రెండు పక్షము లందు ఏకాదశి నాడు ఉపవశించి శ్రద్దా యుక్తుడై లెస్సగా విధానానుసారము స్నాన మాడి మడుగు వస్త్రము ధరించి జితేంద్రియుడై విధి వత్తుగా మనస్సు నిలిపి విష్ణుని పుష్పములతో సుగంధములతో దీప దూప నైవేధ్యములతో బహు విధములగు ఉపహారములతో జప హోమ ప్రదక్షిణములతో నానా విధములగు స్తోత్రములతో దివ్యములు మనోహరము లగు గీత వాద్యములతో దండవత్ గా నమస్కారములతో ఉత్తమములగు జయ శబ్దములతో పూజించి రాత్రి యందు ప్రజాగారము చేసి విష్ణుని యందు పరమ శ్రద్ధ గలిగి ఆ మహనీయుని కథలనో గీతికలనో గానము చేసినచో నరులు విష్ణుని పొందుదురు. ఇది నిశ్చయము. అని వ్యాసుడు పలికెను.
ఓ వ్యాస ముహా మునీ! ప్రజాగరము చేసి గీతికా గానము చేయుట వలన కలుగు ఫలమును వినగోరు చున్నాము. అని మునులు అడిగిరి.
ఓ ముని శ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణు మహిమ గానము చేయుట వలని ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు. భూ లోకమున ప్రసిద్ధి పొందిన అవంతీ నగరమున శంఖ చక్రా గదా ధరుడగు విష్ణువు కలడు. ఆ నగరము చివరలో గానమున నేర్పరి యగు చాండాలుడు కలడు. అతడు సద్వృత్తితో ధనమార్జించి తన సేవకులను పోషించు చుండును. అతడు విష్ణు భక్తుడై ప్రతి మాసమునను దృఢ వ్రతుడై ఏకాదశి నాడు ఉపవసించి రాత్రి ప్రజాగరము చేసి విష్ణుని అవతారములను గూర్చి అతని నామముచే అంకితము లగు గీతికలను సప్తస్వర ప్రస్తారయుక్త ములగు గానము చేయును. ప్రాతః సమయమున ద్వాదశీ తిథిలో విష్ణుని నమస్కరించి స్వగృహమునకు వచ్చితన కూతుళ్లు అల్లుండ్రు మేనల్లుండ్రు పరివారము వీరిని భుజింప జేసి తరువాత తాను భుజించును. ఇట్లు విష్ణు ప్రీతిని కలిగించుచు జీవించు అతనికి చాల వయస్సు గడచెను. ఇట్లుండ ఒకప్పుడు చైత్ర కృష్ణైకాదశి నాడు విష్ణు సేవకై అతడు భక్తి తత్పరుడై పూలు తెచ్చుటకై ఉత్తమ వనమునకు పోయి క్షిప్రా నది యొడ్డున కలి వృక్షము క్రిందనున్న ఒక రాక్షసునకు కనబడెను. ఆ రాక్షసుడు ఈ చాండాలుని తిన గోరెను. నీవు నన్ను ఈనాడు తిన వలదు. నేను రేపు మరల నిజముగా వత్తును. నేనీనాడు పూజ చేసికొన వలయును. కాన రాక్షసా! నన్ను విడువుము. రాత్రి జాగరణము చేసి నేను విష్ణుని సేవింతును. నాకు వ్రత విఘ్నము చేయ వలదు. అని చాండాలుడు రాక్షసుని వేడెను. ఓచాండాలుడా! పదినాళ్ళు నాకు ఆహారము లేక ఈనాడు నీవు నాకు దొరకితివి. నాకు చాల అకలిగా ఉన్నది. నేను నిన్ను విడువను. భక్షింతును. అని పలికిన రాక్షసుని బ్రతిమాలుచు చాండాలుడు దృఢములగు సత్య వచనములు ఇట్లు పలికెను.
