వాయు మహా పురాణము
35 - జంబూద్వీప వర్ణనం
సూత ఉవాచ:-
సూతుడనెను:-
కర్ణికా మూలమని యేది (పూర్వము) చెప్పబడినదో అది డెబ్బదివేల యోజనములు క్రిందుగా నుండును. దాని మండలము (చట్టుకొలత నలుబది యెనిమిది వేలు (యోజనములు). శైల రాజములచే చుట్ట బడి కడు రమ్యమైనది మేరుమూలమని వేదము-1,2. ఆ పర్వత సహస్రములలో ననేక పర్వతము లందు మిక్కిలి యెత్తైనవి, సమస్త దిక్కుల యందు చివర నుండుటచే మర్యాద పర్వములు (సరిహద్దు పర్వతములు) అనబడినవి-3. అవి పొదలచేతను, గుహలచేతను సెలయేళ్ల చేతను శోభించినవి. అనేక (దేవత మందిరముల) రాజభవనములచేతను నగరములచేతను, పూవులతో నుజ్జలములైన కొండచటి యలచేతను శోభించినవి-4. కొండనడుమనున్న పుష్పమాలా సమూహముల చేతను, ధాతువులతో నలంకరింపబడిన చటీయల చేతను, అనేకములైన సెలయూరులచే జుట్టబడి బంగారు వన్నెతోను గోరోచనము వంటి వన్నేతోను ఒప్పిన శిఖరములచే ప్రకాశించినవి. అనేక రత్నములు పొదిగిన బలిష్టులచే ఆయన్ని పర్వతములు శోభించినవి-5. నూర్లకొలది పక్షులచే కూడుకొన్నవి సాటిలేని పొదరిండ్లచే నొప్పినది. సింహములు పులులు శరభమృగములు (ఎనిమిది కాళ్లుగలిగి సింహమునుగూడ జంపు మృగములు), చామరమగములు ఏనుగులు- వీనిచే నొప్పినవి. అనేకవర్ణములు (రంగులు) ఆకారములుగల అనేకవిధములైన పర్వతములచే నొప్పినవి-6. అందులో నొక్కొకటి పది పర్వతములు గలది. నల్లని యాకారము గలిగియున్నను ఏడు రంగులుగలిసిన కిరణములుగల సూర్యుని ప్రకాశముగలది. బాహ్యములోను ఆభ్యంతరములోను అవి సమానముగా త్రివాహములుగా (మూడు వాహనములు గలవిగా తలంపబడుచున్నవి-7. తూర్పుదిక్కున జఠరము దేవకూటము అనునవి పర్వతములు రెండు. అవి దక్షిణోత్తర దిక్కుగా పొడవైనవి. (దక్షిణము వైపు) నీల పర్వతమువరకును, ఉత్తరమున నిషధపర్వతమువరకును వ్యాపించి యున్నాయి-8. కైలాస పర్వతము హిమవత్పర్వతమును దక్షిణోత్తరముల నున్న పర్వతములు రెండు. ఇవి తూర్పువైపునకును పశ్చిమపు వైపునకును పొడవై వ్యాపించిన సముద్రము చివరను వెలసియున్నవి-9.
ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! పొడవైన బంగారు పర్వతము మేరువనునది యేది కెలదో, దాని విష్కంభము (వ్యాసము Diametre)ను చెప్పెద వినుడు-10. మేరువు యొక్క క్రింద నాలుగు దిక్కులు గొప్పపాదములు (ప్రత్యంతపర్వతములు= పెద్దకొండచేరువనున్న చిన్న కొండలు) గలవు. వానిచేత ధరింపబడినదై యేడు ద్వీపములు గల భూమి చలింపదు (చక్కగా తిరుగును)-11. వాని యందు (పాదములందు) 'పదివేల యోజనముల పొడవని చదువబడినది. అవి దేవగంధర్వ యక్షులకు నివాసములు. అనేక రత్నములతో శోభితములు. అనేకములైన సెలయేరులతోను కొండనెత్తములతోను ఒప్పినవి. మనోహర గుహలతో నిర్మింపబడినవి-12. కొండనడుమన పుష్పసమూహములతో మనోహరము లైనవి. చిత్రములైన చటియలు గలవి. మణిశిలతోనున్న గుహలచేతను, హరిదళపు ఉపరితలములచేతను శోభించినవి-13. అంతటను సువర్ణమణులచే చిత్రములైన గుహలచే నొప్పినవి. శుద్ధమైన ఇంగితపు రంగుతోను ధాతువులచే నలంకరింపబడిన బంగారు వన్నెలచే నిండినవి-14. శ్రేష్ఠమైన బంగారమున చిత్రములైన పగడములచే నలంకరింపబడినవి. కాంతిగలవి. నూరుపర్వతసంధులు గలవి. సిద్దులకావాసమైనవి. ఆనందనిలయములైనవి. సిరులుగల గొప్ప(యేడంతస్తుల) భవనములచే నంతటను బాగుగా ప్రకాశింపబడినవి-15.
