వాయు మహా పురాణము

Table of Contents

7వ అధ్యాయము

అప్పుడా కల్పము క్షీణించి దాహకాలము వచ్చినది. అప్పుడా కల్పమున దేవతలు వైమానికులై యుండిరి. నక్షత్ర గ్రహతారలు, చంద్ర సూర్య గ్రహములును, సుకృతాత్ముల (పుణ్యాత్ముల) యిరువదియెనిమిది కోటులును ఉండిరి. అట్లే ఒక మన్వంతరమునను పదునాలుగు మన్వంతరములలోను మూడు వందల కోటులును ఒక కోటి తొంబది రెండును, ఏడు వందల యెనిమిది వేలును ఉండిరని పూర్వము స్మరింపబడినది. వైమానికులైన దేవతల కల్పము. గడచిన తరువాత గూడ ఒక్కొక కల్పమున నున్న దేవతలు గూడ వైమానికులుగనే తలంపబడిరి (పరిగణింపబడిరి).

అంత పదునాలుగు మన్వన్తరములలో స్వర్గమున దేవతలును పితరులును మునులును ఉండిరి. వారి సేవకులైన మనుపుత్రులును అట్లే వర్ణాశ్రమ ధర్మములాచరించు వారిచే స్తుతింపదగిన దేవతలు గూడ నుండిరి. మన్వన్తరములలో దేవలోకమున నివసించు దేవతలు వారితో గలిసియున్న వారితో బాటు సంకలనమును (మొత్తముగా లెక్కింపబడిరి) బొందిరి. తుల్యనిష్ఠలు గల ఆయందరు 'ఆభూతసంప్లవము' (పంచ భూతముల విప్లవము ప్రళయము) రాగా, ఆ విప్లవములో వారి వంతు గూడ తప్పక జరుగునని తెలిసికొనిరి. ఆ విప్లవము రాగా ముల్లోకములలో నుండు దేవతలు.

ఉత్సాహము వీడిన దు:ఖముతో తాముయుండు స్థానములు వదిలి కలతజెందిన మనస్సులు గల వారై మహర్లోకమునకు బోవ తల పెట్టిరి.

వారు మహస్సులో ఉన్న శరీరములచే (చిన్న శరీరములచే) కూడుకొన్న వారై చక్కగా నున్నారు. వారందరు విశుద్ధితో నిండినవారై మానసి సిద్ధిని పొందియున్నారు. ఆకల వాసులతో బాటు మహా (హాన్) ఫలమును పొందినవారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సద్భక్తులైన అపరజనులును. ఆ పదునాలుగు దేవ సంఘములు మహర్లోకమును తలంచి (భావించి) సోద్వేగులై జన లోకమునకు బోవుటకై తల పెట్టిరి. విశుద్ధితో నిండినవారై మానసిసిద్ధిని పొంది ఆకలవాసులతో బాటు మహా(న్) ఫలమును పొందిరి. పదిమారులు (మంత్రము) ఆవృత్తి చేత జనలోకము నుండి స్వస్తపోలోకమునకు బోవుచున్నారు. అచట పదికల్పము లుండి మరల సత్యలోకమునకు బోవుచున్నారు. కల్పవాసులు ఈ క్రమయోగముతో (భూర్లోక, భువర్లోక) స్వర్లోక మహర్లోక, జనోలోక-తపోలోక-సత్యలోకములకు బోవుచున్నారు.

ఈ విధంగ ఒకరొకరి నుండి వేల యుగములు గడచినవి. తిరుగులేని స్థానమైన బ్రహ్మలోకము గూడ పొందబడినది. ఒక ఆధిపత్యము దక్క ఐశ్వర్యములో రూపములో స్థానములోను మాత్రము వారు బ్రహ్మతో సమానులగుదురు. అచట వారు సంతోషముతోనుందురు. బ్రహ్మతో మిక్కిలి కలిసియున్నందున బ్రహ్మానందనమును పొంది తరువాత బ్రహ్మతో సహ వదిలి పెట్టబడుదురు (ముక్తి జెందుదురు). వారు స్వయముగా ముందు ప్రాకృతముగ తప్పనిసరిగా జరగబోవు అర్థమునందు నానా భావముతో సంబద్దులైనపుడు తాత్కాలభావులగుదురు. మేలుకొనియున్న వానికి స్వరూపముతో జ్ఞానము బుద్ధి పూర్వమగును. అట్లే వారి జ్ఞానము తాత్కాలభావియగును.

అభి సూష్మములైన భేదముల యొక్క ప్రత్యాహారము నందు (ఉపసంహారము నందు) భిన్నముగా నుండును. కార్యములు కరణములును వానితో బాటే సృజింపబడును. నానాత్య దర్శనము వలన ఆ బ్రహ్మలోక నివాసులకు వినష్టమైన స్వాధికారముగలవారికి స్వధర్మమున నున్న వారికిని (తాత్కాలభావియైన జ్ఞానము ప్రవర్తించును).

