వాయు మహా పురాణము

Table of Contents

1 - ప్రక్రియా పాదము అనుక్రమణిక

 నారాయణునకు, మానవులలో శ్రేష్టుడగు నరునకు, సరస్వతీ దేవికి, వ్యాసునకు నమస్కరించి, తరువాత జయము (పురాణము)ను చెప్పవలెను. సరస్వతీ దేవి యొక్క హృదయమునకు ఆనందమును కలిగించు నట్టియు, పరాశరమహర్షి యొక్క కుమారుడనగు వ్యాసుడు సర్వోత్కర్షగానున్నాడు. ఆయన యొక్క ముఖపద్మము నుండి జారిన వాజ్మయము. అనే అమృతమును మానవులు పానము చేయుచున్నారు.

శాశ్వతుడు, నిత్యుడు, నాశము లేనివాడు, దేవతలలో కెల్లా గొప్పవాడు, మహాత్ముడు, జగత్తున కంతకు ప్రభువును ఈశ్వరుని శరణు వేడెదను-1. లోకములను సృజించిన బ్రహ్మదేవుని శరణువేడెదను. సర్వజ్ఞుడు, పరాజయము నెరుగనివాడు, భూత భవిష్యద్వర్త మానములకు ప్రభువు, సద్రూపుడునగు విష్ణువును శరణువేడెదను.

జగన్నాథుడగు ఈశ్వరుని యందు సాటిలేని జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, నాల్గు సిద్ధులతో కూడిన ధర్మము గలవు-3. ఈశ్వరుడు క్షర (అసత్), అక్షర (సత్) పదార్థములకు నిత్యసాక్షిగా నున్నాడు. క్రియలకు, పదార్థములకు అధిష్టానమైన ఈశ్వరుని యందే ఈ లోకములన్నియు ప్రళయ కాలము నందు లీనమగును-4. ఈశ్వరుడు జగత్తును సృష్టించెను. ఈ జగత్తు యొక్క స్వరూపము ఆయనకు ఎరుకయే. తత్త్వము నెరిగిన పరమాత్మ ధ్యానయోగము నందున్నవాడై ఈ చరాచర ప్రాణి వర్గము నంతనూ సృజించెను-5. నేను పురాణ గాథలను తెలియగోరి, పుట్టుకలేనివాడు, సర్వకర్మాధ్యక్షుడు, చైతన్యఘనుడు, ముల్లోకములకు సాక్షి, జగన్నాథుడునగు పరమేశ్వరుని శరణువేడెదను.

బ్రహ్మకు, వాయుదేవునకు, మహేంద్రునకు, ఋషులలో శ్రేష్ఠుడు మహాత్ముడునగు వశిష్ఠునికి ఆయన మనమడు అయిన జాతూకర్ణ మహర్షికి, మరియు పరమ పావనుడగు కృష్ణ ద్వైపాయనునకు నమస్కరించి-8, ఏకాగ్రమగు మనస్సు గలవాడనై బ్రహ్మచే చెప్పబడిన పురాణమును చెప్పెదను ఈ పురాణము వేదములకు అనురూపమైనది. ధర్మార్థములతో, యుక్తులతో కూడిన వివిధ శాస్త్రములు దీని యందు అలరారుచున్నవి.

పరాక్రమశాలి, సాటిలేని తేజస్సు గలవాడు, రాజులలో మేటి యగు ఆసీమకృష్ణ మహారాజు ధర్మబద్దముగా ఈ భూమిని పాలించుచుండగా-10, వశీకృతమగు అంతః కరణము గలవారు, సత్యమును పలుకుట అను వ్రతమునకు అంకిత మైనవారు, కపటము నేరుంగని వారు, రజో గుణము లేనివారు, అంతరింద్రీయ బాహ్యేంద్రియ నిగ్రహము గలవారునగు ఋషులు-11, ధర్మభూమి యగు కురుక్షేత్రము నందు, స్వచ్చమగు ప్రవాహము గల దృషద్వతి యనే పుణ్యనదీ తీరము నందు చిరకాలము కొనసాగే సత్ర యాగము ననుష్ఠించిరి.

నైమిషారణ్యము నందు నివసించే ఆ ఋషులు శాస్త్ర ప్రకారముగా యజ్ఞదీక్షను స్వీకరించిరి. వారిని దర్శించుటకు మహాబుద్దీశాలి, పౌరాణిక శ్రేష్టుడునగు సూతుడు విచ్చేసెను-13. సూతుడు తన సుభాషితములచే శ్రోతల రోమములు నిక్కబొడుచు కొనునట్లు చేసెడివాడు. ఇట్టి ప్రవచన ప్రభావము వలన ఆయనకు లోకములో లోమహర్షణుడనే ప్రసిద్ధి కలిగినది-14. ముల్లోకములలో పేరుగాంచిన, బుద్ధిశాలియగు సూతుడు తపస్సునకు, పాండిత్యమునకు, శీలమునకు నిధి, జ్ఞానియగు వేదవ్యాసుని వద్ద శిష్యరికము చేసెను-15. ఆయన యందు పూర్ణమగు పురాణ రూపమైన వేదమే గాక, విశాలమైన మహాభారత రూపములో వర్ధిల్లిన సరస్వతి కూడా స్థిరముగా నుండెను-16. ధర్మార్థ కామమోక్షములను వివరించే గాథలు, సూక్తములు, మరియు సుభాషితములు ఆయన యందు, భూమియందు ఔషధులవలె, విలసిల్లినవి.

సదాచారము నెరింగిన ఆ సూత మహర్షి ఆ ధీశాలురగు ముని శ్రేష్ఠులను సమీపించి, దోసిలి యొగ్గి నమస్కరించెను -18. ధీమంతుడైన ఆ మహర్షి సాష్టాంగ నమస్కారము చేసి, ఆ ఋషులను సంతోష పెట్టెను. సత్రయాగము నందున్న మహా తేజశ్శాలురగు ఆ ఋషులు సభా సదులతో కూడి సంతోషించిరి-19. వారు ఆ మహర్షిని విధి విధానముగా సత్కరించి, ప్రీతికరమగు మాటలను పలికిరి. అపుడు వారికి పురాణమును వినాలనే కోరిక కలిగెను.

