వాయు మహా పురాణము

Table of Contents

25 - మధుకైటభోత్పత్తివినాశ వర్ణం

 సూతుడు పలికెను:- తేనేవలే పిజ్ఞ (గోరోచస) వర్ణముతో విశాలమైన నేత్రములుగల ఉమాపతి తన కన్నులతో త్రాగుచున్నాడాయన్నట్లు ఆ బ్రహ్మ విష్ణువులను జూచి, తనను స్తుతించినందున మిక్కిలి సంతసించిన ముఖము గల వాడయ్యెను-1. ఆ ఉమాపతి, విరూపాక్షుడు (మూడు కన్నులు గలవాడు) దక్షయజ్ఞ ధ్వంసమొనర్చినవాడు, పినాకమను  ధనువును ధరించినవాడు, ఖండించెడు గండ్రగొడ్డలి గలవాడు, భూతములున్నచోని వధించువాడు మూడు కన్నులు గలవాడు 2. భగవంతుడు ఐన యా శివుడు ఆ బ్రహ్మ విష్ణువుల యిరువురి యమృతమువంటి వాక్యములు విని, తానెరిగియున్నను, ఆ మహానుభాగుడు ప్రీతిపూర్వకముగా నిట్లనెను-3. పరస్పరహితమును గోరు మహాత్ములైన మీరెవరు? ఆ (యీ) భయంకర ప్రళయ జలమయమైన తెప్పపై కమలాక్షు కూడియున్న మీరిరువురెవరు?-4. అంత ఆ మహాత్ములిరువురును ఒకరి నొకరు చూచుకొనియనిది. భగవాన్! విభో! నీచే నిజముదెలిసి యేమి ప్రయోజనము? నీవు లేక స్వేచ్చా చారరూపమై యంతములేని నిత్య సుఖము ఎక్కడిది.

భగవంతుడైన మహాదేవుడు మాధుర్యము నిండిన మాటలలో నిట్లనెను. ఓ బ్రహ్మా! ఓ విష్ణో! మీరిరువురికి నేను జెప్పుచున్నాను-6. నేనే ఈమీ శాశ్వతాక్షరయుక్తమైన (శాశ్వతమై నాశములేని వర్ణమాలలు గల స్తుతితో గూడిన) భక్తిచేత సంతుష్టుడనైతిని. మిక్కిలి పూజినీయులైన మీరిరువురును నాకు గౌరవింపదగినవారు ఇప్పుడు మీ యిరువురికి వరములలో నుత్తమమైన వరమేమి యోయవలెను?-7.

 మహాదేవుడిట్లనగానే విష్ణువు బ్రహ్మతో ఓ మహాభాగ! బ్రహ్మ! నీవడగదలచిన వరమేమియో చెప్పుము చెప్పుము అని యనెను-8. అంత భగవంతుడగు ఓ విష్ణో బ్రహ్మ “నేను సంతానమును గోరుదును.” అని పుత్రప్రాప్తికై వరమును బొందగోరిభారము వహించగల పుత్రుని గోరు బ్రహ్మతో నిట్లనెను. వీరుడు సాటిలేనివాడు భారమును మోయువాడునైన పుత్రుని గోరినచో-9,10. దేవదేవుడైన మహేశ్వరునే పుత్రుని నీవు కోరుము. అనెను. బ్రహ్మ యాకేశవుని మాటను గౌరవించి “ఈశ్వరుడై నారదుడైన రుద్రునికి చేతులు జోడించి మ్రొక్కి పుత్రకాముడై విష్ణువుతో సహ ఇట్లు పలికెను. భగవంతుడనైన నీవు పుత్రకాముడనైన నా విషయమున సంతుష్టుడవైనచో ఓ విశ్వాత్ముడా నాకు పుత్రుడవు గమ్ము వాడు భారము వహించగలిగి నీతో సమానునిగా నుండవలెను. ఓ మహేశ్వర! నా విషయమై సంతుష్టుడవైన నిన్ను న్యాయమైన యీ వరమును గోరుచున్నాను.

