బ్రహ్మ మహా పురాణము
39 - దక్షయజ్ఞ విధ్వంసనమ్
వైవస్వత మన్వంతరమున ప్రాచేతసుడగు దక్ష ప్రజాపతియొక్క అశ్వమేధ యాగమెట్లు నాశమొందెను. దేవి యొక్క క్రోధవ్యాపాన మెఱింగి సర్వాత్మకుడగు నీశ్వరుడెట్లు కోపించెను? అమిత తేజో వంతుడగు దక్షుని యాగము మహా దేవునిచే రోషముతో నశింప చేయబడిన వృత్తాంతమును సవిస్తరముగ మా కెఱింగింపుము
ఋషులకు బ్రహ్మ యిట్లనియె! మేరు శృంగ మొకటి “జ్యోతి స్థలము” అను పేర నున్నది. అది సర్వరత్న భూషితము. లోక మనోహరము. అందుపై శైల కన్యతో నిందు ధరుండు వసించును. ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, కుబేరుడు సనత్కు మారాదులు అప్సరసలు అందరు నీశ్వరుని సేవింతురు. గంగానది మూర్తిని ధరించి శివు నుపచరించు చుండెను.
దక్ష ప్రజాపతి యీ చెప్పిన విధముగ యజ్ఞా రంభము చేసెను. ఇంద్రాది దేవతలు వచ్చిరి. అగ్ని సమమైన తేజస్సులతో విమానముల మీద గంగా(హరి) ద్వారమునకు వార రుదెంచిరి. గంధర్వులు అప్సరసలు ఆడిరి పాడిరి. అందరును చేతు లొగ్గి యాయనను సేవించిరి. మఱియు శ్రీమహా విష్ణువుతో వసు, రుద్ర, ఆదిత్య, సాధ్య మరుద్గ ణములు ఊష్మపులు, ఆజ్యవులు, సోమపాయలు అశ్వినీ దేవతలు యజ్ఞ భాగార్థులై వచ్చిరి. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములను నాలుగు రకముల జీవ సంఘాతము కూడ వచ్చిరి. దేవతలు, ఋషులు సపత్నీకులై యేతెంచిరి. వారిని చూచి దధీచి కుపితుడై ఇట్లనియె.
పూజార్హులు కాని వారిని పూజించి నను అర్హులను పూజింప కున్నను మానవుడు మహా పాపి యగును.
అని దక్షుని చూచి పశుపతిని పూజార్హుని పరమేశ్వరుని నీవేల పూజింప వని యడిగెను.
శూల హస్తులు జటాజూట ధారులునైన ఏకాదశ రుద్రులు నాకు గలరు. మఱియొక మహేశ్వరుని మేమెరుగము అనెను.
సర్వేశ్వరుల కేకైకమూర్తి యయిన మా మహేశ్వరుని నీవు పిలువ లేదు శంకరుని కంటె మించిన దైవతమును నేను గానను. ఈ యజ్ఞము సంపన్నము గాదు.
విష్ణువునకు హవిర్భాగము లిచ్చితిమి. రుద్రులకు నిచ్చితిమి. మఱియును గల దేవత లందరకు వారివారి భాగముల నిచ్చు చున్నాను. శంకరునికి మాత్రమీయ ననెను.
గిరిరాజ కుమారి, తండ్రి యజ్ఞ యునకు వేల్పులెల్ల రేగిరని తెలిసి పశుపతి యగు పతితో నిట్లనియె.
స్వామి! ఇంద్రాది దేవతలు ఎచటి కేగు చున్నారు. ఆ రహస్యమును సర్వ రహస్యజ్ఞు డవగు నీవు నాకా నతిమ్ము అన
మహానుభావుడగు దక్షుడను పేరుగల ప్రజాపతి యశ్వమేధము చేయు చున్నాడు.
ఈ యజ్ఞమునకు మీరేల వెళ్ళరు. వెళ్ళక పోవుట కభ్యంతర మేమి?
