వాయు మహా పురాణము
8 - చతురాశ్ర విభాగో
సూతుడు పలికెను:- ఆతడు (మహాదేవుడు) వేయి యుగములకు సమానమైన రాత్రి కాలమును సాగించి (ఉండి), రాత్రి చివర స్వర్గ కారణముగా బ్రహ్మత్వమును చేయుచున్నాడు (ధరించుచున్నాడు). అపుడు బ్రహ్మయైతే ఆ జలమున బ్రహ్మయై చరించెను. అపుడు ఆ అంధకారమున స్థావరజంగమములు నశించెను. జలము భూమియందంతట వ్యాపించెను. భూతములు విభాగములేక యేకమై యంతట నెలకొన్నవి. ఆ తరువాత వర్ష కాలమున రాత్రి యందు మెరుపు తీగవలె ఆ యాకాశమున తిరుగాడుచు ఆ స్వయంభువుడు (బ్రహ్మ) చూడబడుచుండెను.
అపుడు ప్రభువు (మహాదేవుడు?) నిలచుట కుపాయమును వెదికెను. అంత ఆ జలము నందు భూమి యంతర్గతముగా నున్నట్లు తెలిసికొనెను. అనుమానము వలన (ఊహ వలన) భూమి నుద్దరించుటను గూర్చి స్పురణకు దెచ్చుకొనెను. పూర్వకల్పములలో ధరించిన వేరొక శరీరమును (వరాహశరీరమును) అవలంబించెను. ఆ ప్రభువు వరాహ రూపమును ధరించి నీటిలో ప్రవేశించెను. ఆ తరువాత బ్రహ్మ జలములచే కప్పబడిన భూమిని బాగుగా జూచెను. ఆ తరువాత అతడు జలములలో నుండి భూమి నుద్దరించి దాని పైన జలములనుంచేను. సముద్ర జలములను సముద్రములలోను, నదీ జలములను నదులలోను పృథివీ జలములను పృధివియందును ఉంచెను. ఆ తరువాత నాతడు పర్వతములను ఏరుకొనెను.
ప్రళయాగ్నిచే పూర్వసృష్టి దహింపబడినప్పుడు ఆ యగ్నిచే భూమి యందంతట ప్రలీనములయ్యెను, శైత్యముతో ఏకార్ణవమైన దానియందు (ఏక సముద్రముగానైన దాని యందు) వాయువుచే జలములు హరింపబడినవై యెక్కడెక్కడ అంటి పెట్టు కొనబడి యుండెనో అక్కడక్కడ పర్వత మయ్యెను. అంటుకొని చలింపనందున అచలములైనవి. పర్వములు (కణుపులు పొరలు). ఉన్నందున పర్వతములైనవి. జలములచే నిగీర్ణ ములగుటచే (ప్రింగబడుటచే) గిరులైనవి. చయనములవలన (కూర్చుకొన్నందున) శిరోచ్చయములైనవి.
తరువాత ఆ ప్రభువు అంతర్జల ముల నుండి భూమిని పైకి లేపి దానిని తన స్థానమున నిలిపి మరల దానిని విభాగము జేసెను. ఆ భూమి యొక్క యేడు ద్వీపములయందు విషయముగానున్న ఏడేడు వర్షములను (భారత వర్షము మొదలగు ఏడు భూఖండములను) సమముగాజేసి శిలలచే పర్వతములను గూర్చెను. ఆ ద్వీపములయందు వర్షాన్తమున ఇరువది నాలుగు వర్షములు (దేశములను) ఇరువది నాలుగు పర్వతములును నెలకొల్పబడినవి. సృష్ట్యాదిలో అవి సహజముగనే యుండినవి, కల్పితములుగా నుండలేదు సప్త ద్వీపములును సముద్రములును పరస్పరము దగ్గరగా కలిసికోన్నవై పరస్పరము చుట్టుకొని మండలముగా నేర్పడినవి.
పూర్వము బ్రహ్మభూర్లోకము మొదలగు నాలుగు లోకములను అన్ని గ్రహములతో బాటు చంద్ర సూర్యులను ఈ స్థానములను అంతట సృష్టించేను. పూర్వము ఈ కల్పమునకు బ్రహ్మస్థానులను (స్థానముగలవానిని సృష్టించెను). జలమును అగ్నిని, భూమిని వాయువును ఆకాశమును ద్యులోకమును. స్వర్గమును దిక్కులను సముద్రములను, పర్వతములను, నదులను, సర్వ పర్వతములను, ఓషధులయొక్క ఆత్మను (బీజమును) వృక్షముల యొక్కయు తీవల యొక్కయు ఆత్మను (బీజములను) సృష్టించెను.
లవములు, కాష్ఠలు, కలలు, ముహూర్తములు, సంధులు, రాత్రులు, అహస్సులు, అర్ధమాసములు, మాసములు, అయనములు, అబ్దములు, ఈ కాల విభాగములను సృష్టించెను. స్థానాభిమానులను, స్థానములను, స్థానాత్మలను సృష్టించి, యుగావస్థను గూడ నిర్మించెను.
కృతయుగమును, త్రేతాయుగమును, ద్వాపరయుగమును, కలియుగమును గూడ నట్లే సృష్టించెను. కల్పాదిలో మొదటి కృతయుగమున ప్రజలను సృష్టించెను.
నేను మొదట నీకు జెప్పిన పూర్వకాల ప్రజలు ఆవర్తమాన కల్పమున అప్పుడు అగ్నిచే దహింపబడిరి. వారు తపో లోకమును పొందనివారై జనలోకమునాశ్రయించిరి. వారు మరల జరుగు సృష్టికి బీజముల కొరకై ప్రవర్తించియుండిరి. హరచట పునః సృష్టి కారణమున బీజార్థముగా నుండిరి. ఆ తరువాత సృజింపబడుచున్నవారై వారు సక్తానము కొరకు (ఉపయోగము) అగుడుండిరి. వారిచట ధర్మార్థకామమోక్షములకు సాధకులుగా తలంపబడిరి. దేవతలు, పితరులును ఋషులును, మనువులను, తపోయుక్తులై వారి స్థానములను నింపుచుండిరి కదా. వారు బ్రహ్మయొక్క మనస్సునుండి బుట్టిన వారై సిద్ధాత్ములగు చున్నారు గదా. ద్వేషముతో కూడిన కర్మతో, దివమునకు వెళ్లిన సృష్టి వారు ప్రతియుగమున మరల నిటకు తిరిగి వచ్చి పుట్టుదురు. వారు తమ కర్మ ఫలశేషము వలన తథాత్మకులుగా(?) ప్రసిద్ధి చెంది కర్మ సంశయబంధనరూపమై జనలోకము నుండి బుట్టుదురు.