భగనేత్రహారియైన మహాదేవుడు బ్రహ్మయొక్క యా ప్రార్థనమును విని నిష్కల్మషముగా మాయలేకుండగా ‘బాఢం’ (అట్లేయగుగాక) యని యనెను. ఓ సువ్రతుడా! బ్రహ్మా! నీవు ఏదేని పని ప్రారంభించగా ఆ పని జరుగునపుడు నీకు కోపము కలుగగలదు. ప్రాణ హేతువులైన నా పదకొండు రుద్రులతో ఈ నేను-15. పదకొండవ వానిని శూలము హస్తమునందుగలవానినై వెంటనుండు వానిని ఋషిని మిత్రుడను మహాత్ముడను అట్టి నేను నీకు కోపము వచ్చినపుడు నీలలాటము నుండి జనింపగలను-16. బ్రహ్మకావిధముగా సాటిలేని వరమునిచ్చి, నీకు గూడ వరమునిచ్చెదను అడుగుమని విష్ణువుతో ననెను.

అంత ఆ మహాభాగుడైన విష్ణువు భవునితోనిట్లనెను. ఓ దేవా! ఇదియంతము నీతోనే చేయబడినది. ఈనీచే జేయబడినదంతయు చాలును నా విషయమున నీవు సంతుష్టుడవైనచో ఓ అంబుద వాహన! మహాదేవా! నీయందు నా భక్తి సుప్రతిష్ఠితమగుగాక-18. అని యడుగబడిన యా మహాదేవుడు కేశవునితో నిట్లనెను ఓ శాశ్వతుడవైన దేవా! విష్ణు! నేను నీ విషయమున నెంత సంతసించితినో వినుము-19. ఈ కనబడునది కనబడనిదియునైన స్థావరజంగమాత్మకమైన విశ్వరూపమంతయు రుద్ర నారాయణాత్మకము-20. నేనగ్నిని నీవు సోముడవు. నీవు రాత్రివి. నేనే పగటిని. నీవు ఋతమవు నేను సత్యమును. నీవు క్రతు స్వరూపుడవు. నేను దాని ఫలమును-21. నీవు జ్ఞానము. నేను క్షేయమును (జ్ఞానముచే తెలియదగినవానిని) నిన్ను జపించి జనులెల్లప్పుడు నన్ను బ్రవేశింతురు. నీవు సంతుష్టుడవైనచో జనులు సుకృతమును (పుణ్యమును) జేయువారగుదురు. యుగక్షయమున (యుగానకాలమున) నీ యిరువురితో గూడినదే మార్గము. వేరొక మార్గములేదు-22. నన్ను ప్రకృతినిగా దెలియుము నన్ను పురుషుడైన శివునిగా తెలియుము. నేను నీకు సగము శరీరమైనట్లే నీవు నాయొక్క సగము శరీరమవు-23. ఎడమ ప్రక్క నేను, నాకది నీనల్లనైన శ్రీవత్సలాంఛనము గలది. నీవు కుడి ప్రక్కవు. కానీ అది నీలలోహితుడనైన నేను-24. ఓ విష్ణో నీవు నా హృదయమవు. నీ హృదయమందైతే నేనున్నాను. నీవు సమస్త కార్యమునకు కర్తవు. నేను దానికి దైవతమును-25. కావున ఓ వత్సా! రమ్ము (నాలోగలియుము) నీకు స్వస్తియగుగాక. ఓ మేఘశ్యాముడా! వెళ్ళుదును. ఇట్లు పలికి విష్ణువుయొక్క దేవుడైన యీశ్వరుడు అంతర్ధానమయ్యెను.

ఓ రాజా! ఆ తరువాత మహాదేవుడు అంతర్థానముగాగానే విష్ణువు అంతర్జాలమున బ్రవేశించి తన శయనమున బరుండెను-27. అపుడు పద్మముల వంటి కన్నులు గలవాడును పద్మము నందు బుట్టిన వాడును అగు బ్రహ్మ సంతసించిన మనము గలవాడై, పద్మగర్బాభమును, (బ్రహ్మతో) విష్ణువుతో, సూర్యునితో సమమై కాంతిగలదియు బ్రహ్మమును (జ్ఞానమయ బ్రహ్మకు సంబంధించినదియు) నైన ఆ పద్మమును జేరెను-28. తరువాత చాలా కాలమునకు, అక్కడ (పద్మమున) సాటిలేని యిరువురు మహాబలులు. అన్నదమ్ములు మధుకైటభులు అనువారు బ్రహ్మను “నీవు మాకు తినదగిన యాహారమగుదువు” అనియని యచ్చటనే యంతర్థానమైరి-29, 30. కమలమున బుట్టిన బ్రహ్మ భయంకరమైన వారి భావమును తెలిసి తన మాహాత్మ్యమును గూడ దెలియక (కర్తవ్యమును) దెలిసికొనుటకు ప్రారంభించేను-31. తాను మరల కమలనాభికూర్పును దాని నుండి పై మార్గమును తెలియక ఆ పద్మనాము గుండా రసాతలమునకు (పాతాళమునకు) లేదా భూమికి అంతర్జాలమున దిగి కృష్ణముగ చర్మమునుత్తరీయముగా ధరించిన విష్ణువును జూచెను-32. బ్రహ్మయా హరిని మేలుకొల్పెను. మేలుకొన్న యా హరితో నిట్లనెను. ఓ దేవా! భూతములవల్ల నాకు భయమేర్పడినది లెమ్ము రక్షించుము శుభమును గూర్చుము”-33. అంత శత్రుదమనుడైన భగవంతుడైన మునియైన విష్ణువు స్వయంగా నవ్వుతో “భయపడవలదు భయపడవలదు” అని యనెను.

