాచర (ప్రపంచ)ము సృష్టింపబడినది. పుత్రకామియై ధ్యానము జేయుచున్న పరమేష్ఠియగు బ్రహ్మనుండి మహానాదము గలిగి విశ్వరూపమైన సరస్వతి యావిర్భవించినది-34.

తరువాత సమస్తమాలలను వస్త్రములను ధరించినవాడు, విశ్వమే యజ్ఞోపవీతముగా గలవాడు, విశ్వమే తలపాగా గాగలవాడు, సమస్త గంధములు గలవాడు, విశ్మమే స్థానముగాగలవాడు మహాభుజములు గలవాడును-35. అగు ఆ యీశ్వరుని బ్రహ్మ యోగయుక్తుడై తన మనస్సుతో ధ్యానించేను. సర్వేశ్వరుడై సర్వమునందున్న ప్రభువగు ఈశానదేవుని నా బ్రహ్మనమస్కరించేను-36. ఓం ఈశానుడవగు నీకు నమస్కారము. ఓ మహాదేవ! నీకు నమస్కారము (ఇది మన్త్రముగా వున సంస్కృతములోనే చదువవలె) ఈ విధముగా ధ్యానమందుండి నమస్కరించుచున్న బ్రహ్మను గూర్చి నేను సంతసించితిని నీకేమి కావలెను. అని పలికెను-37. తరువాత బ్రహ్మ మహేశ్వరునకు నమస్కరించి వాక్కులతో స్తుతించెను. తరువాత సంతుష్టుడైన బ్రహ్మ సంతుష్టమైన మనస్సుతో యిట్లనెను-38. ఈ నీ విశ్వగమై విశ్వేశ్వరమైన రూపమును దెలిసికొన గోరుచున్నాను. ఈ పరమేశ్వరుడెవరు-39. ఈ భగవతియైన దేవి యెవరు? ఈమె నాలుగు పాదములు గలదియు నాలుగు ముఖములు గలదియు, నాలుగు కొమ్ములు గలదియు నాలుగు నోళ్ళు గలదియు, నాలుగు దన్తములు గలదియు, నాలుగు స్తనములు గలదియు-40. నాలుగు చేతులు, నాలుగు నేత్రములు గలదియునై విశ్వరూపమైనట్లు ఎట్లు తలపబడినది.? ఈమె పేరేమి? ఈమె యాత్మ యెవరు? క్రియలవల్లనేమి బలము గలది? తెలియగోరుచున్నాను. అని బ్రహ్మయనెను-41.

మహేశ్వరుడనెను:- ఇది సర్వమన్త్రములలో రహస్యమైనది. పవిత్రమైనది. పుష్టిని వృద్ధి జేయునది. ఆది సృష్టిలోనున్నది. యున్నట్లుగానున్న యతి రహస్యమును వినుము-42. ఈ ప్రస్తుతమునడుచుచున్న కల్పము విశ్వరూపకల్పమనబడినది. దీనిలో భవుడు మొదలుగాగల ఇరువది యాజుగురు మనువులు చెప్పబడినారు-43. ఓ విభువైన బ్రహ్మనీవీ బ్రహ్మస్థానమును బొందినప్పటినుండి యిది ముప్పది మూడవ కల్పము-44. ఓ దేవేశుడా (బ్రహ్మా) నీ ముందే నూరు వేల(కోటి) స్వయంభువులు (బ్రహ్మలు) గడచిపోయిరి ఓ మహామునీ! వారిని వినుము-45. అది (ముప్పది మూడవ కల్పము) ఆనందమని తెలియదగినది. అదీ నీయొక్క మహాలయరూపమైన ఆనందము గాలవ్యగోత్ర తపస్సుచే(?) నా పుత్రుడవైనీవు వచ్చితివి-46. నీయందు యోగము సౌంఖ్యము, తపస్సు, విద్యా విధి, క్రియ భూతము, సత్యము, బ్రహ్మయనునది, అహింస, సన్తతి క్రమములు ధ్యానము, ధ్యానవపువు (శరీరము) -శాస్త్రి, విద్య, అవిద్య, మతి, ధృతి, కాని, శాస్త్రి, స్మృతి, మేధ లజ్జ, శుద్ధి, సరస్వతి, తుష్టి, పుష్టి, క్రియ, లజ్జ, క్షాని, ప్రతిష్ఠితము, లైనవి-48. ఆమె ఇరువది యారు తద్గుణములు (?) గలది. ముప్పది రెండక్షరములచే పేరుగలదిగా గుర్తింపబడినది. ఓ బ్రహ్మా, దీనిని ప్రకృతిని గాను నిన్నుగన్న మహేశ్వరిని గాను దెలియుము-49. అట్టి యీమె భగవతియైనదేవి. ఆమె కన్న సంతానము బ్రహ్మ, ఆమె చతుర్ముఖజగత్తును జన్మింపజేసిన ప్రకృతియైన గోవు అని చెప్పబడినది. తత్యశిక్షకులు ఆమెను ప్రధానమనియు ప్రకృతియనియు జెప్పుదురు-50.

ఈమె అజ అనగా జన్మలేనిది. లోహిత అనగా రజోగుణవతి, శుక్లయు కృష్ణయు, అనగా సత్వగుణవతి తమోగుణవతి విశ్వములను చక్కగా సృష్టించుచున్నది. చక్కని రూపము గలది. ఇట్టి యీ ప్రకృతి రూపము గాయత్రిగా (గానముజేయు వానిని రక్షించుదానినిగా) గాం. గోవునుగా, విశ్వరూపనుగా (విశ్వస్వరూపిణిగా) దెలిసికొని నేను అజుడను (జన్మలేనివాడను) బుద్ధిమంతుడును ఐతిని, మహదేవుడనేను-51.

