వాయు మహా పురాణము
41 - భువనవిన్యాసో
సూతుడనెను:- ఏకాంతమైన సుందర శిఖరము గలదియు, కొండలతో నిండినదియు, శంఖము వలె తెల్లనిదియు పుణ్యాత్ములయిన దేవతలకును భక్తులకును నివాసమయినది యునగు కైలాసము గలదు-1. మల్లెపూవు వలె రమ్యమైన యా కైలాస శిఖరము పైన నూరు యోజనముల పొడవై యేబది యోజనముల వెడల్పు గలిగి-2, అనేకములైన బంగారు మణుల చిత్రములచే నలంకరింపబడిన గొప్ప భవనపంక్తులతో భూషితమై అనేకవాక్కుల విస్తారములుగల (అనేక పీఠములు గల) నగరము గలదు. అది ధనాధ్యక్షుడై మహాత్ముడైన దేవుడగు కుబేరుని నగరము. అది శత్రువులు ఆక్రమింప నలవికానిది, మంచి సంపదలతో గూడినది, ఆనందముతో నలరారినది-3,4, ఆ నగర మధ్యమున నోకసభ కలదు. అది రమ్యము, బంగారముచే నలంకరింపబడినది, విశాలములైన స్తంభములతోను తోరణముల తోను విపులా అనే పేర ప్రసిద్ది జెందినది-5. అచట ఆ పుష్పకమను విమానము గలదు. అది యనేక రత్నములతో నలంకరింపబడినది. అందమైన గొప్ప విమానము అన్ని కామగుణములతో గూడినది-6. మనస్సుతో సమానమైన వేగముగలది. బంగారు కిటికీలతో నలంకరింపబడినది. ఇది యక్షరాజై మహాత్ముడైన కుబేరుని వాహనము-7. అచట కేవలము గోరోజనము వంటి వర్ణము గల్గి దేవుడై స్వయముగా మహాదేవుని (శివుని)సఖుడైన కుబేరుడు నివసించుచుండెను. ఆ యక్షరాజు సర్వభూతములచే నమస్కరింపబడినవాడు-8. అచట ఈ దేవతలలో మిక్కిలి మంచివాడై మహాత్ముడైన కుబేరుడు అప్పరోగణములచేతను, యక్షులచేతను, గంధర్వులతోను, చారణులతోను నివసించుచుండెను-9.
అచట పద్మము మహాపద్మము మకరము కచ్ఛపము కుముదము. శంఖము, నీలము, నందనము -10, అను ఎనిమిది నిధిశ్రేష్ఠములు గలవు. ఇవి ధనేశుడైన మహాత్ముడైన కుబేరునియొక్క అక్షయములైన (తరగని) యెనిమిది నిధులు. రత్నములచే సంపాదింపబడిన మహానిధానములై యా సభలో నుండును -11. ప్రభువైన యక్షరాజైన కుబేరుడున్న కైలాసముననే ఇంద్ర-అగ్ని-యమ-ఆదిదేవతలు అప్పగణములతో నుందురు. అచట నియమింపబడిన పరిచారకులు మొదట యక్షరాజైన కుబేరుని కొలువుచేసి తరువాత వారి వారి పనులకై వెళ్ళుదురు -12, 13.
అచట మందాకిని యను నడబావి(చిన్నపద్మసరస్సు)కలదు. అది సుందరమైన విశాల జలములు గలది. బంగారము తోను మణుల తోను నిర్మించిన మెట్లు గలది. అనేక పుష్పముల గుంపులతో గొప్పనైనది-14. సుగంధము మెత్తని స్పర్శయుగల బంగారు పద్మములతోను, నీలము వైడూర్య మణుల యాకులతోను, సుగంధముగల పెద్ద కలువలతోను -15, చిన్నకలువలతోను విశాలమైన పెద్ద పద్మములతోను అలంకరింపబడినది. యక్షగంధర్వ స్త్రీ చేతను అ ప్స రసల చేతను ప్రకాశించినది-16 దేవతలు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు పన్నగులు వీరిచే స్నానము చేయబడిన జలములు కలిగిన సుందరమైనది యా మందాకిని యను నడబావి-17.
