బ్రహ్మ మహా పురాణము
178 - కండూపాఖ్యానమ్
ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకర మైనది సర్వ పురుషార్థము లిచ్చునదియు నైన యా పురుషోత్తమ క్షేత్రమున “కండువు” అను నొక ఋషి పరమ ధర్మాత్ముడు తేజస్వి సత్యవాది శుచి ఇంద్రియముల నిగ్రహించిన వాడు సర్వభూత హితువు కోరువాడు క్రోధము లేనివాడు వేద వేదాంగ పారంగదుడు నై వసించు చుండెను. అతడు పురుషోత్తము నారాధించి పరమ సిద్ధి నందెను. అట్టి వారే మఱి పెక్కుమంది మునులు నతని వలె ముక్తి నందిరి.
అన మునులు ఈ కండువెవరు? అచట పరమ గతి నెట్లందెను? ఆచరిత్ర విన వలతుమన వ్యాసులిట్లనిరి.
మునులారా! ఇదె వినుండు. పవిత్రమైన గొమతీ నదీ తీరమందు కంద మూల ఫల సమృద్ధము సమిత్పుష్ట కుశ సంపూర్ణము నైన పుణ్యాశ్రమము కండుముని నివాస మయ్యెను. అది సర్వర్తు ఫల పుష్ప శోభితము. అందాయన యమ నియమాదులతో మౌనముతో దప మాచరించు చుందెను. గ్రీష్మ ఋతువున పంచాగ్ని మధ్యమున వర్షా కాలమున ఆవరణము లేని యెడ దడి బట్టలతో చలి కాలములో మహాతప మాచరించెను. అది చూచి ఈయన తపస్సు వేడిమికి భూమి అంతరిక్షము స్వర్గము గూడ నుడికేత్తినవి. ఆహా! ఈయున ధైర్యమేమి ఈ తపస్సేమి అని దేవతలు వెరగంది యందరు నాయన తపము భంగము గావింత మని నిశ్చయించిరి.
శుక్రుడు:
వారి తల పెఱింగి యింద్రుడు ప్రమ్లోచ యను నప్సరసను పరమ సుందరిని జూచి భామినీ! కండు ముని తప మాచరించు తావున కిప్పుడు చనుము. ఆతని తపమ్ము చెరచి క్షోభింప జేయు మనియె.
ఆమె ప్రభూ! నీ యాజ్ఞ తప్పక సేసెదను కాని యిక్కడ నాకు జీవిత సంశయ మేర్పడినది. బ్రహ్మచర్య నిష్ఠుడగు నమ్మునిని మహ్రోగ్ర తపస్విని అగ్ని సూర్యులట్లు వెలుగు వానినిగ నెఱిగిన దానం గావున జడియు చున్నాను. అతడు దుస్సహ మయిన శాపమీయ గలడు. ఏలిన వారి యానలో ఊర్వశ్యాదు లెందరో యప్సరసలు న్నారు. వారు సుందరులు నెఱ జాణలు. ఎవ్వని నేని మోహింప జేయగల నేర్పరులు. వారి నాపనిలో నియోగింపు మనెను.
ఆమె మాట విని యింద్రుడు, ఎందరో ఉందురు గాక! ఇక్కడ నీవే నేర్పరివి. నీకు మన్మథుని వాయువును గూడ తోడొసంగెద నీవేగుమను నా ప్రమ్లోచ యాకసమున నమ్మున్యాశ్రయమునకుం జనియె. అచ్చట నొక సుందర వన మీక్షించెను. అందాశ్రమ మందున్న యమ్మునిం జూచెను. అయ్యాశ్రమో ప్రాంత మందలి యా వనము శోభ నిరుపమానము, సర్వ పుష్ప ఫల భరితము సర్వర్తు శోభనము. అందలి పావురములు కోవెలల యొక్క కల కూజితములు శ్రవణ మనోహరములు ఆ విశాల నయన యాయందమును చేరి పాఱజూచి యమ్మధుర నాదములు విని ప్రసన్న సలిలము లైన కొలనులం జూచి వనంతాదులతో మీరందఱు నాకు దోడ్పడుడని హెచ్చరించెను.