నీవు పూర్వము భూతములవల్ల నాకు మిక్కిలి భయముగలదని యంటివి. కావున నీవు భూతాది వాక్యములచేత ఆ యిరువురుని నశింపజేయగలవు (అనెను)-35. అంత, అచట వచ్చి కూర్చునియున్న అయోనిజుడైన విష్ణువునిలో భూర్లోక భువర్లోక- స్వర్గలోకములు ప్రవేశించినవి. అట్లు జరుగగా అనస్తుడు తనముఖము నుండి విష్ణువు జిష్ణువు (విష్ణువు ఇంద్రుడు) అను సోదరులను వెడలగ్రక్కెను. అంత మరల మధుకైటభులరాతను దెలిసికొని విష్ణు జిష్ణువులతో “బ్రహ్మను రక్షించుకొనుడు” అని యనెను-36,37. సత్తములైన మధుకైటభులు విష్ణు-జిష్ణువులతో సమానమై రూపములను ధరించిరి. ఆ విధముగా సమానరూపములు గలవారికి సమానరూపములు గలవారే అభిముఖులుగా నుండిరి-38. తరువాత (విష్ణు జిష్ణు రూపమునుధరించిన) మధుకైటభులు అను రాక్షసులు బ్రహ్మతో భయంకరవచనము లిట్లనిరి.” యుద్దము జేయుచున్న మా విషయముతో ప్రాశికుడవు ఎవరెవరితో యుద్ధముజేయుచున్నారని తెలియనివాడవు అగుము-39. తరువాత వారు జలమును బ్రవేశించి తమ మాయచే జలమును స్తభింపజేసి యపుడు ఎవరేది యిష్టమో అట్టి తుముల (దొమ్మి) యుద్ధమును జేసిరి.

 ఆ విధముగా యుద్దము జేయుచున్నవారికి దేవమానముతో నూరు సంవత్సరములు గడచినవి. కాని పరస్పరముగా యుద్ధమదము యొక్క ఉప్పొగం తరగలేదు-41. రెండు గుర్తులతో నున్నందున (విష్ణు జిష్ణు) రూపముల ధరించినవారూ నిగూఢభావబోధకములైన చేష్టలు (ఇంగితములు) గలవారైరి. వారొకే రూపసాదృశ్యంలో నున్నందున బ్రహ్మ వారిని గుర్తింపలేక వ్యాకుల చిత్తుడై ధ్యానము నాశ్రయించెను-42. తరువాత దివ్య దృష్టితో వారిలో భేదమును గుర్తించి, పద్మకేసరము (కింజలము)ల నుండి బుట్టిన సూక్ష్మమైన వారి కవచమును బంధించెను. నడుము వరకున్న వారి శరీరమును గూడ బంధించిన. ఈ తరువాత మన్తము నుచ్చరించెను. (జపించెను).

 జపించుచున్న బ్రహ్మకు కన్య గలిగెను. ఆమె విశ్వరూపము నుండి బయలు వెడలినదియై పద్మ చంద్రుల వంటి ముఖము గలది. పద్మముల వంటి చేతులు గలది. శుభకరమైనది. ఆమెను జూచి యా యిరువులు రాక్షసులు భయమువలన బాధితులై వివర్ణులైరి.

