సత్యవ్రతుడు భక్తితో కృపతో పట్టుదలతో వినయముతో విశ్వామిత్రుని భార్యను భరించెను. మృగముల వేటాడి తెచ్చిన మాంసము నమ్ముని యాశ్రమ సమీపమున చెట్టు కొమ్మకు వ్రేలాడ గట్టెను. ఉపాంశు వ్రతమూని (ఇంద్రియములను మనసును నిగ్రహించి చేయు వ్రతము) ద్వాదశ వార్షిక దీక్షగొని తండ్రి యాదేశమున నాదేశ మందు వసించెను. యజ్ఞ కర్తలకు కుల గురువులకు గల సంబంధము నమసరించి వశిష్ఠు డయోధ్యా రాజ్యమును రాణి వాసమును దానే బర్య వేక్షించెను. సత్యవ్రతుడు మాత్ర మజ్ఞానము వలన భావిదైవ ఘటనము వలనను కుల గురువగు వశిష్ఠునెడ నధికమైన క్రోధము వహించెను. తండ్రి కుమారుని బహిష్కరించు తఱి వశిష్ఠుడు పెక్కు కారణములచే వలదన డయ్యె. పాణి గ్రహణ మంత్రములకు సప్తపదితో సమగ్రత యేర్పడును కావున సత్యవ్రతుడు సప్తపదిలో కన్య నపహరింప లేదు. ఓ బ్రాహ్మణులారా! వశిష్ఠుడా ధర్మ మెఱిగియు నన్ను రక్షించుట లేదని సత్యవ్రతుడు వసిష్ఠునిపై కోపము గొనెను. వసిష్ఠ భగవానుడు గుణ బుద్ధితోనే అట్లు చేసెను. కాని సత్యవ్రతుడు వానిని తటస్థునిగ తలంచెను. తండ్రియగు వసిష్ఠునకు కుమారుడగు సత్యవ్రతునిపై అసంతుష్ఠి కలిగెను. ఆ కారణమున నా రాజ్యామున నింద్రుడు పండ్రెండు సంవత్సరములు వర్షముల లేకుండ జేసెను. అందులకు ప్రాయశ్చిత్తముగా సత్యవ్రతుడు ద్వాదశ వార్షికమైన కఠోర దీక్షను బూన గలడని దాని వలన నీ కులమున కుగల కళంకము పోగలదని యెఱిగియే వశిష్ఠుడా నాడు వన ప్రవేశము వలదన డయ్యె. మాంసము కరవై సత్యవ్రతు డవ్వల క్షుధాతురుడై క్రోధ మోహములచే మిక్కిలి శ్రమించి వశిష్ఠుని కామధేనువు హరించెను. తాను వసించు దేశధర్మము ననుసరించి యాటవిక క్రూర వృత్తిచే దానిం జంపి యా మాంసమును విశ్వామిత్రుని కుమారులచే గూడ దినిపించెను. అది విని వశిష్ఠుం డతని యెడ కుపితుడై యిట్లనియె.
ఓరి క్రూరుడా! ఇపుడు గురు ధనమగు గోవు నపహరించి సంహరించుట యా మాంసమును ప్రోక్షింపకయే నారగించుట యను నీరెండు శంకువులను ( పాపములను) చేసి యుండవేని తండ్రి యెడ జేసిన నీ మొదటి యపరాధమును నిస్సంశయముగా పోగొట్టి యుండెడి వాడను. ఇప్పుడు మూడు శంకువులను జేసి నీవు త్రిశంకు వైతివని వశిష్ఠ మహర్షి పలికెను. అవ్వల దన కుటుంబ భరణము చేసి నాడని ప్రీతుడై విశ్వామిత్రుండు వర మేదేని యడుగుమన నా నృప కుమారుడు సశరీర స్వర్గ మనుగ్రహింపు మని యాచించెను. అనావృష్టి భయము పోయిన తరువాత విశ్వామిత్రుడు వానిం దండ్రి రాజ్యమున నభిషిక్తు జేసి సశరీస స్వర్గము కొఱుకు యజింప జేసెను. దేవతలు వశిష్ఠులు జూచు చుండగనే వాని నమ్ముని స్వర్గ మెక్కించెను.
