వాయు మహా పురాణము

Table of Contents

49 -  భువనవిన్యాసో

సూతుడనెను:- ఓ బ్రాహ్మణోత్తములారా ప్లక్షద్వీపమును గూర్చి ఉన్నది యున్నట్లు సంగ్రహముగా జెప్పెద వినుడు. జంబుద్వీపవిస్తారమునకన్న దీని విస్తారము రెండింతలైనది. ఆ విస్తారమునకన్న మూడింతలు దీనియంతటి వైశాల్యము. అచటి గ్రామములు పుణ్యములు ప్రజలు చిరకాలమునకు జత్తురు. అట కరువు ఎక్కడిది (లేదు) ముదిమి యొక్కయు రోగముల యొక్కయు భయము ఎక్కడిది? (లేదు). అచట గూడ సముద్రములు, నదులు వాని పేర్లను చెప్పెద వినుడు. ప్లక్షద్వీపాదులైన వానిలో ప్రతియేడింటియందును పర్వతములు చక్కగా పొడవైనవై ప్రతిదిశలోను బ్రవేశించినవి.

ప్లక్షద్వీపమునందలి సప్తద్వీపములను సప్తమహాచలములను గూడ జెప్పెద. ఇచట మొదటి పర్వతము గోమేదకము. అది మేఘముతో సమానమైనది. (రంగులో) ఆ వరము (దేశము) గూడ గోమేదకమను పేరనే పిలువబడుచున్నది. రెండవ పర్వతము చంద్ర పర్వతము. అది సమగ్రౌషధులతో గూడియున్నది. అశ్వినీ దేవతలచేత అమృతము కొరకై యచట ఓషధులుంచబడినవి. మూడవది నారదమను పర్వతము అది మహోన్నతమై పోనలవికానిది. ఆ పర్వతముననే పూర్వము నారదపర్వతులు బుట్టిరి. అచట నాల్గవ పర్వతము దుందుభియను - పేరు గలది. ఇచట శబ్ద మృత్యువైన దుందుభి రాక్షసుడు పూర్వము దేవతలచే చావగొట్టబడెను. ఐదవది సోమకమను పర్వతము ఇచట పూర్వము దేవతలచే అమృతము సంపాదింపబడినది. అది మాతృదాస్య విముక్తికై గరుడునిచే నపహరింపబడినది. ఆరవది సుమనాయను పర్వతము. అదియే ఋషభమని చెప్పబడినది. దీనియందు పూర్వము వరాహావతారమెత్తిన విష్ణువుచే హిరణ్యాక్షుడను రాక్షసుడు చంపబడెను. ఏడవ పర్వతము వైభ్రాజమనునది. అది బాగుగా ప్రకాశించునది స్ఫటికమణిమయమైన మహాపర్వతము. జ్వాలలచే నది విభ్రాజించినది. (ప్రకాశించినది) కావున వైభ్రాజమనబడినది.

ఇప్పుడు యథాక్రమముగా పేరులతో వానియొక్క వర్షములను (దేశములను) చెప్పెదను అందులో గోమేదము అన్నది మొదటి దేశము. అది భయము శమించిన దేశమనబడినది. చంద్రమునకు శిఖరమనునది దేశము నారద్వీపమునకు సుఖోదయము దేశము ఆనందమన్నది దుందుభియొక్క దేశము. సోమకమునకు శివమనునది దేశము. ఋషభమునకు క్షేమకమన్నది దేశము వైభాజమునకు ధ్రువమన్నది దేశము. ఈ దేశములందు దేవగంధర్వులు, చారణులతోడి సిద్ధులను విహరింతురు. వారితోగూడి కనబడుచున్నవారై క్రీడింతురు. వానియొక్క నదులు గూడ ప్రతీదేశమునకును ఏడే! అవి సముద్రమును జేరునని పేరున వాటిని సప్తగంగయైన మహానది అని చెప్పెద. ఆ నదులు ప్రవహించును వాటి నుండి వేల కొలది యితర నదులు ప్రవహించును. అవి బహూదకములు సమూహములు గలవి. ఇంద్రుడు వర్షించు వైపునకు బ్రవహించునవి. ఆ గ్రామములు మాత్రము సంతుష్టములై యెల్లప్పుడా నదీ జలములనే ద్రావుదురు. అవి (జనపదములు) శుభములు, శాంతవహములు, ప్రమోద్రములు, అవియే శివములు. ఆనందములు ధ్రువములు శ్రీవముతోగలపి క్షేమకములు (ఇందలి జనులు ఆ నదీజలముల ద్రోవుదురు) వీనియందలి ప్రజలంతటను వర్ణాశ్రమాచార ధర్మములు గలిగినవారు. ఈయన్నింటియందును ప్రజలు ఆరోగులు, సుబలులు, ఏయనారోగ్యములు లేనివారు. వారిలో అధోగతి లేదు అట్లే ఉద్గతియును లేదు. అచట ఎక్కడగూడ కృత త్రేతాది చతుర్యుగ కృతమైన యుగదశలేదు. ఎల్లప్పుడు త్రేతాయుగముతో సమానమైన కాలమే యుండును. ప్లక్షద్వీపము మొదలు ఈఐదు ద్వీపములలో నంతటను త్రేతాయుగమమగు కాలమే యుండును. దేశము యొక్క అనువిధానమును బట్టి కాలము యొక్క అనువిధులు గూడ నుండునని చెప్పుదురు. ఆ దేశములలో మానవులు సూరూపులై సువేషములు గలవారై, అరోగులై, బలవంతులై ఐదువేల యేండ్లు జీవింతురు. సుఖము, ఆయువు, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మమును ప్లక్ష ద్వీపము మొదలు శాకద్వీపము వరకు చక్కగా వర్తిల్లును. ప్లక్షద్వీపము విశాలమైనది, శ్రీమంతము, అంతట ధనధాన్యములు గలది దివ్యౌషధి ఫలములతో గూడినది. సరౌషధి వనస్పతులు గలది. వేలకొలది పశువులచేతను, గ్రామముల చేతను, అరణ్యములచేతను జుట్టబడినది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ ద్వీప మధ్యమున జంబూవృక్షముచే బిలువబడిన ప్లక్షమను (జువ్విచెట్టు) మహావృక్షము గలదు. కావున ఆ వృక్షము పేరనే ప్లక్షద్వీపమని పిలువబడినది. ఆ జనపదము యొక్క మధ్యన ఆ రుద్రుడు పూజింపబడును. అదియును చెఱకురసము గల ప్రదేశము. అది ప్లక్షద్వీపముచే చుట్టబడినది. ఇదియంతయు ప్లక్షద్వీపము యొక్క వైపుల్యము విస్తరముగా జెప్పబడినది.

