మీరు చెప్పిన భాస్కర క్షేత్ర మహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగ లేదు. కావున పూజా విధానము, దానము, నమస్కారము, ప్రదక్షిణము ధూప దీపాది సమర్పణముపవాసము, సూర్యాలయ మార్జనము మొదలగు వాని విశేషములను విన గోరెదము. సూర్య ప్రీతి కరములైన పూవులను, నమస్కార విశేషములను, సూర్యార్ఘ్య విధానము, సూర్యు నుద్దేశించి చేయు నుపవాసము, నక్తము (పగలుపవాస ముండి రాత్రి భోజనము చేయుట) మొదలగు వాని ఫలము, దేశకాల విశేషములను విన వలెనని కుతూహల పడుచున్నాము.
మనస్సు చేతజేయు భావన భక్తి శ్రద్ధ ధ్యానము సమాధి యనుపేర్ల పిలువ బడును. భక్తి సమాధి స్తుతియను వానిచే పత్ర పుష్ప ఫలము తోయములే కొంచెమొసంగిన నది భగవంతుడు స్వీకరించి ప్రీతి చెందును. రవికి భక్తితో చేసిన ప్రదక్షిణ మఖిల భూ ప్రదక్షిణమే. సర్వ దేవతా ప్రదక్షిణమే. షష్టి తిధి యందు ఏక భుక్తము చేసి గాని సప్తమి నాడు భాను నర్చించిన నది యశ్వమేధ ఫలమిచ్చును. కృష్ణపక్ష సప్తమీ తిధి యందు. భాస్కరుని పూజించిన పద్మ ప్రభమైన విమానములో నెక్కి సూర్య లోక మేగును. శుక్లపక్ష సప్తమి నాడు ఉపవసించి తెల్లని పూజా ద్రవ్యముల నబ్జ బాంధవుని పూజించిన సరియే ఫలము. అర్క సంపుటముతో (రాగి అరివాణముతో) గూడిన తీర్థము నేకోత్తర వృద్ధిగా నిరువది నాలుగు రోజులు పానము చేసి క్రమముగా తగ్గించు కొని వచ్చుచు సేవించుచు నిట్లు రెండేడ్లకు వ్రత సమాప్తి చేసినచో నయ్యర్క సప్తమీ వ్రత మశేష కామ ప్రదము. శుక్లపక్ష సప్తమి భానువారము కలిసి వచ్చెనేని యది విజయ సప్తమి యనబడును. అందు స్నాన దానము లనంత ఫలదము లగును.
ఆదివారము శ్రాద్ధము పెట్టినను మహా శ్వేతము (తెల్ల జిల్లేడు) తో హోమ మొనర్చినను నభీష్టసిద్ధి గల్గును. వారి వంశమున దరిద్రుడు గాని, రోగి గాని పుట్టడు. తెల్లని యెఱ్ఱని పసుపు పచ్చని మృత్తికతో పూసికొన్న వాని కోర్కెలు నెరవేరును. రంగు రంగుల పూలతో చిత్రభాను నర్చించి యుపవాస ముండిన నభీష్టము వడయును. ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపము పెట్టి ఆదిత్యుని పూజించిన వానికి నేత్ర వ్యాధు లుండవు. దీపదాతకు జ్ఞాన దీపము లభించును. తిలలు పవిత్రములు కావున తైల గోదానము పుణ్య ప్రదము. నలుదారులు కలిసినచో (చతుష్పథము లందు) రాజ మార్గము లందు నట్టి దీప దానము చేసిన నరుడందగాడు (సుభగుడు), భాగ్య వంతుడు నగును. దీపము హవిర్ద్రవ్యములు (ఆవు నెయ్యి) మొదలైన వానిచే బెట్టుట ప్రథమ కల్పము. ఓషధీ రసముల చేత బెట్టుట రెండవ కల్పము. వసా మేదోస్థి సంబంధమైన (క్రొవ్వు పదార్థములు) దీపము నిషిద్ధము. దీప మెపుడు నూర్ధ్వముగా బ్రసరించును. కావున దీపదాత యెపుడు నూర్ధ్వగతినే గాని యథోగతి నందడు. వెలుగు చున్న దీపమును దగ్గింప రాదు. ఆర్పి వేయరాదు. అట్లుచేసిన వాడు బంధము నాశనము కోపము తమో గుణమును బొందును. దీప దాత స్వర్గ మందు దీప మాలవలె వెలుగును. కుంకుమాగరు చందనములచే రక్త చందన రక్త పుష్పములచే నాదిత్యు నర్పించినయత డుదయమందర్ఘ్య మిచ్చి నతడు సంవత్సరములో నిష్ట సిద్ధి గాంచును.
సూర్యుడుదయించి అస్తమించు దాకా నిలబడి సూర్యాభి ముఖుడై యేదేని మంత్రము జపించిన వాడు సూర్య స్తోత్రమేదేని చేసిన వాడు సర్వ పాపములంబాయును. దీనిని ఆదిత్య వ్రత మందురు. సువర్ణ గోవృషభ వస్త్ర దానములతో సూర్యార్ఘ్యము నిచ్చిన పుణ్యుడా ఫలమేడు జన్మల దాకా యను భవించును. అగ్ని నీరు యంతరిక్షము పవిత్ర భూమి ప్రతిమ పిండితో చేసిన సూర్యమూర్తి అనువాని యందర్ఘ్య మీయ నగును. సవ్యముగా గాని యప సవ్యముగ (కుడి ఎడమ ప్రక్కల) నర్ఘ్యమీయ రాదు. అభిముఖముగా మాత్రమే సూర్యార్ఘ్య మీయ వలెను. రవికి గుగ్గులు క్రర మారేడు దేవ దారువులతో చేసిన నలు పలకల యాసనము కర్పూరాగరు ధూపము లొసగిన వారు స్వర్గ మందుదురు. విషువము లందు (రాత్రి పగలు సమముగా నున్న పర్వము లందు) బ్రభాకరు నర్చించిన సర్వ దురితములు దొలంగును. కృసరము (పులగము) పాయసము, అపూపములు పండ్లు, దుంపలు, నెయ్యి యను వానిచే సూర్య బలి యిచ్చిన సర్వ కామ సమృద్ధి నందును. ఆవు నేతితో తర్పణము చేసిన సర్వసిద్ధి నందును. ఆవు పాలతో తర్పణము మనస్తాప హరణము, ఆవు పెరుగుతో చేసిన కార్యసిద్ధి. పవిత్ర తీర్థజలములచే మార్తాండునకు స్నానము నిర్వర్తించినచో పరమ గతి వడయును. ఛత్రము ధ్వజము (వితానము చాందినీ)పతాక చామరములు భానునకు సమర్పించిన నభీష్ట గతి లభించును. ఏద్రవ్య మర్కునకు భక్తితో సమర్పించునో ఆ ద్రవ్య మనంతముగా లభించును. త్రికరణ కృత దురిత జాలమెల్ల జలజ బంధువు వారింప గలడు. యథోక్త దక్షిణముగా చేసిన క్రతుశతము వలని ఫలము ఒక్కనాడు సూర్యుని భక్తితో నారాధించి నను లభింప గలదు.
Summary of chapter 29 of the Brahma Purāṇa is as follows:
One hundred and eight sacred names of Sūrya are enumerated and their meanings explained. Each name encodes a divine attribute — Vivasvat (the resplendent), Mārtaṇḍa (born of the cosmic egg), Bhāskara (maker of light), Savitṛ (impeller of all), and others. The chapter serves as a sacred name-litany whose recitation confers Sūrya's blessings and purifies the devotee.