బ్రహ్మ మహా పురాణము
241 - వసిష్టకరాల జనక సంవాదే క్షరాక్షర విచార నిరూపణమ్
అక్షర తత్త్వమును చేరిన వారు సంసారమున మరల అవృత్తిని పొందరు. క్షర తత్త్వమును చేరిన వారు మరల సంసారమున అవృత్తు లగుదురు. అని తెలిపితిరి. ఈ రెండు తత్త్వములను వివేచించి తెలుప ప్రార్థింతుము. వేద తత్త్వజ్ఞులును మహా భాగులు నగు ఋషులును మహాత్ము లగు యతులును నీవు జ్ఞాన వేత్తలలో శ్రేష్టుడ వని ప్రశంసించు చున్నారు. ఇట్టి మీ నుండి ఈ విషయమును మేము వినగోరు చున్నాము. ఉత్తమామృతమును ఎంత వినియు మేము తృప్తులగుట లేదు.
ఈ విషయములో మీకు పురాతన మగు వసిష్ఠ జనక సంవాద రూపమగు ఇతిహాసమును వినిపింతును. ఋషులలో శ్రేష్ఠుడును సూర్య తేజో యుక్తుడు నగు తన సభలో కూర్చున్న వాడు నగు వసిష్ఠుని శ్రేయః ప్రద మగు ఉత్తమ జ్ఞాన విషయమున ప్రశ్నించెను. ఆ వసిష్ఠుడు పరమాత్మ తత్త్వమును బాగుగా నెరిగిన వాడు. అధ్యాత్మ విషయమున నిశ్చయాత్మక జ్ఞానము కలవాడు. అట్టి ఋషి వర్యుని జనకుడు దోసిలి యొగ్గి నమస్కరించి తన హృదయము నుండి ఉత్పన్న మైనదియు మధురమును చక్కగా ఏర్పరచుకొన బడినదియు నగు పై ప్రశ్నమును అడిగెను.
బ్రహ్మ యొక్క పగటి సమయమున పరమాత్ముడగు నారాయణుడు సృష్ఠిని జరుపును. రాత్రి కాగానే దానిని రుద్ర రూపమున సంహార మొనర్చి నిద్రించును. మరల పగలు కాగానే సృష్టి నారంభించును. అణిమ లఘిమ మొదలగు అష్ఠ సిద్దులకు ఈశ్వరుడు అవ్యయ జ్యోతీ రూపుడు అన్ని వైపులకు అంతట పాణి పాదములు నేత్రశిరో ముఖములు కర్ణములు కలిగి సాంఖ్య శాస్త్రము నందు బహుధా నామములతో వ్యవహరింబడుచు విచిత్ర రూపుడు విశ్వాత్ముడు ఏకాక్షరుడు అని శాస్త్రములలో చెప్ప బడుచు ఏకాత్మకమగు త్రై లోక్యమును స్వశక్తితో ధరించు చున్న ఆ పరతత్త్వము బహు రూపములతో విశ్వముగ కనబడుటచే విశ్వాత్ముడన బడుచు తానే మాయ వశమున వికారమును పరిణామమును పొంది తన్ను తానే ప్రపంచముగా సృజించు కొనుచున్నాడు. అప్పుడ తనికి విరించి అనియు మహ త్తత్త్వము అనియు ఇత్యాది వ్యవహారము. ఈ తత్త్వమే శాస్త్రములలో బుద్ది తత్త్వము హిరణ్య గర్భుడు అనియు చెప్ప బడినది. ప్రజాపతుల చేత నమస్కరింప బడు ఆ త్తత్త్వమును మహా తేజ స్సంపన్న మగు అహంకార తత్త్వ మనియు అవ్యక్త తత్త్వము నుండి వ్యక్తమైన విద్యా సృష్టి యనియు అవిద్యా సృష్టి యనియు వివిధము లుగ వ్యవహరింతురు. ఏలయన ఏకైక తత్త్వము నుండియే ఆచరము చరము అవిద్య విద్య భూత సృష్టి వైకృత ప్రపంచము అన్నియు ఏర్పడినవి. శబ్ద స్పర్శ రూప రస గంధము లనెడి తన్మాత్రలు పృథి వ్యప్తేజో వాయ్వాకాశము లనెడి పంచ భూతములు ఈ పదియు ఒకే మారు వ్యక్తము లైనవి. మనస్సుతో కూడ త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వ ఘ్రాణము లనెడి ఐదు జ్ఞానేంద్రియములు వాక్పాని పాద పాయూవస్థము లనెడి కర్మేంద్రియము లైదును జన్మించి నవి. ఈ విధముగా చతుర్వింశతి = ఇరువది నాలుగు తత్త్వములును ఏర్పడినవి. వీని తోనే ఈ సమస్త మగు ప్రపంచమును, నరకము, యక్షులు భూతములు గంధర్వులు కింనరులు మహోరగులు దోమలు ఈగలు పురుగులు కీటకములు శునకము శ్వపాకుడు మొదలగు రూపము లలో పృథివి జలా కాశము లందుండు స్థిర చర రూపము లగు ప్రాణులు జడ చేతన పదార్థములు ఏవేవి కలవో అన్నియు ఆ పరమాత్ముని యొక్క రూపమే. ఇది ఆ అక్షర నాశము లేని తత్త్వము నుండి క్షర మగుచున్నది. వ్యక్తమగు చున్నది. కనుక ఇది క్షరము. ఇది మరల ఆ అక్షర తత్త్వము నందు లయము నొందుటచే కూడ ఇది క్షరము = నశించునది. అనబడును. ఇచట చతుర్వింశతి తత్త్వములు, పంచ భూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియమలు, పంచ కర్మేంద్రియములు, చిత్త మనో బుద్ద్య హంకారములు అనెడి అంతఃకరణ చతుష్టయము, ఇవి ఇరువది నాలుగు. మఱియు క్షర తత్త్వము వ్యక్త మయి సృష్ఠి జరుగు దశలు ఐదు. 1. పరమాత్మ 2. బుద్ది తత్త్వాత్మక హిరణ్య గర్భుడు. 3. ఈ హిరణ్య గర్భుని అహంకారము నుండి కలిగిన సూక్ష్మ భూత సృష్టి. 4. భూతముల వైకృతము. 5. భౌతిక లోకముల, లోకము లందలి ప్రాణుల సృష్టి. ఈ జగత్తు అంతయు మొహాత్మక మైనది. అమూర్త మగు అవ్యక్త తత్త్వము నుండి వ్యక్తమై మూర్తిని ధరించినది.
