వాయు మహా పురాణము

Table of Contents

6 - సృష్టి ప్రకరణము

 సూతుడిట్లు పలికెను:- జలములు అగ్ని నుండి పుట్టినవి. ప్రలయములో అగ్ని నష్టమాయెను. భూమండలము జలములలో మునిగి పోయెను. చరాచరులగు ప్రాణులు నశించెను. అపుడు సర్వము ఒకే జలరాశిగా నుండి, ఏమియూ తెలియకుండెను. అపుడు అనంతములగు నేత్రములు కలిగినట్టియు, అనంతములగు పాదములు కలిగినట్టియు, అనంతములగు శిరస్సులు కలిగిట్టియు, బ్రహ్మ రూపుడైనట్టి భగవాన్ నారాయణుడు ఆ జలమునందు నిద్రించేను. ఆయన సత్యగుణము యొక్క ఉద్రేకము కలిగి, నిద్ర లేచి, సర్వము శూన్యముగ నుండుటను, గాంచెను. నారాయణుని గురించిన ఒక శ్లోకమును పండితులు ఉదహరించెదరు. నారములు అనగా జలములు అని వినియున్నాము. జలముల యందు నిద్రించును గనుక, భగవానునకు నారాయణుడు అని పేరు కలిగెను. నరుని (పురుషోత్తముని) నుండి పుట్టుటచే జలములకు నారములని పేరు కలిగెను.

భగవానుడు వేయి యుగముల రాత్రి కాలమునందు నిద్రించి, రాత్రి పూర్తి కాగానే సృష్టిని ప్రారంభించుట కొరకై బ్రహ్మను నిర్మించెను. అపుడా బ్రహ్మ ఆ జలమునందు వాయు రూపముతో, వర్షా కాలములో రాత్రి యందు ఇటునటు తిరుగాడు మిణుగురు పురుగువలే, సంచరించెను. అపుడాయన ఆ జలములో భూమి మునిగియున్నదని తెలుసుకొనెను. కాని, ఆ భూమిని పైకి ఎత్తుటకై ఏమి చేయవలెనో ఆయనకు తెలియలేదు. అపుడా పరమేశ్వరుడు తన మనస్సుచే పూర్వకల్పములయందు తాను మరియొక దివ్య దేహమును ధరించిన విధమును స్మరించెను.

భగవానుడు సర్వము జలముచే నిండియుండుటను, భూమి దాని యందు మునిగి యుండుటను గాంచి, “నేను ఏ పెద్ద రూపమును ధరించి, ఈ భూమిని పైకి ఎత్తవలెను?” అని ఆలోచించీ, నీటిలో ఆడుట యందు అభిరుచి గల వరాహము యొక్క రూపమును స్మరించెను. అపుడు పరమేశ్వరుడు దాల్చిన వరాహమూర్తిని ప్రాణులేవియూ జయించలేవు. అది జ్ఞాన రూపమైన, ధర్మము అను పేరు గల వరాహము. అది పది యోజనములవైశాల్యమును, వంద యోజనముల యెత్తును కలిగి, నల్లని మేఘమువలె భాసించుచుండెను. దాని, శబ్దము మేఘగర్జనను బోలి యుండెను. దాని తెల్లని దేహము పెద్ద పర్వతమును బోలి యుండెను. దాని పదునైన దంతములు భయమును గొల్పుచుండెను. దాని నేత్రములు మెరుపువలె, అగ్నివలె ప్రకాశించెను. అది సూర్యునితో సమానమైన తేజస్సును కలిగియుండెను. దాని భుజస్కంధములు బలిసి, విశాలముగా, గుండ్రముగా నుండెను. అది సింహము వలె విక్రమముతో నడచెను. దాని కటిభాగము బలిసి ఎత్తుగా నుండెను. మృదువైన నున్నని దేహము గల ఆ వరాహము శుభ లక్షణములను కలిగి యుండెను. శ్రీహరి అట్టి విశాలమగు వరాహ రూపమును ధరించి, భూమిని పైకి ఎత్తుట కొరకై రసాతలమును ప్రవేశించెను.

