వాయు మహా పురాణము
10 - మన్వన్తరాది వర్ణనం
సూతుడు పలికెను :- లోక కర్తయైన బ్రహ్మచే లోకములట్లుండగా, అప్పుడు ఏ కారణమునైనను ప్రజలు ( ధర్మ మార్గమున) ప్రవర్తింపకుండిరి-1. అప్పటి నుండి బ్రహ్మ తమోగుణ మాత్రముచే జుట్టబడెను. (కప్పబడెను) తరువాత తన బుద్దిని అర్థ నిశ్చయ గామినిగా (విషయములను తేల్చునిశ్చయించుదానిగా) జేసెను-2. వెంటనే తన యందు నియామికయైన (నియమించునదైన) తమోగుణమాత్రముచే నిండిన బుద్దిని సృష్టించేను. ధార్మికముగా మండుచున్న రాజస గుణమును ఓడించేను.
ఆ దుఃఖముచే తపింపబడి జగత్పతి శోకించెను. దాని వలన తమోగుణము తొలగించెను. రజోగుణము తమోగుణము నావరించెను (ఆక్రమించెను)-4. తొలగించబడిన యా తమోగుణము మిధునమును (రణమును, యుద్దమును) కలిగించెను. రణము నుండి అధర్మము జన్మించెను. శోకము నుండి హింస జనించేను-5. అంత రజోరూపమైనయా మిధునము జనింపగా భగవంతుడు సంతసించెను. అట్లు సంతసించినవాడై యభాస్వరమైన (కాంతిలేని) తన తన శరీరము నాశ్రయించెను-6, ఆ శరీరమును ఒక క్రొత్తవిధముగా భావించేను. ఆ దేహమును రెండు విధములుగా చేసెను. అది సగము పురుషుడయ్యెను-7. సగము స్త్రీయయ్యెను. ఆ స్త్రీ శతరూపమయ్యెను. ప్రాకృతయై భూతదాత్రియైన మాయెననుసరించి యాప్రభువు కామములను సృజించెను-8. ఆమె తన మహిమచే ఆ స్వర్ణమును భూమిని గూడ వ్యాపించి నిలిచెను. బ్రహ్మయొక్కయు మొదటి శరీరము స్వర్ణమావరించియున్నది.
తన యర్థశరీరము నుండి సృజింపబడిన స్త్రీయైన శతరూప అతి కష్టమైన లక్షతపము జేసెను-10. దీప్తయశస్కుడైన పురుషుని భర్తగానొందెను. అతడేయిట స్వాయంభువమన్వంతరము వాడైన మొదటి పురుషుడైన మనువనబడుచున్నాడు-11. ఇచట డెబ్బది యొక్కయుగములు ఆతని మన్వంతరమనబడును. ఆ పురుషుడు అయోనిజయైన శతరూపనుపత్నిగా బొందెను. అది ఆమెతో రమించుచుండెను. ఆ కారణమున నామె (ఆరమణ క్రియ) రతి యనబడినది. కల్పాదిలో అదియే మొదటి సంప్రయోగము (స్త్రీ పురుష సంపర్కము)గా జరిగెను.
బ్రహ్మ విరాజుని సృజించెను. ఆతడు విరాట్టయ్యెను. (ఆదిదేవుడు) (బ్రహ్మ) మానసరూపుడై వైరాజుడైన విరాట్టు నుండి బుట్టినవాడు సమ్రాట్టెన (చక్రవర్తియైన) మనువనబడేను-14. అది వైరాజమైన ప్రజాసృష్టి ఆ సృష్టిలో పురుషుడు మనువు వీరుడైన విరాట్పురుషుని నుండి శతరూప పుట్టెను.
పుత్రవతులలో శ్రేష్ఠులైన ప్రియపుత్రుడు ఉత్తానపాదుడు అను పుత్రులును ఇద్దరు గొప్ప భాగ్యవతులైన కన్యలును కలిగిరి. ఆ కన్యలనుండి యీ ప్రజలు పుట్టిరి-16. దేవీ ఆకూతి, స్రసూతి అని వారి పేరుతో ప్రభువైన బ్రహ్మ స్వాయంభువుని సంతానమును దక్షునకిచ్చెను-17. ప్రాణము దక్షుడని సంకల్పము మనువు అనియనబడిరి. ప్రజాపతియైన రుచికి ఆకూతినిచ్చెను-18. మానసపుత్రుడైన రుచికి ఆకూతియందు శుభమైన మిథునము ( ) జజ్ఞే పుట్టేను. యజ్ఞుడు, దక్షిణయను (యమకులు) జంట పుట్టినదీ-19. ఆ యజ్ఞ-దక్షణలకు పండ్రెండుగురు పుత్రులు జనించిరి వారు స్వాయంభువమన్వంతరము యాములనియనబడిరి-20. యజ్ఞరూపుడైన యమునకు పుత్రులుగాన వారు యాములనబడిరి. అజితులు, శూకులు అను రెండు బ్రహ్మయొక్క గణములనబడినవి.