            ఈ విధముగ జెప్పి మహాదేవుడు (శివుడు) అట్టహాసము (పెద్దనవ్వు) జేసెను. జుట్టిచరచిన ధ్వనియును (చప్పటల ధ్వని) కహా కహ అను ధ్వనీయునుగల యట్టహాసమును జేసెను-52. తరువాత మహాదేవుని ప్రక్కనుండి దివ్యులై సర్వరూపముల గల కుమారకులు జనించిరి జటి (జడలు గలవాడు) ముండి (కొరిగిన తలగలవాడు) శిఖండీ (నెమిలితల పైన గలవాడు) అర్థముండుడు (సగముతలగొరిగి కొన్నవాడు) వీరు మహా దేవుని ప్రక్కలనుండి జన్మించిన వారు-53. అంతవారు శాస్రకమైన యోగములతో చక్కని గొప్ప ఓజస్సుగలవారై దేవయానపు వేయియేండ్లు మహేశ్వరునుపాసించిరీ-54. తరువాత శిష్టులకు యోగపూర్ణమై దృమై నియతమైన ధర్మోపదేశముజేసిరి అట్లే నియతాత్మలై ఈశ్వరుడైన రుద్రునిలో ప్రవేశించిరి-55.

 వాయువు బలికెను:- తరువాత ఆశ్చర్యమునందిన లోకపితామహుడగు బ్రహ్మ భక్తియుక్తమయిన చిత్తముతో మహాదేవుని శ్రరణుబొంది) జేరి, ఓవిభో, మహాదేవ, నీకు అంతట శ్వేతత్వము (తెలుపు దనము) ఎట్లు వచ్చినది? అని యడిగెను-56. భగవంతుడు శివుడు పలికెను. శ్వేతకల్పమున్నప్పుడు నేను శ్వేతుడనయితిని తెల్లని తలపాగా గలవాడను. తెల్లని మాలలు గలవాడను. తెల్లని వస్త్రములు గలవాడను, శివుడను, తెల్లని యెముకలు మాంసము వెంట్రుకలు గలవాడను, తెల్లని చర్మము గలవాడను. తెలుపు, ఎఱుపు వర్ణము గలవాడను అయితిని ఆకారణముననే అప్పుడీకల్పము శ్వేతకల్పమని ప్రసిద్ధిజెందినది-57,58. నాయనుగ్రహముననే దేవేశుడయిన బ్రహ్మ శ్వేతాంగుడు తెలుపు ఎఱుపు వర్ణముగలవాడయ్యెను. అపుడు గాయత్రి (సరస్వతి) శ్వేతవర్ణమై బ్రహ్మ (బ్రహ్మీ) యని పేర్కొనబడినది-59. ఓ దేవేశుడవైన బ్రహ్మా నీ చేత నేను రహస్య పద(స్థాన) మునందున్నందునను, నా తపస్సు చేతను సద్యోజాతుడైన సనాతనునిగా తెలియబడితిని. సద్యోజాతమను నీది పరబ్రహ్మము రహస్యమని చెప్పబడినది-60. కావున రహస్యత్వమును బొందిన నన్ను దెలిసిన ద్విజాతులు బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు) పునర్జన్మ లేని యాతని(శివ) సామీప్యమును బొందుదురు-61.

నేను పేరుతో లోహితుడనై (మరల) నున్నప్పుడు నావర్ణముచేతనే యాకల్పములోహితకల్పమనబడినదీ-62. అప్పుడు. గాయత్రీ రూపిణియగు గోవు ఎర్రని మాంసము ఎముకలు పాలు కలదై ఎఱ్ఱని కన్నులు స్తనములు గలదై కీర్తింపబడినది 63. ఆ తరువాత లోహితుడగుటచే వర్ణము తారుమారుకాగా యోగము వామముయి నందున వామదేవత్వము పొందబడెను 64. అయినను ఆత్మను వశీకరించి మహా బలవంతుడనగుటచే శ్వేత వర్ణముతోనే తెలియబడితిని. కావున వర్గోత్తముడనైతిని. ఆ తరువాత భూమి పైన వాయుదేవునిగా ప్రసిద్దిబొందితిని-65. నావామదేవత్వమును దెలిసిన ద్విజాతులు ఈమెను రుద్రాణియై గాయిత్రియైన మాతనుగా దెలిసికొని సర్వపాపములనుండి విముక్తులై రజోగుణమువీడిన వారై బ్రహ్మతేజము గలవారై పునర్జన్మలేని రుద్రలోకమును బొందగలరు-67.

