వాయు మహా పురాణము

Table of Contents

48 -  భువనవిన్యాసో

సూతడనెను:- భారతదేశమునకు దక్షిణము వైపున గూడ పదివేల యోజనముల వైశాల్యముగల సముద్రమును దాటి తరువాత నున్న భూమి విశేషమును వినుడు. అచట మూడువేల యోజనముల పొడవు గలిగి ఒక వేయి యోజనముల వెడల్పు గల్గి నానా పుష్పఫలముల వృద్ధిగలిగి, మెఱువులు గలిగి మహాశైలమైన నొకకుల పర్వతము గలదు. దానియనే! శిఖరములచేత నా ద్వీపము చక్కగా నలంకరింపబడినది. అచట నిర్మలములై తీయనైన జలములు గల వేల నదులు గలవు. ఆ ద్వీపముయొక్క బావులు గూడ నిర్మల జలములు గలవిగా నైనవి. ఆ పర్వతముయొక్క పొడవై (వెడల్పుతో విశాలములై అనేక ఛిద్రములు (నిర్మితములైన గుహా రంధ్రములు) గలవు. వానియందు అంతటను నరనారులచే సంతుష్టములై యొప్పి సమృద్ధములైన యనేకాకారములు (చెక్కిన మూర్తులు చిత్రించిన చిత్రములు) గలవు ఆయాకారములున్న వాని పై భాగములకు బ్రవేశించు మార్గములే ద్వారములు వేలు నూర్లు గలవు పర్వతాంతర్గతముగా పురములు చక్కగా గూర్పబడినవి. ఒకే ద్వారములు గలవైనను పరస్పరము సుసంబద్దములుగా జేయబడినవి. అచటి ప్రజలు పొడవైన మీసములు గడ్డములును గలవారు జన్మించిన వారందరును ఎనుబదియేండ్ల పరమాయుష్యము గలవారు. నల్లనై మేఘములకకు సమానమైన కాంతిగలవారు. కోతులతో సమానమైన ధర్మము (ఆచరణము) వారు ఫలములు మూలములను దినువారు. ఎడ్లవంటివారై శౌచాచారముల వదిలినవారు. చెప్పుచేతలు లేనివారు. ఆ ద్వీపము క్షుద్ర మానుషులైన మనుజులచే నిండినది. ఈ విధముగా నీయన్తరద్వీపములు ఆనుపూర్వకముగా వ్యాఖ్యానింపబడినవి.

 ఇరువది ముప్పది. ఏబది అటువది, ఎనుబది, నూరు, వేయి యోజనములలో నంతటను వెడల్పై పొడవైనవియునై అనేక ప్రాణులతో నిండినవై నెమళ్ళ ద్వీప భాగములు గల క్షుద్ర ద్వీపములు వేలకొలది కలవు.

జంబుద్వీప ప్రదేశమున కంటే వేరుగా వివిధాశ్రయములై నానారత్నములకు గనులై భూమి పై మరి యారు ద్వీపములు గలవు. అవి అంగద్వీపము, యమద్వీపము, మలయద్వీపము, శంఖద్వీపము, కుశద్వీపము, వరాహద్వీపము అనునవి. అంగద్వీపమును గూర్చి వినుడు. అది యనేక సంఘములతో నిండినది. అనేక మ్లేచ్చ గణములతో వ్యాపించినది. అది మహావిశాలమైనది. భూమిలో బంగారము పగడములును నిండిన రత్నములకును నెలవైనది. నదీ శైలవనములతో చిత్రమైనది. ఉప్పు సముద్రముతో సమానమైనది. చట చక్రగిరియను పర్వతము గలదు. అదియనేకములైన సెలయేరులను గుహలును గలది. దాని గుహ పెక్కు మృగజీవముల కాశ్రయమైనది. అది నాగదేశ మధ్యమున నున్న అనేక ప్రదేశములు గల మహాపర్వతము దాని శిఖరములు నాగములకు నిలయములు. అది నదనదీపతియగు సముద్రము వరకు జేరినది (వ్యాపించినది).

యమద్వీప మను ద్వీపము పెక్కు రత్నముల గనులతో వ్యాపించినది. అచట గూడ ధాతువులతో నలంకరింపబడిన 'ద్యుతిమాన్' అను పర్వతము గలదు. అది నదులకుత్పత్తి స్థానము, బంగారమునకుగూడ పుట్టు స్థానము,

