బ్రహ్మ మహా పురాణము
20 – జంబూ ద్వీప వర్ణనమ్
క్షీర సముద్రముచే జంబూ ద్వీపము చుట్ట బడినట్లు ప్లక్ష ద్వీపము లవణోదధిచే పరవృతమై యున్నది. జంబూద్వీప విస్తృతి లక్ష యోజనములు, దానికి రెట్టింపు ప్లక్ష ద్వీపము. ప్లక్ష ద్వీపేశ్వరుడు మేధాతిది. వాని కుమారు లేడ్వురు. శాంతమయుడు (జ్యేష్ఠుడు), శిశిరుడు, సుఖోదయిడు, ఆనందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. వారీ ద్వీపము నేలిన వారు. వారి పేర మఠ్యాదా(హద్దు) కౌరవ పర్వతము లేడు గలవు. అట్లే వర్ష పర్వతములు మఱి యేడు గలవు. మునులారా! వాని పేర్లు వినుడు. గోమోదము, చంద్రము, నరదము, దుందుభి, సోమకము, సుమనస్సు, వైభ్రాజము అనునవి.
పుణ్యాత్ములారా! రమ్యములగు నీ వర్ష పర్వతము లందును, వర్షము లందును ప్రజలు దేవ గంధర్వులతో గూడి వసింతురు. అందలి దేశములు పవిత్రములు. వీర్య వంతములు. ఆందు జనులు మృతి నందరు. అధి వ్యాధులు లేక సర్వ కాలము సుఖముందురు. అందు నదులు గూడ ఏడే. సముద్రగాములు వానిపేర్లు ఆనుతప్త, శిఖ, విప్రాశ, త్రిదివ, క్రము, అమృత, సుకృత అనునవి. వినినంతనే పాపములు హరించునవి. ప్రధానము లైన నదులు, పర్వతములు పేర్కొన బడినవి. చిన్నచిన్న నదులు పర్వతములు వేల కొలది గలవు. ఆచటి వారు ఎప్పుడును ఆ నదీ జలములనే త్రాగు చుందురు. కాని నదులు తగ్గవు పెరుగవు.
ఆ ప్రదేశము లేడింటి యందును యుగ వ్యవస్థ లేదు. ఎల్లప్పడు త్రేతా యుగ సమముగనే కాలము నడచును. ప్లక్ష ద్వీపము మొదలు శాక ద్వీపము దనుక జనులు అయిదు వేలేండ్లా యువు గల్గి నీరోగులయి యుందురు, వర్ణాశ్రమ విభాగానుసార మక్కడ ధర్మము నాల్గు విదములుగ నుండును. అక్కడ వర్ణములు నాలుగు. వానిని మీకు చెప్పు చున్నాను వినుడు.
ఆర్యకులు, కురువులు, వివిళ్వులు, భావులు ననుపేర విప్ర క్షత్రియ వైశ్య శూద్రూలు అను నాలుగు వర్ణముల వారుందురు.
జంబూ ద్వీపమున జంబు వృక్షమున్నట్లు అంత పరిమాణము గల జువ్వి చెట్టు ప్లక్ష ద్వీప మధ్య మందున్నది. అందుచే దానికా పేరు గల్గినది, అందు ఆర్యకాది వర్ణముల వారిచే జగత్కర్తయు సర్వేశ్వరుడును సోమ రూపియు నగు నాహరి ఆరాధింప బడును, ప్లక్ష ధ్వీప ప్రమాణము గల ఇక్షు (చెఱకు రసము) సముద్రముచే ప్లక్ష ద్వీప మావరింప బడి యున్నది. మునులారా! ఇట్లు మీకు ప్లక్ష ద్వీపము సంగ్రహముగ వర్ణించితిని. ఇక నాచే శాల్మల ద్వీపమును గూర్చి తెలిసి కొనుడు.