నేను కృష్ణవర్ణుడై (నల్లనివాడనై) భయంకరునిగా నున్నప్పుడు నాచే చేయబడిన వర్ణము చేత నా కల్పము గూడ కృష్ణ కల్పమనబడినది-68. అచట నేను కాలముతో సమానమైన వాడను కొలము లోకమును ప్రకాశింపచేయునది. ఓ బ్రహ్మా నేను మౌరుడను ఆ ఘోర పరాక్రముడను అని నీ వెఱుగుదువు. కావున భూమి పైన నన్ను ఘోరత్వమును (భయంకరత్వమును) బొందిన వానిగా దెలిసిన వారికి నేను అభయంకరుడను శాస్తుడను అవ్యయుడను అగుదును-70. కావున భూమిపై నన్ను విశ్వత్వమునుబొందిన వానిగా దెలిసిన వారికి నేనెల్లప్పుడు శివుడను సౌమ్యుడను. అగుదును-71. కావున నీ కల్పము విశ్వరూపకల్పమనబడినది. అట్లే యీ సావిత్రి కూడా విశ్వరూపయనబడినది-72. అట్లే సర్వరూపములు గల వీరందరు నీయొక్క పుత్రులైనారు. వారు లోకసమ్మతమై నాలుగు పాదములుగా జెప్పబడిరి-73. కావున నాకు సర్వవర్ణములు గల సంతానము గలిగియుండుట జరుగలదు. వర్ణములను బట్టి ప్రజసర్వభక్ష్యమును పవిత్రమును గో గలదు.74 మోక్షము ధర్మము అర్థము కామము అనునీ నాలుగు నుండ గలవు. కావున తెలిసికొనువాడును తెలియదగినదియు నాలుగు విధములుగా గలదు-75. భూతసమూహములు (పృధివ్యమేజస్సులు నాలుగు అట్లే ఆశ్రమములు (బ్రహ్మ క్షత్రియవైశ్యశూద్రులు) గూడ నాలుగు ధర్మము యొక్క నాలుగు పాదములు నా నలుగురు పుత్రులు-76. కావున చరాచరమైన జగము నాలుగు యుగావస్థలు (కృత త్రేతాద్వాపరకలిరూపములు) గలది. అట్లు నాలుగు విధములు గానున్నదియు (ప్రతిది) నాలుగు పాదులు గలది గాగలదు-77. 1. భూర్లోకము, 2. భువర్లోకము, 3.స్వర్లోకము, 4.మహర్లోకము, 5.జనోలోకము, 6.తపోలోకము, 7.శాస్తలోకము, 8. రుద్రలోకము-78. వీనిలో మూడవది స్వర్లోకము, నాలుగవది మహర్లోకమనబడినది. అచట లోకము ఉత్కృష్టమైన స్థానము అది యోగులకు పరమమైన స్థానమనబడినది-79. అచట వారు నిర్మములు (మమకారము లేనివారు) నిరహంకారులు, కామ క్రోధములు లేనివారు, తద్విదులై (పరమాత్మను దెలిసిన వారై) యోగధారణమున నున్నవారు, (పరబ్రహ్మధ్యానతత్పరులునై కనబడుదురు-80. నీవు సరస్వతిని నాలుగు పాదములు గల దానినిగా జూచితివి. ఆమె యట్లున్నందున అన్ని పశువులును నాలుగు పాదములు గలవిగా గలవు. కావుననే వానికి నాలుగు స్తనములుండగలవు-81. మన్తసంయుక్తమైన సోమము నాముఖము నుండి జారిపడినదై స్తనములనుండి మొత్తము ఘృమును (నేతిని) త్రాగి ఓ బ్రహ్మా!-82. ప్రాణులకందరికి జీవమయినందున నిదియంతయు(?) జగమంతయు సోమమయముగను అమృతము పేర్కొనబడినది-82. ఆకారణముననే నాలుగు పాదములుండగలవు. దీనికి ఆశ్వేతత్వము గూడదానిచేతనే యుండగలదు 83. ఈ లోకభావినియై సావిత్రి యైన మహేశ్వరి యీ విధమైన క్రియ గలదై ద్విపాదగా (రెండు పాదములు గలదిగా) చూడబడినందున నరులందరు రెండు పాదములు రెండు స్తనములను గలవారనబడిరి-84. మహాసత్యము (బలము) గలదై సర్వప్రాణులను ధరించునదై పరారూపిణియైన మహేశ్వరి అజయై మేకయై (జన్మలేనిదై) సర్వవర్ణములు గలదిగా నీచే జూడబడినందున అజములకు (మేకలకు విశ్వరూపత్వము రాగలదు-85. మహాతేజమైన మేకగూడ మహాతేజము గలదిగాగలదు. ఈ మేకముఖమున నంతటను అగ్నిహోత్రుడు వ్యర్థముగా నిస్రఫలమైన) రేతస్సుగలవాడగును. కావున అగ్ని పశురూపియై అంతటనున్న వాడైకూడ పవిత్రుడే-86. తపస్సుచే భావితమైన యాత్మలు గల ద్విజులు ఈశిత్వము చేత శివత్వముచేత సర్వగతుడై యంతటను స్థిరుడైన వానినిగా-87, నన్ను (ఈశ్వరుని) జూచినవారు రజస్తమోగుణములను వదలి భూమిజ మానుష్యకరూపమును గూడ వదలియు, పునరావృత్తిలేని (పునర్జన్మలతో లభ్యముగాని) నా సమీపమును బొందుదురు-88. ఓ ద్విజులారా! అని యీ విధముగ రుద్రునిచేజెప్పబడిన బ్రహ్మ నమస్కరించి పరిశుద్ధుడై మరల నీ విధముననెను-89.

బ్రహ్మ పలికెను:- ఓ భగవన్! ఓ దేవదేవేశ! విశ్వరూపియైన మహేశ్వర! ఓ మహాదేవ! ఈ నీ తనువులు లోకవందితములైనవి. ఓ విశ్వరూప! ఓ మహాసత్త్వ! ఓ మహాభుజములుగలవాడా! ద్విజాతులు ఏ యుగసంభూతియందు నిన్ను జూడగలదు? ఓ మహాదేవ! ద్విజాతులకు ఏతత్యయోగముతో లేదా ఏ ధ్యానయోగముతో నీ తనువులను జూడశక్యమగును?-92.

భగవంతుడు పలికెను:- తపస్సు చేతగాని, యోగము చేతగాని, దానధర్మఫలము చేతగాని, తీర్థ (యాత్రా) ఫలయోగము చేతగాని, దక్షిణలతోగూడిన యజ్ఞముల చేతగాని-93, వేదముల జదివించుట చేతగాని, చిత్తము తోడి నివేదనముల చేతగాని నేను మనుష్యులకు కనబడను కేవలమొక ధ్యానము చేతనే గనబడుదును. అంతకన్నవేరుగాదు. 94.