బ్రహ్మ రాక్షసా! వినుము. జగత్తునకు అంతటికి సత్యమే మూలము. నేను మరల వత్తునని సత్యముతో శపథము చేయు చున్నాను. నరుడు చేయు పనులకు సూర్య చంద్రులు అగ్ని వాయువులు భూమ్యా కాశములు జలము మనస్సు అహో రాత్రములు యముడు ప్రాతఃసాయం సంధ్యలు సాక్షులు. నేను మరల నీ దగ్గరకు రానిచో వరదార ధనము లందు ఆసక్తి బ్రహ్మ హత్య సురాపానము గురు దార గమనము గొడ్రాలికి శూద్ర స్త్రీకి పతి యగుట పూజారి తనము చేప పంది తాబేలు వీని మాంసము తినుట నిష్కారణముగా మాంసము తినుట వెన్ను మాంసము తినుట, కృతఘ్నత మిత్ర ద్రోహము, మారు మనువాడిన స్త్రీని పెండ్లాడుట, సూతకము కలుపు కొనుట, క్రూర కర్మలు చేయుట, పిసిని గొట్టు తనము, అతిథుల నాదరింప కుండుట, అమావాస్య అష్టమి షష్ఠీ కృష్ణ శుక్లవక్ష చతుర్దశులు ఈ తిథుల యందును శ్రాద్ధము చేసిన తరువాతను స్త్రీతో సంగ మించుట, బహిష్ఠు ఐన స్త్రీని కలియుట, మిత్రుని భార్యను పొందుట, చాడీలు చెప్పుట, కపటము మోసము చేయుట, తేనె దొంగలించుట, బ్రాహ్మణునికి దాన మిత్తునని ఒప్పుకొనినది ఈయ కుండుట, కన్యను గోవును కంచర గాడిదను ఇత్తునని ఈయ కుండుట, స్త్రీ బాలవధ అసత్య మాడుట, వ్యర్థముగా మాట లాడుట దేవతలను వేదములను ద్విజులను రాజులను పుత్రులను మిత్రులను పతివ్రతలను గురువులను నిందించుట, అగ్ని హోతము విడుచుట, నిప్పుపెట్టుట గృహేష్టి చేయుట, ద్విజాధముడై గోవధ చేయుట, భ్రూణ వధ తమ్మునకు పెండ్లి ఐన తరువాత తాను పెండ్లాడుట, అన్న కంటె ముందు తాను పెండ్లాడుట వలన కలుగు పాపములు నేను మరల నీ కడకు రానిచో నాకు తగులును. ఇంకను భయంకర శపథము వినుము. నేను తిరిగి రానిచో తన కన్యపై జీవించుట సత్యమును మఱుగు పఱచి సాక్ష్యము పలుకుట యాగము చేయింప రాని వానిచే యాగము చేయించుట నపుంసకు డగుట శ్రవణము చేయరాని వాని వాని నుండి శాస్త్ర శ్రవణము చేయుట శ్రవణము చేయదగని వానికి శాస్త్రముల శ్రవణము చేయుట సన్యాసి కాని బ్రహ్మచారి కాని కాముకుడై ప్రవర్తించుట వీని వలన కలుగు పాపముల పొందుదును అని చాండాలుడు రాక్షసునకు శపథము చేసెను.
బ్రహ్మ రాక్షసుడు చాండాలుని మాటవిని ఆశ్చర్యపడి ఈ సత్య శపథముతో వెళ్ళి అన్న మాట కాపాడుము అనెను. ఆ చాండాలుడును పుష్పములు తీసికొని దేవాలయమునకు పోయి బ్రాహ్మణున కిచ్చెను. అతడవి నీటితో కడిగి విష్ణుని అర్చించితన ఇంటికి పోయెను. చాండాలుడు ఆనాడు ఉపవసించి గుడి వెలుపల నుండి విష్ణు గీతుల పాడుచు రాత్రి ప్రజాగరము చేసెను. తెల్లవారగనే అతడు స్నాన మాడి విష్ణుని నమస్కరించి తన సత్యమును కాపాడు కొనుటకై రాక్షసుని దగ్గరకు బయలు దేరెను. త్రోవలో తన కెదురైన ఒక నరునకును చాండాలున కును ఇట్లు సంభాషణము జరిగెను. నరుడు “నాయనా! ఎక్కడకు పోవు చున్నావు?’’ చాండాలుడు తనకు రాక్షసుని విషయమున జరిగిన దంతయును చెప్పెను. నరుడు: ’’ధర్మార్థ కామమోక్షములకు శరీరమే సాధనము. కావున వివేకవంతుడు మహా ప్రయత్నముతో నైనను శరీరము రక్షించుకొన వలెను. జీవించినచో కీర్తియు లభించును. మరణించిన వాని మాట ఎవడు తలచును?’’