ఆ తరువాత బ్రహ్మ మధురములైన మాటలతో ఆ కన్యతో నీవెవ్వతవని తెలియవలెను? ఓ నిందింపబడని దానా! నిజముగా జెప్పుము” అని యడిగెను-45. అప్పుడు ఆ కన్య సామముతో (శాంతముగా సామము వేదముతోను) బ్రహ్మను పూజించి చేతులు జోడించి “నన్ను విష్ణువు యొక్క యాజ్ఞను నెరవేర్చు మోహినీ మాయనుగా నన్ను తెలియుము” అనెను 46. ఓ బ్రహ్మాన్ నీ చేత ధాన్యనింపబడిన దాననై నేను వేగముతో వచ్చితిని. అని యనెను. ఈమె విషయమున సంతసించిన మనస్సు గలవాడై బ్రహ్మయామెకు గౌణమైన (గుణమునాధారముగా చేయబడిన) నామమును (పేరును) బెట్టెను-47. నాచే వ్యాహృతురాలవై (విశేష ధ్యానమున బిలువబడిన దానవై) వచ్చితివి గావున మహావ్యాహృతి యనియే నీ పేరు ప్రచారమగును-48. శిరస్సును భేదించి పైకి వచ్చితివి గావున సావిత్రియని పిలువబడెదవు. ప్రస్తుతము అంశములులేక ఒక్కతెవైనందున అనేకాంశవు అగుదువు-49. ఇవి నీ గౌణములైన (గుణ ప్రధానములైన) నామములు. ఓ శుభాననా! నాయనుగ్రహమున నీ క్రియల వలన గలుగు నామములు వేరుగాగలవు.

తరువాత (ఆమెచే) పీడింపబడినవారై యీతనిని (బ్రహ్మను) “ఆవరణములేని మరణము మాకు గావలెను. మేము నీకు పుత్రులముగూడ గావలెను” అని వరమడిగిరి-51. బ్రహ్మ- మీరడిగినట్లే యగుగాక అని వారిని వెంటనే యమలోకమున కంపెను. విష్ణువు కైటభుని తరువాత జిష్ణువు మధువును యమలోకమునకు బంపిరి.

ఈ విధముగా జిష్ణువుతో గూడిన విష్ణువుతో ఆ యిరువురు రాక్షసులు చంపబడిరి. ఆ తరువాత సంతసించిన యీశుడైన బ్రహ్మచేత లోకముల హితముగోరి-53. ఏ విధముగా పుత్రత్వరూపమున ఆత్మ (తన రూపము) ఈయబడినదో వినుడు. ఆ విధముగా విష్ణు జిష్ణులతో మధుకైటభులకు యుద్ధము జరుగగా బ్రహ్మ విష్ణువుతో బలికెను.

ఇవ్వేళ నూరేండ్లు నిండినవి. సమయము ముందుగా వచ్చినది. ఇది సంక్షేపమై భయంకరమైన సంప్లవము (ప్రళయము) నేను నా స్వస్థానమునకు వెళ్ళుచున్నాను అనియనెను-55. బ్రహ్మమాట విని దేవుడు (మహాదేవుడు) అపుడు సంహారమును (సర్వ ప్రాణుల సంహారమును) చేసెను. భూమినంతయు స్థావరములు (చరింపని పర్వత వృక్షాదులు) లేనిదానినిగా జేసెను. జంగమములను (చరించువానిని) వాని మూలమైన ప్రకృతిలో నుండునట్లు చేసెను-56. గోవిందుడైన విష్ణువు యొక్క భద్రత కొరకు సముద్రముంచబడినది. ఓ లక్ష్మీవర్ధనుడవైన విష్ణో! నీకు నేను చేయవలసినదేమైననున్నచో చెప్పుము అని యనెను-57. విష్ణువనెను. ఓ బ్రహ్మన్ బంగారు వన్నెగలవాడా! అదియంతయు సరియ! నా మాట వినుము. పుత్రకాంక్షచే పూర్వము ఈశ్వరుని నుండియే యనుగ్రహం నీకు లభించినదో-58, దానినట్లే సఫలముగాజేసి నానుండి ఋణ విముక్తుడవైనావు. నాలుగువిధములైన ప్రాణులను నీవు సృష్టించుము లేదా వదిలి వేయుము అనెను.