ముల్లోకములకీశ్వరుడై విష్ణువైన నారాయణుడు గూడ ఈ లోకమున సాధ్యుడు గాగలడు. పేరుతో నాతడు వారాహుడని ప్రసిద్ధుడు-95. నాలుగు బాహువులు నాలుగు పాదములు నాలుగు నేత్రములు నాలుగు ముఖములును గల యాతడు అప్పుడు సంవత్సరముగానయి యజ్ఞరూపుడగును. ఆతడు ఆజంగములు గలవాడు. మూడుశిరములు గలవాడు, మూడుస్థానములలో మూడు శరీరములు గలవాడును అగును-96.

కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, అని నాలుగుయుగములు, దీనియొక్క పాదములు నాలుగు అంగములు, క్రతువులు, భుజములు నాలుగు వేదములు, ఋతువు సంధి ముఖములు (షడంగకములు) రెండు ముఖములు రెండు ఆయనములు నాలుగు నేత్రములు-98. ఫాల్గున ఆషాఢ కార్తీక మాసములు అను మూడు సర్వములు మూడు శిరములు దివ్య అన్తరిక్ష-భౌమములనునవి మూడు స్థానములు సంభవము ప్రలయము అనునవి రెండు ఆశ్రమములు-99. ప్రభువై విష్ణువై నారాయణుడు కాలరూపుడై వరాహత్వమున నున్నప్పుడు సాధ్యుడు గాగలడు-100.

అప్పుడు ఓ దేవేశ నీవు నాలుగు ముఖములు గలవాడవుగా గలవు. ప్రభువైన విష్ణువైన నారాయణుడు బ్రహ్మాలోకమునకు నమస్కరింపదగిన వాడు-101. భూమియంతయు సముద్రము కాగా దానిలో తెప్పపై పడుకొనుచున్న పురుషుడైన దేవేశుడై ధ్యానయుక్తుడై మహామునియైన హరిని నీవు జూడగలవు. అపుడు మీ రిద్దరు నాయోగముచే (యోగశక్తిచే) మోహితుడై చిత్తమును గోల్పోవుదురు. రాత్రిలో ఒకరినొకరు తెలియక బండారులు పోటీపడిన వారగుదురు-102,103 మానుషులైన బ్రహ్మనారాయణులు ధ్యాన(యోగ)ము వలన ఒక్కొకరికడుపులలో నున్న చరాచరలోకములను జూచి తెలిసికొని యాశ్చర్యము నొందుదురు-104.

తరువాత నీవు పద్మమున బుట్టిన వాడవు. సనాతనుడైన విష్ణువు పద్మము నాభియందు గలవాడై పద్మనాభుడు నీవు పద్మాంకితుడవై గొప్ప ప్రసిద్ధిని బొందగలవు-105.

ఆ తరువాత ప్రభువు యొక్క వారాహకల్పములో మరల మహాతేజుడైన విష్ణువు కొలుడై లోక ప్రకాలను డగును. అపుడు వైవస్వతుడను మనువు నీ పుత్రుడు గాగలడు-106. అపుడు నాలుగు యుగావస్థలు గల యా యుగాన్తకమైన కల్పమునందు శిఖతోగూడుకొని శ్వేతుడను మునినై యుండగలను-107. అపుడు నాకు రమ్యమైన హిమగిరి శిఖరమున మేకలతో నిండిన పర్వత శ్రేష్ఠమున శివయోగ్యులైన నలుగురు శిష్యులు గాగలరు-108. వారు శ్వేతుడు. శిఖుడు శ్వేతాశ్వుడు. శ్వేతలోహితుడు అనువారు నలుగురు వేదపారగులు, మహాత్ములునైన బ్రాహ్మలు-109. కావున వారు పరబ్రహ్మ మార్గమును జూచి బ్రహ్మమయులై పునరావృత్తి లేని యాబ్రహ్మసమీపమును (నా సమీపమును) జేరుదురు-110.

మరల నాదేవేశుడైన ప్రభువు ద్వితీయద్వాపరమున బ్రహ్మనపుడు సత్యుడను పేరుగల వ్యాసుడుండగలడు. అపుడు లోకహితము కొఱకు లోకమునను గ్రహించుటకై యా కలియుగములో సుతారుడను పేరుతో నుండగలను-111,112. అచ్చట గూడ నాకు పుత్రులు కలుగ గలరు. వారు దున్దుభి శతరూపుడు. ఋచీకుడు క్రతుమాన్ - అనువారు-113. వారు యోగమును జ్ఞానమును సనాతనమైన బ్రహ్మను పొంది పునరావృత్తి లేని బహు జన్మలలో లభ్యముగాని) రుద్రలోకమును బొందగలరు-114.

మూడవ ద్వాపరమున భార్గవుడు వ్యాసుడై యుండును. అపుడు యుగాన్తమున దమునుడనై నేనుండగలను-115 అచటగూడ నాకు నలుగురు పుత్రులుందురు. వారు విశోకుడు వికేశుడు, విశాపుడు శాపనాశనుడు అనువారు. వారు గూ ఆయోగోక్తమార్గముననే గొప్ప ఓజోవంతులై పునరావృత్తి లేని రుద్రలోకమును బొందగలరు-116, 117.

నాలుగవ ద్వాపరయుగమున అంగిరసుడు వ్యాసుడనబడును అపుడు నేను సుహోత్రుడను పేరుతో నుండగలను 118. అక్కడ గూడ తపోధనులు దృఢవ్రతులు యోగాత్ములైన బ్రాహ్మణ శ్రేష్టులునైన నలుగురు నలుగురు సత్పుత్రులు గలుగుదురు-119. వారు సుముఖుడు, దుర్ముఖుడు, దుర్దముడు, దురతిక్రముడు-అనువారు వారు సూక్ష్మమైన యోగమార్గమును పొంది పాపముల దహించి నిర్మలులగుదురు వారు గూడ ఆ యోగమార్గముననే (పూర్వులవలె) నిశ్చయముగా రుద్రలోకమును బొందుదురు-120.

