ప్రజాగరము చేసి విష్ణు మహిమ గానము చేసి చాండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతి శాలివగు ఓ వ్యాస మహర్షీ! ఏ తపస్సుచే ఏ కర్మ నాచరించుటచే విష్ణవు నందు భక్తి కలుగునో ఆ ఉపాయమును మాకు తెలుపుము. వినగోరు చున్నాము అని మునులు అడిగిరి.
ఓ ముని శ్రేష్టులారా! మానవునకు మహా ఫలప్రద మగు విష్ణుభక్తి కలుగు ఉపాయము క్రమముగా చెప్పెదను. వినుడు. మహా ఘోరమును సర్వ ప్రాణులకు భయమును కలిగించునదియు మహా మోహమును కలిగించు నదియు నానా విధములగు నూర్ల కొలది దుఃఖములతో నిండి నదియు అగు ఈ సంసారమున జీవుడు వేల కొలదిగా తిర్యగ్యోనుల వృక్ష పశు పక్ష్యాది జన్మముల యందు మరల మరల జన్మించి ఎంతో కష్టము మీద మనుష్య జన్మమును పొందును. అందును. బ్రహ్మణు డగుట అందును వివేకము కలుగుట అందును ధర్మము నందు ప్రవృత్తి అందును శ్రేయఃప్రద మయిన వానిని గ్రహించుట దుర్లభము. సంచిత పాపము సంపూర్ణముగా నశించ నంత వరకు సర్వ జగద్రూపుడగు వాసుదేవుని యందు భక్తి కలుగదు. కనుక అందులకు ఉపాయము తెలిపెదను. వినుడు. త్రికరణము లతో శుద్ధిగా అన్య దేవతల యందు మనస్సు నిలిపి అనుష్ఠించు భక్తి వలన యజ్ఞములు చేయుట యందు శ్రద్ద కలుగును. అప్పుడు అగ్ని యందు భక్తి కలిగి యజ్ఞములు చేసి అగ్నిని తృప్తి నొందించుటచే సూర్యుని యందు భక్తి కలుగును. భాస్కరుని ఉపాసించి అతనిని ప్రీతునిగా చేయుట వలన శంకరుని యందు భక్తి కలగును. విధి విధానానుసారము శంకరుని ఆరాధించి అతనిని తుష్టి నొందించుట వలన విష్ణుని యందు భక్తి కలుగును. జగద్రక్షకుడును అవ్యయుడును నాశనము లేనివాడు అగు వాసు దేవుని సంపూజించుట వలన నరుడు భుక్తిని ముక్తిని పొందును.
ఓ మహామునీ! లోకమున వైష్ణవులు కాని వారు కొందఱు కనబడుటకును వారా విష్ణును నర్చింప కుండుటకును హేతు వేమని మునులు వ్యాసు నడిగిరి.
ఓ ముని శ్రేష్టులారా! స్వయంభూ బ్రహ్మ చేయు ఈ భూత సృష్టి దైవీ సృష్టి అసుర సృష్టి అని రెండు విధములు దైవీ ప్రకృతి = స్వభావము కలవారు విష్ణుని భక్తితో అర్చింతురు. ఆసురీ ప్రకృతి కలవారు హరిని ధూషింతురు. ఆసురీ ప్రకృతి గల నరాధములు మాయచే విజ్ఞానము నశించి నందున విష్ణుని చేరలేక అధమ గతిని పొందుదురు. విష్ణుని మాయ గంభీర మైనది. సురాసురు లకును తెలిసికొన శక్యము కానిది. మహా మోహము కలిగించునది సంస్కారము నొందిన మనస్సులు లేని వారికి దాట శక్యము కానిది.
ఓ ధర్మజ్ఞా! సుదుస్తర మగు విష్ణుని మహా మాయను గూర్చి తెలిసికొన కుతూహల మగుచున్నది, తెలుపుము.