గోవిందుని వలన పద్మమున బుట్టిన బ్రహ్మ మేలుకొని ప్రజలను సృష్టించు తలంపుగలవాడై ఉగ్రమైన మహా తపస్సు జేసెను-60. ఈ విధముగా తపముజేయుచున్న యా బ్రహ్మకేమియు జరుగలేదని తరువాత చాలాకాలమునకు దుఃఖము : వలన క్రోధము పెరిగెను-61. ఆ క్రోధముచే నిండిన నేత్రముల నుండి కన్నీటి బిందువులు రాలెను. తరువాత ఆ కన్నీటి బిందువుల నుండి వాతపిత్త కఫాత్మకులు మహాభాగులు గొప్పయదృష్టము గలవి) మహాబలవంతములు, స్వస్తిక చిహ్నములచే నలంకరింపబడినవి, విరియబోసిన వెంట్రుకలు గలవి మహావిషముగలవియును అగు (ఆ) సర్పములు బుట్టినవి-62,63. ఆ విధముగా ముందుగా. బుట్టిన సర్పములను జూచి బ్రహ్మ తనను నిందించుకొనెను. అయ్యో! తపస్సుచే నా కిటువంటి ఫలితము లభించినచో ధిక్కారము. నాకు మొదటి సంతానమే లోకముల నశింపజేయునదిగా బుట్టినదే యని యనుకొనెను 64. తరువాత ఆ బ్రహ్మకు క్రోధాసహనముల వలన బుట్టిన మూర్ఛ తీవ్రమయ్యెను.

 సాటిలేని వీర్యము గల యాతని (బ్రహ్మయొక్క) దేహము నుండి కారుణ్య పూర్వకముగా ఏడ్చుచున్న తనతో పదకొండుగురైన రుద్రులు బుట్టిరి. రోదించుటవలన వారు రుద్రులు. ఆ కారణముననే వారిలో ఆ రుద్రత్వముండినది 66. ఎవరు రుద్రులో వారు ప్రాణములు గదా ఏవి ప్రాణములో అవి రుద్రాత్మకములు. అవి సర్వభూతములందున్న ప్రాణుల ప్రాణములుగా దెలియదగినవి-67. త్రిశూలియైన నీలలోహితుడు ఏకాదశాత్మకుడైన ప్రభువైన శివుడు అత్యుగ్రుడు మహత్యము గలవాడు చక్కగా నడచినవాడునైన యా బ్రహ్మకు లలాటము నుండి మరల ప్రాణములను ఇచ్చెను-68. అపుడు (బ్రహ్మకు) ఆత్మజుడై ప్రభువైన ఆ శివుడు బ్రహ్మను జూచి సంతసించిన ముఖముగలవాడై యా రుద్రదేవుడు, ఈ విధముగా ఉత్కృష్టమైన వాక్కును బలికెను.

హే బ్రహ్మన్, నన్నడుగుకొనుము. నిన్ను నీవు స్మరించుకొనుము. నన్ను నీ యాత్మజుడనైన రుద్రనిగా దెలియుదువు. హేప్రభో! నన్ననుగ్రహింపుము-70. ఈ రుద్రుని వాక్యమును బ్రహ్మవినేను. ఆయన మనోగతము (కోరిక) ప్రభూతమ (ఎక్కువ)య్యెను. వికసించిన కమలము వలె ప్రకాశించు కన్నులచే బ్రహ్మప్రసన్నాత్ముడయ్యెను-71. తరువాత, మరల ప్రాణమును బొందిన బ్రహ్మ శుద్ధమైన బంగారువన్నెగలవాడై స్నేహముతో గూడి గంభీరమైన వాక్కుతోనిట్లనెను-72. ఓఓ మహాభాగుడా నా మనము నానందపరచుచున్నావు విశ్వమును భూతి (ఐశ్వర్యమవు)వి. ఏకాదశాత్మకుడవు ఐన నీవెవడవు? చెప్పుము. అనీ యనెను.

 అనంత తేజస్కుడై భగవంతుడైన బ్రహ్మ యిట్లనగానే తనతోబుట్టిన వారితోబాటు అభివాదనము (నమస్కారము) జేసి రుద్రుడు బదులు పలికెను-74, ఓ బ్రహ్మన్! పూర్వము విష్ణువుతోగూడినన్ను పుత్రుడవుగమ్మని లేదా నీతో సమానముగా భారము వహించు పుత్రునిమ్మని వరమడిగితివి-75. లోకములలో ప్రసిద్ధులైన విశ్వాత్మునివల్ల బుట్టిన యందరిచేతను చేయదగినది గలదు. ఓ దేవేశ! దుఃఖమును వదులుము. లోకములను నీవు సృజింపదగియున్నావు. అని యనెను.

ఈ విధముగా జెప్పగానే బ్రహ్మ సంతసించెను. తరువాత లోకాన్తమునకు నీలలోహితుడైన రుద్రునితో మారు పలికెను.

