బ్రహ్మ మహా పురాణము
243 - వసిష్ఠం ప్రతి మోక్షధర్మ విషయకో జనక ప్రశ్నః
క్షరాక్షరతత్త్వముల సంబంధమును నిరూపించుట
మీరు ప్రతిపాదించిన క్షర అక్షర తత్త్వముల సంబంధము లోకమున స్త్రీ పురుషుల సంబంధము వంటిదని నేననుకొను చున్నాను. అన్ని ప్రాణుల లోను ఋతు కాలమున సంగమించి నపుడు స్త్రీ పురుషులు అన్యోన్య గుణముల నొకచో చేర్చిననే మఱియొక దేహి దేహ ధారణము జరుగు చున్నది. పురుషుని నుండి అస్థిస్నాయు మజ్జలును స్త్రీ నుండి త్వక్ మాంస రక్తములును ఏర్పడి దేహమును నిర్వర్తించు చున్నవి. అంతేకాక పురుషుడు లేక స్త్రీ గర్భమును ధరించ జాలదు. స్త్రీ లేనిదే పురుషుడు దేహమునకు రూపమును ఈయ జాలడు. ఇట్లే క్షర తత్త్వము అగు ప్రకృతియు అక్షర తత్త్వమగు పరతత్త రూప పురుషుడును కలియనిదే ఈ సృస్టి జరుగదని వేద శాస్త్ర ప్రమాణములు తెలుపు చున్నవని నా అభిప్రాయము. మాకు తమ నుండి ఈ తత్త్వము తెలియ వలెను. తత్త్వ జ్ఞానము వలన మోక్షము కలుగును. మేము మోక్షమును కోరు వారము. అనా మయమును అజేయమును అజరమును నిత్యమును అతీంద్రియమును అనీశ్వరమును అగు పరతత్త్వమును పొందుట మా కోరిక. కనుక యథార్థ తత్త్వమును మాకు తెలుపుము.
ఓ జనకా! నీవు చెప్పి నట్టె విషయ నిర్ణయము నందు వేద శాస్త్రములు ప్రమాణములు. నీవు తత్త్వమును గ్రహింప గల జిజ్ఞాసువు. కాని వేద శాస్త్రములను గ్రంథములుగా అధ్యయనము చేసి ధారణ చేసినందు వలన ప్రయోజనము లేదు. వాని యందలి విషయమును ఎఱిగి వివేచనతో తత్త్వ నిర్ణయము చేసిన వారు. మాత్రమే ఆ ప్రమాణ భూతము లగు వేద శాస్త్రము లందలి తాత్త్విక విషయ మిదియని చెప్ప గలరు గాని మిగిలిన వారు గ్రంథములను ధారణ చేయుట బరువును మోయుటకు మాత్రమే. నేను తత్త్వమును ఉన్నది ఉన్నట్లుగ చెప్పెదను వినుము. ఈ విషయమున సిద్ధాంతములో యోగులకును సాంఖ్యుల కును అభిప్రాయ భేదము లేదు. ఈ రెండు దర్శనము లును ఒక దానిని మఱి యొకటి అనుగమించు చునే పరస్పర విరోధము లేకుండ విషయమును ప్రతిపాదించు చునే యుండును. వాటి పరస్పర సమన్వయము నెఱిగిన వాడే తత్త్వజ్ఞుడు.