కర్మల యొక్క యా యాశయము (అభిప్రాయము) అచట కారణమని తెలిసికొనవలెను. శుభా శుభరూపములైన యాకర్మల చేతనే జనలోకము నుండి లోకులు పుట్టుచున్నారు. యోనులలో వారు నానా రూపములైన శరీరములను గ్రహింతురు. దేవాద్యమై స్థావరాన్తమైన దానియందు (జగమున) పరస్పరము, బుట్టుదురు. అట్లు మాటిమాటికి సృజింపబడుచున్నవారై వీరు, వారు సృష్టికి పూర్వము జేసిన కర్మలనే, పొందుచుండిరి. హింసా?హింసలు, మృదుక్రూరములు, ధర్మాధర్మములు, ఋతానృతములు, వీనిచే భావింపబడినవారై (యాకర్మలను) పొందుదురు. కావున అది యాతనికి రుచించును.
గత కల్పములలో నున్న రూపనామములనే రానున్న (భవిష్యత్) కాలమున సామాన్యముగా వారు పొందిరి. వారు ఆ నామ రూపములతోనే మరల మరల జన్మింతురు. అంత (ఆ తరువాత) సృష్టి చేయదలచిన బ్రహ్మ యొక్క సృష్టి నిలిచిపోగా, ధ్యానము జేయుచున్న యా బ్రహ్మయొక్క సత్యస్వరూపమును ఆ ప్రజలు అభిధ్యానించువారైరి.
ఆ బ్రహ్మ అపుడు తన ముఖము నుండి వేయి మిధునములను సృజించెను. ఆ జనులు సత్య గుణముతో నుద్రేకమును జెందినవారు సుచిత్తులుగా నొప్పియుండిరి. ఆ బ్రహ్మ వక్షస్థలము నుండి మరొక వేయి జంటలను సృజించెను. వారందరు రజోగుణముచే నుద్రేకమును జెందిన వారై శౌర్యతేజము గలవారును శౌర్యతేజములేనివారును ఐరి. బ్రహ్మ తన యూరువుల (తొడల) నుండి మరొక వేయి జంటలను సృజించెను. రజస్తమోగుణములచే నుద్రేకమును జెందినవారై వారందరునుఊహా శీలురుగా తలపబడిరి. బ్రహ్మపాదములజంట నుండి మరొక వేయి మిథునములను సృజించెను. వారందరు తమో గుణముచే నుద్రేకమును జెందినవారై నిః శ్రీ కులును (దరిద్రులు కళాహీనులు) అల్పతేజస్కులును అయిరీ. అంత ఆ జంటల నుండి బుట్టిన ప్రాణులు సంతసించుచున్నవారై పరస్పరము కామావేశము జెందినవారై మైథునమునకు (సంభోగమునకు) బూనుకొనిరి-40. అప్పటి నుండి యీ కల్పమున మిథునోత్రి చెప్పబడినది. అపుడు స్త్రీ నుండి ప్రతి మాసమున ఆర్తవము (ఋతుక్రియ) వెలువడుట అనునది తెలియబడినది. (తెలియబడలేదు?). ఆ కారణమున మైథునము సేవించినను (స్త్రీలు) ప్రసవించకుండిరి. ఆయుష్యము చివరలో ఆ మిథునములే ఒక్కమారు (మాత్రమే) (సంతానమును) ప్రసవించుచుండెడివి-42. మరణింపగోరినవారుగా జేయబడిన కుటకులును కులికులును పుట్టుచుండిరి. అప్పటి నుండి యీ కల్పములో గూడ మిథునముల పుట్టుక జరిగినది.
మనస్సుతో ధ్యానము చేసినపుడు (మనసు చింతించినపుడు) ఆ ప్రజలకు ఒక్కమారు (సంతానము) కలుగుచెండెడిది. అది శబ్దాదులకు విషయమైనది, శుద్దమైనది, ప్రత్యేకముగా ఇలక్షణములు గలది. ఈ విధముగా పూర్వము బ్రహ్మ యొక్క మానససృష్టి మొదట జరిగెను. దాని వంశముననే బుట్టిన వారు ఈ జగమును నింపిరి. నదులు, సరస్సులు, సముద్రములు వీనిని పర్వతములను గూడ (ఆ ప్రజలు) సేవించుచుండిరి. అప్పుడా యుగమున అత్యంబువులుగాని, అతిశీతములుగాని, అత్యుష్ణములుగాని చరింపకుండెను.
పృథివీరసము నుండి బుట్టిన యాహారమును తినుచుండిరట. ఆ ప్రజలు కామచారిణులు. మానసిసిద్ధిని పొందినవారు. వారిలో ధర్మాధర్మములు లేకుండెడివి. వారొక నిర్విశేషులైన (విశేషములు లేని) ప్రజలు ఆ కృతయుగములో వారి కాయువు, సుఖము, రూపమున్ను సమానములు, (తారతమ్య భేదము లేదు).
కల్పాది యందు కృత యుగములో వారికి ధర్మాధర్మములు లేవు. వారా కృతయుగమున తమ తమ యధికారములతో బుట్టిరి. ఆద్యమైన కృతయుగము దివ్య సంఖ్యతో నాలుగు వేల యేండ్లు నాలుగు వందల సన్యలు అని యందురు. అందువలన వేల కొలది ప్రజలు విస్తరించినను వారికే ప్రతిఘాతము (ఎదురుదెబ్బ) లేదు. యుద్దము (అనైక్యము) లేదు. క్రమము కూడ (ముందువెనుక అన్న క్రమము) కూడా లేదు. వారు పర్వతములను సముద్రములను సేవించువారు (నివసించువారు). (సేవిన్యః?) ఇంటి యాశ్రయములేనివారు, శోకములేనివారు, ఎక్కువకెక్కువ బలవంతులు (ఏకాన్తమున సుఖించిన సంతానములు గలవారు) కేవలము సుఖించిన (దుఃఖములేని ప్రజలు, వారు ఎప్పుడు చరించువారు, నిత్యము సంతసించిన మనస్సుగలవారు. పశువులు పక్షులు పాములును అప్పుడు లేవు. ఉద్భిజ్జములు (మొక్కలు) అ రకములును(?) లేవు. అవి యధర్మ ప్రసూతులు గదా, మూల ఫలపుష్పములు లేవు. ఆర్తవము లేదు. ఋతువులు గూడ లేవు.