చాండాలుడు యుక్తి యుక్తముగా ఇట్లనెను. ‘‘అయ్యా నేను చాల శపథములు చేసితిని, సత్యము కాపాడుటకై నేను పోవు చున్నాను.’’
నరుడు “నీవు ఇట్లు మూడ బుద్ధివై ఉన్నావేమి? ఓ సత్పురుషుడా! గోవులను స్త్రీలను ద్విజులను రక్షించుటకును వివాహము విషయమునను సురత సందర్భమునను ప్రాణములును సర్వ ధనమును పోవుచు న్నప్పుడును అసత్య మాడుట పాతకము గాదు. స్త్రీల విషయమున వివాహ సందర్భము నను శత్రువు విషయము నను మోసము ధనహాని ఆత్మ నాశము జరుగు నప్పుడును ఇతరులు అసత్యము చేయు నప్పుడును ధర్మ వాక్యములను పాటించ రాదు. అని మనువు చెప్పినది నీవు వినలేదా?’’
చాండాలుడు ‘‘అయ్యా! అట్లు పలుకకుము. సత్యము లోకము లందు పూజింప బడును. లోక మందలి సర్వ సౌఖ్యములును సత్యముచే లభించును. సత్యము చేతనే సూర్యుడు వెలుగును. నీరు ప్రవహించును. అగ్ని జ్వలించును గాలి వీచును. చతుర్విధ పురుషార్థములు సత్యము చేతనే లభించును. సత్యము పరబ్రహ్మము. ఉత్తమ యజ్ఞము. స్వర్గము నుండి వచ్చినది సత్యము. సత్యమును విడువ రాదు.’’
ఇట్లు పలికి ఆ చాండాలుడు ఆ నరుని వదలి వేసి ప్రాణి ఘాతుకుడగు ఆ బ్రహ్మ రాక్షసుడున్న చోటికి పోయెను. వాడు ఆశ్చర్యముతో కన్ను విప్పారించి తల ఆడించుచు ఇట్లు పలికెను.
‘‘సత్య వాక్యమును అనుపాలించిన ఓ మహాభాగా! మేలు మేలు! సత్యమే లక్షణముగా గల నీవు చాండాలుడు కావని నా అభిప్రాయము. నీవు చేసిన ఈ పనిని బట్టి నీవు శుచియై అవ్యయు డగు ఏ వికారమును లేని బ్రాహ్మణు డవే. శుభ స్వరూపుడ వగు నీతో ధర్మమును గూర్చి కొంచెము మాట లాడెదను. నీవు రాత్రి విష్ణ్వాలయమున ఏమి చేసితివో చెప్పుము’’.
చాండాలుడిట్లు పలికెను. వినుము. రాత్రి కాలమున విష్ణ్వాలయమున నేనేమి చేసితినో ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఆలయమునకు దిగువ వినయముతో వంగియుడి నిలిచి రాత్రి అంతయు ప్రజాగరము చేసి విష్ణు గీతికలు గానము చేసితిని.
నీవు భక్తితో ఎంత కాలము ఆలయమున ప్రజాగరము చేసితివి? అనెను.