లోకములను ఆకర్షించు ఆ విష్ణు మాయ స్వప్నముతో ఇంద్ర జాలముతో సమాన మైనది. దానిని విష్ణువు తప్ప మఱవ్వరును తెలిసికొన జాలరు. మాయ విషయములో ఒక బ్రహ్మణునకును నారద మహర్షికిని కూడ జరిగిన మోసము తెలిపెదను వినుడు. ఒక నగరమును పూర్వము అగ్నీధ్రు డగు కామదమనుడు అను రాజుండెడి వాడు. అతని కుమారుడు పవిత్రుడు, ధర్మము నందే ఉండి ఆనందము పొందు వాడు, క్షమా శీలము పితృ సేవాసక్తి ప్రజలను రంజించు సమర్థత కలవాడు, వేదముల యందు శాస్త్రముల యందు పరిశ్రమ చేసిన వాడు. తండ్రి అతనికి పెండ్లి చేయ యత్నించెను. అతడు ఇష్ట పడలేదు. నాయనా! నీవు పెండ్లాడ ఇష్ట పడని కారణమేమి? మనుజులు భార్య వలన సుఖములు లభించునను తలపు తోనే కదా పెండ్లాడుదురు. కనుక నీవును వివాహము చేసికొనుము. అని తండ్రి పలుకగా అయన యందలి గౌరవముచే కుమారుడు ఏమియు సమాధాన మీయక ఊరకుండెను. ఐనను మరల అడుగగా అతడు తండ్రితో ఇట్లు పలికెను, నేను అభివ్యక్తము పరిపాలింప దగినదియు విష్ణునికి సంబంధించి నదియును అగు ‘నామానురూపతా’ నామమునకు తగినట్లు నడచుట అను నియమమును ఆశ్రయించితిని అనెను. తండ్రి ఇట్లు పలికెను. కుమారా? ఇది ధర్మము కాదు. వివేకి యగు పురుషుడు తండ్రి అజ్ఞకు విరుద్ధముగా ఆలోచింప దగదు. నాకు నీపై అధికారము కలదు. నా మాట పాలింపుము. సంతతి ముందునకు సాగక పోవుటచే నా వంశము నరకములో మునుగు నట్లు చేయకుము. అనెను. తండ్రి ఇచ్చిన ఈ అజ్ఞను విని ఇంద్రియ నిగ్రహము కల ఆ కుమారుడు అనాది సిద్ధముగా నున్న ఈ సంసారవు విచిత్ర స్థితిని జ్ఞాపకము చేసికొని ఇట్లు పలికెను.
నాయనా! సహేతుక మగు తాత్త్విక విషయమును చెప్పెద వినుము. ఓ రాజా! నామమునకు అనుగుణముగా ఆచరించుట కర్తవ్యము, అనునది సత్యము. నేను ఎన్నియో జన్మములు జరా మరణములు భార్యలతో సంయోగ వియోగములు గడ్డి, పొదులు, తీగలు సరీసృపములు, ప్రాకెడి పాము వంటి ప్రాణులు, మృగములు, పక్షులు, పశువులు మానవులలో స్త్రీ పురుషులు మొదలగు రూపములు ఎన్నియో పొందితిని. గణ దేవతలగు వసు రుద్రా దిత్యులు కింనర గంధర్వ విద్యాధర నాగులు యక్ష గుహ్యక రాక్షసులు దానవులు అప్సరసలు దేవతలు సముద్రములు మొదలగు అనేక రూపములలో సృష్టింప బడితిని. సంహరింప బడితిని. దారలతో సంయోగము వలన నాకు కలిగిన మోసము ఇటు వంటిది. ఈ జన్మ నుండి పూర్వము మూడవ జన్మమున జరిగి నదియు తీర్థ మాహాత్మ్యముతో సంబంధించి నదియు అగు వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నేను నర దేవ గంధర్వ నాగ విద్యాధర గరుడ కింనరాది జన్మములు అనేకములు పొందిన తరువాత సుతపంకుడను మహా ఋషిగా జన్మిచింతిని. అట్టి నాకు లోకములకు ప్రభువు, మధువను రాక్షసుని వధించిన వాడునగు జనార్దనుని యందు స్థిరమగు భక్తి కలిగెను. చక్ర గదా ఖడ్గ దారియగు విష్ణుని వివిధము లగు వ్రతములచే ఉపవాసము లచే మెప్పింపగా ఈ మహాత్ముడు నాకు వరమీయ గోరి గరుడుని ఎక్కి వచ్చి ఓ బ్రాహ్మణా! నీకు కావలసిన వరము ఏదో కోరుము. ఇచ్చెదను. అని బిగ్గరగా పలికెను. నీకు నాపై ప్రీతి కలిగి నచో నీ మాయా తత్త్వమును నాకు తెలుపు మని కోరితిని. ధర్మార్థ కామములను శ్రేష్టులగు పుత్రులను బాధా రాహిత్యమును ఇత్తును. తీసి కొనుము. నా మాయను తెలిసికొని ఏమి చేయుదువు? అని విష్ణు వనెను. ధర్మార్థ కామాది పురుషార్థములు చేత నైనను జయింప వలసినది నీ మాయనే కావున నేను దాని తత్త్వమును తెలిసికొన గోరు చున్నాను. కనుక ఓ పుండరీకాక్షా! నీకు నీ మాయా తత్త్వమును చూపుము. అని నేనంటిని.