కాలము సర్వ కామములకు సుఖముగా నుండెను. ఉష్ణము గాని శీతము గాని, ఎక్కువ లేక సమ శీతోష్ణముగా నుండెను. ఆ ప్రజలకు మనస్సు కోరిన కోరికలు ఎల్లప్పుడును ఎల్లెడలను లభించెడివి, ఆ ప్రజలచే చింతింపబడిన (కావలెనని కోరబడిన) వెల్లను భూమియందు రసోష్ఠితములై (ధాన్యపు పంటలు)? లేచు చుండెడివి. (మొలకెత్తి పెరుగుచుండెడివి). వారి యామానసీసిద్ధి ఆ ప్రజలకు బలమును చక్కని యాకర్ష ణీయ వర్ణమును కలుగ జేయునది. రోగమును నశింప జేయునది. కూడా, తైలాది సంస్కారము లక్కరలేని (సహజ సత్తసుందర) శరీరములతో వారు (ముసలితనములేని) స్థిర యౌవనము గలవారు వారి విశుద్దమైన స్కల్పము వలన మీథునరూపములైన ప్రజలు పుట్టుచుండిరి. వారిజన్మ రూపమున్ను సమములు వారు సమముగానే మరణింతురు. భేదము లేదు. అప్పుడు సత్యము, లోభము లేమి, క్షమ, సంతోషము, సుఖము, దమము. ఇవి యున్నయు వారి రూప ఆయు-శీల-చేష్ఠితముల చేత నిర్విశేషముగ (సమానముగ) జేయబడినవి. ప్రజల వృత్తము నడవడి బుద్ధిపూర్వకముగాకుండగనే (అనుకొనకుండగనే) స్వయముగనే సహజముగ ఉండును.
కృతయుగమున శుభపాప కర్మలలో ప్రవృత్తి లేదు. అపుడు వర్ణాశ్రమ వ్యవస్థలు లేవు. సజ్కరము లేదు వారు అనిచ్చతో అద్వేషముతోను కూడుకొన్నవారై పరస్పరము నడుచు కొందురు. అందరును సమానమైన రూపము ఆయుష్యము కలవారు. అధములని ఉత్తములని భేదము లేనివారు. సుఖముతో నిండినవారు శోకము లేనివారు నిత్యము సంతసించిన మనస్సులు గలవారు. మహా స త్త్వగుణమును మహాబలమును గలవారు వీరు కృతయుగమున బుట్టుదురు వారికి లాభములు మిత్రా మిత్రులును ప్రియాప్రియులను ఉండరు. కోరికలేని యా కృతయుగపు వారికి మనస్సునకు విషయమై యే (ప్రతిది) ఉండును. (కోరినది లభించును). వారు ఒకరి వస్తువును మరొకరు కోరరు తీసికొనరు కూడ.
కృతయుగమున ధ్యానము, త్రేతాయుగమున జ్ఞానమున్ను పరమములుగా జెప్పబడినవి. ద్వాపరమున చేయబడినయజ్ఞము కలియుగమున చేయబడిన దానము శ్రేష్ఠమైనవి. యుగవృత్తవశముగా కృతయుగము సత్యము, త్రేతాయుగము రజస్సు, ద్వాపరయుగము రజస్తమములు, కలియుగము తమస్సు అని తెలియవలెను.
కృతయుగములో ఇది కాలము. దాని సంఖ్యలను వినుడు. నాలుగు వేల యేండ్లు కృతయుగము, దాని సంధ్యాంశములు ఎనిమిది వందలు అపుడు ఆ ప్రజల ఆయువు (సంపూర్ణముగ) నుండెను. కష్టములుగాని ఆపదలు గాని ఉండవు.
అంత ఆ కృతయుగమున సంధ్యాంశము గతించి పోగా యుగధర్మ మంతటను పాదా వశిష్టమగును. యుగము యొక్క చివరి కాలములో సంధ్యగడచిపోగా, యుగము యొక్క సంధ్యాధర్మము పాదమే, మిగిలి నిలుచును. ఈ విధముగా కృతయుగము నిఃశేషము గాగా, అట్లే సిద్ధి గూడ అంతర్ధానమయ్యెను.
ఆ యుగమున ఆమానసీ సిద్ది భ్రష్టము కాగా అట నుండి (త్రేతాయుగ) మధ్యమున మరొక సిద్ది కలిగెను. సృష్ట్యాదిలో నాతో చెప్పబడిన యెనిమిది మానసీ సిద్ధులు క్రమయోగమున నాశమందును కల్పాదిలోని ఈ మానసిసిద్ధి కృతయుగమున కలుగును. అన్నిమన్వంతరములలోను చతుర్యుగ విభాగముగా వర్ణాశ్రమాచార కృతమైనది. కర్మసిద్ధోద్భవముగా తలంపబడినది.
సంధ్య చేయబడిన దాని యొక్క పాదము (నాలుగవవంతు)తోను, సంధ్య యొక్క పాదము (నాగవవంతు) తోను అంశములుగా చేయబడిన సంధ్యాంశకములు గల యీయవి పరస్పరము మూడు మూడు పాదములను తపము శ్రుతము బలము ఆయుష్యము అను ఈ యుగధర్మములచే తగ్గించివేయును.
అంత, ఓ ఋషి సత్తములారా! కృత యుగాంశ క్షీణము కాగా, త్రేతలో మరొక యుగము కృతయుగాంశగా నేర్పడెను. ఆ కృతయుగాంశ కూడా క్షీణిపంగా, దాని నుండి మిగిలిన ప్రజలలోనిటకల్పాదిలో నేర్పడిన త్రేతాయుగము యొక్క మొదట, కాల యోగమున సిద్ది ప్రకాశ మయినది. వేరు విధమున గాదు. ఆ సిద్ది నశింపగా మరొక సిద్ది వచ్చినది.