అని, ఆను పూర్వితోను, సంగ్రహముగను ఈ ప్లక్ష ద్వీపము యొక్క సన్నివేశము చెప్పబడినది. శాల్మలద్వీపమునకు సంబంధించిన యాసన్నివేశమును వినుడు. తఱువాత ద్వీపమునకు సంబంధించిన యా సన్నివేశము వినుడు. తరువాత ద్వీపములలో మూడవదైన శాల్మల ద్వీపము ఉత్తమమైనది. శాల్మలద్వీపముతో సముద్రము చెఱుకు రసము జలముగా గలదైనది. ప్లక్ష ద్వీపమునకన్న రెండింతలైన విస్తారముతో జుట్టబడినది. అచట గూడ రత్నములు బుట్టు స్థానములై పర్వతములు గూడను ఏడేయని తెలియవలె. మొదటిది సూర్యునితో సమానమైన కుముదమను పర్వతము అన్నిధాతువులతో నిండి శిలాజలముల నుండి పైకి లేచిన శిఖరములతో నలంకరింపబడినది. దానియొక్క రెండవ పర్వతము ఉన్నతమని ప్రసిద్దిజెందినది. హరిదళము నిండిన శిఖరములతో నాకాశమునావరించి యున్నది. దానియొక్క మూడవ పర్వతము బలాహకమని ప్రసిద్ధమైనది. గాఢనీలమైన శిఖరములతో నాకాశమావరించి నిలచియున్నది. దాని నాలుగవ పర్వతము ద్రోణ పర్వతము. దానియందు మహాబలములైన యోషధులు గలవు. విశల్యకరణి (తీసివేయదగిన) ఎముకను దీసివేయు నోషధియు, అట్లే మృతసంజీవని (చచ్చినవానిని బ్రతికించునది) అగు ఓషధియు దానియందు గలవు. అచట కంకమన్నది ఐదవ పర్వతము. గొప్పయెత్తైనది. దివ్యపుష్పఫలములతో గూడినది. చెట్లతో తీగలతో జుట్టబడినది. అచట ఆరవ పర్వతము మహిషమను పేరుగలది. అది మేఘంవలె నల్లనైనది. అచట నీటబుట్టిన మహిషమను. నగ్ని గలదు. అట కకుద్మాక అను పర్వతము ఏడవదిగా జెప్పబడును. ఇటచ ఇంద్రుడు స్వయముగా ననేక రత్నములను వర్షించును. ప్రజాపతిని (బ్రహ్మను) దీసికొని వచ్చి ప్రాజాపత్య యామును జేయించును. అను ఈ ఏడు పర్వతములు శాల్మల ద్వీపమున మణులచే నలంకరిపంబడినవి. ఆ పర్వతములకున్న యేడు శుభములైన వర్షములను (దేశములను) చెప్పెదను. కుముద పర్వతము నుండి మొదటిది శ్వేతదేశము. 'ఉన్నతము'నకు లోహిత దేశము. బలాహకమునకు జీమూతదేశము ద్రోణమునకు హరితదేశము. కంకమునకు వైద్యుత దేశము. మహిషమునకు మానసదేశము. కకుద్మంతమునకు సుప్రభదేశము ఏడింటికి ఏడు దేశములు గలవు. వానిలో నదులను వినుడు. అచటి నదులు పాని(న) తోయా, వితృష్ణ, చంద్ర శక్ర, విమోచనీ, ఏడవది నివృత్తి అని ప్రతిదేశమునకు ఒకటిగా నదులు చెప్పబడినవి. ఆ నదులకు సమీపముగా బోవు ఇతర నదులు నూర్లు వేలును గలవు. వాని లెక్కింప నలవికాదు. అచట నుండ దలచినవాని చేత శ్రద్ధగా తెలిసికొనదగినవి. అని యది శాల్మల ద్వీపము యొక్క సన్నివేశముగూడ చెప్పబడినది. ప్లక్షవృక్షముతో సంఖ్యలో సమానముగా శాల్మలద్వీప మధ్యమున మహాశాల్మలి (బూరుగు) వృక్షము గలదు. అది విశాలమైన స్కంధములు గలది. ఆశాల్మలి వృక్షరాజలము సురాజలముతో గల సముద్రమునంతట జుట్టబడి ఆ సురాసముద్రము శాల్మలవృక్ష విస్తారమునకు అంతట సమముగా నున్నది.