ద్రవ్యము నుండి ద్రవ్యము ఇంద్రియము నుండి ఇంద్రియము, దేహము నుండి దేహము, బీజము నుండి బీజము, గుణముల నుండి గుణములు ఉత్పన్న మగును. చతుర్వింశతి తత్త్వ రూపమగు ప్రకృతి కంటె అతీత మగు పంచ వింశతితమ = ఇరువది యైదవ తత్త్వము బీజము. దానికి ద్రవ్యములు ఇంద్రియములు దేహములు గుణములు అనునవి లేవు. త్వక్కు మాంసము రక్తము మేదస్సు పిత్తము మజ్జ అస్థి స్నాయుము ఈ ఎనిమిదియు స్త్రీ నుండి ఏర్పడినను పురుషుని నుండి ఏర్పడినను ఇవి అన్నియు ప్రాకృతికములు, ప్రకృతి నుండి కలిగినవి. ఇవి అన్నియు లింగములు. హేతువులు, గుర్తులు, పంచవింశతి తమ తత్త్వమగు ఆత్మ ఇచ్చట ఉపాధిని గ్రహించి యున్నదని మనము వ్యవహారమునకై గుర్తించుటకు ఉపపత్తి మాత్రము. అనగా పర్వతమునకు ఆవల దూరముగా పొగ కనిబడగా అచ్చట ఆ పొగ యున్న తప్పక యుండ వలసిన అగ్ని యున్నదని ఊహించి నట్లే ఆయా పనులను చేయుచున్న దేహములో ఈ ఆత్మ తత్త్వమున్నదని ఊహించుటకు అవకాశముమ ఇచ్చునది లింగము. అంతేకాని ఈ దేహము, ఇంద్రియములు, ధాతువులు ప్రకృతి జనితములే కాని అది క్షర తత్త్వము యొక్క కాని అక్షర తత్త్వము యొక్క కాని వాస్తవ రూపము కాదు. అంతేకాక ఆ క్షరాక్షరాత్మక మగు ఆత్మ తత్త్వము నిర్గుణము. నిరింద్రియము నిర్దేహము. ఐనను మాయా కృతమైన అహంకార మమకారా వరణముచే సగుణము సేంద్రియము సశరీరము అగుచున్నది. ఈ ప్రకృతియు మాయా కృతము. అనగా ఈ దృశ్యమగు ఈ ప్రకృతి యంతయు ఆ ఆత్మ తత్త్వము యొక్క వ్యక్త రూపము. ఇవిలేని ఆ తత్త్వము అవ్యక్తము. అవ్యక్తము ప్రబుద్ధము, బుద్ధ్య మానము. వ్యక్తమగు క్షరతత్త్వము అప్రబుద్ధము. అదియే ఈ మాయాకృత ప్రకృతి తత్త్వములు ఇరువది నాలుగింటికి అతీతమగు ఇరువది యైదవ తత్త్వము. ఏకత్వము అక్షర తత్త్వము. నానాత్వము క్షరతత్త్వము. ఇది వాస్తవ మగు విషయ ప్రతిపాదనము.
ఓ ద్విజ సత్తమా! ఏకత్వము అక్షర తత్త్వము, నానాత్వము, క్షరతత్త్వము అని తాము చెప్పిన విషయము నిస్సంశయముగా నాకు అవగతము కాలేదు. ప్రబుద్ధము, బుధ్య మానమ, అప్రబుద్ధము అను నిదర్శనము కూడ నాకు అవగతము కాలేదు. అక్షరక్షరముల వివేచించు కొనుటకు తాము తెలిపిన హేతువులు కూడ నా బుద్ధి అస్థిర మగుటచే దాని యందు నిలువ లేదు. కావున తాము నాయందలి దయతో అక్షరక్షర తత్త్వములను ఏకత్వ నానా త్వములతో దర్శించ వలసిన తీరును ద్వంద్వముల స్థితిని అక్షర తత్త్వము ఆ ద్వంద్వములచే నిరుద్ధము, అడ్డగించ బడినది, బాధనొంద బడినది, కాని స్థితిని విద్య, అవిద్య, వీని స్వరూపమును సాంఖ్య విధానమునను యోగ విధానము నను తత్త్వమును వివేచించు ప్రక్రియలను బుద్ధ ఆబుద్ధ స్థితుల వివేచనమును చక్కగా తెలుప ప్రార్థించు చున్నాను.