వేదవేద్యుడగు పరమాత్మ యజ్ఞ వరాహము యొక్క మూర్తిని దాల్చెను. యజ్ఞము దాని వక్షస్థలము. చితి (యజ్ఞములోని ఇష్టకాచితము) దాని నోరు. అగ్నియే జిహ్వ. దర్భలే రోమములు. బ్రహ్మయే శిరస్సు కాగా, ఆ వరాహము దుర్నిరీక్ష్యముగా ప్రకాశించేను. రాత్రింబగుళ్లు కనులు, వేదాంగములు (శిక్షా, వ్యాకరణ, ఛందః, నిరుక్త, కల్ప, జ్యోతిషములు) చెవులకు ఆభరణములు, హోమద్రవ్యమగు ఆజ్యము ముక్కు, స్రువము, (హోమము చేయు గరిటె) తుండము కాగా, సామవేదఘోషయే ఆ వరాహము చేయు పెద్ద శబ్దము ఆయెను. సత్యము, ధర్మము స్వరూపముగా గల ఆ వరాహము ధర్మముయొక్క పరాక్రమముతో శోభిల్లెను. ప్రాయశ్చిత్త కర్మలు ప్రియముగా గల ఆ యజ్ఞ వరాహము పెద్ద ఆకారముతో భయమును గొల్పేను. యజ్ఞ పశువు దాని మోకాలు ఆయెను. ఎత్తైన దేహము గల ఆ వరాహమునకు హోమము లింగము కాగా, గొప్ప ఓషధులు బీజము ఆయెను. వేద వేద్యుడగు పరమాత్మ దాని అంతరాత్మ. మంత్రము దాని పిరుదులు. హోమద్రవ్యములగు నేయి, సోమరసము రక్తము ఆయెను. వేదములు ఆ వరాహము యొక్క స్కంధము లాయెను. హోమ ద్రవ్యముల గంధము కలిగిన ఆ వరాహము హవ్య (దేవతల కర్పింపబడునది), కవ్య (పితృదేవతల కీయబడునది) ముల వేగము కలిగి యుండెను. యజ్ఞశాలయే దేహము కాగా ఆ వరాహము యజ్ఞేయ దీక్షలతో కూడి విరాజిల్లు చుండెను. యోగశక్తి గల ఆ వరాహము దక్షిణలే హృదయముగా, మహా సత్ర యాగము స్వరూపముగా ప్రకాశించెను. ఉపాకర్మేష్టి యొక్క ప్రకాశము గల ఆయజ్ఞ వరాహము ప్రవర్యము (యజ్ఞములోని ఒక కర్మ) అలంకారముగా కలిగి యుండెను.

ఆ వరాహము, వైదిక ఛందస్సులు నడిచే మార్గము కాగా, ఛాయయే పత్ని కాగా, రహస్యములగు ఉపనిషత్తులు ఆసనము కాగా, మణులు పొదిగిన పర్వత శిఖరమువలె ఉన్నతమై భాసించెను. జగత్సభువు, ప్రజాపోషకుడు నగు శ్రీహరి ఇట్టి యజ్ఞ వరాహ రూపమును దాల్చి, నీటిలో ప్రవేశించి, మునిగియున్న భూమి వద్దకు చేరెను. ఆయన భూమిని సమీపించి, వెంటనే పైకి లేవనెత్తి, దాని యందలి సముద్ర జలములను సముద్ర పాతాళములో మునిగియున్న భూమిని శ్రీహరి లోకహితమును గోరి దంష్టతో పైకి లేవనెత్తేను.

భూమిని సృజించి వహించు భగవానుడు అపుడా భూమిని దాని స్థానమునకు తెచ్చి, మనస్సుతో సంకల్పించి విడిచి పెట్టేను. భూమి ఆ విశాలమగు జలరాశి పై పెద్ద నౌకవలె కన్పట్టెను. భగవానుడు అచట ఉంచుట వలన, భూమి మునిగి పోకుండగా ఉండగలెను. అపుడు పద్మము వంటి నేత్రములు గల శ్రీహరి జగత్తు స్థితిని కల్పించు ఇచ్ఛగలవాడై, భూమిని విభాగము చేయుటకు నిశ్చయించెను. ఆయన భూమిని సమముగా చేసి, ఆ పైన అక్కడక్కడ పర్వతములను సమకూర్చెను. పర్వతములు పూర్వము ప్రలయ కాలాగ్నిచే దహింపబడి, భూమి యందు అంతటా చెల్లాచెదురుగా విసిరి వేయబడి, క్రుంగిపోయెను. అపుడు ఆ చల్లని జలరాశి యందు వాయువుచే జలముల ద్వారా ఒక చోటకు చేర్చబడి, రాశులుగా చేయబడి పర్వతము లాయెను. ఇట్లు ఒక రాశిగా చేయబడిన తరువాత ఘనీభవించి, కదలిక లేని పెద్ద రాశులుగా అగుట వలన వాటికి అచలములని పేరు వచ్చెను. వాటి నిర్మాణములో వివిధ స్థాయిలలో సంధులు (పర్వలు) ఏర్పడుట వలన పర్వతములని పేరు వచ్చెను.