తూరుపున మందరమను పర్వతము. దక్షిణమున గంధమాదనమను పర్వతము. పశ్చిమపు ప్రక్కన విపులమను పర్వతము. ఉత్తరమున సుపారమను పర్వతమును గలవు అని తలంపబడినది-16. వానియొక్క వేయిశిఖరములయందు వజ్రవైడూర్యమణుల వేదికలు గలవు. వానియందు (నాలుగింటియందు) నాలుగు మహా వృక్షము లుత్పన్నము లైనవి. అవి వేయికోమ్మలు గలవి. చక్కని బలమైన వేరులతో చక్కగా నిలదొక్కుకొని యున్నవి-17. దట్టమైన నల్లనై గుంపుగానైన యాకులచే కప్పబడినవై అనేక విధములుగా ప్రాణులకాశ్రయమిచ్చునవి. అనేకములైన మొక్కలచే నెత్తైనవి. ప్రాణులచే ననుభవింపబడు మహాపుష్ప-ఫలములు గలవి-18.యక్ష-గంధర్వులచే సేవింపదగినవి. సిద్దులచే చారణుల చేతను సేవింపబడినవి. ఈ నాలుగు మహావృక్షములు ద్వీపమునకు ధ్వజమువంటివి-19.
మందర పర్వతపు శిఖరమున కేతురాజమను మహావృక్షముగలదు. అది పొడవైన కొమ్మలు శిఖరములును గలది-20. అది సర్వకాలములలో బూయునట్టి పెద్దకడవలంతటి పుష్పములుగలది. ఆపూవులు వికసించిన కేసరములుగలవి. గొప్ప సువాసనలు గలవి. మనోహరములైనవి. అట్టి పూవులచే నా వృక్షము శోభించినది-21. ఆ వృక్షము పిల్లవాయువుచే వీవచబడినదై వేయియోజనములకు మించి యంతటను తనపూవుల సుగంధముచే దిక్కులను నింపినది-22.
ఓ ద్విజులారా! వరకేతువే భద్రాశ్వమను పేరుతో ప్రసిద్ధిజెందినది. అచట సాక్షాత్తుగా హృషీకేశుడు (విష్ణువు) సిద్ధ సంఘములతో పూజింపబడును-23. పూర్వము అపుడు రుద్రుల సమూహము యొక్క తెలుపును హరించు దేవతా శ్రేష్ఠుడైన విష్ణువు సపరివారముగా నచటికి వచ్చెను-24. ఓ మానవనాయకులారా! ఆ సమస్త ద్వీపము ఆ విష్ణవుచే జూడబడినది. ఆతని పేరనే భద్రాశ్వమను పేరనీ ద్వీపము పిలువబడినది-25.
దక్షిణమున నున్న పర్వతము యొక్క శిఖరమున, దేవ సేవితమై ఎల్లప్పుడు పుష్పఫలములతోను మాలలతోను ఒప్పినదై 26, గొప్పనైన వేళ్లు బోదెలును గలదై, దట్టమైన రంగులతోనలంకరింపబడినదై ‘జంబువు’ అను మహావృక్షముండును. అది ఎల్లప్పుడును నూతనములైన పుష్పఫలములుగల శాఖలతో ప్రకాశించును-27. ఆ వృక్షముయొక్క మిక్కిలి లావై, మెత్తనివై తీయనివై అమృతముతో సమానమైన ఫలములు ఆ పర్వతశిఖరమున బడును-28. ఆ గిరి శ్రేష్ఠము యొక్క నెత్తము నుండి స్రవించు ప్రవాహమై తేనెలు ప్రవహించు జంబూనదియనెడి నది బయలుదేరినది-29. అచట జాంబూనదమను బంగారము బుట్టును. అది అగ్నికాంతికలది. దేవతలకలంకారమైనది. సాటిలేనిది. పాపనాశనమైనది-30. దేవ-దానవ-గంధర్వులు, యక్ష రాక్షస-పన్నగులు, అమృతముతో సమానమై, తీయని ఆ జాంబూనద ధారను త్రాగుదురు-31. అది దక్షిణ ద్వీపమున ధ్వజమువంటిది. జంబువని లోకములలో ప్రసిద్ధి చెందినది. ఈ జంబూవృక్షము పేరనే అతిప్రాచీనమైన జంబూ ద్వీపము ప్రసిద్ధిజెందినది-32.