జలముల యొక్కయు సూక్ష్మ భావము గడచిపోయినపుడు, వారిద్దరు? (తా?) మేఘరూపమున (ప్రకాశమునందిరి). గర్జించు చున్న మేఘముల నుండి వృష్టి జరిగినది. ఆ వర్షముచే నొక్కమారే కలిసిన (తడిసిన) భూమి పైన వారి (ప్రజల) గృహములలో నున్న వృక్షములు అపుడు ప్రాదుర్భవించేను. ఆ వృక్షముల నుండి ఆ ప్రజలసమస్త ప్రత్యుపభోగము (అనుభవం) జరిగినది. త్రేతాయగ ప్రారంభమున ఆ ప్రజలు వాని కొరకు (వృక్షముల కొరకు) ప్రయత్నము జేయుదురు. ఆ తరువాత చాలకాలమునకు ఆ ప్రజల వ్యతిరేకతవల్లనే అపుడు రాగ-లోభరూపమైన భావము ఆకస్మికముగా గలిగెను.
స్త్రీలకు జీవితాన్తమున గలుగు (జరుగు) ఆవర్తములు అప్పుడు కలుగలేదు. మరల యుగ బలముననైతే, ఆ స్త్రీలకు ఆర్తవము నేల నెలకు మరల మరల కలుగుచుండెను. ఆ తరువాత అపుడు మిధునములు ఆ యోగముతోనే యుండిరి. ప్రతి నెలలో కలిసికొను ఆ ప్రజలకు, తత్కాలమున జరుగునదిగాన, అకాలమున ఆర్తనోత్పత్తియు గర్భోత్పత్తియు జరిగెను. ఆ కాలముచే జరుగు ప్రజలయొక్క విపర్యము (వ్యత్యాసము) చేత గృహము నందున్న వృక్షము లన్నియు నశించినవి. ఆ తరువాత, ఆ వృక్షములు నశింపగా విభ్రాస్తులై వ్యాకులత జెందిన యింద్రియములు గలవారై యప్పుడు ఆ సత్యము ధ్యానించువారు ఆ సిద్దీని అభిధ్యానించిరి. వారియొక్క గృహములందున్న యా వృక్షములు ప్రాదుర్భవించినవి. వస్త్రములను ఫలములను ఆభరణములను ప్రసవించినవి. వారికి ఆ వృక్షములందే గంధవర్ణరసములతో గూడినది. మాక్షికముగానిది (తేనెటీగలు పెట్టినదిగదాని) మహావీర్య (బల)మైనదియైన మధువు (తేనె) పుటక పుటకమున (ప్రతి దొప్పలోను) తెనెపట్టు రంధ్రములలోను కలుగుచున్నది. త్రేతాయుగ ప్రారంభమున ఆ మధువుతో వారు ప్రజలు (జీవించు) మొదలుచుండిరి. ఆ సిద్ధిచేత ప్రజలు హృష్టులు తుష్టులును విగతజ్వరులును ఐరి.
కాలాన్తరముచే (కాలభేదముచే) మరల వారు (పజలు) లో భావృత్తులైరి. ఆ వృక్షములను తేనెటీగల తేనెను బలాత్కారముగా పరిగ్రహించిరి. లోకకృతమైన వారి యాయపచారము చేత కొన్ని కొన్ని చోట్లలో తేనెతోబాటు కల్పవృక్షములు గూడ నష్టములైనవి. సంధ్యకాలవశమున అప్పుడు అది అల్పశిష్టము కాగా ఆ ప్రజలజంటలు లేచినవై ప్రవర్తిల్లినవి.
వారు తీవ్రమైన చలిగాలి ఎండలచే మిక్కిలి దుఃఖితులైరి. జంటలచే పీడింపబడిన వారు (ప్రజలు) ఆవరణములను (కప్పులను) నిర్మించిరి జంటలకు ప్రతీకారమును జేసి (కప్పులను) నిర్మించిరి. జంటలకు ప్రతీకారమును జేసి నికేతములను ఇండ్లను జేరిరి. పూర్వము వారు మిక్కిలి తిరుగువారు ఎక్కువగా యిండ్ల యాశ్రయము లేనివారుగా నుండిరి. తమకు తగు విధముగను ప్రీతికరముగను వారు మరల ఇండ్లలో నుండిరి. ఆ యిండ్లు నీరులేని మెట్టలలోను, పల్లపు భూములందును, పర్వతములందును, నదులం(తీరముల)దును నిర్మింపబడియుండెడివి. వారు దుర్గములను (కోటలను) ఎల్లప్పుడు నీరుండు ఎడారులను ఆశ్రయించిరి.
కూర్పున కనుగుణముగా, కోరికల కనుగుణముగా, సమస్థలములలోను విషమస్థలములలోను వారు శీతోష్ణములను వారించుటకై యిండ్లను నిర్మింప ప్రారంభించిరి ఆ తరువాత పల్లెలను, పురములను గ్రామములను సంస్థాపించిరి. అట్లే ఇండ్లలో విభాగానుసారము అనఃపురములను గూడ నిర్మించిరి.
వాటి యొక్క పొడవులను వ్యాసములను, పట్టణముల చుట్టుండు బయలు ప్రదేశము (నగర పరిసరోద్యానముల)లను తమ తెలివి లేటలననుసరించి నిర్మించిరి. ప్రదేశము వారిచే పేరిడబడినది. చాచిన బొటనవ్రేలికిని చూపుడు వ్రేలికిని ఉన్న మధ్య కొలత ప్రాదేశమనబడును. అట్లే చాచిన బొటనవ్రేలికి చాచిన నడిమి వ్రేలికి ఉన్న మధ్య కొలత తాలమనబడును. అట్లే బొటన వ్రేలికి ఉంగరపు వేలికిని వున్న మధ్యకొలత గోకర్ణమనబడును. చిటికెన వ్రేలికిని మధ్యనున్న కొలత వితస్తియనబడును. ఇది పన్నెండంగుళములుండును. ఇరువది యంగుళములు రత్నియనబడును. ఇరువది. నాలుగంగుళములు హస్తమనబడును. 24 అంగుళములు కిష్కు అనబడును. నాలుగు హస్తములు ధనుర్దండము. అదియే నాలికాయుగము రెండువేల ధనుర్దండములు యోజనమనబడును. ఈ యోజనము చేతనే నగరపు చుట్టు ఉద్యానము నిర్మింపబడినది.