అట్లే అలకనందీ నదీ శ్రేష్ఠమైన ‘నంద’ యు పై మందాకిని గుణములతోనే గూడుకొనిన నదులు, దేవతలచేతను ఋషులచేతను స్నానాది క్రియలచే సేవింపబడినవి -18.
ఆ కైలాస పర్వత శ్రేష్ఠము యొక్క తూర్పు శిఖరమున ప్రసిద్ధములై వేయి యోజనముల పొడవై ముప్పది యోజనముల వెడలైన-19, పది గంధర్వ నగరములు గలవు. అవి మిక్కిలి సమృద్ధితో నిండినవి. అనేకము లైన గొప్ప భవన పంక్తులచే నలంకరింపబడినవి-20. సుబాహువు హరికేశుడు మొదలైనవారు, చిత్రసేనుడు జరుడు మొదలైన వారును జ్వలించిన యగ్నితో సమానమైన పరాక్రమము గల పది గంధర్వరాజులు (ఆ నగరము రాజులుగా) గలరు-21.
మల్లెపూవు వలెను, చంద్రుని వలెను తెల్లనైన యా కైలాస పర్వతపు పడమటి శిఖరము అనేక ధాతువులచేత చిత్రించిన నూర్ల కొలది చిత్రములు గలది. సిద్దులు- దేవతలు ఋషులు వీరిచే సేవింపబడినది-22. అట్టి పడమటి శిఖరమున ఒక్కొక్క యక్ష భవనము ఎనుబది యోజనములు పొడవు, నలుబది యోజనముల వెడల్పు గలదై మహాభవన పంక్తులు గలిగి యుండును-23. ఇచటి ఆఢ్యములై (మహాధనికములైన ముప్పది మహాయజ్ఞాలయములున్నవి. వానిని నావల్ల వినుము. అవి యంతటను సంతోషముతోను మహా సంపదతోను కూడియున్నవి-24. మహామాల సునేత్రుడు మొదలగువారును అట్లే మణివరుడు మొదలగువారును మిక్కిలి పెంపొందిన యక్షరాజులు ముప్పదుగురు అచట నెల్లప్పుడును ప్రకాశించుచుందురు-25.
అని యీ విధముగా వాయ్వగ్నులతో సమానమైన తేజస్సులు గల యక్షులు చెప్పబడిరి. వారి యధిపతి శ్రీమంతుడైన ప్రభువైన కుబేరుడు-26. ఆ కైలాసము యొక్క కుడిప్రక్కనున్న హిమవత్పర్వత ప్రతేష్ఠము గలదు. దాని తటమున పొదరిండ్లు సెలయేరుల గుహలు, అనేకములైన చరియల గుహలును గలవు-27. అది తూరుపు సముద్రము నుండి పశ్చిమ సముద్రము వరకును గలవు-27. అది తూరుపు సముద్రము నుండి పశ్చిమ సముద్రము వరకును (మానదండకమువలె పొడవై) వ్యాపించియున్న పర్వతము. అనేక శిఖర సమూహములుగల యా హిమవత్పర్వత శ్రేష్టముయొక్క కకలలో (మధ్య భాగములలో) అచ్చటచ్చట, నరనారీ సంతోషభరితమును, హృష్టులు పుష్టులు (బలిష్టులు)నైన జనులచే కలకలలాడు కిన్నరుల నూరు పురములు గలవు-28, 29 ద్రుమ సుగ్రీవ సైన్యము మొదలగువారును, భగదత్తుడు మొదలగు వారును అచట నుండిరి. తేజస్వులై బలశాలురైన పైవారి రాజులు నూరుగురచట నుండిరి-30. దేవియైన ఉమతో రుద్రుని వివాహమిచటనే జరిగినది. వరాంగనయైన యాయుమాదేవి యిచటనే యీశ్వరునికై తపము జేసినది-31. కిరాతరూపమున రుద్రుడిచటనే ఓడించెను. కిరాతరూపులైననయుమారుద్రులచే నిచటనే జంబూద్వీపావలోకనము