 అట్లే మలయద్వీపము. గూడ నిట్లే చక్కగా జుట్టబడియున్నది. అది మణిరత్నములకు నెలవైనది. విశాలమైనది. బంగారమునకు గూడ నెలవైనది. చందనవృక్షములకు నెలవైనది. అట్లే సముద్రములకును నెలవైనది. పెక్కు మ్లేచ్చ గణములతో వ్యాపించినది. నదులు పర్వతములు వీనిచే నలంకరింపబడినది. అచట శ్రీమంతమైన సుమలయపర్వతముగలదు. అది వెండికి నెలవు మహామలయమని ప్రసిద్దిజెందిన శ్రేష్ఠమైన పర్వతము. భూమిలో రెండవ మందర పర్వతమని యెల్లప్పుడు పేరొందినది. అచట దేవరాక్షసులచే నమస్కరింపబడిన అగస్త్యుని భవనము గలదు. అట్లే బంగారు పాదము (ప్రత్యంత పర్వతము) గల మరొక మలయపర్వతము యొక్క గడ్డిచే తెల్లనైన పొదలకాశ్రయమై, పుణ్యాత్ములతో సేవింపబడినది. అనేకపుష్ప ఫలములతో గూడినదై స్వర్గమునకంటే మిన్నయైనది. అచట రవి సంక్రాంతులు మొదలగు ప్రతి పండుగలందును ఎల్లప్పుడు, స్వర్గమే దిగివచ్చును. అట్లే మూడు శిఖరములకు నెలవై యనేకధాతువులచే నలంకరింపబడి, అనేకయోజనముల యెత్తె, చిత్రములైన చరియలు గుహా గృహములును గలిగి, రమ్యమైన యాసుమలయపర్వతము యొక్క శిఖర భాగమున, బంగారు కోగోడలును తోరణములును (బురుజులును) గలిగినదై, నాగవాసములందును గోడల యందును చిత్రములు గలదై, ధనిక భవనముల యొక్కయు రాజభవనములయొక్కయు వరుసలుగలదై నూరుయోజనముల విస్తీర్ణము ముప్పదియోజనముల పొడవును గలదై నిత్య సంతోషముగలదై, విశాలమైనదై లంకయను పురి కలదు. అది కామరూపులైన మహాత్ములైన రాక్షసులకు స్థానము, బలముచే మదించిన వారికి నివాసస్థానము అది దేవశత్రువులగు రాక్షసులకు నివాసము. సంకుచితములు విశాలమై యామహాపురి మనుషులకు జేరనలవిగానిది, సముద్రమునకు తూరుపున ఆ ద్వీపము యొక్క తీరమున గోకర్ణుడను పేరుగల శంకరుని గొప్ప యాలయము గలదు.

అట్లే ఒకే రాజ్యముగా నున్నది. శంఖద్వీపమని తెలియవలెను. అది నూరు యోజనముల విస్తీర్ణము గలది. అనేక మ్లేచ్చగణములకు నివాసమయినది. అచట శంఖగిరియను పేరుగల పర్వతము గలదు. అది కడిగిన శంఖపు చిప్పవంటి కాంతిగది. అనేక రత్నములకు నిధియైనది. పుణ్యమైనది పుణ్యముజేసిన వారిచేత సేవింపబడినది. దానినుండి శంఖనాగయనునది పుట్టి ప్రవహించినది. శంఖముఖుడను నా రాజు దానిని వాసముగా జేసికొనెను.

అట్లే కుముద ద్వీపము అనేక పుణ్యములతో బ్రకాశించినది. అనేక గ్రామముల వ్యాపించినది. అనేక రత్నములకు నెలవై శివమై (మంగళమైనది. అచట కుముదాయను మహాభాగ దుష్టచిత్తములను బోగొట్టు నదిగను, మహాదేవుని సోదరిగను, ఆ (మహాదేవ) కాంతులతో బూజింపబడును.

 అట్లే వరాహద్వీపము అనేక మ్లేచ్ఛగణములతో నిండినది. నానాజాతులతో వ్యాపించినది. అనేక ప్రభుత్వములు పత్తనములును గలది. ధన ధాన్యముల గూడి బలసినది. ధర్మిష్టులైన జనులచే గజిబిజిగానున్నది. దానియందు చిత్రములైన పెక్కు పుష్పఫలములతో గూడిన నదీ పర్వత వనములచే నొప్పిన, వరాహ పర్వతమను నొక పర్వతము గలదు. అది రమ్యమయిన పర్వతము. అనేకములైన కందకములు దరులు గుహలు సెలయేరులు వీనిచే బ్రకాశించినది. ఆ వరాహ పర్వతము నుండి 'వారాహీ' యను మహానది చక్కని రసవంతమైన జలములు గలిగి పుణ్యతీర్థ నదియై బయలుదేరినది. అది భక్తులకు వరములిచ్చునది. అచట బ్రాహ్మణ జన్ములు వరాహావతారరూపియై సర్వప్రభువుగా సమర్థుడైన విష్ణువునకు తదేక దేవతాభక్తులై నమస్కరింతురు. ఈ యేడును ద్వీపములు సంపూర్ణముగా జెప్పబడినవి. భారత ద్వీపదేశము దక్షిణదిశగా బహువిస్తరము. ఒక్కటైన యీ దేశము ఇచట నీ విధముబహు ద్వీపములు గలదిగ జెప్పబడినదని తలపబడినది. ఈ విధముగా చతుర్మహా ద్వీపము తనలోని ద్వీపములచే నలంకరింపబడినది. జంబూద్వీపము యొక్క విస్తరము అను ద్వీపముతోబాటు ఈ విధముగ జెప్పబడినది.

ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబది యెనిమిదవ యధ్యాయము.