ఇదంతయు దేవతలు చేసిన కుట్ర. యజ్ఞము లందన్నిటను నాకు భాగము కల్పింప బడుట లేదు. మునుపటి నుండి యేర్పడిన దారినే పోవలెను. దేవతలు యజ్ఞ భాగమును నాకు ధర్మము ననుసరించి యీయ వలసినది ఇచ్చట లేదు అన
ఏలిన వారు ప్రభావము చేతను గుణముల చేతను దేవత లందరిలో తేజస్సు చేత కీర్తి చేత యణిమా సంపద చేత గెలువ రాని వారు లొంగని వారు. మీకీ హవిర్భాగము ఈయ నందున నేనెంతో దుఃఖము నందు చున్నాను. నాకు వణకు పుట్టు చున్నది. సాక్షా ద్భగవంతుడు ధ్యానమున కందని మహానుభావులు అయిన నా భర్త యజ్ఞ భాగము నందుటకు నేనేమి దానము, నియమము తపస్సు చేయుదును.
అని పలికి క్షోభ పడుచున్న పత్నిని జూచి భగవంతుడు ఆనంద భరితుడై యిట్లనియె.
ఓ కృశోదరి! లతాంగి! నన్నీ వెఱుంగవు. నీవిపుడన్న మాట లేమంత యుచితములు? విశాలాక్షి! మహానుభావు లందఱు నేమన కొందురో నేనె ఱుంగుదును. నీకు గలిగిన పొరబాటు వలన ఇంద్రునితో గూడ నెల్ల దేవతలు ముల్లోకములు సర్వము నష్ట పడినది. నన్ను యజ్ఞేశ్వరుండందురు. రథంత సామముచే వేద విదులు నన్ను స్తుతింతురు. బ్రాహ్మణులు నన్ను వేద మంత్రము లచే యజింతురు. అధ్వర్యులు నాకు యజ్ఞము లందు భాగము గల్పింతురు.
సామాన్యుని వలె నాడు వారిలో నిన్ను నీవు పొగడు కొను చున్నావు. నీలో నీవు గర్వపడు చున్నావు. సందేహము లేదన
సురేశ్వరి! నీవను కొన్నట్లు నన్ను నేను బొగడు కొనుట లేదు. ఇక నా యజ్ఞ భాగమును నేనడుగ బోవు చున్నాను.
అని ప్రాణముల కంటె బ్రియురాలైన యుమా దేవింగూర్చి భగవంతుడు పలికి ముఖము నుండి క్రోధాగ్ని నుండి యొక కుమారుని సృష్ఠించెను. వానింగని దక్షుని యజ్ఞమున కేగును. నా యాజ్ఞచే నతడు సేయుచున్న క్రతువును నాశనము సేయుమనియె.
అవ్వల నిట్లు రుద్రుడు ప్రయోగించిన సింహ వేషధారి చేతను దేవి క్రోధవశమై నదని యెఱింగి నా దక్ష యజ్ఞ మవలీలగ ధ్వంసము చేయ బడెను. ఆగ్రహముచే మహోగ్రయై మహేశ్వరి భద్రకాళియై, తాను కర్మసాక్షి గావున యా కోపమూర్తి వెంట నేగెను. రుద్రక్రోధ స్వరూపుడైన యాతడు వీరభద్రుడను పేరందెను. ఆయన శ్మశాన నివాసి గూడ. దాక్షాయణి కోప నివారణము సేసిన వాడు. ఆయన తన రోమ కూపముల నుండి తనకు దాన గణేశ్వరులను సృజించెను. వారు రుద్రుని వెంట నుండువారు రుద్రుని బలపరాక్రమ స్వరూపులు రౌద్రాకారులు. రుద్రుని సేవకలు వందలు వేల కొలది యప్పుడు యటవచ్చి వ్రాలిరి. ఆ రుద్ర గణములు సేసిన ఘోరమైన కిలకిలా