జేయబడినది-32. మిక్కిలి సంతోషించిన నానా భూతగణములతో రుద్రుడు క్రీడించిన భూములివియే చిత్ర పుష్పఫలములతో గూడియున్నవి-33. సంతసించి గిరి గుహలలోనున్న సన్నని నడుములు గలిగి, చక్కని కన్నులు గలిగి, మనోహర సుందరులైన కిన్నర స్త్రీలిచటనే క్రీడించిరి-34. విశాలాక్షులైన యక్షులు, తక్కిన యప్సరోగణములు చక్కని యంగ సౌష్ఠవముగల గంధర్వులును ఇచటనే ముదముతో మెదలిరి-35. శంకరు డర్థనారీనరమైన రూపము ధరించినట్టి సర్వలోక ప్రసిద్దమైన యుమావనమను వనమిచటనే కలదు-36. షణ్ముఖుడైన కుమారస్వామి జనించిన శరవణమిచటనే యున్నది. కుమారస్వామి క్రౌంచ శైలవనక్రీడలో (ధను:క్రీడలో) ఉత్సాహము జూపినది క్రౌంచ పర్వతమునకు తన బాణముతో రంధ్రము జేసినది ఇచటనే-37. మహాధీశాలియైన కృత్తికా పుత్రుడైన కుమారస్వామికి ధ్వజము పతాకము చిరుగంటలు మాలలునుగల సింహరథము బూన్చుట యిచటనే జరిగినది-38. చిత్రముగా పుష్పించిన పొదరిండ్లు గల క్రౌంచ పర్వతము యొక్క తటమున దేవశత్రువులైన రాక్షసులను ధ్వంసము జేయునట్టి స్కందుడు (కుమారస్వామి) యిచటనే తన శక్తి బాణమును ప్రయోగించేను-39. పండ్రెండుగురు సూర్యులతో సమానమైన ప్రతాపము గలిగి రాక్షస శత్రువైన విష్ణువు ఇంద్ర, ఉపేంద్రులు మొదలైన దేవ శ్రేష్ఠులచేత గుహుడు (కుమారస్వామి) యిచటనే దేవ సేనాధిపతిగ నభిషేకింపబడెను-40. ఓ బ్రాహ్మణులారా! భూత సంఘములతో వ్యాపించిన యీ స్థానములును మరికొన్ని స్థానములును అచట కుమారస్వామి యొక్క నివాసస్థానములైనవి-41. అట్లే అనేక భూతగణములు వ్యాపించి హిమవత్పర్వతము వీపున (ఉపరితలమున) క్రౌంచ పర్వతమునకు తన బాణముచే రంధ్రము జేసిన కుమారస్వామి యొక్క క్రీడాస్థానమైన పాండు శిలయను నదిచటనే కలదు-42.
ఆ హిమవత్పర్వతపు రమ్యమైన తూర్పు తటమునకలాప గ్రామమను పేర విద్వాంసులచే బిలువబడిన యొక సిద్ధావాసము గలదు-43. ఈ హిమవంతమును మృకండుడు, వసిష్ఠుడు, భరతుడు నలుడు, బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు, ఉద్దాలకుడును-44, తక్కిన యుగ్ర తపస్వులై యాత్మ భావన గల ఋషులును మొదలగు వారు తమ తమ యాశ్రమముల నేర్పరచుకొనిరి. అవి లక్ష కలవు-45. అది యనేక సిద్ధగణముల నివాసము అనేకములైన మానవుల యునికి పట్టులచేతను యజ్ఞ శాలల చేతను శోభాయమానమైనది. యక్షులు గంధర్వులు చరించినది. అనేక మ్లేచ్చగణములచే గూడియున్నది-46. అనేక రత్న నిధులచే నిండినది. అనేక ప్రాణులచే సేవింపబడినది. అనేక నదీ సహస్రములకీ హిమవత్పర్వతము శ్రేష్ఠము పుట్టు స్థానము-47.
