బ్రహ్మ మహా పురాణము

63 - పంచతీర్థమాహాతమ్యం

సముద్ర స్నానా నంతరము యజ్ఞ పురుషుని శరీర మందా విర్భవించిన తీర్థము ఇంద్రద్యుమ్న సరస్సును సేవిం పవలెను. ఆ తీర్థ సేవన మందు “అశ్వ మేధాంగ సంభూత”యను మంత్రము నుచ్చరించ వలెను. ఇట దేవర్షి పితృ తర్పణము జేసి దశాశ్వమేధ యాగ ఫలమొంద వచ్చును. వెనుక యేడు తరముల రాగల యేడు తరముల వారిని నీ పుణ్య మాచరించు నాత డుద్ధరింప గలడు. కామగ విమానమున విష్ణు లోకమున కేగ గలడు. ఏకాదశి యుపవాస ముండి పంచ తీర్థములను సేవించి జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు పురుషోత్తముని దర్శించు నాతడు పునరావృత్తి రహిత పుణ్యస్థాన మందును.

మాఘాది మాసములను వదలి జ్యేష్ఠ మాసమునే ప్రసంశించితి వేలయని మునులడుగ

జ్యేష్ఠ శుక్ల దశమి మొదలు ఏడు రోజులు సర్వ తీర్థములు పురుషోత్తమ క్షేత్ర మందుండు. కావున నే కొంచెము పుణ్యమేని నిచట యక్షయ మగును.

జ్యేష్ఠ శుక్లపక్ష దశమి పది రకముల పాపములను హరించును. కనుక దశహర యన బడును. ఆనాడు బలరామ కృష్ణ సుభద్రల దర్శనము విష్ణు లోక ప్రదము. పాల్గుణ పూర్ణిమ నాడుయ్యెల యందున్న గోవిందుని ఆ డోలోత్సవమును జూచు నతడు గోవింద పురమేగును. విషువత్తులందు పంచతీర్థ సేవన మొనరించి యా మూడు మూర్తులను సేవించు నతడు సర్వ యజ్ఞ ఫలభాజను డగును. విష్ణు లోక గమనము చేయును. వైశాఖ కృష్ణ తృతీయ తిధి యందు కృష్ణునకు చందనోత్సవము జరుగును. అది చూచు నతడు. విష్ణు లోక మందును. జ్యేష్ఠా నక్షత్రముతో నున్న జ్యేష్ఠ పూర్ణిమ యందు బురుషోత్తమ దర్శనము చేసిన యతడు ఇరువది యొక్క తరముల నుద్ధరించి విష్ణుపద మందును.