నీవడిగిన ప్రశ్నకు చాల సంతోషము కలిగినది. ఓ మహారాజా! నీవడిగిన వానిలో యోగ శాస్త్రా నుసారియగు తత్త్వ వివేచన ప్రక్రియను నీకు తెలిపెదను. వినుము. ఈ ప్రక్రియలో ధ్యానమే యోగ సాధనకు బలమును చేకూర్చును. ధ్యానము కూడ మనస్సు యొక్క ఏకాగ్రత, ప్రాణాయామము అని రెండు విధములు. ఈ రెండిటిలో ప్రాణాయామము సగుణ ధ్యాన ప్రక్రియ. మానస ఏకాగ్రతా రూపమగు ధ్యానము నిర్గుణమైనది. ఈ రెండు విధములగు ధ్యాన ప్రక్రియలలో దేనిని సాధన చేయ దలచినను ఈ చెప్పబోవు నియమములను తప్పక పాటించ వలెను. మూత్ర విసర్జనము మల విసర్జనము నియతములు కావలెను. అందులకై ఆహారమునను నియమము కావలెను. దినమున రెండు మారులు భుజింప రాదు. భగవంతునికి నివేదించిన దానిని తత్పరుడై భుజించ వలెను. ఇంద్రియములను ఆయా ఇంద్రియ విషయముల నుండి మరలించి మనస్సు నియమించ వలెను. మౌనమును విచారణా శీలత్వమును పూన వలెను. ఆ ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మాత్రమే అని లెక్కించినచో పది మాత్రము. వాటితో మనో బుద్ధులను కూడ చేర్చినచో పండ్రెండు. ఇట్టి ఇంద్రియ నిగ్రహ పూర్వక మగు ధ్యాన ప్రక్రియతో చతుర్వింశతి తత్త్వములకు అతీత మగు తత్త్వమును సాక్షాత్కరించు కొనవలెను. మనస్సును తత్త్వ సాక్షాత్కారమునకై చోదన చేయ వలెను. ఆ తత్త్వము అజరము. విశ్వాత్మకము. అదియే జ్ఞేయము, తెలిసికొన, సాక్షాత్కరించు కొనదగినది. ఉన్నత మనస్సు గల సాధకుడు ఆశ్రయించ వలసినది ఈ తత్త్వమునే. మఱి దేనిని కాదు. సర్వ సంగములను విడిచి లఘువు, తేలికగా జీర్ణమగు, ఆహారము తినుచు ఇంద్రియములను జయించి రాత్రి యొక్క మొదటి జాములోనో కడపటి జాములోనో మనస్సును తత్త్వముపై నిలుప వలెను. కొయ్య మొద్దువలె నిశ్చలుడై, అనగా స్థిరమగు చిత్తము కలవాడై, విధి విధానముతో ధ్యానము చేసిన వాడు యుక్తుడు, యోగ సాధకుడు అని చెప్ప బడును. అప్పుడు ఆ సాధకుడు ఏమియు వినడు, వాసన చూడడు, చూడడు, స్పర్శను ననుభవించడు, మనస్సుతో ఏదియు సంకల్పించడు, ఆలోచింపడు, ఎఱుగడు. అప్పుడే ఈ యుక్తుడు యోగ సాధకుడు, ప్రకృతిని స్వాభావిక స్థితియగు, తత్త్వమును పొందెనని చెప్ప బడును. ఆ స్థితిలో ఈ ఆత్మ తత్త్వము లోకము నందలి దీపము వలె వత్తి నూనె ప్రమిద మొదలగు నవి లేకయు ప్రకాశించును. దానికి ఇంద్రియములు మొదలగు వ్యావహారిక చిహ్నములు ఏవియు లేవు. క్రిందికిని పైకిని అడ్డము గాను అన్ని వైపులకును ప్రసరించ గలదు, ఆ తత్త్వ దర్శనము కాగానే