మిక్కిలి శ్రద్ధేయుడు, విద్వాంసుడు నగు ఆ లోమహర్షణుని ఆ స(తయాగము నందలి యజమాని చూచేను. ఆయన కూడా శాస్త్రములన్నిటిలో దిట్ట -21. ఆయన ఋషుల ముఖ కవళికలను బట్టి వారి హృదయములోని భావమును తెలుసుకొని, సూతుని ఈ విధముగా ప్రోత్సహించేను. హే సూతాః నీవు మహా బుద్ధిశాలి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు వేదవ్యాస భగవానుని-22, ఇతిహాసపురాణములను తెలుసుకొనుట కొరకై చక్కగా సేవించితివి. నీవు ఆయన బుద్ధి (అనే గోవు) నుండి పురాణ గాథలను పితికితివి -23. హే మహాబుద్దే! ధీమంతులగు ఈ ఋషి శ్రేష్ఠులు పురాణమును వినగోరుచున్నారు. కాన, నీవు పురాణమును వినిపింపవలెను-24. వీరందరు మహాత్ములు, బ్రహ్మవేత్తలు, వివిధ గోత్రములవారు ఒకచో సమకూడిరి. వీరు తమ తమ వంశములను గూర్చి పురాణ వచనముల ద్వారా వినేదరు గాక!- దీర్ఘ సత్రయాగములో తమ పుత్రులతో గూడియున్న ఈ మునులకు నీవు వినిపింపుము. మేము యాగమునకు ముందు దీక్షను స్వీకరించబోయే సమయములో నిన్ను స్మరించి యుంటిమీ.

పూర్వము సత్యవాక్య పాలనా పరాయణులు, పురాణముల నెరింగిన వారునగు మునులు పురాణము కొరకై సూతుని ఈ విధముగా ప్రోత్సహించిరి-27. ఇది సూతునకు స్వధర్మమని ప్రాచీనులగు ఋషులు భావించిరి. దేవతల యొక్క, ఋషుల యొక్క, మరియు గొప్ప తేజశ్శాలురగు రాజుల యొక్క-28, వంశములను సూతుడు గుర్తుంచుకొనవలెను. మరియు, ఇతిహాస పురాణములలో బ్రహ్మవేత్తలచే నిర్దేశింపబడి ప్రఖ్యాతి గాంచిన మహాత్ములను గురించి సూతుడు తెలుసుకొని యుండవలెను.

వేదముల యందు సూతున కేమియూ అధికారము లేదు. ఏలయన, వేనుని కుమారుడు, మహా పురుషుడునగు పృథువు యజ్ఞమును చేయుచుండగా-30, సుత్య (యజ్ఞమునకు అంగమగు ఒక కర్మ) జరుగుచుండగా, మొదటిసారిగా వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో బృహస్పతికి ఉద్దేశించిన హవిస్సు ఇంద్రుని హవిస్సుతో కలిసిపోయేను-31. దానిని దేవేంద్రుని కొరకు హోమము చేసిరి. అపుడు సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో ఇట్టి పొరపాటు వలన యజ్ఞాంగకర్మలలో ప్రాయశ్చిత్తమునకు అవసరమేర్పడెను-32. గురువునకు ఉద్దేశించిన హవిస్సు శిష్యుని హవిస్సుతో కలిసి, తిరస్కారమునకు గురి అయ్యెను. ఇట్లు నికృష్టమును ఉత్కృష్టముతో కలిపి అనుష్ఠించుట వలన వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను.

 బ్రాహ్మణి యందు క్షత్రియుని వలన సూతుడు జన్మించెను. కాని, బ్రాహ్మణత్వ లక్షణ ములుండుటచే, సూతుని ధర్మము బ్రాహ్మణ సదృశమని చెప్పబడెను-34. క్షత్రియుల నాశ్రయించి, రథమును నడుపుట, ఏనుగులను, గుర్రములను సంరక్షించుట సూతునకు మధ్యమ ధర్మము. వైద్య వృత్తి అధమము-35. కావున బ్రహ్మవేత్తలగు మీరు నన్ను స్వధర్మమునకు, చెందిన విషయమును అడిగితిరి. ఋషులచే పూజింపబడే పురాణమును నేను శ్రద్ధగా ప్రవచనమును ఏల చేయను?

 పితృ దేవతలకు వాసవియను మానస పుత్రిక జన్మించెను. ఆమె పితృ దేవతలచే మానసికముగా శపింపబడి మత్స్య కన్యగా జన్మించెను-37. అరణి నుండి అగ్ని జన్మించి నట్లు, ఆమె యందు గొప్ప యోగి, వేదవేత్తలలో శ్రేష్ఠుడునగు వ్యాసుడు జన్మించెను-38. మహా విద్వాంసుడగు ఆ వ్యాసభగవానునకు నమస్కారము. పురాణ పురుషుడు, జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి వాక్యమును సత్యము చేయగోరి-39, వేద వ్యాస రూపముగా మనుష్య దేహమును స్వీకరించెను. పుట్టుటతోడనే సంపూర్ణ వేదము సాంగముగా ఆయనకు సాక్షాత్కరించేను-40. కానీ, ఆయన విద్యాధర్మమును పాలించి, జాతకర్ణుని వద్ద వేదమును ఆధ్యయనము చేసెను. ఆయన వేదములు అను సముద్రమును, బుద్దిని, కవ్వముగా చేసి మథించగా-41, మహాభారతమనే చంద్రుడు ఉదయించి, లోకమును ప్రకాశింపజేసెను. సారవంతమగు నేల యందున్న చెట్టు కొంత కాలములో అనేక శాఖలుగా విస్తరించిన తీరున వేదమనే వృక్షము ఆయన వలన శాఖలు కలది ఆయెను. బ్రహ్మవేత్త యగు ఆయన నుండి నేను పురాణమును వినియుంటిని-42, 43. ఆయన సర్వజ్ఞుడు. సర్వ వేదముల యందు కీర్తింపబడినాడు. మహా తేజశ్శాలి. ఆయన నుండి పొందిన పురాణమును నేను ప్రవచించెదను. ఈ పురాణమును పూర్వము నైమిషారణ్యవాసులు, మహాత్ములునగు మునులు కోరగా, వాయు దేవుడు చెప్పి యుండెను.