నాలుగే దుర్గములలో మూడు స్వయముగా లేచినవి. నాలుగవది కృత్రిమ (కట్టబడిన) దుర్గము నేను దాని విధానమును నేను చెప్పుదును. మేడలు ఎత్తైన కోటలు చుట్టుగోడలును గలది, అంతలు చాతక పక్షులతో చుట్బడినది, ఒక సస్తిక ద్వారము గలది, కుమారీపురమేయగును. చెరువులతోబాటు(?) ఆ ద్వారము మరల త్రవ్వబడినది. పదునెనిమిది హస్తములు శ్రేష్ఠములని కొందరు, లేదా పందొమ్మిది హస్తములు శ్రేష్ఠములని మరికొందరు. సమ్మతించుదురు. పల్లెలకు, నగరములకు గ్రామములకును అన్ని దిక్కులలో మూడు విధములైన దుర్గములను పర్వతోదకములచే మూడువైపుల సుమారు పర్వతములచేగాని మూడు వైపుల సహజ జలములచేతగాని బంధనము జరుగును-106. మూడు విధముల దరుముల పొడవు వ్యాసమున్ను యోజనముల విష్కంభము ఎనిమిది భాగములలో సగము పొడవ తూర్పు ఉత్తరములలో పరమార్ధార్థ మాయామముగల పురము మిక్కిలి శ్రేష్టమైనది. (?) భిన్న కర్ణమైనది, వికర్ణమైనది, వ్యంజనమైనది, కృశించినచోనున్నది. వృత్తమైనది, హీనమైనది, దీర్ఘమైనది. యైన నగరము ప్రశస్తమైనది కాదు. చతురస్రముగా నున్నది. చక్కగా నున్నది. దిక్కులలో నున్నది. యైన పురము ప్రశస్తమైనది. ముందు 24 హస్తములును తరువాతిది, హస్తములును గలది. ఇచట హ్రస్వోత్కృష్టములు (పొట్టి పొడుగులు) లేని మధ్యదానిని ప్రశంసింతురు.
ఒక 108 కిష్కులు ముఖ్య నివేశనండలోనందురు. నగరము నుండి సగము విష్కంభమున పల్లె, తరువాత గ్రామము, తరువాత బయలు ఉండవలెను.
నగరము నుండి యోజనమున పల్లె పల్లె నుండి అర్థ యోజనమున గ్రామము ఉండవలెను. పరమసీమ (చివరి హద్దు),రెండు క్రోశము లుండవలె. క్షేత్ర సీమ నాలుగు ధనువు లుండవలెను. దిక్కుల యొక్క మార్గటములు ఇరువది ధనువుల విస్తీర్ణముగా వారిచే చేయబడినది. గ్రామ మార్గము 20 ధనువుల వెడల్పు, సీమా మార్గము 10 ధనువుల విస్తీర్ణము. శ్రీమంతమైన రాజ పథము పది ధనువుల విస్తీర్ణము అది మనుష్యులు గుజ్జములు రథములు ఏనుగులును ఏయిరుకు లేక సంచారము జేయదగినదిగా నుండవలె. దాని శాఖా మార్గములు నాలగు ధనువుల విస్తీర్ణముగా వారిచే నిర్మింపబడినవి. గృహమార్గములు ఉపమార్గములు ద్వికములైన ఉపరధ్యక మార్గములును. ఘంటాపథమున్ను నాలుగు పాదములు వెడల్పు(?) గృహాన్తరములోని మార్గములు మూడు పాదములు వెడల్పు. వృత్తిమార్గములు సగపాదము వెడల్పు ప్రాగ్వశముల పదికము (?) వెడల్పు అనబడినది. మలవిసర్జనమునకు (మరుగుదొడ్డికి) జల ప్రవాహమునకు (స్నానపు గది కాబోలు)ను అన్ని వైపుల, లేదా నలువైపుల ఒక్క పదము మాత్రము. ఈ విధముగ ఆయా స్థానములు నిర్మించిన తరువాత మరల గృహములు నిర్మించిరి.
అట్లే ఆ గృహ సంస్థితములైన వృక్షములు పూర్వముండినవి. వాటిని మరల మరల జ్ఞాపకము దెచ్చికొని. పూర్వమున్నట్లే యా వృక్షములను గృహ సంస్థితములుగా జేయుటకు ప్రారంభించిరి. పూర్వము వృక్షములు పోయినవి. శాఖలు కాదు. అవి పరాగతములైనవి (?) అన్యశాఖలు అంతకంటే పైకిపోయినవి. అట్లే కొన్ని అడ్డముగా పోయినది. వృక్ష శాఖలు ఎట్లుపోయినవో వెదికి తెలిసికొనుట న్యాయము. ఆ ప్రజలచే ఆ శాకలట్లే (పూర్వమున్నట్లే) నిర్మింబడినవి. కావున గృహసంస్థిత వృక్షశాకలు (గృహముగా నేర్పరచుకొన్న వృక్షశాకలు) (గృహముగా నేర్పరచుకొన్న వృక్షశాకలు) 'శాల'లనబడినవి.
ఈ విధముగా శాఖల నుండి శాలలును గృహములును ప్రసిద్ధము ఎక్కువగా సిద్ధము) లైనవి. కావుననే ఆ శాఖలు శాలలని తలంపబడినవి. శాఖల యందు శాలాత్వము గూడ దలపబడినది. ఆ శాఖాశాలలో మనస్సు ప్రసన్నముగా నుండును. ఆవిమనస్సును (మేడలుగా జేసి) సంతోషపెట్టును. కావున గృహములు శాలలనియు ప్రాసాదములనియు పిలువబడినదీ.
ఆద్వంద్వోప ఘాతములను జేసి జీవనోపాయమును చింతించిరి. మధువు (తేనె)తోబాటు కల్పవృక్షములు నష్టమైనపుడు ఆ ప్రజలు ఆకలిదప్పులుగలవారై దుఃఖముతో వ్యాకమము జెందిరి.
ఆ తరువాత త్రేతా యుగములో మరల సిద్ది ప్రాదుర్భవించెను. జీవనముల కొఱకై ధనములను సాధించునట్టి మరొక వృత్తి వారి యిష్టప్రకారమేర్పడెను. వారికి పల్లములకు ప్రవహించు వద్దోదకములు కలిగెను. వర్షముతో జలములు ప్రవాహములు గూడిన సరస్సులు నదులును ఏర్పడినవి.