సాధకుడు ఆత్మ దర్శనముతో కూడిన వాడయ్యెను అనబడును. అతడే హృదయస్థు డగు అంతరాత్మ. ఆతడే జ్ఞేయుడు తెలియబడ వలసిన వాడు. జ్ఞుడు = అన్నింటిని ఎఱిగిన వాడు. అని నావంటి తత్త్వ వేత్తలు చెప్పుదురు. ఆ తత్త్వము పొగ లేని అగ్ని వంటిది. కిరణములు ఏ ఆవరణము లును లేక వెలుగు సూర్యుని వంటి వాడు. నిర్మలాకాశమున ప్రకాశించు మెఱపు ప్రకాశము వంటి వాడు. ఈ తత్త్వమును ధృతి మంతులు నిశ్చల చిత్తము కల మనుషులు మహాత్ములు బ్రహ్మ నిష్ఠులగు బ్రాహ్మణులు తన యందు తన్నే దర్శింతురు. ఈ మహా తత్త్వము తనకు ఏదియు ఉత్పత్తి హేతువు లేనట్టిది. అమృత రూపమైనది. అది అణువుల కంటె అణుతరము. మహత్తుల కంటె మహత్తరము. అంతట అన్ని భూతముల యందు నిశ్చయముగా నిశ్చలముగా నుండియు కన బడదు లోక కర్తయగు ఈతడు బుద్ధి యను ద్రవ్యముతో వెలుగు మనో దీపము యొక్క ప్రకాశము సాయమున చూడ సాధ్య మగును. మహా తపస్సునకు ఆవల నుండును. తమో గుణముచే ఆవరింప బడిన వాడు కాదు. వేద తత్త్వజ్ఞులగు వారు ఈ తత్త్వమును గూర్చియే “తమసః పరస్తాత్” “తమస్సునకు ఆవల దూరముగా నున్నవాడు” అని చెప్ప చున్నారు. ఇతడు విమలుడు. లింగ రహితుడు = అనగా ఇంద్రియ దేహాది ఉపాధులు లేని వాడయ్యు కలవాడై కనబడు చున్నాడు. ఈ యోగ దర్శనమును అనుష్ఠించిన వారు అజరుడు = నాశరహితుడు అగు పరమాత్ముని దర్శింప గలుగుదురు.
ఇంత వరకును నేను నీకు యోగ దర్శనమును తాత్త్వికముగా తెలిపితిని. ఇక సాంఖ్య జ్ఞాన దర్శనమును తెలిపెదను. ఇది పరిసంఖ్యా నిదర్శన రూప మైనది. (ఇదియే సత్యము కాని అది సత్యము కాదు అని చెప్పుట పరిసంఖ్యానము. సామాన్య మానవులకు వ్యవహారములో కనబడు చున్నందున ఈ లోకము సత్యమే యని పించును. కాని శాస్త్రములలో మాత్రము ప్రపంచము శాశ్వతమగు సత్యము కాదు. పరమాత్మ తత్త్వమే శాశ్వత మగు సత్యమని చెప్ప బడుచున్నది. ఈ రెండిటిలో ఏది గ్రాహ్యము? అని సందేహము కలుగును. అట్టి వానికి వివేచనా పూర్వకముగా జగత్తు యొక్క సత్యత్వమును నిర్ధారించునది పరిసంఖ్య అదియే సంఖ్య, సంఖ్యా = నిర్ణయ ప్రధానమైన దర్శనము సాంఖ్య దర్శనము. ఇది మీమాంసా శాస్త్ర ప్రక్రియ ననుసరించిన వివరణము, అనువాదకుడు.) ( ప్రకృతి యనగా స్వాభివికస్థితి యని అర్థము. ఇది పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరాప్రకృతి యని రెండు విధములు. ఈ విషయములో భగ. 7అ.
4. భూమిరాపోనలో వాయుః! ఖం మనోబుద్ధి రేవచ,
అహంకార ఇతీయంమే! భిన్నా ప్రకృతి రష్టధా.
5. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పఠామ్
జీవభూతాం మహాబాహో యయేదంధార్యతే జగత్.
6. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యువ ధారయ
అహంకృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయన్తథా.
7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ
మయిసర్వమిదంప్రోతం నూత్రేమణిగణాఇవ.
అను శ్లోకముల యర్థమును అను సంధానము చేసికొని విషయమును గ్రహించుటకు ప్రయత్నించ వలెను అను వాడకుడు.)
ఆ పరమాత్మ తత్త్వము యొక్క వ్యక్త స్థితికి మూలమగు పరమస్థితి అవ్యక్త స్థితి = ఇదియే ప్రఖ్యానము, వ్యక్తత అన బడును. ఇదియు పరమాత్ముని యొక్క ప్రకృతి స్వాభావిక స్థితియే. కాని ఉత్కృష్ట మైనదియు మొట్ట మొదటిదియు కావున ‘‘పరాప్రకృతి’’ అన బడును. రెండవ దశ మహత్త్వము. ఇదియే వేదాంత దర్శనము నందలి బుద్ధి తత్త్వాత్మక మగు హిరణ్య గర్భుడు అనెడి తత్త్వము. మహత్తు నుండి అహంకారము వ్యక్త మగుట మూడవ దశ. అహంకారము నుండి పంచసూక్ష్మ, అపంచీకృత భూతము లేర్పడుట నాలుగవ దశ. మహత్తు, అహంకారము, మనస్సు, పంచ భూతములు అనెడి ఎనిమిదియు అపరా ప్రకృతి అనబడును. వీని విస్తరణము లగు షోడశ వికారములు, విశేష పంచకము, పంచేంద్రియములు మొదలగు భౌతిక సృష్టి యంతయు ఐదవ దశ. ఇదియే సాంఖ్య తత్త్వ మంతయు. షోడశకశ్చ వికారః సాంఖ్య కారికలు = 3కా అనియు గణశ్చషోడశకః = సాంఖ్య 22కా అనియు చెప్పిన విధమున ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనెడి తన్మాత్రలు ఐదు మనస్సు మొత్తము పదునారు వికారములు. వీనిలో ఈ ఐదు తన్మాత్రలు స్థూల భూత సృష్టికి మూలము కావున ఐదు విశేషములు వాటిని జీవుడు అనుభవించుటకు సాధనములు కావున ఐదు జ్ఞానేంద్రి యములు ముఖ్యము లని ఇచట సూచింప బడిన దని గ్రహించ వలెను, అనువాదకుడు.
ఇవి అన్నియు ఏక్రమమున సృష్టింప బడినవో అక్రమమునకు ప్రతిలోమముగా లయము జరుగును. అనగా చివరి చివరిది లయమొంది మొదటి మొదటిది మిగులుచు వచ్చును. ఈ లయము అలలు సముద్రములో లయ మగుట వంటిది. ఏలయన ఏది ఎచట నుండి జనించునో అది దానియందే లయ మొందును. ఇట్లు లయ మొందగా కడపటికి మిగిలిన ఆత్మ తత్త్వము యోగ సాధనమున తనయందు తన్ను తానుగా చూచును. ఓ రాజ సత్తమా! అపరాపరా ప్రకృతులు సృష్టి ప్రళయ స్వరూప క్రమము ఇదియే. ప్రళయము నకు తరువాత ఏకత్వము. సృష్టి కాలములో నానాత్వము. దీని కంతటికిని అధిష్ఠాత అవ్యక్త కూటస్థ తత్త్వము. పరమాత్ముడు తన్నుతాను నానాత్వమున రూపొందించు కొనగా ఏర్పడిన పాంచ భౌతిక దేహము క్షేత్రము. దానిని మహాన్ ఆత్మా, మాయా వశమున ఆశ్రయించి అధిష్ఠాతయై యుండును. ఇది