రావముల లాకాశ మెల్ల నలము కొన్నట్ల య్యెను. ఆ ధ్వనికి దేవత లందరు హడలి పోయిరి. పర్వతములు బ్రద్ద లయ్యెను. భూకంప మయ్యెను, ఝంఝూ మారుతములు విసరెను. సముద్రము క్షోభించెను. అగ్నులు వెలుగ వయ్యె. సూర్యుడు వెలవెల పోయెను. నక్షత్రములు తారా గ్రహములు కాంతి హీనము లయ్యెను. ఋషులు దేవ దానవులు ప్రభాశూన్యు లయిరి. లోక మిట్లంధ కారబంధుర మయిన తఱి గణేశ్వరులు విజృంబించి యజ్ఞశాల నంటించిరి. బ్రద్దలు కొట్టిరి. యూప స్తంభములను పెల్లగించి పార వేసిరి. మనో వాయు వేగముల బర్వు లెత్తిరి. యజ్ఞ పాత్రములను యజ్ఞా యతన ములను పిండి పిండి చేసిరి. తారలు (నక్షత్రములు) తునుక తునుకలై నింగి నుండి రాలు చున్నట్లు కన బడెను. రుద్ర గణము దివ్యాన్న పాన భక్ష్యరాసులను పర్వతము లట్లున్న వానిని దినివేయ మొదలిడిరి. క్షీర నదులు, కరడు గట్టిన నెయ్యి పాయసము తేనెలు ఇసుక మేటలిట్లు పడి యున్న ఖండ శర్కరలు కాలువలై పారు బెల్లపు పాకములు హెచ్చురు చిగుల్కు మాంసములు వివిధములైన భక్ష్యములు (తిన దగినవి) లేహ్య (నాక దగినవి) చోష్య (జుఱ్ఱ దగినవి) పానీయములు (త్రావ దగినవి) పెక్కు నోళ్ళ దిను చున్నారు. ఒలుక బోయు చున్నారు, విరజిమ్ము చున్నారు, రుద్రుని కోప స్వరూపులు మహా కోవులు. కాలాగ్ను లట్లున్నారు. నడగొండ లట్లు నలుదెసల గ్రమ్మి భక్షించిరి. బెదరించెను. పలు రూపులనాడిరి. గంతు లిడిరి. దేవ తాంగనలం బట్టుకొని విసర జొచ్చిరి. ఇట్లు గణములం గూడి ప్రతాప శాలి వీరభధ్రుడు రుద్ర కోపముచే బ్రయోగింప బడి సర్వ దేవతల రక్షణలో నున్న యమ్మహా యజ్ఞమును, భద్రకాళి సన్నిధి నుండ దహించి వేసెను. కొందరు గణాధిపులు సర్వభూత భయంకర ముగ నార్చులు వెట్టిరి. యజ్ఞ పురుషుని తల బ్రద్దలు గొట్టి పెల్లున గర్జించిరి. అంతట నింద్రాది దేవతలు దక్ష ప్రజాపతియుం జేతులు జోడించి తామెవ్వరో తెలుపు మనిరి.
నేను దేవుడను గాను దైత్యుడను గాను ఇక్కడ విందు గడుచుటకు వచ్చిన వాడను గాను. మీ వేడుక చూడ వేడుకపడు వాడను గాను. దక్షయజ్ఞ నాశనము సేయ వచ్చి నాడను. రుద్ర కోపము వలన బయలు దేరినాడను. వీరభద్రుడను పేరందిన వాడను. దేవి క్రోధము నుండి వెలువడి భధ్రకాళి యని పేరందిన దీమె. దేవ దేవుడు పంప నీ యజ్ఞము దరికి వచ్చినది. రాజేంద్రా! నీవు దేవదేవు నుమాపతిని శరణందుము. దేవ ప్రభువు కోపించుట మంచిది గాని నైకరులతో గోపము మంచిది గాదు.