ఈ క్షర స్థితికి అతీత మగు అమూర్త అవ్యక్త మూల కూటస్థ తత్త్వము అక్షరము. త్రిగుణాతీత మైనది. వ్యవహారమున సత్త్వ గుణ ప్రధాన మైనది. ఇంత వరకు చెప్పిన చతుర్వింశతి తత్త్వాత్మక వ్యక్త జగత్తునకు అధిష్టాత యగు నిత్య తత్త్వమది. ఈ తత్త్వము అన్ని మూర్త తత్త్వములకు అంతర్యామి యై వాని హృదయాకాశ మున నుండును. వాటిని ఆయా వ్యాపారముల యందు ప్రవర్తింప జేయును. తనకు మూర్తి, రూపము, లేకయు మూర్త రూపమున, ప్రపంచ రూపమున వ్యక్త మగును. సృష్టి ప్రళయ ధర్మము నొంది సృష్ఠి ప్రళయ రూపమై ఇంద్రియ గోచర మగును. నిర్గుణు డయ్యు సగుణ రూపము ధరించును. ఇట్లు తత్త్వము వికృతిని, పరిణామమును, పొందు చుండియు ప్రకృతి, మూల తత్త్వ రూపమయి వాటి విషయమున ఏ అభిమానమును లేక ధీరుడై యుండును. అజ్ఞాను లగు జనులు తన్ను సేవించు కొనుటకు అనువుగా త్రిగుణాత్మక మూర్తులుగా అవతారము లెత్తి ఆయా జన్మలు ధరించు చున్న దీ యక్షర తత్త్వము. కాని అతడు జ్ఞాన స్వరూపుడు తాను బాల్యాది దశలు లేని వాడయ్యు ఆయా రూపములలో నుండి నేను బాలుడను వృద్దుడను ఇత్యాది అభిమానములను పొందు చున్నాడు. అహం రూపుడు కాకయు అహంకారమును ప్రకటించు చున్నాడు. వ్యవహారము నకై శుక్ల కృష్ణ లోహిత వర్ణములు కలవిగా చెప్పబడు సత్త్వ తమో రజో గుణాశ్రితుడై గోచరించు చున్నాడు. కాని ఈ గుణములు మూడును ప్రాకృత జనులలో ప్రాణులలో వ్యవహారమున గోచరించు చున్నవి. తామస జీవులు నరకమును పొందును. రజో గుణ ప్రధానులు మానుష భావమున నుందురు. సత్త్వ ప్రధాన జీవులు దేవత్వమును పొందుదురు. కేవలము పాపులు నరకమును పశుపక్ష్యాది తిర్యక్ జన్మములను పొందుదురు. పుణ్య పాప మిశ్రణమున మానవత్వము కలుగును. కేవల పుణ్యముచే దేవత్వము కలుగును. మోక్షము వీటి కన్నిటికి అతీతము. అది కేవల జ్ఞానము చేతనే సాధ్యము. ఇరువది యైదవది యగు అక్షర తత్త్వములో అజ్ఞానము గుణములు మూర్తి మొదలగు దోషములు లేవు. ఆ తత్త్వము కేవల జ్ఞానరూపమై శుద్ద జ్ఞానము తోనే ప్రవర్తిల్లును.
Summary of chapter 134 of the Brahma Mahā Purana is as follows:
The celebrated dialogue between the sage Vasiṣṭha and King Janaka (Karāla Janaka) on the path to liberation is initiated. Janaka, a royal sage exemplifying the ideal of the wise householder, approaches Vasiṣṭha with sincere questions about the nature of liberation and the means of attaining it. Vasiṣṭha begins a systematic exposition of the Sāṃkhya-Yoga path appropriate to Janaka's level of understanding.