ఈ విధముగా రెండవ వృష్టిసృష్టిలో నదులేర్పడినవి. ఆ తరువాత భూమిపై జలసమూహములు ఏర్పడినవి. భూజల సంయోగమువలన వానిలో ఓషధులు పుట్టినవి. అవి పుష్పమూల ఫలములు గల (మరికొన్ని) ఓషధులను బుట్టించినవి. కజ్జతో దున్నకయే పుట్టునని ప్రత్యేకముగ నాటకయే పుట్టునవి, గ్రామములో బుట్టినవి, అరణ్యములో బుట్టినవి ఋతువులలో పుష్పించి ఫలించునవి, వృక్షరూపములు, పొదలరూపములు మొత్తము ఓషధులు 14 విధములు.
త్రేతాయుగ జీవనములో ఔషధ ప్రాదుర్భావము అప్పుడు త్రేతాయుగములో ప్రజలు ఆ ఔషధముతోనే వర్తిల్లుచుండిరి.
అంత వారిలో నంతట రాగలోభములు గలిగినవి. త్రేతాయుగవశమున అవి వారికి తప్పని సరియైనవి. అంతగా వారు నదీ క్షేత్రములను, పర్వతములను, వృక్షములను, పొదలుగానున్న ఓషధులను వారి వారి బలానుసారము బలాత్కారముగనే (నివాసమునకుగా బోలు?) పరిగ్రహించిరి.
పూర్వము నేను ప్రాకృతమున (కృతయుగమున?) సిద్దాత్ములని కొందరిని జెప్పితిని. ఆబ్రాహ్మణులే ఈ మానవులే ఈత్రేతాయుగమున గూడ యోజనము జేయుటవలన (కలుపుటవలన?) బుట్టిరి. వారు శాస్తులు వేడిమిగలవారు కర్మిణులు దుఃఖినులు. వీరు కృతయుగమునుండి వచ్చి త్రేతాయుగమున మరల బుట్టిరి. పూర్వజన్మలలోని శుభా శుభ కర్మలచే భావింప బడినవారై బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అట్లే ద్రోహిజనులని యేర్పడిరి.
ఇటు వారికంటే బలవంతులు సత్యశీలురు అహింసకులు లోభములేనివారు ఆత్మను జయించినవారు ఉండేవారు. వారిలో వారినుండి అల్పతేజస్కులైన ఇతరులు పుచ్చుకొనేవారు పనులు చేసేవారు. ఈ విధముగా వారు పరస్పరముగా (ప్రతిపన్నేషు) (తెలియబడినవారు) విప్రతిపన్నులు (విరుద్దులు) ఐరి. వారియా దోషమువలన ఓషధులు అప్పుడు కపటత్వము నందినవి. ఇసుకవలె పిడికిళ్లతో గ్రహింపబడినవై నశించినవి. యుగబలమువలన భూమి పదునాలుగు గ్రామ్యారణ్య ఓషధులను గ్రసించెను. అవి (ఓషధులు) పత్రములచేత పుష్పములను, పుష్పములచేత ఫలములను గ్రహించెడివి.
ఆ ఔషధులు ప్రణష్టములు కాగా ప్రజలప్పుడు విభ్రాంతులైరి. ఆకలితో నావేశింపబడిన (బాధింపబడిన) ప్రజలు స్వయంభువుడై ప్రభువైన బ్రహ్మకడకు వెళ్లిరి. వారు త్రేతాయుగముయొక్క ఆదిలో తమ జీవనోపాధిని పొందగోరిరి. స్వయంభువ భగవంతుడగు బ్రహ్మ వారి కోరికను తెలుసుకొనెను.
ప్రత్యక్షముగా చూచిన చూపుతో (దివ్యదృష్టితో) చూచి చక్కగా విచారించి తెలిసికొని వానిని భూమినుండి స్వీకరించేను. (అనగా) మరల భూమినుండి వానిని పితికెను. సుమేరు పర్వతమును దూడనుగా జేసి భూమిని పితికేను. అపుడీయావు పృథివీ తలమున బీజములను పితికినదీ. ఆ బీజములు పుట్టినవి (మొలకెత్తినవి) అవి గ్రామ్యారణ్యములైన ఓషధులు. ఓషధులు ఫలపాకముతో (వాని ఫలములు పండగనే) నశించునవి. అవి డెబ్బదియేడు. ప్రహులు, (వడ్లు) యవలు, గోధుమలు, అణువులు (చిలువడ్లు) తిలలు (నువ్వులు) ప్రియంగవములు (కొజ్జలు, నల్లా వాలు), ఉదాహరణములు, కారూషములు, సతీనకములు (లంకలు), మాషములు (మినుములు), ముద్దములు (పెసలు), మసూరములు (చిజు సెనగలు), నిష్టావములు (అనుములు) కులుళములు, ఆఢక్యములు (కందులు), చణకములు (సెనగలు), ఇటువంటివి డెబ్బదియేడు అనబడినవి.
ఇవి యన్నియు గ్రామ్యములైన ఓషధులయొక్క జాతులనబడినవి. యజ్ఞయము (యజ్ఞసంబంధము)లైన గ్రామ్యారణ్య ఓషధులు పదునాలుగు. ద్రోహులు (వడ్లు), యవలు, మాషములు (మినుములు), గోధుమలు, అణువులు (చిరువడ్లు), తిలలు ప్రియంగువులు (కొజ్జలు), ఈ యేడు, ఎనిమిదవ కులుత్తికములు, శ్యామాకములు (చామలు), నీవారములు (దూసవరిధాన్యములు), జర్తిలములు (అడవి నువ్వులు), గవేధుకములు (అడవి గోధుమలు, వట్టివర్లు), కురువిందములు. (ఒక వడ్లజాతి), వేణుయవములు (వెదురు బియ్యము), మర్కటకములు. ఇవి పదునాలుగు గ్రామ్యారణ్యములైన ఓషధులనబడినవి. ఇవి కృతయుగముయొక్క ఆదియందు మొదట ఉత్పన్నములైనవి.
కఱ్ఱతో దున్నక అంతట పండిన ఓషధులు గ్రామ్యారణ్యములు. వృక్షములు, గుల్మములు (పొదలు) లతలు (ప్రాకుతీగలు), వల్లులు (చుట్టుకొనుచు ప్రాకుతీగలు), వీరుధములు (వివిధముగా మొలచు తీవగుంపులు), ఇవి తృణజాతులు (పశువులు తినదగిన గడ్డి జాతికి చెందినవి). ఇవి వేరులతోను, పండ్లతోను పుష్పములతోను గ్రహించి (బీజశక్తిని గ్రహించి) పుట్టునవి. పూర్వము స్వయముగా బ్రహ్మచే ఈ బీజములు భూమి (గోవు) నుండి పితకబడినవి.