ప్రతి మాసము నందును ఏకాదశీ తిథు లందు ఇరువది సంవత్సరములు ప్రజాగరము చేసితిని అని చాండాలుడు నవ్వుచు పలికెను. అది విని బ్రహ్మ రాక్షసుడు
నీవు ఒక రాత్రి ప్రజాగరము చేసి పొందిన ఫలము నాకిమ్ము. అట్లెననే కాని నేను నిన్ను విడువను. అని పలికెను.
ఓ రాక్షసుడా! నా దేహము నీకర్పించితిని. మాటలతో పని యేమి? స్వేచ్ఛగా నన్ను తినుమని చాండాలుడు పలికెను. అయ్యా దయతో నీవు రెండు జాములు ప్రజాగరము చేసితిని అని చాండాలుడు నవ్వుచు పలికెను.
అయ్యా! దయతో నీవు రెండు జాములు ప్రజాగరము చేసి సంగీతము పాడి సంపాదించిన ఫలము నైన ఇమ్మని రాక్షసుడు బ్రతిమాలెను.
అసంబద్ధముగా ఏల మాటాడెదవు? నేను ప్రజాగర ఫలము నీయును. స్వేచ్ఛగా నన్ను నీవు తినుమని చాండాలు డనెను. ఆ మాటవిని బ్రహ్మ రాక్షసు డిట్లనెను., ఏమందుడగు దుష్టబుద్ది ధర్మ కర్మలచే రక్షితుడ వగు నిన్ను చూచుటకు గాని బెదరించుటకు గాని పీడించుటకు గాని శక్తి కలవాడు అగును? అదికాక దీనుడు పాప గ్రస్తుడు విషయ సుఖములచే మోహము పొందినవాడు నరక యాతనలచే పీడింప బడువాడు మూఢుడు అగు వాని విషయములో సత్పరుషులు దయ చూపుదురు. ఇట్టి నామీద నీవు దయచూపి ఒక జాము ప్రజాగరము చేసి సంపాదించిన ఫలమునైన ఇమ్ము. లేదా నీ ఇంటికి మరలి పొమ్ము. నీకు యామ ప్రజాగర ఫలమును కూడ ఈయను. ఇంటికిని మరలి పోను. అని చాండాలు డనెను. రాత్రి చివరలో వినోదార్థము పాడిన పాట ఫలమునైన ఇచ్చి నన్ను పాపము నుండి సముద్దరింపుము. అని బ్రహ్మ రాక్షసుడు బ్రతిమాలెను.
అది విని నీవు పూర్వము ఏ వికృత కర్మము చేసి ఈ దోషరాశిచే ఇట్లు బ్రహ్మ రాక్షసుడ వైతివి?
చాండాలు డడుగగా వినివాడు దుఃఖముచే సంతప్తు డగుచు తాను చేసిన దుష్కృతమును జ్ఞాపకము చేసి కొనుచు ఇట్లు పలికెను.
నేను పూర్వము ఎవడనో ఏమి పాపము చేసి నందున రాక్షసుడ నై పాప యోని యందు జన్మించితినో చెప్పెదను వినుము. సోమయాజియు వేదా ధ్యయనము చేసిన వాడు నగు దేవశర్మ యను బ్రాహ్మణుని కుమారు డగు సోమశర్మ అను వాడనుగా ఉంటిని. యజ్ఞోపవీత ధారణము నకు వేదమంత్ర గ్రహణము నకు అధికారము లేకయు యజ్ఞ కర్మ చేయ వలెనను అసక్తి కల ఒక యజమానుని యజ్ఞ కర్మను జరిపించుట యందు శ్రధ్ద వహించి లోభముచే మోహముచే బాధింప బడిన వాడ నగుచు అగ్నీ ధ్రుడుగా అగ్నీధ్రము అను స్థానమున నుండు ఋత్వికుడిగా ఉంటిని. ఆ యజమానుని ఆ యజ్ఞము ముగియ గానే మూర్ఖుడనై దంభమును అవలంబించి ద్వాదశాహ పండ్రెండు నుత్యాహస్సులతో చేయదగిన మహా క్రతువును చేయింప నారంభించితిని. అది జరుగు చుండగా నాకు కడుపు నొప్పి కలిగెను. అప్పటికి పదినాళ్లు మాత్రము గడచెను. యజ్ఞము ముగియ లేదు. రాక్షస సమయము నందు విరూపాక్షునకు ఆహుతి ఈయ బడుచున్న సమయమున నేను మరణించి ఆ దోషముచే బ్రహ్మ రాక్షసుడ నైతిని. మూర్ఖుడనై మంత్రము సూత్రము స్వరము సరిగా తెలియక యజ్ఞ విద్య తెలియక యజ్ఞము చేయుటచే చేయించుట చే ఆ దోషమున బ్రహ్మ రాక్షసుడ నైతిని. కనుక ఇట్లు పాప మహా సముద్రమున మునిగి యున్న నన్ను నీ ప్రజాగరముతో కడపటి ఒక పాట యొక్క ఫలము నైన దానము చేసి ఉద్ధరింపుము.
