వాయు మహా పురాణము

Table of Contents

36 -  భువనవిన్యాసో

సూతుడనెను:- వరుసగా నా నాలుగు పర్వత రాజముల యొక్క మనోహరములైన యనుబంధ ప్రదేశము చెప్పెదను. అవి సర్వకాలములు (భూత భవత్- భవిష్య) సర్వఋతువులు సమముగా గలవి. అనగా నాయా ఋతుచిహ్నములగు పూవులుగలవీ-1. గోరువంకలు, నెమళ్లు, చకోరములు, మదించిన చిలుకలు, గండు తుమ్మెదలు, చిత్రములైన యితరపక్షులు వీనిచే నంతట ప్రకాశించు చుండును-2. వెన్నెల పురుగుల నాదములు, హేమక (బంగారువన్నె) పక్షుల నాదములు, మదించిన కోకిలనాదములు, మేకపోతుల నాదములు-3. చక్కని కంఠములు గల కాంచన పక్షుల నాదములు, ఊరబిచ్చుకల నాదములు, తక్కిన ప్రాణుల. కూతలనాదములు- వీనిచే నంతట మనోహరమైనవై యుండును-4. ఒక్కొక్క చోట మదముచే విజృంభించి మధురములై యలసతోనున్న తుమ్మెదల యొక్కయు, ఒక్కొక్క చోట కిన్నెరుల యొక్కయు గానములచే నిండి వనాంతములు ఉపగానము జేసినవి-5. అందమైన చిగురాకులతో నొప్పిన తరువులు పిల్లవాయువులతో కదల్చబడి పుష్పవర్షమును గురియుచున్నవి-6. పిల్లవాయువులతో కదలుచు ఊగుచున్న యెఱ్ఱని చివురాకుల తోను పూలగుత్తుల తోను ఆ వృక్షములు కూడియున్నవి-7. ఓ బ్రాహ్మణ శ్రేష్టులారా! ఒకచోట అనేక ధాతువులచే చిత్రమై మనోహరముగానుంచబడిన నూర్లకొలది శిలలచే శోభితములై యున్నవి-8. దేవదానవ-గంధర్వ-యక్ష- రాక్షస - పన్నగులచేతను, అప్సరోగణములచేతను సేవింపబడినవి-9.

తరువాత నచట మనోహరము లైన నాలుగు దేవతల ఉద్యానవనము లున్నవి. అవి నాలుగు దిక్కులతో విశాలముగా వ్యాపించి యున్నవి. వాని పేరులను వినుడు-10. తూర్పు దిక్కున నున్నది చైత్ర రథమను పేరు గలది. దక్షిణపుది నందన వనము పశ్చిమపుది వైభొజమనునది, ఉత్తరపుది సావిత్ర (సూర్యునిది) మనునది. ఈ విధముగా తెలియవలెను-11. ఈ మహావనములలో నున్న మనోహరములైన యనుబంధము వరుసగా నివి. పక్షుల కూతలు-12, వనములచే విస్తీర్ణములైన తీర్థములు, మహాపుణ్యములైన వనములు, గొప్పయేనుగలు, పాములు- వీనికి స్థానములు. మహాత్ములచే సేవింపబడిన ప్రదేశములు-13. మంచి రుచిగల నిర్మల జలములు- ఇవి మంగళములు సుఖకరములు ఉత్తములైన సిద్దులచేతను దేవతలచేతను అసురులచేతను స్నానము చేయబడినవి-14. ఛత్రము లంతటి ప్రమాణములు గలిగి, గొప్ప సువాసనలు గలిగి వికసించి విశాల దళములు గల మనోహరము లైన కమలముల చేతను కలువల చేతను ఆ జలములు శోభిల్లుచున్నవి. అట్టి జలములు గల మహాసరస్సులు నాలుగు గలవు, వాని పేరులను జెప్పెదను-15.