ఆ ఓషధులు (భూమిపై) చల్లినప్పుడు మొలవలేదు కాని, అప్పుడు ఆ ఓషధులు ఋతువు ననుసరించి పుష్పించి ఫలించునపై పుట్టినవి. (మొలచినవి). అపుడు స్వయంభుడైన భగవంతుడైన బ్రహ్మ సిద్ధిని కర్మ వల్ల కలుగుదానినిగా పరికించి ఆ ఓషధుల వృత్తికొరకు (చక్కగా మొలచి బ్రతికి నిలుచుటకు, వార్డోపాయమును (వాటి జీవనోపాయమును) ఉపయోగించెను. అంత బ్రహ్మవలన ఆ ఓషధులకు జీవనోపాయము (జీవనోపాధి) సంసిద్దించగా, అప్పటినుండి ఓషధులు కృష్ణపచ్యములై (దున్నగా పండినవై) జన్మించినవి. (మొలచినవి) అవి యారంభింపబడిన విధముగా పరస్పరముగా మర్యాదలు స్థాపింపబడినవి.
ఆ ప్రజలతో విధానమాత్మగాగల వారై (యధికారమును) పరిగ్రహించిన వారుండిరి. వారితరులకు రక్షణమొసగువారు. వారిని క్షత్రియులనుగా బ్రహ్మ నిలిపెను. అట్లే నిర్భయులై యెంతమంది యా క్షత్రియులకు సమీపముగా నిలిచినవారో వారు సత్యమును బ్రహ్మను పూర్వమున్న విధముగా జెప్పువారై బ్రాహ్మణులైరి. తక్కిన వారిలో ఎవరు అబలురో వారు వైశ్యకర్మలో (వ్యాపారముతో) నున్న వారు. చురుకైనవారు, భూమిలో దారిద్ర్యమును నశింపజేయువారు. వారిని వృత్తి సాధకులను (జీవనమునకై వ్యాపారము జేయువారు) కీనాశులను (ఈకృషి చేయువారిని) లేదా దారిద్ర్యమును నశింపజేయువారిని వైశ్యులని యందురు.
దుఃఖించు ద్రవీభావము జెందుచు (పరుగులిడుచు) పరిచర్యలో (సేవలో) నిరతులై తేజోహీనులై అల్పవీర్యు (స్వల్పబలవంతు)లైన వారిని ఆ బ్రహ్మ యనెను. ప్రభువైన బ్రహ్మవారి కర్మలను ధర్మములను విధించెను. ప్రాకృతము (కృతయుగము) ఉండగా అంతట చాతుర్యర్ణవ్యవస్థ యుండెను. కాని యా ప్రజలు అజ్ఞానమువలన ఆధర్మములను పాలించలేదు. వర్ణ ధర్మములతో జీవింపక పరస్పరము విరోధించిరి.
ప్రభువైన బ్రహ్మ ఉన్నది ఉన్నట్లు ఆ పరస్పర విరోధిత్వమును తెలుసుకొని క్షత్రియులకు బలమును దండమును యుద్ధమును జీవన వృత్తిగా నాదేశించెను. యాజనము అధ్యాపనము మూడవది పరిగ్రహము (స్వీకారము) బ్రహ్మ బ్రాహ్మణులకు విధించిన కర్మలు. పశుపాలనము, వ్యాపారము, కృషి (వ్యవసాయము)ని వైశ్యులకు జీవనవృత్తిగా కల్పించేను. శిల్పవృత్తిని కూలిని ఆ బ్రహ్మ శూద్రులకు జీవన వృత్తిగా నేర్పరచెను.బ్రహ్మక్షత్ర- వైశ్యులకు (యజనము చతురాశ్రమ విభాగము - ఎనిమిదవ అధ్యాయము యజ్ఞము చేయుట) వేదములు చదువులు, దానమును సామాన్య కర్మలు. ఆ తరువాత వారికి పరస్పరముగా కర్మాభవమును (పనీబ్రతుకు దెరువును) ఇచ్చెను. సిద్దిచే వారికి లోకాన్తరములలో స్థానములనిచ్చెను.
యజ్ఞయాగాది క్రియావంతులగు బ్రాహ్మణులకు ప్రాజాపత్య (బ్రహ్మ) స్థానము యుద్ధమున పారిపోని క్షత్రియులకు ఇంద్రస్థానము. స్వధర్మముననుసరించి జీవించు వైశ్యులకు మరుద్దేవతాస్థానము (వాయుస్థానము) ప్రతీచారమున (సేవలలో)నున్న శూద్రులకు గాంధర్వ (దేవతా స్థానము) లభించును.
స్వయముగా వ్యత్యాచారవంతులైన ఈ వర్ణములు (బ్రహ్మక్షత్రాదులు) స్థానములు. ఆ విధముగా వర్ణములుండగా ఆశ్రమములనేర్పరచేను. గార్హస్థ్యము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, భిక్షుకము అనునీ నాలుగాశ్రమములు ఆ ప్రభువగు బ్రహ్మ పూర్వము ఏర్పరచెను.
వారిలోనే కొందరట వర్ణకర్మలు చేయరో వారు ఆశ్రమస్థానానికి కర్మాక్షితి యెక్కడిది. అని యందురు. బ్రహ్మ ఆయాశ్రమములను పేరు పేర నేర్పరచెను. తరువాత నిర్దేశము కొరకై బ్రహ్మ వాని ధర్మములను జెప్పెను. వారి ప్రస్థానములను, యమములను, నియమములను చెప్పెను. పూర్వము గృహస్థాశ్రమము బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు నాలుగు జాతులవారు గూడ ఆచరింపదగినదని చెప్పబడినది. ఇది తక్కిన బ్రహ్మచర్య వానప్రస్థ-భిక్షువుల ఆశ్రమములకు మూలమైనది. వానిని నిలుపునది. దానిని యథా క్రమముగా యమములతో నియమములతో చెప్పెదను.