ఐదవ ద్వాపరయుగములో సవితవ్యాసుడగును. అపుడు లోకానుగ్రహమునకై యోగాత్ముడను మహాతపస్విని అనేక కార్యముల జేయువాడను. అయిన అయిన కంగుడను వాడను గాగలను–121. మహాభాగ్యవంతులు, రజోగుణములేనివారు. పరిశుద్దజన్యులు, దృఢవ్రతులు, యోగాత్ములునైన నలుగు నాకు పుత్రులు గలుగగలరు-122. సనుడు సనందనుడు, ప్రభులైన సనాతనుడు, ఋతువు సనత్కుమారుడు, వీరు మమకారము లేని వారై యహంకారము లేనివారై అనేక జన్మలచే గూడ పొందరాని నాసమీపమును (రుద్రలోకమును) పొందగలరు-123.

తిరిగివచ్చిన యారవ ద్యాపర యుగమున విభువైన మృత్యువు వ్యాసుడగును అపుడు నేను లోకాక్షియను పేరు నుండగలను- 124, 125. దివ్యులు దృఢవ్రతులు యోగాత్ములు లోకసమ్మతులు నైన నలుగురు నాకు శిశ్యులు (పుత్రులు) కలుగగలరు. వారు సుధాముడు, విరజుడు, శంఖపాదుడు, రవుడు అనువారు యోగాత్ములైనవారందరు పాపములను దహించి మహాత్ములై యాయోగమార్గముననే నిస్సంశయముగ నా రుద్రలోకమును బొందుదురు-126.

తిరుగుచు వచ్చిన యేడవ ద్వాపరయుగమున మహాతేజస్కుడైన విభువైన శతక్రతువు వ్యాసుడగును-127. అపుడుగూడ ఆయుగాన్తకమైన కలిలో సమస్త యోగులలో శ్రేష్ఠుడనై జై గీషవ్యుడని ప్రసిద్ది జెందిన వాడను గాగలను.-128. అచ్చట గూడ నా యుగములో నాకు నలుగురు పుత్రులు గలుగుదురు. వారు సారస్వతుడు. సుమేధుడు. వసువాహుడు, సువా, హనుడు. అను వారు-129. వారు గూడ అదే మార్గమున ధ్యానయోగమునా శ్రయించి మహాత్ములై రుద్రలోకపరాయణులు (చేరినవారు) కాగలరు-130.

తిరుగుచు వచ్చిన యెనిమిదవ ద్వాపరయుగమున వసిష్ఠుడు వ్యాసుడగును. కపిలుడు. ఆసురి, మునియైన పంచశిఖుడు, మహాయోగియైన వాగ్బలియు వీరందరు గొప్ప ఓజస్సు గలవారు. వీరు ధ్యానయోగులై పాపములదహించి మాహేశ్వరయోగమును బొంది పునః పునః జన్మలలో గూడ లభింపనలవిగాని నా సమీపమును (రుద్రలోకమును) జేరుదురు -131,132. (ఇట రుద్రుడు ఏ నామముతో ఉండునో తెలుపలేదు

తరువాత తిరుగుచు వచ్చిన తొమ్మిదవ ద్వాపరమున సారస్వతుడు వ్యాసుడగును.అపుడు నేను ఋషభుడను పేరుతో నుండగలను అచట గూడ నాకు మహాతేజస్సు గల పుత్రులు గలుగుదురు-133. వారు పరాశరుడు గార్గ్యుడు భార్గవుడు, అంగిరుడు అనువారు. వారందరు మహాత్ములు వేదపారగులు, తపోబలముచే గొప్పవారు శాపమిచ్చుటలోను ఉపసంహరించి యను గ్రహించుటలోను సమర్థులు వారు గూడ యోగోక్షమార్గమునే తపస్వినులై ధ్యానమార్గమును బొంది నా రుద్రలోకమును జేరుదురు-135.

పదియవ ద్వాపరమున త్రిధాముడనువాడు వ్యాసుడగును. ఓ బ్రాహ్మణులారా అపుడు మరల నేను రాగలను-136. హిమాలయ శిఖరమున కొండ చరియలతో నెతైన పర్వతము గలదు. దాని పేరు. భృగువుయొక్క శిఖరము-137. కావున నాశిఖరము భృగువైనది. అచటనే దృఢవ్రతులైన (యా) పుత్రులు నాకు గలుగుదురు. వారు బలబంధువు, నిరామిత్రుడు కేతుశృంగుడు తపోధనువారు-138. వీరు యోగాత్ములు మహాత్ములు ధ్యానయోగముతోగూడిన వారు వీరు తమ తపస్సులచే తపపాపములను దహింపజేసిన వారై రుద్రలోకమును జేరగలరు-139.

పదునొకండవ ద్వాపరమున త్రివృత్ అనువాడు వ్యాసుడగును అప్పుడుగూడ కలియెదుట గంగా ద్వారమున నేను రాగలను-140. అచటనే ఉగ్రులను వారు మహానాదముగలవారై నాకు పుత్రులు గాగలరు. వారు గొప్ప ఓజస్సు గలవారు మంచినడవడిగలవారు లోకప్రసిద్ధులు-141. వారి పేరులు లంబోదరుడు, లంబుడు, లంబాక్షుడు, లంబకేశుడు, వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమునకు బయలుదేరుదురు. వారుగూడ ఆ మార్గమున (ధ్యాన యోగ మార్గమున)నే పరమగతిని (రుద్రలోకమునకు) బొందుదురు-142.

