లోమహర్షణ! దేవ దానవ గంధర్వోరగ రాక్షసుల యొక్క ఉత్పత్తిని విపులముగ తెలుపు మనిరి.
స్వయంభువు నాజ్ఞచే దక్షుడు సృష్టి చేయ నారంభించెను. తొలుత మనస్సుచే భూతముల సృజించె. వారు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసాదులు. కాని యా సంతతి యంతగ పెరుగ దయ్యెను. అప్పుడు మైథున ధర్మముచే దానిం బెంప దలచి అసిక్నియను దానిని వీరణుడను ప్రజాపతి కూతురుం గ్రహించెను. తపస్విని లోకముల ధరింప గలదియు నైన ఆమె యందు దక్షు డైదు వేల మందిని గాంచెను. సృష్ఠిని పెంపొందించ దలచిన యా దక్ష పుత్రులంగని దేవర్షి (నారదుడు) మీరేల యీ సృష్ఠి కార్యము మొనరింతురు వలదనియె. అందుచే వారికి వినాశము, అతనికి దక్ష శాపము సంభవించెను. మున్ను బ్రహ్మ కుదయించిన వాడు నారదుడు వీరణుని కూతురగు అసిక్నియం దుదయించి యుండెను. తండ్రివలె దక్షుడు అతనిం గొడుకుగా గనెను. అందు వలన దక్షుని కుమారులు హర్యశ్వులను పేరొందిరి. వారు నారదుని మాట విని యెటకో పోయిరి. అపుడు పరమేష్ఠి (బ్రహ్మ) బ్రహ్మర్షుల పురస్కరించుకొని పోయి దక్షుని క్రోధముప సంహరించుకొన వలసినదని వేడుకొనెను. ఆవల వారిర్వురకు సంధి యయ్యెను. ఆ సంధి యేమనగా “నా కన్య యందు నారదుడు నీకు పుత్రుడయి యుదయింప వలెను” అని. అందులకు దక్షుడు పరమేష్ఠికి ప్రియ యను కన్యనిచ్చెను. ఆమె యందు దక్షశాప భయముచే నారదుడు జనించెను.
ప్రజాపతి కుమారులెట్లు నారదునిచే నాశన మందిరి? ఆ వృత్తాంత మున్న దున్నట్టు మేము వినగోరు చున్నాము.
దక్ష సుతులయిన హర్యశ్వులు ప్రజావృద్ధి చేయగోరి రాగా నారదుడు వారింగని యిట్లనియె.
మీరు మూఢులు. ఈ భూమి ప్రమాణమెంతో యెఱుగరు. అట్లె ఱుగకయే సంతాన ముంగన నెంచినారు. క్రిందును మీదును అంతరము నెఱుంగని వారెట్లు బిడ్డల గాంతురు? అన విని వారు నలు దిశలకు బోయిరి. సముద్రముం జొచ్చిన నదులు వెను దిఱుగని యట్లిప్పటికిని వారు తిరిగి రారైరి. ప్రాచేతసు డయిన దక్షుడు హర్యశ్వు లట్లు పోగా వైరిణి యందు మరి పుత్ర సహస్రముం గనెను. వారు మున్ను నారదుడాడిన పలుకులు స్మరించి దేవర్షి (మనయన్న) బాగుగ చెప్పినాడు. మనమును మన యన్నల జాడనంటి పోవుదము భూమి ప్రమాణ మెఱిగి యా మీద సృష్టి చేయుదము, యని కూడ బలుకుకొని యందరు నన్ని దెసలకుం బోయిరి. వారును ఇంత వరకు వెనుతిరిగి రారైరి. అది మొదలు సోదరుడు సోదరుని జాడ వెదుక బోయెనేని యక్కడ నశించును కాని తిరిగిరాడు. ఇది యెఱింగిన వాడీ పని జేయ రాదు.
దక్షుడా పుత్రనష్ట మెరిగి వైరిణి యందు యరువది మంది గన్యలను మరల బుట్టించెను. అతడు పది మందిని ధర్మునికి, కశ్యపునకు పద ముగ్గురను, ఇరువది యేడుగురను సోమునికి, నల్గురను అరిష్టనేమికి, ఇర్వురను బహుపుత్రునకు, ఇద్దర నంగిరసునికి, ఇద్దరను విద్వాంసుడైన కృశాశ్వునికి నిచ్చెను. వారి పేరులు వినుడు.
