బ్రహ్మ మహా పురాణము
4 - పృథుప్రభృతి సర్వదేవాదీనాం రాజ్యాభిషేక వర్ణనమ్
బ్రహ్మ వేన కుమారుని పృథుని చక్రవర్తిగా నభిషేకించి క్రమముగా వారి వారికి రాజ్యములను నిర్ణయించి యిచ్చెను. ద్విజులు ధాన్యములు నక్షత్రములు గ్రహములు యజ్ఞములు తపస్సులు అను వాని రాజ్యాధికార మందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజ రాజును, (కుబేరుని) అదిత్యులకు విష్ణుని, వసువుల కగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తలకు వానవుని, దైత్య దానవులకు ప్రహ్లాదుని, పితరులకు వైవస్వతుని, (యముని) యక్ష రాక్షస పార్థివ సర్వ భూత పిశాచములకు శూల పాణియైన గిరీశుని, (శివుని) శైలమునకు హిమ వంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్పములకు తక్షకుని, ఏనుగులకు ఐరావతుని, అశ్వములకు ఉచ్చైఃశ్రవసమును, పక్షులకు గరుడుని, మృగములకు శార్దూలమును, గోవులకు గోవృషమును, వనస్పతులకు జువ్వి చెట్టును, రాజు గావించెను. తూర్పు దిశకు వైరాజ ప్రజాపతి కుమారుని సుధన్వుని, దక్షిణ దిశకు కర్దమ ప్రజాపతి కొడుకు శంఖపదుని, పడమటి దిశకు రజస్సు కుమారుని (అచ్యుతుని) కేతుమంతుని, ఉత్తర దిశకు వర్జన్య ప్రజాపతి తనయిని హిరణ్యరోముని అధిపతులనుగా నభిషేకించెను. సప్త ద్వీప పరివృత మయిన యీ పృథ్వి పట్టణములతో గూడి వారివారి చేత నిపుడును ధర్మముతో పాలించ బడుచున్నది. ఈ నరపతులచే వేద విహితముగ రాజసూయాభిషిక్తుడునై, రాజ్యాభిషిక్తుడవై పృథువు చక్రవర్తియై యిమ్మేదిని నేలను, చాక్షుష మన్వంతరము గడచి వైవస్వంత మన్వంతర మారంభ మయ్యెను. అమ్మన్వంతర వృత్తాంతము వినిపింతును వినుండు.
లోమహర్షణ! పృథు చక్రవర్తి మహానుభావుడు. ఇవ్వసుంధరను గోవు నొనరించి వస్తుసారమును పిదికె నందురు. నర నరాసుర నాగ యక్ష ద్రుమ శైల పిశాచ గంధర్వ ద్విజ రాక్షసాది మహాసత్వ జాతులచే నీ భూమి ఎట్లు పిదుక బడినది. వారువారు పిదికిన పాత్ర విశేషము లేవి? దూడ లెవరు? దోగ్ధ ఎవరు? దుగ్ధము (పాలు) ఎట్టిది? ఆనతిమ్ము. కుపితులైన మహర్షు లెట్లు వేనుని హస్తము మథించిరి? దానికి కారణమేమి? అదియుం గీర్తింపుము.
ఏకాగ్ర మనస్కులై యాలింపుడు. అశుచికి నీచ మనస్కునకు శిష్యుడు కాని వానికి వ్రత దూరునికి కృతఘ్నునికి అహితునకు నిది నేను తెలుపను. ఇక్కడ స్వర్గప్రదము, కీర్తిదము, ఆయుష్యము, ధన్యము, వేద సమ్మితము, ఋషులు రహస్యముగా నానతిచ్చినది. వినుండు. బ్రాహ్మణులకు నమస్కరించినచో నిది కార్యము. ఇది అకార్యమునని విచారింప బని యుండదు.