ఉత్తర ద్వీపములలో ప్రజలు ధర్మజ్ఞులు వినుడు. నేను విన్నట్లుగా న్యాయమును గుణముగా జెప్పెద వినుడు. నాలుగవదైన యాకుశ ద్వీపమును సంగ్రహముగా జెప్పెద వినుడు. కుశద్వీపము చేత సురాజలమంతట జుట్టబడినది అచట ఏడే పర్వతములు. వానిని వర్ణించెద వినుడు. శాల్మలద్వీపవిస్తారముకంటె నంతటను రెండింతలు గలదు. కుశద్వీపమున పగడముల యెత్తెన రాశిగానున్న పర్వతము కుశద్వీపము యొక్క మొదటి పర్వతము. రెండవది హేమ పర్వతము. మూడవది ద్యుతిమాన్ అను పర్వతము. అది మేఘమువంటి పర్వతము. నాలుగవది పుష్పవాన్ అను పర్వతము. ఐదవది కుశేశయమను పర్వతము, ఆరవది హరిగిరియన్నది ఏడవది మందరమనబడినది. మందా అనగా నీరు ఆ నీటిని జీల్చుటచే మందరమైనది. వానియొక్క లోపలి విరివి రెండింతలుగా జుట్టబడినది . మొదటి వర్షము (దేశము) ఉద్భిదమన్నది. రెండవది వేణు మండలము మూడవది స్యైరథాకారము. నాలుగవది లవణమనబడినది. ఐదవ దేశము ధృతిమాన్. ఆఱువది ప్రభాకరమను దేశము. ఏడవది కపిల మనునది. ఈ యేడును వర్షపర్వతములు. వీనిలో దేవ గంధర్వులు జగదీశ్వరులై కాంతిమయులై చూడబడుచు ప్రతిదేశక్రమమున విహరింతురు క్రీడింతురు. ఆ దేశములలో దొంగలు లేరు. అట్లే మేచ్చ జాతీయులు లేరు. జనమంతయు తెల్లని వర్ణముగలది. అట్లే ఒక క్రమమున జత్తురు. అచట గూడ నదులు ఏడే! అవి స్వేతర పాపముల గడిగివేసినవి. మంగళకరములైనవి. అచటి సంతతి పవిత్రమైనది. అట్లే భూమి కాంతి గర్బిత. ఆ నదుల నుండి బయలుదేరినవి నూర్లు వేలు, అవి న్నియు ఇంద్రుడు వర్షించు చోట్లకు జేరును. కుశద్వీపము వెలుపల నేతి నీటితో జుట్టబడినది. ఆ ఘృతోదము విస్తారమున కుశద్వీపముతో సమానము. అనీ యిది కుశద్వీపము యొక్క సన్నివేశము వర్ణింపబడినది. ఆ తరువాత నేను క్రౌంచ ద్వీపముయొక్క విస్తారమును జెప్పెదను.

ఆ క్రౌంచ ద్వీపము కుశద్వీప విస్తారమునకన్న రెండింతలనబడినది. నేతి జల సముద్రము క్రౌంచ ద్వీపముతో జుట్టబడినది. ఆ ద్వీపమున శ్రేష్ఠపర్వతమైన మొదటి పర్వతము క్రౌంచస్థము. క్రౌంచమునకు పరమైనది వామనకము. వామముకన్న పరమైనది అంధకారకము. అంధకారమునకన్న పరమైనది దివావృత్ అనునది. దీవావృత్తుకన్న పరమైనది గోవిందగిరి. గోవిందమునకన్న పరమైనది పుండరీకమను మహాగిరి. పుండరీకమునకన్న దుందుభిస్వనము. ఈ రత్నమయములైన యేడు క్రౌంచ ద్వీపము యొక్క పర్వతములు బహువృక్షఫలములతో గూడినవి. అనేక వృక్షఫలములతో జుట్టబడినవి. వర్ష పర్వతము విష్కంభము నుండి యొండొరుల రెండింతలైనవి. అచట దేశముల పేర్లతో జెప్పెద వినుడు. క్రౌంచమునకు కుశలియనుదేశము, వామనమునకు మనోగమను దేశము, మనోనుగమున కంటే పరమైనదేశము ఉష్ణదేశము. ఇది మూడవ దేశమనబడినది. ఉష్ణమునకన్నపరమైనది ప్రావరకము, ప్రావరముకన్న పరము అంధకారకము. అంధకారక దేశమునకన్న పరమైనది. మునిదేశమనబడినది. మునిదేశమునకన్న పరమైనది దుందుభి స్వనమనబడినది. సిద్దచారణులతో సంకీర్ణమైన యచటి జనముసామాన్యముగ వర్ణముగలది. అట గూడ త్రిదేశమున నదులు శుభములై ఏడే. యనబడినవి. గౌరీ, కుముద్వతి, సంధ్య రాత్రి, మనోజవో, ఖ్యాతి, పుండరీక అను గంగ ఏడు విధములనబడినది. వానిలో సమీపముగా బోవునపై సముద్రమున జేరు నదులు వేరుగానున్నవి. అవి న్నియు విశాలములై బహుజలములు గలవై తోడుగా బోవును. క్రౌంచ ద్వీపము పెరుగు మీగడవంటి జలసు గలిగి క్రౌంచ ద్వీపసమముగానున్న సముద్రముచేత ఆ శ్రీమంతమగు క్రౌంచ పర్వతము చుట్టబడినది. ప్లక్షద్వీపము మొదలగు నీ ద్వీపములు సంగ్రహముగా జెప్పబడినవి. ఆ ద్వీపములయొక్క స్వభావముగూడ మొదటి నుండియు వరుసగా మొత్తవ గా జెప్పబడినది. ఇచటి ప్రజల సృష్టిసంహారములు వివరముగా నూరేండ్లలో గూడ జెప్పనలవిగానివి.