స్వర్గ నివాసులైన దేవతలకు పేరుగావున పూర్వము యాములు పరిక్రమించిరి. (విహరించిరి) (?) స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతియందు లోకమాతయు జనించిరి-22. దక్షునకా కన్యయందు ఇరువది నలువురను కన్యలను బ్రహ్మ జనియింప జేసెను. వారందరు మహాభాగ్యవంతులు కమల లోచనలు-23. వారు యోగపత్నులు యోగమాతలను శ్రద్ధా, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియా అట్లే బుద్ధి, లజ్జా, వపువు, శాస్త్రి, సిద్ధి, కీర్తి, త్రయోదశి-24. దాక్షాయణులైన దక్షుని కన్యలను ధర్ముడు భార్యార్థముగా స్వీకరించెను. బ్రహ్మ యీ కన్యలు ధర్మునకు (సృష్టికి) ద్వారములుగా జేసెను-25. వారికన్న మిగిలిన సులోచనలు పిన్నవారును ఐన వారు పదకొండుగురు కన్యలును, వారు ఖ్యాతి, సతీ, తరువా తసంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా అట్లే-26. సన్నతి, అనుసూయా, ఊర్జా, స్వాహా, స్వధా- అనువారు వారినైతే మహర్షులు (భార్యలుగా) పొందీరి.
రుద్రుడు, భృగువు, మరీచి, అణ్ణరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, వసిష్ఠుడు, పీతరులు, అగ్ని, వీరు (ఆ ఋషులు)-28. సతిని భవునకిచ్చెను. ఖ్యాతిని భృగువునకు, అట్లే, మరీచికి సంభూతిని, ఆజ్గిరసునకు స్మృతిని ఇచ్చెను -29. అట్లే పులస్త్యునకు ప్రీతిని, పులహునకు క్షమను, క్రతువునకు సన్నతిని, అట్లే ఆత్రికి అనసూయను-30. వసిష్ఠునకు ఊర్జను, అగ్నికి స్వాహాను, పితురులకు స్వధను, ఇచ్చెను. వారియందాఋషులకు గలిగిన సంతానము ముందు చెప్పబడుచున్నదీ.
అన్ని మన్వన్తరములలోను సర్వభూత ప్రలయమగు నంతవరకు, ఈ యందరు మహానుభావులును ఉందురు. వారి ప్రజ్ఞలను (లౌకికాలౌకికసూక్ష్మబుద్ధులు) చక్కగా అనుష్ఠింపబడుచుండును (ప్రసరింపబడుచుండును).
వారిలో శ్రద్ధ కాముని గనెను. దర్పుడు (దర్పము) లక్ష్మీసుతుడనబడెను. ధృతికి నియముడు (నియమము) పుత్రుడు తుష్టికి సంతోషుడు (సంతోషము) పుత్రుడనబడేను-33. పుష్టికి లాభుడు (లాభము) సుతుడు. మేధా పుత్రుడు శ్రుతుడు (శ్రుతము) అట్లే, క్రియకు నయుడు (నయము) దణుడు (దణ్ణము) సమయుడు (సమయము)ను పుత్రులనబడిరి-34. బుద్దికి బోధుడు అప్రమాదుడు అనునిద్దరు పుత్రులు, లజ్జకు వినయుడు (వినమయ) పుత్రుడు. వ్యవసాయుడు (వ్యవసాయము) వపువుయొక్క పుత్రుడు-35. క్షేముడు (క్షేమము) శాస్త్రికి పుత్రుడు. సిద్ధికి సుఖుడు (సుఖము) కలిగెను. కీర్తికి యశుడు (యశము) సుతుడు. ఈ విధముగ వీరందరు ధర్ముని పుత్రులు (ధర్మము యొక్క పుత్రులు).
కామునకు దైవియైన రతి వలన హ ర్షుడను పుత్రుడు గలిగెను. ఈ విధముగ నిది సుఖమునే ఫలముగా నిచ్చు ధర్ముని యొక్క సృష్టి చెప్పబడినది.