పశ్చిమ దిక్కుననున్న విశాలమై గొప్పనైన పర్వతము యొక్క శిఖరమున మిక్కిలిగా గొప్పనైన యశ్వత్థ (రావి) వృక్షము జన్మించెను-33. అది వ్రేలాడునట్టి శ్రేష్ఠమైన మాలలుగలది. బంగారముతోను మణులతోను నిర్మించిన వేదికలుగలది. మిక్కిలియెత్తైన బోదెలు శాఖలు గలది. అనేక ప్రాణులకు నివాసమైనది-34. కడవవలెలావైనవియు, తమ రుచులతో సుఖమునిచ్చునవియు, అన్ని ఋతువులలో ఫలించునవియు, శుభకరములైన ఫలములతో గూడినది. కేతుమాలదేశీయులకు (విజయ) ధ్వజమువలె నున్నది దేవతల చేతను, గంధర్వుల చేతను సేవింపబడినది-35. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! కేతమాలయను పేరు దాని నామకర్మలననుసరించియేట్లు వచ్చినదో యానిరుక్తము (నిర్వచనము)ను వినుడు-36. సముద్రమథనము జరిగిపోగా, రాక్షస పక్షమోడిపోగా, దేవేంద్రునిచే రచింపబడినదియు, అంతకుముందెవ్వరిని పొందనిదియునైన (దేవేంద్రుని) సుత ప్రాయయైన (పుష్ప) మాల, ఆ మహాయుద్దసమ్మర్ధమున గలిగిన వృక్షముయొక్క కలత నమఠితమైనదై-37. యా వనస్పతియైన (పూలులేకయే ఫలించువృక్షమైన) యశ్వత్థాము (రావిచెట్టు)యొక్క బోదెయందు అంటుకొనియుండెను-38. అదియటైనను గొప్పసువాసనగలిగి వాడనిదై అన్ని కోరికలిచ్చునదై యనే కులైన సిద్దులచేతను చారణులచేతను పూజింపబడుచున్నది-39. ఆరావిచెట్టు యొక్క ధ్వజమునుండి దేవదత్తయైన యీమాల గాలితో ప్రేరేపింపబడినదై ప్రకాశించును. మనోహరమైన దివ్యగంధమును వీచును-40. ఆ కేతుమాలలు గుర్తుగాగల ద్వీపము పశ్చిమమున చాల విస్తారముగానున్నది. స్వర్గమునను ఈ భూమీలోను అంతట “కేతుమాల” అని ప్రసిద్ధిచెందినదీ-41.
తన ప్రక్కనున్న ఉత్తర శిఖరమున గూడ నొక మహా వృక్షముద్భవించినది. అది మ ఱ్ఱిచెట్టు. విశాలమైనబోదెగలది. అనేకయోజనముల చుట్టు వైశాల్యము గలది-42. అనేక సుగంధములతో నొప్పిన పూలమాలలసమూహము గలది. ఊడలు వ్రేలాడు కొమ్మలు గలిగి సిద్ద-చారణులతో సేవింపబడినదై ప్రకాశించెను-43. పగడపు కుండలవంటివియు తేనె తీపితో నిండినవియు నైన ఫలములతో నెల్లప్పుడు నిండియుండును. అది యుత్తర కురుదేశములకు ధ్వజము వంటి వృక్షముగా ప్రకాశించును-44. సనత్కుమారులకు తరువాత బుట్టినవారును మహాభాగ్యవంతులును ఐన కురువులు అను ఏడుగురు బ్రహ్మమానసపుత్రులు ప్రసిద్ధులుండిరి-45. వారు అచట జ్ఞానమును బొందిరి. సాత్త్యికులైరి. పవిత్రకీర్తిని బొందిరి. చివరకు వారు అక్షయమై క్షేమకరమై సనాతనమైన పరాత్పరమైన లోకమును బొందిరి-46. మహాత్ములైన యాయేడుగురి పేరుతో బిలువబడు నదీద్వీపము. దేవలోకమునను భూలోకమునను ఉత్తరకురువులని ప్రసిద్ధిబొందినవి-47.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున జంబూద్వీప వర్ణనమను ముప్పది యైదవ యధ్యాయము 35.