 ఓ మహాదేవా! నా పని కొరకై సహాయపడుము. నాతోగూడి ప్రజలను సృష్టిచేయుము. నీవు సర్వప్రాణులకు బీజవంతుడవు తత్రసన్నుడవై (ఆ బీజములను పొందినవాడవై) బీజవంతుడవు గమ్ము. అని బ్రహ్మయనెను. శంకరుడుగూడ సరియేయని యా మాటను స్వీకరించేను.

తరువాత ఆ భగవంతుడైన బ్రహ్మ కృష్ణ మృగ చర్మముచే నలంకరింపబడినవాడై మొదట ప్రాణులను ధరించినదైన మనస్సును సృజించెను. తరువాత జిహ్వారూపిణియై విశ్వరూపిణియైన యా సరస్వతిని సృజించెను-79. భృగువు, అజీరసుడు, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, అను ఏడుగురిని మనస్సున బుట్టిన వారిగా నమహాతేజస్వియైన బ్రహ్మ సృజించెను-80. ఇంక నాతడు తనతో సమానులై విశ్వమున బుట్టినయితరులను గూడ సృజించెను. మరల నా మార్గముననుసరించి వారి ముఖము నుండి గోవులు బుట్టినవి-81. ఓంకారము మొదలుకొని వేదములను, అభిమానింపదగిన  దేవతలను సృజించెను. ఈ విధముగా పైన జెప్పబడిన వారి నందరిని లోక పితామహుడైన బ్రహ్మ సృజించెను-82. తరువాత నా భగవంతుడైన ప్రభువు దక్షుడు మొదలగు మానసపుత్రులతో మహాధీశక్తిగల రుద్రునితోగూడి ప్రజలను సృజింపుడు మీకు భద్రమగు గాక” అనెను.

 అప్పుడు ప్రజాపతులు (దక్షుడు మొ॥ వారు) ఆ మహాత్ముడైన శంకరుని వెంబడించి, ఓ దేవ! నీతోగూడి మేము ప్రజలను సృజింపగోరుచున్నాము. ఓ మహేశ్వర! ఇది బ్రహ్మయొక్కయు నీ యొక్కయు సందేశము (ఆజ్ఞ)-84. ఆ దక్షాదులిట్లనగానే ప్రభువైన రుద్రుడు వారితోనిట్లనెను. బ్రహ్మయొక్క ఆత్మజులైన (కుమారులైన) దేవతలు నాకై నా నుండి ప్రాణములను గ్రహించిరి. ఈ సాకుమారులైన బ్రాహ్మణులను అగ్రజులకంటే నగ్రజులుగాజేసి బ్రహ్మాది సంబ పర్యంతములై బ్రహ్మ మొదలు గడ్డిగుత్తి వరకైన) నేనాత్మగా నున్న యేడు లోకములను మీరు నా మాటవలన సృష్టింపదగును. మీకు శుభమగుగాక"-85,86. ఈ విధముగ రుద్రుడు చెప్పగానే త్రిశూలియైన యాద్యుడైన రుద్రునితో ప్రజాపతులు మీరాజ్ఞాపించినట్లే యది (సృష్టి కాగలదు అనిరి-87. అపుడు ప్రజాపతులు మహాదేవుని ఒప్పించి మహాత్ముడైన దక్షునితో నిట్లనిరి. “నీవు శ్రేష్ఠుడవైన ప్రజాపతివి. నిన్ను ముందుంచుకొని నీకు మేము క్షేమముగా ప్రజలను సృష్టింపగలము-88. దక్షుడట్లేయగుగాకయని వారి మాటనోప్పుకొనెను. ప్రజాకాముడై యా ప్రజాపతి వారితో గూడి ప్రజలను సృష్టింపనారంభించెను. తరువాత స్థాణువు (శంకరుడు) సర్గమునందు (సృష్టియందు) ఉండగా బ్రహ్మ సర్గమును సృష్టిజేసెను-89. ఆ తరువాత బ్రహ్మకేడవ కల్పము గడచిపోగా నీ బ్రహ్మకు ఋభువు, సనత్కుమారుడును బుట్టిరి. వీరిరువురు తపోలోక నివాసులు, ఆ తరువాత ఇతర మహరులను మానసజన్ములుగా నా ప్రభువు సృష్టించెను.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున మధుకైటభోత్పత్తి వినాశ వర్ణనమను ఇరువదియైదవ యధ్యాయము.