మహేశ్వరుడు సర్వోత్కృష్టుడు, ఇంద్రియ గోచరుడు కాడు; నాల్గు చేతులు, నాల్గు ముఖములు గలవాడు; మనస్సునకు గోచరము కానివాడు; ప్రత్యక్షాది ప్రమాణములచే పొంద శక్యము కానివాడు; స్వయం సిద్దమగు జగత్కారణుడు; మరియు జగన్నియంత-45. ఆయనయే అవ్యక్త (మూల ప్రకృతి) రూపముగా జగత్కారణమై యున్నాడు. ఈ మూల ప్రకృతి నుండియే మహత్తు మొదలుకొని అణువుల విశేష ధర్మముల వరకు గల జగత్తు పుట్టినది అని శాస్త్ర నిర్ణయము. ఈ జగత్తు అధిష్టాన(ఈశ్వరుడు) రూపముగా సత్; జగద్రూపముగా అసత్ (మిథ్య)-46. మూల ప్రకృతి నుండి సాటిలేని, తేజోమయమగు (హిరణ్య) అండము పుట్టినది. ఈ అండము జలము చేతను, జలము తేజస్సు చేతను ఆవరింపబడి యుండెను-47. తేజస్సు వాయువు చేతను, వాయువు ఆకాశము చేతను ఆవరింపబడి యుండెను. ఆకాశము సమష్టి అహంకారము చేతను, సమష్టి అహంకారము మహత్తు (సమష్టి బుద్ధి) చేతను, మహత్తు మూల ప్రకృతి చేతను ఆవరింపబడి యుండెను.

ఈ పురాణము నందు దేవత లందరియొక్క, ఋషుల యొక్క నదుల యొక్క, మరియు పర్వతముల యొక్క ఉత్పత్తి వర్ణింపబడును-49. అన్ని మన్వంతరములు, కల్పములు కూడా వర్ణింపబడును. బ్రాహ్మణ, క్షత్రియ వంశముల ఉత్పత్తి, బ్రహ్మగారి పుట్టుక కూడ కీర్తింపబడును-50. బ్రహ్మ యందు సృష్టి కర్తృత్వము, ప్రజలయొక్క సృష్టి మరియు మూలప్రకృతినుండి జన్మించిన బ్రహ్మయొక్క అవస్థలుకూడా దీనియందు కీర్తింపబడును-51. కల్పములలోని సంవత్సరములు, జగత్తుయొక్క స్థితి, విష్ణువు శయనించుట, మరియు భూమిని ఉద్ధరించుట దీనియందు వర్ణింపబడును.

వర్ణాశ్రమ  విభాగ పూర్వకముగ నగరాదులను తీర్చిదిద్దుట, ఇంటిలో నుండు వృక్షముల అమరిక, సిద్ధ పురుషులు నశించుట-53, బహు దూరము వరకు విస్తరించిన మార్గములు, వాటి నిడివి, వాటి యందలి సంచారము, స్వర్గమునందు స్థానముల విభాగము, భూలోకమునందుండు మానవులస్థానములు వర్ణింపబడును-54. వృక్షములు, ఔషధులు, మరియు లతలు వర్ణింపబడును. మానవులు పాపము వలన పొందే వృక్షకీలాదిజన్మలు కీర్తింపబడును-55. దేవతలకు, ఋషులకు సంబంధించిన రెండు మార్గములు, అన్నము, శరీరములు మొదలగు వాని సృష్టి మరియు శరీర త్యాగము కీర్తింపబడినవి.

బ్రహ్మ శాస్త్రములన్నింటిలో ముందుగా పురాణమును స్మరించెను. తరువాత, ఆయన ముఖముల నుండి వేదములు బయల్వెడలినవి-57. వేదాంగములు, ధర్మశాస్త్రము, వ్రతములు, నియమములు, పశువుల ఉత్పత్తి, మరియు మానవుల ఉత్పత్తి కూడా ఈ పురాణము నందు వర్ణింపబడినవి-58. మరియు కల్పము యొక్క మూలము నిర్వచనము చెప్పబడినవి. బ్రహ్మ చేసిన తొమ్మండుగురు మానస పుత్రుల సృష్టి చెప్పబడినది-59. ఇంతే గాక, బ్రహ్మ ఇంకనూ ముగ్గురు మానస పుత్రులను సృజించి, తరువాత లోకములను సృజించెను. బ్రహ్మ యొక్క అవయవముల నుండి ధర్ముడు మొదలగు వాని పుట్టుక వర్ణింపబడెను.

ప్రతి కల్పము నందు మరల జన్మించే ఈ పన్నెండుగురు పురుషులు, కల్పముల మధ్యన ఉండే కాలము, మరియు వాటి సంధి కాలము వర్ణింపబడినవి-61. తమోగుణముచేత పూర్తిగా ఆవరింపబడిన బ్రహ్మ నుండి అధర్మము పుట్టుట, ఆ తరువాత శతరూప యొక్క జన్మ వర్ణింపబడినవి-62. తరువాత ప్రియవ్రత, ఉత్తానపాదుడు, ప్రసూతి, ఆకూతి కీర్తింపబడుదురు. వీరి యందు క్షాళితము చేయబడిన పాపము గల ప్రజలు ప్రతిష్టితులై యుందురు 63. తరువాత, రుచి ప్రజాపతికి ఆకూతి యందు ఇద్దరు సంతానము కలుగుట, దక్షునకు ప్రసూతి యందు అనేక కన్యలు జన్మించుట-64, ఆ తరువాత ధర్ముడు మహా పతివ్రతలైన శ్రద్ద మొదలగు దక్షుని కుమార్తెల యందు గావించిన సుఖదాయకము, సత్య గుణప్రధానమునగు సృష్టి కీర్తింపబడును.