పడమటి పర్వతమై నిషధ పర్వతము యొక్క యదార్థముగా సంపూర్ణముగా కీర్తింపబడు విశేషమును ఓద్విజులారా! వినుడు-48. దానికి విశాలమైన మధ్య శిఖరము గలదు. అది బంగారు ధాతువులచే విభూషితము. దానియందు సిద్ద - ఋషి-గణసేవితమై యుజ్జ్వలముగా బ్రకాశించిన విష్ణువు యొక్కయు మందిరము గలదు. అది యక్షులచేతను అప్సరసలచేతను వ్యాపించి యున్నది. గంధర్వ గణములచే సేవింపబడినది-49. అచట సాక్షాత్తుగా మహాదేవుడు (శివుడు)ను, లోకకర్తయై సనాతనుడై పీతాంబరమును ధరించి వరదుడైన హరియును సిద్ధులచే నిత్యము సేవింపబడుదురు-50.
ఆనిషధ పర్వత శిఖరమునకు అభ్యంతర శిఖరము గలదు. అది యనేక ధాతువులచే నలంకరింపబడినది. దట్టమై సుందరమైన శిలాతలముగల యా శిఖరమున-51, ఉలంఘులను రాక్షసుల రాక్షసమనుపురము గలదు. అదీ లోహములతోను బంగారముతోను చేయబడిన నాగవాసములు గలది. కాచిన బంగారు తోరణములు గలది. అనేకములైన చంద్రశాలల గుంపులతోను నూరు పేద్ద వీధులతోను గజిబిజీగానున్నది-52. ధనిక భవనములచేతను, మందిరముల చేతను సాటిలేనిది. కాచిన బంగారముచే నలంకరింపబడినది. ధనిక భవనములచేతను దేవళములచేతను బంధింపబడినట్లున్నది. నిత్య సంతుష్టమైనది. మిక్కిలి విస్తారమైనది-53. ఉద్యానపంక్తులతో నొప్పినది. ముప్పది యోజనముల పొడవైనది. విషసర్పముల వంటి శత్రువులకు ప్రవేశింపనలవి కానిది. నిండైనది. (వెలితిలేనిది). ఇట్టిది రాక్షస పురము-54.
దాని యొక్క కుడిపక్కనే అనేక రాక్షసగణముల కాలయము. అచట పర్వత గర్భమున ఇతరులకు బోనలవిగాని గుహలద్వారా ప్రవేశింపదగిన నగరము గలదు-55.
అట్లే పశ్చిమ శిఖరము పారిజాత వృక్షములు గల శిలలతో నెత్తైనది. దానియందు దేవతలయొక్క దానవులయొక్కయు సుసంపన్నములైన పురములు గలవు-56. అచట నా పర్వతపు మహాతటమున ప్రతిపర్వము నందును (పూర్ణిమ) సోముడు (చంద్రుడు) అవతరించు సోమశిల కలదు-57. ఇచట ఋషి కిన్నర గంధర్వులు చీకటిని బారద్రోలు సాక్షాద్దేవుడై యనిందితుడై శ్రీమంతుడైన తారాపతిని (చంద్రుని) నుపాసింతురు-58.
ఆ ఉత్తర కూటముననే బ్రహ్మపార్శ్వమను ప్రసిద్ధ స్థానము గలదు. అది సురేశ్వరుడైన బ్రహ్మయొక్క స్థానమని స్వర్గమున ప్రసిద్ధము-59. అచట సిద్ధులు యక్ష గంధర్వ దానవులును ఆ స్వయంభువై మహాత్ముడైన బ్రహ్మను యజ్ఞపూజలతో నుపాసింతురు-60. అట్లే యచట సర్వలోక ప్రసిద్ధమైన యగ్నిదేవునియొక్క స్థానము గలదు. అచట సిద్ధచారణులచే మూర్తిమంతుడైన యగ్ని సేవింపబడును-61.