అరుంధతి, వసువు, యామి, లంబా, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ వీరు బది మంది. వీరి సంతానమును వినుడు. విశ్వ కుమారులు, విశ్వదేవులు, సాధ్యకొడుకులు సాధ్యులు, మరుత్వతి కొడుకులు మరుత్వంతులు, వసు కుమారులు వసువులు, భాను బిడ్డలు భానువులు, ముహూర్త కొడుకులు మహూర్తులు, లంబ కొడుకు ఘోషుడు, యామి కూతురు నాగ వీధి పృథివికి సంబంధించిన సంతతి యెల్ల అరుంధతి యందు జనించెను. సంకల్పకు విశ్వాత్ముడయిన సంకల్పుడు పుట్టెను. యా మిజయయిన నాగవీధి యందు వృషలుడు బుట్టెను. ప్రచేతస కుమారు డయిన దక్షుడు సోముని కిచ్చిన కన్య లందరు నక్షత్ర నామముల జ్యోతి శాస్త్రము నందు ప్రసిద్ధులయి యున్నారు. జ్యోతి ర్మండలము నందు పురోగ మించువారు దేవతలు. ఖ్యాతి వంతులు మఱి యెనమండ్రు అనలుడు, వసువులు, ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధవుడు, అనిలుడు, అగ్ని ప్రత్యూషుడు, ప్రభాసుడు, అనువారు. ఆపుని కొడుకులు గణింప వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, మునియు. ధ్రువ కుమారుడు కాల భగవానుడు, (లోక ప్రకాలనుడు) లోకమందు కాల గణమున బడునన్న మాట. సోముని కొడుకు వర్చస్సుడు, (ఆయనయే వర్చస్వి) ధవునికి మనోహర అనుదాని యందు దయించిన వారు ద్రవిణుడు, హుతహవ్య వహుడు, శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు. అనిలుని భార్య శివ. ఆమె బిడ్డలు మనోజవుడు అవిజ్ఞాతగతి యను వారిద్దరు. అనలుని కొడుకు కుమారుడు రెల్లుదుబ్బు నందు శోభిల్లు వాడు, అతని తమ్ములు శాఖ, విశాఖ, నైగమేయులను వారు. కృత్తికలు గన్న సంతాన మగుట కార్తికేయు డన బడుచుండు వాడు కుమారుడు. ప్రత్యూషుని కొడుకు దేవలుడని ఋషి. దేవలునకి ఇద్దరు కొడుకులు క్షమాశీలురు, పండితులు, బృహస్పతి చెల్లెలు పరస్త్రీ బ్రహ్మవాదిని. యోగసిద్ధి నంది యెల్ల జగమ్ము సంచరించెను. ఆమె ప్రభాసుని భార్య. అతడు వసువులలో నెనిమిదవ వాడు. విశ్వకర్మయను ప్రజాపతి యామెయందు దయించెను. వేల శిల్పముల కాయన కర్త, త్రిదశలకు (దేవతలకు) అతడు వార్ధకి (వడ్రంగి). సర్వభూషణ శిల్ప కల్పనము చేయువాడు. దేవతా విమాన నిర్మాత యాతడు. కశ్యపుని వలన సురభి ఏకాదశ రుద్రులం గాంచె. ఆమె మహా దేవుని ప్రసాదము వడసి తపస్సుచే ప్రభావిత యయి, ఈ సంగతి గనెను. ఏకాదశ రుద్రులు, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి. రుద్రశతము బురాణము లందు వర్ణింప బడి యున్నది. చరాచర భూత సంఘము వారిచే నిండి యున్నది. కశ్యప ప్రజాపతి భార్యలు అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖన, సురభి, వినత, తామ్ర క్రోధవశ, ఇల, కద్రువు, ముని యనువారు, పూర్వ మన్వంతరము వారు.
చాక్షుష మన్వంతరము నందు సర్వలోక హితము గోరి దేవత లొకకరి కొకరు కలిసికొని వేగముగ రండు, అదితి యందు ప్రవేశించి జనింతము. అందు వలన మనకు శ్రేయస్సు కలుగ గలదు అనుకొనిరి.
లోమహర్షణుడు:
ఇట్లనుకొని యా దేవతలు చాక్షుష మన్వంతర మందు కశ్యపునకు దక్ష కుమార్తె యగు నదితి యందు జన్మించిరి. విష్ణువు ఇంద్రుడు తిరిగి పుట్టిరి. అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశుడు, మహాతేజస్వి యగు భగుడు నను ద్వాదశాదిత్యు లుదయించిరి.
సోముని భార్య లిరువది యేడుగురు మంచి కాంతి వంతులైన కుమారుల గనిరి, అరిష్టనేమి భార్యల యొక్క సంతతి పదునార్వురు జ్ఞానియయిన బహు పుత్రుని యొక్క సంతతి నలుగురు విద్యుత్తులు (మెఱపులు) చాక్షుష మన్వంతర మందు ఋక్ఛాఖీయులు కృశాశ్వుడను దేవర్షి యొక్క కుమారులు. బ్రహ్మర్షి చేత సత్కరింప బడినవారు మహా పురుషులు దేవ ప్రహరణులను వారు జనించిరి. వీరందరూ సహస్ర యుగాంతమున మరల యవత రింతురు. వీరు స్వేచ్ఛా జన్ములు ముప్పది మూడు దేవ గణములు, అని వీరినే పిలుతురు. ఆకాశమున సూర్యునకు దయా స్తమయములు గల్గినట్లు వీరికిని యుత్పత్యవ సానములు గలవు. ప్రతియుగ మందిట్లు దేవతలు గల్గు చుందురు.