నామాయ ఇంత వరకు ఎవరును ఎఱుగరు. ఇక ముందును తెలిసికొన జాలరు. పూర్వము బ్రహ్మకు కుమారుడును దేవర్షియు అగు నారదుడు భక్తి యుక్తుడై నీవు వలెనే నన్ను ఆరాధించి మెప్పించెను. నేనతనికి వరమీయ బోవ అతడును ఇదే కోరెను. నే నెంతగా వలదు అని చెప్పి నను అతడు మూఢుడై ఈ వరము నకై పట్టు పట్టెను. అంతట నేనతనితో నారదా! నీవు నీటిలో మునిగినచో నా మాయ తెలియు నంటిని. నారదుడు నామాట ననుసరించి నీట మునిగి లేచి సుశీలయను కాశిరాజ పుత్రిగా అయ్యెను. ఆమె యౌవన వతి ఐన తరువాత ఆ రాజామెను విదర్భ రాజ కుమారుడగు సుధర్మున కిచ్చి వివాహము చేసెను. ఆ సుధర్ముడు ఈమెతో కామ సుఖమును అనుభవించెను. తన తండ్రి స్వర్గమునకు ఏగిన తరువాత ప్రతాపవంతుడగు ఆ సుధర్ముడు అతని విదర్భ రాజ్యమునకు పాలకుడై పుత్త్ర పౌత్త్రులతో కూడి సంతోషముతో నుండెను. ఇట్లుండ కాశీ రాజును సుధర్మున కును యుద్ధము జరిగెను. తమ పుత్త్ర పౌత్త్రులతో కూడ ఇరువురును నాశము నొందిరి. ఈ విషయము తెలిసి యుద్ధ రంగము నకు పోయి సుశీల చాల తడపు శోకించి ఆర్తురాలై తల్లి కడకు పోమెను. మఱియు మరణించిన తన తండ్రిని భర్తను వారి వారి పుత్త్ర పౌత్త్రాదులను తీసికొని గొప్ప చితిని పేర్చి అగ్నిని ప్రజ్వలింప జేసి హా పుత్త్రా! హా పుత్త్రా! అని శోకించుచు అగ్నిలో ప్రవేశించెను. వెంటనే ఆమె నారదు డయ్యెను. ఆ అగ్ని స్ఫటిక మువలె నిర్మలమును చల్లనిదియు నై నిండు సరస్స య్యెను. అతని ఎదుట నిలిచి దేవ శ్రేష్టుడగు విష్ణువు బిగ్గరగా నవ్వి దేవర్షి యగు నారదునితో ఇట్లు పలికెను! మహర్షీ! నీ కుమారుడు ఎవ్వరు? బుద్ది పొగొట్టు కొని ఎవరిని గూర్చి శోకించు చున్నావు? అది విని నారదుడు సిగ్గు పడెను. నేను (శ్రీ మహా విష్ణువు) అతనితో మరల ఇట్లంటిని, ఓ నారదా! నామాయ ఇటు వంటిది. చాల కష్ట రూప మయినది. బ్రహ్మ రుద్రుడు మహేంద్రుడు కూడ దీని నెఱుగ లేరనిన నీవేమి తెలిసి కొనగలవు? ఈ నామాయ ఇట్టిదని ఊహించు టకును అలవి కానది.