పండ్రెండవ ద్వాపరమున శతతేజుడను మహాముని మహాసత్త్యుడై కవి వరుడైన వ్యాసుడు గాగలడు. అపుడు గూడ యుగాంతమునవిః అను పేరుతో హైమక వనమును (బంగారులేక మంచుగల వనమును) బొంది యోగమును బూని భూతలమున నుండగలను-144. ఇచట గుణ భస్మతో స్నానము జేసి, భస్మను బూసికొన్న వారు మహాయోగులు రుద్రలోకపరాయణులైనవారు నాకా పుత్రులు గలుగగలరు-145. వారు సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యుడు సర్వుడు అనువారు. వారు ధ్యానయోగపరాయణులై రుద్రలోకమును బొందగలరు-146.

క్రమముగా పదమూడవ పరిభ్రమణమైన ద్వాపరము రాగా నారాయణుడను ధర్ముడు వ్యాసుడు గాగలడు-147. అపుడు నేను గంధమాదన పర్వతమున పుణ్యమైన వాలఖల్యాశ్రమమున వాలియను మహామునిగా రాగలను-148. అచట గూడ నాకు ఆతపోధనులు పుత్రులుగా గలరు. వారు సుధాముడు, కాశ్యపుడు వసిష్ఠుడు, విరజుడు-అనువారు-149. మహాయోగబలముతో గూడి విమలుడై యూర్ధ్వరేతస్కులైన వారు గూడ ఆయోగదారణముతోనే రుద్రలోకమును చేరగలరు-150.

 పదునాలుగవ పర్యాయమైన ద్వాపరమున సురక్షణుడను వాడు వ్యాసుడగును. అచట గూడ యుగాన్తమున-151. అంగీరస వంశశ్రేష్ఠుడనై గౌతముడను యోగవేత్తనుగా రాగలను ఆగౌతముని నుండియే యాగౌతమవన మేర్పడగలదు-152. అచట గూడ కలిలో నాకు నలుగురు పుత్రులు గలుగగలరు. వారు అత్రి ఉగ్రతపుడు శ్రావణుడు స్రవిష్టుడు-అనువారు-153. యోగాత్ములు, మహాత్ములు, ధ్యానాయోగ పరాయణులు నైన వారు గూడ ధ్యానయోగమార్గముననే రుద్రలోకవాసులగుదురు-154.

పర్యాయక్రమమున వచ్చు పదియైదవ ద్వాపరమున ప్రభువైన ఆరుణియనువాడు వ్యాసుడు గాగలడు-155. ఓ బ్రాహ్మణులారా అపుడు నేను గూడ వేదశిరుడను పేరు వాడను గాగలను అచట పరమేశ్వర దేవతాకమైన వేదశిరోనామకాస్త్రము కలుగగలదు-156. అది మహావీర్వవంతమైన యస్త్రము హిమవత్పర్వతపు వెనుకటి భాగమునాశ్రయించి సరస్వతీనదీ తీర్థస్థమైన పర్వతశ్రేష్ఠమున (సరస్వతీ పర్వతముగా వచ్చును) వేద శీర్షమను పర్వతము గూడ నుండును అపుడు గూ నాకాతపోధనులు పుత్రలుగొ లరు. వారు కుణి, కుణిబాహువు, శుశరీరుడు, కునేత్రకుడు -అనువారు-158. యోగాత్ములై మహాత్ములై బ్రహ్మిష్ఠులై (బ్రహ్మమునందున్న వారై) ఊర్థ్వరేతస్కులైన వారుగూడ యోగధారణముచేతనే రుద్రలోకమును జేరిరి-159.

పర్వాయక్రమమున తిరుగుచు వచ్చు పదునారవ ద్వాపరమున సంజయుడను వ్యాసుడు ప్రభువు గాగలడు-160 అప్పుడు గూడ గోకర్ణుడను పేరుతో నుండగలను. ఆ గోకర్ణుని నుండియే గోకర్ణమను నా వనము ఏర్పడగలదు-161. అచట గూడ మహౌజస్కులైన యాపుత్రులు కలుగగలరు. వారు కశ్యపుడు, ఉశనుడు, చ్యవనుడు, బృహస్పతియను వారు వారు గూడ యోగధారణమార్గముననే పరమపదమైన రుద్రలోకమును బొందగలరు-162.

తరువాత పర్యాయక్రమమున తిరిగి వచ్చు పదునేడవ ద్వాపరమున దేవకృతంజయుడను వాడు వ్యాసుడుగాగలడు 163. అపుడు గూడ నేను గుహావాసియను పేరనుండగలను. ఎత్తైన హిమాలయపర్వత శిఖరమున మహాలయమను దానియందు మహాపుణ్యవంతమైన మహాలయమను సిద్ది క్షేత్రముండగలదు-164. అటగూడ బ్రాహ్మణ్యులు యోగమును దెలిసినవారు మహాత్ములు సర్వజ్ఞులు నిరంహంకారులైన యాపుత్రులు నాకు గలుగగలరు-165. వారు ఉతథ్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహాలయుడు-అనువారు వారికి లక్షమంది శిష్యులు ధ్యానయోగసాధనముజేయుదురు-166, 166. అప్పుడా కల్పమున వారందరు ధ్యానయోగులు కాగలరు. వారు ధ్యాయోగధారణమును చక్కగా జేసిన వారై హృదయమున మహేశ్వరుని నిలిపి మహాలయమున (అన్ని ప్రాణులులీనమగు గొప్పయాలయమైన శివపదము) అడుగిడి నాశరహితుడైన శివునిలో ప్రవేశింతురు-167. ఇతరులైన మహాత్ములుగూడ నాయుగానమైన కాలమున ధ్యానయుక్తమైన మనస్సుతో నిర్మలులై శుద్ధమైన బుద్ధులు గలవారై-168. మహాలయమును బొంది. మహేశ్వర పదము (స్థానమును) జూచి, వెంటనే వేగముగా తమకు పది తరముల పూర్వులను పది తరములములందు వారిని తరింపజేయుదురు-169. తనను కలిపి మొత్తము ఇరువది యొక్కరిని మహాసముద్రమును తరింపజేసి జ్వరము లేని వారై రుద్రలోకమును జేరుదురు-170.