ఆఱేని భార్య సత్యరధ కేకయ వంశజ. ఆమె పుణ్యాత్ముడగు హరిశ్చంద్రుడను కుమారుని గనెను. ఆ హరిశ్చంద్రుడు త్రై శంకవుడు (త్రిశంకుని కుమారుడు) అను పేర ప్రఖ్యాతి నంచెను. రాజ సూయము గావించి సమ్రాట్టు (చక్రవర్తి) అను యశ మందెను. ఆయన పుత్రుడు రోహితుడు. అతని కొడుకు హరితుడు, హరితుని కొడుకు చంచువు, చంచువు పుత్రుడు విజయుడు. అతడు సర్వంసహా(భూమి) విజేత. అందు వలన నతడు విజయుడన బడెను. వాని కొడుకు రురుకుడు. ధర్మార్థ కోవిదుడైన రాజు వాని కొడుకు వృకుడు. వాని కుమారుడు బాహువు. హైహయులు, తాలంజఘులు నాఱేనింద్రో రాజనిరి. అతని భార్య గర్భవతియై ఔరుని యాశ్రమ మందు జేరెను. బాహువు కుమారుడు సగరుడు. అతడును ధర్మ పరుడు. సత్య నిష్ఠుడు. కృత యుగము వాడు. తల్లికి సవతి పెట్టిన గరముతో (విషముతో) బాటు పుట్టి నందున సగరుడని పేరొందెను. ఔర్వుని యాశ్రమ మందు జనన సమయమున శుక్రుని రక్షణ మొంది క్షేమముగా జన్మించెను. ఆ భార్గవుని వలననే యాగ్నే యాస్త్రము నంది తాల జంఘులను, హైహయులను సంహరించి భూ మండల మెల్ల జయించెను. శక పహ్లవ పారదులను పేరంబరగిన క్షత్రియుల యొక్క ధర్మమును (నాస్తిక ధర్మమును) ఖండించెను.
సగరుడు విషముతో నెట్లు జనించెను. శకాదుల ధర్మములను క్రుద్ధుడై యేల నిరసించెను. ఈ కథ మాకు సవిస్తరముగ నానతి మ్మనిన లోమహర్షణు డిట్లనియె.
బాహువు వ్యసనియయి నందున హైహయులు తాల జంఘులు శకులును నాతని రాజ్యము గాజేసిరి. హైహయుని పక్షమున శకులు యవనులు, పారదులు, కాంబోజులు, పహ్లవులు నను నైదు గణముల వారుకూడ చేరిరి. రాజ్యము పోయి బాహువు వనమున కేగెను. పత్నియు నతని వెంట జనెను. అతడక్కడ ప్రాణములు వాసెను. అప్పటి కతని భార్య గర్భవతి. అమెకు సవతి గరము (విషము) పెట్టెను. వనమం దాసాధ్వి భర్తతో సహగమనము సేయుటకు జితి యెక్కెను. భృగు వంశీయు జౌర్వుడు కరుణగొని యామెను నివారించెను. అయన యాశ్రమ మందా శిశువు గరముతో గూడ జన్మించెను. అందుచే సగరుడను పేరొందెను. జౌర్వుడాతనిని వేదశాస్త్ర బలముచే చదివించి ఆగ్నేయాస్త్ర మందు శిక్షణ మొసంగెను. క్రుద్ధుడైన రుద్రుడు పశువులం జంపునట్లా తడాగ్నేయాస్త్ర బలముచే హైహయుల వధించి మంచి ప్రతిష్ఠ వడసెను. అవ్వల శక యవన కాంభోజ పారద పహ్లవులను నిశ్శేషముగా బరిమార్ప బూనెను. వారు వశిష్ఠుని శరణందిరి. ఆయన వారి కభయ మొసగి సగరుని వారించెను, గురు వచన మాలించి యాతడు వారింగాక వారి ధర్మమును ఖండించి వారందరి వేషములను మార్చెను. అదెట్లన శకుల కర్థ ముండనము (సగము తల గొరుగుట) గావించి వదలెను. యవన కాంభోజులకు సంపూర్ణ ముండనము గావించెను. పారదులను తల విరజోసికొన జేసెను. పహ్లవులకు గడ్డముల నుంచెను. వారెల్లరను నిస్వాధ్యాయ వషట్కారులం గావించెను (యజన యాజనాది వేద కర్మదూరులం జేసెనని భావము.) శకాదులు కోణి సర్పులు మహిషకులు దర్వులు, చోళులు, కేరళులు నను పేర వారందరు క్షత్రియులే. కాని వారి ధర్మ మాతనిచే నిరాకరింప బడినది. అనగా వెలివేయ బడినారన్న మాట. ఇదంతయ వశిష్ఠు నాజ్ఞ చేతనే యాత డొనరించెను.