అని బ్రహ్మరాక్షసుడు వేడెను. నీవు ఇక నుండి ప్రాణి వధను మాను కొందువేని నా కడపటి పాట ఫల మిత్తునని చాండాలు డనగా బ్రహ్మరాక్షసు డంగీకరించెను. తన ప్రజాగరము లో కడపటి సగము జాములో పాడిన పాట ఫలమును చాండాలుడు వానికి దానము చేసెను. వెంటనే వాడును చాండాలుని నమస్కరించి తీర్థశ్రేష్ట మగు పృథూదక తీర్థమునకు పోయి అక్కడ సంకల్ప పూర్వకముగా ఆహారము విడిచి ప్రాణములు విడుచుటతో ఆ చాండాలు డిచ్చిన గీతికా ఫల బలముచే రాక్షసత్వము నుండి విముక్తు డయ్యెను. పృథూదక తీర్థ ప్రభావమున పదివేల యేండ్లు దుర్లభ మగు బ్రహ్మ లోకమున నిరంతరముగా నుండి పిమ్మట పూర్వ జన్మ స్మృతియు ఇంద్రియు నిగ్రహమును గల బ్రాహ్మణుడై జన్మించెను. ద్విజులారా! అతని కథను మీకు మరల చెప్పెదను.
చాండాలుని కథా శేషమును చెప్పెదను వినుడు. బుధ్ది శాలియు శుచియు అగు ఆ చాండాలుడు అనంతరము తన ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని కథను తలచు కొనుచు వైరాగ్యము చెంది భార్యను కుమారులకు అప్పగించి కోకాముఖ క్షేత్రమున బయలు దేఱి కుమార స్వామి దర్శన మగు వరకు భూ ప్రదక్షిణము చేసెను. కుమార స్వామిని స్కందుని దర్శించి ధారా చక్రమును ప్రదక్షిణము చేసి వింధ్య పర్వతమును చేరి పాప ప్రమోచన తీర్థమున స్నానము చేసి పాప విముక్తుడై తన పూర్వ జన్మము లనేకములు జ్ఞాపకము చేసి కొనెను. ఈ జన్మ పరంపరా విషయము ఇట్లున్నది: ఈ చాండాలుడు ఒక పూర్వ జన్మములో బుద్ది శాలియు వేద వేదాంగములు కడ వరకు నేర్చిన వాడును త్రికరణముల యందు నిగ్రహము కలవాడును అగు భిక్షువుగా నుండెను. ఒకప్పుడు దొంగలు హరించు కొని పోవు చున్న గోవులచే రేగిన ధూళిచే అ భిక్షువు యొక్క భిక్ష కప్పబడగా దాని నతడు వదలి వేసెను. ఆ ధర్మ దోషముచే అతడు చాండాలుడై పుట్టెను. అతడు నర్మదా తీరము నందలి పా పప్రమోచన తీర్థమున స్నాన మాడిన పుణ్యమున మరణా నంతరము వారణాసి యందు మూర్ఖుడగు బ్రాహ్మణ శ్రేష్టుడుగా పుట్టెను. అతడు ముప్పది ఏండ్ల వాడై యుండగా అచటికి యోగ మాయా బలము కలవాడును విరూపుడను అగు సిద్దుడు సంచరించుచు వచ్చి ఇతనికి కన బడెను. అతనిని చూచి ఈ మూర్ఖ బ్రాహ్మణుడు