తరువాత పర్యాయక్రమమున తిరగి వచ్చు పదునెనిమిదవ ద్వాపరమున ఋతుంజయుడను ముని వ్యాసుడగును. అపుడు గూడ నేను శిఖండియను పేరనుండగలను-171. సిద్దిక్షేత్రమై మహాపుణ్యమై దేవదానవులచే పూజింపబడినదై హిమాలయశిఖరమున శిఖండియను పర్వతముండును. అచటనే ఋషుల చేతను సిద్ధులచేతను సేవింపబడిన (నివసింపబడిన)-172. శిఖండివనము (నెమలి వనము) ఉండును. అచటగూడ ఆ తపోధనులైన వారు నాకు పుత్రులు గాగలరు. వారు వాచః శ్రవుడు, ఋతి(చీ)కుడు, శావాసుడు దృఢవ్రతుడు అనువారు-173. యోగాత్ములై మహాశక్తి గలవారైన వారందరు వేదములయంతముల వరకు చదివి తెలిసికొన్నవారు. వారు మాహేశ్వరమైన యోగమును బొంది వారు రుద్రలోకమును జేరుదురు-174.

ఆ తరువాత పర్యాయ క్రమమున వచ్చు పందొమ్మిదవ ద్వాపరమున భరద్వాజుడను మహాముని వ్యాసుడగును-175. అటగూడ నేను జటామాలియను పేర జటాయుపర్వతమున్న రమ్యమయిన హిమాలయశిఖరము పైన నుందును-176 అటగూడ మహౌజస్కులైన యాపుత్రులు నాకు గలుగుదురు. వారు హిరణ్యుడు. కౌశిల్యుడు, కాక్షీవుడు, కుథిముడు, అనువారు-177. యోగధర్మము గలిగి యీశ్వరులైన వారందరు ఊర్థ్వరేతస్కులు వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరుదురు-178.

తరువాత పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువదియవ ద్వాపరసృష్టిలో మహామతియైన వాచః శ్రవుడను వాడు వ్యాసుడు గాగలడు-179. అప్పుడు గూడ నేనే అట్టహాసియను పేరనుండగలను అపుడు నరులందరు అట్టహాస (పెద్దనవ్వు) ప్రియులగుదురు-180. సిద్ధులు చారణులు నివసించు నా హిమాలయము పైన నాకు మహౌజస్కులైన యాపుత్రులు గలుగుదురు. వారు యోగముతో గూడిన యాత్మలు గలవారు. మహాబలులు, ధ్యానయోగముగలవారు నియతమైన వ్రతములు గలవారు-181. వారు సుమంతుడు. విద్యాంసుడైనవర్వరి సుబంధువు, కుశీకంధరుడు- అనువారు వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరిరి-182.

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువది యొకటవద్యాపరమున వాచస్పతియను ఋషి సత్తముడు వ్యాసుడగును-183. ఆపుడు గూడ నేను దారుకుడను పేరనుందును. అందునుండియే గొప్పనైపుణ్యమైన దేవదారువనము ఏర్పడలదు-184. అటగూడ నాకు నా మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు ప్లక్షుడు దాక్షాయణి, కేతుమాలి, బకుడు-అనువారు-185. యోగాత్ములు మహాత్ములు నియతులు, ఊర్థ్వరేతస్కులు అట్లే అనఘులు (ప్రాపరహితులు) ఐన, వారు పరమయోగమున నుండి రుద్రుని. బొందుదురు-186.

పర్యాయ క్రమమున తిరగి వచ్చు ఇరువది రెండవ ద్వాపరమున శుక్లాయనుడను వాడు వ్యాసుడగును. అప్పుడు గూడ నేను మహామునినై నాగలిధరించిన (లాంగలియైన) భీముడను పేరనుండగలను. అచట ఇంద్రునితో గూడిన దేవతలు కలిలో అవతరించిన హలాయుధుని (భీమునిగా జూడగలరు-187,188. అచటగూడ నాకు సుధార్మికులైన యాపుత్రులు గలుగగలరు. వారు తుల్యార్చి మధువు పింగాక్షుడు, శ్వేతకేతువు అనువారు-189. వారు గూడ మహేశ్వర యోగమునవలంబించి ధ్యానపరాయణులై రజోగుణము లేనివారై బ్రహ్మమయులై రుద్రలోకమునకు వెళ్ళేదరు-190.

పర్యాయక్రమమున తిరగి వచ్చు ఇరువది మూడవ ద్వాపరమున తృణ బిందువనుముని వ్యాసుడగును. ఆవ్యాసుడు బ్రహ్మ అపుడు నేను శ్వేతుడను పేర మహాకాయుడనై ముని పుత్రుడనై సుధార్మికుడనై యుండగలను-191. అట్టినేను పర్వత శ్రేష్ఠములలో గూడ నుత్తమమైన పర్వతమున (హిమాలయమున) కాలమును గడుపగలను ఆ కారణమున నా పర్వతమున (హిమాలయమున) కాలమును గడుపగలను ఆ కారణమున నా పర్వతము కాలంజరమను పర్వతముగాగలదు-192. అచటగూడ నాకు ఆ మహౌజస్కులైన పుత్రులు గలుగగలరు. వారు-ఉషిజుడు, బృహదుక్తుడు, దేవలుడు, కవి అనువారు. వారు మాహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును బొందుదురు-193.