నారద మహర్షి నా మాట విని ఇట్లు పలికెను. ఓ విష్ణూ! నాకు నీ యందు భక్తి ఇమ్ము. సమయము వచ్చినప్పుడు నీ సంస్మరణ మును సందర్శనమును నాకు లభించు గాక! నేను ఇప్పుడు అర్తుడనై చితిని ఆరోహించిన స్థలము తీర్థముగా నయి ఓ అచ్యుతా! కేశవా! పాప నాశకుడ వగు నీ చేతను బ్రహ్మ దేవుని చేతను అధిష్ఠింప బడినది అగుగాక! నారదుని కోరిక విని ఓ బ్రాహ్మణా! సుతపో మహర్షీ! నేను (శ్రీమహా విష్ణువు) ఇట్లంటిని. ఓ నారదా! కాశిరాజ కన్యగా నీవు చితి చేసిన తావు సితోద మను తీర్ధ మగును. నేనును మహేశ్వరుడును దీని యందు నిలిచెదము. ఉగ్రముగా మాట లాడిన బ్రహ్మ యొక్క ముఖమును శివుడు త్రుంచిన తరువాత ఆతడీ నీ తీర్థమున స్నానము చేయగనే ఆ బ్రహ్మ కపాలము ఈ తీర్థ స్థానమున భూమిపై పడును. అంతట నుండి దీనికి కపాల మోచన తీర్థమను ప్రఖ్యాతి ఏర్పడును. అప్పటి నుండి ఈ పుణ్య తీర్థము నందు ఇంద్రడు నిరంతరము నిలిచి యుండును. ఇంద్రునికి విడువని బ్రహ్మవధ దోషము అంటగా అతడు దాని నిచ్చట విడిపించు కొనును. కాన దేవతలును ఈ రహస్య మగు మహా తీర్థమును విముక్త తీర్థమని ప్రసిద్ధము చేయుదురు. నరుడు ఎన్ని మహా పాపములు చేసిన వాడైనను ఈ తీర్థమున ప్రవేశించి ఏమరుపాటు లేక స్నానమాడి శుచియై నన్ను స్మరించి నచో శుద్ధుడై భగవదను గ్రహము పొంది ముక్తు డగును. రుద్రపిశాచ మను మహా పాపుడు అనేక జన్మము లంది దుఃఖము లనుభవించును. అతడట్లు జన్మ పరంపరలతో పాపము నశించి అనేక సహస్ర సంవత్సరముల తరువాత విప్ర గృహమున జన్మించును. అతడా జన్మములో మహా నిగ్రహము కలవాడగును. అతని అంత కాలమున రుద్రుడు హితకర మగు తారక మంత్రము నతని కుపదేశించును. ఓ విప్రా? నేనిట్లు నారదునకు చెప్పి నా నివాస మగు క్షీర సాగరము నకు వెళ్ళితిని. విప్రుడు నారద మహర్షి యును గంధర్వ రాజుచే సమర్పించ బడుచు స్వర్గమున సంచరించెను. ఓ సుతపో మహామునీ! నిన్ను ప్రబోధించు టకై నీకు ఈ నారద వృత్తాంతము తెలిపితిని. నా మాయను నీవు ఎఱుగ జాలవు. నీవది తెలిసికొన గోరినచో ఈ కోకాముఖ తీర్థ మందు మునుగుము. అని విష్ణువు పలికెను. విష్ణుని వచనము ననుసరించి విప్రుడగు సుతపో మహాముని తన భవిష్యత్ ఫలమునకు వశుడై ఆ నీట మునిగెను. నాయనా! ఆ బ్రాహ్మణుడు వెంటనే చండాల గృహమున కన్యగా నయ్యెను. ఆమె మంచి రూపము శీలము గుణములు కలది. క్రమముగా యౌవన వంతురాలు కాగా ఆమెకు రూప హీనుడగు సుబాహుడను చండాల కుమారునితో వివాహ మయ్యెను. భర్త ఆమెకు ఇష్టుడు కాలేదు. కాని భర్తకు ఆమె ఇష్టు రాలయ్యెను. ఆమెకు ఇద్దఱు అంధులగు కుమారులును ఒక చెవిటి కుమార్తెయు కలిగిరి. భర్త దరిద్రుడు. అందుచే ఆ అమాయికురాలు అను దినము నదికి పోయి ఏడ్చు చుండెడిది. ఒకా నొకప్పుడా చండాల కన్యక బిందె తీసికొని నదికి పోయి స్నానమునకై నీటిలో ప్రవేశించి లేవగనే కర్మ యోగము నందు అసక్తు డగు సుతపో మహాముని యను బ్రాహ్మణుడుగా మొదటి రూపమునకు మారెను. భర్త యగు సుబాహుడును భార్య నదికి పోయి చాలా సేపయినదే యని నదికి వెడలి అచట కడవ మాత్రముండి ఒడ్డున ఆమె కనబడక పోవుటచే మహా దుఃఖమున ఆ ప్రదేశము మారు మ్రోగునట్లు ఏడువ సాగెను. అంతలో గ్రుడ్డి కుమారులును చెవిటి కూతురును అచటికి వచ్చి తమ తండ్రి ఏడ్చు చుండుట చూచి తామును ఏడువ సాగిరి. తరువాత సుబాహుడు అచ్చట నున్న బ్రాహ్మణులను మీరెవరైన నీటికి నదిలో దిగిన యువతిని