ఆ తరువాత శాకద్వీపమున్న విధానమును జెప్పెదను. మొత్తము శాక ద్వీపమున్నదియున్నట్లు జెప్పెదను దాని థార్థతత్యమును నిశ్చయముగా జెప్పెద నా నుండి వినుడు. దాని విస్తారము క్రౌంచ ద్వీపము విస్తారమునకన్న రెండింతలు పెరుగు మీగడ వంటి నీరు గల సముద్రమును జుట్టి యది యున్నది. అచటి జనపదములు గ్రామములు పుణ్యములు జనులు చాల కాలము జీవించి మరణింతురు. అచట కరువెక్కిడిది? రోగ భయమెక్కడిది?. అచట గూడ పర్వతములు ఏడే! అవి శుభ్రములు మణులచే నలంకరింపబడినవి. అట్లే సముద్రములును నదులును గలవు. వాని నామములను వినుడు. అందులో మొదటిది దేవర్షులతోను గంధర్వులతోను కూడినదై మేరువని చెప్పబడుచున్నది. తూర్పునకు పొడవై బంగారు వర్ణము గల యది ఉదయమను పర్వతము, అచట మేఘములు వర్షము కొరకై పుట్టును. పోవును, దానికి పైగా గొప్పనై జలధారమను మహాగిరి కలదు. దాని నుండి యింద్రుడు ఉత్తమమైన జలమును స్వీకరించును. తరువాత వర్షకాలమున ప్రజలకు ఇచట వర్షము కలుగును. దానికి పైగా రైవతకమను పర్వతముగలదు. అచట రేవతీదేవి యను నక్షత్రము నిత్యము ప్రతిష్ఠితమైయున్నది. ఆ గిరి బ్రహ్మచే జేయబడినది. దానికి పైగా గొప్పవైన శ్యామమను మహాపర్వతము గలదు. పూర్వమీ ప్రజలు దానివల్లనే నలుపుదనమును బొందిరట. దానికి పైగా ఆంబికేయమను పర్వతము గలదు. అదీ మంచుచేగప్పబడి దుర్గమై (పోనలవికాని) శైలము. ఆంబికేయ పర్వతమునకు పైగా రమ్యమై సర్వేషధులతో గూడిన కేశరియను పర్వతముగలదు. దానినుండి వాయువు వీచును. ఇక యథా పూర్వకముగా వాని దేశ నామములను వినుడు. ఉదయపర్వతమునకు ఉదయదేశము జలదమని ప్రసిద్ధిగాంచినది. రెండవ జలధారపర్వతమునకు సుకుమను రెండవదేశము చెప్పబడినది. రైవతకమునకు కౌమారదేశము శ్యామపర్వతమునకు మణీచకమనుదేశము. అస్తపర్వతమునకు శుభమను దేశము పూవులతో మిక్కిలి యెత్తైనది. ఆంబికేయపర్వతమునకు మోదాక మనుదేశము. కేశరములలో మహాద్రుమమను దేశము. ద్వీపము యొక్క పరిమాణము శాకద్వీపముతో సమానముగా పొట్టపొడుగులుండును. దానియొక్క మధ్యన శాకమను మహావృక్షము గలదు. అచట జనులు దానికి పూజలు చేయుదురు. దీనితోనే దేవగంధర్వులు చారణులతోడి సిద్ధులును విహరింతురు. వారితో సహచూడబడుచున్న వారై క్రీడింతురు. అచట పుణ్యములైన జనపదములు (గ్రామ నగరములు) చతుర్వర్ణములతో గూడి యుందురు. వానిలో గూడ నదులు ఏడే! ప్రతివరము (ఏడు) సముద్రమును జేరునవి. వాని నామముల దెలియుము. అవి న్నియు గంగలే ఏడుగా జెప్పబడినవి. మొదటిది సుకుమారీయనునది. ఇది గంగ, శ్రీవజల, అనుతప్త, అను పేర్లతోనున్న నదిగా బిలువబడినది. కుమారియను పేరుగల గంగరెండవది. అది మరల సతి (యనబడినది) నంద అనియు పార్వతియనియు పేరు గలది మూడవదిగా జెప్పబడినది. శివేతికయనునది నాల్గవది. అది త్రిదివాయని కూడ అనబడినది. ‘ఇక్షు’ అనునది యైదవది. అది మరల క్రతువనబడినది. ధేనుకయని మృతయని ఆరవ (ఏడవ) గంగ(లో) చెప్పబడినవి. ఇవి యేడు మహాగంగలు. శివములైన (మంగళములైన) జలములు గలవి. ఇవి శాక ద్వీపనివాసులైన జనమును అందరిని సేవించును. ఆ నదులనువేరైన వేలకొలది నదులు అనుసరించును. ఇంద్రుడు వర్షించినవైపున నెక్కువ జలముతో స్రవించును. దాని పేర్లను పరిమాణములను పరిగణించి చెప్పుటకు సాధ్యముగాదు. అవి నదీ శ్రేష్ఠములు ఆ జనపదములు (తద్వాసులు) సంతుష్టులై యా నదులనే (జలములనే) ద్రాగుదురు ఓ శంశపాయన! ఈ ద్వీపము విస్తీర్ణము చక్రమునందున్నది. నదీ జలములచే గప్పబడినది. మేఘములవంటివియు. సమస్తధాతువులచే చిత్రములైనవియు, మణులచేతను పగడములచేతను అలంకరింపబడినవియు నైన పర్వతములచే గప్పబడినది. అనేకాకారములు గలవియు, విశాలములైనవియునైన జనపదములచేతను అంతట ఫలములతోగూడిన వృక్షములచేతను ఆ పర్వతము ధనధాన్యవంతమైనది. పాలవంటి జలములు గల సముద్రముచేతనంతటను జుట్టబడినది. శాకద్వీపము విస్తారమువలన సమానముగా పై వానిచే నంతటను జుట్టబడినది. పర్వతాంతరాళమైన యా ద్వీపమున జనపదములు పుణ్యములు, శుభములు, వర్ణాశ్రమముల నిండిన యా దేశములు ఏడుగానే జెప్పబడినవి. జనులలో వర్ణాశ్రమములవల్ల వచ్చిన సాంకర్యమెక్కడను గూడ లేదు. ధర్మమునకు వ్యభిచారము (విరోధ ప్రవృత్తి) లేనందున ప్రజలు దుఃఖము లేశములేని సుఖములననుభవించిరి. వారిలో లోభముగాని, మాయగాని లేదు. ఈర్ష్యా, అసూయ, అధైర్యము ఇవెక్కడివి? (లేవు) వారిలో విపర్యయము ధర్మాది వ్యతిరేకముగా (బోవుట) లేదు. అది వారిలో స్వాభావికముగా దలపబడినది. వారికి పన్నులవేత లేదు. శిక్షగాని శిక్షించువాడు గాని లేరు. ధర్మజ్ఞులైన యాజనులు తమ ధర్మముచేతనే యొండొరుల రక్షించుచుండిరి. ఆ ద్వీపమున నుండు వారికి సంబంధించినదింత మాత్రమే చెప్పసాధ్యము ఏడవదైన పుష్కర మును గూర్చి చెప్పెద వినుడు.