ఇట్లని వారిచే నౌనని పించుకొని యిప్పుడ యమ్ముని చెంత కేగెదను. శరీర రథమును నింద్రియములను గుఱ్ఱముచే నిగ్రహించిన యాతని పూవిలుతు నమ్ములచే పగ్గముల బిగువు సడలింజేసి జ్జేతగాని సారథిం గలవాని బోలె జేసెదను. బ్రహ్మ జనార్దనుడు శివు డయినను నగు గాక నీ క్షణములో కామ బాణక్షతుని గావించెద నని యమ్ముని ప్రశాంతాశ్ర మందు నిలిచి యల్లల్లన సంగీతము పాడ నారంభించెను. అంతట వసంతుడు తన బలగముల గూర్చికొని యకాలిక మధుర కోకిలా రావము మేళవింప జేసెను. గంధ వహుడు (వాయువు) మలయాద్రి నుండి యల్లల్లన వీవందొడంగె. అంతియ కాదవ్వన సీమ నల్గడల నా చెట్లునుం పూవులం జలజల రాల్చెను. మదనుడు పూవు టమ్ముల నమ్ముని మనస్సును గలగుండు పరచెను. అంత కండువా సంగీత ధ్వని నాలకించి వింతగొని యావిడ యున్న తావున కేగి యా సొగసులాడి సోయగమున కచ్చెరు వడి తేఱిపాఱ జూచి పైవలువ జార మేను గగుర్బోడవ మది చెదరి యల్లన నిట్లు పలుకరించె.
ఓ సుందరి! నీవెట నుండు దానవు ఎవరి దానవు నా మనను జూరగొను చున్నావు. నిజము తెల్పుమన నామె నీదాన్యము సేసెదను.
పువుల కోఱకు వచ్చితిని. నావలనం బనిగొనుము నీ యాజ్ఞ నిప్పుడు నిర్వ హింతును.
అన విని ముని మోహము గొని ధైర్యమెడలి యామెం జేత బట్టుకొని తన యాశ్రమముం జొచ్చెను. అవ్వల బువ్విలు కాడు వాయువు వనంతుడు నిట్లు తమ పని చక్క వెట్టికొని వచ్చిన దారి నమరపురి కరిగిరి. అతని యొక్కయు నామె యొక్కయు సమావేశ వృత్తాంతము నింద్రున కేరింగించిరి. సురపతియు సురలు నది విని ప్రీతిసెందిరి.
కండుముని యవ్వనితతో నాశ్రమముం జొచ్చి మనోహర రూపము నిండు జవ్వనముం దనకు సంతరించు కొనియె. దివ్య వస్త్రములు దివ్యా భరణములుం దాల్చి పదు నాఱేండ్ల యీడున నున్న యా యందగానిం గాంచి కేవల తపశ్శక్తిచే దివ్య కుసుమాలలు దాల్చి సుగంధము బూసికొని సర్వభోగ సంపన్నుడై యప్పటి కప్పుడ తోచిన యా తపస్వి ప్రభావ ముంగని యచ్చెరువు పడి యవ్వేల్పు పడతి, ఓహో! ఈయన తపస్సు ఈయన వీర్య మద్భుత మని కడుంగడు సంబర పడెను. స్నాన సంధ్యలు జపము హోమము బ్రహ్మ యజ్ఞము దేవ తార్చనము ధ్యానము వ్రతోపవాస నియమములను వదలి యమ్ముదితతో రేయిం బవళ్ళు మదన వశుడై క్రీడించెను. తపస్సు క్షయమైన దని కూడ గుర్తింప డయ్యె. విషయ లంపటుడై పగలు రాత్రి సంధ్య పక్షమాసర్తు సంవత్సరము లేవో కూడ తేలియక యామె వలంపునం బడియె. అక్కాంతయు పంచబాణ బాణనిహతయై యోకాంతముని నింపు నింపుపలుకుల నుపలాలించుచు నతనిం గోరి రమించెను. ఇట్లామేని గ్రామ్య సుఖము మఱగి వందయేండ్లా సుందరితో మందర గిరి కందరము నందుండెను. అంత నది యమ్మా హానుభావుం గని నేను స్వర్గమున కేగెద. ప్రసన్న ముఖుడవై యో బ్రహ్మణ్యమూర్తీ యనుజ్ఞ దయసేయు మనియె. అతడామె యెడ నెడలని వలపుగొని కల్యాణి! కొన్ని దినము లుండు మనియె. అట్లయని యా వేల్పు పడతి నూరేండ్లకు మించి యాతని తోడి పొందు గొని యింపోందె. ఆ మీద మఱల యనుమతింపు మనియె. కాదు కాదు నిలు నిలుమన మఱి వంద సంవత్సరము లేగె. ఎడనెడ నిట్లావిడ యడుగుటయు నమ్ముని వలపు గొని వలదనుట యుంగా జరుగుచుండ నాతని శాపమున కడలి యాదేవ కామిని యించుక తక్కువగా రెండు వందలేండ్లు ప్రణయ భంగము వలన గలుగు బాధ నెఱింగినద కావున యాతని వదలి పోదయ్యెను. అప్పరమర్షి దానితో రేయిం బవళ్లు రమించు చున్న కొలది ప్రేమ యెప్పటి కప్పుడు గ్రొత్తది కాజొచ్చెను.