అధర్మము నుండి హింస జనించెను. నికృతి-అనృతులిద్దరును (మిథునము) బుట్టిరి. ఆ నికృతి -అనృతులిద్దరికి భయము నరకము జనించినవి-38. వీరిద్దరికి మాయ-వేదన అను మిథునద్వయము గలిగెను. భయమునుండి యామాయ భూతాపహారిణి యగు మృత్యువును గనెను-39. తరువాత వేదన నుండి దుఃఖము గలిగెను. తరువాత భయంకరమైన మృత్యువునుండి వ్యాధి, జ్వర-శోకములు క్రోధము అసూయయును గలిగెను. ఇవి యన్నియు దుఃఖము నిండినవి. అధర్మ లక్షణములు-40. వారికి వారికి భార్యగాని పుత్రుడుగాని, వారందరు నిధనులే (మరణములే) యనబడిరి. ఈ విధముగా నిధి ధర్మనియామకమైన తామస సృష్టికలిగినది.
ప్రజలను సృజింపుమని బ్రహ్మచే నీలలోహితుడైన శివుడాజ్ఞా పింపబడెను. ఆతడు ధ్యానించి ఆత్మ సంభవమైన సతిని భార్యగా నిర్మించుకొనేను-42. తనకు మించకు తగ్గకయు సమముగానున్న వేయివేల (10 లక్షల) మానవసుతులను సృజించెను. వారందరు కృమివాసస్సుతో (పట్టువస్త్రముతో) రూప-తేజో-బల-శ్రుతములతోను తనకు సమానులు.
ఎఱ్ఱని గోరోచనపువర్ణముగల) వారిని, సన్ని కర్పులను, జటాజూటముగలవారిని, విలోహితులను (ఎర్రని వారిని), వస్త్రములేని వారిని, కోతిరంగు వెంట్రుకలు గలవారిని, దృష్టాలను బోగోట్టువారిని కపాలములు ధరించు వారిని-44, బహురూపములు గల వారిని విరూపులను, విశ్వరూపులను రూపవంతులను, రథములు గల వారిని, కవచములు గల వారిని, ధర్ములను, సేనలను-45, లక్షబాహువులు గల వారిని, దీవులను భౌములను (భూమియందుండువారు) అన్తరిక్షగులను (ఆకాశమునందుండు వారు, లావుతలగలవారిని, ఎనిమిది కోరలు గల వారిని, రెండునాలుకలు గలవారిని, మూడు కన్నులు గల వారిని-46, అన్నముదినువారిని, మాంసముదినువారిని, నేయి ద్రాగువారిని, సోమరసమును ద్రాగు వారిని, మేదస్సును దాగువారిని అతి కాయులను లావు శరీరముగలవారు) నల్లనికంఠము తీవ్రకోపమును గల వారినీ-47, అమ్ములపొదులు గల వారిని, తలత్రము పై (రక్షణకవచము) గలవారిని, ధనుర్దారులను, ఉపకవచముగలవారిని, కూర్చున్నవారిని, పరిగెత్తుచున్న వారిని, ఆవులింతలు దీయువారిని, ధిష్ఠితులను (నివసించినవారిని), అధ్యాపకులను జపము చేయుచున్నవారిని, కలియుచున్నవారిని, ధ్యానము జేయుచ్ను వారిని, మండుచ్ను వారిని, వర్షించుచున్నవారిని, ప్రకాశించుచున్న వారిని మిక్కిలి పొగవేయబడిన వారిని-48, 49, బుద్ధులను, బుద్ధతములను, బ్రహ్మలో నిలచినవారిని, శుభదర్శనులను, నీలకంఠులను, సహస్రాక్షులను, సమస్తరాత్రి చరులైన రాక్షసులను, సర్వభూతములకు కనబడని వారిని, హాహాయోగులను, మహా తేజస్సు గలవారిని, రోదనము చేయుచున్నవారిని, పరుగిడుచున్న వారిని, ఈ విధముగా గలిసియున్న వారిని వేలకు వేలు అపాతయాములను రుద్రరూపులు ఐన సురోత్తములను సృజించెను.