మరియు అధర్మునకు హింసయందు తమోగుణ ప్రధానమైన, అమంగళ లక్షణములతో కూడిన ప్రజా సృష్టి వర్ణింపబడెను. ఇంతే గాక, మహేశ్వరునకు సతి యందు కలిగిన ప్రజా సృష్టి కీర్తింపబడినది-66. దోష రహితుడగు బ్రహ్మ కీర్తింపబడెను. యోగ శాస్త్రము నందు నిధియగు పరమేశ్వరుడు మోక్షమును గోరు ద్విజులకు యోగమును ఉపదేశించెను 67. రుద్రుని అవతారము, మరియు ఎనలేని సంపద, మూడు వేదములకు సంబంధించిన గాధ, బ్రహ్మ నారాయణులతో రుద్రునకు జరిగిన శ్రేష్ఠమగు సంవాదము వర్ణింపబడును-68. వారిద్దరు ఆ దేవదేవుని స్తుతించగా, ఆయన ఎంతయో సంతసించెను. ఈ స్తోత్రము కూడా ఆ పురాణములో వర్ణింపబడినది.

తరువాత బ్రహ్మ యొక్క అంగము నందు పరమాత్మయగు రుద్రుని ఆవిర్భావము, ఆయన నామములోని వైశిష్ట్యము, మరియు గొప్ప మనస్సు గల రుద్రుడు రోదించుటకు గల కారణము కీర్తింపబడును-70. స్వయంభువుడు (అనగా సర్వ కారణ కారణుడు, అజుడు, స్వయముగా ప్రకాశించు జగత్పిత) అగు శివుడు 'రుద్ర' మొదలగు ఎనిమిది నామములను పొందిన తీరు, మరియు స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములు శివుని ఆ ఎనిమిది రూపములచే వ్యాప్తమై యున్న విధము వర్ణింపబడును-71. భృగు మొదలగు ఋషుల ప్రజా సృష్టి, మరియు బ్రహ్మర్షి యగు వశిష్టుని గోత్రము ఈ పురాణములో కీర్తింపబడును-72. అగ్నికి స్వాహా దేవి యందు కలిగిన సంతానము వర్ణింపబడును. తరువాత, రెండు రకముల పితృ దేవతలకు స్వధా దేవి యందు కలిగిన సంతానము కీర్తింపబడును.

ఈ పితృ వంశ ప్రసంగము తరువాత, మహేశ్వరుడు సతీదేవి విషయములో దక్షునకు, భృగుడు మొదలగు ధీమంతులగు ఋషులకు శాపము నిచ్చిన ఘట్టము వర్ణింపబడును-74. విస్మయమును కలిగించే కర్మల నాచరించు దక్షుడు రుద్రునకు తిరిగి శాపమునిచ్చుట, ఆ తరువాత వైరము తొలగుట అను వృత్తాంతము ఈ పురాణములో వివరముగా వర్ణింపబడినది-75. పై విధముగా సృష్టింపబడిన వారు వేర్వేరు ద్వీపములలో వేర్వేరు దేశములలో నియోగింపబడిరి. తరువాత స్వాయంభువమనువు యొక్క సృష్టి కీర్తింపబడును. మరియు, నాభి యొక్క సృష్టి కీర్తింపబడును-76. మరియు నాభి యొక్క సృష్టి మహాత్ముడగు రజసుని సృష్టి వర్ణింపబడును. ఇంతేగాక, ద్వీపములు సముద్రములు, పర్వతములు వర్ణింపబడును.

కురు, ఇలావతాది దేశములు, నదులు, వాటి ఉప నదులు, సప్త ద్వీపములు, వాటిలోని వేలాది అవాంతర భేదములు -78, జంబూద్వీప, సముద్రముల మండల విస్తారము, యోజనములలో వాటి నిడివి, మరియు వాటి యందలి పర్వతములు -79, హిమవంతుడు, హేమకూటము, నిషధము మేరువు, నీలము, శ్వేతము, శృంగవాన్, అనే వర్ష (దేశ) పర్వతములు కీర్తింపబడును-80. ఆ పర్వతముల చుట్టు కొలత, ఎత్తు, వైశాల్యము, విస్తారములు యోజన ప్రమాణములో ఈయబడును. మరియు ఆ పర్వతములలో నివసించు జనులనీ పురాణము వర్ణించును.

భారత మొదలగు దేశములు, వాటిలోని నదులు, పర్వతములు, చలనము గల ప్రాణులు, చనలము లేని ప్రాణులు 82, ఏడు సముద్రములచే చుట్టు వారబడియున్న జంబూ ద్వీపము మొదలగు ద్వీపములు, ఆ తరువాత జలమయమగు భూమి, లోకాలోక పర్వతము వర్ణింపబడును-83. ఈ లోకములు, మరియు ఏడు ద్వీపములతో కూడిన భూమి, ఆ హిరణ్యాండములోపల నున్నవి. భూరాదిలోకములు, వాటిని చుట్టు వారియున్న పదార్థములు కూడా వర్ణింపబడును-84. ఇది అంతా ప్రధానము (మూల ప్రకృతి) యొక్క పరిమాణములో ఒక అంశము మాత్రమే. లోకముల పరిమాణము వ్యాసముతో సహా సంక్షేపముగా వివరింపబడును.

సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి ప్రమాణము యోజనములలో అశేషముగా వర్ణింపబడును. వీటి అభిమాని దేవతలు కూడ కీర్తింపబడుదురు-86. మానస సరోవరము యొక్క ఊర్ధ్వ భాగము నందు మహేంద్రుని పవిత్ర సభ మొదలగునవి, ఆపైన అలాత (అగ్ని) చక్రము స్వర్గమును పొందు మార్గము చెప్పబడినవి-87. నాగవీథి, అజవీథుల స్వరూపము చెప్పబడినది. ధ్రువములు, అభిమాని దేవతలు వర్ణింపబడిరి-88. లోకాలోకము (సూర్యకాంతి ప్రసరించని అంతిమ భాగమునందుండు పర్వతము) యొక్క పరిమాణము యోజనములలో నీయబడినది. ఈ భాగమునకు, జగత్తునకు మధ్య గల సంధి వర్ణింపబడినది. మరియు భూమధ్య రేఖ వద్ద పగలు వర్ణింపబడును. నాల్గు దిక్కులలో ఊర్ధ్వ భాగమునందుండే లోకపాలురు కీర్తింపబడుదురు.

రజోగుణ ప్రధానులగు గృహస్థులు పొందే దక్షిణ (పిత్స మార్గము, సత్య గుణ ప్రధానులగు సన్యాసులు పొందే ఉత్తర (దేవ) మార్గము-90, ధర్మాదులు నిత్యనివాసము చేసే శ్రీ మహావిష్ణువు యొక్క ధామము వర్ణింపబడును. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రముల గతి-91, ధ్రువుని వలన ప్రజలకు కలుగు శుభాశుభములు కీర్తింపబడును. బ్రహ్మ ఒక విశిష్ట ప్రయోజనము కొరకై స్వయముగా సూర్యరథమును నిర్మించెను-92. భగవానుడు సూర్యరూపుడై స్వయముగా ద్యులోకము నందు సంచరించును. ఆ రథమును దేవతలు, ఆదిత్యులు, ఋషులు-93, మరియు గంధర్వులు, అప్సరసలు. సర్పములు, మరియు రాక్షసులు అధిష్ఠించిరి. ఇంతేగాక, జలముల సారభూతుడైన చంద్రుని రథము కూడా వర్ణింపబడును-94. సూర్యుని వలన కలిగే చంద్రుని పెరుగుదల, తరుగుదలలు కీర్తింపబడును. సూర్యాదుల రథములు ధ్రువుని నుండియే వచ్చునని చెప్పబడెను-95. శిశుమారుడు (సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు) దీని యందు వర్ణింపబడును, శిశుమారుని పుచ్చములో ధ్రువుడు ఉండును. నక్షత్రముల స్వరూపము, గ్రహముల స్వరూపము వర్ణింపబడును-96. ఈ పురాణములో దేవతల నివాసములు, పుణ్యాత్ములు నివసించు లోక ములు వర్ణించబడును. వర్షమునకు, చలికి,వేడికి ఆధారమగు అనంత సూర్యరశ్మి వర్ణింపబడును-97. పేరు, కర్మ, స్వరూపము ఆధారముగా సూర్యరశ్ముల విభాగము వర్ణింపబడును. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముల పరిమాణములు, గతులు చెప్పబడును.

బ్రహ్మచే ప్రార్థింపబడిన శివుడు విషమును భక్షించగా, కంఠము నీల వర్ణమును పొందుట, శివుడు విషాదమును పొందుట వర్ణింపబడును-99. దేవతలు విష్ణువును ప్రార్థించుట, విష్ణువు మహేశ్వరుని స్తుతించుట, పాపములనన్నిటినీ పోగొట్టే, పవిత్రమైన లింగోద్భవ కథ వర్ణింపబడును-100. రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ప్రధానము (మూల ప్రకృతి) యొక్క ఈ లింగాకార పరిణామము గొప్ప అద్భుతము. తరువాత, ఇలుని కుమారుడగు పురూరవసుని మహిమ వర్ణింపబడును-101. రెండు రకముల పితృ దేవతలకు అమృతరూపమగు తర్పణము వివరింపబడును. తరువాత, పర్వదినములు (చంద్రుని వృద్ధి క్షయములు), వాటి సంధులు వర్ణింపబడును.

స్వర్గ లోకమును పొందినవారు, అధోగతిని పొందినవారు అను రెండు రకముల పితరులకు శ్రాద్దముచే కలిగే గొప్ప అనుగ్రహము-103, యుగముల సంఖ్య, వాటి పరిమాణము, కృతయుగ, త్రేతాయుగములలో క్రమముగా ధర్మనిష్ఠ మహిమ తగ్గి ప్రవర్తిల్లుట అను విషయములు కీర్తింపబడును-104. వర్ణాశ్రమముల గణనము, వాటిని ధర్మబద్దముగా పరిరక్షించుట -105, యజ్ఞమును చేయుట, దానిలో ఋషులకు, వసువునకు మధ్య సంవాదము, వసువు మరల అధోగతిని పొందుట మొదలగు విషయములు కీర్తింపబడును.

స్వాయంభువ మనువు తప్ప ఇతరులు ప్రశ్నలకు సమాధానమును చెప్పలేకపోవుట, తపస్సు యొక్క మహిమ, మరియు యుగములలోని స్థితి గతులు సవిస్తరముగా చెప్పబడినవి-107. ఈ పురాణములో ద్వాపర, కలియుగములు సంక్షేపముగా వర్ణించబడినవి. ప్రతియుగము నందు దేవతలు, పశుపక్ష్యాదులు, మరియు మానవుల ప్రమాణము (ఒడ్డు, పొడవు) లు-108, యుగ ప్రభావముచే ప్రాణులు విశాల దేహములను కలిగి, గొప్ప ఆయుర్దాయమును కలిగియుండుట, మహాత్ముల ప్రాదుర్భావము మొదలగు విషయములు కీర్తింపబడును-109. వేదములు, వాటిలోని మంత్రములు, వేదశాఖలు, వాటి పరిమాణము, వేద వ్యాస శబ్దము యొక్క సార్థకత ఇత్యాదులు వర్ణింపబడును.