ధర్మముచే జయ మందిన యా సగర చక్రవర్తి వసుంధర నెల్ల గెల్చి యశ్వమేధ దీక్షగొని గుఱ్ఱమును వదలెను. అ గుఱ్ఱము తూర్పు దక్షిణ సముద్ర ప్రాంత తీరమున సంచరించు చుండగా నెవ్వని చేతనో హరింప బడి భూమి యందు బ్రవేశింప జేయ బడెను. అపుడా రాజు తన కొడుకు లఱువది వేలమంది చేత నీ భూమిని ద్రవ్వించెను. వారందఱు సముద్రముం జొచ్చి భూమిం ద్రవ్విపోయి పోయి ఆది పురుషుడగు హరిని కపిల రూపమున నున్న విష్ణువుం గాంచిరి. అ సమయమున నా దేవుడు నిదురలో నుండెను. వారి రాకచే గల్గిన చప్పుడు వలన నాతడు కను దెఱచెను. అందుండి వెడలిన తేజస్సుచే నా సగరులు నల్గురు తరువాయిగా నఱువది వేల మందియు దగ్ధులైరి. అ మిగిలిన సగం వంశ వర్థములు బర్హికేతువు సుకేతువు భర్మరధుడు శూరుడైన పంచ జనుడు ననువారు. భగవంతుడు కపిలుడు ఱేనికి ఇక్ష్వాకు వంశ మక్షయముగ నుండు నట్లును. మంచి కీర్తిమంత మగునట్లు వరము ననుగ్రహించె. సముద్రుని కుమారునిగ నిచ్చి అక్షయ స్వర్గవాస సౌఖ్యమును గూడ నొసంగెను. సముద్రుడా సగరుని కర్ఘ్యముం గొని వచ్చి యిచ్చి నమస్కరించెను. ఆ పుణ్యకర్మ ప్రభావముచే సముద్రుడు సాగరుడు గూడ నయ్యెను. (సగరుని కుమారుడను ప్రఖ్యాతి నంచెను) సగర చక్రవర్తి యన్య శ్వమేదాశ్వమును బడసి తిఱిగి వచ్చి నూఱశ్వమేధ యాగము లాచరించెను. అతని కుమారులే సాగరులను ప్రఖ్యాతి నందిన వార ఱువదివేల మందియని విన్నాము. అన విని మునులు సగరునికి వీరులగు కుమారు లఱువది వేలమంది యెట్లు కల్గిరి? ఎట్లు విక్రమించిరో తెలుపుమన లోమహర్ణణుం డిట్లనియె
సగరుని కిద్దరు భార్యలు. విదర్భ దేశాధీశుని కూతురు కేశిని పెద్దభార్య. అరిష్టనేమి కూతురు మిక్కి యందగత్తె మహతి యునునది రెండవది. ఔర్వుడు వారింగని, అరువది వేలమంది కొడుకులు గావలెనో, వంశో ద్ధారకుడైన కొడుకొక్కడు గావలెనో కోరుకొండని వరమొసంగె. ఒకతె అరువదివే లమంది కొడుకులను, మరొకతె యొక్క వంశధరుడగు పుత్రుని గోరిరి. అంత నమ్ముని యట్లే యగుగాక అనెను.
పంచజనుడను మహా తేజస్వియగు రాజు ఒకతెకు గల్గెను. రెండవ యామె బీజ పూర్ణమైన యొక తుంబుని (సొర కాయను) ప్రసవించెనని ప్రసిద్ధి. అందు నువ్వు గింజలంత వారు అరువది వేలమంది శిశువు లుండిరి. సమయము ననుసరించి సుఖముగ పెంపొందిరి. వారి నామె ఘృత పూర్ణ కుంభముల నుంచెను. ఒక్కొక్కని పోషణమున కొక్కొక్కతె దాది నేర్ప రచెను. పది నెలలో క్రమముగ నా శిశువు లందుండి బయలు దేరి సగరునికి ప్రీతి వర్థనులైరి.