భార్య- అగ్నిహోత్రములు, అతిథిసత్కారము, ఇజ్య శ్రాద్ధ క్రియలు సక్తానములు అనునవి సంగ్రహముగా గృహస్థధర్మములు. దండము ధరించుట, మేఖల (మొలనూలు) ధరించుట,. భూమి పై పరుండుట, జటలు ధరించుట, గురుశుశ్రూషణము, భిక్షాటనము - ఇవి బ్రహ్మచారి ధర్మములు. నారచీరలు, పత్రములు (లేడి) చర్మములు (కట్టుకొనుటకు). తినుటకు ధాన్యములు కందమూలములు ఫలములు ఔషధములు, ప్రాతఃసాయం సధ్యలలో స్నానములు, హోమములును వాన ప్రస్థాశ్రమమునున్న వారి ధర్మములు. ఆసన్నముసలమున (రోకలిదంపులున్నచో) భైక్షము, దొంగతనము లేమి, శౌచము ప్రమాదములేమి, మైథునము లేమి, దయ, భూతములందు సహనము, కోపము లేమి, గురు సేవ, సత్యము. ఇవి పది బ్రహ్మ యీ దశలక్షణికమైన ధర్మమును చెప్పెను.
ఇచట భిక్షువు వ్రతములు ఐదు, ఉపవ్రతములు ఐదు. ఆచారశుద్ది నియమము, శౌచము, ప్రతికర్మ (అలంకరణము), సమ్యద్దర్శనము ఇవి వ్రతములు, ఇట్లే ఉపవ్రతములు కూడా ఐదు. ధ్యానము, మనసుతో ఇంద్రియముల సమాధి, సాగరులతో గూడి భిక్షాటనము, మౌనము, పవిత్రోచితులతో విముక్తి ఇవి పరివ్రాజకుని ధర్మములందురు.
బ్రహ్మచే స్వయముగా నీ శ్రేయస్సు కొఱకే ఆశ్రమములు చెప్పబడినవి. సత్యము ఋజు ప్రవర్తనము (వంకరలేని చక్కని నడవడి) తపము, క్షాని, యోగము, దమపూర్వికమై ఇజ్య (యాగము). సాంగములైన వేదములు, యజ్ఞములు, వ్రతములు, నియమములు, భావదోషమేర్పడిన ప్రదుష్టునకివి సిద్ధింపవు. పరాక్రమములను ప్రదర్శించుచున్నప్పటికిని అంతర్భావ ప్రదుష్టునకు ఒకప్పుడు బహిః కర్మలు బాగుగా సిద్దించును. కలుషితమైన అన్తరాత్మతో సర్వస్వమిచ్చిన దానిచే వాడు ధర్మభాక్కువాడు. దానికి కారణము భావము. సద్భావముగలవాడే ధర్మ భాక్కగును.
ఈ విధముగా పితరులతో గూడ దేవతలు, ఋషులు, మనువులు, వీరికి, దీనియందున్నవారికే స్థానముండునని చెప్పుదుర. ఊర్ధ్వరేతస్కులైన ఎనుబది యెనిమిదివేల ఋషుల ఆది స్థాన మనబడినది. అదియే గురువాసులకు గూడ. సప్తర్షులకు ఏది స్థానామో అదియే స్వర్గవాసులకు స్థానము. గృహస్థులకు ప్రాజాపత్యము స్థానము. న్యాసులకు (సన్యాసులకు) బ్రహ్మలోకము స్థానము, యోగులకు అమృతము స్థానము. నానా బుద్ధులు గలవారికే స్థానములేదు.
స్వధర్మము నందు వ్యవస్థితులైన యాయా ఆశ్రమము లందున్న వారికే స్థానములు. ఆద్యమైన మన్వన్తరమున భూలోకము నందు లోక తస్రముగా నాలుగు దేవయాన రూపమార్గములు నిర్మింపబడినవి. దేవయానమునకైన మార్గములకు ద్వారము సూర్యుడు అనబడినాడు. అట్లే పితృయాణులకు చంద్రుడు ద్వారముగా జెప్పబడినాడు. ఈ విధముగా వర్ణాశ్రమముల విభాగము చేయబడినపుడు, ప్రజలు వర్ణాశ్రమాత్మకులై దీనికి వ్యతిరేకముగా వర్తించనపుడు (వారికి పై యానములు వాని ద్వారములును చెప్పబడినవి).
ఆ తరువాత ఆతడు (బ్రహ్మ) త్రేతాయుగ మధ్యన పూర్వము కంటె ఇతరులైన మానసీ ప్రజలను సృష్టించెను. ఆత్మనుండియు, తన శరీరమునుండియు తనతో బోలిన ప్రజలను సృష్టించేను. ఈ త్రేతాయుగమున ఆది (భాగము) మధ్య (భాగము)ను పొందగా పూర్వము కంటే వేరైన మానసీ ప్రజలను సృష్టించుటకు ప్రారంభించెను.
అంత ఆ ప్రభువు సత్య రజో గుణముల నుద్రేకము జెందిన ప్రజలను సృష్టించెను. వారు ధర్మార్థ కామ మోక్షములను జీవన వృత్తిని సాధించువారు. దేవతలు, పితరులు, ఋషులు, మనువులు, యాగానురూపమైన ధర్మముచేత ఈ ప్రజలను విశేషముగ గూర్చినవారు. బ్రహ్మయొక్క ఆ ప్రజాధర్మము రాగా (ఆతడు) నానారూపములైన సమస్తమానసీ ప్రజలను చింతించెను.
నేను నీకు పూర్వము చెప్పిన జనలోకాశ్రితులు, ఆ లక్సము గడవగానే, వారిట దేవాదులైన ప్రజలుగా నుండిరి. చింతించిన బ్రహ్మ చిత్తములో బుట్టుటకై వచ్చిన వారందరు మన్వంతరక్రమమునని కనిషులైన ప్రథములుగా సమ్మతులైనవారు. ప్రసిద్దమైన అనుబంధములుగలనియు. అన్ని ప్రయోజనములు గలవియు, కుశలాకుశల ప్రాయములునై ఆయా కర్మలచేత నిట ప్రజలెల్లరు భావింపబడిరి. ఆకర్మఫలశేషము చేత కట్టబడిన వారై వారు విశేషముగ బుట్టిరి.దేవత్వము అసురత్వము పితృత్వము వీటిచేతను. పశువులచేతను, పక్షులచేతను, పాములచేతను వృక్షత్వములచేతను, నరక జంతుత్వము చేతను, కీటత్వము చేతను, ఆయా భావముల చేతను (జన్మించి భూమిలో) ఉండిరి.
