ఓ మునీంద్ర! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావ మట్టిదే. నీ వలన నెంత విన్నను దృప్తి కలుగుట లేదు. పురాణము లందు విష్ణువు వరాహావతార మెత్తినట్లు విన్నాము. అది విస్తరముగా నానతిమ్ము. వరాహమన స్వరూప మేమి? దేవత యెవరు? ఏ విధమైన యాచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞ కర్తలకు పరలోక మేగు వారికి బ్రాహ్మణులకు నీ చరిత్ర పుణ్య లోకప్రదము. ఆయన కోర తుదతో భూమి నైత్తిన కథ విన గోరెదము. అదిగాక పరమాత్మ యొక్క యవతార విశేషంబులు గూడ దెల్పుమన వ్యాసుండిట్లనియె.
ఇది గొప్ప ప్రశ్న భారము. యథా శక్తిగ దెల్పెదను. అవ్విష్ణు యశస్సు శ్రవణము చేయవలె నన్న తలపు మీకు కల్గుట యదృష్టము. అందు వలన విష్ణు యశ స్సంకీర్తనము విష్ణు లీలలను వినుడు.
విష్ణువు సహస్ర శీర్షుడు. సహస్రాక్షుడు. సహస్ర ముఖుడు సహస్ర కరుడు సహస్ర జిహ్వుడు. సహస్ర కిరీటుడు. సహస్ర భుజుడని యా యజ్ఞ పురుషుని విష్ణుని పురుష సూక్త విధానమున బ్రహ్మజ్ఞులు స్తుతింతురు. హవనము హోమము సవనము (ప్రాతర్మధ్యాహ్న సాయం సవనములు మూడు) హోత హవ్యము (హోమ ద్రవ్యము) పాత్రలు పవిత్రములు వేది దీక్ష సమిధ స్రువము స్రుక్కు సోమము సూర్యుడు ముసలము ప్రోక్షణి దక్షిణాయనము అధ్వర్యుడు సామగుడు (ఉద్గాత) సదస్యుడు సదనము (యజ్ఞశాల) సదస్సు యూపము చక్రము ధ్రువ దర్వి చరువు ఉలూఖలము ప్రాగ్వంశము త్రేతాగ్నులుండు శాల (ఉప సదేష్టులు ప్రవర్గ్యమిందే జరుగును) హ్రస్వములు అణువులు స్థావరములు జంగమములు ప్రాయశ్చిత్తములు అర్ఘ్యము స్థండిలములు (అగ్ని ప్రతిష్ఠ చేయుటకు కల్పింప బడిన ప్రదేశ విశేషములు) కుశలు మంత్రములు యజ్ఞముల వహించు వహ్ని హవిర్భాగము భాగవహము (హవి ర్భాగములను) వహించు పాత్ర విశేషము) అగ్రాసి సోమ భుజుడు హోమము చేయ బడిన శ్రుత్యుక్త ఆయుధములను ధరించిన అగ్నిగ వేదవేత్తలు పిలుతురో యట్టి శాశ్వతుని యజ్ఞేశ్వరుని శ్రీవత్సాంకిత వక్షుడగు విష్ణువు యొక్క యవతార సహస్రము లెన్నో జరిగినవి. జరుగ నున్నవి. చతుర్ముఖ బ్రహ్మ యిట్లు చెప్పెను. విష్ణువు యొక్క యవతారమునకు సంబంధించిన కథలను శ్రద్ధతో వినుడు. ఈ వాసుదేవ మాహాత్మ్యము చరిత్ర దేవ మర్త్య లోకములకు హితకరము. శుభ ప్రదము. సర్వ భూతాంతరాత్మ యవతారములు పెక్కు గలవు. వేయి దివ్య యుగములు నిదురించి యొకానొక పనికై మరల మేల్కొనును. బ్రహ్మ కపిలుడు, త్ర్యంబకుడు, దేవతలు, సప్తర్షులు, నారదుడు, అప్సరసలు, సనత్కుమారుడు మనువు మొదలగు వారిని ఆయన యావిర్భవింప జేసెను. అతడు అగ్ని వంటి తేజస్వి.