ఉపహాసమున కై అతనిని నమస్కరించి ఓ సిద్ద పురుషా! కుశలమా? ఎక్కడి నుండి వచ్చు చున్నావు? అని ప్రశ్నించెను. ఆ సిద్దుడు తన్ను ఈతడు తెలిసికొనె నని తలచి స్వర్గము నుండి వచ్చుచున్నా ననెను. స్వర్గము నందు నారాయణ ముని తొడ నుండి జన్మించిన యప్సరస యగు ఊర్వశి నెఱుగుదువా? అని మూర్ఖ బ్రాహ్మణు డడిగెను. అమె నారాయణ ముని నుండి జన్మించినది. స్వర్గమునకు అభరణము వంటిది. ఇంద్రునికి చామర గ్రాహణి. ఇట్టి ఊర్వశిని నేనెఱుగక పోవుటేమి? అని సిద్దు డనెను. ఆ మూర్ఖ బ్రాహ్మణు డును సరళ మార్గము విడిచి వక్ర మార్గమున ఇట్లనెను. ఓ మిత్రమా! నా మీద ఆదరము చూపి నా వృత్తాంతము ఊర్వశికి తెలిపి అమె చెప్పిన సమాధానమును నాకు వచ్చి చెప్పు మనెను. సిద్దుడు సరే అనెను. విప్రుడు సంతసించెను. సిద్దుడు మేరు పర్వత సానువు నందలి స్వర్గమునకు పోయి ఈ బ్రాహ్మణుడు చెప్పిన మాట ఊర్వశికి చెప్పెను. కాశీపతి యగు బ్రాహ్మణు డెవరో నేనెఱు గను కనుక నీవు చెప్పిన మాట నిజమని నేనను కొనుటలేదు. అని ఊర్వశి సిద్దునితో పలికెను.
ఊర్వశీ చెప్పిన ఈ మాటలు విని సిద్దుడు వెడలి పోయి చాలా కాలము తరువాత మరల వారాణసికి పోయెను. అతనిని చూచి మూర్ఖ బ్రాహ్మణుడు ఊర్వశి ఏమి చెప్పెనని అడుగగా అమె తాను నిన్ను ఎఱుగ ననెనని సిద్దుడు పలికెను. ఆది విని మూర్ఖ విప్రుడు చిరునవ్వు నవ్వి ఈ మాఱు పోయి నప్పుడు నీవాతనిని ఏ గురుతుతో గుర్తింప గలవని ఊర్వశిని అడుగు మనగా సిద్దుడును సరేయని స్వర్గమునకు పోయి నప్పడు ఇంద్ర భవనము నుండి బయటికి వచ్చు చ్చున్న ఊర్వశిని చూసి మూర్ఖ బ్రాహ్మణుడు చెప్పిన మాట అమెకు చెప్పెను.
అమె ఆ బ్రహ్మణుడు ఏవైన నియమమును పూనినచో దానిని బట్టి అతనిని గుర్తింప గలననెను.
ఆ మాట సిద్దుడు మరల మూర్ఖ బ్రాహ్మణునితో చెప్పగా అతడును నేను ఇక మీదట శకటము భక్షింపను.
ఇది నా నియమమని ఊర్వశితో చెప్పు మనెను. సిద్దుడు సరేయని తాను మరల స్వర్గము మునకు పోయి నప్పుడీ విషయము ఊర్వశితో చెప్పెను. ఇప్పుడు నేనతని నీ నియమమును బట్టి గుర్తింప గలను. ఆ మూర్ఖుడు నన్ను ఉపహాసము చేయుటచే ఇట్లు చెప్పెను. అని పలుకుచు ఊర్వశి వెడలిపోయెను.