నీటి లోపల దాగి యుండుట వలన గిరులు అనియు, రాశులుగా ఘనీభవించుట వలన శిరోచ్చయములనియు పర్వతములకు పేర్లు వచ్చాను. ప్రలయమునందు లోకములు, సముద్రములు, పర్వతములు చెల్లాచెదరు కాగా, కల్పాదియందు మరల మరల విశ్వకర్మ వాటిని యథా భాగముగా విడదీయును. బ్రహ్మ మరల సముద్రములతో, ఏడు ద్వీపములతో పర్వతములతో కూడిన ఈ భూమిని, మరియు భూరాది (భూః, భువః, సువః, మహః) నాల్గు లోకములను సృష్టించెను. ఇట్లు లోకములను సృజించి, ప్రజలను కూడా సృష్టించెను.

స్వయంభువు, భగవంతుడునగు బ్రహ్మగారు వివిధ ప్రాణులను సృష్టించగోరెను. ఆయన పూర్వకల్పముల యందలి సృష్టిని బోలిన సృష్టిని చేసెను. ఆయన తన బుద్దిలో సృష్టిని గురించి ధ్యానము చేయుచుండగా, ప్రధానముతో బాటు అదే కాలములో తమోగుణాత్మకమగు సృష్టి బయల్వెడలెను. ఆ మహాత్ముని నుండి బయల్వెడలిన ఈ అవిద్యారూపమగు సృష్టియందు తమస్సు, మోహము, మహా మోహము, తామిస్రము, అంధము అను ఐదురకముల శ్రేణులు ఉండెను. సృష్టిని గురించి ధ్యానించగా, ప్రథమ శరీరాభిమాని యగు బ్రహ్మ నుండి, కుండచే మూసివేయబడిన దీపము వలె, అన్ని వైపులా తమోగుణముచే (అయిదు విధములుగా) ఆవృతమైన సృష్టి బయలుదేరెను.

ఈశ్వర చైతన్యము లోపల, బయటకూడ, వ్యాపించి యుండును. ఆత్మరూపమగు ఈ చైతన్యము శుద్ధము, నామ రూపములు లేనిది. కాని, ప్రథమ సృష్టియగు వృక్ష జాతిలో బుద్ది, మరియు ముఖమునందు ఉండే ఇంద్రియములు (ముక్కు, నోరు, చెవి, కన్ను), అజ్ఞానముచే కప్పివేయబడినవి. ప్రథమ సృష్టి ఈ విధముగా విఫలమగుటను గాంచి బ్రహ్మగారు చీకాకు పడిరి. అపుడాయన మరియొక సృష్టిని సంకల్పించిరి. బ్రహ్మగారు మరల ధ్యానము చేయగా, జంతుప్రపంచము సృష్టింపబడెను. జంతువులలో ఆహార గ్రహణము భూమికి సమాంతరముగా నుండుటచే, జంతు ప్రపంచమునకు తిర్యక్ గ్రోతస్సు అని పేరు. జంతువుల యందు తమోగుణము అధికముగా నుండుటచే, జ్ఞానహీనములై అవి తప్పు దారిలో నడుచును (అనగా, ఆ జన్మలో ఉన్నతిని పొందలేవు అని భావము); మరియు విపరీత జ్ఞానమును కలిగియుండును.

       తత్త్వములలో అహంకారము ఒకటి. ఇది 'నేను' అను రూపములో బుద్ధి యందు భాసించును. ఇంద్రియముల అశక్తులు పదకొండు బుద్దిలోని దోషములు పది హేడు. వెరసి ఇరవై ఎనిమిది. తుష్టి తొమ్మిది విధములుగ నున్నది. సిద్ధులు ఎనిమిది విధములుగ నున్నవి. ఈ తత్యములు అన్నియూ సాంఖ్యములో పరిగణింపబడినవి. ఇరువది ఎనిమిది విధముల అశక్తులు (వధలు)జంతు సృష్టియందు ఉండును. పశువులలో అంతరంగమునందు ప్రకాశము ఉన్ననూ, బాహ్యములో అజ్ఞానము యొక్క ఆవరణ గలదు. ఈ విధముగా నిర్మాణమైన రెండవ సృష్టియగు పశుప్రపంచమును చూచి బ్రహ్మగారు తన అభిప్రాయము వ్యర్థమైనదని భావించెను.