సముద్ర మధ్యమందా సనాతన మూర్తి యుండగా ప్రళయ మైన తఱి మధు కైటభు లిద్దరు భగవంతుని చేత వరము లంది యుద్ధము సేయ బూనిరి. కమల నాభుడు నిదురించిన తఱి పుష్కరము నుండి దేవతలు ఋషులు పుట్టిరి. ఆ ప్రాదుర్భావమే పౌష్కర మను పేర పురాణము నందు శ్రుతి సమ్మతమై వర్ణింప బడినది. హరి వరాహ రూపమున నెత్తిన యవతారము శ్రుతి ముఖము. అనగా వేదములే యా మూర్తి యొక్క ముఖాద్యవయవ స్వరూపము లందె నన్నమాట.
అయ్యజ్ఞ వరాహ మూర్తి పాదములు నాల్గు వేదములు. ఆయన కోర యూప స్తంభము. క్రతువు చేతులు. అశ్వినులు ముఖము. అగ్ని జిహ్వ. దర్భలు రోమములు. బ్రహ్మ శిరస్సు. అహో రాత్రములు కన్నలు. వేదాంగములు కర్ణ భూషణములు. ఆజ్యము నాసిక. స్రువము ముట్టి సామ ధ్వనిఘర్ఘర స్వరము. సత్య ధర్మములా శ్రీమంతుని స్వరూపము. ప్రాయశ్చిత్త మాయన ఘోరమైన ముఖము. పశువు మోకాళ్ళు ఉద్గాతి ఆయన పేగు మంత్రము మూపు వేదిక హవిస్సు వాసన (హవ్య కవ్యములు) ప్రాగ్వంశము నానా దక్షతలతో కూడినది శరీరము. ఆసనము శరీర కాంతిపత్ని మణి మయమైన శృంగము వలె లేచి దక్షిణ హృదయము అనేక సత్రమయము యోగ వరహ మూర్తి యొక్క స్వరూపము. ఉపాకర్మాష్టకము దంతములు ప్రవర్గలా శరీర మందలి సుడులు. ఛందస్సు లన్నియు నాయన నడచు దారులు. గాహ్యోపనిషత్తు సశైల వనము సాగరపర్యంతము ఏకార్ణవ మందు మునిగిన భూమిని తన కొమ్ము చివర లోకహితము కొరకు పెల్లగించి ధరించెను. ఈ విధముగ యజ్ఞ వరాహమూర్తి చేత వసుంధరా దేవి భూత హితార్ధ ముద్ధరింప బడినది.
నరసింహ రూప మెత్తి హరి హిరణ్యకశిపుని సంహరించిన కథ వినుండు. కృత యుగ మందు దైత్యులకు మొదటి పురుషుడు. హిరణ్య కశిపుడు పదివేల పదునేను వందల సంవత్సరము లుపవాసము సేసి మౌనము బూని తీవ్ర తపస్సు చేసెను. వాని శమ దమములకు బ్రహ్మ చర్యమునకు తపో నియమములకు బ్రీతినొంది భగవంతుడు స్వయంభువు స్వయముగా హంసలను బూన్చిన సూర్య ప్రభమైన విమానమున ఆదిత్యులు వసువులు మరుత్తులు దేవతలు రుద్రులు వెన్నంటి రాగా యక్ష రాక్షసులు కిన్నరులు దిక్కులు విదిక్కులు నదులు సముద్రములు నక్షత్రములు ముహూర్తములు మహా గ్రహములు తపో వృద్ధులైన సిద్ధులు విద్వాంసులు పుణ్య ఋషులు మొదలగు పరివారముతో వచ్చి
నీ తపస్సునకు సంతసించితిని. నీకు భద్రమగుగాక. ఇష్టమైన వరము కొరుము సిద్ధినందుమనెను.
హిరణ్యకశిపుడు:
పితామహ! దేవాసుర గంధర్వాదు లెవ్వరును గోపించి నన్ను శపింప రాదు. ఇదియే వరము. శస్త్రాస్త్రములచే చెట్లచే గిరులచే నెండిన తడసిన దేనిచే గాని క్రింద గాని పైన గాని కాకుండ ఒక్క చేతితో మాత్రమే సైన్య సపరి వారముగ నన్ను చంప గల వాడే నాకు మృత్యువు గావలెను. నేనే సూర్య చంద్రులు వాయువు అగ్ని నీరు అంతరిక్షము ఆకాశమునై యుండ వలెను. కామ క్రోధములు నేనే. ఇంద్ర యమ వరుణ కుబేరులు నంతయు నేనే కావలె నన
యివిగో దివ్యబాణములు నీకిచ్చుచున్నాను. ఇవి యద్భుతములు. నీవు కోరిన కోరికలు వానిచే బొందెదవు. సందియము లేదు.