పుష్కర ద్వీపముతో వెలుపల క్షీరోదక సముద్రము చుట్టబడినది. అది శాకద్వీప విస్తారమున కన్ననంతటను రెండింతలు. పుష్కరద్వీపమున శ్రీమంతమైన పర్వతము ఒకటే. అది మహాశిలామయము. మణిమయములైన శిలలచేతను ఉన్నతములైన శిఖరములచేతను, చిత్రమైన యా ద్వీపముయొక్క పూర్వార్థమున ఒక గొప్ప చిత్రసానువు గలదు. (చిత్రమైన చరియ కలదు) ఇరువదియైదు పరిమండల (అంతట గుండ్రని తనము) సహస్రముల విస్తీర్ణము. ముప్పదినాలుగు వేల (పరిమండలముల) యెత్తుగలదై యా పర్వతమేర్పడినది. ద్వీపసగభాగమునకు ఆ పర్వతము ఏనుగకు గపు బొంతవలె నున్నది. అది మానసోత్తమము. అది సముద్రవేలా సమీపమున నుదయించిన నూతన చంద్రునివలే నున్నది. ఏబదియైదు వేల యోజనముల పైకి యెత్తుగా వ్యాపించినది. అంతే అంతట గుండ్రని తనముతో విశాలమైనది. ఇట్లు ద్వీపముయొక్క పడమటి సగభాగమున మానసమను పర్వతము గలదు. ఒకే మహాసానువు (చరీయ) అచట నుండుటచే రెండుగా జేయబడినది. తీయని నీరుగల సముద్రముచే నంతట చుట్టబడినది. పుష్కర ద్వీపవిస్తారము వలన నిది (పర్వతము) యంతటను వ్యాపించినది. ఆ ద్వీపమున రెండు శుభములైన జనపదములు గలవు. అవి మానస పర్వతముచుట్టును అనుసరించిన మండలాకారములైయున్నవి. మానస పర్వతముయొక్క వెలుపలగనబడు వర్ణము మహావీతము. (మహావీతము?) దానియొక్క లోపలిది ధాతకీ ఖండమనబడును. ధాతకీ కుసుమఖండము) (అరెమ్రాకు). అచట మానవులు పదివేలయేండ్లు జీవింతురు. ఆరోగ్య సుఖములతో నిండినవారై మానసీ సిద్ధిని పొందియుందురు. ఆ రెండు దేశములలోను ఆయువు రూపము సమానములు. వారిలో అధమోత్తములు లేరు. రూపశీలములో వారు సమానులు. అచట మోసగాడు లేడు. ఈర్ష్య లేదు. దొంగలు లేరు. భయము లేదు. రాజ నిర్బంధము లేదు. దండము లేదు. లోభము లేదు. దానము తీసికొనుట లేదు. అచట సత్య- అనృతములు లేవు. అట్లే ధర్మాధర్మములు లేవు. వర్ణాశ్రమముల వార్త (ఉనికి) లేదు. పశుపాలన వృత్తియు వైశ్యవృత్తియు లేవు. ధర్మాధర్మములు తెలియజేయు త్రయీ విద్య, నయానయములు తెలియజేయు దండనీతివిద్య, సేవనము, బాణవిద్య (వైద్యములోని ఎముకలను గూర్చిన విద్య), ఇవి యన్నియు పుష్కరద్వీపమునందలి రెండు దేశములలో లేవు. అచనదులు, వర్షము, శీతోష్ణములును లేవు. భూమిని భేదించుకొని పుట్టు వృక్షలతాదులు, జలములు కొండ సెలయేరులును లేవు. జనమెల్లప్పుడు ఉత్తరకురు దేశవాసులకు సమానమైన కాలముగలవారు. అచట అంతట మంచి సుఖము గలవారు, ముసలితనము అలసటయు (శ్రమయు) లేనివారు. అని యిది మహావీతమున ధాతకీ ఖండము. మొత్తము పుష్కరము యొక్క విధానము ఆనుపూర్వీతో చక్కగా జెప్పబడినది. పుష్కర ద్వీపము తీయని జలముగల సముద్రముచే చుట్టబడినది. పుష్కర ద్వీపము యొక్క విస్తారము నుండియు మండలము నుండియునట్లే తీపి సముద్రముచే జుట్టబడినది.