ఒక్కతఱి నాతడు తత్తరము గొని యిల్లు విడిచి చనుచుండ నాసుర కాంత ఎచటికేగు చున్నారన కల్యాణి! తెల్లవారినది. సంధ్య వార్చెదను. కాదేని అనుష్ఠాన లోప మగునన
నల్లన నవ్వి యమ్మహా మునింగని ఓ ధర్మజ్ఞ! ఇప్పుడా నీకు తెల్లవారుట అనుష్ఠాన మెప్పుడో గతించినది. ఇమ్మాట యెవనికి వింత గొలువదు?
అన నమ్ముని ఈ యుదయమే నీవీ నదీ తీరమునకు వచ్చితివి నాకు గనబడితివి. నా యాశ్రమమును జొచ్చితిని. సంధ్యా సమయమయినది ప్రోద్దెక్కినది ఎందుకు పరియాచకము లాడెదవు? ఉన్నదున్నట్లు పలుకుము.
అనవిని ప్రమ్లోచ నేను వేకువ వేళ వచ్చిన మాట ఓ బ్రహ్మణ్యా నిజమే నేనబద్ద మాడుట లేదు. కాని ఇప్పుడా కాలము కొన్ని వందలేండ్లు గడిచి పోయిన దనియె.
యా ముని ఛీఛీ ఎంత అనాచార మెంత యపచారము గావించితిని అని తనను దానిందించుకొని నా తపస్సు నెల్ల నీట గలిసినవి.
బ్రహ్మవేత్తల ధనమెల్ల చెఱచి నట్లయినది నావివేక మెవ్వడో కాజేసి నట్లయినది ఈ యాడుది నన్ను మోహ పెట్టుటకు పుట్టింప బడినది. షడూర్ముల (కవ్వలిదా బ్రహ్మవస్తువు 1. బుభుక్ష 2. తృష్ణ 3. శోకము 4. మోహము 5.జర 6. మరణము) ఆత్మ నిగ్రహముచే నెఱుగ వలసి నది. ఛీఛీ ఆ కామ మహాగ్రహము నన్ను పట్టుకొని నాకీ గతి తెచ్చి పెట్టినది నా వ్రతములు సర్వ వేదములు మఱియెల్ల ఉత్తమ కారణములు నరక గ్రామమునకు మార్గమైన కామముచే నిహతము లయినవి. అని యిట్లు తన్ను దానిందించు కొని యా ధర్మజ్ఞుడు తన యందు గూర్చున్న యా యప్సరసం జూచి యిట్లనియె.
పొమ్మో పాపాత్మురాల! నీ హావ భావములచే నా మదిం గలచి యింద్రునికై చేయ వలసిన దంతయం జేసితివి. సత్పురుషుల దోడి మైత్రి సాప్త పదము (అనగా ఏడడడుగులు కలిసి వేయుట లేక యేడు మాటలు మాట లాడుకొనుట వలన నేర్పడు నది) కావున నీతో గలిసి కొన్నాళ్లుంటిని గావున నిన్ను భస్మము చేయును. అదిగాక యిందు నీ తప్పిద మేమున్నది! నీకేదైన శాస్తి చేయుటకు, ఇంద్రియ నిగ్రహము లేని వాడనగట నీ తప్పు నాదియె. సురపతి ప్రీతి కొరకైన నీ వాల్చూపను సమ్మోహన మంత్రముచే నేనీ యవకర మునకు గుఱి యైతిని.
అని యిట్లా బ్రహ్మర్షి యా రమణితో నని నంతట నది ముచ్చెటములు పోసి యొడలెల్ల దడియ నెడనెడ వడంకు చున్న యావేల్పు పడతిం గని పో పొమ్మని యమ్ముని యలుకగొని జడిపింప నది యయ్యాశ్రమము వెడలి యాకసము వెంట నేగుచు నా చెట్ల చిగుళ్లం జెమట దుడిచి కొనియె. అట్లు చెట్టు నుండి చెట్టున కడుగు వెట్టుచు నా చిన్నది యెర యెఱ్ఱని క్రొంద లిరుటాకులం జెమట తడు లోత్తుకొను చున్నంత నయ్యింతికి పులక లయ్యె అప్పుడ పులకలతో బాటామె మేను వెడలి స్వేద రూపమున గర్భము కలిల మయి జాల్వారెను. దానిని వృక్షములు సేకొనియె. వాయు వద్దానినేకము సేసెను. అమృతాంశుడు తన కిరణముల నద్దాని కాప్యాయ మొనరింప నల్లల్లన నది దిన దినా భివృద్ది నొందెను. అ గర్భమే మారిష యనుపేర వృక్షములకు గన్య యయ్యె ఆమె ప్రాచేతసుల భార్య దక్షునికి తల్లి.