ఇరువది ఐదవ తత్త్వము. ఇతడు క్షేత్రమును ఎరుగును క్షేత్రం జానాతి, కావున క్షేత్రజ్ఞుడు. వ్యక్త రూపమగు ఈ దేహము అనుపురమున శయనించుటచే పురి, శేతే, పురుషుడు అనబడును. ఇదియే క్షేత్ర క్షేత్రజ్ఞ వ్యక్తావ్యక్త పరాపరా ప్రకృతి వివేచన క్రమము. ఈ క్షేత్రజ్ఞుడే జ్ఞాత జానాతి తెలిసి కొనువాడు. ఈ జ్ఞాత యొక్క స్థితిని ఆధారముగా చేసికొని జ్ఞాత = జ్ఞానము, జ్ఞేయము అను త్రిపుటి ఏర్పడు చున్నది. ఇచట మఱియు సూక్ష్మ మగు వివేచనా క్రమము ఇది, క్షేత్రజ్ఞుడుగా నున్న అవ్యక్త తత్త్వము వ్యక్త మైనట్లు కనబడుచు జ్ఞాత అగును. వ్యక్త తత్త్వములకు అతీతమైన ఇరువది యైదవ శుద్ధ తత్త్వము జ్ఞేయము, తెలియ బడ వలసినది. దానిని ఎరుగుట వ్యవహార దశలో జ్ఞానము కాని పరమార్ధ దశలో ఆ అవ్యక్త శుద్ధ తత్త్వము ఒక్కటియే జ్ఞానము అది ఎఱుగుట అనెడి వ్యాపారమునకు వనికి అతీతము అదిచిత్= జ్ఞాన రూప మైనది. ఓ జనక మహారాజా! వాస్తవ మగు జ్ఞాన మనగా ఈ పరాప్రకృతిని సాక్షాత్కరించు కొనుటయే. సగుణము నుండి నిర్గుణమును వేరు పరచి తెలిసికొని అది తానగుటయే. ఈ స్థితిని పొందిన వారికి జనన మరణావృత్తి లేదు. క్షర భావము ఉండదు. కావున క్షరాక్షర ములు రెండును లోక వ్యవహారము నందలి స్త్రీ పురుషుల వలె పరస్పరా శ్రయములని నీవను కొనిన భావమునకు కూడ ఇచ్చట అవకాశము లేదు. ఇది యెరుగక వేరుగా తెలిసి కొను మంద మతులకు జనన మరణ పునరావృత్తి తప్పదు. వారు అవ్యక్త తత్త్వమును వ్యక్త తత్త్వమునుగా చూచుటచే దానినే అనువర్తించుచు వ్యక్త స్థితిలో పడి యుండక సంసారమున సంచరించక తప్పదు. వ్యక్త ప్రపంచము నందలి ఏ తత్త్వమును కానట్టి ఇరువది యైదవదగు అవ్యక్త తత్త్వమును ఎరిగిన వారికి భయము లేదు. ( ఇచట ప్రమాణము: తైత్తిరీయోపనిషత్ ఆనందవల్లీ, అనువాకము7: యదా హ్యేవైష ఏతస్మి న్నదృశ్యేనాత్మ్యేనిరుక్తే నిలయనే భయం ప్రతిష్ఠాం విందతే అథ సోభయం గతో భవతి యదా హ్యేవైష ఏతస్మి న్నుదర మంతరం కురుతే అథ తస్య భయం భవతి )
Summary of chapter 136 of the Brahma Mahā Purana is as follows:
The Vasiṣṭha-Janaka dialogue deepens into a discussion of the specific experiences that arise during advanced Yoga practice, the nature of kaivalya (aloneness of the Puruṣa from Prakṛti) as the Sāṃkhya understanding of liberation, and how a liberated king may continue to function in the world while remaining inwardly free. The concept of jīvanmukti (liberation while still living) is addressed through the model of Janaka himself.