మున్నత్రి వంశమున ధర్మ ప్రభువు అత్రి సమానుడు. అంగుడను ప్రజాపతి యుదయించెను. వాని సుతుండు వేనుడు. మృత్యువు కూతురగు నునీధయందు కలిగిన వాడు. మాతా మహ దోషముచే నాతడు స్వధర్మమును వెనుకబెట్టి కామలోభియై ప్రవర్తించెను. ధర్మము యొక్క హద్దులను దారు మారు సేసెను. వేద ధర్మము నతిక్రమించెను. వాని రాజ్యమున స్వాధ్యాయము వషట్కారమును విన రాదయ్యెను దేవతలు యజ్ఞము లందు సోమముం ద్రావి యెఱుంగరు. హవిస్సుల నారగింపరు. ఆ నర పతికి వినశ కాలము దాపురించె గావలయు యజ్ఞము వలదు హోమములు వలదని శాసించెను. క్రూర బ్రతిజ్ఞ చేసెను. నేను యజ్ఞే శ్వరుడను యజ్ఞకర్తను, యజ్ఞమును నన్ను గూర్చి యజింప నగును. నాకై హోమము లాచరింప వలెనని వాడు శాసించెను. మర్యాద నతిక్రమించి ఉత్పధ గామియై యున్న వానింగని మరీచి ప్రముఖులైన ఋషులు వేన మేము పెక్కు సంవత్సరములు దీక్షా ప్రవేశము గావించెదను. అధర్మము సేయకు, ఇది సనాతన ధర్మము. అత్రి తరువాత నీవు ప్రజాపతియను నవతరించి నాడవు. ప్రజలను బాలింతులని ప్రతిజ్ఞ చేసికద రాజైతివి. అన విని వాడు వారన పరిహసించి దుర్బుద్ధి యనర్ధ పరుడుగాన యిట్లనియె.
ధర్మమునకు నాకంటే కర్త యెవ్వడు? నేనెవ్వని మాట విన వలయును? శ్రుతమున (పాండిత్యమున) వీర్య మందు తపస్సులో సత్యములో నాతో సము డెవ్వరు? సర్వ భూతముల యొక్కయు, ధర్మము యొక్కయు మొదలు తుదియ తెలియని మూర్ఖులు మీరు. నిజముగ నన్నె ఱుగరు. తలచితి నేని యీ యిలాతలము నంతను దహించి వేయ గలను. నీటి వెల్లువల ముంచెత్త వేయగలను. భూమ్యా కాశముల దారులను బంధించ గలను. అనవిని పొగరెక్కి మూర్ఖుడై యున్న వానిని సరి చేయుట యసంభమని మహర్షులు క్రుద్ధులైరి.
వానిని బట్టి కట్టివైచి వాని యెడమ తొడను మథించిరి. అందుండి నల్లని వాడు, పొట్టివాడు జనించి భయ పడుచు దోసిలొగ్గి నిల బడెను. బెదురు చున్న వానిని జూచి అత్రి మహర్షి “నిషీద” (గూర్చుండుము) అనెను. అందుచే వాడు నిషాద వంశమునకు (బోయలకు) మూల పురుషు డయ్యెను. ఆ మీదట “ధీవరులు” చేపలు పట్టు వారిని మేని కల్మషమున వాడు కనెను. వాని వలన కోయలు మొదలగు కొండ జాతుల వాండ్రు జనించిరి. వేనుని కల్మషముచే బొడమిన వారందరు నధర్మ ప్రియులైరి.