అని వైరాజమని శ్రుతి పిలిచెడి బ్రహ్మ సదనమునకు బ్రహర్షిగణ సేవితుడై వేంచేసెను.
అటుపై దేవ నాగ గంధర్వ మునులు బ్రహ్మ వలన జరిగిన ఈ వర ప్రదాన విషయము విని బ్రహ్మకిట్లనిరి.
స్వామి! ఈ నీ విచ్చిన వరము వలన నా యసురుడు మమ్ము బాదింప గలడు. దయజేసి వాని వధ విషయ మాలోచింపుము.
నీవు ఆదికర్తవు హవ్య కవ్యములను సృష్టించిన వాడవే నీవు. అన బ్రహ్మ
త్రిదశులార! చేసిన తపస్సు యొక్క ఫలమవశ్య మనుభవింప వలసినదే. తపస్సునకు చివర విష్ణు భగవానుడు వానిని వధించును.
అన విని దేవతలు సంతసించి స్వస్థానముల కేగిరి.
వాడు వరము లభించిన క్షణములో పొగరెక్కి మున్యా శ్రమము లందు వ్రత నిష్టులై సత్మ ధర్మరతు లైన దాంతులను శాంతులను హడల గొట్టెను. అట్లే స్వర్గమున కేగి దేవతల నోడించెను. ముర్లోకముల వశము జేసుకొని స్వేచ్ఛా సంచారియై దైత్యులను యజ్ఞీయులను (యజ్ఞ భాగార్హులను) దేవతలను ఆయజ్ఞీయు లను గావించెను. ఆదిత్యులు మొదలుగా దేవ వర్గము విష్టుని శరణొందిరి.
దేవేశ్వరా! రక్షింపుము. హిరణ్యకశిపుని వలన మాకిప్పుడు భయము వచ్చి పడినది. నీవు గదా మాకు పరమ దైవము. పరమ గురుడవు. పరమ ధాతవు. కమల లోచన! అదితి వంశజయము నకు శరణమగు మనిరి.
జడియకుడు. అభయ మిచ్చు చున్నాను. మనువటి వలె స్వర్గము త్వరలో పొంద గలరు. ఇపుడే నేను వరదాన దర్పితు డైన వానిని సపరివారముగ సంహరించు చున్నాను. అని యిట్లు పలికి దేవతలను బంపి భగవంతుడు హిరణ్య కశివుని తావునకు వచ్చెను. సగము నర శరీరము సగము సింహ శరీరము సేసి చేతితో చేయిని తాకుచు దట్టపు మేఘము వంటి శరీరము మేఘ గర్జనము వంటి గర్జనము గొని మెరయుచు మేఘమంత వేగముగ వచ్చి యాకలి కొనిన పెద్ద పులి వలె నున్న యా రక్కసుని పొగరెక్కి యున్న రక్కసులచే రక్షణ యివ్వ బడుచున్న వారిని సంహరించెను.
నృసింహు జెప్పితిమి. ఇక వామనుని వినుండు. బలి యజ్ఞ మందు బల శాలియైన విష్ణువుచే మూడడుగులచే మహాసురులు సంక్షోభింప జేయ బడిరి. విప్రచిత్తి బృహత్ కీర్తి మొదలు శంబరుడు దాక గల రాక్షసులు శతఘ్ని చక్ర ముసలము లూని అశ్వ యంత్రములు బూని బింది పాల శూల ఉలూఖలములు జేబూని పరశ్వధము లూని పాశ ముద్గర పరిఘా యుధములు గొని పెద్ద బండలు గొని యుద్ధమునకు నడిచిరి. వారి ముఖములు తాబేలు వలె కోడివలె గుడ్ల గూబల వలె నుండెను. కొందరు గాడిదలు ఒంటెలు పందులు పిల్లులు నెమళ్ళ వంటి ముఖములు గలవారు. మొసళ్ళు మేకలు ఎడ్లు గొర్రెలు గేదెలు దున్న పోతుల అట్టి మొగములతో నుండిరి. ఉడుము ముఖము కొందరిది. చుంచులు కప్పలం తోడేళ్ళం బోలిన వారు కొందరు. అశ్వ ముఖులు క్రౌంచ ముఖులు (బెగ్గురు పక్షులు) మయూర ముఖులు కొందరు. కొందరు గజ చర్మము కృష్ణాజినము ధరించిరి. నల్లని బట్టలు కట్టు కొనిరి. కొందరు తల పాగలు కొందరు కిరీటములు ధరించిరి. కొందరికి కుండలము లున్నవి. జుట్టు విరబోసి కొనిరి కొందరు. శంఖము వంటి మెడలు గల్గి నానా మాల్యాములు గంధములు పూసికొని నానా వేషధారులై అందరు తమ ఆయుధములం పచారు సేయుచున్న హరిని సమీపించిరి.
