బ్రహ్మ మహా పురాణము
6 - ఆదిత్యోత్పత్తి వర్ణనమ్
ద్విజోత్తములారా! కశ్యపునికి దక్షసుత యందు వివస్వంతు డుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూప యౌవన శాలిని యైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానంద మీయ దయ్యొను. ఆమె మంచి తపస్సు చేసి మంచి దీప్తి గడించు కొన్నది. కాని యాదిత్య మండలము వేడిమి కామె తనూలత వాడిపోయి యంతగ రాణింప దయ్యెను. కశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు ”అండ మందు మృతుడు కాలేదు” గద అని యొఱుంగక పలికిన కతన నాతనికి మార్తండుడను పేరు రుఢ మయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై ముల్లోకములను దహింప జేయున దయ్యెను. ఆదిత్యుడు (వివస్వంతుడు) సంజ్ఞాదేవి యందు మనువును శ్రాద్ధ దేవుడైన యము నింగనెను. యమున యను కన్యను గూడ గాంచెను. యముడును యమునయు కవల పిల్లలు. సంజ్ఞ శ్యామ వర్ణుడైన యా వివస్వంతుని జూచి యోర్వక తనకు సాటియైన ఛాయను (నీడను) మాయా మయియైన దానిని కల్పించెను. ఆమె యెదుట నిల్చి ప్రాంజలియై మ్రొక్కి ఓ సుహాసిని! నా చేయనగు కార్యముం జెప్పుము. నీ యాజ్ఞా వశనై యున్నాను నన్నుంబని గొమ్మనియె.
అబలా ! నేను పుట్టినింటి కేగెదను. నీకు భద్రమగును గాక ! నాయింట నీవు నిశ్శంకముగ నుండ వచ్చును. ఈ పిల్లలిద్దరు నీ బాలిక నా సంతానము. వీరిం గని పెట్టుకొని యుండుము. ఈ మాట భగవంతుడు వివస్వంతుని కెన్నడేని జెప్పకుము.
జుట్టుపట్టి లాగునందాక. శాప మిచ్చు నందాక ఈ వార్త నేనెన్నడును జెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళి రమ్మనెను.
తపస్విని యైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డల నప్పగించి తండ్రి యగు త్వష్ట ప్రజాపతి సమీపమున కేగి సిగ్గున తలవంచు కొని నిలువ బడెను. ప్రజాపతిచే భర్త సన్నిధికి పోపొమ్మని పలు మారులు అదలించి బెదిరించి యాదేశింప బడియు నయ్యింతి కాంతుని వంక బోక బడబా కృతిందాల్చి (ఆడు గుఱ్ఱమై) తన రూపము మఱుగు పఱచుకొని ఉత్తర కురు భూములందు బచ్చిక బయళ్ళలో తిఱుగ జొచ్చెను
రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞ యేయని భావించి యామె యందా దిత్యుడు తన కీడైన కొడుకుం గాంచెను. ఇంత మున్ను, పుట్టిన మనువును బోలిన వాడై నందున నితడును “సావర్ణ మనువు” అని పిలువబడు చుండెను.
అమెకు కల్గిన రెండవ కుమారుడు శనైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత నామె తన కప్పగించిన సవతి బిడ్డల నాదరింప దయ్యెను. మనువు దానికి సైచి యూర కుండెను. యముడది యోర్వక యా సవతి తల్లిని పాదమెత్తి బెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవు గాక యని శపించెను. యముడా వృత్తాంమును దండ్రికి ప్రాంజలియై విన్న వించెను. నా కామె యిచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడు కొనెను. తల్లి తనయు లందరి యెడ వాత్సల్యముతో వర్తింప వలయును గదా. ఈ యమ్మ మమ్ములను నిరసించి బ్రతుక నెంచినది. అందు వలన నే నామెపై పాద మెత్తితిని, ఎత్తితినే కాని యామె శరీరము తాకింప లేదు. బాల్యముచే లౌల్యముచే నెఱుంగక యేనొనరించిన తప్పును క్షమింప దగుదువు. తల్లి శాపమునకు గురి యైతిని గ్రహరాజ! నీయను గ్రహముచే నా పాదము పడిపోకుండు గాక ! అని కొడుకు వాపోవ గరుణించి
పుత్ర! ఇందేదో గొప్ప కారణ ముండి తీరును, ధర్మజ్ఞుడవు, సత్య వచనుడ వైన నిన్ను క్రోధ మావేశించినది. నీ తల్లి మాట మిధ్య గాకుండుటకు కృములు నీ కాలి మాంసము దిని యవని కేగును. ఈ రీతి మీయమ్మ మాట సత్యము కాగలదు. ఈ విధమైన శాప పరిహారముచే నీవును సురక్షితు డయ్యెద వనెను.