ఆ కండుముని సత్తముండును తనను క్షమింప పురుషోత్తమ మను నావిష్ణు క్షేత్రమున కరిగెను. ముక్తిదము దుర్లభమునై దక్షిన సముద్ర తీర మందున్న సర్వ కామద మయిన యా దివ్య క్షేత్రమును దర్శించెను. భృగ్వాది మునులు నిరంతరము సేవించు నవ్వైకుంఠా యతనముం గని సర్వ దేవతలు గొలువ నింపుగులుకు హరిని పురుషోత్తము వైకుంఠుం దర్శించి కృతార్థుడ నైతి ననుకొనియె. మఱియు నేకాగ్రచిత్తుడై యాస్వామి నారాధించెను. అయ్యోగి ఊర్ద్వ బాహువై యచట నిలువ బడి “బ్రహ్మపారము” అను మహా మంత్రమును జపించెను. అన విని మునులు వ్యాసుంగని
యో మునీ ఆ బ్రహ్మపారము పరమ శుభ మంత్రము కండుముని జపించి విష్ణు నారాధించిన యది మేము విన వలతుమన వ్యాసభగవానుల డిట్లానతిచ్చెను.
పారం పరం విష్ణుః = శ్రీహరి సంసార మార్గమునకు సరవోత్కృష్టము పునరావృత్తి రహితము నగు అవధి లేక గురు పరంపరచే తెలియ దగిన రహస్య వస్తువు. అపారపారః = తెలియ లేని అంతము గలవాడు లేక అపరిమిత శక్తి గలవాడు. పరేభ్యః పరః = ఉత్కృష్టముగా నెంచబడు ఆకాశాదుల కంటె గొప్పవాడు. (మహతో మహీయాన్ ) పరమాత్మ రూపః = పరబ్రహ్మ రూపుడు. బ్రహ్మపారః = బృహద్రూప మగు ప్రధానము నకు అవసాన మైనవాడు లేక సబ్రహ్మపారః = వేదములు తపస్సులతో కూడికొనిన వారు సబ్రహ్మలు అట్టి వారికి గంతవ్యుడు, పరపారభూతః = ఆత్మేతరమగు ఆనాత్మ ప్రపంచమునకు అవధియైన వాడు పరాణామపి పరః = ఆత్మగా ప్రతీయమానములగు చున్న ఇంద్రియాదులకు అతీతుడు. పారపారః = వూరకములు పోషకములు నైన ఆకాశాదులకు లేక ఇంద్రాదులకు కూడ వూరకుడు పోషకుడు నైనవాడు.
ఆ విష్ణువు అన్నిటికి కారణము. సమస్త కార్యములకు కారణమైన విపంచ మహా భూతములు తన్మాత్రలు వానికి కూడ కారణ మైనవాడు. ఆహంకారమునకు మహత్తత్వము హేతువు. దానికి కూడ హేతువైన వాడు అనగా ఉపాదాన కారణ భూతుడు. ఆతడే క్రియాకారక రూపముతో సమస్తమునకు రక్షకుడునై యున్నాడు. అతడు వేద నిర్వాహకుడు. అతడే వేదము. వేదాంగాదులు కూడ నాతడే. వేదార్థ స్మర్తలగు మన్వాదులకు కూడ ప్రభువైన వాడు. అవ్యయుడు నిత్యుడు పుట్టుక లేనివాడు. షడ్భావ వికారములతో సంబంధము లేని వాడు. బ్రహ్మ పుట్టుక లేని వాడు నాశన రహితుడు నిత్యుడు నైనట్లు ఈ పురుషోత్త ముడును అట్లే అని స్తుతించు చున్న నాయొక్క రాగ ద్వేషాదులు శమించు గాక!
అని యిట్లమ్ముని జపించు బ్రహ్మ పారమును విని యాతని యచంచల భక్తి పారమ్య మెఱింగి పురుషోత్త స్వామి పరమ ప్రీతితో భక్త వత్సలుండు గావున నతని దగ్గర కేగి మేఘ గంభీర మగు వచనము దిక్కుల బ్రతిధ్వనింప జేయుచు వినతాకుల నందనుడైన గరుడునిపై గూర్చుండి యిట్లనియె.