ఆ మీదట వేనుని కుడి చేయిని అరణినట్లు మథింపగా నందుండి “అజగవమ” ను ధనువును దివ్య బాణములను గొని కవచముల దాల్చి పృథువు అగ్నివోలె వెలుంగుచు నుదయించెను. అయ్యెడ సర్వ భూతములు సంతుష్టము లయ్యెను. వేనుడా క్షణము స్వర్గ మలంకరించెను. మహానుభావు డయిన పుత్రుని వలన పుంనామ నరకము నుండి రక్షింప బడెను. ఆ పృథుని సన్నిధికి రత్నములు గొని సముద్రము నదులు వచ్చి పవిత్రో దకముల నభిషేకించి నవి. బ్రహ్మయు నంగిరసుడు మొదలగు దేవతలతో నేతెంచెను. స్థావర జంగమము లయిన భూతములు గూడ వచ్చినవి, అందరు నతనికి పట్టాభిషేకము గావించిరి. యథావిధిగ ధర్మ నిపుణులచే నభిషిక్తుడయిన యా చక్రవర్తి తండ్రిచే బాధితులయిన ప్రజల ననురాగముచే రంజింప జేసెను. దాన నతడు ‘రాజు’ యను పేరంచెను. అతడు సముద్రమున కరుగ నుదకములు స్థంభించి నడక కనుకూల మయ్యెను. పర్వతము లాతని టెక్కెమునకు భంగము రాకుండ దారి యిచ్చెను. తలచు కొన్న మాత్రమున ధరణి దున్నకయే సర్వ సస్యములను బండెను. గోవులు కామధేనువు లయ్యెను. పట్టు పట్టునం దేనియులు కురిసెను. ఈ సమయ మందొక యజ్ఞమున సుత్యాహస్సు నందు సూచి యందు మహా మేధావి సూతుడ వతరించెను. అయ్యజ్ఞ మందు ప్రాజ్ఞుడయిన మాగధుడును కలిగెను. వారిర్వురును పృథు చక్రవర్తిని స్తుతించుటకై మునులు బిలువగా నేతెంచిన మహానుభావులు. ఋషులు పృథు చక్రవర్తిని మీరిద్దరు స్తుతింపుడని యాదేశించిరి. అప్పుడు సర్వ ఋషులను గూర్చి యా సూత మాగధు లిట్లు పలికిరి.
అనూత మాగధులు మేము దేవతలను ఋషులను కీర్తించి సంతుష్టుల నొనరించు వారము. ఇతడెవడో యీతని పేరేమో చేసిన చేతయేమో లక్షణ మెట్టిదో కీర్తి యెలాటిదో యెఱుంగుము. చూచుటకు మహా తేజస్వియై కనిపించు చున్నాడు. కాని యేమని యీతని నుతింతుము. అన మునులు జరుగ బోవునీతని సత్కార్యములను భావించి గానము సేయు మనిరి. వారు నాతని పిమ్మటి చరితము నూహించి కొనియాడిరి. అది మొదలు లోకము నందు జరుగు స్తవములు ఆశీర్వాద ప్రధానములయి సూతమాగధ వందిజన ముఖమున ప్రవర్తింప జొచ్చెను. వారి స్తుతికి మిక్కిలి సంతసించి పృథు చక్రవర్తి సూతునకు (అనూ పదేశము) సముద్ర తీర ప్రాంతమును మాగధునకు మగధ దేశమును బహుమాన మిచ్చెను. అవ్వల మహర్షు లందరు పరమ ప్రీతులయి ప్రజలను ద్దేశించి ఈ ఱేడు మీకందరకు వృత్తుల నొసంగ గలడనిరి. అది విని ప్రజలు వేదసుతుని దరికి పరుగు లెత్తిరి.
అత్తఱి నా రాజు విల్లు నమ్ములు దాల్చి భూమిం గూర్చి బరు వెత్తిన నామె పెఱగంది పారి పోయిన నాతడు వెంబడించి యామెం దఱుమ జొచ్చెను. ఆమె పృథుని కిం జడిసి లోకముల వెంట బరువులు వెట్టి వెట్టి తానేగిన చోట నెల్ల యెట్ట యెదుట ధనుర్భాణ పాణియై జ్వతి తాగ్ని వలెనున్న యాఱేనింగని అమరులకేని ఓర్వరాని వాడని కని దిక్కు తోపక యాతనినే శరణందెను. త్రిభువన పూజ్యయైన వసుంధర