ఈ విధముగ ద్వీపములు ఏడేడు సముద్రములచే జుట్టబడినవి. ద్వీపమునకుఎడములేని సముద్రమంతట నుండును. ఈ విధముగ బండారులవలన ద్వీప సముద్రముల వృద్ధిని తెలియజేయవలెను. నీటియొక్క సముద్రేకమువలన సముద్రములని పిలువబడినవి. దీనియందు ఋషులు నివసింతురు. ఏ కారణమున ప్రజలు నాలుగు విధములో ఆ కారణమున వర్షమని చెప్పబడినది. ఆ వర్షము ప్రలజకు సుఖమునిచ్చునది. ఋషమంటేనే ఋషులు. వృషధాతువు శక్తి ప్రబంధమను నర్థమున ప్రయోగించబడును. ఈ విధముగ (మానవాదులను) ప్రబంధించుట వలన దేశమునకు వరత్వము సిద్ధించినది. దానివలన ఆ దేశములందు వరత్వము సిద్ధించినది. శుక్ల పక్షమున చంద్రుడు వృద్ధిజెందునపుడు సముద్రము నింపబడును. (ఉప్పొత్తము) బహుల పక్షమున చంద్రుడు క్షీణించునపుడును అస్తమించినపుడును (సూర్యునిలో గలిసి యగుపించనపుడు) సముద్రము క్షీణించును. సముద్రమున నింపబడుచున్నపుడు తనంతట తానే నింపబడును. తరువాత క్షీణించునపుడు తనంతట తానే క్షీణించును. వంకుండలోని జలము అగ్ని సంయోమున ఉద్రేకమునందినట్లు (మసలి యుప్పొంగునట్లు) మహాసముద్రములోని జలము గూడ (చంద్రకాంతికి) ఉద్రేకము జెందును (ఉప్పొంగును). శుక్ల కృష్ణపక్షములలో (పూర్లిమామావాస్యలలో చంద్రుని యొక్క యుదయాస్తమయములచేత సముద్రజలము తగ్గకుండను హెచ్చకుండను ఉప్పొంగును. చల్లారును. (సముద్రపు ఆటుపోటులలో సముద్రజలముల హెచ్చుతగ్గులు లేకయే పొంగి చల్లారును). ఈ విధముగ చంద్రుని వృద్ది క్షయముల వలన సముద్రము యొక్క వృద్ధి క్షయములేర్పడును. పూర్లిమామావాస్య పర్వములందు సముద్రజలముల యొక్క వృద్ది క్షయములు ఐదువందల పది (510) అంగుళములుగా కనుగొనబడినది. రెండు వైపుల జలములున్నవి గాన ద్వీపములైనవి. అంతట జలములచే జుట్టబడినవి గూడ ద్వీపములనబడును. ఉదకము యొక్కయునికి యున్నందున ఉదధియనబడినది. పర్వములు (కణుపులు) లేనివి గిరులు. పర్వములున్నవి పర్వతములు. ప్లక్షద్వీపమున గోమేదము పర్వములు గలది గాన పర్వతమనబడినది. శాల్మలద్వీపమున శాల్మలియను (బూరుగ) మహావృక్షము పూజింపబడును. గాన నా నామముచే నా ద్వీపము: పిలువబడినది. క్రౌంచద్వీపమున జనపదమధ్యమున క్రౌంచగిరియున్నందున క్రౌంచద్వీపమయినది. శాకద్వీపమున శాకమను వృక్షము లదు. గాన శాకద్వీపమనబడినది. పుష్కరద్వీపమున మఱ్ఱిచెట్టు మహావృక్షముగ నచటివారిచే పూజింపబడినది. ఆ పుష్కర ద్వీపమున మహాదేవుడయి ముల్లోకములకీశ్వరుడైన బ్రహ్మయుండును. ప్రజాపతియైన బ్రహ్మ తన సాధ్య దేవతలతో గూడియుండును. చట దేవతలు ముప్పదిముగ్గురైన మహర్షులతోగూడి బ్రహ్మనుపాసింతురు. దేవోత్తమోత్తముడైన యా బ్రహ్మయచట దేవతలచేత పూజింపబడును.

 జంబూద్వీపము నుండి యనేకవిధములైన రత్నములు బయలు దేరును. ఆ ద్వీపములన్నిటియందును ప్రజల యొక్క క్రమములిట జెప్పబడుచున్నవి. అంతటను బ్రహ్మచర్యముతోను, సత్యముతోను దమముతోను ప్రజలుందురు. ఆరోగ్యము ఆయుః ప్రమాణములంతటను రెండింతలు. ఈ పుష్కరద్వీపమున రెండు దేశములున్నవి వానిని నచటి సజ్జనాలంకృతులైన ప్రజలను. ఈశ్వరుడు దండమునెత్తి రక్షించును. త్రిభువనములకీశ్వరుడైన బ్రహ్మయు రక్షించును. విష్ణువుతో గూడియు, శివునితో గూడియునున్న యా దేవుడై బ్రహ్మ వారికి తండ్రి. ప్రయత్నము లేకయే వచ్చినదియు, షడ్రసములు గలదై మహాబలమైన భోజనమునచటి ప్రజలెల్లప్పుడు భుజింతురు.