ఓ మునీ! నీ మదినున్న పని తెలుపుము. వరమీయ వచ్చితిని. అడుగుమన కండుముని కనులు దెఱిచి యెదుట నున్న కమలాక్షుని అతనీ కుసుమ సంకాశుని శంఖ చక్ర గదాహస్తుని కిరీటాంగద ధారిని పీతాంబరుని శ్రీవత్స వక్షుని వనమాలా భూషితుని చతుర్భాహువును దివ్యగంధాను లిప్తుని దివ్యమాలా భూషితుని సమున్నత మూర్తిని జూచి వెఱగంది తనువు పులకరింప సాష్టాంగ దండ ప్రణామ మొనరించెను. మఱియు నిపుడు నా జన్మ సఫల మైనది. నా తపస్సు ఫలించిన దని నమ్ముని వరుడిట్లు వినుతింప నారంభించెను.
నారాయణాది నామములతో నారంభించి శ్రీహరి కళ్యాణ నామ సంకీర్తనము జేసి పాల సముద్ర మందున్న మహా సర్పమందు నిద్రించు కనక రత్న కుండలా లంకృతు డగు పరమాత్మకు నమస్కారము అని చేసిన ఈ స్తుతి పారాయణ ప్రధానము సుల భార్ధము గావున అనువాదము చేయ బడలేదు.
ఇట్లు స్తుతింపబడి సంప్రీతుడై మాధవుడు మునివర! నావలన నీ కోరున దేమో త్వరగ చెప్పుమన
జగన్నాథా! తలచు కొన్నంత మేను గగుర్పొడుచు నీ దాటరాని యనిత్య సంసార మందు బహు దుఃఖ కరమై యరటాకు వలె పేలవమై నశించు స్వభావము గల నీటి బుడగ వంటి నిరాశ్రయము నిరాలంబము నగు భయంకర సంసారమున మాయామో హితుడనై తిరుగు చున్నాను. విషయ వాసనల చేత జెడిన మనసుతో దీని యంతు దరికాన లేకున్నాను. దీనికి దడిసి యిపుడు నిన్ను దిక్కంటిని కృష్ణా నన్ను ద్దరింపుము. నీ ప్రసాదమున పునరావృత్తి లేని దుర్లభమైన సనాతన ముక్తి పదము నంద గోరు చున్నాను. అన భగవంతు డిట్లనియె.
ఓ ముని శిరోమణి! నీవు నా భక్తుడవు. నిచ్చలు నన్నా రాధింపుము. నా యనుగ్రహమున నిశ్చల మైన మోక్షమును బొంద గలవు. నా భక్తులు ఏ కులము వారైన స్త్రీ లైన పరమ సిద్ధి నందుదురు. నీవందుటలో నాశ్చర్య మేమి. కుక్క మాంసము దిను వాడైన మిక్కిలి శ్రద్ధ గొని నా యెడ భక్తి కలవాడు అభీష్ట సిద్ది బొందును. మఱియితరుల మాట జెప్పనేల?
అని పలికి భక్త వత్సలుడగు హరి యంతర్థాన మయ్యెను.
విష్ణువట్లు జని నంతట కండువు ముదమంది నిష్కాముడై స్వస్థ చిత్తుడై యింద్రియముల నియమించుకొని యహంకారము వాసి మది నిలకడగొన నిర్లేపుడు నిర్గునుడు శాంతుడు సత్తామాత్రుడు నైన పురుషోత్తమ దేవుని ధ్యానించి యపర దుర్లభ మైన పరమపద మందెను. మహాత్ముడగు కండువు యొక్క కథ నెవ్వరు చదువునో వినునో యతడ ఘములం బాసి స్వర్గలోక మందును. ఓ ముని తల్లజులార! కర్మ భూమియగు భారత వర్షమును గుఱించి మోక్ష క్షేత్రముల గురించి పరమాత్మ పురుషోత్తముని గుఱించి చెప్పితిని. అవ్వరదుని ప్రభుని భక్తితో నెవ్వరు ధ్యానింతురు దర్శింతురు స్తుతింతురు వారు పవిత్రులై రాజ్య భోగముల ననుభవించి స్వర్గ సుఖము జూరలాడి అవ్యయ మగు ముక్తి నందుదురు.
Summary of chapter 71 of the Brahma Mahā Purana is as follows:
Lomaharṣaṇa responds to the sages' questions by explaining the doctrine of divine incarnation (avatāra). Bhagavān Viṣṇu, though eternally transcendent and unborn, takes on embodied form through his Yogamāyā whenever dharma declines and adharma rises. The chapter establishes the theological basis of avatāra — not a limitation of the divine but a supreme act of grace — and introduces the principal incarnations to be narrated.