యంజలించి “స్త్రీ”వధ అధర్మమని కానవే? నేను లేకుండ ప్రజానెట్లు ధరింతువు? లోకము లెల్ల నా యందున్నవి. నా చేతన యీ జగము ధరింప బడుచున్నది. నేను పోయిన ప్రజలెల్లరు వోదురు. అది యెఱుంగుము. నీవు ప్రజా శ్రేయస్సు చేయనెంతు వేని ననుదుద ముట్టింప దగదు. మరియు నొక మాటయు వినుము. నిరపాయమైన యుపాయమున సర్వ కార్యములు సిద్దించును. ఈ ప్రజల ధరింప నేనొక యుపాయము సెప్పెద వినుము. నన్ను సంహరించిన నీవు ప్రజలను బోషింప జాలవు. నేను నీకనుకూల నయ్యెద. కోపముప సంహరింపుము. పశు పక్షులందేని అడుది అవధ్యురాలని యందురు. నీవు ధర్మమును వీడుట తగదు. అని పెక్కు విధముల పలికిన ధరిత్రి పలుకు లాలించి మహామతి కావున యా నృపతి కోపమును నిగ్రహించి వసుమతిం జూచి యిట్టనియె
తనకు గాని యితరునికి గాని యెక్కనికి మాత్రము క్షేమము గల్గుటకు పెక్కు ప్రాణులను సంహరించిన వాని కంతులేని పాపము గల్గును. ఏ యొక దుష్టుడు సంహరింప బడుట వలన పెక్కు మంది జీవుల సుఖము నందుదురో అట్టివాని సంహరించుట వలన పాతకము ఉప పాతకము ననునేవియు గలుగవు. వసుంధరా! నా చెప్పినట్లు జగద్ధితము సేయవేని నిన్ను పెక్కు మంది ప్రజల సేమము నిమిత్తమై ఇదిగో ఇపుడు సంహరించెను. నా శాసనమునకు పెడమొగ మయిన నిన్ను నా బాణముచే నిప్పుడు గూల్చి మెప్పుగౌని ప్రజల గాపాడెదను. ధర్మశీలుర కెల్ల నుత్తము రాలవు నీవు నా శానమునకు గట్టువడి ప్రజల బ్రతికింపుము. ప్రజాధారణ మందు నీవు సమర్థు రాలవు గద! నాకు కుమార్తెవు గమ్ము. అపుడీ భయంకర మైన బాణము నుప సంహరించెదను, అని రాజనెను
ఇది యెల్ల సేనొనరించెదను. సంశయము లేదు. కాని నాకొక దూడను సంపాదింప యత్నింపుము. దాని మూలమున నేను పాలు చేసెదను. ఆదిగాక నన్ను మెట్ట పల్లములు లేనట్లొ నరింపుము. అపుడు నా చేపిన క్షీరము నలు మూలల సమముగా జాల్వారును. నావిని పృథు చక్రవర్తి ధనుష్కోటిచే వేల కొలది కొండలను మీదికి లేవ గొట్టెను. ఇంతకు ముందటి సృష్టి యందు భూతలము విషమముగ నుండెను. ఆయెగుడు దిగుడు నేల యందు పురములు గ్రామములను, విభాగమే లేకుండెను. పంటలు లేవు. గోరక్షణ లేదు. కృషి లేదు. వర్తకము దారి లేదు. సత్యా నృతము (వాణిజ్యము) లేదు. లోభము లేదు. మత్సరము లేదు. పైవస్వత మనువు తరమట్లు నడిచినది. ఇప్పుడు పృథు చక్రవర్తి మొదిలిది యెల్ల యేర్పడినది. ఎక్కడెక్కడ యీ ధరిత్రి సమముగ నుండిన నక్కడ ప్రజలు నివాస మేర్పరచ గొన గోరిరి. ఆనాటికి కంద మూలము లాహారము. అది మిగుల కష్ట జీవనమని విందుము. పృథువు స్వాయంభువ మనుపును దూడ నొనరించి తన హస్తమే పాత్రముగ భూమిని పిదికెను. ఆ పిదికిన క్షీరము సర్వ సస్యస్వ రూపము ఆ అన్నము చేతనే యీ నాటికిని ప్రజలు సుఖ జీవనులగు చున్నారు. ఋష్యాదులు తమ తమ యాహార రూపమైన క్షీరమును తమతమ కభిమతమైన పాత్రము లందు పిదుకు కొనిరి.