విష్ణువు పాదములతో కరతలముతో రక్కసులం గొట్టి భూమిని లాగు కొనెను. అతడడుగ డుగున నాక్రమించి చంద్ర సూర్యులు రొమ్ము దానందాక బెరిగి నాభిదాక నంతై యింతంతగుచు సర్వ మాక్రమించి సర్వంసహ నింద్రున కొసంగెను. ఈ త్రివిక్ర మావతార వైభవమును వేద విదులు వర్ణింతురు. ఇది విష్ణుయశస్సం కీర్తనము.
భూతాత్మ యగు విష్ణువు యొక్క కేవలక్షమాల క్షణమైన యవతారము దత్తాత్రేయుడను పేర వచ్చి ప్రఖ్యాతి జెందినది. వేదములు నశింప ప్రక్రియ యజ్ఞలు నశింప చాతుర్వర్ణ్యము సంకరమై ధర్మము శిథిలమై అధర్మము బెరుగ సత్యము చెడి అసత్యము పెరుగ ధర్మము వ్యాకులము గాగ యజ్ఞముతో క్రియలతో నతడు వేదములను పునరుద్ధరించెను. చాతర్వర్ణ వ్యవస్థ నా మహాత్ముడు కాపాడెను. మరియు హైహయ రాజ వంశము వాడైన బుద్ధిమంతు డగు కార్తవీర్యున కాయన వరమిచ్చెను. ఈ నీ బాహువులు రెండును నా నిమిత్తముగ వేయి బాహువు లగును. సర్వ వసుధను పాలింతువు. యుద్ధము నందు శత్రువులకు జూడ నశక్యుడ వగుదువు. ఈ నీ యవతారము విష్ణువు యొక్క యవతారము.
ఇటుపై మహానుభావుడగు పరశురాముని యవతార మయ్యెను. అందు వేయి బాహువుల చేత దుర్జయుడైన కార్తవీర్యార్జునుని యాయన సంహరించును. రథము నందున్న కార్తవీర్యుని పరుశురాముడు పుడమిపై పడగొట్టి యప్పటికిని మేఘము వలె గర్జించు చున్న వానిని హడ లగొట్టి వేయి బాహువులను గొడ్డలిచే నఱికెను. వాని జ్ఞాతులను గూడ గొట్టెను. కోట్లకొలది క్షత్రియులతో నిండి మేరు మంథర పర్వత భూషణమైన పృథివి ఇరువది యొక్క మార్లు దండెత్తి నిక్షత్రియ మొనర్చెను. ఈ పాపము పోవుట కాయన అశ్వమేధము గూడ సేసెను. మహాదాన పవిత్రమైన నయ్యజ్ఞ మందాతుడు మరీచి వంశము వాడైన కశ్యపునకు తాను గెల్చిన వసుమతిని దక్షిణగా నిచ్చెను. మరియు నా యశ్వమేధమున గుఱ్ఱములను రథములను ఏనుగులను అక్షయమైన బంగారమును గోవులను దానము సేసెను. ఇప్పుడును భృగు నందనుడగు (భార్గవుడు) పరశురాముడు లోకహితము కొరకు మహా తపస్సు సేయుచు శ్రీమంతుడై దేవుని వలె నున్నాడు. ఇది, దేవపతి యవ్యయుడు శాశ్వతుడు నైన విష్ణువు యొక్క పరశురాముడను పేరి యవతారము.