ప్రళయములో మన్వంతరముల ఉపసంహారము, ప్రళయాంతము నందు దేవతలు, ఋషులు, మనువు, పితృ దేవతలు తిరిగి జన్మించుట-111. మొదలగు సృష్టిని విస్తరముగా చెప్పుట అసంభవము గాన, సంక్షేపముగా చెప్పబడును. మనుష్య మానములో మన్వంతర కాల గణనము ఈయబడును-112. గడుచుచున్న మన్వంతరమునకు చెప్పబడిన ఈ గణనము గడచిన, రాబోవు మన్వంతరములకు కూడా వర్తించును-113. మరియు స్వాయంభువ మన్వంతరమునకు గడచిన, రాబోవు మన్వంతరములతో గల ప్రతి సంధానము (మధ్యలో నుండు కాలము) కూడా చెప్పబడినది.

మూడు మన్వంతరములు, కాలజ్ఞానము, మన్వంతరములలోని దేవతలు, మహారాజులు వర్ణింపబడిరి-115. దక్షుని ప్రియ కుమార్తెకు జన్మించిన కుమారుల వర్ణన గలదు. వారీ విధముగా బ్రహ్మ, దక్షుడు అను పరంపరకు చెందినవారైరి -116. మేరు పర్వతము నందుండు సావర్ణుడు మొదలగు మనువులు; ధ్రువుడు, ఉత్తానపాదుడు చేసిన ప్రజాసృష్టి వర్ణింపబడినవి-117. వేనుని కుమారుడగు పృథువు భూమిని గోవుగా చేసి పాలను పితుకుట, ఉపయోగించిన పాత్రలు, పితికిన పాలు వర్ణింపబడుటయే గాక, రాజవంశముల వర్ణన కూడా గలదు.

ఈ భూమిని బ్రహ్మాదులు పూర్వమే పితికియున్నారు. పదిమంది ప్రచేతసుల వలన మారిష యందు-119, సోముని అంశముతో ధీమంతుడగు దక్షప్రజాపతి జన్మించుట, భూర్భువస్సువర్లోకములపై మహేంద్రుల ఆధిపత్యము వర్ణింపబడును-120. మన్వాదులకు చెందిన అనేక గాథలు వర్ణింపబడును. మరియు, వైవస్వత మనువుయొక్క ప్రజాసృష్టి వివరింపబడును-121. మహాదేవుని యజ్ఞములో వారుణ దేహమును ధరించిన బ్రహ్మ యొక్క శుక్రము నుండి భృగువు మొదలగు వారి ఉత్పత్తి వర్ణింపబడును.

చాక్షుష మనువు యొక్క శుభకరమగు ప్రజాసృష్టి, తరువాత వైవస్వత మన్వంత రములో ధ్యానము నుండి దక్షుడు చేసిన సృష్టి వర్ణింపబడును-123. బ్రహ్మ పుత్రుడు, ప్రియముగా మాటలాడు వాడునగు నారదుడు తన శాపము కొరకై మహా బలశాలురగు దక్షుని కుమారులను నశింప జేసెను-124. అపుడు దక్షుడు వీరిణి యందు కీర్తిగాంచిన కన్యలను సృజించెను. తరువాత, ధర్ముని సృష్టి ధీమంతుడగు కాశ్యపుని సృష్టి వర్ణింపబడును-125. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య గల ఐక్యము, భిన్నత్వము, మరియు వారిలోని విశేషములు కీర్తింపబడును.

 దేవతలకు అధిపతి యగు బ్రహ్మ దేవతలను శపించుట, దితి యొక్క అనుగ్రహముచే దేవాంశతో కూడి మరుత్తులు జన్మించుట, ఏడురు చొప్పున మరుత్తుల గణములు ఏడు తండ్రి మాటచే వారికి దేవత్వము, వాయువు యొక్క ఆవహ, ప్రవహ మొదలగు స్కంధములలో ఆశ్రయము లభించుట. దైత్యులు, దానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, సర్వభూతములు, పిశాచములు, పశువులు, పక్షులు, లతలు, అప్సరసలు అను వాటి ఉత్పత్తి విస్తరముగా వర్ణింపబడును. సముద్రము నుండి ఐరావత గజము పుట్టుట గరుత్మంతుని పుట్టుక, అభిషేకము, భృగువుల, అంగిరసుల వివరములు చెప్పబడినవి.

మహాత్ములగు కశ్యప, పులస్త్య, అత్రి, పరాశర మహర్షుల సంతానము ఈ పురాణములో వివరింపబడును. దేవతలకు, ఋషులకు కలిగిన సంతానము గురించి చెప్పబడును. లోకములకు ఆధారమైన ముగ్గురు కన్యల కీర్తి గానము చేయబడును. ఓ పూజ్యా! దేవతల తండ్రులు, మనుమలు, వారి జన్మ గురించి వివరింపబడును. ఐదుగురు మహాత్ముల చరిత్ర వర్ణింపబడును. భూమి విస్తారము, ఆదిత్యుని విస్తారము, తరువాత కుక్షి చరిత్ర, మరియు ధుంధువధ వర్ణింపబడును.

ఇక్ష్వాకువు నుండి బృహద్బలుని వరకు, నిమి మొదలు కొని జహ్ను గణము వరకు గల చక్రవర్తులు కీర్తింపబడిరి. యయాతి మహారాజు చరితము, యదువంశ చరిత్ర, హైహయుని చరిత్ర కీర్తింపబడును తరువాత, క్రోష్ణువు యొక్క వంశము, జ్యామఘుని మాహాత్మ్యము, ప్రజాసృష్టి కీర్తింపబడును. దేవావృధుడు, అర్కుడు, మహాత్ముడగు వృష్టి అను మహారాజుల చరిత్ర, అత్రిమిత్ర వంశము, మరియు విష్ణువు యొక్క మహిమ వర్ణింపబడును. తరువాత, సూర్యుడు శ్రేష్ఠమగు మణిని పొందుట, ధీమంతుడగు యుధాజితుని ప్రజాసృష్టి కీర్తింపబడును.

