మార్కండేయుడు ఆ పాపని కడుపు నందుండి వెడలి వెలుపల నొక్కటే సముద్ర మయిన భూమిని నిర్జన మయిన దానిని దర్శించెను. మున్ను చూచిన యా బాలుని కూడ మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నమురమున దీపింప పీతాంబరము ధరించి యా పద్మపత్ర లోచనుడు జగత్తును జేకొని యున్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడ తన ముఖము నుండి వెడలి యా మహార్ణవమున దేలి చేష్టలు దక్కియున్న నా మునిని జూచి
“వత్సా! నాకడుపు నందు బ్రవేశించి విశ్రమించితివా? అందిటు నటు పరిభ్రమించి యేమి వింత జూచితివి? ఓ మునిశ్రేష్ఠ! నాకు భక్తుడవు. నాయండ చేరితివి. అలసితివి. కావున నీకుపకారము చేయ సంభాషించు చున్నాను. నావంక జూడుమని యల్లన నవ్వుచు భగవంతుడనియె.
ఆ మాట విని యుప్పొంగి యొడలు గగుర్పొడవ నీ కన్నుల గనరాని దివ్య రత్నాలంకృతు డయిన యమ్మేటి వేల్పుని మార్కండేయుడు దర్శించెను. అంత నాముని తద నుగ్రహమున మిగుల నిర్మలమై ప్రసన్నమై మరల క్రొత్త సొగసు నొంది యావిర్భవించెను. ఎఱ్ఱని వ్రేళ్ళు గల యా మేటివేల్పు అడుగుల తలవాంచి వ్రాలి సువంద్యము లయిన యా పాద ద్వందము నకు బ్రణమిల్లి హర్ష గద్గదము లయిన మాటలతో కృతాంజలియై యానంద భరితుడై యచ్చెరు వొందుచు మరిమరి జూచి యా పరమాత్మను స్తుతించుట కారంభించెను.
దేవదేవ! మాయా బాల మూర్తిధర! పద్మాక్ష! దుఃఖితుడనై శరణొందిన నన్ను రక్షింపుము. ప్రళయ కాలాగ్నికి నుడికి పోయితిని నిప్పుల వర్షమునకు జడిసి పోతిని. ప్రళయ ప్రచండ వాయువునకు నారిపోతిని. అలసి విహ్వలుడ నయి ప్రథయావర్తమునకు నదిరిపోయి శాంతి గనజాల కున్నాను. ఆకలి దప్పులకు వశుడ నైతిని. పురుషోత్తమా! నేనొక రక్షనిందు గననైతిన. రక్షింపుము. ఈ ఏకార్ణవ వ్రళయ మందు చరాచరము సురిగి పోయిన యీ ఘోరదశ యందు నంతుదరి గన లేకున్నాను. దేవేశ! నీ యుదర గోళమున చరాచర ప్రపంచమును గంటిని. ఆశ్చర్య విషాద ములందు చున్నాను. దిక్కలేని యీ సంసారమున పరమేశ! ప్రసన్నుడవు కమ్ము. ఓ వేల్పుమేటి! ప్రసాదముం జూపుము. దేవనాధ! అనుగ్రహింపుము గ్రహింపుము. జగత్కారణులకు కారణుడవు. నీవ పంచ భూతములు. అహంకారము నీవు. మహత్తత్వము బుద్ధినీవు. ప్రకృతివి. సత్వాది గుణ త్రయము నీవు. నీవ దిక్పాలకుడవు. అష్ట వసువులు నీవు. ఏకాదశ రుద్రులు, ద్వాధ శాదిత్యులు, గంధర్వులు, దేవ దానవులు, మరుత్తులు, పితృ దేవతలు, వాలఖిల్యాదులు, ప్రజావతులు, సప్త ఋషులు, అశ్వినులు, మఱి మనసుకు మాటకు నందని యశేష జీవ సంతతి బ్రహ్మాది స్తంబ పర్యంత బూత భవ్య భవిష్య జ్ఞాలము నీ రూపము. అంతకును మీదనున్న కూటస్థుడవు నీవు. బ్రహ్మాదులు నిన్నెరుగరు. అల్ప మేధసులు నీ జాడ నెట్లెరుగుదురు. నీను నిత్య శుద్ద బుద్ధ ముక్త స్వభావుడవు. ప్రకృతి కవ్వల వాడవు. అవ్యక్తుడవు. అనంతుడవు. అంతట నున్న వాడవు. ఆకాశము వలె శాంతుడవు.
ఇట్లు నిర్గుణుడు, నిరంజనుడు అయిన నిన్ను యెవ్వరు స్తుతింప గలరు. మనసు చెదిరిన నల్పమతి నయిన నేను నిన్ను స్తతించితిని . ఇదెల్ల క్షమింప నర్హుడవు. ఓ అవ్యయ! దేవ దేవేశ! వందనము.
Summary of chapter 55 of the Brahma Purāṇa is as follows:
The sacred shrine of Narasiṃha (the Man-Lion incarnation of Viṣṇu) within the Puruṣottama kṣetra is praised. The legend of Narasiṃha's appearance to slay Hiraṇyakaśipu and protect the boy-devotee Prahlāda is briefly narrated. The merit of worshipping Narasiṃha at this kṣetra — liberation from fear, destruction of enemies, and ultimate deliverance — is enumerated.