ఇరువది నాల్గవ త్రేతాయుగ మందు విశ్వామిత్రుని పురస్కరించు కొని దశరథునకు కమలాక్షు డవతరించెను. ఆయన తనను నాల్గు విధములుగ నొనరించు కొని సాక్షాత్ సూర్యుని వలె వెలుంగుచు రాముడను ప్రసిద్ధి నొందెను. లోకా నుగ్రహమునకు రాక్షస నిగ్రహమునకు ధర్మ సమగ్ర వృద్ధి కొరకు మహా కీర్తిశాలి దయ చేసినారు. సర్వభూత హితుడు నరేంద్రుడని యాయన నందురు. సర్వ ధర్మజ్ఞు డాతడు. లక్ష్మణు డనుసరింప పదునాల్గేండ్ల రణ్యమున వసింసి. తపస్సు చేసెను. ఆయన గృహిణి సీత. జగత్ర్పసిద్ధురాలు మున్నేను చెప్పిన మహాలక్ష్మియే సీతగా భర్త ననుగమించినది. జన స్థానమున వసించుచు నాయన వేల్పుల కార్యమును జక్క పెట్టినాడు. ఆయన కపకారి యైన పరమ క్రూరుని రావణుని సీతజాడ నెరిగి బోయి సంహరించి నాడు. ఆ రావణుడు దేవాసుర యక్ష రాక్షస నాగాది గణముల కవధ్యుడు. కారు మేఘ మట్లున్న వానిని రాక్షస కోట్లు వెంబడించినవి. ముల్లోకములు నా రావమెత్త జేసినందున (ఏడ్పించి నందున) రావణుడను పేరు గన్న యా రాక్షస రాజును దుర్జయుని దుర్మదుని దృక్తుని శార్దూల విక్రముని దుర్నిరీక్ష్యుని వరదాన గర్వితుని మంత్రులతో సేనలతో గూడ సమూలముగ రామచంద్ర ప్రభువు సంహరించెను. అచేసిన రావణ సంహారము సర్వ జగత్సంహారము చేసిన భూతపతి (శివుని యొక్క) చేతవలె దీవించెను. సుగ్రీవుని కొరకు మహా బలుడైన వానరేంద్రుడు వాలి నిహతు డయ్యెను. సుగ్రీవు డభిషిక్తు డయ్యెను.
మధువను రాక్షసుని కుమారుడు లవణుడు. వాడు మధువన మందు సంహరింప బడెను. మునుల యజ్ఞములను జెరచిన మారీచ సుబాహులు శ్రీరామునిచే నిహతులైరి. మరి యెందరో రాక్షసులు సంహరింప బడిరి. శాప వశులైన గంధ్వరులు విరాధ కంబధు లాయనచే గూలిరి. ఆయన బాణము లగ్ని రవితేజ స్స్వరూపములు. బంగారపు విచిత్రమైన పుంఖములు కలవి. ఆ మహానుభావునకు విశ్వామిత్రుడు అమోఘము లైన శస్త్రాస్త్రములు నొసంగెను.
మహానుభావుడైన జనక చక్రవర్తి యొక్క యజ్ఞ మందు రాముడు శివ చాపమును విలాసము గనెత్తి విరచెను. ఈ పనులు సేసి ధర్మమూర్తి రామమూర్తి యవిఘ్నముగ పది అశ్వమేధ యాగములు సేసెను.
రాముడు రాజ్యము ప్రశాసించు చుండ దొంగ తనములు లేవు. వైధవ్య దుఃఖము లేదు. సర్వము శుభ మయ్యెను. వాయు జలాగ్న్యాది భూత ప్రకోపము వలని భయము లేదు. పెద్దవాండ్రు బాలురకు ప్రేత కార్యములు చేయుట లేదు. క్షత్రియ జాతి బ్రహ్మ చర్య పరమై యుండెను. అనగా బ్రాహ్మణుల కధీనులై ప్రవర్తించిరి. వైశ్యులు క్షత్ర పరులైరి. శూద్రులు మూడు వర్ణముల వారు చెప్పినట్లు వినిరి. అహంభావము లేని వారైరి. స్త్రీలు భర్తలను భర్త భార్యను అతిక్రమించి నడువ లేదు. సర్వ జగత్తు ప్రశాంత మయ్యెను. భూమి చోర రహిత మయ్యెను. రాము డొక్కడే భరించు వాడు (భర్త) రాము డొక్కడే పాలించు వాడు. పుత్ర సహస్రములతో ననే కవర్ష సహస్రములు ప్రజలు జీవించిరి. ప్రాణులు రోగము లేకుండా యుండెను. దేవతలకు ఋషులకు మనుష్యులకు నన్యోన్య సామరస్యము పృథివి యందు నెలకొల్పెను. ఇచ్చట పురాణజ్ఞులు రాముని యెడల చంచలమైన తత్వ జ్ఞానము గలవారు. ఆ బుద్ధి మంతుని మాహాత్మ్యమును గురించి యీకింద్రి విధమైన గాథను గానము సేయుదురు.
