వాయు మహా పురాణము
3 - సృష్టి ప్రకరణము
సూతుడిట్లు పలికెను:- సర్వ శ్రేష్ఠమగు పరాక్రమము, కర్మ, బుద్ది మరియు తేజస్సు కలిగినట్టియు, అనంత సూర్యుల వర్చస్సు కలిగినట్టియు, ముల్లోకములను సంహరించి, సృష్టించునట్టియు, దేవ దేవుడైన మహేశ్వరుని కొరకు నమస్కారము. ముల్లోకములలో పూజింపబడే ప్రజాపతులను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, భృగువును, మరీచిని, మనువును మరియు, రజస్తమోధర్మములు గల కశ్యపున, వసిష్ఠుని, దక్షుని, అత్రిని, పులస్త్యుని, కర్దముని, రుచిని, సూర్యుని, క్రతువును, అంగిరసమహర్షిని, ప్రజాపతిని, మరియు పులహుని మనసా స్మరించి, శిరసా నమస్కరించెదను.
మరియు, ఇరువది ఒకటవ ప్రజాపతి యగు చుక్రోధనుని, నమస్కరించెదను. పురాతనులు, శాశ్వతులు, తమ తమ శిష్యగణములతో కూడియున్నవారు. ధైర్యము (జ్ఞానము) తో శోభించువారునగు ఇతర ఋషులను నమస్కరించెదను. తపస్సు, సదాచారము, దయలతో కూడిన బృహస్పతి శుక్రాది మునిపుంగవులను నమస్కరించి కలి యొక్క పాపమును పోగొట్టే పురాణమును చెప్పెదను.
ప్రజాపతి యొక్క ఈ సృష్టి సర్వ శ్రేష్ఠమైనది. దీని యందు ఇంద్రుడు, దేవ గణములు, ఋషి గణములు విరాజిల్లు చున్నవి. తపోధనులు, మహా తేజశ్శాలురునగు ప్రజాపతుల శుభమైన, సాటిలేని, పుణ్యశాలియగు, ఋషి పూజితమగు సృష్టిని కూడా వర్ణించెదను. బ్రహ్మగారీ పగలు ప్రారంభమయ్యే వేళలో ఆయన సృష్టి సామర్థ్యము ఈ జగద్రూపముగా ప్రకటితమయ్యెను. వేదమునందు, స్మృతుల యందు వర్ణింపబడి, వాయుదేవునిచే కీర్తింపబడిన ఈ మహామహిమాన్వితమగు సృష్టిని వర్ణించేదను.
ఈ పురాణము సుందరమగు సమాసములతో, విశిష్టమగు శబ్దములతో మనస్సునకు ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పముచే ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పముచే ప్రధానము నుండి బయలుదేరిన ప్రథమ సృష్టిని బంధింపబడినది. జగత్కారణము, ప్రమాణ గోచరము కానిది, ప్రకృతికి మూలము, ఆత్మ రూపముగా హృదయగుహ యందు ప్రకాశించే ద్రష్టయగు పరబ్రహ్మ వర్ణింపబడినది. క్షేత్ర స్వరూపము, మరియు అక్షర శబ్దవాచ్యుడు, అమృతస్వరూపుడు, శుద్ధజ్ఞానస్వరూపుడు, నిత్యుడునగు జీవుని స్వరూపము, ముల్లోకములకు పితామహుడగు బ్రహ్మగారిని సృష్టించిన అప్రమేయు (ప్రమాణములకు అందని డగు పరమాత్మ స్వరూపము నిరూపింపబడినవి.