ఇక శాల్మల ద్వీపము, దీనికి వీరుడైన వువష్మంతు డధీశ్వరుడు. వాని కుమారుల నామములతో శ్వేతము, హరితము, జీమూతము’ రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభమునను వర్ష పర్వతము లేడును ప్రసిద్ధములు. శాల్మల ద్వీపము ఇక్షు రస సముద్రముచే పరి వేష్టితము. ఈ ద్వీపము ప్లక్ష ద్వీపమునకు రెట్టింపు ప్రమాణము గలది. అక్కడ రత్న గర్భములైన సప్త కులా చలములు సప్త నదులు గలవు. అందు కుముదము, ఉన్నతము, వలాహకము, ద్రోణము. కంకము, మహిషము, కకుద్మంతము అను పర్వతము లున్నవి. ద్రోణగిరి యందు మహౌషధు లుండును, ఇందలి నదులు శ్రోణి, తోయ, వితృష్టా, చంద్ర శుక్ర, విమోచని, నివృత్తి అనునవి. అవి స్మరణ మాత్రాన పాపముల హరించును.
ఇందలి వర్షములు శ్వేతము, లోహితము, జీమూతము, హరితము, వైద్యుతము, మానసము, సుప్రభము ననునవి. ఇందు చాత్యుర్వర్ణ వ్యవస్థ యున్నది, కపిల = తేనె రంగు, అరుణ = ఎఱుపు, పీత = పసువు, కృష్ణము = నలుపు అను రంగులు గల్గి క్రమముగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిందు నివసింతురు. ఇచట యాగ కర్తలకుపాస్య దైవము విష్ణువు. యజ్ఞ మందు వాయు స్వరూపునిగ నా దైవమును యజ్వలు సేవింతురు. అతి మనోహరమైన యీ ద్వీప మందు దేవతలు సన్నిధి సేసి యుందురు. శాల్మల వృక్ష ముండుటచే నీ ద్వీపమునకు శాల్మల ద్వీపమని పేరు. కుశ ద్వీపము చుట్టును నురా సముద్ర మున్నది. అది శాల్మల ద్వీపమునకు రెట్టింపు విస్తారము గలది.
ఇందు రాజైన జ్యోతిష్మంతుని కుమారులు ఉద్భిదుడు, వేణుమంతుడు, స్వైరధుడు, రంధనుడు, ధృతి, ప్రభాకరుడు, కపిలుడు అను వారి పేరులతో వర్షములు నున్నవి. ఇందు మనుజులతో బాటు దైత్య, దానవ, దేవ, గంధర్వ, యక్ష, కింపురుషులును వసింతురు. ఇక్కడ స్వధర్మానుష్ఠాన పరులయిన బ్రహ్మణాది చతుర్వర్ణ ప్రజలు వరుసగా దములు, శుష్మిణులు, స్నేహులు, మాందహులు ననుపేర నుందురు. అక్కడ పరబ్రహ్మ రూపుడు జనార్ధను డారాధ్య దైవము. అచట జనులు జనార్దను గూర్చి యజ్ఞములు సేసి ఆధికారిక పురుఘలుగా నవతరింప వలసిన పురాకృత పుణ్యకర్మ ఫలమును క్షయింప జేసి కొందురు. అనగా కేవల నైష్కర్మ్య విషయ మయిన ముక్తినే కోరుదురని తాత్పర్యము. విద్రుమము, హేమశైలము, ద్యుతిమంతము, పుష్టి మంతము, కుశేశయము, హరి మందరము ననునవి యచ్చట వర్షపర్వతము లేడు.