ఆదిత్యుడు సంజ్ఞం జూచి (ఛాయా మూర్తిని) బిడ్డల నందర నొక్కరీతిగా గాక యొక్కని యందెక్కువ ప్రేమ నీకెందుల కని యడిగిన నామె యా మాట దప్పించెనే గాని నిజము సెప్పదయ్యె. అతడు తనకుదా సమాధాన పడి యోగ దృష్టిచే నిజ మెఱింగెను. ఆమె నప్పుడు శపింప బూనియు శాప మీయక జుట్టు పట్టుకొని యూచెను. అంతనామె జరిగిన దెల్ల పతికి విన్న వించెను. వివన్వంతుడు విని కవలి మామ గారగు త్వష్ట చెంత కరిగెను. మామయు నటువచ్చిన యల్లు నాదరించెను. రోషముగొని తనను దహింప నేతెంచినాడని గ్రహించి యపుడాతని ననునయించుచు నిట్లనియె.
ఓ అదిత్యమూర్తి! నీ రూపమిది భరింప రాని తేజముచే జూడ రాదయ్యె. సంజ్ఞ యిదిసైప నేరక పచ్చిక బయళ్ళ తిరుగాడు చున్నది. శుభ చారిణయైన నీ సహ ధర్మచారిణి నిప్పుడు చూడ వలయును. అమె శ్లాఘనీయ యోగ బల సంపన్నురాలు. గ్రహ రాజగు నీకు నా మాట యనుకూలము సమ్మత మగు నేని యోగ మూని యామె చెంత కరుగును. నీ రూపమును జూడ ముచ్చటగ నొనరింతునని తెలిపి యా తరణిని (సూర్యుని) యంత్రము నెక్కించి చెక్కి వైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటి నుండీ తరణి బట్టుటన నీ పేరు లోకమున రూఢి కెక్కెను. దాన నాతని తేజస్సు కొంత డిందువడి రూపము చూడ నందమయి యింపొందెను. ఆ మీద నతడు యోగ శక్తిచే నేగి తన భార్యను బడ రూపమున జరించు దానినిం జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతముల కదృశ్యయై యున్న యయ్యంగనను ఎందును జడియక సంచరించు చున్నంగని తాను నశ్వ రూపము దాల్చి ముఖ మునం గవయం బోయెను. పర పురుష శంకగొని యామె పెడ మెగయయి మున్నతఱి నామె యందు నిక్షిప్తమైన శుక్రమామె నాసికా రంద్రముల వెంట చీది వైచెను. అందుండి అశ్వినులు అను దేవ వైద్యులు నా సత్యుడు(దన్రులు) అని పేర్కొన బడెడు వారిద్ద రుదయించిరి. అష్టమ ప్రజాపతి యగు మార్తండుని యౌరసు లీయిర్వురు మిక్కిలి యంద గాండ్రు. భాస్కరుడు నవ్వల నాకాంతకు మిగుల కాంతుడై కానవచ్చె. అమె కూడ తన మనోహరునిం గని మిగుల సంతోషించెను
యముడు మాత్రము తా మున్నొనరించిన పనికి మిక్కిలి పగ చెంది ప్రజలను ధర్మముచే రంజింప జేసి ధర్మరాజను సార్ధక నామముం బితృ దేవతల కాధిపత్యమును లోకపాల కత్వముం బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరు గిరిపై నిప్పుడును తపము చేయు చున్నాడు. వాని తమ్ముడు శని గ్రహ పదవి నందెను. త్వష్ట (సూర్య బింబమును) తరణి బట్టగా రాలిన రజమును బ్రోవు చేసి విష్ణు చక్రమును గావించె. అది దాన వాంతకము అప్రతిహతము. యముని తరువాత బుట్టిన యా బాలిక యమున యనుపేర లోక పావనియైన నది యయ్యెను. మనువు సావర్ణు డునను పేర నా రెండవ కుమారుడు పిలువ బడెను. ఆయన తమ్ముడు శని గ్రహపదవి నంది సర్వలోక పూజితు డయ్యెను. దేవతల యీ జన్మ వృత్తాంతమును విన్న యాతడు ఆపదలను బాసి మహా యశస్సు నందును.
Summary of chapter 6 of the Brahma Mahā Purana is as follows:
Detailed accounts of specific Solar Dynasty kings are narrated. The story of Satyavrata is recounted — how he was banished by his father, maintained the family of Sage Viśvāmitra during a twelve-year drought, and incurred the lasting displeasure of Vasiṣṭha. His aspiration to ascend bodily to heaven as Triśaṃku is woven into the broader account of the Ikṣvāku lineage.