చూచితిరా! చెప్పుడు అని అడిగెను. ఆమె నదిలో దిగుట చూచితిమి. కాని పైకి వచ్చినట్లు చూడలేదు. అని వారు చెప్పిరి. భయంకర మగు ఆమాట విని సుబాహుడు కన్నీళ్ళు కారుచుండ గట్టిగా ఏడువ నారంభించెను. ఓ రాజా! అట్లు అతడును కొడుకులును కూతురును ఏడ్చుట చూచి నాకు చాల బాధ కలుగుటతో బాటు నేనే అంత వరకు చండాల కన్యకగా ఉంటినను విషయము స్మరణమునకు వచ్చెను. అందుచే నేనా సుబాహునితో నీవిట్లు ఎందులకు అర్తుడవై ఏడిచెదవు? మూర్ఖుడవై ఎంత ఏడ్చినను ఆమె నీకు లభింపదు. అంటిని. అతడు నాతో ఇట్లనెను. ఓ బ్రాహ్మణా! ఈ కుమారులు ఇద్దరును గ్రుడ్డి వారు. కుమార్తె చెవిటిది. దుఃఖించు చున్న వీరిని నేను ఎట్లు ఓదార్చ గలను? ఎట్లు పెంచి పెద్ద చేయ గలను? ఇట్లు పలికి అతడు కుమారులతో కుమార్తెతో కూడ వెక్కివెక్కి ఏడువ సాగెను. అతడు ఏడ్చిన కొలది నాకు వారిపై దయ కలిగెను. అందుచే నతని ఏడ్పు మాన్పించి నా వృత్తాంతము నాతనికి తెలిపితిని. అతడును మిగుల ఆర్తుడై ఆ కోకాముఖ తీర్థమున మునిగెను. నీటిలో ప్రవేశించ గనే ఆ తీర్థ ప్రభావమున వాడు పాపముల నుండి ముక్తుడై నేను చూచు చుండగనే చంద్రుని వలె ప్రకాశించెడి విమాన మెక్కి స్వర్గమునకు పోయెను. అతడట్లు మరణించ గనే కును మోహకర మగు మనోవ్యథ కలిగెను. ఓ రాజశ్రేష్ఠా! నేనును మహాపవిత్ర మగు కోకా జలమున మునిగి స్వర్గమునకు వెళ్ళితిని.
తరువాత జన్మమున వైశ్య కులము నందు వ్యథతో బాధపడు వాడనుగా కోకాముఖ తీర్థ ప్రభావమున పూర్వజన్మ స్మృతి కలవాడనుగా జన్మించితిని. అంతట నేను చాల వైరాగ్యము చెంది వాక్కును మనస్సును నిగ్రహములో ఉంచుకొని కోకాముఖ తీర్థమునకు వెళ్ళితిని. అచ్చటనే వ్రతము పూని శరీరము కృశింప జేసికొని దేహ త్యాగము చేసి స్వర్గమును పొందితిని. స్వర్గము నుండి దిగి భూలోకము నందు కూడ విష్ణుని అనుగ్రహము వలన పూర్వజన్మ స్మృతి కలవాడను గా నీయింట పుట్టితిని. ఇట్లు నేను శ్రీమహా విష్ణుని ఆరాధించి కోకాముఖ తీర్థమున శుభాశుభము లగు కోరికలు ఏవియు లేకుండ వదలు కొనిన వాడ నైతిని. అని పలికి ఆ రాజ కుమారుడు తండ్రిని నమస్కరించి శ్రేష్ఠమగు కోకాముఖ తీర్థమునకు పోయి ఆ మనుజ శ్రేస్ఠుడు వరాహ రూపుడగు శ్రీమహావిష్ణు నారాధించి సిద్ధిని పొందెను. ఇట్లు ఆ కామ దమనుడను నతడు తన పుత్ర పౌత్త్రులతో కూడ మహాపవిత్ర మగు కోకాముఖ తీర్థమున అపవిత్ర మగు మానవ శరీరమును విడిచి సూర్య సమములై ప్రకాశించెడి విమానములలో స్వర్గమున కేగెను. ఓ బ్రహ్మణులారా! దేవతలకు ఊహింప అలవి కానిదియు స్వప్నము లోను ఇంద్రజాలము తోను సమానమును లోకమును మోహ పరచు నదియునగు పరమేశ్వరుడగు విష్ణుని మాయను మీకు తెలిపితి నని వ్యాస మహా ముని పలికెను.
Summary of chapter 122 of the Brahma Purāṇa is as follows:
Prophetic descriptions of the progressive decline of dharma through the Kali Yuga are presented. The social, moral, and cosmic deterioration characteristic of the dark age — shortening of life spans, diminution of physical and mental capacities, breakdown of social institutions, rise of irreligion, and the general triumph of adharma — are described as forewarnings and as confirmation of the sacred texts' knowledge of the entire arc of cosmic time.