కలుగుల నుండి పెల్లగింప బడి విఱువ బడిన యూపములతో మాంస లుబ్ధములై వ్రాలుచు మిక్కిలి విసురగ ఱెక్కలు విసరుచు నెగురుచు వ్రాలుచున్న గ్రద్దలతో నక్క కూతలతో ప్రతి ధ్వనించు చున్న రుద్ర గణములచే ధ్వంసము సేయ బడిన దక్ష యజ్ఞ మపుడు లేడి రూపుగొని యాకాశమున కెగిరి పోయెను. ఆ రూపమున బోవు చున్న యయ్యజ్ఞ పురుషుం జూసి వీరభద్ర స్వామి విల్లు నమ్ములుంగొని వానింజంప నేగెను. అమిత ప్రతాప శాలియైన యా గణేశుని క్రోథము వలన నాతని నుదుటి నుండి ఘోరమైన యొక చెమట చుక్క రాలిపడెను. నేలపై బడగానె యా స్వేదబిందువు నుండి ప్రజ్వలించు కాలాగ్ని వోలె నొక పురుషు డావిర్భ వించెను. ఆదోచిన పురుష మూర్తి మరుగుజ్జు ఎఱువు గన్నుల వాడు. బవిరి గడ్డము వాడు. భయంకరుడు. నిక్కిన తల వెంట్రుకలు. ఒడలెల్ల బొచ్చు. ఎఱుపారు చెవులు. జడుపు గొల్పు కాఱు నలుపు రంగు ఎఱ్ఱ బట్టలు గలవాడై యమ్మహా బలుడా యజ్ఞము నగ్ని కక్షమును (ఎండు గడ్డిని) వలె గాల్చి వైచెను. దేవత లడలెత్తి పది దెసలకు బారి పోయిరి. అందు విక్రమమున సంచారము సేయు చున్న యా వీరభద్రునిచే భూమి సప్త ద్వీపములతో గంపించెను. దేవలోక భయంకరమైన యొక పెనుభూత మిట్లు విజృంబించి నంతట నేను (బ్రహ్మ) మహా దేవుని బూజించుచు నిట్లంటిని. దేవత లెల్లరు నీకు గూడ యజ్ఞ భాగము నీయ గలరు. ప్రభూ! సర్వ దేవాధి నాథుడవు. నీవీ భయంకర రూపము నుప సంహరింపుము. ఈ దేవత లందఱు వేలకొలది ఋషులు నీ క్రోధముచే శాంతి వడయ లేకున్నారు. ఓ సురేశ్వరా! నీ చెమట నుండి పుట్టిన యీ పురుషుడు జ్వరమను పేర లోకములం జరింప గలడు. ఏక రూపమై యున్న నితని తేజస్సును ఈ యెల్ల పృధివియు భరింప జాలదు. కావున దీనిని పెక్కు రూపుల గావింపుము. అని నేన న్నంతట, యాయనకు గూడ యజ్ఞ భాగము గల్పించి నంతట నా భగవంతుడు పినాక పాణి తనకు దాను పరమ ప్రీతి నందెను. దక్షుడును మనసార నాభవుని దేవుని శరణందెను. నేత్ర స్థానమున ప్రాణా పానములను ప్రయత్నముతో నిలిపి బహుదృష్టి యగు పరమేశ్వరుడు బహిర్గత మైన చూపును మరలించి నిలిపి యల్లన నవ్వి నీకేమి చేయుదును తెలుపు మనియె. ఈ కథను దేవతలు పితృ దేవతలు నాలించి నంతట ప్రజాపతి దక్షుడు చేతులు మొగిచి బెదరి పోయి మదిలో శంకించుచు కన్నుల నీరు గార్చుచు నిట్లనియె.
భగవంతుడు నా యెడల బ్రసన్ను డగునేని నేను నీకు బ్రియుండ నేని నేన నుగ్రహింప నర్హుడ నేని నాకొక్క వరమీయ దగును. ఈ యజ్ఞము కొరకు బహు కాలము బహు ప్రయత్నముచే సమకూర్చు కొన్న భక్ష్యమెల్ల భక్షింప బడినది. త్రావ దగినిదెల్ల త్రావ బడినది. బెదిరింప బడినది. నాశనము సేయ బడినది. పొడిపొడి గావింప బడినది. ముక్క ముక్కలు సేయ బడినది. అయినను నీ యనుగ్రహము వలన నో మహేశ్వర! ఈ యజ్ఞ మబద్దము గాగూడదు. సఫలము గావలయు నని ప్రార్ధించెను.
తథాస్తు (అట్లే యగు గాక) యని భగుని కన్నులు రాల్చిన యాహరుడు పలికెను. ధర్మమున కధ్యక్షుడు త్రినేత్రుడు నగు మహాదేవుని దక్షుడు నేలపై మోకాళ్ళ నానించి నమస్కరించి శివ యజ్ఞముం బడసి యెనిమిదివే ల శివ నామముల నా వృషభ ధ్వజుని స్తుతించెను.
Summary of chapter 39 of the Brahma Mahā Purana is as follows:
The sacred tīrtha of Ekāmra (Bhubaneswar, Oḍiśā) and its presiding deity Śiva Ekāmreśvara are extolled. The origin of this holy centre, the miraculous events that hallowed it, and the extraordinary merit accruing to those who visit, bathe, and worship there are described. The Ekāmra tīrtha is proclaimed one of the holiest Śaiva centres in Bhārata, capable of granting liberation even to the gravest of sinners.