తరువాత పుష్కరద్వీపమునకు పైగా నావరించియున్న మహాసముద్రము కలదు. అది తీయని నీరు గలది. అంతట జుట్టి యున్నది. దానికి పైన గొప్పలోక స్థితి కలదు. అచటి భూమి బంగాపుదై రెండింతలైనది. భూమియంతయు నేక శిలవలె నుండును. దాడికంటె పైన పర్వతము దాని పొలిమేర చివర నొక మండలమును గలవు. ఆ పర్వతము ప్రకాశమును (కాంతిమంతమై కనబడునదియు) ఆ ప్రకాశమును (కాంతిలేక కనబడనిదియు) పైలోకాలోక పర్వతమను పేర జెప్పబడును. ఆ పర్వతము క్రిందివైపున వెలుగు, దానికి చీకటియు నుండును. దానియెత్తు పదివేల యోజనములనబడినది. అంతీయ (పదివేల యోజనములె) దాని విస్తారము. అది భూమి పైన నిష్టము వచ్చినట్లు పోవునది కూడను. ఆ లోకమున కనబడునది యను నర్థముగల లోక శబ్దమున్నది. నిరాలోకమున కనబడువారితో కూడనిదియను నర్థమునిచ్చు అసలోకత యున్నది (ఆలోకమనగా కనబడునది నిరాకమనగా కనబడనిది) చూడబడు జనముగల మానవాదిలోకము కొరకై అంతఃకాంతిగలలోకము (పర్వతము) సమ్మతమైనది. నిరాలోకమన్నదో కనబడని (కాంతిలేని) విధముగా బహిర్బాగమున చీకటిగల అదే పర్వతము (అలోక పర్వతము)గా సమ్మతమైనది. (లోకాలోక పర్వతము అంతర్భాగమున సూర్యకిరణములచే బ్రకాశించుననియు బహిర్భాగమున చీకటితో నుండుననియు గురు బాల ప్రబోధికయను అమరకోశవ్యాఖ్యాత చెప్పినాడు). లోక పర్వతపు సమస్త విస్తారము (అంతర్భాగము) వెలుగు నిండినది. వెలుపలనంతటను పరిచ్చిన్నమై యది (పర్వతము) నీటితో నావరింపబడియున్నది. అది నిరాలోకము (వెలుగులేనిది) ఆ వెలుగలేని అలోక పర్వతమునకు పై భాగమున ఒక అండమావరించియున్నది. ఆ యండము లోపల నీలోకములును, ఏడుద్వీపములు గల భూమియు గలదు. లోకములు భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము తపోలోకము, సత్యలోకము అనునవి సంగ్రహముగా నేడు దాని పైన లోకాన్తము గూడనింతయని తెలియవలె, శుక్లపక్షము మొదటి నుండి పడమటి దిశలో కుంభమున నున్న చంద్రునివలే నాగుడ్డు శరీరము తెల్లగా నుండెను. సృష్టికారణభూతుడైన అవ్యయాత్ముని నుండి (బ్రహ్మ నుండి) వచ్చిన యిటువంటి యండములు అడ్డముగను, ఊర్ధ్వ భాగమునను అధోభాగమునను వేల కోట్లు గలవు. అచట ఏడు ప్రాకృత కారణములచేత నది యావరింపబడినది. పరీకన్నమించియే యనియు, ఒకటి నుండి యొకటి పుట్టినవై ఒకటి నొకటి చుట్టినవై ఒండొరుల ధరించుచున్నవి. ఈ యండమంతటను గొప్ప సముద్రము ప్రవేశించినది. ఆ సముద్ర జలముచే ధరింపబడుచున్నదై నిలచి యున్నది.

 ఘనజలముయొక్క వెలుపల, అడ్డముగను నిలువునను నున్న మండలములకనుగుణముగా నంతటను, ఘనతేజస్సుచే ధరింపబడుచు అది నిలిచియున్నది. ఇనుము, బెల్లములవలే నున్న యగ్ని అంతటను మండలాకారమును దాల్చినదై యంతటను ఘనహాయువుచే ధరింపబడుచున్నదై యది (అండము) నిలచియున్నది. పంచభూతములలో నాదియైనది యాకాశము. పంచభూతములకాదియైనది మహాన్ ఈ మహాన్ అననమైన యవ్యక్తముచే వ్యాపింపబడినదై ధరింపబడుచున్నది. ఈ నంతమైన యపరివ్యక్తము (అవ్యక్తము) పది విధములై సూక్ష్మమైనది. అంతములేనిది, ఆత్మనిగ్రహము గలది, చాపుపుట్టుకలు లేనిది. ఆపైన మించి, భయంకరమైనదియు, ఆధారములేనిదియు, అరోగమైనదియు, అనేక సహస్ర యోజనముల యెడముగలిగినదై చీకటితో నావరింపబడినదియు. అయిన చీకటియే నిరాలోకము (వెలుగు లేమితనము) అది పొలిమేరలు లేనిది, దేశవిభాగము లేనిది, దేవతలకు గూడ తెలియనిది, ఏ వ్యవహారములు లేనిది.

 చీకటి చివరను ఆకాశము చివరను సమ్మాన్యమై ప్రసిద్దమై ప్రకాశించునొక గొప్ప శివాలయము గలదు. ఆ దివ్య స్థానము దేవతలకు గూడ పోనలవిగానిది అని వేదము (వినికిడి) అది మహాదేవుని యొక్క మర్యాదలో స్థాపింపబడినది. చంద్రసూర్యులచే తపింపబడినవిగానే లోకములు ప్రసిద్ధిజెందినవో నివి జగత్తుయొక్క లోకములుగా జెప్పబడినవి. సంశయము లేదు. పాతాళ ప్రదేశమునుండియు నట్లే భూమి పై నుండియు వాయువునకు ఏడేడు స్కంధములు (అంతరములు) గలవు. ఓ ద్వీజులారా! అవి బ్రహ్మ నివాసములతో గూడినవి. పాతాళమునుండి స్వర్గమువరకు ఐదువిధముల మార్గము గలదు. ఇది జగత్తు యొక్క ప్రమాణము. ఇది సంసార సాగరము.