అట్లే రమ్యమైన యుత్తరమున త్రిశృంగమను పర్వత శ్రేష్ఠము గలదు. అది ఋషులచేతను సిద్దులచేతను సేవింపబడినది. అనేక భూతగణములకు ఆలయము. అచట నున్న పురము బంగారు చిత్రములు గలదై ముల్లోకములలో ప్రసిద్ది జెందినది-62. అచట దేవముఖ్యులైన మువ్వురికి (బ్రహ్మ విష్ణు మహేశులకు) మూడో స్థానములు గలవు. ఓ బ్రాహ్మణోత్తములారా! తూర్పు శిఖరమున నారాయణుని మందిరము గలదు. మధ్యమ శిఖరమున బ్రహ్మయొక్క మందిరము గలదు. పడమటి శిఖరమున శంకరుని మందిరము గలదు-63. దైత్యులు దానవులు గంధర్వులు యక్షులు రాక్షసులు పన్నగులు వీరిచే ఆ మహాబలులైన దేవదేవులు యజ్ఞములు జేయుచు పూజింపబడుదురు-64. అట్లే త్రిశృంగపర్వతమున అచటచట యక్షగంధర్వ నాగుల రమ్యములైన పురములు గలవు-65.
అట్లే యుత్తర ప్రదేశమున జారుధియను దేవ పర్వతము గలదు. అదియనేక శిఖరములతో నొప్పినది. సిద్దులు సాధువులును నివసించునది-66. యక్షుల యొక్కయు, కిన్నరుల యొక్కయు, గంధర్వుల యొక్కయు, వేల కొలది నాగుల యొక్కయు, రాక్షసుల యొక్కయు, దైత్యుల యొక్కయు గొప్ప బలము గలది-67. దాని మధ్య శిఖరము సిద్ధసంఘములు నివసించినది. రమ్యమైనది. దేవతలును ఋషులును సంచరించినది. రత్నములచేతను ధాతువులచేతను అలంకరింపబడినది-68. వికసించిన కమలముల యొక్కయు వనములచే ప్రకాశించినది. అట్టే శిఖరమునందు పక్షులు గూడులుచే వాని నాదములచే మ్రోగినదియు, అనేక ప్రాణలు నివసించినదియు, హంసలచే కారండవ పక్షులచే వ్యాపించినదియు, మదించిన తుమ్మెదలు గలదియు-70, అనేక ప్రాణిగణములు వ్యాపించినదియు, పక్షలచే శోభించినదియు, సుందరములైన నదులచేతను (వాని యొడ్డున వెలసిన) పుణ్యక్షేత్రములచేతను క్రిక్కిరిసినదియు ముప్పదీ యోజనముల మండలాకారము గలదియు-71. సిద్దులాచమనముజేసిన పవిత్రజలములు గలదియు, జలదోషములు లేనిదియు, మహాపుణ్య జలములు గల “యానంద జల” మను సరస్సు గలదు-72. అచట చండుడను నాగపతి కలడు. అతడు శత్రువులకు సమీపింపనలవి కానివాడు. వేయి తలలుగలవాడు. మహాభాగ్యవంతుడు. విష్ణుచక్రపుగుర్తులు గలవాడు. ఈ విధముగా విచిత్రములైన యెనిమిది దేవపర్వతములు ఉన్నవని తెలియవలెను-73. (ఇవి) పురములు పుణ్యములైన మందిరములు, పుణ్యజలములుగల సరోవరములు అనేకములైన బంగారు పర్వతములు అట్లే వెండి పర్వతములు-74, అనేక రత్నకాంతులు గల అనేక మణిపర్వతములు, హరిత పర్వతములు, ఇంగిలీకపురంగు, బంగారురంగును గల-75, శుద్ధములైన మణి శిలాసమూహములతో గూడి మిక్కిలి ప్రకాశించు ఎల్లని కాంతిగల యనేక ధాతువులచే చిత్రములైన యనేకమణి పర్వతములు వీనిచే నొప్పినవి-76. పూర్వపు (తూరుపు) భూమియంతయు అనేక విస్తారములు గల గిరులచే నొప్పినది. అనేకములైన నదులు గుహలు శైలములు మొదలగువాని చేతను చిత్రములైన చరియలచేతను ఒప్పినది-77. ఈ విధముగా పర్వతములతో గూడి, దైత్యులు రాక్షసులు సాధువులు కిన్నరులు ఉరగులు గంధర్వులు విచిత్రులైన సిద్ధచారణులు-78, గంధర్వాప్సరసలు వీరందరిచే గూడియు, అనేక విస్తారములు గలిగి పుణ్యాత్ములచే వ్యాపించి వెంట్రుకలు (లేక సింహపు జూలు) ఆకారములలో నున్న పర్వతములు గలవు-79.