తరువాత తదేకముగా ధ్యానించి, బ్రహ్మగారు సత్యగుణ ప్రధానులగు దేవతలను సృష్టించెను. ఈ మూడవ సృష్టి ఊర్ధ్వ లోకములయందు చేయబడెను. దీనికి ఊర్థ్వ ప్రోతస్సు అని పేరు. మానవులు అగ్నిలో వ్రేల్చిన హవిస్సు సూక్ష్మ రూపములో ఊర్థ్వ లోకమును చేరి దేవతలకు ఆహారమగును. కావున, దేవ సృష్టికి ఊర్థ్వస్రోతస్సు అని పేరు. దేవతలు లోపల, బయట పూర్ణులై, సుఖ సంతోషములతో అలరారుదురు. ఊర్థ్వ స్రోతస్సులోని దేవతలు లోపల, బయట ప్రకాశము కలిగి యుందురు. ద్యులోకమునందు సంచరించు దేవతలు సంతుష్టాంత రంగులై యుందురు. దేవతలతో కూడిన ఈ ఊర్థ్వస్రోతస్సును సృష్టించి, జగత్ర్పభువగు బ్రహ్మగారు సంతసించి, మరల ఇంకొక సృష్టి కొరకు నిర్ణయించెను.

జగదీశ్వరుడగు బ్రహ్మగారు ఇంకనూ ధ్యానించెను. ఆయనది సార్థకమైన ధ్యానము. ఆయన మరియొక సఫలమగు సృష్టిని చేసెను. అవ్యక్తము నుండి శ్రేష్టుమగు అర్వాక్ స్రోతస్సు ఆవిర్భవించెను. మానవులలో ఆహార గమనము పై నుండి క్రిందకు ఉండుటచే మానవ ప్రపంచమునకు అర్వాక్సోతస్సు అని పేరు. మానవులు బుద్ది ప్రధానులు వారిలో రజస్తమోగుణములు మూడింటి యొక్క ఆధిక్యము కన్పట్టును. కావున, వారు దుఃఖములనధికముగా అనుభవిస్తూ, అనేక కర్మలను చేయుచుందురు. వారికి లోపల, బయట కూడా ప్రకాశము కలదు. మానవులు కర్మ ప్రధానులు. వారి యందు ఊహ, శబ్దము మొదలగు ఎనిమిది రకముల సిద్దులు ఉండును. మానవులు ఉన్నతిని పొందగల సమర్థులు. వారు గంధర్వులతో సమమగు లక్షణములను కలిగి యుందురు. ఈ విధముగా ఈ అర్వాక్సోతస్సు తేజోమయమగు సృష్టియని వర్ణింపబడినది.

అయిదవది అనుగ్రహ సర్గము. ఇది అవిద్య, అశక్తి (ఇంద్రియములకు శక్తి లేకపోవుట), తుష్టి (జ్ఞానము కొరకు శ్రమించాలనే ఆసక్తి లేకపోవుట), మరియు సిద్ధి (అధ్యయనము, దానము ఇత్యాది) అని నాల్గు విధములుగ నున్నది. అహంకారము మొదలు సర్వప్రాణుల వరకు గల తత్త్యములకు ఆధారముగా గల మౌలికార్థములు (ఇవి పది గలవు) ఆరవ సర్గము అగును. అవిద్యతోను, అశక్తితోను కూడియున్నది. అహంకారము, అవిద్యతోను, అశక్తితోను కూడియున్నది. మహత్తు యొక్క సృష్టి మొదటిది, ఆ మహత్తు నుండి పంచతన్మాత్రల (సూక్ష్మ భూతముల) సృష్టి రెండవది దీనికి భూతసర్గమని పేరు. ఇంద్రియముల సృష్టి మూడవది. ఈ మూడు కలిసి, సంకల్ప పూర్వకముగా ప్రకృతి నుండి బయల్వెడలిన సృష్టియగును. నాల్గవది ముఖ్య సర్గము. వృక్ష లతాదులు ముఖ్యములనబడును.