బ్రహ్మ యీ వీరిని చూచి యిటువంటి ప్రజలను సృష్టించవలదనెను. నీకు సమానులైనట్టి వారిని గాని, నీకంటే నధికులైనట్టివారిని గాని ప్రజలను సష్టింపరాదు. నీవితరులను సృజింపుము నీకు భద్రమగును. నేనున్నాను. ప్రజలను సృజింపుము అనేను-52. యీ నేను సష్టించిన వారు విరూపులు నీలలోహితులు వేయివేలు నాతో సమానులుగా నిశ్చయింపబడినవారు-53. రుద్రులను మహాబలురు దేవతలు గాగలరు. భూమిలోను ఆకాశమునను రుద్రనామముతో ప్రసిద్ధులు-54. శతరుద్రులని పిలువబడిన వారు కాగలరు. యజ్ఞమునకరులు దేవయుగములతోబాటు యజ్ఞఫలమును బొందువారు గూడకాగలరు-55. చందజులై స్వేచ్ఛతో బుట్టినవారై మన్వన్తరములలో బుట్టబోవువారితో బాటు యూగము జేయబడుచువారైయుగక్షయము వరకిచటనుండగలరు. ధీమంతుడైన మహాదేవునిచే నిట్లు చెప్పబడినవాడై బ్రహ్మ, సంతసించుచున్న ప్రజాపతియై యపుడు భీముడైన శివునకిట్లని మారుపలికెను-57. ఓ ప్రభూ! నీవు చెప్పినట్లే అట్లే అగుగాక. నీకు శుభమగుగాక అంత బ్రహ్మసమ్మతించగనే ఎల్లప్పుడు ఎల్ల విషయములు జరిగినవి.
అప్పటినుండి దేవేశుడైన యీశ్వరుడు ప్రజలను ప్రసవించలేదు. ఊర్థ్వరేతస్కుడై మహాభూత ప్రలయమువరకు స్థాణువై కదలని మొద్ది) యుండెను. ఆతడు నేను కదలక ఉన్నాను. అన్నందువలన స్థాణువనబడెను-59. జ్ఞానము వైరాగ్యము. ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధీతి, స్రష్టత్వము (సృష్టిచేయుతనము), ఆత్మజ్ఞానము, అధిష్ఠాతృత్వము (అందరికి పై నుండువాడు) ఈ యైదు నిత్యము శంఖరుని యందుండును-60. సమస్తదేవతలను ఋషులను అసురులను గూడ తేజస్సుతో అతిశయించును గాన నాతడుమహాదేవుడనబడినాడు-61. ఐశ్వర్యము వలన దేవతలను, బలముచే రాక్షసులను, జ్ఞానముచేత మునులనందరిని యోగమువలన భూతములను అన్ని విధముల మించినవాడు.
ఋషులనిరి:- ఓ మహామునీ! యోగమును, తపమును, సత్యమును, ధర్మమును, మాహేశ్వరజ్ఞానమును సాధనమును మాకు జెప్పుడు-63. బ్రాహ్మణులు యేయే ధర్మమునాచరించుటచే సద్గతిని (జ్ఞానమును) పొందగలరు. ఓ ప్రభో మాహేశ్వర యోగమైనదానినంతయు వినగోరుచున్నాను.
వాయువు పలికెను:- రుద్రునిచే పురాణము లందు ఐదు ధర్మములు చెప్పబడినవి. క్లిష్ట కర్ములు గాని రుద్రులచే నది మాహేశ్వర్యముగా చెప్పబడినది-65. ఆదిత్యులు, వస్తువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, భృగువులు, దేవాలయములు గలవారు-66. యముడు శుక్రుడు ముందుగాగల పితరులు కాలాన్తకులు వీరు మరికొందరైన అనేకులచేత ఆధర్మములు పాసింపబడినవి-67. వారు అత్యంతము క్షీణించిన కర్మలుగలిగి, శరత్కాలమేఘము వలే నిర్మలములైన మునిగణములు తమయాత్మయందాత్మను సంధానముజేసి (కలిపి) యుపాసింతురు-68. గురువులకు ప్రియమును హితమును జేయుటకు బూనుకొన్న వారు. గురువుల ప్రియమును గోరువారు మానుషజన్మను వదిలి దేవతలవలె విహరింతురు.