ఋషులకు సోముడు వత్సము (దూడ) దోగ్ధ (పిదుకు వాడు) బృహస్పతి. క్షీరము తపోబ్రహ్మము పాత్రము ఛందోమయము దేవతల కింద్రుడు దూడ, దోగ్ధ రవి, పాలు ఓజస్సు (తేజస్సు), పాత్రము కాంచనము. పితృ దేవతలకు దూడ యముడు, దోగ్ధ అంతకుడు. పాలు సుధ (స్వధ). పాత్రము రాజతము (వెండి గిన్నె) నాగులకు తక్షకుడు దూడ దోగ్ధ ఐరావతుడను నాగుడు. క్షీరము విషము పాత్రము సొరకాయ. అసురులకు విరోచనుడు వత్సము (దూడ) దోగ్ధ మధువు. పాలు మాయామయము. పాత్ర ఆయసము ఇనుప గిన్నె (అయోమయము) యక్షులకు దూడ వైశ్రవణుడు. దోగ్ధ రజతనాభుడు. పాలు అంతర్ధానము పాత్ర. మట్టి కుండ రాక్షసేంద్రులకు దూడ సుమాలి దోగ్ధ రజతనాభుడు, పాలు శోణితము (రక్తము) పాత్ర కపాలము. గంధర్వులకు దూడ చిత్రరథుడు పిదుకు వాడు సురుచి పాలు సుగంధము. పాత్ర పద్మము పర్వతములకు దూడ హిమవంతుడు దోగ్ధ మేరువు పాలు రత్నౌషధులు పాత్రము శైలము వృక్షములకు దూడ ప్లక్షము (జువ్వి) దోగ్ధ పుష్పించిన శాలము. వృద్ధి పాలు తెగిన కాలిన చోట మొలపించు శక్తి యనునది. పాత్రము మోదుగాకుల దొన్నె (పాలాశ పత్రము) ఈ విధముగ నీ ధాత్రి నిజముగ ధాత్రియో (పాలిచ్చి పెంచెడి దాదియే) విధాత్రి (జీవన విధాత్రి బ్రతుకు తెఱవు చూపెడి తల్లి) పావని. చరాచర భూతములకు నిలుచు నాదరుపు. (యోని కారణము) సర్వ కామ దోగ్థ్రి సర్వసస్య ప్రరోహణి. ఆ సముద్ర పర్యంతయైన యీ భూమి మధుకైటభుల మేదస్సుచే (మెదడుచే) మేదిని యన ప్రఖ్యాతి గొన్నది. ఈ పేరు వేదవాదులు పెట్టినది. ఈ వల నీమె పృథు నృపతికి కన్న కూతురయ్యెను గావున పృథివి యను ఖ్యాతి గన్నది.
అతనిచే వసుంధర సువిభక్త యయినది సువిశోధిత యయి సస్యములు గనులు గల్గి, పుర పట్టణ గ్రామాదులచే నిండు దనము సంతరించు కొన్నది. వైన్య రాజస్య చూడామణి యిట్టి యసామాన్య ప్రభావుడు రాజ సత్తముడు, భూత, గ్రామముల కెల్ల నమస్కరింప దగినవాడు. పూజింప నర్హుడు. వేదవేదాంగ పారగులైన బ్రాహ్మణులకు గూడ పృథు చక్రవర్తి నమస్కార్యుడు. పార్థివత్వమును గోరు రాజుకు మహానుభావులకు ఆది రాజుగ నభివంద్యుడు. ప్రతాపశాలి శ్రీపృథువు. విక్రమ శీలురైన యోధులకు జయాక్షాంక్ష లయిన వారికి యోధుల కెల్ల ప్రథముడైన పృథువు వంద్యుడు. పృథుని ధ్యానించి, కీర్తించిన యోధుడు ఘోర మయిన సంగ్రామ రంగము నుండి క్షేమముగ మరలి రాగల్గును వాణిజ్య వృత్తినను సరించు వైశ్యులకు విత్త సమృద్ధికై వృత్తి దాతయైన పృథువు వందనీయుడు. శుచివర్తనులై త్రివర్ణముల నుపచరించు శూద్రులకును పృథు చక్రవర్తి నమస్కారార్హుడు. దానవారు పరమ శ్రేయస్సు నంద గలరు మహర్షులార ! మహానుభావు లార! మఱియేమి వినదలతురు? సెలవిండు.
Summary of chapter 4 of the Brahma Mahā Purana is as follows:
The origin and evolution of Vivasvat (the Sun-god, Āditya) are narrated, tracing his birth from Kaśyapa and Aditi. The chapter describes how Vivasvat came to be recognized as the luminous lord of the solar world, his relationship with Saṃjñā (his wife, daughter of Viśvakarman), and the significant progeny born from their union — including Vaivasvata Manu, Yama, and Yamī.