రజోగుణ ప్రధానుడగు సృష్టికర్త సృష్టి కాలమునందు కర్మ ఫలానుసారముగా, క్షేత్రజ్ఞుని (జీవుని) తో గూడిన, పాంచ భౌతిక వికారములగు దేహములను సృష్టించి, ఆ ప్రాణుల ద్వారా వాటి వాటి సంతానము వృద్ధియగు నట్లేర్పరిచెను. జగద్రూపముగా పరిణమించిన ప్రకృతి యందు మహేశ్వరుడు సంకల్ప మాత్రము చేతనే తన ఎనిమిది అవస్థా విశేషములను (మూర్తులను) సృష్టించెను. దేవతలు, అసురులు, పర్వతములు, వృక్షములు, సముద్రములు, మనువులు, మహారాజులు, ఋషులు, పితరులు, ద్విజులు, పిశాచములు, యక్షులు, నాగులు, రాక్షసులు, నక్షత్రములు, గ్రహములు, సూర్యుడు, సప్తర్షి మండలము, నిశాచరులు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, రాత్రులు, పగళ్లు, దిక్కులు, కాలము, యోగములు, యుగములు, అయనములు, వనములు, ఓషధులు, లతలు, సరస్సులు, అప్సరసలు, పశువులు, విద్యుత్తు, వర్షము, మేఘములు, పక్షులు మొదలగు వాటి గతి, విభాగము ఈ పురాణము నందు వర్ణింపబడినవి. భూమి యందు, ఆకాశము నందు ఉండే సూక్ష్మ గమనము గల ప్రాణులు, మరియు చెట్లు మొదలగు కదలని ప్రాణులు ఇత్యాది సర్వప్రాణుల గతి, విభాగములు దీనియందు గలవు. ఛందస్సులు, వేదములు, ఋక్కులు, యజుస్సులు, సామలు, సోమము మరియు యజ్ఞము దీని యందు వర్ణింపబడినవి.
ఆ బ్రహ్మదేవుడు తన అభిమతముననుసరించి వివిధ ప్రాణులకు జీవికను కల్పించుట, ముందుగా వైవస్వతమనువు యొక్క పుట్టుక వర్ణింపబడినవి. ముల్లోకముల యందు పూజింపబడే ఇంద్ర, బృహస్పతి, మన్వాది ధీశాలురపుట్టుకచే ఈ సృష్టి పూర్ణమై ప్రకాశించినది. అట్టి ఆపుణ్యాత్ముల ఉత్పత్తి కూడా వర్ణింపబడినది.
రుద్రుని శాపముచే దక్షుడు మనుష్య లో మలో జన్మించి, నియమబద్దముగా జీవించుట, దక్షుడు రుద్రునకు ప్రతి శాపమునిచ్చుట. మన్వంతరములు మారుచుండుట, యుగములయందు జరిగే సృష్టి ప్రళయములు, ఋషి ధర్మము, యుగాదుల యందు దాని వృద్ధి వర్ణింపబడును. ద్వాపర యుగములందు వేద విభాగము చేసిన వ్యాసుల క్రమము, కల్పములోని సంవత్సరముల సంఖ్య, లోకముల సంఖ్య, బ్రహ్మగారి దినములోని కాలమానము అను విషయములు ఈ పురాణములో నిబంధింపబడినవి.
అండజములు (గ్రుడ్డు నుండి పుట్టే పక్ష్యాదులు), ఉద్భిజములు (భూమి నుండి పుట్టే వృక్షాదులు) స్వేదజములు (చెమట నుండి పుట్టున నల్లులు మొదలైనవి), జరాయుజములు (గర్భము నుండి పుట్టే మనుష్యాదులు) అను నాలు రకముల ప్రాణులు, స్వర్గాది లోకములను పొందే ధర్మాత్ములు, నరకములో యాతనలను అనుభవించే జీవుల వివరములు ఈ పురాణములో సోపపత్తికముగా వర్ణింపబడినవి. ఆత్యంతీక ప్రళయము (జగత్తు ఈశ్వరుని యందు విలీనమగుట), ప్రాకృతిక ప్రళయము (దేహము పతనమగుట), నైమిత్తిక ప్రళయము (నిద్రలోనికి జారుకొనుట), బంధ మోక్షములు, సర్వోత్కృష్టమగు ప్రాజాపత్య స్థానముతో కూడిన సంసారగతి దీనియందు వర్ణింపబడినవి. ప్రళయమునందీ బ్రహ్మాండములు జగత్కారణమగు ప్రకృతి యందు నిలీనమై యుండుట, ఇత్యాది విషయములను అన్నింటిని ధీశాలురగు మీ ముందు నా బుద్ధిశక్తి ననుసరించి ఆవిష్కరించెదను. ఓ విప్రులారా! వాయుదేవునిచే మహర్షులకు చెప్పబడిన పురాణమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను. వినుడు.
శ్రీ వాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అనే మూడవ అధ్యాయము ముగిసినది.