మహేశ్వరునిచే చెప్పబడిన యా ప్రాచీన ధర్మములనన్నింటిని క్రమయోగమున జెప్పెద వినుడు-70. ప్రాణాయామము అట్లే ధ్యానము ప్రత్యాహారము (ఇంద్రియములను విషయములనుండి మరల్చుట) ధారణ, స్మరణము ఈ యైదును ఈ యోగముననైదు ధర్మములనబడినవి-71. క్రమ విశేషముతో వాని లక్షణమును కారణమును నిజముగా రుద్రుడు జెప్పినరీతిగనే చెప్పబోవుచున్నాను-72. ప్రాణము (వాయువు) యొక్క పొడవైన నడక ప్రాణము యొక్క ఆయామమనబడును. అదియును మన్దము, మధ్యమము, ఉత్తమము అని మూడు విధములు-73, ప్రాణముల నిరోధము అనునది ప్రాణ వాయువుల నరికట్టుట ప్రాణాయామ మనబడినది. ప్రాణాయామ ప్రమాణము పండ్రెండు మాత్రలనబడినది-74. మన్ల ప్రాణాయామము పండ్రెండు మాత్రలు, పండ్రెండు ఉద్ఘాతములు ప్రారంభములు) అనబడినవి. మధ్యమ ప్రాణాయామము రెండు ఉద్ఘాతములు, ఇరువది నాలుగు మాత్రలు (పరిమాణముగలది) 75 ఉత్తమ ప్రాణా యామము మూడుద్ఘాతములు ముప్పది యారుమాత్రలు గలది. యనబడును. చెమట కంపము (వణుకు) విషాదములను గలుగజేయునది యుత్తమమనబడును-76 ఈ విధముగ ప్రాణాయామలక్షణము మూడువిధములుగా జెప్పబడినది. ఇది ప్రాణా యామము యొక్క ప్రమాణము సంగ్రహ లక్షణమున్ను (అని తెలియవలెను).
సింహము గాని యేనుగు గాని యట్లే వేరొక మృగము గాని ఆరణ్యమున పట్టుకొన బడినదై సేవింపబడుచు క్రూరస్వభావము వదిలి మృదు స్వభావముగలది యగును-78. సమస్త పాపాత్ములకు పట్టుబడని ప్రాణము యోగము వలన సేవింపబడుచున్నదై యభ్యాసమువలన ఆ ప్రాణమే పట్టుబడును-79. ఆ ప్రాణమే సింహము వలె ఏనుగువలె కాలాన్తరవశమువలన, యోగమువలన, పరిమర్దనము వలనను దుర్బలమగును-80. వాయువు యోగము నందుండి వశ్యత్వమును బొందును. అట్లే మనోదేవుని గప్పివాయువు ప్రాణము జీవించును. వాయువు యోగము నందుండి వశ్యత్వమును బొందును. అంట్లే మనోదేవుని గప్పి వాయువు ప్రాణము జీవించును-81. వాయువు యోగమునందుండి వశ్యత్వమును బొందినపుడు స్వేచ్ఛగా ప్రాణమును కోరినచోటికి గొనిపోవును-82. సింహముగాని ఏనుగుగాని మనుష్యుల వశమందుండి మనుష్యలనితర మృగములనుండి ప్రవర్తించును. అభయమునకై అట్లే విశ్వతోముఖమైన (సర్వవ్యాపియైన) వాయువు పరిచితమై పరిధ్యాయమానమై ప్రాణాయామమున శరీరమందు సంరుద్దమై పాపమును దహించివేయును. పెంచిన కుక్క యజమానిని ఇతరుల భయమునుండి రక్షించినట్లే సర్వవ్యాపియైన వాయువు ప్రాణవాయువుగా శరీరమున బంధింపబడి శరీరఘాతుకములైన దోషములనన్నింటిని దహించివేయునని భావము-83, 84. ప్రాణయామముతో యుక్తుడైన నియమబద్ధుడైన బ్రాహ్మణునకు సర్వదోషములు నశించును. అతడు సుస్వస్థుడు గూడనగును-85. సర్వతపములు సర్వయజ్ఞఫలములు ప్రాణాయామమునకు సమానము.
నూరేండ్లు ప్రతి మాసమున దర్బాగ్రముతో నీటి బిందువును ఆదర్బాగ్రముతో బాటు తిని యుపవాసము చేయుటతో ప్రాణాయామము సమానము-87. ప్రాణాయామములతో దోషములను దహింపజేయవలెను. ధారణలచే పాపములను దహింపజేయవలెను. ప్రత్యాహారముచే (ఇంద్రియములవిషయనివృత్తిచే విషయసుఖములను, ధ్యానముచే అనీశ్వరములైన (ఈశ్వరత్వప్రాప్తికి విరుద్దములైన గుణములను దహింపజేయవలెను-88. కావున యుక్తుడైన (సమర్థుడైన) యోగి ప్రాణాయామపరుడు గావలెను. వాడు సర్వపాపములు తొలగి విశుద్ధాత్ముడై పరబ్రహ్మను జేరును-89.
ఇది శ్రీ వాయు ప్రోక్తమైన మహాపురాణమున మన్వన్తరాది వర్ణనమనునది పదియవ యధ్యాయము.