ధూతపావ, శివ, పవిత్ర, సమ్మతి, విద్యుదంభస్సు, మహీ యనునవి మరికొన్ని చిన్న చిన్న యేరులు వేల కొలది సర్వపాప హరము లైన వక్కడ నున్నవి. కుశ ద్వీప మధ్యమున కుశస్థంబ మున్నది. అందుచే దాని కాపేరు గల్గినది. ఘృత సముద్రము క్రౌంచ ద్వీపముచే నావృతమయి యట నున్నది,
ఇక క్రౌంచ ద్వీపము కుశ ద్వీపము కంటె రెట్టింపు విరివి గలది. ఇచట ద్యుతిమంతుని కుమారు లేడుగురు పరిపాలకులు. కుశగుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి యనువారు. దేవ గంధర్వ నిషేవితములు రమ్యములు నైన వర్ష పర్వతము లిందున్నవి. అవి క్రౌంచము, వామనము, అంధకారకము. దేవవ్రతము, ధమము, పుండరీక వంతము, దుందుభి అనునవి యొక దానికంటె నొకటి రెట్టింపు ప్రమాణము గలవి. ఇక్కడ దేవగణ ములతో గూడి పుష్కరులు పుష్కలులు ననువారు ధన్యులై చరింతురు. బ్రహ్మణాది చతుర్వర్ణములు నిందు గలవు. ఇందు ప్రధాన నదులేడు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజప, ఖ్యాతి, పుండరీక యనునవి. అక్కడ పుష్కరాదులచే ధ్యాన యోగమున యజ్ఞమందు రుద్ర రూపుడైన జనార్దను డారాధింప బడును. ఇది మీగడ సముద్రముచే ఆవృతము. అది యా ధ్వీప పరిమాణము గలది. దాని చుట్టును శాక ద్వీప మున్నది.
శాక ద్వీప పతియైన భవ్యునికి జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుశమోదుడు, మోదాకి, మహాద్రుముడు నను పుత్రులు గలరు. అందలి వర్షములు వారి పేర నున్నవి. అందేడు వర్ష పర్వతములు ఉదయగిరి, జలధార = రైవతకము, శ్యామము, అంభోగిరి, అస్తికేయము, కేసరి యనునవి. సిద్ద గంధర్వ సేవితమై యిచట శాకమను (టీకు గాని కడిమి గాని) మహావృక్ష మున్నది. దాని యాకుల గాలి తాకినచో పరమా హ్లాదము గల్గును. అక్కడ పవిత్రము లయిన చతుర్వర్ణ ప్రజలతో గూడిన జనపదములు గలవు. ఆచటి జనులు నిరాతంకులు ఏ అభ్యంతరములు లేనివారు నిరోగులు. నదులు మహా పుణ్యములు. పాపభయ హరములు. సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, ధేనుక, గభస్తి అనునవి యేడు చిన్నచిన్న యేరులు, గిరులు వేలున్నవి. జలదాది గిరులపై వసించు జను లానదీ సలిలము లను ద్రావుదురు. ఈ నదులు స్వర్గము నుండి వచ్చినవి. అచటి ప్రజలలో ధర్మహాని సుఖ దుఃఖములు, శాస్త్రము హద్దుమీరి నడచుట అనునవి లేవు. మగులు మాగధులు మానసులు మందగులు నను పేర బ్రాహ్మణాది చతుర్వర్ణ ప్రజ లచట నివసింతురు. శాక ద్వీప వాసుల కుల దైవము విష్ణువు, సూర్య రూపుడుగా యథావిధి శ్రీహరి యీ ప్రజలచే నర్చింప బడును.
శాక ద్వీపము అదే ప్రమాణము గల క్షీరాభ్దిచే నావరింప బడి యున్నది. క్షీరాభ్ది పుష్కర ద్వీప సమావృతము, శాక ద్వీపము కంటె రెట్టింపు ప్రమాణము కలది పుష్కరము. పుష్కర ద్వీప మందు సవనుని కుమారులు మహావీతుడు, ధాతకి యను వారు. వారి పేర వర్షములు రెండు. ఇక్కడ వర్ష పర్వతము మానసోత్తర మనున దొక్కటియే. అది యీ ద్వీపము నడుమ వలయా కారమున నున్నది. ఏబదివేల యోజనముల యెత్తు, అంతే వెడల్పు గలది. అది పుష్కర ద్వీప మండలమును నడిమికి రెండు భాగములు సేయు చున్న ట్లున్నది. దాని మూలమునే యీ ద్వీపము రెండు వర్షములుగా విభక్త మైనది. అవి వలయా కారములు. వాని నడుమ పెద్ద గిరి కలదు. అచటి జనులు పది వేలెండ్లు జీవింతురు.