నారాయణ తేజస్సున బ్రవేశించిన యా మహానుభావులలో నొకడు పంచజను డనువాడు రాజయ్యెను. అతని కుమారుడు వీర్యవంతుడగు నంశమంతుడు. అంశుమంతుని సుతుడు దిలీపుడు. ఖట్వాంగు డనుపేర నతడు సుప్రసిద్ధుడు. ఈతడు స్వర్గము నుండి యీ లోకమునకు వచ్చి ముహూర్త కాలముండి బుద్ధితోను సత్యము తోను ముల్లోకముల నొక్కటి చేసెను. దిలీపుని దాయాది భగీరథుడు. అతడు గంగ నవని కవతరింప జేసిన వాడు. ఆ గంగను సముద్ర మందు గంగ సంగమింప జేసిన మహానుభావుడు. భగీరథుడు సరిచ్చ్రేష్ట యైన గంగ నా విధముగా తన కూతురుగా చేసి కొనెను. అందు వలననే గంగ భాగీరతథి యయ్యెను.
భగీరథుని కుమారుడు శ్రుతుడు. అతని పుత్రుడు నాభాగుడు ఉత్తముడు. నాభాగుని పుత్రుడు అంబరీషుడు (నాభాగి) సింధుద్వీవుని కాతడు జనకుడు. సింధు ద్వీవుని కొడుకు అయితాజిత్తు. అతని కొడుకు అయుతాజిత్తు. అతని కొడుకు ఋతుపర్ణుడు. అక్షహృదయ మెరిగిన ప్రోడ. బలశాలి. నలునికి మిత్రము. ఋతుపర్ణుని కొడుకు అత్తపర్ణి. గొప్ప కీర్తి మంతుడు. వాని కుమారుడు సుదాసుడు ఇంద్రుని స్నేహితుడు. వాని బిడ్డడు సౌదాసుడు రాజై కల్మాష పాదుడు, మిత్ర సహుడనియు పేరందెను. వాని కొడుకు సర్వకర్మ. వాని కుమారుడు అనరణ్యుడు. వాని తనయుడు నిఘ్నుడు. నిఘ్నుని వలన అనమిత్రుడు రఘువు అని ఇద్దరు రాజ శ్రేష్ఠులు గల్గిరి. అనమిత్రుని సుతుడు విద్వాంసుడు దువిదుహుడు. అవ్వాని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు వీరుడగు రఘవు. రఘువు రాముని ముత్తాత. ఇతడు మహా బలుడై అయోధ్యా పట్టణమున మహా రాజుగ నుండెను.
అయన కొడుకు అజుడు. అయనకు దశరథు డుదయించెను. దశరథ కుమారుడు రాముడు. రాముని కుమారుడు కుశుడు కుశనందను డతిథి. అతని పుత్రుడు నిషధుడు. నిషధుని సుతుడు నలుడు. నలాత్మజుడు నభుడు. నభుని బిడ్డడు పుండరీకుడు. వానికి క్షేమధన్వుడు, వానికి దేవానీకుడు నుదయించిరి. దేవానీకుని కొడుకు అహినగువు వాని కొడుకు సుధన్వుడు. వాని కొడుకు శలుడు. శల పుత్రు డుక్యుడు. ఉక్యుని కొడుకు వజ్రనాభుడు. వాని కొడుకు నలుడు. పురాణము లందు నలులిద్దరే ఖ్యాతి కెక్కినారు. ఒకడు వీరసేనుని కుమారుడు రెండవ వాడు ఇక్ష్వాకు వంశజుడు వీరు వివస్వతుని వంశ మందలి తేజస్స మృద్ధులైన రాజులు. ప్రజలకు పోషకుడును శ్రాద్ధదేవుడును నగు అదిత్యుని యీ వంశవృత్తము పఠించునాతడు సంతాన వంతుడయి అదిత్యుని యొక్క సాయుజ్యము నందును.
Summary of chapter 8 of the Brahma Purāṇa is as follows:
The Candravṃśa (Lunar Dynasty) is narrated from Soma through Budha (son of Soma and Tārā) and then through Purūravas, Āyus, Nahuṣa, and their descendants. The chapter traces the great lineage from which the Pāṇḍavas and Kauravas will eventually descend, establishing the sacred pedigree of the Lunar Race.