తూర్పున అరుణోదయ (ఎఱ్ఱని నీరు గలది), దక్షిణమున మానసము, పశ్చిమమున సితోదము (తెల్లనీరుగలది), ఉత్తరమున మహాభద్రము- అను సరస్సులు గలవు, తూర్పుననున్న అరుణోదయ సరస్సు నుండి యేర్పడిన పర్వతము లెవ్వియో విస్తరముగా జెప్పెద వినుడు-17. సీతాంతము (చల్లని స్వభావము గలదియు) కుముంజము (గజిబిజిగానున్న ముంజుగడ్డి గలదియు), సువీరము (చక్కని వీరులుగలదియై సంవీరమను) ఒక పర్వతశ్రేష్ఠము. వికంకము (రాపులుగులు లేనిదియు)మణిశీలము (మణులే స్వభావమైనదియు) నైన వృషభమును-18. తరువాత నీలము (గొప్పనల్లనిదియు) రుచకము (మంగళద్రవ్యముగలదియు) సబిందువు (నీటిబొట్లుగలదియు) మందరము వేణమంతయు) వెదురు వృక్షములు గలదియు) సేమేధము (మంచి మేధాశక్తి గలవారుండునదియు) దేవపర్వతనీషధమనుపర్వతము-19. అనునీ పర్వత శ్రేష్ఠములును తక్కిన పర్వతములును మందరమునకు తూర్పుననున్నవై సిద్ధులకు ఆవాసములగా జెప్పబడినవి-20.

మానస సరోవరము యొక్క దక్షిణ వైపున నున్న మహాపర్వతముల పేరులను వినుడు-21. మూడు శిఖరములుగల పర్వతము (త్రిశిఖరము)శిశిరము (చల్లనిది) అను పర్వత శ్రేష్ఠము, కలింగము, పతంగము, రుచకము, సానుమంతము-22. తామ్రాభము (రావిశ్రాంతిగలది), వీశాఖము, శ్వేతోదరము (తెల్లని మధ్యభాగము గలది), సమూలము, విషధారము, రత్నధారము-23, ఏకశృంగము, మహామూలము, గజశైలము, పిశాచకము. పంచశైలము, కైలాసము, పర్వత శ్రేష్టమైన హిమవంతము-24. అనునవి దేవతలు నడచిన యుత్కృష్టములైన పర్వతశ్రేష్ఠములు దివ్యతేజముగల మేరుపర్వతముయొక్క దక్షిణ దిగ్భాగమున నున్నవి-25.

ఓ బ్రాహ్మణోత్తములారా! సితోద సరస్సు యొక్క పశ్చిమమున నున్న ఉత్తమములైన మహాశైలమును వరుసగా జెప్పెదను-26. సువక్షము, శిఖిలము, కాలము, వైదూర్యము, కపిలము, పింగలము, రుద్రము, సురసము-27. కుముదము, మధుమంతము- అంజనీమకుటము, కృష్ణము, పాండరము, సహస్రశిఖరము-28. పారియాత్రము, త్రిశృగంము అనునవి పశ్చిమ పర్వతోత్తమములుగా జెప్పబడినవి-29.

శోభావంతమైన మహాభద్ర సరస్సు నకుత్తరమున నున్న పర్వతములను పూర్వము జెప్పిన వానిని వరుసగా జెప్పెదను 30. శంకుకూటము, మహాశైలము, వృషభము, హంస పర్వతము, నాగము కపిలము, ఇంద్రశైలము సానుమంతము-31. నీలము, కనకశృంగము, శతశృంగము, పుష్పకము. మేఘశైలము, విరాజము, జారుధి, అనునవి పర్వతశ్రేష్ఠములు ఇవి యుత్తరపర్వతములనబడినవి-32. ఈ ప్రధానశైలముల మధ్యనున్న స్థలులు (మెట్టునేలలు), (ద్రోణులు (పసులు మేయుకంచెలు- కొండపల్లములు) సరస్సులును వరుసగా వినుడు-33.

ఇది శ్రీ వాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను ముప్పది యాఱవ యధ్యాయము 36.