వారు రాగద్వేష శోకములు లేనివారు. ఆరోగ్య వంతులు వారిలో అధమోత్తమ భేదము లేదు. చంపువాడు చంపబడు వాడును లేరు. ఈర్ష్యాసూయ లెరుగరు, భయము రోషము దోషము లోభము శూన్యములు. మానసోత్తర పర్వతమునకు మహావీత ఖండము వెలుపలిది. ధాతకీ ఖండము లోపలిది. దేవదైత్యులు వసింతురు. ఈ వర్ష ద్వయమున పుష్కర ద్వీపమందు సత్యా నృతము (వాణిజ్యము) లేవు. నదులు లేవు కొండలు లేవు. ద్వీపములు లేవు.
మనుష్య లందరి వేష మొక్కటే. వారు దేవసమ రూపులు. అట వర్ణా శ్రమాచా రధర్మవి చక్షణ లేదు. వేదత్రయము వార్త దండనీతి శుశ్రూష యనునవి లేనేలేవు. ఈవర్ష ద్యయము భూలోక స్వర్గమే. కాలము జరా రోగములు లేక సర్వ సుఖప్రద మగును ఈరెండు ఖండము లందు పుష్కర ద్వీప మందు న్యగ్రోధ (మఱ్ఱి) మహా వృక్షము బ్రహ్మ యుండు స్థానము. బ్రహ్మ యచట సురాసురులచే పూజింప బడుచుండును. తియ్యని నీటి సముద్రముచే నది చుట్టు కొన్నది. దాని ప్రమాణము పుష్కర ద్వీప సమానము.
ఇట్లు ద్వీపము లేడును సముద్రము లేడింటిచే నావరింప బడి యున్నవి. ద్వీపము లన్నియు సమ ప్రమాణములు. సముద్రము లన్నియు వానికి రెట్టింపు ప్రమాణము గలవి. అన్ని సాగరము లందలి నీరు నెల్లప్పుడును నమము. హెచ్చు తగ్గులు లేవు. నిప్పుచే గిన్నెలో నీరు పొంగినట్లు, చంద్రుని వృద్ధి ననుసరించి అందలి నీరు పొంగును. ఆపొంగు క్రుంగు కూడ నన్నిట సమానమే. అన్ని సాగరములు సమముగ పొంగును తగ్గును. శుక్ల కృష్ణ పక్షము లందు చంద్రోదయాస్త మయము లందు పదునైదు అంగుళములు పొంగుచు క్రుంగుచు నండును. పుష్కర ద్వీప వాసు లందరు నన్ని వేళల స్వయం సంప్రాప్తమైన షడ్రసోపేత భోజనము సేయు చుందురు.
స్వాదూదక (మంచి నీటి) సముద్రము చుట్టు లోక మున్నది, దానికి రెట్టింపు బంగారు భూమి, జంతు రహితము. ఆ మీద లోకాలోక పర్వతము పదివేల యోజనములు విరి వైనది, అంతే యెత్తును అంతే లోతు గలది. ఆ శైలము నావరించి చీకటి యున్నది. ఆ చీకటి ఆండకటాహ మంతట నావరించి యున్నది. ఇంత వరకు గల యీ భూమి యేబది కోట్ల యోజనముల ప్రమాణము గలది. బ్రహ్మాండ కటాహముతో ద్వీపములతో పర్వతములతో నీ ధాత్రి విధాత్రి (సృష్టి హేతువు) యై సర్వ భూతములలో గుణాధిక్యము గల దై సర్వ జగదా ధారమై యున్నది.
Summary of chapter 20 of the Brahma Mahā Purana is as follows:
The various hells (narakas) and their specific torments are systematically described. Each hell is named and the sins that lead a soul there are enumerated — from violence against living beings to violations of sacred duties. The agents of Yama administer appropriate punishments, and the chapter serves as a vivid moral teaching on the consequences of adharma.