 దేవమీఢుడనే రాజర్షి యొక్క శోభాయుతమగు వంశము, ఆ మహాత్ముని చరిత్ర, పునర్జన్మ వర్ణింపబడినవి. కంసుని దుష్టబుద్ధి, దేవకీవసుదేవులకు జగన్నాథుడగు విష్ణువు రహస్యముగా జన్మించుట. తరువాత ప్రజాసృష్టి వర్ణింపబడెను. దేవాసురయుద్ధములో విష్ణువు ఇంద్రుని ప్రాణములను రక్షించుట కొరకై స్త్రీని వధించగా, భృగువు విష్ణువును శపించెను. భృగుమహర్షి శుక్రుని మాతృదేవిని తిరిగి బ్రతికించెను.

ధీరుడగు శుక్రుడు వరదానమును గోరి, శివుని ఆరాధిస్తూ తపస్సు చేయుట, శివస్తుతి ఆ తరువాత దేవాసురుల వృత్తాంతము వర్ణింపబడినవి. మహాత్ముడగు శుక్రుడు జయంతితో కూడి యుండగా, బుద్దీశాలియగు బృహస్పతి శుక్రరూపముతో రాక్షసులను మోహ పెట్టెను. అపుడు గొప్ప తేజశ్శాలియగు శుక్రుడు వారిని శపించెను.

విష్ణు మాహాత్మ్యము, మరియు విష్ణువు జన్మించుట వర్ణింపబడును. యయాతికి శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని యందు తుర్వసుడు, అనువు, ద్రుహ్యుడు, పూరువు అను కుమారులు కలిగిరి. ఈ పురాణములో వారి వంశములో జన్మించిన మహాత్ములగు చక్రవర్తులు కీర్తింపబడిరి. మరియు, ఆ చక్రవర్తుల దీర్ఘ కాలకీర్తివారి సంపద, తేజస్సు కీర్తింపబడినవి. విప్రర్షియగు కుశికుని ధర్మనిష్ఠ వర్ణింపబడినది.

సురభి బృహస్పతి శాపమును తొలగించుట, జహ్ను వంశము, శంతనుని పరాక్రమము వర్ణింపబడును. భవిష్యత్తులో రాబోవు రాజుల వర్ణనము, రాబోవు ఏడురు మనువుల వర్ణనము ఈ పురాణము నందు గలవు. కలియుగాంతము నందు ప్రాణి సంహారము, పరార్ధ లక్షణము, పరలక్షణములు కీర్తించబడును. యోజనములలో బ్రహ్మ యొక్క పరిమాణము, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతికములనే, సర్వప్రాణుల యొక్క మూడు రకముల ప్రళయము, అనావృష్టి సూర్యుని నుండి భయంకరమగు ప్రళయకాలాగ్ని పుట్టుట వర్ణింపబడును.

ప్రళయ కాలమేఘము వర్షించగా సర్వము జలమయమగుట అప్పటి వాయువు వర్ణింపబడును. మరియు, అపుడు మహాత్ముడగు బ్రహ్మకు రాత్రియగుట, ఆ రాత్రి యొక్క కాలమానము నిర్దేశింపబడును. భూరాది ఏడు లోకములు, పాపులు పొందే రౌరవాది నరకములు వర్ణింపబడును. బ్రహ్మ లోకమునకు పైన పవిత్రమగు శివ లోకము గలదు. సర్వప్రాణులు ప్రళయములో అచటనే లీనమగుదురు. సర్వప్రాణుల ఉత్తరగతులు అచటనే నిర్ణీతమగును. ప్రళయము నందు సర్వప్రాణులసంహారం వర్ణింపబడును.

ధర్మా చరణము వలన ఊర్థ్వగతి, అధర్మా చరణము వలన అధోగతి, ప్రతి కల్పము నందు మహాభూతములు కూడా వినాశము చెందుట, దుఃఖగణనము, సృష్టికర్త కూడా అనిత్యుడేనని నిరూపించుట. భోగములు పరిణామములో హానిని కలిగించునని నిర్ణయించుట, మోక్షము దుర్లభమని ప్రతిపాదించుట, వైరాగ్యముచే భోగములయందు దోషమును దర్శించుట ఈ పురాణములో వర్ణింపబడినవి. వ్యక్తము (పృథివి, అగ్ని, జలము), అవ్యక్తము (వాయువు, ఆకాశము) అగు జగత్తు నుండి మనస్సును మరలించి, బ్రహ్మము నందు స్థిరముగా నుంచుట వలన అది శుద్ధమై ద్వైత దర్శనమును అతిక్రమించగలును.

తరువాత త్రివిధ తాపములకు అతీతము, రూపము లేనిది, పుణ్యపాప సంగము లేనిది, ఆనందఘనము, అభయస్థానమునగు పరబ్రహ్మ వర్ణింపబడును. బ్రహ్మ పూర్వ సృష్టిని బోలిన మరియొక సృష్టిని చేయుట, పాపముల నన్నిటినీ పోగొట్టే ఋషి వంశ వర్ణన, మొదలగునవి ఈ పురాణమునకు విషయ వస్తువులు. దీని యందు జగత్తు యొక్క సర్వ వికారములు, ప్రలయము కీర్తింపబడును. ప్రాణుల ఉత్పత్తి వినాశములు, కర్మఫలములు కూడా వర్ణింపబడును. వశిష్ఠుని ఉత్పత్తి, మరియు శక్తి యొక్క జన్మ వర్ణింపబడును.