తిర్యక్ స్రోతస్సు అనబడే పశుపక్ష్యాదుల సర్గము ఐదవది. ఊర్థప్రోతస్సులగు దేవతల సృష్టి ఆరవది. దానికే దేవసర్గమని పేరు. ఏడవదియగు అర్వాక్సోతస్సుల సృష్టికి మానుషసర్గమని పేరు. ఎనిమిదవది అనుగ్రహ సర్గము. అది సత్య ప్రధానముగను, తమో గుణ ప్రధానముగను కూడా గలదు. ఈ అయిదు వైకృతి సర్గములు అనగా ప్రకృతి నుండి పుట్టిన వికృతుల నుండి పుట్టినవి. ప్రాకృత సర్గ. ఎలు మూడు. ఈ ప్రాకృత, వైకృత సర్గములే గాక తొమ్మిదవది యగు కౌమార సర్గము కూడ గలదు. ఇది ప్రాకృతము, వైకృతము కూడా. సంకల్పములేని మూడు ప్రాకృత సర్గములు బయలుదేరగా, బ్రహ్మగారి సంకల్పముచే మిగిలిన ఆరు సర్గములు బయలుదేరినవి.

నేను అనుగ్రహ సర్గమును విస్తరముగా కీర్తించెదను. తెలియుడు. అది సర్వప్రాణులలో నాల్గు విధములుగానున్నది. విపర్యయము, అశక్తి, తుష్టి మరియు సిద్ధి అను నాలు విధములు దానికి గలవు. వృక్షలతాదులలో విపర్యయము (ఆజ్ఞానము), పశుపక్ష్యాదులలో అశక్తి, మానవుల యందు సిద్ది, దేవతల యందు తుష్టి గలవు. ఈ తీరున, ప్రాకృత వైకృత సర్గములు తొమ్మిది వర్ణింపబడినవి. ఈ తత్యముల పరస్పర సృష్టులు అనేక ప్రకారములుగా నున్నవి. మున్ముందుగా బ్రహ్మగారు తనతో సమానులైన మానసపుత్రులను సృజించెను. సనందనుడు, సనకుడు, సనాతనుడు అనునవి వారి పేర్లు. వారు గొప్ప జ్ఞానులు, గొప్పతేజశ్శాలులు. జ్ఞానులగు ఆ ముగ్గురు మహానుభావులు తండ్రిచే త్యజింపబడుటచే, సంతానమును కనకుండగనే, ప్రలయములో ఈశ్వరుని యందు ఐక్యమును పొందిరి.

వారు అట్లు తొలగిపోగా, బ్రహ్మగారు వివిధ అధికారముల యందు, అభిమానము (నేను, నాది అను ధారణ) గల మానసపుత్రులను మరల సృజించెను. వీరు ప్రలయ కాలములో సర్వప్రాణులు నశించు వరకు ఉందురు. వీరు నామములను తెలియుడు. జలములు, అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, దిక్కులు, స్వర్గము, ద్యులోకము, సముద్రములు, నదములు, శైలములు, వృక్షములు, ఓషధులు, లతము, లవము (సెకను)లు, కాష్ట (రెండు సెకనులు)లు కల (నిముషము)లు, ముహూర్తము (48 నిముషములు) లు, సంధ్యలు, రాత్రులు, పగళ్లు, పక్షములు, నెలలు, అయనము (6 నెలలు) లు, సంవత్సరములు, యుగములు అనునవి వాటి పేర్లు. ఈ స్థానాభిమాని దేవతలు ఆయాస్థానముల నామములచే పిలువబడెదరు.

బ్రహ్మగారి ముఖము నుండి బ్రాహ్మణులు, వక్షస్నలము నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, మరియు పాదముల నుండి శూద్రులు జన్మించిరి. ఈ విధముగా వర్ణములన్నియూ ఆయన దేహము నుండి ఉద్భవించినవి. అవ్యక్తము (ప్రకృతి) కంటే నారాయణుడు ఉత్కృష్టమైనవాడు. అండము అవ్యక్తము నుండి పుట్టినది. అండము నుండి బ్రహ్మ జన్మించెను. ఈ లోకములు ఆయన చేత స్వయముగా నిర్మింపబడినవి. నేను ఇంత వరకు మీకు ఈ పురాణములోని ప్రథమ పాదమును విస్తరము కాకుండగా, సంగ్రహముగా చెప్పితిని.

శ్రీ వాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అను ఆరవ అధ్యాయము ముగిసినది.

ప్రక్రియా పాదము ముగిసినది.


 

శ్రీ గణేశాయనమః