ఆ మేరువు యొక్క గిరి సమూహమంతయు సిద్ధలోకమున (స్మరింప) బడినది. అది చిత్రము. అనేకములైన యాశ్రమములతో గూడినది. పుణ్యాత్ములెక్కువగా సంచరించునది-80. అంతగా నుగ్రములుగాని కర్మలందు సిద్దులైనవారి ప్రతిమలు మధ్యమము లన బడినవి. అది స్వర్గమని చెప్పబడినది. క్రమము ఇదియని చెప్పబడినది-81. అట్టి యీ భూమి నాలుగు మహా ద్వీపములు గలదని చెప్పబడినది. అనేక వర్ణములు (రంగులు), ప్రమాణము (ఎత్తులు-పొడవులు) వెడల్పులు అనేక జాతుల బలములు, అనేకము లైన భక్ష్యములు (నమిలితినునవి), అన్నములు, పానములు అనేక విధములైన కప్పు వస్త్రములు, సొమ్ములు, అచట నున్న అనేక విధములైన ప్రజల వికారములు-83, వీరితో గూడియున్న నాలుగు మహాద్వీపములు ప్రసిద్ధములు. ఇవి అనేక వర్ణాదులు(జాత్యాదులు) గలవి. భద్రములు భరతములు, కేతు మాలములును పశ్చిమములు (పడమటివి). నిర్మింపబడిన పుణ్యాత్ముల గృహములు గల కురువులు ఉత్తరపువి-84. ఓ బ్రాహ్మణులారా! అట్టి యీ నాలుగు మహాద్వీపములు గలదియు అనేక ద్వీపములతో కలకలలాడుచున్నదియు నైన సమస్త భూమి పద్మాకారయని నా చే జెప్పబడినది-85. అయీ అంతర ద్వీపములతో శైలములతోను వనములతోను కాననములతోను (సెలయేరులతోను, అడవులతోను) బహువిస్తరమైన సమస్త భూమి ‘పద్మ’ యని చెప్పబడినది-86 ఆ బ్రహ్మ నివాసమైన (పద్మయైన) లోకము దేవతలతోను అసురులతోను, మానుషులతోను గూడినదై త్రిలోకమని ప్రసిద్ధిజెందినదై (యచటి) ప్రాణులచే పిలువబడినది-87. చంద్ర సూర్యులచే (క్రిందుగా) తపింపబడినదై యది జగత్తని గానము జేయబడినది. శబ్దస్పర్శ రూప రస గంధములను గుణములచే గూడీన-88, యా లోకపద్మము శ్రుతులచే పద్మమని చెప్పబడినది. ఈ క్రమము సర్వపురాణములందును చక్కగా నిశ్చయింపబడినది-89.
ఇతి శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబది యొకటవ యధ్యాయము-41.