సిద్దుడును తన ఇచ్చా నుసారముతో లోక సంచారము చేయుచుండెను. మహా సుందరి యగు ఊర్వశియు వారాణసికి పోయి దివ్య శరీరము ధరించి మత్స్యోదరీ తీర్థమున స్నానము చేయు చుండెను. ఈ సమయమున యాదృచ్చికముగ అచటకు వచ్చిన ఆ మూర్ఖ బ్రాహ్మణుడు అట్టి ఊర్వశిని చూచి కామముచే కలత నొందెను. అందుచే అతడు చేసిన చేష్టలను బట్టి మునువు సిద్దుడు చెప్పిన మూర్ఖ విప్రుడు ఈతడే యని ఊర్వశి గుర్తించి చిఱునవ్వు నవ్వుచు అతనితో ఓ మహాభాగా! నా వలన నీకు ఏమి కావలెనో చెప్పుము. నీ మాట ప్రకారము చేయుదును. నీవు నన్ను విశ్వసింపుము. అనెను. నిన్ను నాకు అర్పణము చేసికొని ఓ సుందరీ! నా ప్రాణములను కాపాడు మని అతడనెను. నేను ఇప్పుడు వ్రత నియమము నందున్నాను. క్షణ కాలము నారాకకై వేచి యుండు మని ఊర్వశి పలుకగా అతడు సరే యనెను. అమెయు స్వర్గమున కేగి ఒక మాసము తరువాత మరల వారాణసికి రాగా ఈ విప్రుడు కృశించి కనబడెను. అతడంత వరకును నిరాహారుడై నదీ తీరమందే నిశ్చయముతో నుండెనని అమె తెలిసికొని వృద్దురాలి రూపము ధరించి వచ్చి నదీ తీరమున శర్కరతో తేనెతో నేతితో నిండిన శకటమును కావించి మత్స్యోదరీ తీర్థమునకు పోయి స్నానమాడి ఒడ్డునకు వచ్చి శకటము కడ నిలిచి ఈ మూర్ఖ బ్రాహ్మణుని పిలిచి ఇట్లు పలికెను. ఓ విప్రా! నేను తీవ్రమగు వ్రతమును సౌభాగ్యము నిమిత్త మాచరించితిని. వ్రతాంతమున ఉద్యాపనము నకై ఇది దానము చేయొ చున్నాను. ప్రతి గ్రహించుము. అనెను.
అతడు ఇట్లనెను: ఇది ఏమి? లోకములో శర్కరతో నిండిన శకటము దానము చేయుదురా? ఓ పూజ్యురాలా! ఆకలిచే ఎండిన కంఠముతో ఉండి అడుగు చున్నాను. చక్కగా చెప్పుము. ఆమె ఇట్లనెను. ఓ విప్రా! ఈ శకటము శర్కరతోను పిండితోను నిండి యున్నది. దీనిని నీవు తీసికొని నీ ప్రాణముల తృప్తి నొందించు కొనుము. ఆలస్యము చేయుకుము. ఈ మాటవిని అతడు ఆకలితో భాదపడు చుండియు జ్ఞాపకము చేసికొని ఇట్లనెను. ఓ పూజ్యురాలా! నేనిది తీసి కొనను. నేను సిద్ద వర్యుని కడ శకటమును భక్షింప ననియమును ఊర్వశికి గుర్తుగా చేసితిని. కనుక దీనిని మఱి ఎవ్వరి కైన దానము చేయుము. అమె ఇట్లు పలికెను. ఓ విప్రా! పూజ్యుడా! నీవు కొయ్యతో చేసిన శకటమును తిననని నియమము పూనితివి. ఇది కొయ్యతో చేసినది కాదు. శర్కరతో చేసిన శకటము. దీనిని భక్షింపుము. నీవును ఆకలిచే చాల బాధనొంది యున్నావు. బ్రాహ్మణుడిట్లనెను: నేను శకటము అని సామాన్యముగా పలికితిని. కాని దేనితో చేసినది అని విశేషణముతో చెప్పలేదు. ఊర్వశి ఇట్లనెన: ఓ విప్రుడా! సరే. నీవు తినకున్నను నీ కుటుంబము వారు తిందురు. నీవీ చక్కెర బండిని కొని పొమ్ము. బ్రాహ్మణు