రాముడు చామన చాయ మేనివాడు. రక్తాంత లోచనుడు. కళకళ లాడు నెమ్మోము వాడు. అజాను బాహువు. ప్రసన్న ముఖుడు. సింహము నూపురము వంటి నూపురము గలవాడు. మహా వీరుడు. ఆ రాముడు పది వేలేండ్లు రాజ్యము సేసెను. ఆయన రాష్ట్రమున ఋగ్యుస్సామ వేదముల యొక్క ఘోషము జ్యాఘోషము (ధనుష్టంకారము) యెడతెరగ కుండెను, ఇవ్వండి తినండి యన్న ధ్వని నిర్విరామముగ వినిపించెను. సత్వ సంపన్నుడు గుణ సంపన్ను డైన రాముడు కేవలము తన తేజస్సుచే దేదీప్యమాను డయ్యెను. రామ చంద్రుడు చంద్రుని సూర్యులను మించి తేజరిల్లెను. పవిత్ర క్రతు శతము సంపూర్ణ శ్రేష్ఠి దక్షిణమైన దాని నతడు యజించెను. అయోధ్యను విడచి మహాబలుడు రాఘవుడు దివమ్మున కేగెను. ఇక్ష్వాకు కుల నందనుడైన దశరథ నందనుడు సగణముగ రావణుని జంపి స్వర్గ మాక్రమించెను.
మహాత్ముడైన విష్ణువు యొక్క మరొక యవతార వర్ణనము ఈ తరువాతి యవతారము. ఇది సర్వలోక హితమునకై మాధుర కల్పము నందు వచ్చినట్లు విఖ్యాతి గన్నది. ఇందు సాల్వ చైద్య కంస ద్వివిద వృషభ కేశి పూతనా రిష్టాదులను కువలయా పీడ చాణూర ముష్టి కాదులను మానుషా కారముతో వచ్చి సంహరించెను. ఇందే బాణుని వేయి బాహువులు తెగినవి. నరకుడు కూలెను. కాలయవనుడు గడతేరెను. అనేక మంది రాజుల యొక్క సర్వ రత్నములు (సర్వ ద్రవ్యము లందు సర్వశ్రేష్ఠ వస్తువులు) ద్వారక కుంగొని రాబడినవి. ధుర్ధర్షులైన రాజులు భూతలమున కొరిగిరి. ఇది లోక హితమునకు వచ్చిన పరమాత్మ యొక్క యవతారము.
కల్కి యవతారము
కల్కిమూర్తి శంభల గ్రామమున విష్ణు యశస్సను పేరున సర్వలోక హితమునకు నవతరించును. ఇవే గాక దితితో దేవ గణములతో వచ్చిన యవతారములను బ్రహ్మవాదులు పురాణము లందు గీర్తించి యున్నారు. ఈ యవతార కీర్తన మందు దేవతలు గూడ తబ్బిబ్బు వడుదురు. వేద ధ్వనితో బాటు పురాణ కీర్తన ప్రవచనము జరుగ వలెనను నుద్దేశ్యముతో నా యవతార చరిత్ర వర్ణింప బడినది. కీర్తనీయుడైన సర్వ జగద్గురులైన విష్ణువు యొక్క యీ చరిత్ర కీర్తించుట వలన పితృ దేవతలు సంప్రీతు లగుదురు. మరియు విష్ణువు యొక్క ఈ కథ కృతాంజలియై విన్నవాడు యోగీశ్వరేశ్వరుడు ఐన యా స్వామియొక్క యోగ మాయ విలాసములను విన్న నరుడు సర్వ పాపముల నుండి విమోచన నుండి సమృద్ధి యైన బుద్ధిని (జ్ఞానమును) విస్తారము లైన భోగములను భగవత్ ప్రహదము వలన శీఘ్రముగ బొందును. మునీంద్రులార ఇట్లు నాచే నమిత తేజస్వియైన విష్ణువు యొక్క పుణ్యా వతారములు సర్వపాప హరములు. సమగ్రముగా కీర్తింప బడినవి.
Summary of chapter 106 of the Brahma Purāṇa is as follows:
The specific torments inflicted upon sinful souls in the various narakas are described in vivid detail. Each sin — from failure to observe dharma to violence, theft, ingratitude, and irreverence — is matched with an appropriate hell and its torments. The chapter functions as a moral compendium cataloguing sins and their precise consequences, reinforcing the purāṇic teaching that no action, good or evil, goes unaccounted.