వారైతే తుల్య లక్షణులు, సిద్ధులు, శుద్ధాత్ములు, నిరంజనులు. ప్రకృతిలో కారణాతీతులు, స్వాత్మలోనే యుండువారు.

సర్గము (సృష్టి మరల జరుపబడగా మరల వారికి కారణమగును. తత్యదర్శులైనవారు ప్రాకృతమైన ప్రకృతిసిద్ధమై పామరులు చేయునదైన) సంయోగమున యుక్తులగుదురు. ఈ లోకమునకు మరలరాని మోక్షమునందున్నవారు చల్లారిన జ్వాల మరల బుట్టనట్లు, ఇచట మరల బుట్టరు.

అంత ఆ మహాత్ములు త్రైలోక్యము నుండి ఊర్థ్వమునకు వెళ్లిరి. వారితో బాటు మహర్లోకము నుండి జనులు రారైరి. వారు పోగా మిగిలినవారు కల్పమునకు దేహమును పొందుదురు. గంధర్వులు మొదలు పిశాచుల వరకున్న (దేవయోనులు దేవజాతులు) మనుష్యులు, బ్రాహ్మణులు మొదలగువారు, పశువులు, పక్షులును, కదలలేనివి (పర్వతములు) ప్రాకునట్టి పాములున్ను, వీరందరు భూమి పై నుండు వారై యుండగా, ఇచట వేయియై (అనంతములై) భాసించు సూర్య కిరణములు ఏడుగానయి అందొక్కొక్క రవి (సూర్యుడు) పుట్టును.

క్రమముగా నా సూర్యులు (ఆకాశము పైకి) లేచుచున్నవారై మూడు లోకములను దహించివేయుదురు. జజ్జిమమును (తిరుగువానిని) స్థావరమును (కదలక నుండువారిని), నదులను సమస్త పర్వతములను (దహించివేయుదురు). అందులో అవి ముందే వర్షములేనందున ఎండిపోయినవి. సప్త సూర్యులచే (నిప్పంటి) పొగరాజినవి. అపుడు ధర్మాధర్మాత్మకములైన ఆ సమస్త స్థావర జజ్జమములు సూర్య కిరణములచే దహించిపోయినవి.

తరువాత పాపయుగము పోయినపుడు దహించిన శరీరములు గల వారు శుభపాశానుబంధము గల యాయోనిచే వదలి పెట్టబడనివారై (జనలోకమునకు) వెళ్ళిరి.

ఆ తరువాత 'జన' లోకమున జనులు సమానరూపులుగా నొప్పిరి. వారందరు సర్వపరిశుద్దులు, మానసీ సిద్దిని పొందినవారు.అచట ఒక రాత్రియుండి పుట్టుక తెలియని బ్రహ్మయొక్క సృష్టిలో మరల బ్రహ్మయొక్క మానస ప్రజలుగా బుట్టుదురు.

ఆ తరువాత ఆ త్రైలోక్య వాసులు జనలోకములో నుండగా, సప్త సూర్యులచే ఆ లోకములు దహింపబడగా, వర్షముచే భూమియంతయు వరదలు పారగా ఆలయములన్నియు ధ్వంసముకాగా, సముద్రములు మేఘములు భూమి పైన సమస్త జలములు వీనికి సంబంధించిన జలములన్నియు కలిసి నేకసముద్రముగానైనవి. పై పైగా వచ్చు ఆ నీరు అధికమైనపుడు ఈ భూమినంతయు నీరు గప్పినది. అపుడా భూమి అర్ణవము (సముద్రమను) పేరుగలదైనది.

ఎందువలననగా వ్యాప్తిదీపులలో (సూర్యకాంతులలో) ప్రకాశించుచున్నవైనను (మనకు) ప్రకాశించుటలేదు. ఆకాంతులలో గూడ అంతట నీరుపారి వాటిని కప్పివేయుచున్నది. ఆ నీరు భూమియంతటను వ్యాపించుటవలనను, తనోతి ధాతువు విస్తార మను అర్థము చెప్పుట చేతను, అవి (కాంతులు) అమ్భస్తనువులని (నీరు శరీరముగా గలవి అని) స్మరింపబడుచున్నవి. 'అర'మన్నది శీఘమను అర్థమున నిపాతముగా కవులు చెప్పినారు. భూమి ఏకార్ణవమైనపుడు ఆ నీరు శీఘ్రముగా లేదు. కావున అవి నీరములు అయినవి. బ్రహ్మయొక్క ఒక పగలై అది యుగ సహస్రాంతముగా, రాత్రియంతయు నీరు రూపములో నుండేను. ఆ తరువాత ఆజలమున భూమి పై అగ్ని నశింప గా, ప్రశాంతమైనవాయువుగా, వెలుగులేని చీకటి అంతట నుండగా-55.