ఈ విధముగా జగత్తు యొక్క ప్రవృత్తి ఆద్యన్తములు లేనిదై యనేక జాతులు పుట్టునట్టిదై నడచును. అది విచిత్రమైన ఒకచోట నిలచునదిగా నుండదు. ఈ భౌతికమనునదీ సహజముగా బహు విస్తారమైనది. అతీంద్రీయులై మహాభాగ్యవంతులైన సిద్ధులచేతగూడ చూడబడదు. భూమి పైన అగ్ని వాయువులకును అట్లే మహాతమస్సునకును అనస్తుడైన దేవుడైన యీశ్వరునకును ఓ ద్విజోత్తములారా!. క్షయముగాని, పరిమాణముగాని అన్తముగాని యుండదు. ఈతడంతట నంతుడు, అన్ని స్థానములయందును అనస్తుడని పఠింపబడును. పూర్వమీ నామానుకీర్తనమున నాచే నాతనిని గూర్చి చెప్పబడినది. అట్టి వీడు శివనామముతో మీకు పూర్తిగా జెప్పబడినాడు. అట్టి యితడు (శివుడు) అంతట నుండువాడుగా నన్నిచోట్లలోను పూజింపబడును. భూమియందును, పాతాళమునందును, ఆకాశమునను, వాయువునందును, అగ్నియందును సమస్త సముద్రములందును, స్వర్గములందును. అట్లే తపస్సునందునను. ఈ శివుడే మహాద్యుతి గలవాడుగా నుండునని తెలిసికొనదగును. అట్లే అనేక విధముల విభజింపబడిన అంగము గలవాడై మహాయోగియైన మహేశ్వరుడు సర్వలోకములలో లోకేశ్వరుడైన శివుడు అనేక విధములుగా పూజింపబడును.

ఈ విధముగా పరస్పరముగా బుట్టిన (వారు) పరస్పరముగా ధరింపబడును(దురు). ఆధారాధేయ భావమున నవి (వారు) వికారియొక్క వికారములు. వీరివి మొదలైనవి వికారములు. అవి పరస్పరముగా పరిచ్చిన్నములు (భాగములైనవి.) పరస్పర అధికములైనవి. పరస్పరములలో బ్రవేశించినవి. పరస్పరములో బ్రవేశించినందున నవి ఫైర్యమును బొందినవి. విశేషముల యన్యోన్య ప్రవేశము వలన పూర్వము అవి శేషములుండెడివి. పృథివి మొదలు వాయువు వరకు మూడు పరిచ్చిన్నములు. గుణములు(5, 4, 3, 2 పృధివ్యాది భూతములలో) తగ్గుటచే పరిచ్చేదము (భేదము) విశేషించి కలదు. తక్కినవానిలో భేదము సూక్ష్మమగుటచే నిచట విశేషముగ భావింపబడుటలేదు. ఆ పృథివ్యాది భూతములకంటె పరముగా ఆలోకము అనబడినది. భూతములు ఆలో కమగు ఆకాశమున నంతట పరిచ్ఛిన్నములు. పెద్ద పాత్రలో చిన్న పాత్రలంతర్గతమై యిముడునట్లు (పెద్ద గిన్నెలో చిన్న గిన్నె యిమిడినట్లు) పరస్పరసమాశ్రయము వలన పరస్పరముగా తగ్గినవి (లేనివి) అగును. (1టి 2 లో గలిసినచో 1టి ఉండదు అట్లే 2డు 1లో గలిసినచో రెండు ఉండదు. ఈ విధము ఒండరుల ఒండొరులలో గలసినచో నొండొరులు గూడ నుండరు.) అట్లే ఆ లోకమగు నాకాశమున భేదములు అంతర్గతములై పోవును. కనబడవు అని (పెద్దలచే) నంగీకరింపబడినవి. పృథివి మొదలు వాయువు వరకు గల మొత్తము నాలుగు భూతములు పరస్పరముగా నధికములు. ఈ భూతములున్నంతవరకుత్పత్తి జరుగుచుండును. అని చెప్పిబడినది. జస్తువులకు (ప్రాణులకు) ఇట సంస్కారము భూతములలో నంతర్గతమైనదిగా సమ్మతమైనది. భూతములను వదిలి కార్యోత్పత్తి యుండదు. కావున కార్యాత్మక భేదములు గూడనట్లే పరిమితములు. అని సప్తద్వీప సముద్రయగు భూమియొక్క సన్నివేశము విభాగములతోబాటు నాచే వోద్విజులారా! మీకు ఉన్నదియున్నట్లు జెప్పబడినది. ప్రధానము యొక్క (ప్రకృతి యొక్క) విశ్వరూపత్వము విస్తారము వల్లను, మండలము వల్లను, చక్కగా లెక్కింపబడుటచేతను, పరిమాణములో ఏకశికమే. (ఒక భాగమే). ఈ జగమంతయు ఎవ్వనితో ఆ భగవంతుని యొక్క అధిష్ఠానమైనది. ఈ విధముగా ఏడు భూతగణములు పరస్పరముగా చక్కగా ప్రవేశించినది. ఇంతటి సన్నివేశమైతే నాచే భావించుటకు శక్యమైనది. ఓ రాజా! సన్నివేశ విషయమున నింతయే వినదగినది. ఈ యేడు ప్రకృతులు పరస్పరము ధరించును. ఆయల్ప ప్రకృతులలో అల్ప పరిమాణముతోనే లెక్కించుటకు ఇచట జెప్పబడుచున్నది. అడ్డముగను, నిలువుగను, క్రిందుగను ఉన్న ప్రకృతులు లెక్కింపనలవిగానివి. తారకల (చుక్కల) సన్నివేశమైతే దివ్యమైన (స్వర్గమైన) మండలము వరకున్నది. భూమియొక్క మర్యాదా సన్నివేశమైతే మండలము ననుసరించియున్నది. ఓ ద్విజోత్తములారా! ఆ తరువాత భూమియందున్న పై వానిని గూర్చి చెప్పెదను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువనవిన్యాసమను నలుబది తొమ్మిదవ యధ్యాయము.