కశ్యపుని వలన దితికి హిరణ్య కశిపు, హిరణ్యాక్షులు జనించిరి అని విని యుంటిమి. విప్రచిత్తి భార్య సింహిక. ఆమె పుత్రులు మహా బలవంతులు, సైంహికేయులు. హిరణ్య కశిపుని పుత్రులు బలశాలురు. వారు నల్గురు హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. హ్లాదుని కుమారుడు హ్లదుడు. హ్లదుని కుమారు లిద్దరు. శివుడు, కాలుడు, యనువారు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు అతని కొడుకు బలి. బలి కుమారులు బాణుడు మొదలుగా నూర్గురు. వారందరూ తపో ధనులు. ధృతరాష్ట్రుని మొదలు విప్రచిత్తి వరకు కశ్యప ప్రజాపతికి పెక్కుమంది కలిగిరి. ఈ దానవులకు విప్రచిత్తి ప్రధానుడు. వీరి పుత్ర పౌత్ర గణము గణించి చెప్పుట సాధ్యముగాదు. వీరిలో స్వర్భావని కూతురు ప్రభ.
సురభి ఆవులను గేదెలను ప్రసవించెను. ఇర చెట్లను, తీగలను తృణ జాతులను గనెను. ఖన యక్షులను రాక్షసులను గనెను ముని యను నామె అప్సరసలను గాంచెను. అరిష్ట సిద్ధ గంధర్వులను ప్రసవించెను స్థావర జంగమాత్మకమైన యీ సంతతి కశ్యపునకు సంబంధించినది. వారి మనుమలు, ముని మనుమలు, వేల కొలది పుట్టిరి. ఇది స్వారోచిష మన్వంతరమున జరిగిన సృష్టి, వైవస్వత మన్వంతరము నందు వరుణ దేవతాక మైన క్రతువు జరుగగా బ్రహ్మ హోతగా నుండి చేసిన హోమము వలన కల్గిన సృష్టి నిప్పుడు చెప్పు చున్నాడు. లోగడ కల్పము నందు పుట్టిన సప్త మహర్షులను ఈ కల్ప మందు తిరిగి బ్రహ్మ సప్తర్షులుగా గల్పించెను. ఆ మీద దేవ దానవులకు యుద్ధము జరిగెను. అందు దితి సంతానము రాక్షసులు నశించిరి. దితి కశ్యపునకు మొఱ పెట్టుకొనెను. కశ్యపుడు ఆమె మొఱవిని ఇంద్రుని చంప గలిగిన కుమారుని వరముగా నను గ్రహించెను.
నీ గర్భమందు జనించు వాడు ఇంద్రుని చంప గలడు. కాని నీవు ఆ గర్భమును శుచిగా వ్రతము చేయుచు ధరింప వలెనన నామె యట్లేయని గర్భవతి యయ్యెను. అవ్వల కశ్యపుడామె యందు గర్భాధాన మొనరించి వెళ్ళిపోయెను. ఆమె దేవతల నందరిని నిరోధింప గల్గు తేజస్సును గర్భమున దాల్చి వ్రతము బూని యొకానొక పర్వతమునకు తపస్సు కొఱకేగెను.
ఆమె వ్రతలోప మెప్పుడు జరుగునా యని చూచు చున్న ఇంద్రుడు నూరేండ్ల తరువాత పాదములు గడుగు కొనక పరుండుట జూచి యామె గర్భమున ప్రవేశించి, వజ్రాయుధముతో దానిని ఏడు తునకలు గావించెను. వజ్రహతుడైన ఆ శిశువు రోదనము చేసెను. “మారోదీః” ఏడువకు మని మరిమరి చెప్పెను. ఆ గర్భము ఏడు తునక లయ్యెను. ఇంద్రుడు రోషము గొని దానిని మరి యేడు తునకలు చేసెను. ఆ తునకలే మరుత్తులను పేర నేర్పడిరి. ఆ నలుబది తొంబండుగురును నింద్రునకు సహాయులైన దేవతలు గూడయైరి.
తరువాత దేవతా గణములను ప్రజాపతులను గానొనరించి పృథువు మొదలుగా గలవారికి రాజ్యములను గూడ విభాగించి ఇచ్చెను. హరియే సాక్షాద్విష్టువు, ప్రజాపతియు, పర్జన్యుడును, పవనుడు, జిష్ణువునై ఈ జగత్తును సృష్టించెను. ఈభూత సృష్టిని చక్కగ నెరిగిన వారికి పునర్జన్మము కలుగదు. పరలోక భయమెక్కడ నుండి కలుగును.
Summary of chapter 3 of the Brahma Purāṇa is as follows:
The fourteen Manvantaras — cosmic eras each presided over by a Manu — are systematically described. The names of the Manus, their associated Saptarṣis, Indras, Devas, and the sons of each Manu are enumerated. The chapter establishes the cyclical framework of sacred time in which dharma is upheld in each era through the respective Manu and his divine co-rulers.