పర్యాయక్రమమున తిరగివచ్చు ఇదువది నాలుగవ ద్వాపరమున ఋక్షుడను వాడు వ్యాసుడు గాగలడు. ఓ బ్రహ్మ అచట నా కలియుగ సమీపమున యోగివందితమయిన నైమిషమున (నైమిషారణ్యమున), శూలయను. పేర మహాయోగినై యుందును-194. అచటగూడ నాకు తపస్వినులైన యా పుత్రులు గలుగ గలరు. వారు శాలిహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు,-అనువారు. వారుగూడ యోగబలముతోగూడిన వారై సువ్రతులై రుద్రుని జేరుదురు-195.

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇరువదియైదవ ద్వాపరమున వసిష్ఠుడను వ్యాసుడు శక్తియను పేర నుండగలడు-196. అపుడుగూడ నేను దండినై (దండధారినై) ముండినై (శిరో ముండనము జేసికొన్న వానై) శరుడనై ప్రభువునై దేవతలచే పూజింపబడిన కోటివరమను గరమును బొందియుండలను. అచటగూడ నాకు ఆక్రమాగతులైన పుత్రులు గలుగగలరు. వారు యోగాత్ములు, మహాత్ములునైన వారందరు ఊర్థ్వరేతస్కులు-198. వారు ఛగలుడు, కుంభకర్షాశ్యుడు (కుభకర్ణాస్యుడు) కుంభుడు, ప్రబాహుకుడు - అనువారు. వారు మాహేశ్వరయోగమునుబొంది పూర్వము వారివలెనే రుద్రలోకమును జేరుదురు- 199.

పర్యాయక్రమమున తిరిగివచ్చు ఇదువది యారవ ద్వాపరమున పరాశరుడనువాడు వ్యాసుడగును. ఆపుడుగూ నా కలియుగ సమీపమున రుద్రవనమును బొంది నేను సహిష్ణువను పేర నుండగలను-200. అచటగూడ నాకు సుధార్మికులైన, యా పుత్రులు గలుగగలరు. వారు-ఉలూకుడు వైద్యుతుడు, సర్వకుడు, ఆశ్వలాయనుడు-అనువారు. వారుగూడ మాహేశ్వర యోగమును బొంది పూర్వము వారివలెనే రుద్రుని జేరగలరు-201.

పర్యాయక్రమమున తిరిగి వచ్చు ఇరువది యేడవ ద్వాపరమున జాతూకర్ల్యుడను తపోధనుడు వ్యాసుడగును-202. అపుడుగూడ నేను సోమశర్మ యను పేర బ్రాహ్మణోత్తముడనై ప్రభాసతీర్థమును జేరియోగాత్ముడనై లోకప్రసిద్దుడను గాలను-203. అచట గూడ నాకు ఆతపోధనులైన పుత్రులు గలుగగలగరు. వారు అక్షపాదుడు, కణాదుడు, ఉలూకుడు, వత్సుడు, అనువారు, వారు యోగాత్ములు మహాత్ములు నిర్మలులు శుద్ధమైన బుద్ధులు గలవారు. వారు గూడ మహేశ్వరయోగమును బొంది రుద్రలోకమును జేరుదురు-204, 205.

పర్యాయక్రమమున తిరగి వచ్చు ఇరువది యెనిమిదవ ద్వాపరమున పరాశరుని కుమారుడు. శ్రీమంతుడైన విష్ణువు లోకపితామహుడు (లోకబ్రహ్మయై-206, ద్వైపాయనుడను పేర వ్యాసుడై ప్రభువగును. అపుడు (నా) ఆరదవ వంశమున కృష్ణుడైన పురుషసత్తముడు (పురుషోత్తముడగు విష్ణువు), వసుదేవుని నుండి యదుశ్రేష్ఠుడై వాసుదేవుడు అవతరింపగలడు-207. అపుడు గూడ నేను యోగాత్ముడనై యోగమాయచేత లోకమునాశ్చర్యపరచుటకై బ్రహ్మచారి శరీరముగలవాడనగుదును-208. శ్మశానమున చనిపోయి వదలి పెట్టబడిన యనాథయైన లోకమును జూచి బ్రాహ్మణుల హితము కోరకై విష్ణువుతోను నీతోను సహితముగా యోగమాయచే-209, పుణ్యమై దివ్యమై (దేవ సంబంధమైన) మేరుపర్వతము యొక్క గుహను బ్రవేశింతును. అపుడు ఓ బ్రహ్మా, నకులీయనుపేరనుండగలను. అపుడు భూమియున్నంతవఱకు ఇది కాయారోహణమను సిద్ది క్షేత్రముగా గలదు-211. అచట గూడ నాకా తపస్వినులు పుత్రులుగా గలరు. వారు కుశికుడు, గార్యుడు, మిత్రకుడు, రుష్టుడు-అనువారు-212. యోగయుక్తులై మహాత్ములై వేదపారగులైన బ్రాహ్మణులై వారు మాహేశ్వర యోగమును బొంది విమలులై యూర్థ్వరేతస్కులునై పునః పునః జన్మలతో లభింపనలవిగాని రుద్రలోకమును జేరగలరు-213. అనియీ విధముగా మనువు మొదలుకొని కృష్ణుని వరకు ఇరువదియెనిమిది యుగముల వరుసలో నాచేత అవతారములలోని లక్షణము జెప్పబడినది. అచట స్మృతుల సమూహముల విభాగము ధర్మలక్షణము-214.

అని శ్రీవాయుప్రోక్తే మహాపురాణమునందు మాహేశ్వరావతారయోగమను ఇరువదిమూడవయధ్యాయము.