దీని నంతయు అధిష్ఠించినవాడు బ్రహ్మ ఆతడే పురుషుడు ప్రభువును ఆతడు ఈ లోకము యొక్క విభాగమును మరల జేయుదలచుచున్నాడు. అపుడు ఏకార్ణవమైన దాని యందు స్థావరజజ్ఞమములు నష్టములు కాగా, ఆ బ్రహ్మపుట్టును. ఆ పురుషుడు సహస్రాక్షులు గలవాడు, సహస్రపాదములు గలవాడు, నహస్రశిరములు గలవాడు, బంగారు వర్ణము గలవాడు, ఇంద్రియములకు గోచరముకానివాడు. అపుడు నారాయణుడను బ్రహ్మ జలమున పరుండెను.

సత్యోదేకము వలన నాతడు మేలుకొని లోకమును శూన్యముగా జూచెను. ఈసందర్భమున నారాయణుని గూర్చి ఈ శ్లోకమును పేర్కొందురు (చెప్పుదురు). ఆపస్సులు (జలముల) పేరు విందుము. (ఆ జలములను) నాభిలో నింపి యచట ఉన్నాడుగావున నారాయణుడని స్మరింపబడినాడు. వేద మార్గమున నిర్వచింపబడిన ఆ పురుషుడు వేయి తలలు గలవాడు, మంచి మనస్సుగలవాడు, వేయి పాదములు గలవాడు వేయి కన్నులు ముఖములును గలవాడు. వేయి బాహువులు గలవాడు. ఆతడు మొదటి ప్రజాపతి బ్రహ్మ.

సూర్యవర్ణము గలవాడు, భువనమును రక్షించువాడు, ఒక్కడు, పూర్వము లేనివాడు. మొదటి ఇంద్రుడు హిరణ్యగర్భుడైన (బ్రహ్మయైన) మహాత్ముడైన పురుషుడు ఆతడు తమస్సున కావల నుండువాడుగా పఠింపబడుచున్నాడు. కల్పాదిలో రజోగుణముచే నుద్రేకమునందిన బ్రహ్మయై ప్రజలను సృష్టించెను. కల్పాన్తమువలన తమో గుణముచే నుద్రేకమును జెందిన కాలుడై మరల ప్రజలను మ్రింగెను.

     ఆ నారాయణు డనువాడే సత్య గుణముచే నుద్రిక్తుడై సముద్రమున పరుండుచు, తనను మూడు విధములుగా విభజించి ముల్లోకమున నుండెను. ఆ మూడింటిచే (త్రివిధావిభక్త శరీరములచే) వారిని సృష్టించును మింగివేయును, చూచును. అప్పుడు స్థావరజఱమరూపమైన లోకము ఏకార్ణవము కాగా, నాలుగు వేల యుగముల చివర, అంతయు జలముచే ఆవరింపబడగా, నారాయణడును బ్రహ్మ వెలుగు లేని సముద్రమున పరుండుచు, నాలుగు విధములైన ప్రజలను మింగి బ్రాహ్మీ రాత్రి యందు నిద్రించిన కాలుని మహర్లోకమునుండి మహర్షులు చూతురు.

భృగువు మొదలగు ఏడుగురు మహర్షులు ఈ కల్పమున (నున్నపుడు) నుండిరి. ఆ తరువాత ఆ విధముగా ఉంటున్న సప్తమహర్షులచే పరమైన మహర్లోకము పరిగతమాయెను-68. మొదట సత్యర్థమైన 'ఋ' ధాతువు నుండి 'ఋషయః' అన్న నామము (పదము) ఏర్పడినది. ఆ కారణము వలన ఋషి పరమైన (ఋషి శబ్దము పరముగా నున్న) మహత్ శబ్దము కావున మహర్షయః అయినది. అపుడు మహర్లోకమున నున్న ఆ సప్తర్షుల చేత నిద్రించిన కాలము చూడబడినది. కల్పము ముగియగా, ఆ సప్తమహర్షులు సత్యాదులైరి. ఈ విధముగా బ్రాహ్మీరాత్రులు (బ్రహ్మమానములోని రాత్రులు) వేలకొలది ముగియగానే, ఇతర మహర్షులు గూడ అట్లే నిద్రించిన కాలమును చూచిరి. కల్పాదిలో పదునాలుగు సంస్థలను అనేక పర్యాయములు బ్రహ్మ కల్పించిన కారణముగా కాలము నిర్వచింపబడినది. ఆ కాలము కల్పాదులలో మరల మరల సర్వభూతములకు స్రష్ట యగును. ఆ కాలమే వ్యక్తావ్యక్తుడైన మహదేవుడు (శివుడు) అగును. ఈ జగమంతయు ఆ మహదేవునిది. ఈ విధముగ రెండు కల్పముల యొక్క ప్రతి సన్ది చెప్పబడినది. ఈ ప్రతి సంధి వర్తమాన భూతకాలముల మధ్యన మొదటి (ప్రారంభ) యవస్థ యగును. ప్రతి కల్పమున ఉన్నది యుండునట్లు సంగ్రహముగా ప్రతి సంధి చెప్పబడినది. ఇప్పుడీ కల్పమును గూర్చి చెప్పెదను వినుడు.

ఇది వాయు ప్రోక్తమైన మహాపురాణమున ప్రతిసంధి కీర్తనమను ఏడవ అధ్యాయము.