వ్యాస భగవానుడు నాల్గు పాదములతో కూడియున్న ఒకే ఒక వేదమును తన బుద్దితో నాలు భాగములుగా విభాగము చేసిన విధానము, ఆయన శిష్యులు, శిష్యుల శిష్యులు మరల వాటిని శాఖలుగా విభాగము చేయుట వర్ణింపబడినవి. దీని వెనుక విడువకుండా జాగరూకులై వెళ్లుడు. మీకు హితమును కలిగించు దేశమును పొందగలరు. పరుగిడే ఈ ధర్మ చక్రము యొక్క అంచు ఎక్కడ శిథిలమగునో, ఆ ప్రదేశము పవిత్రమైనదని తెలుసు కొనుడని బ్రహ్మదేవుడు చెప్పెను. బ్రహ్మ ఋషుల నుద్దేశించి, ఇట్లు పలికి, మరల అంతర్ధానమయ్యెను.

గంగాదేవి యొక్క గర్భము నుండి జనించిన బంగారమును తీసుకువచ్చుట, ఆ ఋషులకు నైమిషీయులు అను సార్థక నామ ధేయము వర్ణింపబడినవి. అపుడు ఋషులు నైమిషమునందు సత్రయాగముననుష్ఠించిరి. శరద్వంతుడు మరణించగా, ఆతడు పునరుజ్జీవితుడు చేయబడెను. నైమిషము నందలి ఋషులు అతిశయించిన శ్రద్దతో-180, ఈ సమస్త భూమిని సరిహద్దులు లేకుండగా చేసి, రాజును తీసుకువచ్చిరి. ఆతనిని శాస్తోక్త విధానముగా అతిథి మర్యాదలతో ఆదరించిరి. ఆ విధముగా యథావిధిగా చేయబడిన ఆతిథ్యముచే సంతసిల్లిన రాజును క్రూరుడు, కనబడకుండ సంచరించువాడునగు స్వర్భానుడనే రాక్షసుడు అపహరించేను.

ఆ మహారాజు యజ్ఞములో మహరులను కలుసుకొనుట, ఆ మహాత్ముల యజ్ఞములోని సామగ్రి అంతా బంగరుదై ఉండుటను గాంచుట. నైమి షేయులగు మహర్పులు చేయు పన్నెండు సంవత్సరముల యాగములో ఆ రాజునకు మహర్షులతో వివాదము, ఆతడు, వారిచే సంహరింపబడుట. ఆతని కుమారుడగు ఆయుషుని నైమిషారణ్యములో చక్రవర్తిని చేయుట, తరువాత యాగమును పూర్తి చేసిన ఆ మహారాజును సేవించుట వర్ణించబడినవి. ఓ ద్విజశ్రేష్ఠులారా! ఋషుల యొక్క మహిమాన్వితమగు చరితము జరిగినది జరిగినట్లుగా ఈ పురాణము నందు వ్యాఖ్యానింపబడినది.

ఉత్తమ జ్ఞానరాశియగు ఈ పురాణమును పూర్వము బ్రహ్మ చెప్పియుండెను. రుద్రుడు ద్విజులననుగ్రహించుట కొరకై అవతరించు. పాశుపత యోగములు, స్థానములు, లింగోద్భవము, శివుడు నీలకంఠుడగుట అను విషయములు కూడా దీని యందు కీర్తింపబడును. ధన్యము, కీర్తినిచ్చునది, ఆయుర్దాయమునిచ్చునది యగు ఈ పురాణమును బ్రహ్మవాదియగు వాయుదేవుడు విప్రులకు చెప్పియుండెను. దీనిని ప్రవచించుట, వినుట, విశేషించి కంఠస్థము చేయుట వలన పాపములు తొలగి, పుణ్యము లభించును. ఈ పురాణము ఇదే క్రమములో చెప్పబడగలదు

 విశాలమగు విషయమునైననూ తేలికగా, సంగ్రహముగా చెప్పుటకు వీలుపడును. అందువలన, ముందుగా సంగ్రహముగా చెప్పి, తరువాత విస్తరముగా వివరించెదను. ఎవరైతే ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్దగా అధ్యయనము చేసెదరో, వారు పురాణమునంతనూ అధ్యయనము చేసిన ఫలమును పొందెదరనుటలో సందియము లేదు. నాలు వేదములను వేదాంగములతో, ఉపనిషత్తులతో సహా అధ్యయనము చేసిన ద్విజుడైననూ, పురాణమును ఎరుంగని వాడైనచో, అట్టివాడు పండితుడు కాజాలడు. ఇతిహాస, పురాణముల జ్ఞానముతో వేదమును విస్తరముగా వ్యాఖ్యానించవలేను. వేదము అల్పజ్ఞుడగు వ్యక్తి వలన ఈతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించునేమో యని భయపడుచుండును. బ్రహ్మ స్వయముగా చెప్పిన ఈ అధ్యాయమును పునః పునః పఠించే వ్యక్తి ఆపదల నుండి విముక్తుడై, అభీష్టమగు పుణ్యగతిని పొందును.

పురా అనితీతి పురాణమ్. పూర్వము (సృష్ట్యాదిలో) ప్రవర్తిల్లినది గనుక పురాణము అనబడును. ఈ నిర్వచనము నెరింగిన వ్యక్తి పాపములన్నిటి నుండి విముక్తుడగును. నారాయణుడు ఈ జగత్తునంతనూ వ్యాపించియున్నాడు. జగత్తును సృష్టించిన బ్రహ్మను కూడా సృష్టించిన వాడు మహేశ్వరుడు. మీరీ పురాణ సంగ్రహమును వినుడు. ఈ పురాణము అంతా మహేశ్వరుని స్వరూపము. ఆయన సృష్టి కాలములో ప్రాణులను సృష్టించి, ప్రలయకాలములో తనలో లీనము చేసుకొనును.

శ్రీ వాయుప్రోక్తే మహాపురాణములో అనుక్రమణిక (విషయ సూచిక) అను ప్రథమాధ్యాయము సమాప్తము.