డిట్లు పలికెను. ఓ సుదతీ! నేనిపు డింటికి పోవను. మూడు లోకముల యందును గుణములచే అందరి కంటే అధికురాలును సుందరియు ఆగు అమె ఇక్కడకు వచ్చినది. నేను కామార్తుడనై వేడగా క్షణములో వత్తును. ఉండు మని నన్నోదార్చి అమె వెళ్లినది. ఓ వ్రతస్థు రాలా! అమెయొక్క సత్య వచనము నందు అను రక్తుడనై అమె సంగమము కోరి అమె వెళ్లి ఇప్పటికి మాసము గడిచినను ఇక్కడనే యున్నాను. ఆ మూర్ఖ విప్రుని మాటలువిని ఊర్వశి తన స్వరూపము ధరించి నవ్వుచు భావ గంభీరముగా ఇట్లు పలికెను
ఓ విప్రుడా! నీవు నా దర్శనము గోరి హఠముతో నిష్ఠతో కూడిన మనస్సుతో వ్రతమును నిర్వహించిన మాట సత్యము. నీ విషయము తెలిసికొన గోరి వచ్చితిని. ఓ విప్రా! నేనే ఊర్వశిని. నిన్ను పరీక్షించి నీవు సత్య తపస్కుడు అను ఋషి వని నిశ్చయించితిని. రూప తీర్థమని ప్రసిద్ధి పొందిన శూకరవ క్షేత్రమునకు పొమ్ము. అచ్చట నీకు సిద్ది కలుగును. అప్పుడు నేను నీకు లభింతును.
ఇట్లు పలికి ఆ ఊర్వశి స్వర్గమునకు ఎగిరి పోయెను. అసత్యత పోయి ఋషియు రూప తీర్థమునకు పోయి అచట శాంతి పరుడై నియమ వ్రతములను పూని శుచియై జీవించి దేహ త్యాగా నంతరము ఉత్తమ మగు గంధర్వ లోకమునకు పోయెను. అచ్చట నూరుల కొలది మన్వంతరములు వాస్తవము లగు భోగములను అనుభవించి పిమ్మట భూ లోకమున ప్రజా రంజకుడగు రాజై జన్మించెను. సమగ్ర మగు దక్షిణలతో వివిధము లగు యజ్ఞములు ఆచరించి కుమారులకు రాజ్యము నప్పగించి మరల శూకరవ క్షేత్రమునకు ఏగెను. ఈ రూప తీర్థమున మృతి పొంది ఇంద్ర లోకమునకు పోయి అచట నూరుల కొలది మన్వంతరము భోగము లనుభవించి అచట నుండి దిగి భూమిపై ప్రతిష్టాన నగరమున బుధుని కుమారుడగు పురూరవుడుగా జన్మించి ఊర్వశితో సంగమము పొందెను. ఈ విధముగ సత్య తపస్కుడన బ్రహ్మణుడు శూకరవ క్షేత్రమను రూప తీర్థమున శ్రీ మహా విష్ణువును ఆరాధించి భోగములను అనుభవించి ముక్తిని కూడ పొందెను. (ఈ ప్రతిష్టా నగరము ఈనాడు అలహాబాదు.)
Summary of chapter 121 of the Brahma Purāṇa is as follows:
The nature and operation of divine Māyā — the cosmic illusive power by which Bhagavān Viṣṇu projects, sustains, and withdraws the universe — is philosophically expounded. Māyā is distinguished from the supreme Puruṣa who wields it; it is neither fully real nor fully unreal but is the mysterious power that causes the diversity of phenomena to appear within the undivided reality of Brahman. The relationship between Māyā, Prakṛti, and the individual soul is analyzed.